రంగుల హేల 36: విచిత్ర వీరులూ – వింత తీరులూ

14
11

[box type=’note’ fontsize=’16’] మనల్ని తికమక చేసే మనుషులు ఎదురయితే జీవితం ఎలా ఉంటుందో వివరిస్తున్నారు అల్లూరి గౌరీ లక్ష్మిరంగుల హేల” కాలమ్‌లో. [/box]

[dropcap]మ[/dropcap]న చుట్టూ మన అలవరుసలలో మనలాగే ఉండే మనుషులతో మనం హాయిగా కలిసి మెలిసి స్నేహంగా జీవించేస్తూ ఉంటాం. ఏ సమస్యా ఉండదు. మనకి మంచి మనుషులతో జీవించడం తెలుసు అలాగే చెడ్డవాళ్లతో కూడా జాగ్రత్తగా కలిసి మెలిసి మేనేజ్ చెయ్యడం తెలుసు. మన అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాల మహిమ అది.

అయితే కొందరు చిత్రమైన మనుషులుంటారు. వాళ్ళను గుర్తు చేసుకున్నప్పుడల్లా ఆశ్చర్యచకితులం అవుతుంటాం. మన చుట్టుపక్కలో, చుట్టాల్లోనో ఇలాంటి వాళ్ళుంటారు. వాళ్ళను మనం తప్పించుకోలేము. అప్పుడప్పుడూ వాళ్ళ బారిన పడి తీరాల్సిందే! జుట్టు పీక్కోవాల్సిందే! కుయ్యో మొర్రో అనాల్సిందే! తప్పదు.

ఇలాంటి వారు మనకు భలే పజ్లింగ్‌గా మన మెదడుకు మేతగా ఉంటారు. వారితో ఎలా నడుచుకోవాలనేది పెద్ద సవాల్. అలా అని వాళ్ళు దుర్మార్గులేమీ కాదు. ప్రమాదకారులూ కాదు. మనకి కలిసి రారు అంతే. అలా అని వాళ్ళు మనకి సహాయం చెయ్యరనీ చెప్పలేము. చేస్తే చెయ్యొచ్చు. చెయ్యకపోనూ వచ్చు. ఊహించలేము. వారిని నమ్మి వారిపై ఆధారపడలేము అంతే.

మా పెద్దమ్మగారు అంటూ ఉండేవారు. ‘మనుషుల్ని కొంతకాలం వాడాలర్రా, అంటే వారితో దగ్గరగా కలిసి జీవించాలి అప్పుడే వాళ్ళ మనసు, ప్రవర్తన, తీరు మనకి అవగతం అవుతాయి’ అని. ఈ చిత్రమైన మనుషులు మాత్రం ఎవరికీ అర్థం కారు. వీళ్ళని ఎన్నాళ్ళు వాడినా వారి తీరు పసికట్టలేం. ఎందుకంటే అది ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ ఉంటుంది. అసాధ్యంగా అనూహ్యంగా ఉంటారు. వీళ్ళను గురించి ఎవరైనా వాకబు చేస్తూ, మనల్ని “వాళ్ళు మంచివాళ్ళేనాండీ?” అనడిగితే తల నిలువుగా కాక, అడ్డంగా కాక మధ్య రకంగా తిప్పుతాం. “సరిగ్గా చెప్పండి?” అంటే చెప్పలేకపోతాం. మనకి ఖచ్చితంగా తెలిస్తే కదా ఇతరులకి చెప్పడానికి. ఎందుకంటే ఇటువంటి వారి ప్రవర్తనలో మనకి క్లారిటీ కనబడదు. బహుశా వారికి ఉండి ఉండవచ్చు. మనకి తెలీదు కదా!

ఆ విచిత్ర వీరులు గొప్ప ఆత్మీయంగా ఉంటారు. సరిగ్గా మనం సహాయం అడిగే సమయానికి జర్రున జారిపోతారు.  అవసరానికి రారు అని మనం నిర్ణయించుకుని ఇతరులతో పని చేయించుకునే ఏర్పాట్లు చేసుకున్నాక వచ్చి సహాయం చేసి చూపిస్తారు. స్నేహశీలురు అని నిరూపిస్తారు. ఇంకేముంది మనం ఆనందపడిపోయి ధీమాగా వాళ్ళమీద వాలి కూచున్నామంటే తుపుక్కున ముందుకో వెనక్కు పడతాం. పళ్ళు రాలతాయి లేదంటే వీపు పగులుతుంది.

కొందరు బంధువులు ఫోన్ చేసి మరీ సహాయం చేస్తామంటారు. మనం టెంప్ట్ అయ్యామా! అయిపోయామే! చక్కగా బోలెడు కబుర్లు చెప్పి మన సమస్య విని “ఆ మినిస్టర్ గారు మా చిన్నాన్నే! మీ సమస్య ఆయనకి చెబుదాం చిటికెలో పనైపోతుంది” అంటారు. తీరా వివరాలన్నీ తెచ్చిపెట్టి సాయం అడగగానే మొహం చాటేస్తారు. మనకి జవాబుండదు. మా హెల్పర్ పిల్ల చెప్పకుండా మానేస్తుంది. లబో దిబో మంటూ ఫోన్ చేసి “క్యా హువా?” అంటాను. “కుచ్ భీ నై హువా అమ్మా! తుమ్ పరిషాన్ మత్ కరో! ఆజ్ మై ఘర్ మే ఆరామ్ కర్ రే. కల్ జరూర్ ఆతే అమ్మా!” అంటుంది నవ్వుతూ. నేను ఏడవలేక నవ్వి “ఠీక్ హై, కల్ ఆజావ్” అంటాను.అప్పుడు నా మొహం అద్దంలో నేనే చూసుకోను.

ఎవరో ఫోన్ చేస్తారు. “మీరు మీరేనా?’ అనడుగుతారు. అవునంటాను. “అబ్బ! జ్యోతిలో మీ కధ చదివి ఫిదా అయిపోయాననుకోండి. ఏం రాసారండీ బాబూ! అద్భుతం! మీ కథలో కొటేషన్లు బట్టీ పట్టాను. అసలు నేను చిన్నప్పటినుంచీ కొన్ని వేల పుస్తకాలు చదివాను. పురుగుననుకోండి” ఇదీ వరస. వారి పుస్తక పఠనం మీద వారికెంత ఆరాధనో! చివరికి “మీ పుస్తకాలు కావాలండీ! ఎలా?” అంటారు. “బుక్ షాప్‌లో అడగండి ఉంటాయి” అంటాను. మళ్ళీ రెండురోజుల్లో ఫోన్. “లేవండీ” అని.  సరే అని నేను రాసిన ఓ రెండు పుస్తకాలు పోస్ట్ చేసి ఎదురు చూస్తూ ఉంటాను. ‘అందాయి’ అని మెసెజ్ వస్తుంది. అంతే. మనం పోస్టల్ చార్జీలు పెట్టుకుని ఫ్రీ గా పంపిన పుస్తకాల మీద అభిప్రాయం మాత్రం రాదు. వాళ్ళ నంబర్ నుంచి టైం కిల్లింగ్ వీడియోలు, ఏ పండక్కో విషెస్ ఫార్వర్డ్‌లో వస్తూ ఉంటాయి. ఇదో రకం.

ఒకాయన మా ఆఫీస్‌కి పనిమీద వచ్చినప్పుడు నన్ను కలిసి “నేనూ రచయితనండీ” అని పరిచయం చేసుకున్నాడు. అప్పుడప్పుడూ వస్తూ మిత్రుడయ్యాడు. అదే ఊర్లో జరుగుతున్న ఒక సాహిత్య సభకి ఇద్దరం ఆయన కార్లో వెళ్ళాం. ఆ తర్వాత పొరుగూరులో ఒక పెద్ద మీటింగ్ జరగబోతోంది. అక్కడికి ఓ మూడు గంటలు కార్లో వెళ్లాల్సి ఉంటుంది. ఈ సంగతి ఆ రచయిత మిత్రుడు గారే ఫోన్ చేసి చెప్పి “వెళదామా మాడం?” అనడిగాడు. “ఈసారి నా కార్లో వెళదాం” అన్నాను. “వద్దొద్దు. నా కార్లో మిమ్మల్ని తీసుకెళ్లి మళ్ళీ మీ ఇంట్లో దింపే బాద్యత నాది. నా భార్య కూడా వస్తోంది. అది ఆవిడ పుట్టిన ఊరే” అన్నాడు. సరే అనుకుని ఆ మీటింగ్‌కి వస్తున్న మా మిత్ర రచయితలకి నేను కూడా వస్తున్నానని చెప్పి ఓ రెండు నిమిషాల స్పీచ్ కూడా రాసుకున్నాను. రేపే ప్రయాణం. ఈయన నుంచి ఫోన్ లేదు. నేనే ఫోన్ చేసి అడిగితే “మా మిసెస్ వెళ్లిపోయిందండీ. ఓ పని చెయ్యండి. మీరు ట్రైన్‌లో వెళ్లిపోండి. టికెట్స్ దొరుకుతాయి. వచ్చేప్పుడు మనం కలిసి వచ్చేద్దాం” అన్నాడు. ఆ మర్నాడు నా కారు ఉండదు. మరో ఆఫీసర్ గారు అడిగితే ఇస్తానని మాటిచ్చాను. రైలు టికెట్లు చూసుకుంటే లేవు. నోరు మూసుకుని ప్రయాణం మానుకున్నాను. తర్వాతి నెల ఆ పెద్దమనిషి మా ఆఫీస్ కొచ్చి కూర్చున్నపుడు ఆ మాటే ఎత్తలేదు. కాఫీ తాగి కొన్ని కబుర్లు చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ గుడ్ మార్నింగ్ మిత్రుడే అతను.

మా అక్కయ్య వియ్యంకుడు నాకు మితృడైపోయి “చెల్లాయ్! నేనొస్తున్నా, మీ ఇంటికి రేపొద్దున్నే. ట్రైన్ ఎక్కుతున్నా” అంటాడు. అన్నీ రెడీ చేసుకుని కూర్చుంటే రాడు. ఫోన్ కూడా చెయ్యడు. చూసి చూసి మనమే చేస్తే  “ఎక్కడమ్మా! నన్ను ట్రైన్ దింపి తీసుకుపోయారు మా వెధవలు” అంటాడు ముసి ముసి నవ్వులు నవ్వుతూ. తానొక లోకల్ రాజకీయనాయకుడినని చెప్పుకుంటాడాయన. మరో రోజు రాత్రి భోజనాలయ్యాక సింక్ నింపేసి కిచెన్ బైటికొచ్చి టీ.వీ. ముందు కూర్చుని చేతులకి క్రీమ్ రాసుకుంటూ ఉండగా చెప్పా పెట్టకుండా దిగిపోయి ఇబ్బంది పెడతాడు. ఆయన మీద ఎవరికీ కంప్లైంట్ చెయ్యలేం కదా!

కొంతమంది వాహనదారులు నాలుగు రోడ్ల కూడలి కొచ్చాక వెహికల్ కొన్ని సెకన్లు ఆపి, అప్పుడు ఎటు వెళ్లాలో నిర్ణయం తీసుకుంటారు. అప్పటిదాకా ఎడమ పక్కకి వెళుతున్నట్టుగా కనబడి చటుక్కున కుడివైపు వెళ్ళిపోతారు. దాంతో వళ్ళు మండిన చుట్టుపక్కల వాహనదారులు వారి వారి వాడుకభాషల్లో కసితీరా ఒకట్రెండు మాటల్లో గొణుక్కుంటారు.

ఒక మీటింగ్ లో కలిసిన నా అభిమాన గాయకుడు స్వర్గీయ ఎస్. పీ. బాలు గారికి నా బుక్స్ ఇస్తుంటే పక్కనే ఉన్న వారి చెల్లాయి “నాకూ ఇవ్వండి. ప్రతిరోజూ ఒక కొత్త బుక్ చదవకపోతే నాకు నిద్ర రాదు. జర్నీలో కూడా బుక్ ఉండాలి” అని అడిగి మరీ తీసుకుని ” మేం ఫ్లైట్ దిగగానే మీకు ఫోన్ వస్తుంది చూడండి” అని చెప్పి కొన్నేళ్ళయింది.

మా లేడీ కొలీగ్ కొడుకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఒకరోజు తల్లి కోసం వచ్చి, ఆవిడ ఓ మీటింగ్‌లో ఉందని, నా కేబిన్ లో కూర్చుని “ఆంటీ! మీరు రైటర్ కదా, నేను మీకొక బ్లాగ్ చేసిస్తాను” అంటూ అప్పటికప్పుడు ఒక బ్లాగ్ క్రియేట్ చేసి నా కంప్యూటర్ డెస్క్ టాప్ మీద ఉన్న కథలూ, కవితలూ అందులో వేసి చూపించాడు. “ఆంటీ! మీ పబ్లిష్ అయిన రైటింగ్స్ ఇంకా ఉంటే వెతికి నాకు మెయిల్ చెయ్యండి. నేను అందులో పెట్టేస్తాను” అని మెయిల్ ఐ.డీ., ఫోన్ నంబర్ ఇచ్చి ఊరించి వెళ్ళిపోయాడు. నేను మురిసిపోయా. ఆ పిల్లాడిని తెగ మెచ్చుకున్నా. తర్వాత నా రాతలు వెతికి వెతికి ఆ అబ్బాయి కోసం ట్రై చేశా. ఫోన్ ఎత్తడు. మెయిల్ చూడడు. మా కొలీగ్ కి చెబితే “వాడంతే! కబుర్ల మనిషి. పని చేసే రకం కాదు. పోయి పోయి వాణ్ణే నమ్మేరా?” అని మురిసిపోతూ నవ్వేసింది. ఆ బ్లాగ్ ఇప్పటికీ అలాగే అర్ధాంతరంగా ఉండిపోయింది.

మా పక్క ఫ్లాట్‌లో ఉండే ఆవిడ మాకు బాగానే దోస్తు. అప్పుడూ ఇప్పుడూ కలిసి షాపింగ్ చేస్తూ ఉండే వాళ్ళం. వాట్సాప్ జోకులు పంపుకునే వాళ్ళం. ఒకసారి ఆవిడ మనవరాలు పుట్టినరోజు రాబోతోంది. వెనక వీధిలో కొడుకూ కోడలూ ఉంటారు. “సురుచి హోటల్‌లో బర్త్ డే పార్టీ చేస్తున్నాం. మా కోడలు వచ్చి మిమ్మల్ని పిలుస్తానంటోంది. వస్తుంది” అని చెప్పింది. నేను వెళ్లకపోతే బావుండదు కదా, పొద్దున్నే లేచి మొహాలు చూసుకునే వాళ్ళం అనుకుని ముందుగానే ఆ రోజుకి హాఫ్ డే లీవ్ అప్లై చేసి శాంక్షన్ చేయించి పెట్టుకుని, గిఫ్ట్ కూడా కొని పెట్టుకుని ఉన్నాను.

తీరా ఆ రోజు రానే వచ్చేసింది. నేను హాఫ్ డే ఇంటికి వచ్చేసాను. అప్పుడు గుర్తొచ్చింది.ఆ కోడలు నన్ను పిలవలేదే అని. వాళ్ళింట్లో ఎవరూ లేరు. ఇంటికి తాళం ఉంది. వాట్సాప్‌లో మెసెజ్ ఉందేమో అని చూసాను. లేదు. ఏం చెయ్యాలీ అని ఆలోచించి తిరిగి ఆఫీస్ కెళ్ళిపోయి పనిలో పడ్డాను. సాయంత్రం ఆవిడ వచ్చి, పిలవడం మర్చిపోయానని నొచ్చుకుంటుందేమో ఏం చెప్పాలీ? అనుకున్నాను. ఆమె రాలేదు. నేను ఆశ్చర్యపోయాను. ఆమె మర్నాడుదయమే కనబడింది. ఏమీ అనలేదు. మామూలు కబుర్లు మొదలు పెట్టింది. నేనింకా షాక్ లోనే ఉన్నాను. వారం తర్వాత నేనొకరోజు ఆఫీస్‌కి బయలుదేరి లిఫ్ట్ నొక్కాను. ఆవిడ కింది నుంచి లిఫ్ట్‌లో వచ్చి మా ఫ్లోర్ లో దిగింది. నేను లిఫ్ట్ ఎక్కి డోర్ వేసి గ్రౌండ్ బటన్ నొక్కాక ఆమె “మొన్న మీరు మా ఫంక్షన్ రాలేదేమండీ?” అంటూ ఉండగానే లిఫ్ట్ కదిలి కింది కొచ్చేసింది. నా బుర్ర గిర్రున తిరిగింది. దీన్నేమంటారో! భాష సరిపోలేదు. మర్నాడు ఆవిడ మళ్ళీ మామూలు కబుర్లు చెబుతోంది.

మా కజిన్ బ్రదర్ భార్య అప్పుడప్పుడూ షాపింగ్ చేసుకోవడానికి సిటీ కొచ్చిమా ఇంటి కొస్తూ ఉంటుంది. వచ్చే ముందు రోజు ఫోన్ చేసి “వదినా! ఏం స్వీట్ కావాలి? బెల్లం మిఠాయి (ఒకోసారి జిలేబీ అంటుంది) నీకు ఇష్టమంట కదా! తెస్తున్నానులే” అంటుంది. “వద్దొదినా!” అంటే “వట్టి చేతుల్తో నేను రాలేనమ్మా” అంటుంది. వస్తుంది వెళ్తుంది. ఆ స్వీట్ మాట ఎత్తదు. నేనేమన్నా అడిగానా? ఎందుకలా ప్రవర్తిస్తుంది. అంటే చెప్పలేం. ఇలాంటి వాళ్ళు ఒకోసారి మన బీ.పీ. పెంచి ఏమీ ఎరగనట్టు ఉంటారు. ఇంట్లో ఎవరికన్నా ఈ సంగతి చెబితే చుట్టాలు తెచ్చే స్వీట్లకి ఆశపడి ఏడుస్తున్నాననుకుంటారని నోరు మూసుకుంటాను.

ఈ దెబ్బలకి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలీక అయోమయంగా ఉండడం మొదలు పెట్టాను. వేడి పాయసం తాగి నోరు కాల్చుకున్న కుర్రాడు పెరుగును కూడా ఊదుకుంటూ తాగుతాడట. అలా అయ్యింది నా పరిస్థితి. అందరి మీదా నమ్మకం పోయింది. ఎవరైనా వస్తున్నారని తెలిస్తే వాళ్ళకి ఫోన్ చేసి “మీరు నిజంగా వస్తున్నారు కదా?” అనడుగుతున్నాను. ఇంట్లో వాళ్ళని కూడా “మీరు నిజంగా నా పని చేసి పెడతారా?” అని అనుమానించడం మొదలు పెట్టాను. దాంతో పిల్లలు ‘అమ్మకి చాదస్తం పెరిగింది’ అని బ్రాండ్ చెయ్యడం మొదలు పెట్టారు నన్ను. స్టెప్పుల వారీగా నాతో జనం ఆడుకున్న వైనం అందరికీ చెప్పలేను కదా. అదన్న మాట సంగతి. ఇలా మనల్ని తికమక చేసే మనుషులు మీకెప్పుడూ ఎదురు కాలేదా? అయ్యే ఉంటారు. ఒకసారి గుర్తు చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here