విలువలు

1
8

[dropcap]మ[/dropcap]నిషికి అసలైన సిసలైన ఆస్తి అతని వ్యక్తిత్వం. అది గల మనిషిని సమాజం గౌరవిస్తుంది, విలువ ఇస్తుంది. మనిషికి పేరు ప్రఖ్యాతుల కంటే వ్యక్తిత్వమే ముఖ్యం. అది లేని మనిషికి పేరు ప్రఖ్యాతులు లభించినా అవి పునాదులు లేని భవంతిలా కూలిపోతాయి. అదంతా ఎందుకు తన ఇంట్లోనే వ్యక్తిత్వం లేని మనుషులున్నారనుకుంటుంది అమల.

“పాపం తన చిన్నకూతురు అపరాజిత తండ్రి చేత చావు దెబ్బలు తిని ఏడ్చుకుంటూ పడుకుంది రాత్రి. ఉదయం కూడా తిండి తినకుండా స్కూలుకి వెళ్ళిపోయింది. దానికి స్కూలుకి భోజనం తీసుకువెళ్ళాలి” అనుకుంది అమల. ఎంతేనా అమెది తల్లి మనస్సు కాదా!

“దానికి ఎందుకు భోజనం స్కూలుకి తీసుకు వెళ్తున్నావు? మరీ మొండిగా తయరయింది నీ చిన్నకూతురు. కడుపు మాడితే అదే ఇంటికి వచ్చిన తరువాత తిండి తింటుంది” అత్తగారు అంది.

ఆమెకి జవాబియ్యకుండా తన పనిలో నిమగ్నమయింది అమల. “వీళ్ళ పెంపకం సరిగా లేదు. అందుకే పిల్లలు అలా మొండిగా తయారయ్యారు. దిక్కరించి మాట్లాడుతున్నారు” మామగారు అన్నారు.

ఎవ్వరికీ ఏం జవాబియ్యకుండా స్కూలు వేపు బయలుదేరింది అమల.

నడుస్తున్న ఆమె మొదడు నిండా అనేక ఆలోచన్లు. తన బాల్యం ఎంత మధురంగా చక్కగా సాఫీగా గడిచిపోయింది? తనని ఇంట్లో వాళ్ళు ఎంతో అపురూపంగా చూసుకునేవారు. అలాంటి తను పెళ్ళయిన తరువాత ఈ ఇంట్లో వచ్చి పడింది. ‘చాలా మంచివాళ్ళు. మంచి సంబంధం’ అంటూ ఆనందరావుతో తన పెళ్ళి జరిపించారు పెద్దలు.

అత్తవారింటిలో అడుగు పెట్టిన తరువాత అక్కడి వాతావరణం క్రమంగా అవగతమయింది తనకి. ఆ ఇంట్లో తన భర్త స్థానమేంటో అవగతమయింది. తన భర్త ఆ ఇంటికి ఒక్కగాని ఒక్క వారసుడు. నలుగురు అక్కల తరువాత పుట్టిన మగ నలుసు ఆనందరావు. అందుకే అందరి అజమాయిషీ తన భర్త మీదే.

ఆ ఇంట్లో ఆడ పెత్తనం. మగవాళ్ళు డమ్మీలు. తన ఆడబడుచులు కూడా తమ భర్తల్ని తమ చెప్పుచేతల్లో ఉంచుకునేవారు. అంత వయస్సు వచ్చినా తన భర్తకి ఆ ఇంట్లో స్వాతంత్య్రం లేదని తను ఇట్టే గ్రహించింది. తనని ఎక్కడికి తీసుకెళ్ళాలనుకున్నా, ఏ వస్తువు కొనాలనుకున్నా చివరికి తల్లో పెట్టుకునే మల్లెపూల దండ కొనాలనుకున్నా ఇంట్లో వాళ్ళకి చెప్పి చెయవల్సిందే. ఇంట్లో వాళ్ళ అభీష్టానికి ఏ మాత్రం వ్యతిరేకంగా జరిగినా ఇంట్లో పెద్ద రబసే. ఇటు వంటి వాతావరణంలో తనేం చేయగలదు?

తన భర్త స్వతంత్రించి ఏం కొనితెచ్చినా ఇంట్లో పెద్ద రాద్ధాంతమే. మరి ఆడబడుచులు వాళ్ళ అత్తవారిని ఆమడ దూరంలో ఉచుతారు. పుట్టింటికి వచ్చినప్పుడు తల్లికి కోడలి మీద ఎలా అజమాయిషీ చేయాలో బోదనలు చేస్తారు. వచ్చినప్పుడు వాళ్ళదే పెత్తనం. తనింట్లో తనకే స్వాతంత్య్రం లేని పరిస్థితి.

ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత ఆనందరావు ఇప్పుడిప్పుడే మారుతున్నాడు. దానికి కారణం స్నేహితుల కుటుంబాల తీరుతెన్నులు చూసిన తరువాత ఈ మార్పు. తన జీవితంలో కూడా కొద్దిగా మార్పు వస్తోంది. లేకపోతే ఆడబడుచులు పుట్టింటికి వస్తే వాళ్ళ బట్టలు కూడా తనే ఉతికేది. పాచి పని చేసేది. పని పిల్లని ఇంట్లో పెట్టుకొడానికి ఇష్టపడేవారు కాదు. ఇదీ పెళ్ళయిన కొత్తలో తన జీవితం.

తిండి విషయంలో కూడా ఆంక్షలే. కుటుంబ సభ్యులందరూ తిన్న తరువాత తను తినాలి. అందరూ భోజనం చేసుంటే వాళ్ళకి వడ్డన చేయాలి. ఆ తరువాత తన భోజనం.

“ఇదేంటి మీ ఇంటి పద్దతి? చాదస్తం మనుషలు. చాదస్తపు భావాలు! మీ ఇంటి పద్దతులు మరీ విడ్డూరంగా ఉన్నాయి. నీ ఇంట్లో నీకే స్వాతంత్య్రం లేదు. నీవు కాబట్టి కుదురుగా ఉండి కాపురం చేస్తున్నావు కాని నేనే అయితే ఓనమస్కారం పెట్టి వచ్చేసి ఉండేదాన్ని.

మీ బావగారు ఇంట్లో ఎవరికి ఇయ్యవలసిన గౌరవం వాళ్ళకిస్తారు. ఎవరిలో తప్పులున్నా తన వాళ్ళయినా ఊరుకోరు. భార్యగా నన్ను గౌరవిస్తారు. అభిమానిస్తారు. సమర్థిస్తారు. ఎవరైనా నన్ను ఏ మాటన్నా ఊరుకోరు. అది వాళ్ళవాళ్ళయినా అంతే” అక్కయ్య తనతో ఓ పర్యాయం అంది. తన భర్త ప్రవర్తన బాగలేదని అక్కయ్య ఉద్దేశ్యం.

“మీ మరిది సంగతి నీకు తెలుసు కదా అక్కా” అని తను కన్నీళ్ళు పెట్టుకుంది. “ఇది నీ పిరికితనం” అని అక్క తనని కసురుకుంది. తన తండ్రి సంతానంలో తనదే ఇలాంటి జీవితం. అదే తన వాళ్ళ బాధ.

తన అత్తగారిది ఓ విచిత్రమైన మనస్తత్వం. నెలలో ఆ మూడు రోజులు తను ఎలా వండినా ఎలా పెట్టినా తినేస్తారు. మిగతా రోజుల్లో తను ఉదయాన్నే స్నానం చేసి కాఫీ తయారు చేసి ఇస్తేనే త్రాగుతారు. టిఫిను తింటారు. కొద్దిగా నలతగా ఉన్నా తను స్నానం చేయకుండా టిఫిను, కాఫీ ఇస్తే ఆ రోజు రాద్దాంతమే.

ఇంట్లో తను ఓ యంత్రంలా పని చేయవల్సిందే. మడీ తడీ అని అత్తమామలు, స్కూలుకి టైము అయిపోతోంది అని పిల్లలు, ఆఫీసుకి టైమవుతోందని భర్త ఇంత మందిని సముదాయించుకుని రావాలి తను.

మామగారు టి.వి.కి అతక్కుపోతే, అత్తగారు దేవుడి గదిలో సెటిలయిపోతుంది. అవిడ పూజ పూర్తయ్యేవరకూ తనకి టిఫిను తినే అవకాశమే లేదు. పది పదకొండు గంటలకి టిఫిను తింటే భోజనం మధ్యహ్నం ముడు గంటలకే. రాత్రి పది గంటలకి భోజనాలయితే మాటలు అన్ని అయిన తరువాత పడుకోవడం రాత్రి పన్నెండు గంటలకి. తిరిగి తెల్లవారగానే లేస్తే గాని ఇంటి పనులు జరగవు. అందుకే వేళకి తిండి లేక, వేళకి నిద్ర లేక తన ఆరోగ్యం పాడవుతోంది.

పెద్దకూతురు అరుణకి పన్నెండు సంవత్సరాలు. కొంచెం సాత్విక స్వభావురాలు. నెమ్మదస్తురాలు. మొత్తానికి సాప్ట్. చిన్న కూతురు అపరాజితకి పది సంవత్సరాలు. అది అరుణకి పూర్తిగా వ్యతిరేకం. పేరుకు తగ్గట్టే ఎందులోనూ పరాజయం పొందడం సహించలేదు. ఉన్నది ఉన్నట్లు నిర్మోహమాటంగా మాట్లాడుతుంది. ధైర్యస్తురాలు. మొండిది కూడా. గడుసుది. తన కళ్ళ ముందు ఏ అన్యాయం జరుగుతున్నా సహించలేదు. ఎవరి వల్ల తప్పున్నా ముఖం ఎదుటే అడిగేస్తుంది. అందుకే అందటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు. అదంటే అందరికీ కోవమే.

“ఇంట్లో ఆడ మలయాళం ఎక్కువయిపోయింది. ఒక మగ నలుసు అయినా పుట్టలేదు మా వాడికి. ఇంటికి వారసుడుండాలి” అని అత్తగారూ మామగారూ రోజూ సణుగుసణుగు.

వాళ్ళ మాటలు తనకి బాధ కలిగించాయి. ఆడపిల్లలయినా, మగపిల్లలయినా పుట్టడానికి కారణం ఒక్క ఆడదాని తప్పు కాదు. అది ఆడలోనూ, మగలోనూ కూడా ఉంటుంది. ఈ విషయం గుర్తించకుండా కేవలం ఆడదానిదే తప్పు అని ఆమె మీద నింద వేయడం తనకి నచ్చదు. తన అత్తగారు, మామగారూ తరుచూ వారసుడు లేడని అనడం ఆడపిల్లల్ని కసురుకోవడం తనకి నచ్చలేదు. అరుణకి, అపరాజితకి జ్ఞానం వస్తోంది. వాళ్ళెం చిన్న పిల్లలు కారు. వాళ్ళకి కూడా మంచి చెడ్డలు తెలుస్తున్నాయి.

“ఏంటమ్మా! నాన్నమ్మ, తాతగారూ రోజూ అలా సణుగుతారు? మమ్మల్ని తిడతారు. అత్తయ్యల పిల్లల్ని ఏం అనరు. వాళ్ళను చాలా బాగా చూసుకుంటారు. మేమూ వాళ్ళ మనుమలు కాదా?” అని బాధపడేవారు అరుణ అపరాజిత.

విని విని తనే అత్తగారూ, మామగారితో “పిల్లల్ని మీరు ఎందుకలా కసురుకుంటారు? వాళ్ళు చాలా బాధపడ్తున్నారు. ఈ కాలంలో ఆడపిల్లలు, మగ పిల్లలూ సమానమే. ఇంకా ఆడపిల్లలుంటేనే మంచిది. తల్లిదండ్రుల మీద ఆశ అభిమానం వాళ్ళకుంటుంది. ఎందుకొచ్చిన మగపిల్లలు? మగ పిల్లలు ఎంతమందో తమ తల్లి దండ్రుల్ని ఎన్ని యాతనలకి గురిచేస్తున్నారో వింటున్నాం కదా! పేపర్లో చదువుతున్నాం” ఉక్రోషంగా అంది.

“ఎందుకలా ఆవేశపడ్తావు? ఉన్న మాటే అన్నాము. వారసులుంటే ఇంటి పేరు నిలబడతుంది. ఎంతేనా ఆడపిల్లే. పై ఇంటికి పోవల్సిందే పెళ్ళి అయినా తరువాత. పోనీ! ఓ మగపిల్లాడ్ని పెంచుకోండి” మామగారు అన్నారు.

అతని మాటలకి తనకి చాలా కోపం వచ్చింది. “పెంచుకునే ప్రసక్తే లేదు. మాకు మగ పిల్లలయినా, ఆడపిల్లలయినా అరుణా, అపరాజితే” గట్టిగా అని అచటి నుండి వచ్చేసింది.

తన భర్త దగ్గర మామగారు అన్న మాటల్ని చెప్తే “పోనిద్దూ! పెద్దవాళ్ళు ఏదో చాదస్తంగా మాట్లాడుతారు. మనం పిల్లలకి సర్ది చెప్పాలి” అని అనేవాడు. మరీ గట్టిగా చెప్తే “మా వాళ్ళు ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేదా?” అని తీవ్రంగా అనేవాడు.

అత్తగారూ, మామగారూ తమ దగ్గర ఉండడం ఇష్టముండదా? పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఎలా వస్తారు ? అందులోనూ వాళ్ళు తన భర్తకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు. తనకి తన తల్లిదండ్రులెంతో, అత్తమామలూ అంతే, అయితే వాళ్ళు కూడా అందరికీ విలువ ఇవ్వాలి. వాళ్ళ విలువలు వాళ్ళు కాపాడుకోవాలి. అని తను అనుకునేది.

పాపం అరుణ, అపరాజిత ఉదయం స్కూలికి వెళ్ళి పుస్తకాల మద్య యంత్రాలయిపోయి, చదువు, హోమ్ వర్క్‌లతో వాళ్ళ మొదడ్లు వేడి ఎక్కిపోతున్నాయి. ఉదయం స్కూలుకి వెళ్ళిన వాళ్ళు సాయంత్రం ఆరు గంటలకి ఇంటికి వస్తారు. వాళ్ళకి కూడా కొద్దిగా రీలీఫ్ కావాలి కదా! ఎంజాయ్‌మెంట్ కావాలి. సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత టి.వి.లో కామిక్‌షోలు చూడాలనుకుంటారు. అయితే ఆ సమయంలోనే అత్తగారు, మామగారూ టి.వి.కి అతుక్కుపోతారు. పిల్లలు టి.వి చూస్తామని అడిగితే కసిరేస్తారు. చదువుకోమంటారు పిల్లల్ని.

తనకి ఎలాగూ టి.వి చూసే అదృష్టం లేదు. పిల్లలకి కూడా ఆ అవకాశంలేదు. వాళ్ళింట్లోనే వాళ్ళకి స్వాతంత్య్రం లేదని తను బాధపడేది. ఇక సెలవులిస్తే ఆడబడుచులు పిల్లల్తో సహా దిగిపోయేవారు. “వాళ్ళు మనింటికి గెస్టుగా వచ్చారు. మనం వాళ్ళకి మర్యాదలు చేయాలి” అంటూ అత్తగారూ, అరుణ, అపరాజితకి చెప్పి వాళ్ళ చేత వచ్చిన వాళ్ళకి నానా చాకిరీ చేయించేవారు. ‘తనకి అయితే ఎలాగూ తప్పదు. పిల్లల చేత కూడా ఇలాంటి వెట్టిచాకిరీ చేయించడమేంటి?’ అని తను చాలా బాధపడేది తను.

అత్తగారు అలా పురమాయిస్తే అరుణ నాన్నమ్మ చెప్పినట్టు చేసేది కాని అపరాజిత మాత్రం వినీ విననట్లు ఊరుకునేది. దీనకి ఎంత పొగరు? అంటూ అపరాజిత మీద కళ్ళు ఎర్రజేసి పళ్ళు పట పట కొరికేది అత్తగారు. అపరాజిత మీద ఆవిడకి అంత కోపం.

చిన్న పిల్లయినా అపరాజిత మాటలు ఒక్కొక్క పర్యాయం ఆశ్చర్యం కలిగించేది. వయస్సుకి మించిన మాటలు మాట్లాడేది “ఏంటమ్మా! ఆ వచ్చిన వాళ్ళకి మనం ఎందుకు సేవ చేయాలి? వాళ్ళకి మనం నౌకర్లమా? నీవు కూడా గంగిరెద్దురా తల ఊపుతూ ఎవరు ఏం చెప్పినా చేస్తావు. నీవు మనిషివే కదా! ఇన్ని పనులు ఎలా చేయగలవు? ఆ మాత్రం జాలి కూడా నీ మీద వాళ్ళకి లేదు నాన్నమ్మకి” అన్నది.

“తప్పమ్మా! నీవు చిన్న పిల్లవి. నీవు అలాంటి మాటలు మాట్లాడకూడదు. వాళ్ళు వింటే బాగుండదు” అని నెమ్మదిగా అపరాజితను మందలించేది తను. అపరాజితకి తన మాటలు నచ్చేవి కావు. “నీ కర్మ!” అంటూ తన నిరసన తెలియ చేస్తూ అక్కడి నుండి వెళ్ళి పోయేది.

ఒక్కోక్కసారి “ఏంటమ్మా! నాకు ఇంట్లో ఉండడానికే విసుగ్గా ఉంది. ఎక్కడికేనా వెళ్ళిపోవాలనిపిస్తోంది” అని అనేది. ‘ఎంత విసిగిపోతే కాని అంత చిన్నపిల్ల అంతేసి పెద్ద మాటలు అంటుంది’ అని అనుకుంది తను.

“తప్పుమ్మా! అలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడకు. నీకు ఇక పై అలాంటి మాటలు అంటే నా మీద ఒట్టే” అని అపరాజిత చేత తను ఒట్టువేయించుకుంది. ఎందుకంటే చిన్నపిల్లలు కుంటుంబ కలహల వల్ల ఇల్లు విడిచి వెళ్తన్న సంఘటనలు కూడా ఉన్నాయి.

నిన్న సాయంత్రం స్కూలు నుండి ఇంటికి వచ్చిన తరువాత టి.వి.లో కామిక్ షో చూడాలనుకున్నారు అరుణ, అపరాజిత. ఆ సమయంలోనే అత్తగారూ, మామగారూ టి.వి. చూస్తున్నారు. “నాన్నమ్మా! మేము టి.విలో కామిక్ షో చూస్తాము” అపరాజిత అడిగింది.

“పిల్లలు టి.వి.లు చూడంటం ఏంటి? మీరు వెళ్ళి చదువుకోండి” వాళ్ళని కేకలు వేసింది అత్తగారు.

అపరాజిత ఊరుకుంటుందా? అసలే దానికి ముక్కు మీద కోపం. “పదక్కా! మనకి మనింట్లోనే ఫ్రీడమ్ లేదు” అంది. ఆ చిన్న పిల్ల మాటలు అత్తగారికి కోపం తెప్పించాయి. ఆవిడకి ఉక్రోషం ముంచుకొచ్చింది. ఆవిడ కడుపు మంట చల్లారలేదు. అక్కడికి ఆవిడకి తను సర్దిచెప్తూనే ఉంది. రాత్రి కొడుకు రాగానే చాడిలా చెప్పింది.

అక్కడికీ తను జరిగిన విషయం భర్తకి చెప్పి అపరాజిత తప్పేం లేదని నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. అయినా భర్త తన మాటలు వినలేదు. అతని కోపం తారాస్థాయికి చేరుకుంది. బెల్టు తీసి అపరాజితను గొడ్డును బాదినట్టు బాదారు.

“పెద్దవాళ్ళకి గౌరవం ఇచ్చే విధానం ఇదా? వాళ్ళ మాటలకి విలువ ఇవ్వద్దా? నాన్నమ్మకి సారీ చెప్పు” అన్నారు. అపరాజిత అలా చేయకపోయేసరికి మరింతగా కొట్టారు.

“తనే తప్పు చేయలేదు. తనెందుకు సారీ చెప్పాలి” అని దాని భావన. భర్త కొడ్తూ ఉంటే ఆ దెబ్బలకి తట్టుకోలేక “అమ్మా!… అమ్మా!…” అంటూ అపరాజిత ఏడుస్తూ ఉంటే తనది ఏం చేయలేని పరిస్థితి. ఆ పసిదానికి దెబ్బల మీద ఆయింటుమెంటు రాయడం తప్ప తనే చేయలేకపోయింది. నొప్పి అంటూ రాత్రంతా అపరాజిత ఏడుస్తూనే ఉంది. తిండి తినలేదు.

ఉదయం కూడా తిండి తినకుండా స్కూలుకి వెళ్ళిపోయింది.

“అమలా! ఏంటి అలా ఉన్నావు? ఏదైనా సమస్యా?” అడిగింది అరుంధతి. అత్తవారింటిలో అమల జీవితం ఎలా సాగుతోందో అన్ని విషయాలూ అరుంధతికి తెలుసు. ఇద్దరి మధ్యా ఏ దాపరికాలూ లేవు. అందుకే అమల రాత్రి జరిగినదంతా అరుంధతికి చెప్పింది.

వాళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులు. పెళ్ళిళ్ళు అయినా ఇద్దరికీ ఒకే ఊరులో ఉండే అవకాశం వచ్చింది. ఇద్దరూ ఒకరి భావోద్వేగాలు మరొకరు పంచుకుంటారు. మనం మన వాళ్ళు దగ్గర చెప్పుకోలేని విషయాలు కూడా స్నేహితుల దగ్గర పుంచుకుంటాం.

అంతా విన్న తరువాత గాఢంగా నిట్టూర్పు విడిచింది అరుందతి. కొంత సేపు మౌనంగా ఉన్న తరువాత “అమలా! ఒక్క విషయం. మీ ఇంటి పరిస్థితి, మీ అత్తవారి మెంటాల్టీ వేరు. ఇంలాంటి చాదస్త, శాడ్టిస్టు మెంటాల్టీ గల వాళ్ళు అరుదుగా తారసపడతారు. ప్రతీ విషయంలో దూరిపోయి పెత్తనం చెలాయించాలనుకునే రకం మీ అత్తవారు.”

“నీ పిల్లల విషయానికి వస్తే వాళ్ళు ఇంటి పరిస్థితుల్ని అర్ధం చేసుకుంటున్నారు. జరుగుతున్న అన్యాయాల్ని గుర్తిస్తున్నారు. మంచి చెడ్డలు అర్ధం చేసుకుంటున్నారు. అపరాజితలో తిరుగుబాటు ధోరణి అగుపిస్తోంది. అయితే అన్యాయం ఎదిరించడానికి అలా ఉండాలి. అందుకే నిన్ను గంగిరెద్దుతో పోల్చింది. తరానికి తరానికి ఈ మార్పు సహజం. ఈ తరం వాళ్లు కొంతమంది సాఫ్టుగా ఉండలేరు. ఈతరం పిల్లలు నాలాగ ఉండమంటే ఈ తరం పిల్లలు ఉంటారా? అందులోనూ అరపాజిత లాంటి వాళ్ళు అసలు ఉండలేరు.”

“మీ అత్తవారిది కూడా శాడిస్టు మెంటాల్డీ. లేకపోతే ఆ చిన్న పిల్లని తండ్రి కొట్టేవరకూ ఊరుకోలేదు. నీ భర్తకి కూడా తల్లిదండ్రుల మీద భక్తి గౌరవం ఉండొచ్చు. అభిమానం ఉండొచ్చు. జన్మనిచ్చిన వాళ్ళ మీద అలా ఉండడం అవసరమే. అయితే నీ భావాల్ని పిలల్ల భావాల్ని కూడా అర్ధం చేసుకోవాలి. సమస్యల్ని కూడా అర్ధం చేసుకోవాలి.”

“మేము పెద్ద వాళ్ళం. మా మాటే వినాలి. మాకు గౌరవం ఇయ్యాలి అనే భావం మీ అత్తవారిలో నాకు అగుపిస్తోంది. మీకు పిల్లలు పుట్టే విషయంలో కూడా వాళ్ళదే పెత్తనంలా ఉంది. ఇలా ప్రతీ విషయంలోనూ వాళ్ళ జోక్యం మంచిది కాదు… అది తప్పు… ఇలా చేస్తే వాళ్ళ పెద్దరికం నిలవదు. మీ ఆయన కూడా వాళ్ళు చెప్పినదే వేదం అన్నట్టు కాకుండా అతని ఆలోచన్లు మార్చుకుని పెద్దవాళ్ళకి నచ్చ జేప్పే విధంగా ఉండాలి. లేకపోతే మీ అత్తగారూ, మామగారూ కూడా మానసికంగా మీ కుటుంబానికి దూరమవుతారు.”

“ముఖ్యంగా మీ భార్యా భర్తలిద్దరూ ఒక్క మాట మీద ఉంటే ఎవ్వరూ ఏం చేయలేరు. అయితే పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు. వాళ్ళ సలహాలు, సహకారం మీకు కావాలి. అందకు మీరు కూడా పెద్దవాళ్ళ మనస్సుని కష్టపెట్టకుండా ఇవతల పిల్లల మనస్సు కలత చెందకుండా చూడవల్సిన బాధ్యత నీది అమలా! దీనికి ముందుగా సహనం ఎంతో అవసరం. ఈ పని ఒక విధంగా కత్తి మీద సాములాంటిది.”

అరుంధతి మాటలు వింటూ అపరాజితను తలుచుకుంటూ స్కూలు వేపు గబగబ అడుగులు వేస్తోంది అమల. ఆమె మనస్సులో ఒక్కటే ఆలోచన. అరుంధతి చెప్పినట్టు ఎవరి విలువలు వాళ్ళు కాపాడుకుంటే ఏ సమస్యా ఉండదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here