విశ్వాసం

0
12

[బాలబాలికల కోసం ‘విశ్వాసం’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]

[dropcap]సి[/dropcap]ద్ధయ్య ఒక ఎకరం పొలం కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నాడు. అదే అతనికి జీవనాధారం.

సిద్ధయ్య విశ్వా అనే కుక్కను పెంచుకుంటున్నాడు. అది ఎంతో విశ్వాసంతో సిద్ధయ్య ఇంటికి కాపలా ఉండటమే కాకుండా అతనితో పాటు పొలానికి వెళ్ళి తోడుగా ఉంటుండేది.

ఒక సంవత్సరం కరవు ముంచుకొచ్చి పంటలు పండలేదు. సిద్ధయ్య పొలం కూడా పండక ఎరువుల ఖర్చు కూడా రాలేదు. తన కష్టాలను సిద్ధయ్య తన భార్యకు బాధతో చెప్పడం విశ్వా వినింది. సిద్ధయ్య కష్టాలను అది అర్థం చేసుకున్నది. అది సిద్ధయ్యకు సహాయపడాలంటే ఏవిధంగా సహాయపడాలో అర్థంకాక సతమతమవ్వ సాగింది.

ఒకరోజు ఆది సిద్ధయ్య ఇంటికి మూడో ఇంటిలో కనకరాజుకు చెందిన రూప అనే కుక్కను కలసి తన యజమాని సిద్ధయ్య ఎంతో మంచివాడని అతను ప్రస్తుతం కష్టాలలో మునిగి ఉన్నట్టు రూపకి విశ్వా చెప్పింది.

“చూడు మనం విశ్వాసానికి మారు పేరు అతను నీకు తిండి పెడుతూ ప్రేమగా చూసుకుంటున్నాడు.  నీవు అతనికి ఏదో విధంగా మేలు చేయడానికి ప్రయత్నించు. మంచి మనసు ఉంటే తప్పక సహాయం చెయ్యడానికి మార్గం దొరుకుతుంది” ఎంతో మంచిగా చెప్పింది రూప.

ఒక రోజు  పొలంలో కలుపు మొక్కలు తీసేద్దామని సిద్ధయ్య పొలం వైపు బయలు దేరాడు. ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఓ వ్యక్తిని ఒక దొంగ కత్తితో అటకాయిస్తూ అతని ఉంగరం, గొలుసు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. సిద్ధయ్య ఆ దొంగను తరిమేందుకు వడివడిగా అటువైపు అడుగులు వెయ్యసాగాడు. దొంగను చూసి భయపడిపోతున్న ఆ వ్యక్తిని కాపాడాలన్న సిద్ధయ్య ప్రయత్నాన్ని విశ్వా గమనించి అది వడిగా వెళ్ళి ఆ దొంగ పిక్కను తన వాడి పళ్ళతో పట్టుకుంది! ఒక పక్క సిద్ధయ్య  ఇంకో పక్క రౌద్రంగా ఉన్న విశ్వాను చూసేసరికి ఆ దొంగకి భయం వేసింది! వెంటనే బలవంతంగా కుక్క నోటినుండి తన కాలు విడిపించుకుని పరుగెత్తికెళ్ళి పోయాడు.

ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి “మీకేం ప్రమాదం జరుగలేదు కదా!” అడిగాడు సిద్ధయ్య.

“సమయానికి మీరు మీ కుక్క రావడం వలన ప్రమాదం తప్పింది. మీ మేలు మరచిపోలేను. వాడు నా గొలుసు, ఉంగరం బలవంతంగా లాక్కోవాలని చూశాడు. మీ రాక వలన నాకు నష్టం ఏమీ జరుగలేదు. మీ కుక్క మనసు కూడా ఎంతో మంచిది” అని మెచ్చుకుని సిద్ధయ్య ఏం ఉద్యోగం చేస్తున్నాడో తెలుసుకోవాలని అడిగితే సిద్ధయ్య తన పేరు చెప్పి తాను పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నట్టు కరవు వలన తనకు నష్టం వచ్చినట్టు చెప్పాడు.

“అయ్యా, సిద్ధయ్యా మీది మంచి మనసు. మీ మంచితనం వలనే మీ కుక్క మీ మనసు అర్థం చేసుకుని నన్ను కాపాడింది. నాకు పదెకరాల పొలం ఉంది అందులో మూడు ఎకరాలు మీకు కౌలుకు ఇస్తాను. మీరు సాగు చెయ్యండి. పొలం ఏ కారణం చేతనైనా సాగుకి రాకపోతే నాకు కౌలు డబ్బులు కూడా ఇవ్వనక్కరలేదు” అని చెప్పి తన ఇంటి చిరునామా చెప్పి తనను కలవమన్నాడు.

ఈ సంభాషణ విన్న విశ్వా కూడా ఎంతో సంతోషించింది. తరువాత విశ్వా పరుగున వెళ్ళి  తన స్నేహితుడు రూప కుక్కను కలసి సిద్ధయ్యకు జరిగిన మేలు వివరించింది.

“చూశావా మంచి చేయాలని ఉంటే మనకు తెలియకుండానే మంచి మార్గం దొరుకుతుంది” అని సంతోషంతో చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here