విషాద యశోద-7

0
13

[‘పద్య కళాప్రవీణ’, ‘కవి దిగ్గజ’ ఆచార్య ఫణీంద్ర రచించిన ‘విషాద యశోద’ అనే పద్యకావ్యాన్ని అందిస్తున్నాము.]

కం.
కన్నా! దాగుడు మూతల
నన్నెపు డాడింతువు! బహు కాలముగ నిటున్
కన్నులకు దూరమయి, నా
కన్నులలో మెదలెద, విది కలయో! నిజమో! (56)

మానిని.
కావలె నిద్దియు కన్నులు మూసెడి కన్నయ యాటని కామనరా!
ఈ విధమున్ మది నెంచుచు జూచితి నింటను మూలల నెల్లెడలన్!
నా విధి యిప్పుడు నాయెడ నుండక, నాదొక భ్రాంతిగ నానెనురా!
ఈవు విలంబము నింకను సేయక నిప్పటికైన మనింటికి రా! (57)

మ.
ఏమో? వత్తువొ, రావొ – యంచు మరి యింకేమూలనో గల్గెడిన్
ప్రేమావేశము నిండు నా హృది నయో వీసెత్తుగా శంకయున్!
నా మోమెంత కృశించె చూడుమయ దీనావస్థలో తేలుచున్!
ఏ మాత్రం బొక యింత జాలి, దయ నీకిట్లెట్లుగా గల్గదో? (58)

చం.
దినమున కొక్క మారయిన దీనయె నీ జనయిత్రి జ్ఞాపకం
బొనరగ రాదొకో ? ఇచట నున్నపు డెప్పుడు – “మాత! మాతరో!”
యనుచు త్వదీయ కార్యముల నన్నిటినిన్ జరిపించుకొంటివే
ఘనముగ నాదు చేత – మరి కార్యములే గతి సాగు నిప్పుడున్? (59)

కం.
అనుదిన మట నీ శిరమున
నునుచుటకై నెమలి పింఛ, మొద్దిక నెవరున్
వనముల, మయూర జాలము
లను పెంచుచు, పోషణమ్ములను జూతురయా? (60)

తే.గీ.
నీ పను లొనర్చుకొను టెప్డు నీ వెరుగవు !
ప్రొద్దు ప్రొద్దున మారాము పోవు నిన్ను
నిమిరి తల, ప్రేమ నెవ్వారు నిదుర లేపు?
స్నాన పానాదు లవియన్ని జరుపు నెవరు ? (61)

కం.
మందముగా గలుగు కురుల
నందముగా దువ్వి, పైన నమరగ కొప్పున్
సుందరముగ తీర్చి, నడుమ
పొందికగా నెమలి పింఛ ముంచు నెవ రటన్? (62)

సీ.
కమనీయ ముఖముపై కస్తూరి తిలకమ్ము
దీటుగా నెవ్వారు దిద్దు నీకు?
వక్షస్థలమ్ముపై పలు కంఠహారాలు
వ్రేలాడ నెవ్వారు వేయు నీకు
నాసికాగ్రమ్ముపై నవ మౌక్తికము నంద
గించ నెవ్వ రలంకరించు నీకు?
కర తలంబున నుంచి మురళిని యెవ్వారు
“వదలబో కెట!“ యంచు పలుకు నీకు?
తే.గీ .
కరములం దెవ్వరు తొడుగు కంకణములు?
పూయు నెవరు చందనముల పూత నీకు?
దివ్య సౌందర్యమూర్తిగా తీర్చి నిన్ను –
దిద్దు నెవరు దిన దినమ్ము దిష్టి చుక్క? (63)

కం.
వేళకు నీ కడుపు నెరిగి ,
చాలను నటు గడ్డ పెరుగు, చలిదన్నముతో
లీలగ ముద్దలు గట్టుచు
బాలక! తినిపించు నెవరు ప్రతిదిన మచటన్? (64)

కం.
నిన్నయొ మొన్నయొ గాదయె!
ఎన్నాళ్ళయె నిన్ను వీడి? ఇల్లంతట పల్
గిన్నెలలో వెన్నను గన –
కన్నులలో నీరు గారి కాల్వలు గట్టున్ ! (65)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here