రంగుల హేల 17: విమర్శ కషాయం

1
6

[box type=’note’ fontsize=’16’] “విమర్శ అనేది రచయిత ఎదుగుదలకు ఎరువు లాంటిది తప్ప గాఢత ఎక్కువయ్యి రచనా మొక్కలు మాడిపోయేట్టు ఉండకూడదు” అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మిరంగుల హేల” కాలమ్‌లో. [/box]

[dropcap]సా[/dropcap]హిత్య పుస్తకాలను బాగా ఎక్కువగా చదివి ఆ పుస్తకాల గురించిన ఒక అథారిటీ సంపాదించి మిత్రులతో చర్చించడం లేదా వ్యాసం రాస్తూ గుణ దోషాలను నిష్పక్ష పాతంగా చర్చకు పెట్టడం సాహిత్య విమర్శ.

సహృదయ విమర్శకులు ఏ విధమైన అనుబంధాలకూ, మొహమాటలకూ లొంగకుండా గురు స్థానంలో నిలబడి చక్కని సూచనలూ సలహాలతో విమర్శించడం రచయితలకూ ఆనందాన్నిస్తుంది. అక్కడ విమర్శను హుందాగా చేయడం, స్వీకరించడం రెండూ ఉన్నతమైన కార్యాలే.

విమర్శకు తనను తాను చంపుకునే గుణం, ఇతరులను చంపే గుణం ఉంటుందంటారు.

 A critic who knows the price of everything, but value of nothing.

విమర్శ ఆరోగ్యం కోసం ఇచ్చే కాషాయం లాంటిది. చేదుగా ఉంటుంది. అది శరీరానికి అవసరం. అయితే దానికి మోతాదు ముఖ్యం. డోస్ ఎక్కువైతే ప్రమాదం.

అచ్చంగా విమర్శకులు కొందరు. రచయితలైన విమర్శకులు కొందరు. వీరు తాము రాసిందే ఉదాత్తమైన రచన అనీ ఇతర్లవి కావనీ ధీమా పడుతుంటారు. తాము రాసిన వాటిలో కూడా తప్పూ తాలూ ఉంటాయని ఒప్పుకోరు.

ఏది ఏమైనా రచయితలకు తమ రచనల మీద దృతరాష్ట్ర ప్రేమ అనవసరం. రచనలు వాటికవి అలవోకగా పుడతాయి. గొప్పవైతే గొప్పవాడైన పిల్లాడిలా పేరు తెచ్చుకుంటాయి. లేదంటే పక్కకి పోతాయి అంతే. వాటి గురించిన వర్రీ రచయితలకు అనవసరం.

సాహితీ విమర్శ ఒక శాస్త్రం. దాని గురించి లోతుగా అధ్యయనం చేసిన వారే సద్విమర్శ చెయ్యగలరు. అటువంటి వారు అరుదుగా ఉంటారు. అటువంటి వారు చేసే విమర్శ బాధ్యతాయుతంగా రచన చెయ్యమని చెబుతుంది. ఒకోసారి పొగడ్త విమర్శ కలిసి మెలిసీ ఉంటాయి. ఒక వాక్యంలో పొగడ్త ఉండి తర్వాత వాక్యం తెగడ్త ఉండొచ్చు. వాటిలో నేర్చుకోవలసింది, నొచ్చుకోవలసింది ఉందా లేదా అని గమనించుకొని ముందుకుపోవడం రచయితల బాధ్యత. అంతకు మించి మనసు మీదికి తీసుకోనక్కరలేదు.

మరి కొందరు అత్యంత ఆత్మవిశ్వాసంతో తమ చుట్టూ కాంక్రీట్ గోడ కట్టుకుని చెవులు మూసుకుని మీరంతా ఏమన్నా నా ధోరణి నాదే అనే టైపు రచయిత లుంటారు. వారిపై వేసిన విమర్శనా బాణాలు బౌన్స్ అవుతాయి తప్ప ఫలితం ఉండదు.

మరో రకం బలహీన మనస్కులైన రచయితలు విమర్శకు చిగురాకులా వణికి పోయి తమ కలం కింద పడేస్తారు. ఇంకొంత మంది తమ రచనని విమర్శించినపుడు తీవ్ర మనోవ్యధకు గురయ్యి మిత్రుల దగ్గర వాపోయి ఇతరులను విమర్శించినపుడు శభాష్, నిజమే సుమీ అని విమర్శకుడి వీపు తడుతుంటారు.

పుస్తక పరిచయం వేరు, సమీక్ష వేరు, విమర్శ వేరు. ఇప్పుడన్నీ కలిపి కిచిడీ చేస్తున్నారు. కొందరు పుస్తక పరిచయం చేయబోయి సమీక్షించబోతారు. కొందరు సమీక్షించబోయి విమర్శిస్తారు. పుస్తకం ఆవిష్కణ రోజునే విమర్శ చేయడం సరికొత్త విపరిణామం. ఇది పుస్తకంపై ఆకర్షణను చంపేస్తుంది. కొందరు విమర్శని ఒక కోర్స్ లాగా చదివి కూర్చుంటున్నారు. వీళ్ళు పుస్తకం దొరకగానే చదివి ఎగిరి గంతేసి ఇందులో ఏమేమి లేవంటే అని గొంతు సవరించుకుంటున్నారు. మా మిత్రుడొకాయన “ఏమేమి ఉన్నాయో చెప్పు చాలు” అన్నాడు ఒక మీటింగ్ లోఅలాంటి విమర్శా శిరోమణి తలపై ఒక మొట్టికాయ వేస్తూ.

వర్క్ అఫ్ ఆర్ట్ అనేది అసంకల్పితంగా పుడుతుంది.దాన్ని తూకం వేసి తూచి, కొలతలు వేసి సృష్టించలేరు. ఒక గొప్ప కథలో ఒకటి రెండు లోపాలుంటాయి. ఒక కాలక్షేపం కథలో ఒక చక్కటి జీవన సత్యం ఉంటుంది. విమర్శ అనేది రచయిత ఎదుగుదలకు ఎరువు లాంటిది తప్ప గాఢత ఎక్కువయ్యి రచనా మొక్కలు మాడిపోయేట్టు ఉండకూడదు.

అందాల పోటీలో ఎంతో అందమైన సినిమా హీరోయిన్ కావలసిన కొలతలు లేక పోటీలో నెగ్గలేక పోతుంది. ఖచ్చితమైన కొలతలతో నెగ్గి కిరీటం పొందిన ప్రపంచ సుందరి కళా కాంతీ లేని మొహంతో పిండి బొమ్మలా/బార్బీ బొమ్మలా ఉంటుంది. అన్ని రూల్స్‌నీ పాటించి రాసిన కథలో ఆర్ద్రత ఉండక పోవచ్చు. అప్పుడది ఎవరి మనసునూ తాకలేదు.

ఇతరుల రచనల్లోని అనౌచిత్యాల్ని ఎత్తి చూపే విమర్శక పండితులు తమ స్వీయ రచనల్లోని అనౌచిత్యాల్ని గురించి ఏమంటారో తెలియదు. వీరి రచనల్ని కూడా విమర్శనా చెరిగివేతకు పెడితే వీరు తమని తాము సవరించుకోవడానికి ముందుకు వస్తారేమో చూడాలి.

విమర్శకులు హృదయవాదులు కాకపోవడం వల్ల లెక్కల మాష్టారిలా స్టెప్‌లు చూసి మార్కులు వేస్తారు తప్ప రచయిత హృదయ గానాన్ని వినిపించుకోదలచుకోరు. ఏం చేస్తాం? అప్పుడప్పుడూ రచయితలు వీరి బారిన పడడం తప్పని సరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here