విశ్వ విఖ్యాత నట సార్వభౌమ – నందమూరి తారక రామ

0
2

[మే 28న శ్రీ నందమూరి తారక రామారావు శతజయతి సందర్భంగా ఈ రచనని అందిస్తున్నారు కె. హరి మధుసూదన రావు.]

[dropcap]‘వి[/dropcap]శ్వ విఖ్యాత నట సార్వభౌమ’ ఈ బిరుదును నందమూరి తారక రామారావుకు ప్రదానం చేసింది ఎవరో కాదు నడిచే దేవుడిగా పేరొందిన కంచి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. నిరంతరం ఆధ్యాత్మిక చింతనలో ఉండే పరమాచార్య వద్దకు ఒక రోజు ఒక భక్తుడు వచ్చి ‘సీతారామ కల్యాణం’ చిత్రాన్ని గురించి చెప్పాడు. ఆ చిత్రాన్ని ప్రత్యేకంగా వేయించుకొని చూసి రామారావు నటనా ప్రతిభను మెచ్చుకొని ఆశీర్వదిస్తూ రామారావుకు ‘విశ్వ విఖ్యాత నట సార్వభౌమ’ బిరుదును ప్రదానం చేశారు. రామారావు తన అద్భుత నటనా శైలితో ఆ బిరుదుకు న్యాయం చేకూర్చాడు.

బాల్యం:

నందమూరి లక్ష్మయ్య చౌదరి, వెంకటరామమ్మ దంపతులకు 1923 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరులో రామారావు జన్మించాడు. చిన్నప్పుడు బుల్లి అని ముద్దుగా పిలిచేవారట. లక్ష్మయ్య దంపతులకు మరో కుమారుడు జన్మించాడు. ఆ అబ్బాయికి త్రివిక్రమ రావు అనే పేరు పెట్టారు. లక్ష్మయ్య చౌదరి తండ్రి రామస్వామి చౌదరి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఆస్తిపరుడు. లక్ష్మయ్య ఆస్తిని వృద్ధి చేయాలని కొంత భూమిని కొని వ్యవసాయం చేశాడు. కానీ అందులో గిట్టుబాటు ధర కూడా రాలేదు. సొంత భూమిని కూడా అమ్మి అప్పులను తీర్చటంతో బీదవాడయ్యాడు. వెంకటరామమ్మ అక్క చంద్రమ్మ భర్త కొమరవోలుకు చెందిన రామయ్య. వీరికి పిల్లలు లేకపోవడంతో రామారావును దత్తత తీసుకొన్నారు. రామయ్య నాటకాలు వేసేవాడు. ఎప్పుడూ చక్కగా దువ్వుకొని, తెల్లటి దుస్తులు వేసుకొని ఉండే రామయ్యను ‘షోకు రామయ్య’ అని పిలిచేవారు. ఆ పెదనాన్నే చిన్నప్పుడు రామారావుకు భారత, రామాయణ ఇతిహాసాలను చెప్పేవాడు. వల్లూరు సుబ్బారావు అనే మాస్టారి వద్ద కొంతకాలం చదువు చెప్పించాడు. తరువాత భుజంపై ఎత్తుకొని అవిరిపూడిలో రోజూ బడికి తీసుకెళ్ళేవాడు. హైస్కూల్ చదువు కోసమని విజయవాడలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని మునిసిపల్ స్కూల్‌లో తారకం బాబుని చేర్పించాడు. కొంతకాలం బస్ కండక్టర్‌గా చేస్తూ ఉండగా ఒక యాక్సిడెంట్‌లో రామయ్య కాలు విరిగింది. దీనితో రామయ్యను నిమ్మకూరులో ఉంచి, లక్ష్మయ్య దంపతులు విజయవాడ చేరి పాల వ్యాపారం మొదలెట్టారు. ఎన్టీఆర్ రోజూ ఉదయం మూడు గంటలకు నిద్ర లేచి పాలు పితికి, ఇంటింటికీ వెళ్లి పాలు పోసేవాడు. ఉదయం ఆరు గంటలకు తాలింఖానాలో వ్యాయామం చేయడం అలవాటుగా పెట్టుకున్నాడు. ఒకరోజు నిమ్మకూరులో పెదనాన్న రామయ్య దగ్గరికి వెళ్లి సరుకులు తీసుకొని సాయంత్రం సైకిల్‌లో విజయవాడకు బయలుదేరాడు. మధ్యలో టైర్ పంచరైనా ధైర్యంగా విజయవాడకు వచ్చాడు. ఇంటికి చేరుకొనేసరికి అర్ధరాత్రి అయిందట. ఎన్టీఅర్ ధైర్యానికి ఇదొక నిదర్శనం. పాల వ్యాపారం వృద్ధిలోకి వచ్చి లక్ష్మయ్య ఒక సొంత ఇల్లు కొన్నాడు. తన తమ్ముడు నాగయ్య పొలం అమ్ముతున్నాడని తెలిసి కొంత డబ్బుని అతనికి పంపాడు.

తొలి నాటకం:

ఎన్టీఆర్ ఇంటర్ చదివేటప్పుడు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు బోధనతో పాటూ నాటకాలు వేయించేవారు. ‘రాచమల్లుని దౌత్య కార్యం’ అనే నాటకంలో నాయకురాలు నాగమ్మ పాత్ర ఎన్టీఆర్ వేయాలి. నాటకానికి అంతా సిద్ధమయ్యింది. ఎన్టీఆర్‌ని మీసాలు తీసివేయమని విశ్వనాథ సత్యనారాయణ చెప్పారు. అందుకు ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. నాటకం వేయడానికి సమయం దగ్గర పడటంతో  మీసాలతోనే ఎన్టీఆర్ నాటకం వేశాడు. నాటకంలో బాగా ఎన్టీఆర్ నటించడంతో విశ్వనాథ సత్యనారాయణ మెచ్చుకొన్నారు. అయితే అప్పటినుండీ ఎన్టీఆర్‌ను ‘మీసాల నాగమ్మ’ అని స్నేహితులు పిలిచేవారు.

ఆత్మగౌరవం:

ఒకరోజు ఎన్టీఆర్ మిత్రుడు వర్షం వస్తూ ఉంటే ఒక ఇంటి వసారాలో కొంచెం సేపు నిలబడ్డాడు. అది ఒక తమిళుడు ఉండే ఇల్లు. కావాలనే ఇంటి ముందు నిలబడ్డాడని అనుమానించి ఎన్టీఆర్ మిత్రుడిని కొట్టాడు. నిజానికి ఆ తమిళునికి ఒక అక్రమ సంబంధం ఉంది. ఈ విషయం తెలిసి విశ్వనాథ సత్యనారాయణ ఏ తప్పూ చేయని తన శిష్యుడిని ఒక తమిళుడు కొట్టినందుకు బాధపడి తెలుగు వాడి ఆత్మ గౌరవం గురించి విద్యార్థులకు చెప్పారు. గురువుగారి కోపాన్ని అర్థం చేసుకున్న ఎన్టీఆర్ ఆ తమిళుడి ఇంటికి వెళ్లి కొట్టి వచ్చాడు. ఈ విధంగా చిన్నతనం లోనే తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాడు. ఎన్టీఆర్ పక్కింటి వారితో స్నేహంగా ఉండేవాడు. సూర్యనారాయణ అనే వ్యాపారి తన కుటుంబంతో కాపురముండే ఉండేవాడు. ఆ కుటుంబం లోని వారితో అక్కా, బావ అంటూ కలిసి మెలిసి ఎన్టీఆర్ ఉండేవాడు. సూర్యనారాయణ బొంబాయి లో వస్త్ర వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఒకసారి వ్యాపారంలో అతని మిత్రులు మోసం చేసి ఇతనిని అరెస్ట్ చేయించారు. అతని భార్య ఏడుస్తూ ఈ విషయం చెప్పింది. ఎన్టీఆర్ ‘అక్కా బాధపడకు, నేను బొంబాయికెళ్ళి బావను విడిపించుకోస్తాను’ అని చెప్పి వెళ్ళాడు. బొంబాయిలో కేసు విషయమై రెండు నెలలు ఉండి జైలు నుండి సూర్యనారాయణను విడిపించాడు. అయితే ఈ కేసు విషయమై సరిగ్గా చదువుకోక పోవడంతో ఇంటర్‌లో ఫెయిల్  అయ్యాడు. ఈ విధంగా ఎన్టీఆర్‌కి తనను నమ్ముకున్న వారి కోసం ఎంతటి త్యాగం చేయడానికైనా వెనుకాడేవాడు కాదు.

ఉద్యోగం:

ఇంటర్ ఫెయిల్ కావడంతో నిమ్మకూరులో పెదనాన్న రామయ్య ఇంటికి ఎన్టీఆర్ వచ్చాడు. పెళ్లి చేద్దామనుకున్నారు. కొమరవోలులో ఉండే జమీందార్ చెంచయ్య కూతురు బసవతారకం సంబంధం దాదాపు ఖరారయ్యే సమయానికి ఎన్టీఆర్ చిన్నాన్న నాగయ్య ఇంకో సంబంధం తీసుకొచ్చాడు. కానీ రామయ్య బసవతారకంతో ఎన్టీఆర్ పెళ్లి నిశ్చయించాడు. దీనితో నాగయ్య కోపంతో తాను అమ్ముతానన్న పొలాన్ని అమ్మలేదు సరికదా డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదు. దీనితో మరోసారి ఎన్టీఆర్ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందిలో పడింది. 1942, మే 21న బసవతారకంతో ఎన్టీఆర్‌కు వివాహమయ్యింది. విజయవాడలో కోర్ట్‌లో సిరస్తాదార్ ఉద్యోగంలో తాత్కాలికంగా ఎన్టీఆర్ చేశాడు. పక్కింటి సూర్యనారాయణ సలహా మేరకు కొన్నాళ్ళు బీడీ, సిగరెట్ హోల్‌సేల్ వ్యాపారం ప్రారంభించాడు. అది సరిగా జరగలేదని జనతా పబ్లికేషన్స్ అనే ప్రెస్‌ను నడిపాడు. ఈ వ్యాపారంలో పడి ఇంటర్ మళ్ళీ తప్పాడు. ప్రెస్ కూడా మూతపడటంతో మూడవసారి ఇంటర్ పరీక్షలు వ్రాసి పాసై, గుంటూరులో ఎ.సి.కాలేజీలో బి.ఏ.లో చేరాడు. రోజూ ఉదయం ఏడు గంటలు బయలుదేరి ట్రైన్లో వెళ్లి ఇంటికి వచ్చే సరికి రాత్రి పదకొండు గంటలయ్యేది. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో కాలేజీలో విద్యార్థుల ఆందోళనను తగ్గించడానికి నెహ్రూని కాలేజీ యాజమాన్యం ఆహ్వానించారు. నెహ్రూ ప్రసంగిస్తుండగా సభ మధ్యలో గాంధీ నడిచి వచ్చాడు. ఆశ్చర్యంగా అందరూ చూస్తుండగా ఎన్టీఆర్ గాంధీ వేషధారై వచ్చి నెహ్రూ పక్కన నిలుచున్నాడట. నెహ్రూ ఆశీర్వదించి ఢిల్లీకి వెళ్లిన తరువాత ఎన్టీఆర్‌కు ఒక గోల్డ్ మెడల్ పంపించారట.

నేషనల్ ఆర్ట్ థియేటర్:

గుంటూరులో చదివేటప్పుడు జగ్గయ్య, వల్లభజోస్యుల శివరామ్, కె.వి.యస్.శర్మ, మల్లికార్జున రావు  మొదలగు క్లాస్మేట్స్ ఎన్టీఆర్‌తో కలిసి బలిదానం, అలీ దో కాబ్లర్ మొదలగు నాటకాలు వేసేవారు. తరువాత వీళ్ళు సినిమాల్లోకి వచ్చారు. మల్లికార్జున రావు సినీనటి శివరంజని అబ్బాయి కావడంతో ఒక రోజు ‘నాయకురాలు’ అనే నాటకం వేస్తున్నప్పుడు శివరంజని భర్త నాగుమణి చూశాడు. ఎన్టీఆర్ నటన చూసి మెచ్చుకొని చిత్తజల్లు పుల్లయ్యకు పరిచయం చేశాడు. ఆయన మద్రాసుకు రమ్మని చెప్పాడు. డిగ్రీ పూర్తి చేసి వస్తానని చెప్పాడు. డిగ్రీ పూర్తి చేసి ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగానికి అప్లై చేస్తే డెహ్రాడూన్‌కు రమ్మని కాల్ లెటర్ వచ్చింది. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక పోవడంతో వెళ్ళలేదు. నేషనల్ ఆర్ట్ థియేటర్ అనే నాటక సంస్థను స్థాపించి తన కాలేజీ మిత్రుల సహాయంతో నాటకాలు ప్రదర్శించేవాడు. ఈ నాటకాల్ని చూసిన దర్శకుడు ఎల్వీ ప్రసాద్ ఎన్టీఆర్‌ని మద్రాస్‌కు తీసుకెళ్ళి స్క్రీనింగ్ టెస్ట్ చేసి, క్రొత్త సినిమా తీసేటప్పుడు కబురు పంపుతానని చెప్పారు. ఈ మధ్యలో పబ్లిక్ సర్వీస్ కమీషన్ వ్రాసి మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్‌గా చేరాడు. కొన్ని రోజుల తరువాత ఎల్వీ ప్రసాద్ నుంచి ‘పల్లెటూరి పిల్ల’ అనే సినిమాలో నటించడం కోసం రమ్మని కబురొచ్చింది. ఉద్యోగం వదిలిపెట్టి మద్రాస్ వెళ్ళాడు. ఈ సినిమాను బి.ఎ. సుబ్బారావు తీస్తున్నారు.

మొదటి సినిమా మన దేశం:

కొత్త అబ్బాయి ఎలా నటిస్తాడో అని సందేహిస్తున్న బి.ఎ. సుబ్బారావు వద్దకు ఎల్వీ ప్రసాద్ వచ్చి తను తీస్తున్న ‘మనదేశం’లో ఒక చిన్న పాత్ర ఇచ్చి చూద్దాము అని అన్నారు. మనదేశంలో సబ్ ఇన్స్పెక్టర్ పాత్రలో ఎన్టీఆర్ నటించాలి. యాక్షన్ అనగానే లాఠీచార్జ్ చేయడం మొదలెట్టాడు. దర్శకుడు ఎల్వీ ప్రసాద్ కట్ చెబుతున్నా కొట్టడం ఆపలేదు. ‘బాబూ ఇది సినిమా షూటింగ్ నిజంగా కొట్టేస్తున్నావు ఏమిటి?’ అని ఎల్వీ ప్రసాద్ అన్నా, పాత్రలో లీనమై నటించడాన్ని బి.ఎ. సుబ్బారావు గమనించి తన సినిమా పల్లెటూరి పిల్లకు తగిన హీరో దొరికాడని అనుకున్నారట. ‘ఇంతవాణ్ణి, ఇంతవాణ్ణయ్యాను’ అన్న మొదటి డైలాగు లాగే ఎంతో ఎత్తుకు ఎదిగాడు. పల్లెటూరి పిల్ల ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించిన మొదటి సినిమా. ఈ సినిమా షూటింగ్ సమయంలో రెండుసార్లు ఎన్టీఆర్ చెయ్యి విరిగింది. చేతికి కట్టు కట్టుకొని నటించడం ఆయనలోని కమిట్‌మెంట్‌కు నిదర్శనం.

విభిన్న పాత్రలు:

‘పల్లెటూరి పిల్ల’ సినిమా షూటింగ్ విశ్రాంతి సమయంలో ఎన్టీఆర్, అక్కినేని ఇద్దరూ టెన్నిస్ ఆడుతున్న సమయంలో దర్శకుడు కె.వి.రెడ్డి అక్కడికి వచ్చారు. అక్కినేని వేసిన రెండు షాట్స్‌ని ఎన్టీఆర్ ఆడలేక పోయాడు. దీంతో కోపంతో బాల్‌ని కొడితే స్టూడియో దాటి పోయింది. వెంటనే కె.వి.రెడ్డి తను తీయబోయే ‘పాతాళభైరవి’లో తోటరాముడు పాత్రకు సరియైన హీరో ఎన్టీఆర్ అని నిశ్చయించారు. బి.ఎన్. రెడ్డి  తీసిన ‘మల్లేశ్వరి’లో ప్రేమికుడిగా నటించాడు. ఈ సినిమా చూసి ఎంతోమంది అప్పటి యువకులు సినిమా పాత్రలోని నాగరాజు లాగా ఫీల్ అయ్యేవారట. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో ‘పెళ్ళిచేసి చూడు’, ‘మిస్సమ్మ’ లలో నటించాడు. కట్నాల మోజులో పడి జీవితాల్ని బలిచేసుకోకుండా ‘పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాలం గడపాలోయ్’ అంటూ యువకులకు సందేశాన్నిచ్చాడు. మిస్సమ్మ పూర్తి నిడివి హాస్య చిత్రం. బి.యస్. రంగా తీసిన ‘తెనాలి రామకృష్ణ’లో శ్రీకృష్ణదేవరాయలుగా నటించాడు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో తీసిన ‘చిరంజీవులు’ సినిమాలో గ్రుడ్డివాడిగా నటించాడు. శ్రీకృష్ణుడిగా నటించిన కె.వి. రెడ్డి తీసిన ‘మాయాబజార్’ చిత్రం ఎన్టీఆర్‌ని ప్రేక్షకుల పూజామందిరాల్లోకి తీసుకెళ్ళింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘భూకైలాస్’లో రావణాసురునిగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, మాయాబజార్, భూకైలాస్ చిత్రాలలో ఎన్టీఆర్‌తో ఏన్నార్ కలిసి నటించారు.

నిర్మాతగా:

తను గతంలో స్థాపించిన నేషనల్ ఆర్ట్స్ అనే పేరును కొనసాగిస్తూ 1953 లో ‘పిచ్చి పుల్లయ్య’ అనే సినిమా తనే హీరోగా తీశాడు. 1954లో ‘తోడుదొంగలు’ సినిమా తీశాడు. ఈ రెండు సినిమాలు పరాజయం పాలయ్యాయి. అయినా ‘తోడుదొంగలు’ సినిమా ఉత్తమ తెలుగు సినిమాగా రెండవ జాతీయ చలన చిత్ర పురస్కారాన్ని పొందింది. ‘పాండురంగ మహత్యం’లో ‘హే కృష్ణా ముకుందా మురారి’ అని పాడితే ప్రేక్షకులు భక్తి పరవశులయ్యారు. మాధవ సేవ కన్నా తల్లిదండ్రుల సేవే గొప్పదని చాటి చెప్పిన చిత్రం తీశాడు.

దర్శకునిగా:

రావణాసురుడిని విభిన్న కోణంలో చూపించాలనే కోరికతో ఎన్టీఆర్ కె.వి. రెడ్డి దగ్గరికి వెళ్లి సీతారామ కళ్యాణానికి దర్శకత్వం చేయవలసిందిగా కోరాడు. ‘మాయాబజార్’లో కృష్ణునిగా చూపిన నిన్ను రావణాసురునిగా చూపలేనని చెప్పడంతో తానే దర్శకనిర్మాతగా మారి ఎన్టీఆర్ ఈ సినిమాను నిర్మించాడు. సాలూరు రాజేశ్వరరావు కొన్ని పాటలకు సంగీతమిచ్చి తప్పుకొన్నారు. సినిమాలకు సంగీత సారథ్యం నుంచి దాదాపు తప్పుకున్న గాలిపెంచల నరసింహారావుని సంగీత దర్శకునిగా ఒప్పించాడు. ఆయన చేసిన ‘సీతారాముల కళ్యాణము చూతము రారండి’ అనే పాట వినిపించని పెళ్లిమంటపం లేదు. బొంబాయిలో ఉన్న రవికాంత్ నగాయిచ్‌ని ఛాయాగ్రాహక దర్శకుడిగా ఎంచుకున్నాడు. రావణాసురుని పది తలలతో చూపించే మాస్క్ షాట్ షూటింగ్ కోసం పది గంటలు కదలకుండా నిలబడ్డ ఎన్టీఆర్‌ని చూసి కెమరామెన్ నగాయిచ్ ఆశ్చర్యపోయాడు. హరినాథ్‌ని రామునిగా, మణిని సీతగా ఎంపికచేశాడు. ఆ మణి యే హీరోయిన్ గీతాంజలి. సినిమా పూర్తి అయిన తరువాత కె.వి.రెడ్డికి ఎన్టీఆర్ చూపించాడట. శెభాష్ బాగా తీశావని ఆయన మెచ్చుకున్నారట.

‘గులేబకావళి కథ’ ద్వారా జోసెఫ్ కృష్ణముర్తిని సంగీత దర్శకునిగా, సి.నారాయణ రెడ్డిని పాటల రచయితగా పరిచయం చేసిన ఘనత ఎన్టీఆర్‌కి దక్కుతుంది. ‘శ్రీకృష్ణ పాండవీయం’లో కృష్ణుని లోని లాలిత్యం, దుర్యోధనుని లోని గాంభీర్యం చక్కగా చూపించాడు. మొదటి రెండు సినిమాలకు దర్శకత్వ పేరు వేసుకోక పోయినా ఈ చిత్రంలో దర్శకత్వం వహించినట్లు పేరు వేసుకున్నాడు.

అనితర సాధ్యం:

ఎన్టీఆర్ అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే ‘దాన వీర శూర కర్ణ’ ఒక్కటి ఒక ఎత్తు. అత్యధిక నిడివి గలిగిన సినిమా తీసి ప్రేక్షకులకు ఆప్పుడే సినిమా అయిపోయిందా! అన్నట్లు భ్రమింపజేయడం ఒక్క ఎన్టీఆర్‌కే చెల్లు. శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడిగా మూడు పాత్రలు వేస్తూ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే అన్నీ తానే అయి 43 రోజులలో నాలుగు గంటల ఏడు నిమిషాల సినిమా తీయటం, అందులో దాదాపు నాలుగు గంటలు తెరపై కనబడడం ఎన్టీఆర్‌కే సాధ్యం. కొత్తగా రామక్రిష్ణా స్టూడియో కట్టి, తనను నటునిగా చేసిన ఎల్వీ ప్రసాద్‌చే ప్రారంభం చేయించాడు. బి.నాగిరెడ్డి ఈ సినిమాకు స్విచ్ ఆన్ చేస్తే, ఎం.జి.రామచంద్రన్ క్లాప్ కొట్టారు. ఒక పక్క ఇదే కథాంశంతో కురుక్షేత్రం సినిమా ఎక్కువ బడ్జెట్‌తో ఉత్తర భారతదేశంలో భారీ సెట్టింగ్స్ వేసి కృష్ణ తీస్తున్నాడు. ‘పాండురంగ మహత్యం’, ‘నర్తనశాల’, ‘పాండవ వనవాసం’, ‘శ్రీకృష్ణావతారం’ వంటి సినిమాలు తీసి పౌరాణిక బ్రహ్మగా పేరొందిన కమలాకర కామేశ్వరరావు కురుక్షేత్రానికి దర్శకుడిగా చేస్తున్నారు. శోభన్ బాబు, కృష్ణంరాజు, నాగభూషణం, మోహన్ బాబు, చంద్రమోహన్, అంజలీదేవి, జమున ఇలా చాలా మంచి నటులు నటిస్తున్నారు. కానీ ‘దాన వీర శూర కర్ణ’ సినిమాకు అన్నీ తానై ఎన్టీఆర్ దాదాపు హైదరాబాద్ లోనే షూటింగ్ పూర్తి చేశాడు. తొందరగా చేసిన ఈ సినిమాలో కొన్ని చోట్ల దారాలు కనబడడం వంటి లోపాలున్నా ఎన్టీఆర్‌ని చూస్తూ ఆయన డైలాగులు వింటూ ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ‘ఏమంటివి ఏమంటివి’ అనే డైలాగ్ ఇప్పటికీ కొందరి సెల్ ఫోన్లో కాలర్ ట్యూన్‌గా ఉందంటే ఎంత ప్రభావితం చేసిందో తెలుస్తుంది. ఒక ప్రక్క ‘కురుక్షేత్రం’ అంతంత మాత్రమే ఆడితే ‘దాన వీర శూర కర్ణ’ రికార్డులను తిరగరాసింది. ఈ సినిమా ద్వారా సంభాషణలు వ్రాసిన కొండవీటి వెంకట కవిని, కెమరామెన్ కె.యస్.ప్రకాష్‌ని సినీ రంగానికి పరిచయం చేశాడు.

గేవా కలర్‌లో మొదటి తెలుగు సినిమా ‘లవకుశ’లో నటించి ప్రేక్షకులకు రాముడంటే రామారావు రామారావు అంటే రాముడు అనిపించాడు. రాముడు అనే పేరుతో అడవి రాముడు, డ్రైవర్ రాముడు, శృంగార రాముడు, ఛాలెంజ్ రాముడు, రౌడీ రాముడు, సరదా రాముడు, కలియుగ రాముడు ఎన్ని సినిమాలు తీసాడో చూస్తే అర్థమవుతుంది. శ్రీమద్విరాట పర్వంలో కృష్ణుడు, అర్జునుడు, బృహన్నల, దుర్యోధనుడు, కీచకుడుగా ఐదు పాత్రలలో నటించిన యుగపురుషుడు ఎన్టీఆర్. వయస్సు పెరిగే కొద్దీ ఆయనలో నటన ఉరకలేసింది అని చెప్పడానికి సూపర్ మాన్, సర్దార్ పాపారాయుడు, గజదొంగ, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, బొబ్బిలి పులి మొదలగు సినిమాలే నిదర్శనం. వీరబ్రహ్మేంద్రస్వామిగా, బ్రహ్మర్షి విశ్వామిత్రగా, అశోక సామ్రాట్‌గా, శ్రీనాథునిగా, మేజర్ చంద్రకాంత్‌గా నటించి ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయాడు కాబట్టే ఇన్ని రోజులైనా అత్యంత పాపులర్ నటుడిగా ప్రేక్షకులచే ఎంపికయ్యాడు.

ప్రజా సేవలో:

రాయలసీమ క్షామ నివారణ నిధి కోసం స్వయంగా నాటకాలు ప్రదర్శించి లక్ష రూపాయలు 1952లో సేకరించాడు. 1965‌లో పాకిస్తాన్ యుద్ధంలో సైనికుల సహాయ నిధికి ఎనిమిది లక్షల రూపాయలు సేకరించి అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డికి అందజేశాడు. 1969లో ఆంధ్రా ప్రాంతంలో సంభవించిన తుఫాను బాధితుల కోసం ఆరు లక్షలు సేకరించి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డికి అందించాడు. ఆన్నిటికన్నా ముఖ్యమైనది 1977 దివిసీమ తుఫాను బాధితుల కోసం అక్కినేనితో కలిసి పదిహేను లక్షలు సేకరించాడు. స్వయంగా తనే జోలె పట్టి ప్రజల మధ్యకు వచ్చి ఒక ప్రముఖ నటుడు అడగడంతో ప్రజలు చాలా మంది చలించిపోయారు. తెలుగు రాష్ట్ర విభజన కోసం తెలంగాణా, ఆంధ్రా లలో ఉద్యమాలు జరుగుతున్న రోజులలో ‘తల్లా పెళ్ళామా’ సినిమాలో  సి. నారాయణ రెడ్డిచే ‘తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది’ అని పాట వ్రాయించాడు. కులమతాల ఆడ్డుగోడలను ‘దానవీర శూర కర్ణ’లో దుర్యోధనుని పాత్ర ద్వారా ప్రశ్నించాడు. బలవంతపు కుటుంబ నియంత్రణపై వ్యంగ్యాస్త్రంగా ‘యమగోల’లో డైలాగులు వ్రాయించాడు. సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి పద్ధతి ద్వారా తెలుగువారి ఆత్మ గౌరవం తాకట్టు పెట్టవద్దని చెప్పి తన పుట్టిన రోజు మే 28, 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టి తొమ్మిది మాసాల్లోనే ముఖ్యమంత్రి అయ్యాడు. పాలనలో కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం, తెలుగుగంగ ప్రాజెక్టు, తిరుమలలో నిత్యాన్నదానం, మండల వ్యవస్థ, ఆస్తిలో స్త్రీలకు సమాన హక్కు, పద్మావతి, తెలుగు విశ్వవిద్యాలయాల ఏర్పాటు, హుస్సేన్ సాగర్‌లో బుద్ధవిగ్రహం ఏర్పాటు ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఉన్నాయి. ‘ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం’ అన్న తెలుగు జాతి ముద్దుబిడ్డ నందమూరి తారక రాముడు. శృంగేరి పీఠాధిపతి వారిచే ‘అభినవ రామ రాయ’ అని పిలవబడ్డ మనందరి ఎన్టీవోడు.

Image Credits: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here