అగ్రకులములంచు నల్పవర్ణములంచు
భేదభావములను పెంపుజేసి
సంఘమందు మిగుల సంకులసమరంబు
పెట్టుచుంద్రు కులపు పెద్దలెపుడు. (21)
సంఘరధమున నాలుగు చక్రములును
సమమునైనవె, వేరొండు శంక వలదు
అనుచు పలుకగ జ్ఞానులునవనిలోన
కట్టుకధలెన్నో చెప్పుచు గలుషమతులు
కరముద్వేషాగ్నిరగిలింప గౌరవంబె? (22)
సంఘగమనమిలను చతికలబడవేయ
సంఘహితము గరము చంపివేయ
వక్రబుద్ధిగులపు వ్యత్యాములబెట్టు
కపట మతుల యాట కట్టుటెపుడో? (23)
భరతదేశమందు ప్రముఖమౌచును నొప్పు
ప్రాంతములును గలవు బహుళముగను
ఒక్క భాష చేత నొక్కక్క ప్రాంతము
దీప్తివంతమగుచు దేజరిల్లు (24)
అట్టి ప్రాంతములకు నన్యోన్య భేదంబు
కల్పనంబు జేసిస్వల్ప బుద్ధి
సత్సమైక్యతకును సంక్ష్యోభమందించి
పెద్దముప్పు తెచ్చి పెట్టినారు. (25)
ప్రాంతీయ దురభిమానము
నెంతయు బెంపొందజేసి యిలలో బ్రజకున్
స్వాంతంబున విద్వేషము
భ్రాంతింగలిగించు చుండ్రి పాపాత్ములునై. (26)
భాషాభేదంబులు పలు
భాషల మధ్య తెగని వైరుధ్యంబుల్
భాషా విద్వేషంబులు
భూషలుగను బెంచినారు భోగాసక్తుల్. (27)
జాతి వైరములును జాజ్వల్యమానమై
జ్వాలలెగయ సాగె వసుధయందు
ఉత్తరాది వారు నుత్తమార్యులునంచు
దక్షిణాది వారు దస్యులంచు. (28)
భరతదేశమందు వరలుచునున్నట్టి
జాతులన్ని చూడ సమమెయంచు
చరిత చెప్పుచుండ, జగతి విద్యేషాలు
వెలయుటన్న జనుల వెఱ్ఱిగాదె? (29)
ఇట్టి విద్యేషములతోడనింత దనుక
భారతీయుల కన్యోన్య వైరమునిడి
ఏకతా సూత్రమునకు ననేకగతుల
భంగపాటును జేసిరి స్వార్థపరులు. (30)
ఉద్రేకమును నించి యున్మాదమును బెంచు
విద్వేషము లవేల విబుధులార
దేశసమైక్యతన్నాశంబు జేసేడు
వక్రబుద్ధులవేలప్రముఖులార
భరతాంబకును కీర్తి భంగంబుగల్గించు
జగడంబులేల విజ్ఞానులార
దేశమాతనెపుడు దీనురాలుగ జేయు
భేధభావము లేల పెద్దలార
చెడును మఱచుచు, మంచికి శ్రీని చుట్టి
దేశసౌభాగ్యమునకును దీక్షబూని
పేర్మి భరతాంబకీర్తిని బెంచుడయ్య
పుణ్యధనులార! భారతపుత్రులార! (31)