విరోధాభాస – పుస్తక పరిచయం

4
10

[dropcap]ప్ర[/dropcap]ముఖ రచయిత్రి ఝాన్సీ కొప్పిశెట్టి రచించిన ‘విరోధాభాస’ నవలా పరిచయం ఇది. రచయిత్రి రెండవ నవల ఇది.

♣♣♣

“ఇది ప్రస్తుత కథ. మనుషుల అనుబంధాల్లో, ముఖ్యంగా స్త్రీపురుషుల అనుబంధాల్లో వచ్చిన మార్పులను, ఉండవలసిన విలువలను చర్చించే నవల. అమెరికా నేపథ్యంగా నడుస్తూ, రొమాంటిక్  నవలా సంప్రదాయానికి చెందిన ఈ నవలలో వాస్తవికతా ఉంది; ఆదర్శమూ ఉంది. ఇటీవల తెలుగులో ఎక్కువగా వస్తున్న విభిన్న ప్రాంతాల, అస్తిత్వాల, చారిత్రక నేపథ్యాల, భిన్న వర్గ జీవితాల నవలలతో పోలిస్తే, ఇది పాతకాలం నవల కోవకే చెందుతుందని చెప్పాల్సి వుంటుంది. అయితే ప్రేమ, కుటుంబం – ఈ రెండు విషయాలూ ఎప్పటికీ కాలం చెల్లనివే. అన్ని కాలాలలోనూ పాఠకుడికి ఆసక్తి కలిగించేవే.

~ ~

ఒక్కో మనిషిలోని బలహీనత వల్ల అతని చుట్టూ ఉన్న ఎన్ని జీవితాలు ఎలా ప్రభావితమయ్యాయో, ఏ దేశంలో ఉన్నా కుటుంబ వ్యవస్థ పటిష్టతపై అచంచల విశ్వాసం ఉన్న భారతీయ సమాజంలో దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత మంచితనాన్ని కలిగి ఉండాలో ఈ నవల చెబుతుంది.

~ ~

ఈ నవలలో అన్నిటికంటే ఆకర్షణీయమైనది రచయిత్రి కథనం, భాష, శైలి. ఏకబిగిన చదివించే గుణం ఉన్న నవల ఇది. ఇటీవలి కాలంలో ‘బరువైన’ నవలలు వచ్చినంతంగా, కథనంతో పాఠకుడిని లాక్కుపోగల రచనలు రావడం లేదు. ‘పఠనీయత’ విషయంలో ఈ నవల పూర్తిగా సఫలమయింది” అని పేర్కొన్నారు డా. సి. మృణాళిని తమ ముందుమాట ‘వాస్తవికత ఆదర్శాల ప్రస్తుత కథ’లో.

♣♣♣

“ఝాన్సీ కొప్పిశెట్టి రచనలు అన్నీ స్త్రీ కేంద్రకంగానే ఉంటాయి. అలాగని సిద్ధాంత రాద్ధాంతాల జోలికి వెళ్ళవు. ఉన్న జీవితాన్ని నిరలంకారంగా యథాతథంగా బొమ్మ కట్టి చూపుతాయి. కార్యాకారణ సంబంధాల విశ్లేషణకు కానీ, గతి తార్కిక, అద్వైత, ఆధ్యాత్మిక భావ సంచయాల వైపు కాని వెళ్ళవు. మానవ జీవితం ఏ అంచనాలకీ అందకుండా ఎలాగైతే స్వయం జ్వలితంగా ఉంటుందో, ఝాన్సీ కొప్పిశెట్టి పాత్రలన్నీ స్వయం జ్వలితంగా ఉంటాయి. అవటానికి అవి రచయిత సృష్టించిన పాత్రలే అయినప్పటికీ, అ పాత్రలేవీ రచయిత నియంత్రణలో ఉండవు. నవలలో ఇదొక సుగుణం.

~ ~

నిజానికి ఈ నవల ఒక భౌతిక ప్రపంచంలో నుండి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి, ఒక మెటీరియలిస్టిక్ వరల్డ్ నుంచి ఒక స్పిరిట్యుయల్ వరల్డ్ లోకి చేసిన ప్రయాణం. ఈ నవల చదవడం మంచి అనుభవం. ఈ నవలలోకి ప్రవేశించండి. మిమ్మల్ని మీరు మరచిపోతారు.” అని ‘భౌతిక ప్రపంచం నుండి ఆధ్యాత్మిక ప్రపంచం లోకి…!’ అనే తమ ముందుమాటలో వ్యాఖ్యానించారు వంశీకృష్ణ.

♣♣♣

“ప్రేమని కోరుకోని వారు ఎవరూ ఈ లోకంలో ఉండరు. ప్రేమని ఆశించి, లేదా ప్రేమించి విఫలమవ్వొచ్చు. కానీ ప్రేమించకుండా ఉండలేరు. ప్రేమించడం మానవస్వభావంలో అంతర్భాగం. స్థలకాలాలు మారొచ్చు, వ్యక్తులూ మారొచ్చు… అయినా ప్రేమ అంతరాంతరాల్లో పాదుకొని వెల్లువలా వ్యక్తమవుతుంది. దానికి సరయిన దిశానిర్దేశం, ఆలంబన లేకపోతే వ్యర్థమవుతుంది. ఈ నిరపేక్ష సత్యాన్ని ‘విరోధాభాస’ నవలలో అందంగా, ఆర్థంగా దృశ్యమానం చేశారు రచయిత్రి ఝాన్సీ కొప్పిశెట్టి” అన్నారు గుడిపాటి తమ అభిప్రాయంలో.

♣♣♣

విరోధాభాస (నవల)
రచన: ఝాన్సీ కొప్పిశెట్టి
ప్రచురణ: పాలపిట్ట బుక్స్,
పుటలు: 164
వెల: ₹ 150
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
పాలపిట్ట బుక్స్, ఫ్లాట్ నెం. 2, బ్లాక్ 6
ఎం.ఐ.జి-II, ఎపిహెచ్‌బి.
బాగ్ లింగంపల్లి, హైదరాబాద్ 500044
ఫోన్: 040-27678430

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here