మతము మతము మధ్య మంటలు రేపుచు
శాంతి జీవనంబు సాగనీక
రక్త సిక్తగాను రమ్యధాత్రిని జేసి
స్వార్థపరులు మిగుల సాగుచుండ్రి. (11)
మా మతము గొప్పదంచును
మా మతమే గొప్పదంచు మహిలో కుమతుల్
భీమాకారులునౌచును
సామంబున్విడచి దిగరె సమరెబునకున్. (12)
మమతను ద్రెంచివైచి, మటుమాయము జేసియు మంచి భావనల్
సమతను గూలనేసియును శాంతికి దిప్పలు దెచ్చి నిత్యమున్
విమతులు నైమెలంగుచును విస్తృతభంగి మతాగ్ని కీలలన్
అమితముగా నరేపుచును నాకసమంటగ, సంచరింపరే! (13)
మతపు చిచ్చునందు సతతంబు సుతులెల్ల
ముందు చూపు లేని మూర్ఖులగుచు
మ్రగ్గిపోయి కరము మండిపోవుచు నుండ
భరతమాత గుండె పగిలిపోదే? (14)
అడ్డదారులందు నందలంబెక్కంగ
కోరి కొంత మంది కుట్రతోడ
మత విభేదములతో మంటలు రేపుచు
సంచరించు చుంట సమరసంబె? (15)
పరమతంబును దిట్టి ప్రజలలో సహనమున్
కోల్పోవజేయుచు గొంతమంది
పరమతంబుల మీద బవరంబు సాగించ
కోరుకొనుచు నుండి కొంత మంది
పరమత సంబంధ ప్రాభవంలది యెల్ల
కూల్చంగ జూచుచు గొంత మంది
పరమతంబులవారి ప్రాణాలు దీయుచు
కుట్రలంజేయుచు గొంత మంది
అన్యమతముల పట్లను నహరహంబు
ద్వేషభావంహురగిలించి దేశక్తీర్తి
గంగపాలును జేయగ గలుషమతులు
పంతముంబూని చరియింత్రు కొంతమంది. (16)
అంత నాగక భువిలోన గొంత మంది
నాశమొందింప జూచుచు దేశ దీప్తి
కులపు భేదాల నెలకొల్ప కూర్మిబాపి
అడ్డుగోడలు వైచిరి గడ్డుగాను. (17)
కొందఱు నధికులటంచును
కొందఱు నల్పులునటంచు కులభేధాగ్నుల్
డెందముల మండజేతురు
కొందల మందంగ గరము గుచ్ఛితులగుచున్. (18)
కులము కులమటంచుగు జనులు కొందఱు
సమత మమతలన్ని సమయజేసి
సంఘజీవనమును సాగనీయక నుంద్రు
ధర్మ పథమునందు దరల నీక. (19)
చిత్తముంబట్టి, చేసేడి వృత్తి బట్టి
కులములేర్పడ్డ తీరునుగూలనేసి
హెచ్చు తగ్గుల భేదాల రెచ్చగొట్టి
వసుధలో, ద్వేషమున్ బెంచ భావ్యమగునె? (20)