విషాద యశోద-8

0
12

[‘పద్య కళాప్రవీణ’, ‘కవి దిగ్గజ’ ఆచార్య ఫణీంద్ర రచించిన ‘విషాద యశోద’ అనే పద్యకావ్యాన్ని అందిస్తున్నాము.]

ఆ.వె.
చల్ల చిలుకబోవ చల్ల ముంతను నీదు
చారడేసి కనుల సౌరు దోచు –
వెన్న నెత్తు వేళ గిన్నెలందున, నాటి
మన్ను దిన్న నోటి మహిమ దోచు – (66)

మ.
కలయో, వైష్ణవ మాయయో యన మునుం గన్పింపగా జేసితే –
ఇలలో గల్గిన సర్వ వృక్షముల,
నెన్నెన్నో పశుల్, పక్షులన్,
పలు జంతుల్, నరులున్,ఝరుల్,గిరులతో బ్రహ్మాండమున్ నోటిలో!
కలగా నేడిటు మొత్తమే కనులకున్ కన్పింప విద్దేమిరా? (67)

కం.
అన్నము రుచియింపదు –
కన్నులకే నిద్ర రాదు – కాంచుచు నీకై
కన్నులు కాయలు గాచెను –
నిన్నే దలచుచు నిరతము నీరగుచుంటిన్ ! (68)

కం.
ఎన్నటికి వత్తువో యని
కన్నుల నీరొలికి పైకి గాంచ నిరాశన్ –
మిన్నున నల్లని మబ్బులు
నిన్నే బోలుచు కనబడి నిట్టూర్చెదరా ! (69)

ఉ.
ఏ గది కేగినంత నటనే గలవేమొ యటన్న భ్రాంతి ! నే
నేగగ చెంతకున్ , కనుల నీడలు గ్రమ్మి నిరాశ గల్గు! నే
వేగుచు నుంటిరా విరహ వేదనమందున నిన్ని నాళ్ళుగా –
వేగమె రమ్ము తండ్రి ! ఇక వేదన నేను భరింపజాలరా ! (70)

ఉ.
తల్లిని నాదు సంగతిని దాపున నుంచుము – నిన్ను గాన కీ
పల్లె కళా విహీనమయి బావురుమన్నటు లున్నదయ్య ! రే
పల్లె ప్రజల్ మనమ్ముల నపార వ్యధాగ్నుల మ్రింగుచుండ్రి !తా
తల్లడమల్లడంబగును తండ్రిగ నంద విభుండు నయ్యహో ! (71)

కం.
ఎవ్వరు చూడని వేళల
నవ్వల నొకమూల నిలిచి, యర్భకు వోలె
న్నువ్వెత్తు పొంగ దు:ఖము;
“వెవ్వే” యని నీదు తండ్రి విలపించు నయో! (72)

తే. గీ.
మరల, నెవరైన జూతురో మరి .. యటంచు
కనుల నీరు గ్రుక్కుకొనును కన్నులందె!
నన్ను గనినంత – నేమి లేనట్లు జూచి,
వెర్రి నవ్వులు నవ్వు నీ పిచ్చి తండ్రి! (73)

ఆ. వె.
ఎరుగు నేమొ నీవు తిరిగి రావనుచును;
ఏది చెప్పబో డదేమొ నాకు!
గ్రుచ్చి గ్రుచ్చి యడుగ – గొణుగుచుండును తాను
“ఏమొ! రాకపోవు నేమొ!” యనుచు! (74)

తే.గీ.
సత్యమో? లేక తానాడు సరస మదియొ?
నమ్మవచ్చునో? లేక తా నటనమాడొ?
సంగతేమంచు నిలదీసి స్వామి నడుగ –
“ఇంక రాబోడు మన కృష్ణు డింటి” కనును! (75)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here