విషాద యశోద-9

1
10

[‘పద్య కళాప్రవీణ’, ‘కవి దిగ్గజ’ ఆచార్య ఫణీంద్ర రచించిన ‘విషాద యశోద’ అనే పద్యకావ్యాన్ని అందిస్తున్నాము.]

కం.
“మధురా నగరికి రాజౌ!
బుధజను లందరు సతతము పొగడగ, గ్రోలున్
మధు పంచ భక్ష్యము లెపుడు –
విధి నట నుండుటె నయ”మని వెర్రిగ పలుకున్! (76)

కం.
బృందావనికిని రాజై
అందరి మెప్పులను బొంది, యందరి తోడన్
విందుగ పాల్, వెన్న, పెరుగు
పొందిన నది చాలదొక్కొ పుడమిని పుత్రా! (77)

మత్తకోకిల.
మారిపోయితి వేమొ కన్నయ! మారిపోవుచు నీవిటున్
జారిపోయెద వంచు నెప్పుడు జన్మలో తలపోసెడిన్
భారమైన దరిద్ర కాలము వచ్చునం చనుకొంటినా?
దూరమైతివి! నేను చేసిన దోష మేమిటి? చెప్పుమా! (78)

ఉ.
తక్కువ యేమి సేసితిని, దక్కక నీ విటు దూరమౌటకున్?
మిక్కట మాయెనా జనని మిక్కిలి ప్రేమము జూప నీకు? ఇం
కెక్కడొ ఎవ్వరో యొకతె యేదొ వినూత్న విధాన ప్రేమమున్
తక్కెడ తోడ తూచి యిడ – దానికి లోబడిపోతివా సుతా! (79)

చం.
ఒకపరి వచ్చి చూడు! మన యూరును! ఊరి జనమ్ము, జంతువుల్,
వికటము గాను తోచు మన వీధులు, మొక్కలు, చెట్టు చేమలున్,
కకవికలైన పుష్పములు, గందరగోళములైన దృశ్యముల్ –
సకలము కోలుపోయినటు సాక్షిగ నిల్చెడు, నీకు దూరమై! (80)

కం.
మందారమ్ములు పూయవు –
సిందూరమ్ములు విరియవు – చినబోయిన దీ
బృందావన మెల్లయు – గో
విందా! నీ వేణుగీతి వినిపించనిచో! (81)

చం.
నిను గనకున్న గోవు లిట నిక్కిన క్రోధము తోడ మా యుర
మ్మున తమ కొమ్ములన్ విసురు – ముత్తెమునంతయు పాల నీవు – పె
ట్టిన తినబోవు మేతను – పటిష్ఠముగా బలపడ్డ వాని యా
తనువులు బక్క జిక్కె – ఎటు తండ్రి ! సహింతుము మూగ వేదనన్? (82)

చం.
వల వల యేడ్చుచున్నవి దివా నిశలందున , కాన రాని నిన్
తలపుల యందు నిల్పుకొని – తాండవమాడవు – ప్రీతి ధాన్యపుం
బలుకులనైన ముట్టవు – ప్రభాసిత కేశ విభూష గాగ నీ
తలను ధరించు పింఛముల తామిడు నట్టి మయూర జాలముల్! (83)

కం.
ఓయమ్మ! నీ కుమారుడు
మా యిండ్లను పాలు, పెరుగు మననీడంచు
న్నీ యమ్మలు, నా యమ్మలు,
నా యా పొరుగమ్మ లిప్పు డరుదెంచరయా! (84)

ఉ.
తోచదు వారికిన్, మరియు తోచదు నాకును – వార లట్టులన్
పాచియు నూడ్చు వేళ, మరి పట్టపగళ్ళును, రాత్రులందునన్
నీ చిన చిన్న తప్పులను నిందలు వేయుచు చెప్పి, యూగుచున్
పేచిని పెట్టుకోని యెడ! వింతగ నంతయు చిన్నబోయెరా! (85)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here