విషాద యశోద-4

0
14

[‘పద్య కళాప్రవీణ’, ‘కవి దిగ్గజ’ ఆచార్య ఫణీంద్ర రచించిన ‘విషాద యశోద’ అనే పద్యకావ్యాన్ని అందిస్తున్నాము.]

తే.గీ.
అవునొ? .. అదియెల్ల నిజమొ? మే మసలు తల్లి
దండ్రులమె కామొ! “దేవకి తల్లియు, వసు
దేవుడే తండ్రి”గా నెంచి, దీనుల మము
విస్మరించితివో నాదు ప్రియ కుమార! (26)

ఉ.
నాకును నీకునున్ నడుమ నాటుక పోయిన ప్రేమ పాశమే
ఆకును చెట్టు కొమ్మ కొస యందున నుండియు త్రెంపినట్లుగాన్ –
మేకును కుడ్యమందు విరమించుట కోసము పీకినట్లుగాన్ –
నీ కనిపించునా తనయ? నేనటులన్ తలపోయజాలరా! (27)

కం.
కుందితి నే నెంతగ పసి
కందగు నిను నాడు నాదు కరములలో నుం
డందుకొని పోయి పూతన
మ్రందించగ జూచినపుడు – మరచితి వేమో!/ (28)

కం.
శకటంబై యసురుం డొక
డొకపరి నీ పైకి వేగ మురుకగ, కని నే
కకవికలైనట్టి విషయ
మొక కొంతైన మదిని గురుతున్నదొ నీకున్? ( 29)

కం.
అత్తకు కోడలికి నడుమ
జుత్తులు ముడివైచి, వెన్న జుర్రెద వని – దు
మ్మెత్తుచు పొరుగిళ్ళ సతులు
వత్తురు చాడీలు జెప్ప, వారిని బంపన్ – (30)

ఉ.
“అల్లరి జేతువే?” యనుచు నాగ్రహమున్ నటియించి నేను నిన్
మెల్లగ కొట్ట రాగ, నను మించు రయంబున పర్గులెత్తి, న
న్నిల్లు నదెల్ల ద్రిప్పుచును నెంతకు జిక్కక – నీరసంబుతో
నుల్లము చేతబట్టి నిలుచుండెడి నన్నపు డల్లుకొంటివో! (31)

కం.
రోలుకు బంధింపగ, నా
రోలునె నీవీడ్చి వెడలి రొప్పుచు గ్రుద్దన్ –
కూలిన మ్రానులు నీపై
వ్రాలెనొ యని నాదు గుండె పగులు టెరుగవే? (32)

సీ.
“కాళింది మడుగులో కాళీయు డుగ్రుడై
కబళించగా నిన్ను కక్షబూని,
అటు పడగల విప్పి, ఇటు తోకతో కప్పి,
నిలువెల్ల మేనితో నిన్ను జుట్ట,
జలము లోలోతులన్ తలమున్క లీవౌచు
వీరోచితంబుగా పోరుచుంటి”
వనుచు నాందోళన నరిగి నాదు కడకు
గోపబాలురు పూస గుచ్చి జెప్ప –
తే.గీ.
చేయుచున్న పనిని యట్లె చేత విడిచి,
నెత్తి, నోరును లబలబ మొత్తుకొనుచు
పరుగు పరుగున నీ చెంత వ్రాలినట్టి
మాతృ హృదయమ్మునే నీవు మరచినావొ? (33)

సీ.
ఘోరాతిఘోరమై కురియ వర్షమ్ము, నా
బీభత్సమున కెల్ల భీతిలంగ –
గోవులున్, గోపికల్, గోపాలురును గూడు
యాదవ కులకోటి కభయమిడగ,
బాలుండ వీవైన భయమన్నదే లేక
గోవర్ధనాద్రిని గొడుగు వోలె
కుడిచేయి చివరలో కొలువైన చిటికెన
వ్రేలితో పైకెత్తి, పిలువ జనుల –
తే.గీ.
చేరినారెల్ల గిరి క్రింద చిత్తమలర!
కాచినావంచు పొగిడె లోకంబు, కాని –
“చితికిపోవునేమొ మరి నీ చిన్ని వ్రేలు”
నంచు నలిగి పోయెనయ – యీ యమ్మ మనసు! (34)

ఉ.
ఎన్నియొ గొప్ప కార్యముల నిట్టుల సల్పుచు నిన్ని నాళ్ళుగా –
నన్నును, నెల్ల వారలను నవ్య విచిత్ర విశేష భ్రాంతిలో
కన్నులు తేలవేయునటుగా పలుమారులు చేసి తీవు! ఆ
మిన్నుల పుష్ప వర్షములు మేనులపై బడె గర్వమొందగాన్! (35)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here