[శ్రీమతి ములుగు లక్ష్మీ మైథిలి రచించిన ‘విలువైన బహుమతి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]భా[/dropcap]రతదేశం సరిహద్దుల్లో మిలటరీ కమాండర్‌గా విధులు నిర్వహిస్తున్న విజయ్ అమ్మా నాన్నల షష్టిపూర్తి కార్యక్రమానికి హైదరాబాద్ వచ్చాడు.
“మామయ్య గారూ! మీకు ఎలాంటి స్వీట్లు చేయించమంటారు. అలాగే షాపింగ్ వెళ్లినప్పుడు, మీకు పట్టు పంచెలు కూడా తీసుకోవాలి.”
“ఆగు రమా! అన్నీ నువ్వే చెప్పేస్తే ఎలా? ముందు నాకు నాన్న, ఆ తర్వాతే నీకు మామయ్య. తన పాదాల మీద, నా చిట్టి పాదాలు పెట్టి నడిపించాడు, నన్ను జీవితంలో ముందుకు నడిపించాడు. తన భుజాల మీద నన్ను ఎత్తుకుని ఈ ప్రపంచాన్ని చూపించాడు. ఆకాశం అంచులను తాకించాడు.” అంటూ చెపుతున్న కొడుకు మాటలకు మురిసిపోయిన తల్లి వేదవతి “అదేమిట్రా! నీకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికీ నాన్నలు ఏమీ చేయనట్లు, మరీ పొగుడుతున్నావు” అంటూ మురిపెంగా అడిగింది.
“అమ్మా! మిగతావారి సంగతి నాకు తెలియదు కానీ, నాన్నగారు నాకు ఎప్పుడూ గొప్పే. నేను ఏడిస్తే.. నువ్వు నా కన్నీళ్లు మాత్రమే తుడుస్తావు. నాన్న అయితే, తానే కన్నీరుగా మారి నా బాధని తగ్గిస్తాడు. అందుకే ఈ షష్టిపూర్తి పండుగ రోజున నాన్నకు మంచి బహుమానం ఇవ్వాలి.” అంటూ తండ్రి భుజం మీద చెయ్యి వేసి ఆనందంగా చెప్పాడు విజయ్.
“నువ్వు నాకు ఎలాంటి బహుమతి ఇచ్చినా తీసుకుంటాను. అలాగే నేను కూడా నీకు ఒక మంచి బహుమానం ఇస్తాను.” చెప్పాడు కొడుకు సంతోషంతో శృతి కలుపుతూ భాస్కరం.
విజయ్ తండ్రి షష్టిపూర్తి ఉత్సవానికి బంధువులను, స్నేహితులను అందరినీ స్వయంగా వెళ్లి పిలిచాడు. వంట వాళ్ళని, భజంత్రీలను, పురోహితులను కూడా మాట్లాడాడు.
“నాన్నా! అందరినీ పిలిచాను. ఇంకా ఎవరినైనా పిలవటం మరిచిపోయారేమో, ఒకసారి గుర్తు చేసుకోండి” అని చెపుతున్న సమయంలో విజయ్ మొబైల్ రింగ్ అయింది.
అది మిలటరీ ఆఫీసు నుండి వచ్చిన ఫోన్ కాల్, వెంటనే అటెండ్ అయి “గుడ్ ఈవినింగ్ సార్, ఎనీ ప్రాబ్లం?” అడిగాడు విజయ్.
“యస్.. దిసీజ్ ఎమర్జెన్సీ న్యూస్. మీరు అర్జెంట్‌గా ఆర్మీకి వచ్చేయండి. ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. ఆల్రెడీ వార్ స్టార్ట్ అయ్యింది. సో ప్లీజ్ కమ్ ఇమ్మీడియట్లీ” అంటూ ఫోన్ పెట్టేసాడు ఆర్మీ ఆఫీసర్.
“ఏంట్రా! ఫోన్ ఎక్కడి నుంచి?”
“మరి.. అదే నాన్నా! అదీ.”
“ఫర్వాలేదు. చెప్పు బాబు, ఎనీ థింగ్ సీరియస్?” అంటూ ఆదుర్దాగా అడిగాడు భాస్కరం.
“అవును నాన్నా! నేను అర్జెంట్‌గా బార్డర్‌కి వెళ్ళాలి. యుద్ధం మొదలైంది. నన్ను వెంటనే రమ్మని చెప్పారు.” చెప్పాడు బాధగా విజయ్.
“చూడు విజయ్! నువ్వు ఈ ఆర్మీలో చేరేటప్పుడు అన్నీ నిర్ణయించుకునే చేరావు. దేశం కోసం సేవ చేయాలనే నీ సంకల్పం నెరవేరుతుంది. అందరికీ అటువంటి అవకాశం రాదు. వెళ్ళిరా విజయ్ అల్ ది బెస్ట్.” చెప్పాడు కొడుకు భుజం తడుతూ భాస్కరం.
“కానీ.. నాన్నా! మీ షష్టిపూర్తి కార్యక్రమం.” అంటూ సందేహంగా అడిగాడు విజయ్.
“ఏం ఫర్వాలేదు.. నువ్వు వచ్చాకే షష్టిపూర్తి మహోత్సవం చేసుకుంటాను. క్షేమంగా వెళ్లి.. విజయంతో తిరిగిరా. నీ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాము.” అంటూ కొడుకు తలపై ముద్దు పెట్టుకుని ఆశీర్వదించాడు భాస్కరం.
***
ఉగ్రవాదులకూ, భారత జవానులకు మధ్య కాల్పుల హోరులో జమ్మూ కాశ్మీర్ మరోసారి దద్దరిల్లింది. కొంతమంది ముష్కరులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఆ సంఘటనలో ప్రమాదవశాత్తు ఎదురు కాల్పుల్లో కొంతమంది సైనికులకు గాయాలయ్యాయి. విజయ్‌కి తలకు బలమైన గాయాలు కావడంతో, వెంటనే ఆర్మీ అధికారులు విజయ్‌ను , గాయపడిన సైనికులను మిలటరీ హాస్పిటల్‌లో చేర్పించారు.
విజయ్ గాయాలతో హాస్పిటల్‌లో చేరాడన్న వార్త తెలుసుకున్న భాస్కరం తట్టుకోలేక నిలువునా కుప్పకూలిపోయాడు. తన ప్రాణానికి ప్రాణమైన కొడుకు ప్రమాదంలో ఉన్నాడనగానే అతని గుండె భరించలేకపోయింది.
***
హాస్పిటల్‌లో బెడ్ మీద ఉన్న విజయ్‌కి ఒక్కసారిగా తెలివి వచ్చింది. లేవటానికి ప్రయత్నించాడు.
పక్కనే ఉన్న డాక్టర్ “డోంట్ వర్రీ మిస్టర్ విజయ్. యు ఆర్ ఆల్ రైట్. బట్ మీ తలకు బలమైన గాయాలు కావడంతో, మీ కంటి చూపు దెబ్బ తినింది.”
“వాట్ డాక్టర్.. అయితే నాకు కళ్ళు కనిపించవా?” అడిగాడు విజయ్ ముఖం మీద బ్యాండేజ్‌ని తడుముకుంటూ.
“నో..నో.. యు ఆర్ పర్ఫెక్ట్ ఆల్ రైట్. మీ కళ్ళకు ఆపరేషన్ జరిగింది. మీకు చూపు కూడా వస్తుంది. నేను ఇప్పుడు మీ కళ్ళకు కట్టిన కట్టు విప్పుతాను. మీరు జాగ్రత్తగా, స్లో గా, టెన్షన్ పడకుండా కళ్ళు తెరవండి. ప్లీజ్.. కోఆపరేట్” రిక్వెస్ట్‌గా అడిగాడు డాక్టర్.
“ఓకే డాక్టర్! అయితే నాదొక కండీషన్. నేను యుద్ధంలో దెబ్బ తిన్నట్లు మా నాన్నకి తెలుసా! తెలిసుంటే ఇక్కడికి నాన్న వచ్చే ఉంటారు. నాన్న నన్ను చూడకుండా ఉండలేరు. నాన్నను పిలవండి. నేను కళ్ళు తెరవగానే నాన్నను చూడాలి.” చెప్పాడు విజయ్ ఆదుర్దాగా.
“ఇట్స్ ఓకే.. కూల్ కూల్” అంటూ పక్కనే ఉన్న సిస్టర్‌కి రూం బయట ఉన్న విజయ్ తల్లితండ్రులను, విజయ్ భార్యను తీసుకుని రమ్మని చెప్పాడు డాక్టర్.
డాక్టర్ మెల్లిగా విజయ్ కళ్ళకున్న బ్యాండేజ్ విప్పేసి “మిస్టర్ విజయ్.. మీరు ఇప్పుడు నిదానంగా కనురెప్పలు తెరవండి.” అంటూ చెప్పాడు .
అప్పుడే పుట్టిన పసివాడిలా చిన్నగా కనురెప్పలు తెరిచిన విజయ్‌కి.. ఎదురుగా కళ్ళకు కట్టుతో నిలబడిన తండ్రి కనిపించాడు. తన తల్లి, రమ నాన్నను చేయి పట్టుకొని తన దగ్గరకు తీసుకురావటం చూసాడు విజయ్.
అంతే ఒక్క ఉదుటున మంచం దిగి, తండ్రిని గట్టిగా కౌగలించుకుని.. “నాన్నా.. ఏమయ్యింది కళ్ళకు? అమ్మా.. నువ్వు అయినా చెప్పు” అని అడుగుతున్నా, వారు ఏమీ మాట్లాడకుండా .. విజయ్‌ని ప్రేమగా తడుముతూ, “మా బంగారు తండ్రి, నువు క్షేమంగా ఉన్నావు. అది చాలు మాకు. నీ గురించి మేమెంత బాధపడ్డామో” అంటూ కొడుకుని చెరొక పక్క గుండెలకు హత్తుకుని ఆనంద భాష్పాలతో నుదుటి మీద ముద్దులు పెట్టారు.
“రమా! నువ్వు చెప్పు. అసలేం జరిగింది”
“మీరు యుద్ధంలో గాయపడిన సంగతి తెలియగానే మేము వెంటనే ఇక్కడికి వచ్చాము. మీ కళ్ళు దెబ్బ తిన్నాయని డాక్టర్ చెప్పగానే, మామయ్య గారు మీకు తన కళ్ళను ఇచ్చారు.” బాధపడుతూ చెప్పింది రమ.
“నాన్నా! ఇన్నేళ్లుగా నీ కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూపించిన వాడివి, ఈరోజు మీ కళ్ళనే ఇచ్చేసి.. మళ్ళీ ఈ ప్రపంచాన్ని చూపించాలనుకుంటున్నావా, వద్దు నాన్నా! మిమ్మల్ని ఇలా చూడలేను.” అంటూ ఏడుస్తూ చెప్పాడు విజయ్.
“చూడు విజయ్! నేను అన్నీ ఆలోచించుకునే ఈ పని చేసాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఒక వీరుడికి తండ్రి అయినందుకు గర్వపడుతున్నాను. నీకు కళ్ళు ఇచ్చి, మన భరతమాతకు.. నా వంతు బాధ్యతగా మరోసారి నిన్ను ఈ దేశానికి, నా కళ్ళతో కాపలా కాసే అవకాశం వచ్చిందని మనస్పూర్తిగా నీకు ఇచ్చాను. డోంట్ వర్రీ మై డియర్ విజయ్” చెప్పాడు గంభీరంగా భాస్కరం.
“నువ్వు దేవుడివి నాన్నా. నీ ఋణం ఎలా తీర్చుకోవాలి?” అంటూ తండ్రి పాదాలు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు విజయ్.
“విజయ్! నువ్వే నా ప్రపంచం అయినపుడు, నాకు ఈ లోకంతో పని లేదు. నా షష్టిపూర్తి ఎంతో గొప్పగా నిర్వహించబోయే నా విజయ్‌కి, ఈ కళ్ళు నేను ఇచ్చే అపూర్వ బహుమానం. అనుక్షణం మమ్మల్ని, ఈ దేశాన్ని కాపాడేందుకు ,నీకు కనులు చాలా అవసరం.” చెప్పాడు భాస్కరం కొడుకు తల ఆప్యాయంగా నిమురుతూ.
“నీ విజయాన్ని, నీ పోరాటాన్ని, నీ గుండెల్లో నిండి ఉన్న దేశభక్తిని, నా కళ్లతో చూసే అవకాశాన్ని నువ్వే ఈ తండ్రికి కానుకగా ఇచ్చావు.” అంటూ కొడుకు భుజం తట్టాడు భాస్కరం.
అక్కడ తండ్రి మనస్సు గొంతు విప్పుతుంటే.. కొడుక్కి చూపునిచ్చిన కళ్ళు వర్షిస్తున్నాయి.. విజయ్‌కి చూపుగా మారి.. ఏ తండ్రీ ఇవ్వని బహుమానం ఇచ్చాయి.