విన్నపాలు వినవలె

3
5

[dropcap]”వి[/dropcap]న్నపాలు వినవలె, వింత వింతలూ…. పన్నగపు దోమతెర పైకెత్త వేళాయె”… స్వామి వారి కీర్తన చల్లగా నా చెవులకు సోకుతోంది. నా చెవుల్లో ఇయర్ ఫోన్స్ సర్దుకుని, ఐప్యాడ్ తలగడ కిందకు తోసి, ఒక పక్కకు తిరిగి పడుకున్నాను.

హాస్పిటల్ బెడ్ మీద నాకు నిద్ర పట్టడం లేదు. అందుకే స్వామి వారి సహాయం తీసుకుంటున్నాను. లేటెస్ట్‌గా డిజైన్ చేసిన పేషెంట్ బెడ్. ఐసియులో 15 ఇలాంటివే తీసుకున్నాను. బెడ్ ఏమిటి? ఈ ఐసియు లోని ప్రతి వస్తువు, ఆ మాటకొస్తే ఈ హాస్పిటల్లో ప్రతి వస్తువు నేను ఎంపిక చేసుకున్నదే. నా శ్రమతో, నా తెలివితో, నా సంపాదనతో నిర్మించిన వంద పడకల ఆసుపత్రిలో ఇవాళ నేనే పేషెంట్ లాగా పడుకొని ఉన్నాను. నిద్రపట్టక దొర్లుతున్నాను. ఒక గంట తర్వాత స్వామివారి మహిమ వల్లో, నర్స్ ఇచ్చిన ఇంజెక్షన్ల వల్లో, నిద్రాదేవి నన్ను తన ఒడిలోకి లాక్కుంది

***

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మా ఊరు. అమ్మమ్మ, తాతయ్య లకు అమ్మ ఒక్కతే కూతురు. తాతయ్య గారు స్కూల్ ఫైనల్ వరకు చదువుకున్నారు. వారసత్వంగా వచ్చిన భూమిని సాగు చేసుకునేవారు. మా అమ్మమ్మ ఐదో తరగతి వరకు చదువుకుంది. వంటల్లో, సాంప్రదాయాల్లో దిట్ట. అమ్మ ఒక్కతే కూతురు కావడం వల్ల గారాబంగా పెంచింది. అమ్మ అమలాపురం కాలేజీలో డిగ్రీ చేసింది. ఫ్రీ గా ఉండడం ఇష్టం లేక, బి.ఇ.డి కూడా చేసింది. మా నాన్న మా తాత గారికి బంధువు. నాన్న కూడా డిగ్రీ చేశారు. నాన్న వాళ్ళ కంటే మా అమ్మ వాళ్లు స్థితిమంతులు కావడం వల్ల ఇల్లరికం ఒప్పందం మీద, అమ్మని ఆయనకిచ్చి పెళ్లి చేసారు. ఊర్లోనే పోస్ట్‌మ్యాన్ ఉద్యోగం వచ్చింది. అమ్మ పక్క ఊర్లో ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా చేరింది.

నేను పుట్టిన తర్వాత అమ్మకి నీరసం చేయడంతో ఇంకో కాన్పు కోసం ప్రయత్నించవద్దని అమ్మ మా నాన్నకి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఒక్కతే కూతుర్ని అవడం వల్ల, .అమ్మ,నాన్న చాలా గారాబంగా చూసేవారు. ఐదేళ్లు పూర్తవగానే అమ్మ ఉద్యోగం చేస్తూన్న స్కూల్లోనే నన్ను చేర్పించింది. అమ్మ ట్రైనింగ్‌లో పెరగడం వల్ల ఏ క్లాస్‌లో చేరితే ఆ క్లాస్‌లో టాప్ చేయడం మొదలుపెట్టాను. ఐదవ తరగతి తరువాత మత్స్యావతార మెత్తిన విష్ణువుకు సముద్రం తప్ప ఇంకేమీ సరిపోనట్టు, నాకు టౌన్‍లో తప్ప అసలు కాంపిటీషన్ ఉండదని మా అమ్మ భావించింది. ఆ విషయంలో మా తాతగారు ఏమీ అనలేదు. కానీ, మా అమ్మమ్మకి అంతగా నచ్చలేదు. అమ్మ నచ్చచెప్పి, “నీ కూతురు మీద ప్రేమతో నువ్వు పెళ్లి చేసావు. నేను నా కూతురు మీద ప్రేమతో కాకినాడలో చదివిస్తాను” అంటూ, నన్ను కాకినాడ హై స్కూల్ లో చేర్చింది.

అలా కాకినాడలో చేరిన తర్వాత నా ప్రస్థానం అప్ర్రతిహతంగా సాగింది. మొదటి ప్రయత్నంలోనే ఎం.బి.బి.యస్.లో సీట్ సంపాదించాను. మొదటి సంవత్సరంలో ఒకటి, రెండో సంవత్సరంలో రెండు, మూడు-నాలుగు సంవత్సరాల్లో రెండు, సంవత్సరాలలో రెండు మొత్తం 7 గోల్డ్ మెడల్స్ సాధించాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ మొదటి ప్రయత్నంలోనే సాధించాను నేను. ఎండి గైనకాలజీ చేశాను. పీజీ ఫైనల్ ఇయర్‍లో ఉండగా జనరల్ మెడిసిన్ సంబంధం వచ్చింది. అతడు నాకు రెండేళ్ళు సీనియర్. కాలేజ్‌లో నా చదువు చూసి కాణీ కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారు.

పీజీ తర్వాత నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. కాన్పు అయాక, ఆరు నెలలు రెస్ట్ తీసుకుని పాపని, మా అమ్మకు అమ్మమ్మకి ఒప్పచెప్పి, పూర్తిగా ప్రాక్టీస్ లోకి దిగాను. 20 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. నా ప్రాక్టీస్ అంతా నా కూతురికి ఇవ్వడానికి, తనని కూడా చదివించాను. బాగానే సంపాదించాము. నా కూతురు కూడా ప్రాక్టీస్‌లో సంపాదించటం మొదలు పెట్టింది. ఈ మధ్యనే దాన్ని పెళ్లి కూడా చేశాం. అల్లుడు నెఫ్రాలజిస్ట్.

ఇంతలో అకస్మాత్తుగా ఒకరోజు ఓపీ చూస్తున్న నేను కళ్ళు తిరిగి పడిపోయానుు. గబగబా, ఐసియు లోకి తీసుకువెళ్ళారు. బీపీ డౌన్ అయింది అన్నారు. గ్లూకోజ్ లెవల్స్ పడిపోయాయి అన్నారు. క్రానిక్ స్ట్రెస్ అన్నారు. అన్ని టెస్టులు చేశారు. మా ఆయన, పాప స్వయంగా అన్ని రివ్యూ చేశారు, కానీ ఏం తేల్చలేదు. చాలామంది లేడీ డాక్టర్స్ లాగే నాకు కూడా మా ఆయన డయాగ్నోస్టిక్స్ మీద నమ్మకం లేదు. మా క్లాస్‌మేట్స్, సీనియర్స్, చాలా తెలివైన వాళ్ళు ఒక అరడజను మంది వచ్చారు. అందరు కలిసి కూడా… అంతా బాగానే ఉందన్నారు. ఏ పనీ చేసుకోలేని నీరసం. అసలు లేవలేకపోవడం. విరోచనాలు 15 రోజులుగా. ఐసియు లోనే ఉన్నాను. ఆకలి వెయ్యదు, నీరసం తగ్గదు. తిన్నా, వంట పట్టదు. సెలైన్లు, రోజూ బ్లడ్ టెస్ట్ లు, మానిటర్ల కుయ్, కుయ్ శబ్దాలతో కాలక్షేపం చేస్తున్నాను.

***

ఒకటి రెండు రోజులు, పగలు, రాత్రి ఒళ్లు తెలియకుండా నిద్ర పోయాను. చాలా కాలం తర్వాత రెస్ట్ దొరికింది అనుకున్నా. మూడవ రోజు నుంచి నా పాట్లు మొదలయ్యాయి. పగలు కునికి పాట్లు పడినా, రాత్రులు అస్సలు నిద్ర పట్టడం లేదు. మొదట్లో మా ఆయనా, కూతురు ఆదుర్దాగా కనిపించినట్టు కనపడినా, టెస్టులు అన్నీ నార్మల్ రావడం వల్ల మెల్లిగా పది రోజులు గడిచేసరికి, వాళ్లకు నా మీద శ్రద్ధ తగ్గింది. నర్సింగ్ హోమ్ పేషెంట్లతో ఇద్దరూ తీరిక లేకుండా ఉన్నారు. నాతో మాట్లాడటం కూడా రౌండ్స్‌కి వచ్చేటప్పుడు చూడడం.

నా కోసం ప్రత్యేకంగా ఒక నర్సును ఉంచారు. దానితో ఎంత సేపని కాలక్షేపం చేయడం? 20 ఏళ్లలో పక్కన మనిషి లేకపోవడం అనేది నాకు తెలియదు. దాదాపు రోజుకు 12 గంటలు హాస్పిటల్. మిగతా టైం ఇల్లు, నిద్ర… జీవితంలో మొట్టమొదటిసారిగా నాకు ఒంటరితనం అంటే ఏమిటో తెలియడం మొదలైంది. గల గలా ఒక గంట సేపు, మాట్లాడుతూ ఉండాలని ఉంది. నా భర్త కూతురుకి అంత తీరిక లేదు. అందులో వాళ్ళ తప్పు కూడా లేదు. ఎందుకంటే, మన సొంత విషయాల కన్నా, పేషెంట్లు- ప్రాక్టీస్ ముఖ్యమని నా అభిప్రాయం. నా అభిప్రాయం ఫాలో అవుతున్నారు. నేనేం చేయలేను. పుస్తకాలు చదివే ఓపిక లేదు. ఎలా? ఎలా? ఈ కాలం గడిచేది ఎలా?.

***

11వ రోజు పక్క బెడ్డు లోకి ఒక కొత్త పేషంట్ వచ్చారు. పర్సనల్ నర్స్ ను అడిగాను. ‘ఏం ఏమైంది?’ అని. లాప్ హిస్టెరెక్టెమీ కేసు. “ఆవిడను పోస్ట్ ఆపరేటివ్ వార్డులో వేయచ్చు కదా? ఇక్కడ ఎందుకు?” అన్నాను.

“మనకు తెలిసిన వాళ్లే!” అంది. “ఆవిడ జిజిహెచ్‌లో నర్సుగా పనిచేసే సంధ్య. కేస్ షీట్ మీద పేరు, వివరాలు చూసి చెప్పింది. వాళ్ళది మా ఊరే. కుటుంబం బాగా తెలిసినదే. కర్టెన్ తీసి చూపించమన్నాను.

“చిన్నమ్మ గారు దెబ్బలాడతారమ్మా” అంది నర్సు. నాకు కోపం నశాళానికి అంటింది. వీళ్ళు ఎంత తొందరగా పార్టీలు మార్చేస్తారు? అనిపించింది దానికి ఉద్యోగం ఇచ్చింది నేను, కానీ ఇప్పుడు నా మాటలను తను లెక్క చేయడం లేదు!

“నోరు మూసుకొని చెప్పింది చెయ్యి” అన్నాను. కర్టెను పక్కకు జరిపింది. ఆ పక్కనున్న పేషంట్ సంధ్య నాకు కనబడింది. చిన్నప్పుడు నా క్లాస్‌మేట్, సంధ్య ….

తెలుగు మాస్టారు ‘ఏ సంధ్యా? తొలి సంధ్యా? మలిసంధ్యా’ అని అడిగేవారు. ఆ మాటలకు సంధ్య బిక్కచచ్చిపోయి ఉండేది. మేము అందరం నవ్వే వాళ్ళం. అంతగా మేమిద్దరం ఆడుకున్న గుర్తు లేదు. నేను పీజీ చేసేటప్పటికి తను స్టాఫ్ నర్స్‌గా పనిచేసేది. ఒకే ఊరు కావడం వల్ల కాసేపు మాట్లాడుకునేవాళ్ళం. నేను ప్రాక్టీస్ మొదలు పెట్టిన తర్వాత అప్పుడప్పుడు కేసులు తీసుకొచ్చేది. నా కూతురి పెళ్లికి కూడా పిలిచినట్టు గుర్తు. వచ్చిందో,లేదో గుర్తు లేదు.

కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో తనని చూడగానే నాకు ఎంతో ఆనందం కలిగింది. కానీ అత్యంత ఆప్తురాలు అనిపించింది. సెడేషన్‌తో సంధ్య ఉంది. కానీ తనకి ఎప్పుడు ఎప్పుడు మెలకువ వస్తుందా అని ఎదురు చూస్తున్నాను.

సంధ్య వచ్చి అప్పుడే రెండు రోజులు అయింది. నాకు కాలక్షేపం బాగానే అవుతోంది. ఇక 5 ఏళ్ళ సర్వీస్ ఉందిట. ఒక ఆడపిల్ల నాకు లాగే. పిల్ల పుట్టిన రెండో సంవత్సరంలో మొగుడు పక్కింటి అమ్మాయితో వెళ్ళిపోయాడు. తానే, స్వంత సంపాదన పైనే ఒక చిన్న ఇల్లు కట్టుకుందట. ఆడపిల్లని చదివించింది. ఆ అమ్మాయి, చదువయాక, ఉద్యోగంలో చేరిన తర్వాత తన కొలీగ్ ని పెళ్లి చేసుకుంది. ఆమెకు రెండేళ్ళ పాప.

ఐసియులోకి ఎవర్నీ అనుమతించరు కాబట్టి, ఆ అమ్మాయి కనపడలేదు. కూతురు, అల్లుడు వచ్చారు. అల్లుడు ఒక రెండు నిమిషాలు ‘అత్తమ్మా!’ అంటూ పలకరించి, బయటకి వెళ్ళిపోయాడు. సంధ్య కూతురు మటుకు, వద్దని చెప్పినా తను స్వయంగా ముద్దలు చేసే సంధ్యకు అన్నం తినిపించింది.

తల్లి మూతి తుడిచి టవల్‌తో అద్ది, మజ్జిగ కలిపి ఇచ్చింది. మంచం సర్ది, దుప్పటి కప్పి నుదుట ముద్దు పెట్టుకొని, వెళ్ళి వస్తానని చెప్పి, నాకు కూడా ‘బై’ చెప్పి వెళ్ళిపోయింది.

ఈ మూడు రోజులు తల్లి, కూతురులను చూసిన తర్వాత నాలో ఏదో తెలియని వెలితి. నా స్నేహితురాలు నాకన్నా సంతోషంగా ఉందనా? లేక పేషెంట్స్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వటం అలవాటై, పుచ్చుకోవడం తెలియని నేను ఇలా బెడ్డు మీద ఉండడం వల్లనా? నా కూతురు నాతో అంత కలివిడిగా లేదనా? ఇలాంటి రకరకాల ఆలోచనలతో మధ్యాహ్నం అంతా అసహనంగా గడిచింది.

కానీ సాయంత్రం రజనీ వచ్చింది. రజినిని చూసి, నా ముఖం వెలిగిపోయింది. రజినీ నా ఇంటర్మీడియట్ క్లాస్మేట్. నా తర్వాత రెండు సంవత్సరాలకు ఎంబిబిఎస్ చేసింది. తర్వాత సర్వీస్ జాయిన్ అయింది. సర్వీస్ లోనే ప్రస్తుతం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సర్జరీ అసోసియేట్ ప్రొఫెసర్‍గా పని చేస్తోంది.

“ఏమిటి? ఇన్ని రోజులు పట్టిందా నన్ను చూడడానికి రావడంలో” అని అడిగాను.

“ఊళ్లో లేనే. పూణే వెళ్లాను. మా అబ్బాయి దగ్గరకి. పొద్దున్నే వచ్చాము. హేమంతి చెప్పింది నీకు బాగా లేదని. హాస్టల్లో పనులు హడావుడిగా చూసుకుని, ఇలా వచ్చాను” అంది రజని.

ఆమె మెడికల్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తోంది.

“ఎలా ఉంది హాస్టల్?” అని అడిగాను.

“ఆ! ఏముంది? మేకప్, లవ్, బ్రేక్ అప్‍లు, సిక్ లీవ్‌లు, మాస్ బంకింగులు” అంటూ నవ్వుతూ, హాస్టల్ విశేషాలు అన్నీ చెపుతూ ఒక గంట ఊదరగొట్టేసింది. తను చెబుతున్నంత సేపూ నేను పడి పడి నవ్వుకున్నాను.

సంధ్య మా సంభాషణ అంతగా పంచుకోలేదు, కానీ నిశ్శబ్దంగా ఎంజాయ్ చేసింది. తన చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషంగా ఉంచగల సామర్థ్యం భగవంతుడు ఏ కొద్దిమందికో ఇస్తాడు. అలాంటి వ్యక్తినీ నా స్నేహితురాలుగా చేసినందుకు భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను .

రాత్రి రౌండ్స్ అయిపోయాయి. భోజనాలు కూడా అయిపోయాయి. మెల్లిగా నిద్రలోకి జారుకునే ప్రయత్నం చేస్తున్నాను. వెల్లకిలా పడుకొని ఉన్నాను.

సీలింగ్ వైపు చూస్తూ, “నువ్వూ ఒంటి చేతితోనే కూతుర్ని పెంచావు, చదివించావు, పెళ్లి చేసావు. నేను కూడా మా ఆయనను జోక్యం చేసుకోనీయకుండా, నా ఇష్ట ప్రకారం గానే, పెంచి, చదివించి, పెళ్లి చేశాను నా కూతురిని. మరి ఎందుకు మా అమ్మాయి నాతో కలివిడిగా ఉండదు?” మూడు రోజుల నుంచి నాలో సుడులు తిరుగుతున్న సందేహం మాటల రూపంలో బయటికి వచ్చింది.

“మాకు అవసరం, మీకు అలంకారం” అంది సంధ్య. పక్కకి తిరిగాను. నిజానికి తాను సమాధానం చెప్పాలని కానీ, తనతో ఆ విషయం చర్చించాలని గాని, నేను అనుకోలేదు.

“ఏమిటి అన్నావు?” అన్నాను అయోమయంగా. అప్పటివరకు ఉన్న దుప్పటి తొలగించుకుని సంధ్య నా వైపుకి సూటిగా చూస్తోంది.

“మా అమ్మమ్మ, మా అమ్మ కూడా కూలీలే. కానీ నేను వాళ్ళ లాగా కాకూడదని నన్ను చదివించారు. నేను కూడా సెలవుల్లో పొలానికి వెళ్ళేదాన్ని. పదోతరగతి తర్వాత నర్సింగ్ అయితే తొందరగా ఉద్యోగం వస్తుందని మీ నాన్నగారు ఇచ్చిన సలహాతో, కాకినాడ వచ్చి చేరాను. ఈ ఉద్యోగం వల్ల మా నాన్న, అమ్మ, అమ్మమ్మలకు కూలి పని చేయనవసరం లేకుండా చేశాను. కానీ నా కూతురు తరం వచ్చేసరికి మహా అయితే ఉండడానికి ఇల్లు ఇవ్వగలిగాను. కానీ చదువుకోకపోతే అది కూడా కూలీకి వెళ్ళవలసిందే. అందుచేత తనకి, సమాజపు తీరుతెన్నులు చూపిస్తూ పెంచాను. నా కూతురు అన్ని అర్థం చేసుకుని, చక్కగా చదువుకుని, స్థిరపడింది. దాని కూతురు కూడా చదువుకుంటే కానీ ఈ స్థిరత్వం మా కుటుంబంలో నిలబడదు.

కానీ, నీ కూతురు విషయంలో అలా కాదు. అవసరం తనకు లేదు. కాన్వెంట్‌లో చేరింది. రోజు స్కూలుకి వెళ్ళడానికి వీడియో గేమ్స్ కొనిచ్చావు. ఇంటర్ నీకు నచ్చిన సెంటర్‌లో చేర్చడానికి తనకి దుబాయ్ ట్రిప్ ఎర వేశావు. కర్ణాటకలో మెడిసిన్ సీటు కొని, రోజు హాస్టల్ నుండి కాలేజీకి వెళ్లడానికి కార్ కొని ఇచ్చావు. మినిమం మార్కులతో పాస్ అయినా యూరప్ ట్రిప్‌కి పంపించావు. పాతికేళ్లకే అన్నీ చూసేస్తే ఇంకా జీవితంలో ఏదైనా సాధించాలనే కోరిక తనకు ఎక్కడ మొదలవుతుంది?”.

నేను నిర్ఘాంతపోయాను.

సంధ్య నవ్వింది చిన్నగా, “నీ చిన్ననాటి స్నేహితురాలివని చనువు తీసుకుంటున్నానుకోకు. నీ గురించే ఆలోచిస్తున్నాను.”

“ఆహాహ! చెప్పు సంధ్యా! నువ్ మాటాడుతూంటే నేను వినవలసినదే ఉంది.”

“ఇక నీ కూతురు. ఆమె ఏదైనా చేద్దాం అంటే నువ్వు సాధించిన గోల్డ్ మెడల్స్, వాటి హై లెవెల్ జీవితాంతం తనను వెక్కిరిస్తూనే ఉంటాయి. కార్పొరేట్ కాలేజీ స్టూడెంట్‌గా తన చుట్టూ ఉన్నవన్నీ తన భర్తతో సహా, తన స్వశక్తితో సాధించుకోలేదే అన్న భావం తనను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. నీ గెలుపు తన గెలుపుగా భావించమంటున్నావు. తనకి ఆడే అవకాశం గానీ, గెలుపు లోని తీయదనాన్ని అనుభవించే అవకాశం గాని నువ్వు ఇవ్వలేదు.. అందుకే అన్నాను. చదువు మాకు అవసరం మీకు అలంకారం. మనకు అవసరమైనది ఎదుటి వారు ఇస్తే, వారి పట్ల మనకు కృతజ్ఞత ఉంటుంది. అదే అలంకరించుకోవడానికైతే మనకు నచ్చిందే మనం అంగీకరించగలం. అంతే గాని ఎవరికో నచ్చినది. మనకు నచ్చాలని రూల్ లేదు కదా? నీ కూతురి కోసం ఏర్పాటు చేసినవన్నీ నీకు నచ్చినవి. తనకు నచ్చినవి కాదు. ఈ విషయం తనలో ఒక స్తబ్ధతను తయారుచేసి ఉండవచ్చు. ఇంత ఆస్తి ఉన్నా, తనకు నచ్చిన జీవితం నీ కూతురికి లేదు. ఇక ముందు పొందే అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు నిర్మించిన చట్రంలో తనని బంధించేసావు. అందుకే నీ కూతురు నీతో అలా పెడసరంగా, ముభావంగా ఉంటుంది.”

సంధ్య ఆపి దీర్ఘ నిశ్వాస విడిచింది.

నేను అలా తనవైపు చూస్తూ ఉండిపోయాను. సంధ్య అలా విపులంగా చెప్పగలదని, చెబుతుందని నేను ఊహించలేదు. జీవితం పట్ల, సమాజం పట్ల తనకు అవగాహన, నిర్దుష్టమైన అభిప్రాయలు ఉంటాయని నేను అనుకోలేదు. విశ్వరూప సందర్శనం అయిన అర్జునుడిలా అయిపోయింది నా పరిస్థితి. మనిషి యొక్క సమాజ స్థాయికి, జ్ఞానానికి సంబంధం లేదని అర్థమైంది. నోటమాట రాక, మెల్లగా పక్క మీదకు వాలిపోయాను.

సంధ్య అటువైపు తిరిగి నిద్రకు ఉపక్రమించింది. నేను ఇంకో వైపు తిరిగాను. చిన్నప్పటినుంచి జరిగినవన్నీ కళ్ల ముందు మెదులుతున్నాయి.

సంధ్య చెప్పిన మాటల్లో నిజాలు నా మెదడులోకి మెల్లిగా ఇంకుతున్నాయి. శభాష్ సంధ్యా! మాష్టారు వెక్కిరించినట్టు, నువ్వు మలిసంధ్యవి కాదే! నీకు, నీ కుటుంబ భవిష్యత్తుకు తొలిసంధ్యవి. రాబోయే నీ కుటుంబ తరాలన్నీ, ముఖ్యంగా ఆడపిల్లలందరూ, నీ పేరు చెప్పుకొని దీపం పెట్టుకోవాలి.

మెల్లగా స్వామివారిని ధ్యానించు కోవడం మొదలుపెట్టాను. స్వామివారిని చూశాను. ఆయన అభయ ముద్రలతో, చిరునవ్వులతో నన్ను చూస్తున్నారు. అది కలో, కలవరింతో, విష్ణుమాయో తెలియదు.

“స్వామీ! చిన్నప్పట్నుంచీ నేను అడిగినవన్నీ నువ్వు నెరవేరుస్తూ ఉంటే నేను నీకు అత్యంత ప్రియమైన భక్తురాలినని గర్వపడ్డాను గాని, నువ్వు నా దురాశకు పరీక్ష పెడుతున్నావు అని అనుకోలేదు స్వామీ! రోజూ వందమంది ఉండాలని కోరుకుంటూ, అన్యాపదేశంగా వంద మందికి రోగాలు రావాలనుకుంటున్నానని తెలుసుకోలేక పోయాను. స్వామీ! నీరసం వచ్చి, మంచం మీద పడితే గాని నిజం తెలుసుకోలేని పరిస్థితి కల్పించావా? స్వామీ!

ఇకముందు నిన్ను ఏ కోరికలు కోరను. నేను దేనికి అర్హురాలినో, అది నాకు ప్రసాదించు. చివరగా ఒక విన్నపం. కనీసం వచ్చే జన్మలోనైనా విజ్ఞానం బదులు జ్ఞానాన్ని, తపన బదులు తృప్తిని, తామసం బదులు ఓర్పునీ, ఈర్ష్య బదులు క్షమ ను, నా భర్త కూతురు ప్రేమను, తోటివారి పట్ల దయను, కోరుకున్నప్పుడు నిద్రని నాకు ప్రసాదించు స్వామీ!”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here