“నీలి నీడలు” అనే ఖండకావ్యంలో మొత్తం ఏడు ఖండికలు ఉన్నాయి. ప్రతి ఖండికలో ఆణిముత్యాల వంటి పద్యాలు ఉన్నాయి. ‘చేతన‘ అనే కలం పేరుతో ప్రస్తుత సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలను ప్రజలకు తెలిపి, జాగృతపరుస్తారు కవి మేడిపల్లి వేంకట లక్ష్మీ నారాయణ. ఇది నాల్గవ ఖండిక ‘జూదము‘.
విద్వేషాలు – ‘నీలి నీడలు’ ఖండకావ్యంలోని నాల్గవ ఖండిక.
***
దేశదేశాల యందున దీప్తి గాంచి
రత్నగర్భను పేరున రాణకెక్కు
భరతమాతకు బిడ్డలై పరగునట్టి
భాగ్యమబ్బుట గతజన్మ ఫలముగాదే. (1)
మంచిని పెంచ, మంచిదని మాన్యులునౌ మునినాధు లెల్లరున్
అంచిత రీతిదెల్పుచు మహాద్భుత రీతిగ బోధజేయగా,
కొంచెపు బుద్ధితో మెలగు, కొందరు భారతజాతి పౌరులే
వంచనబెంచు దుష్టులయి, బంతముతో నిట సంచరింపరే? (2)
జాతులనే కముల్గలిగి జాస్తిగనొప్పననేకభాషలన్
ప్రీతినిగూర్చు వర్ణములబ్రేమనుదెల్పు మతాల తీరుతో
చేతనమైన ప్రాంతముల జెన్నునునింపననేక రీతులన్
భారత భూతలంబు కనుపండవునై వెలుగొందు నెప్పుడున్. (3)
ఒకరికంటె నొకరు నున్నతులనుచును,
పరులకన్నతామెవరులమనుచు
దేశమందుదామె దివ్యాత్మలమటంచు
చెప్పుకొంద్రు ప్రజలు చిత్రముగను. (4)
చెప్పుకొనుటెకాదు చిరకాల మందుండి
వర్ణ, మతపు భేద భావములతో
జాతి, మత కులముల జాడ్యాలతో గూడి
వాదులాడు చుండ్రి భారతమున. (5)
అన్యమేమి లేదు అభిమానమే కాని
అనుచు బలుకుచుండ్రి యవనిజనులు
భేద భావములను పాదుకొల్పిరి ధాత్రి
ప్రాంత, వర్ణ, మతము, భాషలందు. (6)
మంచి భావముగనరాదు మచ్చుకైన,
రెచ్చిపోయె విభేదముల్ హెచ్చుగాను,
తీవ్రయసమానతలతోడన దేశమంత
మండ సాగే విద్వేషంపు మంటలందు. (7)
మతమది మంచి కోసమని మాన్యులునేఘనులెల్ల పల్కుచున్
సతతము మానవాళికిని చక్కని బోధలు చేయుచుండగా
వెతలను గూర్చునీ మతము విస్తృత భంగినటంచునజ్ఞులై
కుతలము నందు దూరుచును గొప్పగ బెంచరె ద్వేషబావమున్. (8)
మతము మత్తు నిచ్చు మను జాతికి నటంచు
కల్ల బొల్లివైన కథలు జెప్పి
సంఘ నియమముల సమయించుచుండిరి
మాతృదేశ కీర్తి మంటగలుప. (9)
ఒక ప్రవక్తదైన నున్నతమౌ భావ
బోధ జాలమెల్ల బుడమియందు
మతముగాను వ్యాప్తి మహిత రీతి జరిగె
అదియ చెడ్డదనిన నర్థమున్నె. (10)




