విజేత

0
6

[box type=’note’ fontsize=’16’] ఎంవిఆర్ ఫౌండేషన్ 2019 ఉగాది సందర్భంగా నిర్వహించిన డా. పాలకోడేటి అప్పారావు స్మారక కథానికల పోటీలో ‘ప్రచురణార్హమైన కథల’ని న్యాయనిర్ణేతలు ఎంపిక జేసిన కథ. రచన కోడుగంటి విజయలక్ష్మి. [/box]

[dropcap]అ[/dropcap]ది ఒక జిల్లా పరిషద్ హై స్కూలు. అలమండలో ఊరి పెద్దల సహకారంతో, ప్రతిష్ఠాత్మకంగా, సకల సౌకర్యాలతో, విద్యార్థులకు పెద్ద క్రీడా ప్రాంగణం, లాబొరేటరీ వసతులు, మగ, ఆడ పిల్లలకు వేరు వేరుగా టాయిలెట్లు, మంచి నీటి వసతి, విశాలామైన తరగతి గదులు, పెద్ద బ్లాక్ బోర్డ్స్, చక్కని సభా వేదిక, ఉపాధ్యాయులకు సౌకర్యవంతమైన విశ్రాంతి గదులు, పెద్ద కాంపౌండ్ వాల్ కలిగిన చూడ చక్కని పాఠశాల. చుట్టు పక్కల ఊర్లతో పోలిస్తే, పాఠశాలలలో తలమానికంగా ఉంటూ, అందులో సీటు రావటమే గొప్పగా భావించే పాఠశాల.

అయితే ఆ పాఠశాల ఇంతగా అభివృద్ధి చెందటానికి కారణం, ఆ పాఠశాలకి 6 ఏళ్ల క్రితం ప్రధానోపాధ్యాయులుగా వచ్చిన ‘శ్రీరామశర్మగారు’. ఆయన వచ్చిన కొత్తలో ఇది కూడా మిగిలిన పాఠశాలలలా బాగా వెనుకబడి ఉండేది. ఒకటి నుండి ఏడు తరగతులు మాత్రమే ఉండేవి. విధ్యార్థుల శాతం చాలా తక్కువ.

శర్మగారు వచ్చాక, పాఠశాలనూ, విద్యార్థులనూ, టీచర్లనూ, బాగా క్రమశిక్షణలో పెట్టి, ఒకొక్క ఏడు ఒకొక్క తరగతి పెంచుతూ, ఉపాధ్యాయ, విద్యార్థి సమూహాలను, రాకపోకనూ అదుపులో పెట్టే సరికి మూడేళ్లలో స్కూలు ఒక గాడిన పడింది.

అప్పుడు ప్రధానోపాధ్యాయులు, స్టాఫ్, విద్యార్థలు ఊరంతా తిరిగి, ప్రతీ గడపా ఎక్కి, మీ పిల్లలు చదువుకొనే బడికి విరాళాలు ఇస్తే, పాఠశాలను తలమానికంగా చేస్తామని ప్రమాణాలు చేశారు. ఊరంతా సహకారించారు. అంతే పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. పదవ తరగతిలో నూరు శాతం ఫలితాలు సాధించి, మాట నిలబెట్టుకున్నారు శ్రీరామశర్మగారు. అంతే, అభినందనల వెల్లువలో తడిసిముద్దయ్యారు.

ఆ సంవత్సరం పాఠశాల స్థాపించి, 25 సంవత్సరాలు అయిన సందర్భంగా సిల్వర్ జూబిలీ ఫంక్షన్ జరపదల్చుకున్నారు. పెద్దలకూ, రాజకీయనాయకులకూ, స్థానిక M.L.A.లకూ ఆహ్వానాలు వెళ్ళాయి. కలక్టరుగారు పది సంవత్సరాల క్రితం ఆ పాఠశాల విద్యార్థేనట. ఆయనకు పూర్వ విద్యార్థిగా ప్రత్యేకంగా ఆహ్వానించారు.

వచ్చిన ఆహుతులందరినీ పాఠశాల ప్రధాన ధ్వారం నుండి పూలజల్లులతో ఆడపిల్లలు ఆహ్వనించారు వేదిక వరకు. ప్రారంభ ప్రార్థనాగీతం అవంగానే “వెల్‌కమ్ డాన్స్” జరిగింది. తరువాత ప్రసంగాలు జరిగాయి. ప్రధానోపాధ్యాయులు చొరవవల్లే పాఠశాల ఇంతగా అభివృద్ధి చెందినదని, అందరూ శర్మగారిని ప్రశంసించారు. చివరగా ప్రధానోపాధ్యాయులు స్కూలు అభివృద్ధికి విరాళాలిచ్చిన అందరి పేర్లూ చదివి, వారి దయవలనే, పాఠశాల ఈ స్థితిలో ఉందనీ, ఈ అభివృద్ధిని, చిరకాలమూ కొనసాగిస్తామనీ చెప్పారు.

సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం, బహుమతి ప్రదానం, కలెక్టరుగారి చేతి మీదుగా జరిగింది. తను చదువుకున పాఠశాల ఇంత అభివృద్ధి చెందినందుకు, నూరు శాతం ఉత్తీర్ణత సంపాదించినందుకూ స్టాఫ్‌నీ, శర్మగారినీ చాలా మెచ్చుకున్నారు వారు.

బహుమతి ప్రదానం, చేసేటప్పుడు, ఒక విద్యార్థి కలెక్టరుగారి దృష్టిని ఆకర్షించాడు. ఇటు చదువులోనూ, అటు ఆటల్లోనూ, అన్నింటిలోనూ ప్రధమ బహుమతి అతడిదే. చదివేది ఆరవ తరగతే గానీ, చాలా పొడువుగా, బలిష్టంగా, మంచి వ్యాయమము చేసి కండలు తిరిగిన శరీరం అతడిది. ఆల్‌రౌండ్ ఛాంపియన్ షీల్టు అతడిదే. ప్రధానోపాధ్యాయులు ప్రత్యేకంగా, ఆ విద్యార్థిని సూర్యప్రకాష్‌గా పరిచయం చేసి బెస్ట్ స్టూడెంట్ ఆఫ్‌ ద ఇయర్ అని ఒక బంగారు పతకాన్ని, కలక్టరుగారి చేతి మీదుగా సూర్య ప్రకాష్ మెడలో వేయించారు.‌

ఆటపాటలలో మేటియే కాకుండా, తెలివిలో క్రమశిక్షణలో కూడా మేటి అని ప్రశంశించారు. చప్పట్లు మారు మ్రోగాయి. కలక్టర్‌గారు ఆ విద్యార్థిని ప్రత్యేకంగా అభినందిస్తూ చదువులో, ఆటల్లో, ఆరోగ్యంలో, అణుకువలో, అన్నింటా ప్రథముడిగా ఉన్న సూర్యప్రకాష్‌లాంటి విద్యార్థులే మన సమాజానికి వెన్నెముకలాంటివారు. ఇలాంటి యువకులే మనకు కావాలి. ఈ విద్యార్థిని ప్రత్యేకంగా స్పోర్ట్స్ స్కూలుకి రికమెండ్ చేస్తున్నాను. మైడియర్ బోయ్, నువ్వు మన దేశానికి ఎన్నో పతకాలు తేవాలి అని భుజం తట్టి అభినందించారు, కలెక్టరుగారు.

ఎంతో, అణుకువగా, సూర్యప్రకాష్, స్టేజిమీద పెద్దలందరికీ పాదాభివందనం చేసి తప్పకుండా వారి మాట నెరవేరుస్తానని మాట ఇచ్చాడు. సూర్యప్రకాష్ తండ్రి రామునాయడును కూడా స్టేజిపైకి ఆహ్వానించి, దండ వేసి గౌరవించారు. వందన సమర్పణతో సభ విజయవంతంగా ముగిసింది.

***

ఇక సూర్యప్రకాష్ కుటుంబనేపధ్యానికి వస్తే, అతడి తండ్రి రామునాయుడు రెండెకరాల నీటి ఆధారం గల పొలం సేద్యం చేసుకుంటూ; తండ్రి, తల్లి, భార్య, కొడుకు, కూతుర్లతో, సుఖంగా కాలం గడుపుతున్నాడు. మంచి సారవంతమైన భూమి. పంట బాగా పండేది. విత్తనాలకు ఉంచగా, అమ్మటానికి చాలా మిగిలేది. ఎందరికో దానాలు కూడా చేసేవాడు.

భార్య రాములమ్మ అతనికి తగిన భార్య. ఆమె చేతికి ఎముకలేదనేవారు అందరూ. అంత ధర్మ తల్లి. పెద్దలయిన అత్తమామలను ఎంతో ఆదరంగా చూసుకొనేది. ఆ ఊర్లో రామునాయుడు కుటుంబమంటే ఎంతో గౌరవం. చింతలు లేని చిన్న కుటుంబం.

ఎంతో ఆలస్యంగా పుట్టిన కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకొన్నారు. తల్లి తండ్రుల పేర్లు కలసి వచ్చేలా సూర్యప్రకాష్ అని పేరు పెట్టారు. తరువాత కమల అనే కూతురు. పిల్లలిద్దరూ ఎంతో బుద్ధిగా చదువుకొనేవారు.

కాలక్రమంలో పెద్దవారిద్దరూ పైలోకాలు చేరుకున్నారు. సూర్యప్రకాష్ చిన్నప్పటి నుండీ, మంచి దేహదారుఢ్యం కలవాడు. వ్యాయామం, దండీలు, బస్కీలు తీస్తూ మంచి ఆహారం తీసుకుంటూ ఉండటం వలన 6వ తరగతికే మంచి బాడీ వచ్చింది.

సూర్య ఇంటి దగ్గరగా ఒక పెద్ద ప్రైవేటు స్కూలు ఉండేది. అందులో అన్నిరకాల ఆట పరికారాలు ఉండేవి. ఆ స్కూలు వ్యాయామ ఉపాధ్యాయుడు సూర్యకి మంచి ఫ్రెండు. సూర్యని తన స్కూల్లో జాయను చేయించి, అన్ని రకాల ఆటల్లో ప్రావీణ్యత కలిగేలా చేశాడు.

సూర్య లాంగ్ జంప్, పై జంప్, హర్డిల్స్, డిస్కస్ త్రో, షాట్ పుట్, త్రోబాల్, వాలీ బాల్ ఒకటేమిటి అన్ని ఆటల్లోనూ ప్రవీణుడే. అన్ని స్పోర్ట్ పోటీలకీ, చిన్న క్లాసుల నుండీ సూర్యని తీసుకెళ్లేవాడు ఆ డ్రిల్లుసార్. కాబట్టి సూర్య పెరసనాలిటీ వల్ల ప్రతీ ఆటలోనూ విజయం సాధించేవాడు.

క్రమంగా కప్పులతో, ట్రాఫీలతో, మెడల్స్‌తో సూర్య వాళ్ల ఇల్లు నిండిపోయేది. వాటిన్నిటినీ బస్తాల్లో వేసి అటక ఎక్కించేసారు. సూర్య 5వ తరగతిలో ఉండగా వాళ్ల ఊర్లో పెద్ద జిల్లా పరిషత్ హైస్కూలు అన్ని హంగులతో కొత్తగా కట్టారు. అందుకే 6వ తరగతిలో సూర్య అందులో జాయనయాడు.

ఆ స్కూల్లో కూడా తన ప్రతిభ చూపిస్తూ, ఆటల్లో చదువులో మంచి ప్రతిభ కనపర్చేడు. సూర్య పర్సనాలిటీ, ప్రతిభ చూసి కలక్టరుగారు, తనని స్పోర్ట్స్ స్కూలుకి రికమండ్ చేశారు.

కలక్టరుగారి మాట కాదన లేక, ఇష్టం లేకపోయినా సూర్యని స్పోర్ట్స్ స్కూల్లో జాయిన్ చేశాడు. కానీ కొడుకు దూరం అయిపోవడం వల్ల రామునాయుడు తట్టకోలేకపోయాడు.

కాలం ఎప్పుడూ ఒక్కలా ఉండదు కాదా! రెండేళ్ల పాటు వరుసగా వర్షాలు కురువకపోవడంతో, అందరి పొలాలూ బీడులుగా మారాయి. రామునాయుడు పొలానికి ఏదో కొంచెం నీటి ఆధారం ఉండటం వలన కొద్దిగా పంట పడుతూంది. అయితే ఆ కొద్ది పంట కూడా పశువులు, రాత్రిళ్లు వచ్చి మేసేస్తున్నాయి.

అందుకని రామునాయుడు తన పొలానికి కరంటు కంచే వేయిచాడు. ఒకనాడు రాత్రి పొలంలో పశువులు పడ్డ కల వచ్చి, ఆత్రంగా లాంతరు కూడా పట్టుకోకుండా, పొలానికి బయలుదేరాడు రామునాయుడు. ఆగాభరాలో కంచె మాట మరచి, దానిని తాకటంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఊరుఊరంతా గొల్లుమంది.

కొడుకుకి కబురు చేద్దామంటే, వాడికి మార్నాడే సెలక్షన్స్ ఉన్నయిట. ఎట్టి పరిస్థితులలోనూ, తమ ఇంటి విషయాలేవీ, వాడికి తెలియనీయ వద్దనీ, అలా తెలిస్తే వాడు అక్కడ చదవడనీ, వచ్చేస్తాడనీ, రామునాయుడు ఊరి పెద్దల దగ్గర వాగ్దానం తీసుకున్నాడు. అందుకని, సూర్య రాకుండానే, ఎంతో బాధతో అంత్యక్రియలు చేసేశారు. రామునాయుడు భార్యకి మతి స్థిమితం తప్పిపోయింది.

***

సూర్యా వాళ్ల కోచ్ రవిచంద్ర నార్త్ ఇండియన్. అతనికి సూర్య అంటే ప్రాణం. వాళ్ల ఇంటి విషయాలన్నీ అతనికి తెలిసినా, వాళ్ల పెద్దల కోరిక ప్రకారం సూర్యకి చెప్పలేదు. చెపితే ఉండడని అతనికీ తెలుసు.

ఆ రోజు రాత్రి సూర్యకి ఎందుకో ఇంటి మీద బెంగ వేసింది. సార్ దగ్గరకెళ్లాడు. “సార్! ఒక విన్నపం, ఒక సారి మా ఇంటికెళ్లి మా వాళ్లని చూసి వచ్చేస్తాను సార్, ఎందుకో బెంగగా ఉంది” అన్నాడు.

సూర్య భుజం మీద చేయ్య వేసి దగ్గరగా తీసుకున్నాడు కోచ్. “చూడు సూర్యా పోటీలకు సెలక్టయ్యావు. బాగా ప్రాక్టీస్ చేస్తున్నావు. నీకు చెప్పలేదుగానీ, మీ ఇంటి పరిస్థితులు ప్రస్తుతం బాగు లేవు. ఇప్పుడు గానీ నువ్వు మీ ఇంటికి వెళితే నీ మూడ్ అంతా పోతుంది. మళ్లీ రాలేవు. చిరుతపులి కన్నా వేగంగా పరుగెడుతున్నావు ప్రస్తుతం. పతకం తప్పక సాధించి మన స్కూలు పేరు నిలబెడతావు. నీ మీద, నేను ప్రిన్సిపల్ సార్ ఎంతో ఆశ పెట్టుకున్నాం! మా ఆశలు వమ్ముచేయకు నాయనా! నా మాట విను!”

తన తండ్రిలాగే ప్రేమగా కోచ్ చెప్పిన మాట విన్నాడు సూర్య. తన ఇంటి పరిస్థితులు బాగు లేవన్నమాట! అయినా సరే తను వెళ్లాలి. ఒక్కసారి కోచ్ పాదాల మీద చేతులు వేశాడు. “సార్ మీ పాదాల పై ఆన. ఎలాంటి పరిస్థితులైనా తట్టుకుంటాను! రెండు రోజుల్లో తిరిగొస్తాను. అమ్మ నాన్నాల ఆశీర్వాదం తీసుకుని వెంటనె తిరిగొస్తాను. మీ ఆశ వమ్ము చేయను” అన్నాడు. సరే అనక తప్పలేదు కోచ్ రవిచంద్రకి.

ఉన్న పళంగా బాగ్‌లో రెండు జతల బట్టలు వేసుకుని తన ఊరు బయలుదేరాడు. తోవలో రకరకాల ఆలోచనలు. అందరూ ఎలా ఉన్నారో? ఎన్నాళ్ల బట్టి తన వారి మంచి చెడ్డలు తనకు తెలియనీయలేదు? చెబితే తను స్పోర్ట్స్ స్కూలు నిండి వచ్చేస్తాడేమో? అన్న భయం కాబోలు.

తెల్లవారే సరికి తమ ఊర్లో ఉన్నాడు. ఇంటికి వెళ్లేలోపు ఎందరో తెలిసిన వారు పలకరించారు. “ఇప్పుడా వస్తున్నావు?” అంటూంటే ఏదో తప్పు చేసినట్లనిపించింది తనకు. ఇంటి మందు నులక మంచం మద అమ్మ కూర్చోని ఉంది. “అమ్మా! అమ్మా ఏంటి ఇలా అయిపోయింది?” చింపిరితల, చిరుగులు పడ్డ చీర, ఎటోరెప్పవేయకుండా చూస్తోంది.

“అమ్మా!” ఆర్తిగా ఒళ్లో వాలేడు.

“ఎవరు బాబూ నువ్వు?” గట్టిగా అడిగింది. తెల్లబోయాడు.

“అమ్మా నేనమ్మా నీ సూర్యని”

“ఎవరో నువ్వు నాకు తెలీదు నాయినా! ఎవరైతేనేంగానీ, చిన్న సాయం చేసి పెడతావా బాబూ! చాలా రోజులై మా ఆయన పొలానికని వెళ్లాడు బాబూ ఇంకా రాలేదు. చీకటి కదా కొంచెం తీసుకువస్తావా బాబూ” జాలిగా చేతులు పట్టుకొని అడిగింది. ఆమె కళ్లంట వరదగోదావరిలా నీళ్లు కారుతున్నాయి.

సూర్య ఇంక దుఃఖం పట్టలేకపోయాడు. అమ్మ… అమ్మ పిచ్చిదయిపోయిందా? ఏంటీ ఘోరం? ఈ లోపు పక్క ఆయన వచ్చాడు. “ఒరే సూర్యా! మీ నాన్న పొలంని కెళ్లి కరంటు వైపుకి బలయిపోయాడురా అతని శవాన్ని చూసి కూడా మీ అమ్మ నమ్మలేదురా. అలా క్రమంగా పిచ్చిదై మీ నాన్న రాక కోసం ఎదురు చూస్తూంది. అన్నట్లు ఈ విషయాలేం నీకు తెలీవు కదూ? మన మునసబుగారు నువ్వెప్పుడు వచ్చినా వెంటనే తన దగ్గరకు పంపమన్నారు. వెంటనే వెళ్లు!” అన్నాడు.

విల్లు విడిచిన బాణంలా పరుగెత్తేడు సూర్య! మునసబుగారు చుట్ట కాలుస్తూ ఎటో చూస్తూ ఉన్నారు. “బాబాయ్” వెక్కి వెక్కి ఎడుస్తూ తన కాళ్ల పై పడిన సూర్యని గాఢంగా ఆలింగనం చేసుకుని. తనూ కన్నీరు పెట్టారు మునసబుగారు.

“ఎలాంటి కుటుంబం ఎలా అయిపోయిందిరా! ధర్మదేవత లాంటి నీ తల్లి అలా పిచ్చిదయిపోవడం ఘోరం రా! అప్పటికీ డాక్టరు దగ్గరికి తీసుకెళ్లాం. రెండు మూడు కరంటు షాకులు ఇస్తే మామూలయిపోతుందిట ఇప్పడైతే.”

ఆలస్యం చేసేరనుకోండి, పిచ్చి ముదిరిపోయి మరి తగ్గదు. తరువాత మీ ఇష్టం. ఇప్పటికే ఆలస్యం అయింది. ఒక నెల్లాళ్ల పాటు తీసుకొస్తే, వీలును బట్టి షాకులు ఇస్తాను. అందాకా ఈ మాత్రలు వాడండి. అంటూ ఇరవై మాత్రలు ఇచ్చాడురా! అవి నిన్నటితో అయిపోయాయి. మళ్లీ కొనాలంటే… ఎవరి దగ్గరా డబ్బులు లేవురా…” సిగ్గు పడుతున్నట్లు అన్నారాయన. “అందరి పంటలూ పోయాయి రా. పొలాలు బీడులుగా మారేయి. పశువులు కూడా చనిపోతున్నాయిరా! గడ్డీ నీరూ లేక…” ముఖం దోసిట్లో దాచుకున్నారాయన.

సూర్య అవాక్కయిపోయాడు. సింహంలాంటి మునసబుగారు ఎలా అయోపోయారు? ఏం చెయ్యాలి ఇప్పుడు? డబ్బు ఎలాగ? మందు లెలా కొనాలి? తలదించుకొని ఆలోచించాడు. ఒక్క ఆలోచన తళుక్కు మంది బుర్రలో!

“బాబాయ్! ఎలాగో, తల తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాననుకోండి! మిరేవరైనా మా అమ్మను పట్నం తీసికెళ్లి వైద్యం చేయిస్తారా!” ఆశగా అడిగాడు సూర్య.

“ఓ! దానికే భాగ్యంరా! డబ్బుంటే నేనే స్వయంగా బండి కట్టించి మీ అమ్మకి వైద్యం చేయిస్తాను. నాదీ పూచీ,” అన్నారు. క్షణం కూడా ఆగలేదు సూర్య, “వస్తా బాబాయ్! నేను ఎల్లుండి తప్పని సరిగా మాస్పోర్ట్స్ స్కూలుకి వెళ్ళిపోవాలి. రేపే నీకు డబ్బు తెచ్చిస్తాను. దయచేసి వైద్యం చేయించు చాలు…” పరుగు లాంటి నడకతో పరుగెత్తాడు.

తోవలో తన బాల్యస్నేహితుడు గోవిందు ఇంటి దగ్గర ఆగేడు. గోవిందు కూడా దిగాలుగా కూర్చొని ఉన్నాడు. సూర్యని చూస్తూ ఆశ్చర్యంగా, ఒరే ఎప్పుడొచ్చావురా అన్నాడు ఒక్కసారిగా వాటేసుకొని “ఇప్పుడే రా, కానీ ఒక 5 నిముషాల్లో బండి కట్టుకొని మా ఇంటిరా” అంటూ పరుగెత్తి వెళిపోయాడు సూర్య.

ఇంటి దగ్గర చెల్లి తను వచ్చాడని ఎవరింట్లోంచో చారెడు నూకలు తెచ్చి జావ చేసింది. “అన్నయ్యా ఇంద తాగు” సిగ్గుగా అన్న చేతిలో గ్లాసు పెట్టింది. చెల్లి ఎందుకు బాధ పడుతోందో అర్థం అయింది సూర్యకి. “వద్దమ్మా బాధ పడకు. ఈ జావ అమ్మకి పట్టించు. ఈ బాధలు ఎన్నాళ్లో ఉండవులే” అంటూ చెల్లి తల నిమిరాడు.

తమ ఇంటి అటక ఎక్కాడు. అటక పైన వరసగా పేర్చిన తన ప్రైజుల బస్తాలు కిందకు దింపాడు. 5 బస్తాలున్నాయి. వాటికి శుభ్రంగా బూజు దులిపాడు. ఇంతలో గోవిందు ఎడ్ల బండీ ఇంటి ముందు ఆగింది.

“రారా గోవిందూ వీటిని సాయం పట్టి బండిలో వేద్దాం.” అన్నాడు. “ఒరే నీకేమైనా మతి పోయిందా, వీటినేం చేస్తావురా అన్నాడు. కష్టపడి సంపాదించావు. వీటిని అమ్మేస్తావా ఏం” అన్నాడు గాభరాగా.

“యస్. అమ్ముతాను. నా తల్లికన్నా అవి నాకు ఎక్కువేం కాదురా! ఇలాంటివి వేలకు వేలు సంపాదిస్తాను. నా భుజంలో శక్తి ఉంది. ఆ ధైర్యం ఉంది. ముందు పని అవ్వాలి పద!” మరేం మాటడలేదు గోవిందు.

బండి ఎక్కారు ఇద్దరూ. “వైజాగ్ స్పోర్ట్స్ ఆర్టికల్స్” షాపు నీకు తెలుసుగా, అక్కడకి పోనీ అన్నాడు. ఆఘమేఘాల మీద బండి అరగంటలో అక్కడకు చేరింది. ఆ షాపు చాలా బిజీగా ఉంది. ఆ షాపు ఓనరు ఒక హిందీ ఆయన.

బస్తాలన్నీ షాపులోపలికి చేర్చాడు గోవిందు. ఆ షాపు ఓనరు, సూర్యప్రకాష్‌ని పట్టి పట్టి చూశాడు. అతన్ని ఎక్కడో చూసిన జ్ఞాపకం. ఎక్కడ… ఎక్కడ… ఆ… గుర్తొచ్చింది. గభాలున లేచాడు ఓనరు.

“బాబూ… నువ్వు సూర్యప్రకాష్ కదూ! స్పోస్ట్స్ ఛాంపియన్ దిగ్రేట్! ఆ రోజు కలక్టరుగారు నిన్ను అభినందించిన సభలో నేనూ ఉన్నాను బాబూ! మీ నాన్న రామునాయిడు నేనూ మంచి స్నేహితులం. పాపం! పోయాట్టగా!” విచారించాడు ఆయన.

“అవునంకుల్!” తండ్రి జ్ఞాపకంతో కళ్లంట నీరు తిరిగింది.

“బాధ పడకు నాయినా. ఏం చేస్తాం. మీ ఇంటి పరిస్థితీ మీ ఊరి పరిస్థితీ అంతా తెలిసింది. ఒక్కసారి వచ్చి మీ అమ్మగారిని చూద్దాం అనుకున్నాను గానీ ఈ షాపు బిజీలో రాలేకపోయా! ఏంటి విశేషం, నాయినా ఏంటి ఈ బస్తాలు ఏంటి ఏం చేద్దామని వీటిని” అని అడిగాడు.

క్లుప్తంగా తన ఇంటి విశేషాలు, తన తల్లి పరిస్థితీ వివరించి “ఇవిగో అంకుల్ ఇవన్నీ నా కష్టార్జితాలు. వీటిలో వెండవీ, మెటల్‌వీ, కొన్ని గోల్డ్ మెడల్స్ కూడా ఉన్నాయి. మీరెంత ఇస్తే అంత, నేను అడగను. మీరిచ్చినంతా పట్టుకెళ్తాను. నా తల్లికి అర్జంటుగా వైద్యం చేయించకపోతే మా అమ్మ పిచ్చిదయిపోతుంది. వీటిని తీసుకుని ఎలాగైనా నా తల్లి ఆరోగ్యం కాపాడండి” సూర్య ప్రకాష్ కంఠం రుద్ధమయింది.

ఆ షాపు ఓనరు చాలా మంచివాడు. “చూడు బాబూ, ఎప్పుడూ నీ అవార్డులు అమ్మకు. నీ తెలివితేటలకీ, ఆటలో నీ నైపుణ్యానికీ, నీ బుద్ది కుశలతకీ, నీ దేహదారుఢ్యానికీ అవి కొలమానాలు. నాకు నలుగురు కొడుకులు. నాకు ఆటలంటే చాలా ఇష్టం. కానీ ఏం లాభం. ఒక్కడూ క్రీడాకారుడు కాలేకపోయాడు. ఆ నైపుణ్యం, ఆ నేర్పు, ఆ శరీరదారుఢ్యం అంతా భగవంతుడు నీకిచ్చిన వరం. డబ్బుదేం ఉంది. ఇవాళ ఉంటుంది. రేపు పోతుంది. కానీ నీ చురుకుదనం, నీ చాతుర్యం ఎవరికీరావు. భగవత్ ప్రసాదం అవి. విలు విద్యా పోటీలలో అర్జనునికి పక్షి గుడ్డు మాత్రమే కనుపించినట్లు, నీకు చేదించవలసిన లక్ష్యమే కనుపిస్తుంది. ఎక్కడికెళ్లినా నీకు జయమే.

ఆఁ ఇంతకీ నీకు డబ్బు కావాలంటావు. అంతే కదా, నా దగ్గిర బోలెడు ఉంది. నీ లాంటి క్రీడాకారుడికి ఇచ్చి దాన్ని సార్థకం చేసుకోనీ ప్రస్తుతానికి ఇరవైవేలు ఇస్తాను. చాలా ఇంకా కావాలంటే చెప్పు. ఎంతైనా ఇస్తాను. నా ప్రియ మిత్రుడు ఆత్మ ఎంతో సంతోషిస్తుంది. నువ్వేమీ నా దగ్గర ఉంచక్కరలేదు. సరేనా ఇంద” అంటూ ఇరవై వేలు ఒక కవరులో పెట్టి ఇచ్చాడు.

“అంకుల్ మీ సహాయం నేను మరువలేను. ఇవి నాకు ఇరవై లక్షలతో సమానం. అయితే ఒక కండీషన్. నేను ఈ డబ్బుని ఉత్తినే పట్టుకెళ్ల లేను. నా మనసు అంగీకరించదు. కాబట్టి నా ఫ్రైజులు మీ షాప్‌లోనే ఉండనీండి. నే నెప్పుడు మీడబ్బు చెల్లిస్తానో అప్పుడే వీటిని తీసికెళతాను.

తరువాత మీరు ఇచ్చిన డబ్బుకి రసీదు, సంకతం చేసి ఇస్తాను. కాదనకండి. తరువాత డబ్బులు ఇంకా అవసరమైతే మా గోవిందు వస్తాడు. వాడికి ఇవ్వండి. మీ మేలు ఈ జన్మలో మరువలేను. వస్తాను మరి” అన్నాడు.

“సరే నాయినా, నీ మాట కాదనలేను. కాబోయే అంతర్జాతీయ క్రీడాకారుడివి. ఇలాంటి డబ్బు వేలకు వేలుగడిస్తావు. సరే వెళ్లిరా బెస్టాఫ్‌లక్”.

ఆయన పాదాలకు నమస్కరించి శలవు తీసికున్నాడు.

వెళ్తూనే గోవిందు చేత డబ్బు మునసబుగారికి పంపించేశాడు. అమ్మకి బాగా, ఎంత ఖర్చయినా వైద్యం చేయించమన్నాడు. వెళ్లేటప్పుడు తల్లిని హత్తుకుని అమ్మా నే మళ్లీ వచ్చేటప్పటికి, నువ్వు పూర్వంలా ఆరోగ్యంగా ఉంటావు. అని ఆ రాత్రే తన స్పోర్ట్స్ స్కూల్‌కి వెళిపోయాడు. కొత్త ఉత్సాహంతో.

***

ఆటలపోటీలు రానే వచ్చాయి. బరిలో అందరూ పోజిషన్ తీసుకొని కూర్చున్నారు. ఊ…ష్…. విజిల్ వినిపించింది. చిరుతపులిలా పరుగెత్తేడు సూర్యప్రకాష్. ముందు తండ్రి జ్ఞాపకం వచ్చాడు. తరువాత తన కోచ్… తరువాత షాపు ఓనర్…. ఆఖరున తన తల్లి. వారి గురించి ఆలోచిస్తూనే అందరి కంటే ముందు గీతదాటాడు. ఓహ్… చప్పట్లు… ‘అమ్మా ఈ పతకం నీదే…’ కళ్లంట ఆనంద భాష్పాలతో అనుకున్నాడు విజేత సూర్యప్రకాష్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here