విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-24

0
10

[ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి చిత్రాలను విశ్లేషిస్తూ వేదాల గీతాచార్య అందిస్తున్న సీరిస్]

అజ్ఞానంలో బ్రహ్మజ్ఞానం – 2

ఈగా స్వియాన్టెక్ (Iga Swíatek) ప్రస్తుతం టెన్నిస్‌లో ప్రపంచ నంబర్ 1 క్రీడాకారిణి. పోలిష్. సెరీనా విలియమ్స్ రిటైరయ్యాక, వీనస్ ప్రభ పూర్తిగా మరుగున పడుతున్న వేళ (చాలామంది ఈ తరం కుర్రకారుకు వీనస్ గురించి, ఆమె సాధించిన ఘనతల గురించి తెలియదు. కొన్నాళ్ళకు సెరీనా గురించి కూడా అంతే) టెన్నిస్ లో కొత్త ఐకన్‌గా ఎదుగుతున్నది. స్టెఫీ గ్రాఫ్ కూడా ఇప్పుడు అప్పటి తరం అభిమానుల ఙ్ఞాపకాలలో ఉండచ్చు కానీ, ఈ తరం వారికి ఒక రికార్డుల పుస్తకంలో ఎక్కువగా తగిలే పేరు. అంతే! సచిన్ లాంటి ఆటగాడినే ఈ తరం అభిమానులు (కోహ్లీని చూస్తూ పెరిగిన తరం అనుకోండి) పెద్దగా లెక్క చేయటం లేదు. కాలం మారుతుంది. అన్నీ జ్ఞాపకాల పుస్తకాలలో చేరతాయి.

పాఠ్య పుస్తకాలనే తెరచి చదవని తరం, అసలు పుస్తకాలను కూడా ఆడియోలుగా, యాప్ లలో డాక్యుమెంట్లుగా మార్చే తరం మామూలు అచ్చు పుస్తకాలనే చదవరు. ఇక జ్ఞాపకాల పుస్తకాలను ఏమి చదువుతారు?

కొన్నేళ్ళ క్రితం నా టీమ్‌లో content writer గా పని చేసే ఒక కుర్రాడున్నాడు. అచ్చమైన ఈ తరం కుర్రవాడు. మా ఆఫీస్‌లో ఎంటర్టెయిన్మెంట్ డిపార్టుమెంటుంది. అందులో ఒక యాప్‌ను డెవలప్ చేస్తున్నారు. దాన్ని గేమిఫికేషన్ యాప్‌గా మార్చాలని ఆలోచన. అందులో కంటెంట్ న్యూస్, సినిమా రివ్యూలు, క్రీడల గురించి, సినిమా వార్తలు, సైన్స్ విశేషాలు, క్విజ్జులు, ఆఫర్లు, గేమ్స్.. ఇలా జనాన్ని ఆ యాప్‌ను వదలకుండా చేసే సామాగ్రి అంతా పెడుతున్నారు. అది చూసే బాధ్యత నాది. అటు డెవలపర్ టీమ్‌కు, ఇటు కంటెంట్ టీమ్‌కు వారధిలా. అటో చెయ్యి, ఇటో చెయ్యి వేయాల్సి వస్తుంది.

ఈ కుర్రాడిని క్రీడల గురించి రాయటానికి తీసుకున్నారు.

సరిగ్గా రాడు. పని చేయటంలో రకరకాల చాయ్స్‌లు చెప్తాడు. అది చేయను. ఇది చేయను అంటాడు. ఒకసారి చరిత్రలో 20 మంది గొప్ప క్రికెట్ ఆటగాళ్ళ లిస్టు చేయాలని టాస్క్ పడింది. దానికి అతను పంపిన లిస్ట్‌లో 2010 కు ముందు ఆడిన వారిలో ఒక్క ఆటగాడు కూడా లేడు. సచిన్ సహా.

సచిన్ ఎందుకు లేడు అని అడిగాను.

అతని strike rate 86. కోహ్లీది 93 అన్నాడు.

సచిన్ లాంటి ఆటగాడే లేకుంటే ఇక కపిల్, గవాస్కర్, ఆ పైన వారి సంగతి? అదృష్టవశాత్తు డేల్ స్టేన్ 2016 దాకా ఆడాడు కాబట్టి అతన్ని ఉంచాడు.

కొన్నాళ్ళకు ఒకసారి అతన్ని కీత్ మిల్లర్ గురించి రాయమన్నాను. వాడెవడు? ఇదీ నాకు వచ్చిన సమాధానం.

సరిగ్గా లెక్క తీస్తే క్రికెట్ ఆడిన అందరు ఆటగాళ్ళలో అతి గొప్ప ఆల్‌రౌండర్. నేను చెప్పాను. ఇప్పుడు అదే ప్రతిభతో ఉండి ఉంటే కనీసం $4 మిలియన్లు పెట్టి కొనుక్కునే వారు ఐపీఎల్ లో అని అన్నాను as he’s more interested in IPL and club cricket than ODIs, let alone test cricket. అదంతా బుల్షిట్ సార్ అంటాడు.

కొంచెం ఆసక్తి కలిగింది. అప్పుడు కీత్ మిల్లర్ గురించి కొంత చెప్పి, అతని గురించి చదివి ఒక ఆర్టికల్ రాయమని చెప్పాను. What’s so great about him I don’t care. అన్నాడు.

ఒక incident చెప్పాను. అతను రెండవ ప్రపంచ యుద్ధంలో కమాండర్ గా పని చేశాడు. ఇంగ్లీషు సైన్యం కోసం. అప్పుడు కొందరు ఇంగ్లాండ్ ఆటగాళ్ళు కూడా అతనితో కలిసి పని చేశారు. అక్కడ ఆ యుద్ధంలో పని చేయటం, ఆ సమయంలో చూసిన ఘోర కలి, హిరోషిమా నాగసాకీల మీద వేసిన అణుబాంబు వల్ల జరిగిన మారణహోమం.. ఇవన్నీ చూశాక అతనిలో చాలా మార్పు వచ్చింది.

1948లో The Invincibles గా పేరుపొందిన ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్‌లో యాషెస్ ఆడింది. ఆస్ట్రేలియా జట్టుకు డాన్ బ్రాడ్మన్ నాయకత్వం వహించాడు. ఆ జట్టులో స్టార్ ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు కీత్ మిల్లర్. జట్టుకు ఓపెనింగ్ బౌలర్ మాత్రమే కాదు, ఐదవ నంబర్‌లో ఆడతాడు బ్యాటింగ్ ఆర్డర్‌లో. చాలామంది ఆల్‌రౌండర్‌లలా కాకుండా నిఖార్సైన ఫాస్ట్ బౌలర్.

ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఆటగాడి మీదకు ప్రమాదకరమైన బౌన్సర్ వేయమంటాడు డాన్ బ్రాడ్మన్. ఆ ఆటగాడు మిల్లర్‌తో కలిసి రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడాడు. ఇద్దరం చావుకు దగ్గరగా వెళ్ళి వచ్చిన వాళ్ళం. యుద్ధంలో కలిసి పోరాడిన వాళ్ళం. ఆటలు యుద్ధాలు కాదు. అవి రిక్రియేషన్ కోసం. డబ్బు తీసుకుని ఆడుతున్నాము కాబట్టి గెలవటానికి ఆడాలి. అంతే కానీ కోపతాపాలు పెంచుకోవటాలు, ప్రమాదకరమైన బంతులు వేయటాలు మంచిది కాదు అని చెప్పాడు. మాంఛి గుడ్ లెంత్ బాల్‌తో ఆ ఆటగాడి వికెట్ తీశాడు కానీ, డాన్ ఆగ్రహానికి గురయ్యాడు. ఎంతలా అంటే కీత్ మిల్లర్ గొప్ప కెప్టెన్ మెటీరియల్ అయినా, ఈ సంఘటన వల్ల హర్ట్ అయిన బ్రాడ్మన్ అతను తన తరువాత కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు.

కీత్ మిల్లర్ గురించి డాన్ కొన్నిసార్లు తేలికగా మాట్లాడాడు ఆ తరువాత రోజుల్లో. అప్పటికి డాన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్నాడు. ఈ విషయం గురించి తెలిసి, మిల్లర్ కాస్త కవ్విద్దామని డాన్ బాగా ఆడుతున్న టైమ్‌లో బౌన్సర్ వేసి ఔట్ చేస్తాడు. దాంతో డాన్ కోపం నషాళానికి ఎక్కుతుంది. తలకు తగిలితే ఎంత ప్రమాదమో ఆలోచించావా అని బ్రాడ్మన్ అంటాడు. మిల్లర్ జస్టలా నవ్వుతాడు. ఇవన్నీ కలిసి కీత్ మిల్లర్ ఆస్ట్రేలియాకు కెప్టెన్ కాకుండా చేశాయి. డాన్ influence అంత గొప్పగా ఉంది.

దీని గురించి చెప్పి కీత్ మిల్లర్, ఎంపతీ మీద ఆసక్తికరంగా రాయమని అన్నాను.

ఇందులో రాయటానికి ఏముంది?

Keith Miller did a great job. Why not talk about it.

So what? మహా అయితే ఆ బౌన్సర్ బ్యాట్స్మన్ తలకు తగిలి concuss అవుతాడు. లేదా ఫిల్ హ్యూజ్ లాగా ఆటలో మరణిస్తాడు. These are all part and parcel of game. Aggression is important అన్నాడు. దానికి కొనసాగింపుగా జమానా కాలం వాళ్ళ గురించి మాకెందుకు సార్ అన్నాడు.

నేను చెప్పుకు పోతున్నాను.

ఇంతకీ ఈ కీత్ మిల్లర్ గురించి ఎందుకు? నాకు నువ్వు చెప్తున్న ఆటల మీద ఆసక్తి లేదు. అనంతరామ శర్మ గారు అన్నారు.

అప్పుడు మీ గురించి అనంతరామ శర్మ ఎవరు అని ఎవరన్నా అడిగారా అండీ? మీ గురించి సినిమా వచ్చిన నాటికి.

లేదు.

కనీసం గంగాధరం అయినా మీ దగ్గర అహంకరించాడా? ఆ పురుష సూక్తం సంగతి వద్దండీ. అక్కడ మీదే తప్పు.

లేదు.

మీ ఇంట్లో కానీ, బైట కానీ, గణపతి సచ్చితానంద స్వామి గారి దగ్గర కానీ మీ విలువ తగ్గిందా?

లేదు.

గంగాధరం గురించి సాక్షి రంగారావు గారు మీ ముందు పొగిడిన సమయానికి మీకు డైరీలో ఖాళీ తేదీలు ఉన్నాయా?

లేవు.

ఆ ఒక్క క్షణంలో, ఆ ఉత్సాహంలో ఆయన అన్న మాటలు తీసేస్తే ఏనాడన్నా ఆయన మిమ్మల్ని తక్కువ చేశాడా?

లేదు.

అనంత్ మామ మీకు ఎప్పుడన్నా ఎదురు చెప్పాడా?

లేదు.

ఈరోజుకూ ఏదో ఒక రకంగా మీ గురించి జనాలు మాట్లాడుకుంటున్నారా?

మంచిగానా?

ఎలాగైనా సరే!

మాట్లాడుకుంటున్నారు.

నేనాడైనా మీ గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించానా?

ఆయన కొన్ని క్షణాలు ఆలోచించాడు. మేము కలిసిన మూడు సందర్భాలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు కాబోలు.

లేదు. స్పష్టంగా అన్నారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రభ వెలుగుతున్న సమయంలో ఎవరైనా ఘంటాసాల పాటలు వినటం మానేశారా?

నేను ఆ సినిమాల గురించి మాట్లాడను.

ఈరోజు ఎక్కువ సంగీతం అక్కడే ఉన్నదండీ.

అయితే?

శాస్త్రీయ సంగీతం నడుస్తోంది కానీ, దానికి రివైవల్ కావాలిప్పుడు. కానీ విలువ తెలిసిన వారున్నారు. సరే! ఘంటసాల విలువ తగ్గలేదు. తరువాతి తరం వచ్చాక నిజానికి బాలు విలువ పెరిగింది.

ఆయన మాట్లాడలేదు.

గంగాధరం వచ్చాక మీ ప్రభ తగ్గలేదు. అతని హవా మొదలైందంతే. కానీ మీకు వేరొక గొప్ప అవకాశం వచ్చింది. దాన్ని మీరు వినియోగించుకోలేదు.

ఏమిటది?

చెప్తాను. దానికన్నా ముందు ఒక చిన్న విషయం చెప్తాను.

ఈగా స్వియాన్టెక్ నిన్న (27 జూలై 2023) ఒక మాట అన్నది.

<<<“Aryna is motivated by the fact that I’m ahead of her now. I’m also motivated by the fact that someone is chasing me. We are having an excellent season this year, playing very well. These are reasons for us to train even better, we want to work even better every day”>>>

మీరు కూడా ఇదే చేసి ఉండవచ్చు కదా?

సమాధానం లేదు.

ఆయన నా వైపు చూస్తున్న చూపులో కాస్త తీక్షణత తగ్గింది.

లేదా మీరు అందుకోలేరని మీకు తెలిసి ఉంటే ఇంకో ఆప్షన్ ఉంది.

ఏమిటది? ఆయన స్వరంలో గాంభీర్యత తగ్గలేదు.

అఙ్ఞానంలో బ్రహ్మఙ్ఞానం!!!

ఆయన ఆశ్చర్యంగా చూశారు.

చెప్తాను. అని లేచాను.

నా పనిలో విజయం సాధించాలని ఆశీర్వదించండి అని ఆయన పాదాలు తాకాను. ఆయన ఆశ్చర్యంగా చూస్తూ..

(కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here