విదేశీ పక్షులు

0
6

[dropcap]శే[/dropcap]ఖరం ఇంటి ముందుగా నడిచి వెళ్తున్న సుబ్బారావ్, ఆ ఇంటి వంక కాస్త పరిశీలనగా చూస్తూ, “అదేవిటీ శేఖరం ఇంటి తలపు తెరిచే ఉంది. అతను అమెరికాలో ఉన్న కూతురునీ, కొడుకుని చూడటానికి వెళ్ళాడు కదా! ఓ మూడు నెలల తర్వాత కదా వస్తా అన్నాడు”, అని ఓ క్షణం ముక్కు మీద వేలు పెట్టుకుని ఆలోచించి “కొంప దీసి దొంగ వెధవ ఎవడైనా వీడి ఇంట్లోకి దూరి నగా, నట్రా చుట్టబెట్టేయట్లేదు కదా ఖర్మ” అని కాస్త దగ్గరగా వెళ్ళి, లోనికి తొంగి చూసాడు. చిన్న, చిన్న శభ్దాలు వినిపిస్తున్నాయి.

“మనుషులు కనిపించడం లేదు కానీ శభ్దాలు వినిపిస్తున్నాయి. ఎందుకైనా మంచిది పోలీసులని పిలుద్దాం” అని చొక్కా జేబు లోంచి ఫోన్ బయటకు తీసే లోపు, శేఖరం కళ్ళజోడు సరిచేసుకుంటూ, లుంగీ, బనీన్‌తో నెమ్మదిగా బయటకు నడుచుకుంటూ వచ్చాడు. అతన్ని చూస్తూనే దగ్గరగా వెళుతూ, “అదేంట్రా శేఖరం, అమెరికా వెళ్ళావ్ కదా! ఎప్పుడొచ్చేసావ్” అడిగాడు కళ్ళు పెద్దగా చేసి చూస్తూ.

“నిన్న రాత్రి ఫ్లయిట్‍కే వచ్చేసాను రా. నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. జెట్‌లాగ్ ఉండి అలా పడుకుండిపోయాను” చెప్పాడు నుదిటికి కాస్త నొప్పి బామ్ రాసుకుంటూ.

“అదేవిట్రా విచిత్రంగా ఉంది.” అడిగాడు ఆశ్చర్యంగా చూస్తూ.

“ఇది తలనొప్పిబామ్ రా, అక్కడే కొన్నాను. నొప్పి తగ్గడంతో పాటు, వాసన కూడా భలేగా నచ్చింది. అందుకే మళ్ళీ, మళ్ళీ రాసుకుంటున్నాను. తల తేలిగ్గా అయిపోయినట్టుంది. నువ్వూ రాసుకుంటావా” అడిగాడు దాన్ని అతనికి అందిస్తూ.

“నే విచిత్రంగా ఉందన్నది దీని గురించి కాదు, పిల్లల దగ్గరకు వెళ్ళి కనీసం మూడు నెలలు ఉంటానూ, అదీ ఇదీ అని ఎగురుకుంటూ వెళ్ళిన వాడివి, ఇలా వాడిపోయి పది రోజులకే పరిగెత్తుకు వచ్చెసావేంటీ అని”

“ఏం చెప్పమంటావ్ రా, వాడు అమెరికా వెళ్ళిన ఏడేళ్ళకి మొదటిసారిగా నేను అక్కడికి వెళ్ళడం. తీరా అక్కడికెళ్ళాక అంతా కొత్తగా అనిపించింది. కనీ పెంచిన నాన్న, చాన్నాళ్ళకి వచ్చాడన్న సంతోషం మా వాడి ముఖాన పెద్దగా కనిపించలేదు. కోడలు సరే సరి. మరీ ఒక్క సారంటే ఒక్కసారి పేరుకి పలకరించి ఆఫీసుకి వెళ్లిపోయింది. మనవరాలిని కూడా స్కూల్‌కి దిగబెట్టేసారు. వెళ్ళిన మొదటి పూటకే ఒంటరి అయిపోయిన ఫీలింగ్ వచ్చేసింది . సరే నేనే మరీ ఓవర్‍గా ఆలోచిస్తున్నానేమో అనుకుని, వీకెండ్‌లో ఖాళీ దొరికితే నాతో గడుపుతారులే అనుకుని ఊరుకున్నాను. తర్వాత రెండు రోజులకి వాళ్ళు పెట్టింది తినలేక, రైస్ తిందాం రా అంటే మా వాడు, ఇది కూడా బావుంటుంది నాన్నా అనేవాడు. పైగా సూపర్ మార్కెట్‌కి వెళ్ళి రైస్ తేవాలి అంటూ ఆ శాండ్‍విచ్‍లూ, బర్గర్లూ, కట్లెట్లూ, పిజ్జాలూ నా  మొహాన పడేసేవారు. మళ్ళీ అడిగితే, రైస్ తెచ్చి వండుకోమని చక్కగా చెప్పింది మా  కోడలు. వాళ్ళు పెట్టింది పూర్తిగా తినలేక చాలు అనేసేవాడిని. తర్వాత ఆకలి వేసేది. సరే వాళ్ళు వెళ్లిపోయాక, ఫ్రిజ్ ఓపెన్ చేస్తే, చిప్సూ, కూల్ డ్రింకులూ తప్ప ఏం ఉండేవి కావు. సరే వాళ్ళ జీవితాలు వాళ్ళవి అని సరిపెట్టుకున్నాను. సాయంత్రం కూడా ఇద్దరూ ఆఫీసు నుండి వచ్చినట్టే వచ్చి మళ్ళీ బయటికి వెళ్లిపోయేవారు. ఒక వేళ ఉన్నా, ఆన్‌లైన్ మీటింగ్స్ అనో, కాన్ఫరెన్స్ అనో, క్లయింట్ కాల్ అనో ల్యాప్‌టాప్‍తో కుస్తీ పట్టేవారు. మనవరాలు పక్కింటికి వెళ్ళేది. నేనెందుకు వెళ్లానో నాకే అర్థం కాక జుట్టు పీక్కునేవాడ్నంటే నమ్ము” చెప్పాడు శేఖరం.

ఆ మాటలకి సుబ్బారావ్, శేఖరం జుట్టు కేసి చూస్తూ, “అవును, అప్పటికంటే జుట్టు తగ్గిపోయింది. ఇలా నీ జుట్టు నువ్వు పీక్కునే బదులు, అదే విషయం మీ అబ్బాయికి చెబితే సరిపోయేదిగా”

“అదే చేశాను. ఆ ముక్క సౌమ్యంగా, మెత్తగా మా వాడితో అంటే, కోడలు వాడి చెవిలో కోపంగా ఏదో చెప్పింది. దాంతో వాడు కూల్ అన్నాడు. తర్వాత ఇద్దరూ గదిలోకి పోయి చాలా సేపటికి బయటికి వచ్చారు. నా కారణంగా వారి ఇద్దరి మధ్యా గొడవలు వస్తాయేమో అని నాకు భయం వేసేదంటే నమ్ము.”

“కోడలు సరే, కొడుకు కూడా నీతో సవ్యంగా మాట్లాడలేదా మరి.” అడిగాడు సుబ్బారావ్.

“మాట్లాడకేం, వాడు నాతో మాట్లాడితే, అక్కడ మన ఏరియాలో గజం ఎంత ఉంది. ఇప్పుడు అమ్మితే ఎంత రావచ్చు, ఆ ఇంటిని రిమోడెల్ చేసి అమ్మితే ఎంత వస్తుంది అని ఏవేవో అడిగేవాడు. నేను, అది మీ అమ్మ, నేను ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు. మీ అమ్మ తిరిగిన ఇల్లు, దానిని ఎందుకు అమ్మడం అని నేనంటే, వద్దు దాడి మీ తరువాత ఇండియాలో ఎవరుంటారు, అని తేలిగ్గా అనేసేవాడు. ఒంట్లో ఏదోలా ఉందిరా అంటే, వెంటనే అక్కడ పెద్ద హాస్పిటల్‌కి తీసుకు వెళ్ళి అన్ని టెస్టులూ చేయిస్తాడనుకున్నాను. కానీ తిప్పి తిప్పి నన్నే ఇండియాకి వెళ్ళాక యోగాలో జాయిన్ అవ్వమని ఉచిత సలహా ఇచ్చాడు. అది తినొద్దు, ఇది తినొద్దు అని నన్నే చీవాట్లు పెట్టాడు. ఆ తర్వాత ఆ వీకెండ్ రానే వచ్చింది. వచ్చాక, ఎవరితోనో లాంగ్ డ్రైవ్‌కి వెళ్తాం అని మనవరాలిని నాకు అప్పజెప్పి వెళ్ళిపోయారు. సరే మనవరాలితో గదుపుదాం అనుకుంటే, నా మనవరాలు ఎప్పుడూ ఆ వీడెయో గేమ్స్ లో మునిగి తేలేది. ఖాళీ దొరికితే, పక్కింటికి వెళ్ళి ఆడుకుని వచ్చేది. ఇలా కక్కలేక మింగ లేక ఓ వారం  రోజులు బలవంతంగా గడిపాను. తర్వాత ఫీనిక్స్‌లో  ఉంటున్న మా అమ్మాయి దగ్గరకి వెళ్ళాను, అల్లుడు తెల్లోడవడం వల్ల అనుకుంటాను, అంకుల్ కం, లెట్స్ ఈట్ అని ఏదో కుక్క పిల్లని పిలిచినట్టు పిలిచేవాడు దరిద్రుడు. పైగా ఏవేవో జోకులు వేసి వాడే నవ్వేసేవాడు. ఇక అవన్నీ సహించడం నావల్ల కాక వెంటనే మా వాడ్ని ఫ్లయిట్ టికెట్ బుక్ చేయమన్నాను. ఇదిగో ఇలా వచ్చేసాను. ప్రేమ చంపుకోలేక పిల్లల పంచన మనసు చంపుకు ఉండే కంటే, ఒంటరిగా ఐనా, మనకి మనంగా చద్దన్నం తిని బ్రతికే జీవితమే ఎంతో సుఖం. ఇక జీవితంలో మళ్ళీ అమెరికా వెళ్ళను” అని క్షణం ఆగి “అవును సుబ్బారావ్, మీ వాడు లండన్ వెళ్లాడన్నావ్. కానీ ఎప్పుడూ మీ వాడి గురించి చెప్పవేంటి” అడిగాడు శేఖర్.

“మా వాడు మీ వాడిలా కాదు. ఇలాంటి గొడవలూ అవీ రాకుండా ఉండాలని కోరుకుంటాడు. అందుకే, నేను లండన్ వస్తానంటే వినడు. వీలు చూసుకుని వాడే వచ్చి వచ్చివెళ్తాడట” అని సుబ్బారావ్ చెప్తుండగానే

“అదృష్టవంతుడివి. మీ వాడే లండన్ నుండి ఇండియా వచ్చి నిన్ను చూసి వెళ్తున్నాడు” అన్నాడు శేఖర్ .

“అక్కడే ఉందిరా శేఖరం అసలు కొసమెరుపు. నేను వాడి దగ్గరకి వస్తానంటే వద్దంటాడు, వాడే వచ్చి చూస్తా అంటాడు. ఇలానే గత అయిదు సంవత్సరాలుగా అంటున్నాడు. అదీ మా వాడి గొప్పతనం.” అంటూ ముందుకి నడిచాడు సుబ్బారావ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here