వీడియో కాల్

1
12

[dropcap]గో[/dropcap]పాలం, లక్ష్మి చిన్ననాటి స్నేహితులు. ఓనమాలు దిద్దే తరగతి నుండి, కాలేజీ అయ్యే వరకు ఒకే ఊరిలో ఇద్దరూ కలిసే చదివారు, పెరిగారు. ఒకరంటే ఒకరికి అభిమానం, మంచి స్నేహం. ఇలా సుమారు ఇరవై సంవత్సరాలు కలసి చదువుకున్న వీళ్ళు, కాలేజీ అయినా తరువాత ఎవరి గమ్యాలను వారు వెతుక్కుంటూ ఎవరికి వారు దూరంగా విడిపోయారు.

అలా దూరంగా జీవితం సాగించిన వీళ్ళు, మళ్ళీ కలిసింది సుమారు యాభై సంవత్సరాల తరువాత, జీవిత చరమాంకపు చివరి ఘట్టంలో అనుకోకుండా, ఒక చిన్న సమాచారం ద్వారా, చరవాణి ద్వారా వారి చిరకాల బంధం మళ్ళీ అనుసంధానమైంది.

సుమారు ఒక ఇరవై రోజుల క్రితం సెల్ ఫోన్ ద్వారా మొదలై, రోజూ ఏదో ఒక సమయంలో మాట్లాడుకుంటూ ఉంటారు, ఇద్దరూ వేరు, వేరు ఊళ్ళల్లో ఉండటం వల్ల, ఒకరికొకరు ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం ఇంకా రాలేదు. ఇదండీ సంగతి టూకీగా……

మరి లక్ష్మి, మన గోపాలంకు ఫోన్ చేస్తోంది. ఏం జరుగుతుందో చూద్దాం రండి…

***

“ఏంటి నాన్న!…..ఇందాకటి నుండి నీ ఫోన్ మోగుతూ ఉంటే ఎత్తడం లేదు?….ఇదిగో తీసుకో…. నీ ఫ్రెండ్ లక్ష్మి ఆంటీ అనుకుంటా” అంటూ కొడుకు ఫోన్ తీసుకుని వచ్చి, ఇచ్చి వెళ్ళిపోయాడు. మంచి కొత్త మోడల్ ఫోన్ కొనుక్కునే స్తొమత ఉన్నా, ఏదో బేసిక్ మోడల్ డబ్బా ఫోన్ తో నెట్టుకువచ్చేస్తున్నాడు గోపాలం.

“హలో! ” అంటూ నెమ్మదిగా ఫోన్ ఎత్తాడు గోపాలం.

“హాయ్ గోపి! ఎన్నిసార్లు చెయ్యాలిరా…. పొద్దుటనుండి చేస్తూనే ఉన్నా. ఎందుకు వెంటనే ఎత్తవు? చిన్నప్పటి నుండి అదే ధోరణి, వెంటనే ప్రతిస్పందించవు. ఎలా ఉన్నావ్?” అంటూ అటువైపు నుండి కాస్త కినుక హించిన గొంతుతో చిన్ననాటి స్నేహితురాలు లక్ష్మి.

“ఆ డబ్బా ఫోన్ కాకపొతే, కాస్త మంచి లేటెస్ట్ మోడల్ ఫోన్ కొనుక్కోవచ్చుగా, డబ్బులకు, కొనేవాళ్లకు నీకు లోటు లేదుగా, కెమెరా ఉన్న ఫోన్ అయితే నీ ఫోటో నాకు, నా ఫోటో నీకు పంపుకోవచ్చుగా, ఎన్ని సంవత్సరాలు అయ్యింది, నిన్ను చూచి. చూడాలని ఉందిరా” అంటూ మందలింపుగా అడిగింది లక్ష్మి.

“హలో లక్ష్మి!…. అదేం కాదులే, చూడలేదు. అందువల్లే నీ ఫోన్ వెంటనే ఎత్తలేదు. నువ్వు ఎలా ఉన్నావ్? ఇంకా మన ఫ్రెండ్స్ వివరాలు నీకు ఇంకా ఏమైనా తెలిసాయా? అయినా ఏముందిలే, అందరం వయసు మీద పడ్డ వాళ్ళం అయిపోయాం. అసలు మనతో చదువుకున్న ఫ్రెండ్స్ ఎంతమంది ఈ లోకంలో ఉన్నారో? ఉన్నా ఆరోగ్యంగా, ఆనందంగా, ఆర్థికంగా బాగున్నారో? లేదో?. నీ ఫోన్ నెంబర్ దొరికి, మనం ఇలా కలుసుకోకపోతే, బహుశా నీ గురించి కూడా ఇలాగే అనుకునేవాడినేమో. నీతో గడిపిన క్షణాలు, జ్ఞాపకాలు ఇంకా నా మదిలో అలాగే నిక్షిప్తం అయి ఉన్నాయి.” అంటూ చిన్నగా నిట్టూర్చాడు గోపాలం.

“అవును. అసలు మన చిన్ననాటి స్నేహితులు, కనీసం మనతో కాలేజీ చదివిన ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో? నీది, నాది స్నేహం పూర్తిగా ఇరవై ఏళ్ళు, మొదటి తరగతి నుండి, డిగ్రీ పట్టా పుచ్చుకునే వరకు కలిసే చదువుకున్నాం, కలిసిమెలిసే ఉన్నాం. ఆ తరువాతే ఏదో అర్థం కానీ ప్రయాణంలో, ఎవరి దారి వారు చూసుకుంటూ ఒక అర్ధ శతాబ్దం అయిపొయింది, మళ్ళీ మనం ఇన్నాళ్లకు కలుసుకున్నాం.

ఇంతకూ, నువ్వు మళ్ళీ నా మాట మారుస్తూ, దారి తప్పిస్తున్నావ్. నీ డబ్బా సెల్ ఫోన్ మార్చవచ్చు కదా. నీకేం లోటు, చిటిక వేస్తే చక్కగా చేసే పిల్లలు ఉన్నారుగా? ఆ డబ్బా ఫోనులో మాట్లాడటం తప్ప, నిన్ను నేను చూడలేను. నన్ను నువ్వు చూడలేవు. కొత్తది కొని అందులో వీడియో కాల్ మాట్లాడు, నిన్ను చూడాలని ఉంది. అర్థం అయ్యిందా. సుమారు ఇరవై రోజుల క్రితం, ఆ రోజు నీ ఫోన్ నెంబర్ దొరికిన వెంటనే, నీతో మాట్లాడిన వెంటనే, ఎంత ఆనందం వేసిందో తెలుసా?…..నా పిల్లలు, మనుమలు ఆటపట్టించారు కూడా, బామ్మకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటూ, కాస్త సిగ్గేసినా, గర్వంగా అనిపించింది. అప్పటి నుండి నీ రూపం చూడాలని, ఎన్నాళ్ళయింది నిన్ను చూసి, అసలు ఎలా ఉన్నావో?…… నీకు అసలు ముసలితనం వచ్చిందో ? లేదో? ఆ రోజుల్లో అందగాడివి కదా. ఒక్కసారి నీ ఫోటో పంపు, అర్థం అవుతోందా?……నేను ఇంతలా మాట్లాడుతుంటే, నువ్వు ఏమీ మాట్లాడ వేమిటి? ఏదో ఒకటి చెప్పు.

నీకు ఇలాంటి ఆలోచన రాలేదా? నీకు మాత్రం నన్ను చూడాలని లేదా? నేను ఎలా ఉండి ఉంటానో ఊహిస్తున్నావా? ఈ జీవితంలో మళ్ళీ మన ఇద్దరం ఒక్కరోజయినా కలసి కోవాలని, తనివి తీరా మాట్లాడుకోవాలని నా మనసు ఉవ్విరూళ్లుతోంది. మరి నీ మనసులో ఏముంది?

నాకు ఇంకా మనం చిన్నప్పుడు కలసి ఆడుకున్న, చదువుకున్న స్కూల్, స్కూల్ దగ్గర పీచుమిఠాయి రాట్నం, మీనా కంపెనీ బిస్కట్ల బండి, మన ఊళ్ళో జరిగే తీర్ధంలో సాగే జీళ్ళు, మీ ఇంటి ఎదురుగా మనం ఆడుకున్న దెయ్యాల మేడ, దాని తోటలో చివరివరకు ఎక్కిన నేరేడు చెట్లు, బాదం చెట్టు కాయలు బద్దలు కొట్టుకోవడాలు, జామ పిందెలను కాయ అయ్యే లోపే కొరికి… ఛీ.. బాగోలేవు అంటూ పాడెయ్యడాలు, మేడ ముందు మేట ఏసిన ఇసుకలో కట్టిన గూళ్ళు, దానిలో గొయ్యి తీసి, ఎండుపుల్లల్లు పేర్చి బాదం ఆకులతో వాటిని కప్పి, ఇసుకతో కప్పేసిన గోతుల్లో మన ఇంట్లో బామ్మ దబ్బున పడితే నవ్వుకున్న రోజులు, మన నాన్నలు మనను పేరు పెట్టి ఒక్క పొలికేక పెడితే, గబుక్కున చెట్టు మీంచి దూకి ఇంట్లోకి పారిపోయిన రోజులు, వార్తా పత్రికల కాగితాలతో, సపోటా కాయల జిగురుతో తయారు చేసిన గాలిపటాలు, దారం కావాలి అంటే, ఇంట్లో బట్టలు కుట్టడానికి అమ్మ దాచుకున్న దారపు ఉండను దొబ్బేసిన రోజులు, స్కూల్లో కోపం వచ్చినప్పుడు పగలకొట్టేసిన మట్టి పలకలు, తిరిగి తీసేసుకున్న కణికలు, వెనుక పేజీలన్నీ పడవలుగా మారిన లేపాక్షీ పుస్తకాలు, కాలేజ్‌లో కులాల కుమ్ములాటలు, ఒకే పచ్చడిని కలసి నంచుకుని టిఫిన్ తినేసిన క్యాంటీన్ రోజులు, ఒక్కటేమిటి అన్నీ గుర్తుకు వస్తున్నాయి.

మళ్ళీ అవకాశం ఇస్తే, కాలచక్రం గిర్ర్రున తిప్పేసి, అక్కడే ఉండిపోవాలని ఉంది. మరి నీకు మాత్రం అలా లేదా? మాట్లాడు. ఓహ్….. ఇందాకటినుండి నేనే మాట్లాడుతున్నా కదా. సారి. ఈసారి నువ్వు మాట్లాడు” అంటూ చిన్నటి ఉద్వేగంతో ఆపింది లక్ష్మి.

గట్టిగా నిట్టూర్చి, గొంతు సవరించుకుని మాట్లాడటం మొదలు పెట్టాడు గోపాలం.

“నీకు చాలా బాగా గుర్తున్నాయి లక్ష్మీ, మన చిన్ననాటి విషయాలు అన్నీ. మరచిపోయావేమో అనుకున్నా? అవును. నాకు కూడా ప్రతీ విషయం, ప్రతీ జ్ఞాపకం ఇంకా మనసులో అలాగే నిలబడిపోయాయి. ఎలా మరచిపోతాం? అంతటి మధుర క్షణాలను. కానీ ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోయింది.

ఆ జ్ఞాపకాలు అయితే మన మదిలో ఉన్నాయి కానీ, ఎక్కడా దాని గుర్తులు మన ఊళ్ళో లేవు. అన్నీ చెరిగి, చెదిరిపోయాయి.

ఇంక మన రూపాలు అంటావా? వయసు పైబడిందిగా పూర్తిగా మారిపోయాం, ఆ జవసత్వాలు అన్నీ ఉడిగిపోయాయి. నా రూపాన్ని నేనే చూడలేకపోతున్నా. ఒక్కప్పటి అందగాడినే కానీ, ఇప్పుడా అందం లేదు, వద్దన్నా మీద పడిపోయే ముంగురుల జుట్టు ఏనాడో రాలి పోయింది, ఆ రొయ్యమీసాలలో ఆనాటి నల్లటి రోషం లేదు, చెఱుకుగడల తోలు వలిచేసిన ఆ పలువరుసా లేదు.

ఆ చాకలి బండ లాంటి ఛాతీలో, గట్టిరాయి లాంటి గుండెకాయ లేదు. ఎందుకు? ఇలా ఉన్నమనం, ఇప్పుడు ఒకరినొకరు చూచుకోవాలా? ఇదివరకటి రూపాలను గుర్తుతెచ్చుకుంటూ ఇలాగే మాట్లాడేసుకుందాం. నాకెందుకో నా ఫోటో నీకు పంపాలని లేదు, నీది తెచ్చుకుని చూడాలని లేదు. అదీకాక ఫోనులో మాట్లాడుతూనే ఉన్నాంగా, ఇంకా రూపాలతో పని ఏమిటి? ఎలాగూ సంధ్య ముసిరిన జీవితాలు, ఎలా ఉంటాయి? నాకు పెద్దగా ఇష్టం లేదు” అంటూ నిర్లిప్తంగా మాట్లాడాడు.

గోపాలం మాటలకు విస్తుపోయిన లక్ష్మి, తేరుకుని “ఏంటి గోపీ! అలా విచిత్రంగా మాట్లాడతావ్? మనం ఏమైనా చిన్నపిల్లలమా? అంత అందంగా ఉండటానికి? గంధర్వులమా, లేక అమృతం తాగిన దేవతలమా? అలాగే ఉండిపోవడానికి. అయినా రూపం ఏముంది. వయసు వచ్చే కొలది మారిపోతుంది. అయినా ఇప్పడు కూడా, ఈ వయసులో కూడా నేను అందంగానే ఉన్నానుగా? ఒకవేళ నేను నిన్ను కలవటానికి వస్తే గుర్తుపడతావా? అసలు నేను ఎలా ఉంటానో ఊహించావా? ఎలా ఉండొచ్చు అని అనుకుంటున్నావ్.

ఏ వయసులో అందం ఆ వయసులో ఉంటుంది, చిన్నప్పుడు పాల బుగ్గలతో జుట్టు మీద పడుతూ, తడబడే అడుగులు వేస్తుంటే అదో అందం, అవే అడుగులు గబగబా వేస్తున్నప్పుడు ఇంకో అందం, అబ్బాయిలకు గెడ్డాలు, మీసాలు మొదటిసారిగా వచ్చినప్పుడు, అమ్మాయిలు మొదటిసారి ఓణీలు వేసుకుని ఆరిందాలా కనిపించినప్పుడు అదో అందం, గొంతులో మాట మార్పు వచ్చిన్నప్పుడు, జ్ఞాన దంతాలు ఊడిపోయినప్పుడు అదో చెప్పలేని అందం, చదువులు అయిపోయి ఉద్యోగంలో చేరి విధులు నిర్వహిస్తూ ఏదో సాధించాలని కసి కళ్ళల్లో కనిపిస్తున్నప్పుడు ఇంకో అందం, నలభైలు దాటి యాభయ్యవ పడిలో పడినప్పుడు రిస్క్ తీసుకోలేని జీవితంలో సద్దుకుని బతకటం మరోఅందం, అరవైఏళ్ళ ప్రహసనంలో అందరి ముందు జీవిత బాధ్యతల విధుల విరమణ చేస్తూ, రిలే పరుగు పందెంలో బ్యాటన్ అందించినట్టుగా, మన పిల్లలకు మన ఇంటి బాధ్యతలు అప్పగిస్తూ కాస్త విరామ చిహ్ననికి స్వాగతం పలుకుతూ నిలబడటం అదో అందం. ఇంకా ఆ తరువాత మన పిల్లలను, మనవళ్లను వాళ్ళ ఎదుగుదల చూస్తూ, చిన్ననాటి స్మృతులు తలచుకుంటూ గడిపేయటం మించిన అందం ఇంక ఎక్కడయినా ఉంటుందా?

అంతే కానీ, ప్రతీదీ శారీరక అందంతో పోలిస్తే ఎలా? అసలు నిన్ను వచ్చి కలవటం లేదా నీ ఫోటో పాదించడం కానీ పెద్ద కష్టంతో కూడిన పని కాదు. కానీ అది నువ్వు చేస్తే బాగుంటుందని నేను ఆగాను. నువ్వు ఏమీ మారలేదు,

చిన్నప్పుడు ఎలా ఉన్నవో, అలాగే ఉన్నావ్. అదే మొండితనం వయసు వచ్చినా తగ్గలేదన్నమాట. నా మీద ఆనాటి కోపం ఇంకా పోలేదా? నా మీద కోపం వచ్చే కదా ఇన్నాళ్లు ఎక్కడో దాక్కున్నావ్? నేను నీ కోసం ప్రయత్నం చేశా, ఇన్నాళ్లకు ఫలించింది. నాకు మాత్రం నిన్ను చూడాలని ఉంది. నువ్వు ఎలా ఉన్నా పరవాలేదు. అసలు నిజం చెప్పాలి అంటే, నిన్ను ప్రత్యక్షంగా చూసి, కలసి మాట్లాడాలని ఉంది, కానీ దూర భారాలు వల్ల, అది ఇప్పట్లో కుదిరేలా లేదు. కనీసం ఈ విధంగానయినా కనిపించరా…..ప్లీజ్ ” అంటూ ఎంతో దీనంగా ప్రాధేయపడింది లక్ష్మి.

లక్ష్మి మాటలు విన్న గోపాలం కాస్త ఉలిక్కిపడి “అయ్యో….లక్ష్మి! అలా మాట్లాడకు. ఎందుకంత ఎమోషనల్‌గా మారిపోయావ్? బాధ పడుతున్నావా? ఎందుకో నాకు పెద్ద ఇష్టం లేదు, అయినా నీవు అడిగితే నేను కాదని అనగలనా?

తప్పకుండా. త్వరలో నా ఫోటో పంపిస్తాను, కొత్త ఫోన్ కూడా కొనుక్కొని నీతో మాట్లాడతాను. అయినా జీవితం గురించి ఎంత అందంగా చెప్పావ్. నాకు మాత్రం నిన్ను మన కాలేజ్ రోజుల్లో చివరి సారిగా చూసినప్పుడు ఉన్న రూపం, అదే ముఖం అలాగే గుర్తుంది, అలాగే మనసంతా నిండిపోయింది, నిన్ను అలాగే చూడాలని, అలాగే ఉంటావని అనుకుంటున్నా. ఎంత వయసు వచ్చినా, నా మనసులో నీ రూపం మారలేదు.

ఎందుకో ఇన్నాళ్లు కలవలేకపోయాం. ఇంకెంత జీవితం, అలాగే గడిపేస్తే పోదా అని అనిపించింది. రూపంలో ఏముంది అంటావా? ఏమో, ఏమి ఉందో జీవితం అంతా అర్థం అయినా, ఈ మూఢ భావాన్నిమాత్రం నాలో మార్చుకోలేక పోయా.

నీ మీద కోపమా? ఉండేది ఒకప్పుడు. నాకు చెప్పకుండా, నేను ఊళ్ళో నప్పుడు, అకస్మాత్తుగా పెళ్లి కుదిరింది అంటూ పెళ్లి చేసుకుని వెళ్లిపోయావ్. అప్పటినుండి నాకు కోపం ఉండేది. అప్పుడే నీ గురించి, నువ్వు ఎక్కడ ఉన్నవో తెలుసుకోవచ్చు. కానీ వయసులో ఉన్న విర్రవీగుతనం వల్ల తెలుసుకోలేదు, ప్రయత్నించునూ లేదు.

అలా మనకు తెలియకుండానే ఎన్నో సంవత్సరాలు గడచిపోయాయి. గడిచే కొద్దీ బుద్ధికి కాస్త అనుభవం వచ్చి నేనూ కొద్దిగా మారిపోయాను. అప్పుడప్పుడు చూడాలనిపించేది కానీ, అలా అని ఎప్పుడూ పెద్దగా ప్రయత్నం చేయలేదు. అందుకే నువ్వు ఇంకా నా మనసులో అప్పటి లక్ష్మి లాగే, అదే రూపంతో ఉండిపోయావ్. దానిని మార్చడానికి కూడా నా మనసు ప్రయత్నించటం లేదు. ఎందుకో కారణం అడగకు.

ఎందుకంటె? కారణం నాకు కూడా తెలియదు. ఇవాళ మా అబ్బాయికి చెబుతాను, కొత్త ఫోన్ కొనమని, నా ఫోటో తప్పకుండా పెట్టి పంపుతాను. సరేనా.” అంటూ అటువైపు సమాధానం కోసం ఆగాడు గోపాలం.

“నిజంగా!…..తొందరగా కొనెయ్యమను. నిన్ను చూడాలని ఉంది. నీతో వీడియో కాల్‌లో మాట్లాడాలని ఉంది. ఇవాళ ఏంతో ఆనందంగా ఉంది” అంటూ ఇంకా యేవో మాటలు మాట్లాడేసి ఆనందంగా ఫోన్ పెట్టేసింది లక్ష్మి.

గోపాలం స్తబ్దుగా, సాలోచనలో ఉండిపోయాడు, కాసేపటికి తేరుకుని కొడుకుని పిలిచి ఒక స్మార్ట్ ఫోన్ కొత్త హుంగులు ఉన్నది కొనుక్కు రమ్మని చెప్పాడు.

నాన్నకు ఇంత అకస్మాత్తుగా ఖరీదయిన ఫోన్ ఎందుకో? అని అనుకుంటూనే, నాన్న ఎప్పుడూ అడగరు, ఆయన ముచ్చట తీరుద్దాం అని అనుకుని, సాయంత్రానికల్లా కొత్త ఫోన్ కొనుక్కుని తీసుకు వచ్చి గోపాలం చేతిలో పెట్టాడు.

గోపాలం తన మనవడిని పక్కన పెట్టుకుని, కొత్త ఫోన్ ఏలా ఉపయోగించాలో, ఎలా ఫోటోలు తీయాలో, ఎలా వీడియో కాల్ మాట్లాడాలో, ఎలా సందేశాలు పంపాలో అన్నీ ఒక్కరోజులో నేర్చేసుకున్నాడు. అయినా కూడా ఒక్క ఫోటో తీసుకోలేదు, ఒక్క వీడియో కాల్ లక్ష్మి కోసం చేయలేదు.

ఇలా వారం గడిచింది. ఇంతలో మళ్ళీ లక్ష్మి ఫోన్ చేయటం, ఈ విషయం మరీ, మరీ అడగటం, ఇంక తప్పదు, రేపు వచ్చే ఆదివారం, పొద్దున్నే ఎనిమిది గంటలకల్లా నీతో మాట్లాడతా అంటూ ముహూర్తం ఖరారు చేసేసాడు. ఎంతో ఆనందంగా ఆదివారం వరకు వేచి చూసిన లక్ష్మి ఆరోజు ఉదయం పెందరాడే స్నానం చేసేసి, చక్కగా ముస్తాబయి ఒక గంట ముందునుండే సెల్ ఫోన్ చేతిలో పెట్టుకుని గోపాలం వీడియో కాల్ కోసం ఎదురు చూస్తూ. చిన్న మెస్సేజ్ రింగ్ టోన్ వచ్చినా ఆత్రంగా మొబైల్ తీసుకుని చూడటం మొదలు పెట్టింది.

అలా ఎంత సేపు చూచినా గోపాలం నుండి ఫోన్ రాక పోవటంతో, తిరిగి తానే చేయడం మొదలు పెట్టింది,

అలా చేయగా, చేయగా ఫోన్ ఎవరో ఎత్తారు.

“హలో.. నేను లక్ష్మిని! గోపాలం చిన్ననాటి ఫ్రెండ్‌ను. గోపీ లేడా? రోజు ఉదయం ఎనిమిది కల్లా నాకు వీడియో కాల్ చేస్తాను అన్నాడు, తన ఫోటో పంపుతానన్నాడు, నేను ఇక్కడ వేచి చూస్తున్నా? ఒక్కసారి గోపీని నాకు ఫోన్ చేయమని చెప్పండి” అంటూ ఆత్రంగా అడిగింది లక్ష్మి.

అటువైపు ఫోన్ ఎత్తిన గోపాలం మనవడు ఒక్కసారిగా ఏడుస్తూ “సారీ అండి! తాతయ్య ఇక లేరు….. ఈ రోజు తెల్లవారుఝామున కాలం చేశారు. నిద్ర లోనే ప్రాణం పోయింది. మీతో మాట్లాడాలని ఆత్రంగా నా దగ్గర కొత్త ఫోన్‌లో విషయాలు అన్నీ నేర్చుకున్నారు. మీతో వీడియో కాల్ మాట్లాడతానని, ఫోటోలు పంపుకుంటానని, అప్పటిదాకా ఫోటోలు, వీడియోలు ఏమీ తనకు సంబందించినవి మీకు పంపవద్దని నన్ను ఆపేసారు కూడా. ఇవాళ మీతో మాట్లాడాలి కదా. కానీ ఇదిగో ఉదయంకల్లా ఇలా జరిగింది.” అంటూ భోరున ఏడ్చేశాడు.

లక్ష్మి ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది, ప్రపంచం అంతా గిర్రున తిరుగుతున్నట్టుగా అయిపోయింది. అరే… గోపీ….. మన గోపాలం…. ఇంక లేడా?…… ఈ పాటికి తనతో మాట్లాడుతూ ఉండవలసిన గోపీ శాశ్వత నిద్రలోకి జారుకున్నాడా? ఇదేమిటి ఇలా జరిగింది అని అనుకుంటూ, ఏదో తెలియని బాధ, వేదన పడుతూ మనసంతా సంద్రం అయిపోయి, వెక్కి వెక్కి ఏడుస్తూ, వణికిపోతూ నెమ్మదిగా కుర్చీలో కూలబడి పోయింది.

బామ్మ పరిస్థితి గమనించిన లక్ష్మి మనుమరాలు సుకన్య గబాగబా వచ్చి “బామ్మా! ఏమయ్యిందే నీకు?” అంటూ లక్షి చేతిలో ఫోన్ తీసి పక్కనపెట్టి నెమ్మదిగా బామ్మను మంచముపై పడుకోబెట్టి జరిగిన అన్ని వివరాలు తెలుసుకుంది.

“అయ్యో! ఎంత పని జరిగింది బామ్మ ” అంటూ లక్ష్మి మొబైల్ కేసి చూసింది.

మొబైల్‌లో, మొబైల్ డేటా ఆగిపోయిన కారణంగా ఒక్క మెసేజ్ కూడా లేదు అని గ్రహించి, మొబైల్ డేటా ఆన్ చేసింది. వరుసగా బామ్మ ఫోన్లో వచ్చిన మెసేజ్లు చూస్తూ ఉంటే, మొదటి మెసేజ్ తెల్లవారుఝామున 3.30కు గోపాలం నుండి వచ్చింది.

దాన్ని ఆత్రంగా చూస్తూ ” బామ్మా! ఇదిగో…. మీ ఫ్రెండ్ గోపాలం నుండి ఇవాళ వచ్చిన మెసేజ్” అంటూ చూపించబోతుంటే, దానిని చదవమని లక్ష్మి తన సౌజ్ఞల ద్వారా చెప్పింది.

“ప్రియమయిన లక్ష్మికి, నువ్వు చెప్పినట్టుగానే, నేను మా అబ్బాయి ద్వారా కొత్త ఫోన్ కొనుక్కుని తెప్పించాను. మొదటి మెసేజ్ నీకే పంపుతున్నాను. బహుశా మొదటి ఫోటో కూడా నీకే, మొదటి వీడియో కాల్ నీ తోటే మాట్లాడతాను. కానీ ఎందుకో ఆత్రుత వల్ల రెండు రోజుల నుండి ఆరోగ్యం సరిగ్గా లేదు.

ఒక గంట నుండి నిద్ర పట్టక, నీకు మెసేజ్ పెడుతున్నా. నీతో మాట్లాడటం కోసం ఎప్పడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తున్నా.

లక్ష్మి! ఇన్నాళ్లు నేను నీ దగ్గర ఒక విషయం దాచాను. ఇప్పుడు చెప్పినా, చెప్పకయినా ప్రయోజనం ఏమీ లేదు. అయినా నా తృప్తి కోసం చెబుతున్నా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి, నువ్వన్నా, నీ పద్ధతి అన్నా, నీతో కలసి ఉండటం అన్నా నాకు చాలా ఇష్టం. అలా మొదలయిన ఇష్టం, పెరిగి, పెరిగి ప్రేమగా మారింది. ఎన్నో రాత్రులు నిద్రలేకుండా ఆలోచించడం, ఉదయంకల్లా నీతో మనసు విప్పి చెప్పాలని అనుకోవటం జరిగేది. కానీ, ఎందువల్లో, నాకు అదృష్టం కుదరలేదు. అందుకే మన చదువులు అయిన వెంటనే, మన ఊరు వదిలి పట్టణానికి వచ్చి ఉద్యోగం సంపాదించి నా కాళ్ళ మీద నేను నిలబడి, అప్పుడు వచ్చి కలుద్దామని అనుకున్నా.

అన్నీ సాధించి వచ్చేటప్పటికి, నీకు పెళ్లి అయిపోయి ఊరు విడిచి వెళ్ళిపోవటం కూడా జరిగిపోయింది. నా అలసత్వానికి నా మీద నాకే కోపం వచ్చి, నాకు నేనే శిక్ష వేసుకున్నా. సమయానికి స్పందించని నా మనసుపై నాకే కోపం వచ్చి, ఎన్నో సార్లు మనసంతా సంద్రమై ఏడుస్తూ ఉన్నా, నిన్ను చూడాలని గోల చేసినా, కర్కశంగా దానిని చంపేశా. అలా జీవనగతిలో పరిగెడుతూ, కాల చక్ర బంధనంలో ఇరుక్కుని ఇన్నేళ్లు గడిపేసా. మళ్ళీ మన జీవితంలో కలిసే అవకాశం లేదని అనుకుంటున్న సమయంలో, ఇలా మన మధ్య అనుకోని విధంగా, మళ్ళీ మన జీవితాలు అనుసంధానింపబడటం జరిగింది.

అందుకే నువ్వు, నేను విడిపోయినప్పటి రూపం ఇంకా గుర్తుకు ఉంది, నాకు ఇంకోలా చూడాలని కూడా లేదు. అసలు ఈ విషయం ఈ వయసులో ఇలా చెప్పటం నాకే సిగ్గుగా ఉంది, కానీ చెప్పకపోవటం వల్లే కదా, నిన్ను పోగొట్టుకుంది. కనీసం ఇప్పుడయినా నా మనసులో మాట చెప్పకపొతే, ఇప్పటికే బావురుమంటూ బ్రతుకు ఈడుస్తున్న నా మనసుకు క్షమాభిక్ష లేని శిక్ష వేస్తున్నట్టు అవుతుంది. ఎలాగూ పడమటి అంచున చివరి అంకంలో ఉన్నాం. అందుకే తప్పో, ఒప్పో, చెప్పాలని అనిపించింది. దీని వల్ల మన జీవితాల్లోఒరిగేది ఏమీ లేదు. కానీ చెప్పుకోవటం వల్ల నా మనసుకు అదో తృప్తి, నీకు కాలేజీ రోజుల్లో ఒకరు వెంటపడి ప్రేమించేవాడు అనే గొప్ప మిగులుతాయి.

నేను నిన్ను ఇప్పడు నా ప్రేమను ఒప్పుకోమని చెప్పటం లేదు. కనీసం ఇంత లేటుగా చెప్పినందుకయినా జాలి చూపిస్తావని, ఈ వయసులో చెప్పినందుకు గల గలా నవ్వుతావని, నీకు ఎలా అనిపించినా సరే…… నవ్వుతూ ఒక పగలబడి నవ్వుతున్న ఈమోజీ ఒకటి నీ మెసేజ్ లో పెట్టు. అది చాలు నాకు.

ఎలాగూ నువ్వు తెల్లవారుఝామునే లేస్తావుగా. ఈ మెసేజ్ చూసిన వెంటనే సమాధానం ఇస్తావని ఆశిస్తున్నాను. నీ సమాధానం కోసం వేచి చూస్తూ, నీతో వీడియో కాల్‌లో మాట్లాడటానికి తహతహ లాడుతూ ఉంటాను.”

అంటూ గోపాలం రాసిన మెసేజ్ గద్గద స్వరంతో సుకన్య లక్ష్మికి వినిపించింది.

ఆ మాటలు విన్న లక్ష్మికి ఏం తలుచుకోవాలో, ఎలా ఉండాలో, అర్థం కాలేదు. నోరు అంతా చేదు అయిపోతుంటే, నాలుక పిడచ కట్టకు పోతుంటే నెమ్మదిగా తనలో తానే గొణుక్కోవటం మొదలు పెట్టింది.

“ఒరేయ్… గోపీ! ఎంత పని చేసావురా? నువ్వు ఎప్పుడూ లేటే, ఈ సారి జీవితకాలం ఆలస్యం అయ్యావ్. ఎప్పుడో చిన్నప్పుడు చెప్పవలసిన విషయం దాచుకుని, దాచుకుని చెప్పకపోవటం వల్ల నేను ఎవరికో దక్కాను. నాకు తెలియదురా….. నీ మనసులో ఇంత అమృతభాండం ఉందని, దానిని ఇన్నాళ్ల్లు సమాధి చేసి, మళ్ళీ ఇప్పుడు అది నీవు నాకోసం తెచ్చినా, అది అందుకోవటానికి నేను ఆలస్యం చేసాను. ప్రతీసారి నువ్వు లేటు అయితే, ఈ సారి నేను లేట్ అయ్యాను. అయినా మొండివాడివి కదా, నాతొ మాట్లాడకుండానే, కనీసం నీ ఫోటో కూడా చూపించకుండానే పరలోకాలకు వెళ్లిపోయావ్.” అని గొణుక్కుంటుండగానే……

ఇంతలో మరో సారి లక్ష్మి ఫోన్ మోగింది. అందుకున్న సుకన్య ఫోన్ ఎత్తి…..

“బామ్మా! గోపాలంగారి మనవడు ఫోన్లో ఉన్నాడు, మీకు ఏమైనా ఆఖరి చూపు చూడాలని ఉందా, చూస్తారా? చూస్తాను అంటే వీడియో కాల్ చేసి తాతగారి పార్థివ దేహాన్ని చూడొచ్చు అంటూ అడుగుతున్నాడు. ఏమని చెప్పను.” అని సుకన్య అంటుంటే

నెమ్మదిగా ఓపిక తెచ్చుకున్న లక్ష్మి వద్దులే అని చేత్తో సైగ చేస్తూ, పక్కకు ఒరిగిపోతూ మళ్ళీ చిన్నగా పెదాలతో ఏదో చెప్పడం మొదలు పెట్టింది.” గోపీ!…..నువ్వు దాక్కున్నంత మాత్రాన, నేను ఊరుకుంటానా, నువ్వు ఎక్కడున్నా నేను వచ్చెయ్యనా?, నిన్ను ఎలా ఉన్నా చూసెయ్యనా?” అంటూ నెమ్మదిగా బాహ్య ప్రపంచానికి వీడ్కోలు పలకటం మొదలు పెట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here