విఘ్నాలను తొలగించే వినాయక చవితి

1
10

[2024 సెప్టెంబర్ 07 వినాయక చవితి పర్వదినం సందర్భంగా – ‘విఘ్నాలను తొలగించే వినాయక చవితి’ అనే రచనని అందిస్తున్నారు డా. మైలవరపు లలితకుమారి.]

[dropcap]ప్ర[/dropcap]కృతి పచ్చదనంతో శోభాయమానంగా ప్రకాశించే వసంత ఋతువులో మనకు పండుగలు ప్రారంభమవుతాయి. ఆకులు రాల్చిన శిశిర ఋతువు తరలివెళ్ళగా చిగిర్చిన చెట్లన్నీ ఆకుపచ్చదనంతో ప్రకాశిస్తున్నాయి. చైత్ర శుక్ల పాడ్యమి అంటే వసంత ఋతువు ప్రారంభమైన రోజున ఉగాది పండుగను మనం జరుపుకుంటాము. ఋతువులలో మొదటిది వసంత ఋతువు మొదటి రోజున వచ్చే పండుగను ఉగాదిగా జరుపుకుంటాము. దీనినే మనం ఉగాది, యుగాది అని కూడా పిలుచుకుంటాము. మనకు ప్రతి నెలలో ఏదో ఒక పండుగ వస్తూనే ఉంటుంది. వసంత ఋతువు తరువాత వచ్చే గ్రీష్మ ఋతువు వెళ్ళిపోగానే వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. దానితో నేలంతా సస్యశ్యామలంగా మారుతుంది. ఆ వర్ష ఋతువులో వచ్చే భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి రోజున వినాయక చవితిని చేసుకుంటాం. దీనినే మొదటి పండుగగా భావిస్తాము. ఎందుకంటే మనం చేసే పనులకు ఎటువంటి ఆటంకాలు కలగకూడదని వినాయకుని పూజిస్తాము. అందువలన దీనిని మొదటి పండుగలా భావిస్తారు. దక్షిణాయణం వెళ్లి ఉత్తరాయణం ప్రారంభంలో వస్తుంది. ప్రకృతితో మమేకమైన పండుగ వినాయక చవితి. ఈ పండుగను పర్యావరణహితమైన పండుగగా చెబుతారు. ఈ పండుగ నాడు తెల్లవారుజామునే అభ్యంగన స్నానమాచరించి పిల్లలు ప్రకృతిలో లభించే 21 రకాల పత్రి ఆకులను సేకరించి విఘ్నేశ్వరుని పూజకై తీసుకువస్తారు. ఈ ఆకులనన్నింటిని ఆయుర్వేద ఔషధములలో ఉపయోగిస్తారు. ఇందులో ఒక్కొక్క రకము పత్రి ఒక్కొక్క రకమైన వ్యాధి నిరోధక ఔషధ గుణము కలిగి ఉంటుంది. చిన్నతనము నుండి పిల్లలకు ఆయుర్వేదము పట్ల అవగాహన కలిగించటం కోసం ఈ పత్రి సేకరణ ఉపయోగపడుతుంది..

ఈ పండుగ నాడు వినాయకుని మట్టి ప్రతిమను తెచ్చి మూడు, ఐదు లేదా తొమ్మిది రోజులపాటు పూజలు నైవేద్యాలతో అర్చించి చివరి రోజున బావి, చెరువు లేదా నదీ జలములలో నిమజ్జనం చేస్తారు. అలా చేయటంలో కూడా ఒక ఉపయోగం ఉన్నది. పత్రితో సహా ప్రతిమను నిమజ్జనంచేసి నందువలన ఆ పత్రిలోఉండే ఔషధ గుణాలు ఆ నీటిలోకి చేరతాయి. ఆ నీటిని స్వీకరించినందు వలన రోగనిరోధక శక్తి పెరుగుతుందని, చర్మవ్యాధులు నశిస్తాయని ఒకనమ్మకం.

అంతేకాక వినాయకుని విగ్రహ స్వరూపంలో కూడా ఒక విశేషం ఉన్నది. పార్వతి దేవి నలుగు పిండితో ఒక బాలుని బొమ్మను చేసి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి, వాకిలి వద్ద కాపలా ఉంచుతుంది. గజాసురుని సంహరించిన పరమేశ్వరుడు కైలాసమునకురాగా ఆ బాలుడు ఈశ్వరుని లోపలికి రాకుండా అడ్డగిస్తాడు. శివుడా బాలుని శిరస్సుని ఖండిస్తాడు. ఆ తరువాత పార్వతీదేవి ద్వారా బాలుని సమాచారాన్ని విన్న ఈశ్వరుడు ఆ బాలునికి గజాసురుని శిరస్సును అతికిస్తాడు. ప్రమథ గణాలకు అధిపతిని చేస్తాడు. అంతేకాక ఎవరు ఏ కార్యాన్ని ప్రారంభించిన నీకే ముందు పూజ చేస్తారు. అలా చేయనిచో వారి కార్యములకు విఘ్నములు ఏర్పడునట్లు వరం ఇస్తాడు. యుగాలేవైనా కాలమేదైనా విఘ్నేశ్వరునికి తొలి పూజ చేయడం సంప్రదాయమైంది. అలా వినాయకుని అర్చించనందు వలన కావేరి నది నీటిని కమండలంలో బంధించిన అగస్త్యుడు భంగపాటును పొందుతాడు. అంతేకాక తల్లి కోరిక మేరకు కైలాసం నుండి శివుని ఆత్మలింగాన్ని లంకకు తీసుకు వెళుతున్న రావణాసురుడు కూడా వినాయకుని అర్చించనందు వలన ఆ ఆత్మలింగం గోకర్ణంలో ప్రతిష్ఠితమయి అవమానాన్ని పొందినట్లు మనకు తెలుస్తున్నది. అంతేగాక వినాయక చవితి నాడు వినాయకుని చూసి నవ్విన చంద్రుడు పార్వతీదేవి శాపానికి గురి అవుతాడు. చవితి నాడు చంద్రుని చూస్తే కుష్టువ్యాధి బారిన పడతారని పార్వతీదేవి శపించింది. కానీ వినాయక చవితి వ్రతం చేసుకొని అక్షతలు శిరస్సును ధరిస్తే శాపప్రభావం ఉండక ఉపశమనం పొందుతారనే వరాన్నికూడా ఇచ్చింది. వినాయకుని పూజ అంత విశిష్టమైనది.

వినాయకుని శరీరం మానవ శరీరం శిరస్సు మాత్రమే ఏనుగు తల. వాహనము ఎలుక. వినాయకుని శరీరానికి, మూషిక వాహనమునకు ఎంతో విశిష్టత కలదు.

శిరస్సు: ఏనుగు తల యోగానికి, ధ్యానానికి చిహ్నం. ఎందువలనంటే ఏనుగు చెరువులో కానీ, నదిలో కానీ స్నానం చేసి తీరానికి వెళ్లి మరల దుమ్మంతా తనపైన వేసుకుంటుంది. అంటే ఏదైనా శరీరానికే కానీ మనసుకు అంటనివ్వకూడదు అన్నది ఇందలి తాత్వికత.

కళ్ళు: ఏనుగు కళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి. ఎప్పుడో కానీ తెరిచి చూడదు. అంటే మంచిని గమనించు. చెడును చూడకూడదు అన్న అర్థాన్ని చెబుతాయి.

చెవులు: చేటల వంటి పెద్ద పెద్ద చెవులు ఎప్పుడు కదలాడుతూనే ఉంటాయి. దానికి అర్థం అన్ని మాటలను విను కానీ చెడ్డమాటలను చెరిగేసి మంచిని మాత్రమే స్వీకరించాలి అని. ఎందుకంటే చేటలో గింజల నుంచి చెరిగతే పనికిరాని వానిని తొలగించి మంచివి మాత్రమే తనలో ఉంచుకుంటుంది. అదే గజకర్ణముల ప్రత్యేకత.

తుండము: స్వామి తొండము ఇది ఓంకారానికి చిహ్నం. అంతేకాక శ్వాసించేటప్పుడు నెమ్మదిగా శ్వాసను గ్రహించాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసములను అదుపులో ఉంచుకోవాలి అని చెబుతుంది.

నోరు: నోరు పెద్దది కానీ తినేది చాలా కొంచెమని కుడుముల ద్వారా చెబుతుంది. అంటే మనిషి కావలసినంత ఆహారం మాత్రమే స్వీకరించాలి అని అర్థము.

పొట్ట: ఆ తర్వాత పొట్టపైగల నాగపాశము శక్తికీ, కుండలినీ శక్తికి సంకేతం. అంతేకాక ఏమి తిన్నా కావలసిన దానిని జీర్ణించుకొని అనవసరమైన దానిని విసర్జించు అన్నట్లుగా వెలగపండును ఏనుగు తిని అందులోని గుజ్జునుమాత్రం జీర్ణం చేసుకొని దానిపై పెంకును విసర్జిస్తుంది.

‘కరిమింగి వెలార్చిన వెలగపండు’ అనే సామెత దీనిని నుంచే వచ్చింది. అలానే మానవుడు మంచి లక్షణాలను తనలో నిలుపుకోవాలని దీని భావన.

పరశువు: చేతనున్న పరశువు దుర్మార్గాన్ని అజ్ఞానాన్ని ఖండించి వేసి జ్ఞానాన్ని పెంచుతుంది.

పాశము: తన భక్తుల కార్యములకు విఘ్నాలు కలుగకుండ ఆవిఘ్నములను కట్టి పడవేస్తుంది.

మాల: మెడలోని మాల జ్ఞానానికిగుర్తు. బుధ్ధిని వికసింప చేస్తుంది.

దంతము: చేతనున్న దంతము త్యాగానికి చిహ్నం. వ్యాస మహర్షి మహాభారతము రచన చేస్తున్నప్పుడు గంటం ఆగకుండా రాయటం ఎలాగా అని ఆలోచిస్తున్న సమయంలో వినాయకుడు తన దంతమును గంటముగా చేసి మహాభారత రచనను పూర్తి గావించెను. పరుల కోసం శరీరాన్ని దానంచేయాలి అనే దాన గుణం మనకు ఇందులో కనిపిస్తుంది.

శరీరము: ఇక మానవ శరీరము మాయ, ప్రకృతుల చిహ్నము. మానవుని లోని అరిషడ్వర్గాలను అణిచివేయటానికి ఎలుకను వాహనముగా చేసుకున్నాడు.

వాహనము: ఎలుక తామస ప్రవృత్తికి చిహ్నం. కనుక కామక్రోధాలను అణగ తొక్కడానికి గుర్తుగా ఎలుకపై స్వారీ చేయడం. మనిషి తన మనసును అదుపులో ఉంచుకోవాలని చెప్పటమే ఈ ఎలుకపై స్వారీ చేయడం.

కుడుములు: కుడుములు నైవేద్యం పరిమిత ఆహారాన్ని తెలియజేయటానికి నిదర్శనము.

మరుగుజ్జుతనము అందానికి కాక ఆత్మవిశ్వాసంతో మెలగాలని సూచిస్తుంది.

ప్రతి విషయములో మనకు తత్త్వాన్ని, సన్మార్గాన్ని బోధించే మహా మహితాత్ముడైన గణపతిని పూజించటం అత్యంత శ్రేయోదాయకం. మన భారతదేశంలోనే కాదు పాశ్చాత్య దేశాలలో సైతం నేడు గణపతి పూజలు, గణపతి నవరాత్రి ఉత్సవములు మహా వైభవంగా జరుపుతున్నారు. మహారాష్ర్టలో పూనాకు 100 కిలోమీటర్ల దూరంలో అష్టవినాయక ఆలయములు ఉన్నాయి. ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క భంగిమలో విగ్రహాలు దర్శనమిస్తాయి. అష్టవినాయక దర్శనం శుభదాయకంగా భావిస్తారు. ముందుగా మోరేగావ్ నుంచి యాత్రను ప్రారంభిస్తారు. విఘ్నాలను తొలగించే వినాయక స్వామికి పూజ చేయటానికి మనమంతా కార్యోన్ముఖులము అవుదాము. వినాయక చతుర్థి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here