విప్లవ తేజం.. కుమ్రం భీమ్

1
6

[కుమ్రం భీమ్ 82వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ వ్యాసం అందిస్తున్నారు శ్రీ రాథోడ్ శ్రావణ్]

భీమ్ ఉద్యమ స్ఫూర్తి
తెలుగు రాష్ట్రాల్లో కీర్తి
జల్ జంగల్ జమీన్ కై
పోరాడిన గిరి మూర్తి
వారెవ్వా! గోండుల ఆరాధ్యదైవం..!
నిజాం నవాబు పై గెరిల్లా పోరాటం..!!

[dropcap]కు[/dropcap]మ్రం భీమ్ అంటే మహావీరుడు. అతనికి భయం ఏ మాత్రం లేదు. నిజాం నవాబులను మూడు చెరువుల నీళ్ళు తాపించిన అడవి బిడ్డ. తుపాకీ గుండ్లకు ఎదురు నిలిచి పోరాడిన పోరాట యోధుడు. నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య తిరుగుబాటు చేసిన యుద్ధ నిపుణుడు. జల్, జంగల్, జమీన్ కోసం నిజాం నవాబును ఎదురించిన ధైర్యశాలి. అతడి గెరిల్లా పోరాటాలను చూసి హడలి పోయినది నిజాం ప్రభుత్వం. ఈ ఆదివాసీ పోరు గడ్డను దాస్య శృంఖలాల నుండి విముక్తి చేసి అమరుడైన ఆదివాసీ ఉద్యమాల సూర్యుడు కుమ్రం భీమ్.

20వ శతాబ్ద కాలంలో తెలంగాణ పూర్తిగా అంధకారంలో ఉంది. నిజాం రాచరిక పాలనలో తెలంగాణ మొత్తం చిన్నాభిన్నమై దోపిడీ, వెట్టిచాకిరి, భూస్వామ్య వ్యవస్థ, పటేల్ పట్వారీ వ్యవస్థ, రజాకార్లు అరాచకాలను సృష్టించడం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, ఆకలి కేకలు, వైద్య సౌకర్యాలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో పిట్టలా రాలిపోతున్న జనం. ఒకవైపు దేశంలో ఇతర ప్రాంతాలలో మహాత్మా గాంధీజీ నాయకత్వంలో స్వాతంత్ర్యం కోసం జాతీయ ఉద్యమాలు కొనసాగుతున్నాయి. మరోవైపు వర్గ, ఆర్థిక, సామాజిక తారతమ్యం లేకుండా శ్రామికులు కోసం నడుస్తున్న కమ్యూనిస్టు ఉద్యమం. ఈ క్రమంలో హైదరాబాదు యందు నిజామ్ నవాబు ప్రభుత్వం నల్ల చట్టాలను అమలు చేసింది. తెలంగాణ అమాయక ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్ర్యం వారి హక్కులను హరించే విధంగా ప్రయత్నం కొనసాగుతోంది.

1928 సంవత్సరం నుండి 1940 సంవత్సరం వరకు జోడేన్ ఘాట్ కేంద్ర బిందువుగా భీమ్ పోరాటం జరిగింది. ఆదివాసులు, రజాకార్ల మధ్య సుమారు మూడు, నాల్గు నెలల పాటు సాయుధ పోరాటాలు ఏకధాటిగా కొనసాగింది. రజాకార్లు తుపాకులు, మందుగుండు సామగ్రి, బాంబులు, కత్తులు, జంబువాలతో జోడేన్ ఘాట్ గుట్ట అడవుల్లో గుర్రాలపై స్వారీ చేస్తూ దాడికి పాల్పడ్డేవారు. ఆసిఫాబాద్ జిల్లా కెరామెరి మండలంలోని జోడేన్ ఘాట్ గుట్ట పై కుమ్రం భీమ్ నాయకత్వంలో గెరిల్లా పోరాటంలో దాదాపు ఐదు వందల మంది ఉద్యమకారులు పాల్గొని రహస్య సమావేశం నిర్వహిస్తున్నట్లు నిజం ప్రభుత్వ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉద్యమ వెలుగులోకి వచ్చిన వారు కుమ్రం భీమ్.

తెలంగాణ రాష్ట్రంలో ఆసిఫాబాద్ జిల్లా కెరామెరి మండలంలోని సంకేపల్లి గూడెంలో 22 అక్టోబర్ 1901లో శ్రీమతి/శ్రీ కుమ్రం చిన్నూ, సోంబాయి గోండు గిరిజన దంపతులకు కుమ్రం భీమ్ జన్మించారు. భీమ్ పదిహేడు సంవత్సరాల వయస్సులో తండ్రి కుమ్రం చిన్నూను అటవీ అధికారులు, సిబ్బంది జరిపిన దాడులలో తండ్రిని కోల్పోవడంతో భీమ్ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. చేసేదేమీలేక బతుకుతెరువు కోసం వీరి కుటుంబం అచ్చటి నుండి కెరామెరి మండలంలోని సుర్ధాపూర్ గ్రామానికి వలస వెళ్ళిపోయింది. సుర్ధాపూర్ గ్రామంలో ఆదివాసులు సాగుచేస్తున్న భూమిని జమీందారు సిద్ధిఖీ ఆక్రమించుకుని అచ్చటి నుండి వెళ్ళగొట్టే ప్రయత్నం ప్రారంభించారు. ఇది గమనించిన కుమ్రం భీమ్ జమిందార్ సిద్ధిఖీ పై కక్ష పెంచుకొని అతనిని ఏవిధంగా నైనా హతమార్చాలని ఉద్దేశంతో ఒక ఉపాయం పన్ని శిక్షణ కోసం అస్సాం వెళ్ళిపోయాడు. అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతాల్లో కాఫీ, తేయాకు ఎక్కువగా పండించే తోటలో పని చేస్తూ శిక్షణ తీసుకొని ఐదు సంవత్సరాల తర్వాత తన సొంతూరు కెరామెరి గుట్టకు చేరుకున్నారు. అప్పటికే భీమ్ వయస్సు ఇరువై ఐదు సంవత్సరాలు. నిజాం పాలనలో అటవీ అధికారులు గిరిజనులు సాగు చేస్తున్న భూములను వారు పండించిన పంటలను స్వాదీనం చేసుకుని గ్రామాల్లోని వారి గుడిసెలను నిప్పు పెట్టి తగులబెట్టేవారు. ఆదివాసులను హింసిస్తూ, చిత్ర హింసలకు గురి చేస్తూ, దౌర్జన్యాలు చేసేవారు. వీరి అత్యాచారాలు, అరాచకాలు, పైశాచిక ఆనందాన్ని సహించలేక సాగు భూములను దక్కించుకోవడానికి జోడేన్ ఘూట్ లోని చుట్టు ఉండే పన్నేండు గ్రామాలైన బాబేఝరి, పట్నాపూర్, బలాన్ పూర్, సుర్ధాపూర్, గుండిగూడ, డేమ్మడిగూడ, భీమన్ గొంది, కోపన్ గూడ, టోకేన్ మోవాడ్, కోరియన్ మోవాడ్, తోరియన్ మోవాడ్, మురికి లంక మొదలగు గూడాలకు చెందిన ఆదివాసులు సంఘటితమై భీమ్ నాయకత్వంలో గెరిల్లా పోరాటాలకు సంబంధించిన శిక్షణ కార్యక్రమానికి హాజరై ఎదురుదాడులకు సంసిద్ధులయ్యారు.

భీమ్ నాయకత్వంలో పోరు గడ్డ జోడేన్ ఘాట్‌లో నిజాం సైనికులపై ఆదివాసులు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటులో చాలా ప్రాణనష్టం సంభవించింది.

భీమ్ తప్పించుకున్నాడు. జనకాపూర్, ఆసిఫాబాద్ తహశీల్దార్ ఆధ్వర్యంలో జోడేన్ ఘాట్ గుట్టకు చేరుకున్న నిజాం సైనిక బృందాలు జోడేన్ ఘాట్ అడవి చూట్టు ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా భీమ్ ఆచూకి లభించలేదు. భీమ్ ప్రాణ స్నేహితుడు కుమ్రం సూరును నిజాం సైనికులు భీమ్ ఆచూకి కోసం తుపాకితో కాల్చుతామని బెదిరించారు. అయినా ఫలితం దక్కలేదు. మడావి కొద్దును నిజాం సైనికులు పట్టుకొని ధనసంపదకు ఆశ పెట్టడంతో చివరికి లొంగిపోయి మడావి కొద్దు పటేల్ భీమ్ రహస్య ప్రదేశాన్ని చూపించడంతో నిజాం సైనికులు భీమ్ స్థావరాన్ని చుట్టుమూట్టారు. నిజాం సైనికుల చేతుల్లో అడవి పులి 22 అక్టోబర్ 1940లో ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి రోజున వీర మరణం పొందారు. అప్పటి నుండి ఆదివాసులు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పోరుగడ్డ జోడేన్ ఘాట్‌లో భీమ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భీమ్ వర్ధంతిని పండుగ వాతావరణంలో ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు, ఉట్టిపడేలా ప్రభుత్వ ఆధీనంలో అధికారికంగా జోడేన్ ఘాట్ గుట్టకు చేరుకోని మన్యం వీరుని సమాధి వద్ద ఘన నివాళులు అర్పిస్తూ వస్తున్నారు.

అచట సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి గారి ఆధ్వర్యంలో అధికారికంగా ప్రత్యేక దర్భారు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ, ఆదివాసి ప్రజల సమస్యలపై వినతి పత్రాలను అధికారులు, ప్రజాప్రతినిధులు స్వీకరించడం, సమస్యల పరిష్కారం మార్గాలను అన్వేషించే దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు హామీలు ఇవ్వడం, పోడు భూముల సమస్యలపై చర్చించడం, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలకు భోజన, నీటి వసతి ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని ముగించడం ప్రతి సంవత్సరం జరుగుతుంది.

కుమ్రం భీమ్ మరణానంతరం ఆదిలాబాదు ఉమ్మడి జిల్లాలో ఆదివాసుల స్థితిగతులను, వారి సమస్యలు, అప్పటి పరిస్థితులకు అధ్యాయనము చేయడానికి మానవ పరిణామ శాస్త్రవేత్త అయిన ప్రొ. క్రిస్టోఫర్ హైమాన్ డార్ఫను ప్రత్యేక అధికారిగా అప్పటి బ్రిటీషు ఇండియా ప్రభుత్వ నియమించింది. ఆయన కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలంలోని మార్లవాయి గ్రామంలో నివాసం ఏర్పరుచుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటా తిరిగి వారి స్థితిగతులను పరిశీలించి ఆధ్యయనం చేసి నివేదికను అప్పటి ప్రభుత్వాలకు సమర్పించేవారు. వీరి కృషి ఫలితంగా 1975లో ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా ఉట్నూరు కేంద్రంగా సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థను స్థాపించారు. ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయాలలో లీనమైన హైమన్ డార్ఫ దంపతులను ఆదివాసులు దేవునిగా భావించి వారి జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు.

2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడ అనే గ్రామంలో కుమ్రం భీమ్ ప్రాజెక్టును నిర్మించింది.

2016లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసిఫాబాదును కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాగా ఏర్పాటు చేసి భీమ్ అసువులు బాసిన జోడేన్ ఘాట్ గ్రామంలో భీమ్ గౌరవార్ధం 25 కోట్ల వ్యయంతో ఒక మ్యూజియంను ప్రారంభించి భీమ్ స్మారక చిహ్నాన్ని రూపొందించి గౌరవించింది.

(వ్యాసకర్త: ఉపన్యాసకులు, పూర్వ అధ్యక్షులు ఉట్నూరు సాహితీ వేదిక, ఉట్నూరు, ఆదిలాబాద్, తెలంగాణ 504311)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here