విరంచి రచించని రోజు

1
10

[box type=’note’ fontsize=’16’] సంచిక నిర్వహించిన హాస్యకథల పోటీకి అందె మహేశ్వరి పంపిన హాస్యకథ “విరంచి రచించని రోజు”. “ఇక నా వల్ల కాదు. ఇక సహించలేను, నేను టిప్పుసుల్తాను సైన్యంలో చేరి గాంధీతో యుద్ధం చేయిస్తా” అని విరంచి పెద్దగా పిచ్చి పట్టినవాడిలా, కేకలేస్తుంటే అసలేం జరిగిందో చెప్తున్నారు రచయిత్రి. [/box]

[dropcap]త[/dropcap]న తలరాతను తానే రాసుకోవాలనే తపనతో విరంచికి ఆ నామకరణం చేశారు రంగాచార్యులు. పేరు వెనక ఉన్న తపనని బాగా వంటపట్టించుకుని వడ్డించే పనిలో.. అదేనండి, నెరవేర్చే పనిలో ఉంటాడు మన విరంచి. మాములుగా అయితే మనలాంటి వాళ్ళు కలల్ని సాకారం చేసుకునే ప్రయత్నంలో ఉంటాము.. కాని విరంచి, ఏమి కలలు రావాలో కూడా తనే నిర్ణయించుకుని మరీ కలలు కనేవాడు. అలాంటి వాడికి, తనేం కావాలో, తనకేం కావాలో నెరవర్చుకోడం పెద్ద పని కాదు. చదువు బాగా చదివేసి, డాక్టరేటు పట్టా అమెరికాలో పుచ్చేసుకుని, పెద్ద అంకెల్లో జీతం పుచ్చేసుకుంటూ, విదేశంలో కారు, చుట్టూ కొలను ఉన్న ప్రదేశంలో బంగళా కట్టేసుకుని సుఖంగా ఉన్నాడు. సమాజంలో జనవాహిని పోరో, ఇంట్లో వాళ్ళ జోరో తెలియదు కాని విరంచికి పెళ్ళి మీద మనసయింది. వాళ్ళ అమ్మలా మంచి నేర్పు, ఓర్పు ఉన్న అమ్మాయిని గాలం.. కాదు కాదు.. వల వేసి మరీ వెతికేసుకుని వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఎన్నో వలలు ఎలుకలు కొరికేయగా.. ఒకానొక వలలో.. తొలిచూపులో తన్మయత్వం, మలిచూపులో మైమరపుతనం కలిగి మొత్తానికి విరంచికి తెలుగు అక్షరాల్లా పొందికగా, అందంగా ఉండే అమ్మాయి కనిపించగా, తన వేటకు విరమ చిహ్నం పెట్టాడు. అలా పెట్టించిన ఆ అమ్మాయి పేరు కూడా అక్షర.

ఫాస్ట్ ట్రాక్ యుగంలో అంతకన్న వేగంగా పెళ్ళిచేసుకుని, దేశం కాని దేశంలో, ‘మేరా భారత్ మహాన్ ‘అని పాడుకుంటూ అక్షర ప్రవేశం అదేనండి కొత్త పెళ్ళంతో, అమెరికా ప్రవేశం చేశాడు. వాళ్ళిద్దరూ, ఒకరికోసం ఒకరు పుట్టారా? అని ప్రజలకు కళ్ళుకుట్టేంత అందంగా, ఆనందంగా కాలంలో సంబంధం లేకుండా కాలం గడుపుతున్నారు. అసలు ఇంత సవ్యంగా జరిగే విరంచి జీవితపు పుస్తకంలో తాను రాయని రోజు ఏంటి? ఇంకెంతసేపాగి చెప్తావు అని నా మీద అక్షింతలు వేయకండి. చెప్పేస్తాను. అలా వాళ్ళిద్దరు మేఘము నంబరు 9లో ఇంకో 1 రోజులో 1 సంవత్సరకాలం ఉన్నారనగా.. సూర్యుడు అప్పుడే తూర్పు దిక్కులో దుప్పటి తీసి నిద్రలేచి చూస్తుండగా సమయం 6 గంటలయింది. అక్షర కెవ్వుమని కేకపెట్టి విరంచికి నిద్రాభంగం కలిగించింది. ఏమైందో అని ఊ కొడుతూ లేచిన విరంచికీ నిజంగానే ఉలిక్కిపడాల్సిన పరిస్థితి.

తమ శయన మందిరం నిండా బోలుడు మంది జనాభా.. తెల్లతోలు వాళ్ళు కాదండోయ్.. మనవాళ్ళే.. కళ్ళు ఇంకొసారి బాగా నలిపి, మళ్ళీ తెరచి చూశాడు. కానీ పరిస్థితేమి మారలేదు. దాదాపు ఒక 10మంది. తమకి తెలిసిన మొహాలు లేకపోవడంతో భార్యాభర్తలిద్దరూ కాసేపు నిశ్చేష్టులై నిలబడిపోయారు. పోనీ మీరెవరు అని ఎవరినైనా అడుగుదామా అంటే.. భయంకరమైన గురకల హోరు తప్ప వీళ్ళని పట్టించుకున్నవాళ్ళెవరూ లేరు. సరే మెల్లగా అందరినీ దాటుకుని మెట్లు దిగుతుంటే మెట్టుకి ఒకరి చొప్పున మళ్ళా మనుషులు. కాసేపు.. ఇది వాళ్ళ ఇల్లేనా అనిపించింది ఇద్దరికీ. లివింగ్ రూమ్ లోకి అడుగుపెడితే కానీ, వాళ్ళకి ఏమి జరుగిందో అర్థం కాలేదు. వాళ్ళకి తెలిసిన మొహాలు కనిపించాయి. వాళ్ళిద్దరి బాబయిలు, పిన్నులు, అత్తలు, మామలు ఒకరేమిటి.. అటు శంకరమంచి వారు, ఇటు తంగిరాల వారు పోటాపోటీగా వేంచేసినట్లున్నారు. అంత మందిని ఒకేసారి చూసిన విరంచి, అక్షరలకు ఒక్క నిమిషం గుండె కొట్టుకోవడం ఆగిపోతుందా అనిపించింది. అందరిని కుశలు ప్రశ్నలు, సమాధానాలు అయ్యాక పట్టపగలు జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో దాగుడుమూతలు ఆడేవాళ్ళలా ఇద్దరు అందరిని దాటుకుంటూ గృహ ముఖద్వారం దగ్గరకి రాగానే మెల్లగా సంధ్య మంత్రాలు వినిపించసాగాయి. అదేదో ఎవరి Mobileలో నుండి వస్తుంది అనుకున్నారు. కానీ ఆ ముఖద్వారం తీసిన తర్వాత కాని తెలియలేదు.. అసలు విషయం ఏమిటో.. తమ తండ్రులు పొద్దున్నే సంధ్య వార్చుకుంటున్నారు. అది కూడా ఎదురుగా ఉన్న చిన్న కొలనులో.. వాళ్ళ మంత్రాల హోరుకీ, జోరుగా ఆడే బాతులు, కొంగలు ఇత్యాది జలపక్షులన్నియూ, కడు భయముతో వణుకుచూ కనిపించినవి. రంగాచార్యులని, వారి వియ్యంకులైన శ్రీనివాసాచార్యులని ఇద్దరిని ఆ కొలను బయటనుండి తీసుకురావడానికి ఆ దంపతులిద్దరూ పెద్ద తపస్సు చేయవలసి వచ్చింది. ఈలోపు వంట గదిలో మడి బట్టలతో కనిపించారు మాతృదేవులు. అప్పటికే వంటగదిలో ఇంగువ వాసన ఇల్లంతా పట్టేసింది. కాఫీలు, అల్పాహారాలు అయ్యక కాని, వాళ్ళెవరూ నోరు మెదిపేలా లేరు. ఈలోపు వీళ్ళిద్దరి గుండెలు అరణ్యంలో దారితప్పిన కుందేలు పిల్లలు సింహం నోటికి చిక్కితే ఎంత వేగంగా కొట్టుకుంటాయో అంతకు రెట్టింపు వేగంతో కొట్టుకుంటున్నాయి. నువ్వు అడుగు అంటే నువ్వు అడుగు అంటూ సంతలోలాగా వంతులేసుకుని, చివరికి విరంచి పిత్రుదేవులని ‘అసలు రాత్రి వేసిన తాళాలు వేసినవి వేసినట్లే ఉన్నాయి. వీళ్ళందరూ లోపలకి ఎలా వచ్చారు. అసలు ఇంతమంది అమెరికాకు ఎలా వచ్చారు. వీసాలు గట్రాలు (టిక్కెట్లు) కావాలి కదా. ఇవన్ని మాకు తెలియకుండా మీరెలా చేసుకున్నారు?’ అని గుక్కతిప్పుకోకుండా ప్రశ్నల వర్షం కురిపిస్తుండగా, విరంచి వాళ్ళ నాన్నగారు ఆ వర్షానికి గొడుగు పట్టినట్లు, సమాధానం ఇవ్వడానికి ఉద్యుక్తులైనారు.

“మీ అమ్మకీ మూడుమాసాల క్రితం ఒక దివ్యమైన ఆలోచన వచ్చిందిరా.. విరంచికి పెళ్ళై ఒక సంవత్సరం కావస్తుంది. మనం సకుంటుంబ, సబంధు సమేతంగా అమెరికా వెళ్ళి కొన్ని రోజులు ఉంటే వాళ్ళెంత సంతోషిస్తారు. ఇంతకన్నా గొప్ప బహుమతి ప్రపంచంలో మరే తల్లిదండ్రులు ఇవ్వలేరండి అని చెప్పింది.. వినడానికి బహుదివ్యంగా ఉన్నా, ఇదసలు సాధ్యమయ్యే విషయమేనా అని అలోచనలో పడ్డనురా.. అలా అలోచిస్తూ అక్షర వాళ్ళ నాన్నగారికి ఫోను చేసి మాట్లాడాను. అల్లుడిగారికి తెలియకుండా వెళ్ళాలంటే, వాళ్ళ స్నేహితులెవరైనా సాయం చేస్తే పనైపోతుంది అని సలహా ఇచ్చారు. వెంటనే మీ స్నేహితుడు సన్నీకి ఫోన్ చేస్తే, వీసాకి కావల్సిన కాగితాలు పంపిస్తా అన్నాడు. కానీ, మేము దాదాపు 35 మందిమి వస్తున్నాం అనగానే, వెంటనే కట్ చేశాడు. ఏమైందో అనుకుని ఇది అవ్వని పనిలే వదిలేశాను. కానీ మళ్ళీ వాడే 2 రోజుల తర్వాత ఫోన్ చేసి సారీ అంకుల్, మొన్న మీరు చెప్పింది విన్నాక వెంటనే స్పృహ కోల్పోయాను. తేరుకోడానికి 2రోజులు పట్టింది. ఇవాళే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు అని చెప్పి ఒక ట్రావెల్ ఏజంట్ ఫోను నంబరు ఇచ్చాడు. ఇంకేముంది, మొత్తానికి అందరికీ టూరిస్ట్ వీసాలు ఏర్పాటు చేశారు.  సన్నీ విమనాశ్రయానికి వచ్చి మమ్మల్ని తీసుకొచ్చాడు, మీ ఇంటి అదనపు తాళాలు వాడి దగ్గర ఉన్నాయని ఇచ్చి, మా అందరిని దించి వెళ్ళాడు.”

ఇదంతా విని విరంచి కరెంటు తీగ మీద షాకు కొట్టిన కాకిలా మాడిపోయాడు. “వస్తే గిస్తే మీరు, అమ్మ, అత్తయ్య, మామయ్య రావాలి గానీ.. ఈ వానరసైన్యంలో దిగారు. పడక గదిలో ఉన్న వాళ్ళలో కనీసం మాకు ముఖ పరిచయం అయినా లేదే అని వాపోయాడు.

“ఏడ్చావులేరా! వాళ్ళందరూ నీకు తెలియకపోయినా వాళ్ళందిరికి మీరు సుపరిచితులే. చిన్నప్పటి నుండి యే పూజా కార్యక్రమం అయినా వాళ్ళ చేతులమీదుగా జరగల్సిందే. వీలయితే రేపు మీ ఇద్దరూ హోమం చేద్దురుగాని. తగిన ఏర్పాట్లకి నువ్వేం హైరానా పడక్కర్లేదు. మేమే చూసుకుంటాం. ఎంత సేపు చుట్టేస్తాం ఊరిని” అని ముగించే లోపు, “నాన్నగారూ ఇవన్నీ ఇక్కడ కుదరవు మేము ఇక్కడ ధూపం కూడా వేయము. స్మోక్ డిటెక్టర్లు ఉంటాయని.. అలాంటిది మీరు యజ్ఞాలు, హోమాలు అంటే ఇంక నేను దేశద్రోహం నేరం క్రింద అమెరికాలో జైల్లో ఉండాల్సిందే!” అని తన గోడు వెళ్ళబోసుకుని మౌనం వహించాడు.

“ఇహ ఇలా అయితే ఇక్కడకి ఇంతమంది పురోహితుల్ని తీసుకుని వచ్చి సప్తసముద్రాలు దాటించిన పాపం నాకు అంటగట్టేశావు” అని రంగచార్యులు కోప్పడుతుంటే, ఈలోపు శ్రీనివాసాచార్యులు మధ్యే మార్గంగా ఒక ఉపాయం ఆలోచించి, “రేపు హోమం చేద్దాం, కాని అగ్నిహోత్రం లేకుండా, మానసికంగా మంత్రాలతో..” అంటే ఉభయులూ అతికష్టంగా తమ అంగీకారాన్ని తెలిపారు. ఇదిలా ఉండగా అప్పుడే నిద్ర లేచిన పురోహితులు, కొలనులో దూకేసి, సంధ్యలు వార్చేసుకుని అక్కడ మడి వస్త్రాలన్ని శుభ్రంగా సబ్బు పెట్టేసి ఉతకగా, ఆ నురగ అంతా కొలనులో పట్టేసి, నీళ్ళూ కాస్తా మంచులా కనిపిస్తుంది దూరం నుండి చుస్తే.. ముఖద్వారనికి అడ్డంగా తీగలు కట్టేసి, వాటి మీద ఆ ఉతికిన మడి వస్త్రాలన్నీ ఆరబెట్టేశారు. దాంతో పాటు పది ఊళ్ళు వినిపించేలా లలిత, విష్ణు సహస్త్ర నామ పారాయణాలు. ఇవన్ని చూస్తూ ఉండబట్టలేక వాళ్ళని వారించబోయిన ఆ విరంచి, అక్షరలకు తిరస్కారం తప్ప వేరే యోగం పట్టలేదు. ఈలోపు చుట్టుపక్కల వాళ్ళెవరో విరంచి ఇంట్లో జరిగే సందడిని అర్థం చేసుకోలేని వాళ్ళై, ఇక్కడేదో ఘోరం జరుగుతుందన్నట్లుగా 911 (రక్షక భటుల)కి ఫోను చేస్తే, వాళ్ళకి సర్దిచెప్పేసరికి విరంచికి చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలు బయటకి కక్కెంతపని అయింది. ఈ మగవాళ్ళలో విరంచి ఇలా వేగుతుంటే, వంటగదిలో, ఆడవాళ్ళలో అక్షరకి పాత్రలో కాకుండా పొయ్యిలో కూర్చుని మొగ్గజొన్న పొత్తులు వేపుతున్నట్లుంది. ఆ పొయ్యిలు మన భారతంలో లాగా కాదు కదా.. పాలు పొంగించేసి, దాని మీద రకరకల వంటలు చేయడంలో, ఇంట్లో ఒకటేమిటి, అన్ని వాసనలు కలిసి, అవి పీల్చడం, నరకంలో వేసే శిక్షల్లో ఒకటిగా అనుభవించాల్సి వచ్చింది. విరంచి “ఇక నా వల్ల కాదు. ఇక సహించలేను, నేను టిప్పుసుల్తాను సైన్యంలో చేరి గాంధీతో యుద్ధం చేయిస్తా” అని పెద్దగా పిచ్చి పట్టినవాడిలా, కేకలేస్తుంటే అప్పుడే ఒక చెయ్యి మొహం మీద పడి.. “ఏమైంది. విరంచి” అని అక్షర గొంతు వినిపించింది.

అప్పుడు కానీ, విరంచికి తాను కల కంటున్నాడని అర్థం కాలేదు. వెంటనే కళ్ళు తెరిచి చూస్తే అంత మామూలుగా ఉంది. వెంటనే ఇంటికి ఫోను చేసి అందరు అక్కడే ఉన్నారని నిర్ధారణ చేసుకున్నాక, తన కలని అక్షరకి చెప్తే అక్షర పగలబడి నవ్వింది. అలా నవ్వులతో వాళ్ళ మొదటి పెళ్ళిరోజు ఆనందంగా మొదలయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here