విశ్వనాథ ‘మ్రోయు తుమ్మెద’లో ఇస్లాం – ఒక విశ్లేషణ

2
12

[‘విశ్వనాథ ‘మ్రోయు తుమ్మెద’లో ఇస్లాం – ఒక విశ్లేషణ’ అనే వ్యాసాన్ని అందిస్తున్నారు హేలీ కళ్యాణ్.]

[dropcap]ఈ[/dropcap] వ్యాసం గురించి ముందుగా ఉపోద్ఘాతంగా కొంత.

ఈ మధ్యన గుంటూరు విశ్వనాథ సాహిత్య అకాడమీ వారు ‘వక్రరేఖ (చారిత్రక నవల)’ ( చూడు: Vakra Rekha (logili.com) ) అని ఒక పుస్తకం పునః ముద్రణ చేశారు. ఈ నవల మొదటి ముద్రణ 1931లో జరిగింది. ఇది మునిమాణిక్యం నరసింహారావు గారి రచన. అయితే పుస్తకానికి పరిష్కర్తగా విశ్వనాథ సత్యనారాయణ పేరు ఉంటుంది. పుస్తకానికి ప్రస్తావన కూడా విశ్వనాథ వారే రాశారు. పుస్తకం అంతటా కూడా చాలా చోట్ల విశ్వనాథ మార్కు కనిపిస్తూ ఉంటుంది.

ఇక ఈ పుస్తకం కథా విషయం దగ్గరికి వస్తే ఇది బహ్మనీ సుల్తానుల కాలం నాటి కథ. ఇంచు మించుగా బహ్మనీ సామ్రాజ్య స్థాపన నుంచే మొదలవుతుంది కథ. వికీపీడియాలో హసన్ బహ్మన్ షా (Ala-ud-Din Bahman Shah – Wikipedia) గురించిన వ్యాసం చదివితే గంగు అనెడి బ్రాహ్మణ జ్యోతిష్య శాస్త్ర పండితుని ప్రస్తావన ఉంటుంది. ఆ బ్రాహ్మణ వంశం బహ్మనీ సుల్తానుల వంశం మధ్యన కొన్ని తరాలు జరిగిన కథగా దీనిని భావించచ్చు. చారిత్రక నేపథ్యం ఉన్న నవల కాబట్టి అటు పూర్తిగా కల్పితం అనలేము అలాగని ప్రతిదీ ఉన్నది ఉన్నట్టుగా ఇలానే జరిగింది ఇది చరిత్ర అని కూడా అనలేము.

ఏదైతేనేమి ఈ పుస్తకంలో కొన్ని వాక్యాలను నేను సామజిక మాధ్యమాలలో పంచుకోవటం జరిగింది. కొందరు సాహితీ మిత్రులతో ఈ విషయమై చర్చలు వాదనలు జరిగాయి.

విశ్వనాథ గద్య సాహిత్యం అంటే ప్రధానంగా నవలా సాహిత్యం నాటకాలు విమర్శలు అన్నీ కలుపుకుంటే దాదాపుగా ఒక ఎనభైకి పైగా పుస్తకాలు నేను చదివాను. కాబట్టి నేను విశ్వనాథ విషయంలో ఒక రకమైన వీరాభిమానిని. అయితే ఈ వక్రరేఖ గురించి తెలిసినా కూడా ఎప్పుడూ దృష్టి పెట్టి చదవలేదు. ఆన్లైన్ ప్రతిలో చదవటం కొంత కష్టమనిపించింది కూడా. ఇప్పుడు ప్రింట్ ప్రతిలో చదివాక నాకు అందులో ఇస్లాం గురించిన కొన్ని వ్యాఖ్యలు కొత్తగా అనిపించాయి. ఇస్లాం రాజుల పాలనలో జరిగిన ఇటువంటి అరాచకాల గురించి విశ్వనాథ ఈ విధంగా ఇంత నాటకీయంగా కళ్ళకు కట్టినట్టు ఇంకెక్కడా రాయలేదు అనుకుంటాను నాకు తెలిసి. ఆ వాక్యాలేమిటో చూద్దాము.

మహమ్మదు షా సుల్తాను కామానికి ఎందరో స్త్రీలు బలయ్యారని ఒక వాక్యంలో ఇలా అంటారు రచయిత(లు)

“కొండపల్లిలోని పేదవారదివరకే షా సైనికుల దుష్టభావముల ఫలమనుభవించిరి. ఇంక షాగారి దౌష్ట్యఫలమనుభవించవలయును. మహమ్మదు షాకు వాని కామమునకుఁ దగిన మిత్రుఁడొకఁడుండెను. వాఁడు తృతీయా ప్రకృతి. స్త్రీవలె వేసము వేసికొనును. స్త్రీవలె మాటాడును. సిగ్గుపడును. వాడు కొండపల్లిలో నూరేగి వాని కంటికి నందముగా నున్న స్త్రీనెల్ల చూచి సుల్తానునకు వర్తమానము చెప్పును. సుల్తాను సైనికులను బంపి యామెను తెప్పించును”

సుల్తాను కామానికి ఎందరో జనుల భార్యలు బలయ్యారని అంటారు మరొక చోట

“..ఇట్టి సుల్తాను ప్రవర్తనచేతఁ గొండపల్లిలోఁ రక్ష లేకపోయెను. జనులు తమ భార్యల యీ వినాశము చూచి చూచి యేమియుఁ జేయలేకపోయిరి. కొందరిది రహస్యముగా నుంచుకొనిరి”

ఆ సుల్తాను బ్రాహ్మణ వధ కూడా చేశాడంటూ ఒక ఉదంతాన్ని గురించి ఇలా ఉంటుంది. వేదం చదువుతున్న బ్రాహ్మణులను చూస్తే సుల్తానుకు మతావేశం వచ్చిందనీ వారిని కాఫిర్ అని సంబోధించాడనీ ఉంటుంది.

“…నొక దేవాలయ మున్నది. అందు బ్రాహ్మణులు కూర్చుండి వేదములు చదువుచుండిరి. వారిని జూచిన సుల్తానులోని మహమ్మదీయ మతావేశము పెచ్చు పెరిగిపోయెను”

“…”కాఫరులారా! నా కోటలోనుండి యావలికిబొండు. ఇచ్చట దుష్టదైవమును కొల్చుచున్నారా?” అని నిరాయుధులు నిశ్శక్తులునైన వారలను తన కత్తికి బలియిచ్చెను. అప్పుడట్లు నరుకఁబడిన బ్రాహ్మణుల సంఖ్య యిరువది. సుల్తాను వెలగల దుస్తులన్నియు బ్రాహ్మణ రక్తముతోఁ దడిసిపోయెను…”

ఇదంతా చూసి ప్రధాన పాత్ర ఇలా ఎదురు ప్రశ్నించటం జరిగినట్టు కూడా ఉంటుంది

“బ్రాహ్మణులు మనుష్యులుకారా? వారికి సుఖదుఃఖములు లేవా? వారిలో నాత్మ యుండదా? మహమ్మదీయులకే యాత్మ కలదా? నవాబుల భార్యలు కాని స్త్రీలకుఁ బాతివ్రత్య మక్కరలేదా? వారి కభిమానము లేదా? వారు పశువులా?”

దేవాలయాలను ధ్వంసం చేసి అదే స్థానంలో మసీదు కట్టిన ఒక ఉదంతం ప్రస్తావన కూడా ఉంటుంది ఇలా.

“..సుల్తాను తక్షణము యా దేవాలయము పడఁగొట్టుడని యాజ్ఞయిచ్చెను…ఆ పని యిరువదివేల మహమ్మదీయ సైనికులచేతఁ బదినిముసములలోఁ జేయఁబడెను. మిగిలిన గోడలమీద మసీదు మరి పదినిముసములలో లేపఁబడెను”

కంచి దేవాలయం మీద ఈ సుల్తాను చేసిన దాడి గురించిన వివరణ ఇది. ఇందులో కూడా ఎందరో హిందువులను వారిలో పూజారులను బ్రాహ్మణులను చంపినట్టుగా ఒక చిత్రణ ఉంది. ఇది కాక సంపద కొల్లగొట్టినట్టు స్త్రీలను చెరపట్టి నట్టు కూడా కొన్ని వాక్యాలు ఉన్నాయి.

“…కంచి దేవాలయమున దేవుని ధనము రక్షించుటకుఁ గొంతమంది సైనికులుండిరి. వారిలోఁ గొందరు బయటకు వచ్చిరి. సుల్తాను నలుబది మందితో మాత్రమే దేవాలయము నొద్దకు ముందు చేరెను. సైన్యమంతయు వెనుక వచ్చుచున్నది. దేవాలయ రక్షక సైన్యములో నొక యాజానుబాహుఁడు తన గుఱ్ఱమును సుల్తాను మీదికి దూకించి యీటెతో సుల్తానును బొడువఁ బోయెను. కాని యతఁడా దెబ్బ తప్పించుకొని వానిని కత్తితో నరికెను. వాఁడు చనిపోయిన వెంటనే యింకొకఁడు సుల్తానును జంపవచ్చెను. కాని వానిని గూడ సుల్తాను నరకెను. తరువాత మరికొందరు హిందువులు వచ్చిన వెనుక హిందువులందరు దేవాలయములోనికిఁ బోయి, తలుపులు వేసి, గోడలెక్కి, మహమ్మదీయులపైఁ గత్తులు, నీటెలు, రాళ్ళు విసరఁజొచ్చిరి. ఇంతలో సుల్తాను యొక్క పదియాఱువేల సైన్యము వచ్చెను. ముట్టడి ప్రారంభమయ్యెను. చివరికా యపరిమిత సైన్యము దేవాలయపు గోడలు కుద్దలించి లోనికిఁ బ్రవేశించి యచ్చటి కొలది సైన్యమును, పూజారులను, బ్రాహ్మణులను ముక్కలు ముక్కలుగా నరకివైచిరి…”

“….తరువాత సుల్తాను కంచి కొల్లగొట్టెను. అంగడు లన్నియు దోచెను. ధనవంతుల యిండ్లు పడగొట్టెను. వారి స్త్రీలను చెరపట్టెను. కొన్ని యిండ్లు కాల్చెను. దుఃఖించుచుఁ బ్రార్థించుచు వచ్చినవారిని జంపెను. కోపము సూచించినవారిని చిత్రవధ చేసెను. ఈరీతి వధయు, కొల్లగొట్టుటయు కంచిలో సుల్తాను వారము రోజులు చేసెను…”

నవలలో పలు చోట్ల ఈ గంగు అనే బ్రాహ్మణునికీ ముస్లిం రాజుకు మధ్యన జరిగిన ఒప్పందం గురించిన ప్రస్తావన వస్తూ ఉంటుంది. మొదట చెప్పినట్టు అసలు కథ మొదలే ఈ మైత్రితో.

హసన్ బహ్మన్ షా అందరు మహమ్మదీయ రాజుల వలెనే హిందువులను బాధించే వాడనీ అంటారు రచయిత(లు).ఇలా జరగకుండా ఆపేటందుకే ఈ బ్రాహ్మణునికి ముస్లిం రాజుకి మధ్యన ఒప్పందం జరిగినట్టుగా ఉంటుంది కథలో.

 “…హసన్ రాజ్యాధిపతి యైనప్పటినుండియు హిందువులను బాధించుట మొదలయిన మహమ్మఁదీయరాజులకు నలవాటయిన కొన్ని కార్యములు చేయుచుండెను. ఇది గంగుబ్రాహ్మణున కిష్టములేదు. గంగూ తానొక యాలోచన చేసెను. తానును సుల్తానును కొన్ని నిబంధనలు చేసికొనునట్లును…”

హరశాస్త్రి అనే పాత్ర గంగు వంశానికి చెందినవాడు. బహ్మనీ సుల్తానులు బ్రాహ్మణవధ చేయరాదని ఒక చోట అంటాడు హరశాస్త్రి

“..హరశాస్త్రి ఇట్లనెను. “నేను బ్రాహ్మణుఁడను. అందులో గంగూ వంశ్యుడను. బ్రాహ్మణవధ బహ్మనీసుల్తానులు చేయరాదు”..”.

మరొక చోట హరశాస్త్రి జహాన్ అనే పాత్రతో ఇలా అంటాడు. తాను కాఫిర్ అయినప్పటికీ కూడా సుల్తానుకు రాజుగా ప్రజలందరినీ చూసుకోవలసిన కర్తవ్యం ఉందంటాడు హర శాస్త్రి. గంగు బ్రాహ్మణునికి హసన్ సుల్తానుకు ఒప్పందం జరిగాక మొదట్లో దాష్టీకాలు జరగకపోయినా కాలం గడిచే కొద్దీ మెల్లగా ఆ ఒప్పందం సడలిపోయిందనీ చివరికి చెప్పరాని ఘోరాలు జరిగాయి కాబట్టి బ్రాహ్మణుడు-సుల్తాను చేసుకున్న సంధి ఇక చెల్లుబాటు జరిగే పరిస్థితి పోయిందని అంటాడు హారశాస్త్రి.

“హరశాస్త్రికిఁ గోపము వచ్చెను. అతడు జహానుతో “సాహెబ్! సుల్తాను, మహమ్మదీయులకే చెందరు. కాఫరులకును జెందును. అందులో బహ్మనీ రాజులు బ్రాహ్మణరాజులు, ఈతఁడు మీకన్న నా కెక్కువరాజు. ఈతఁడు మీకు వట్టి రాజు. నాకు నాత్మసంబంధ మైనవాఁడు. నేను గంగూ బ్రాహ్మణ వంశస్థుఁడను. ఈతఁడు హసన నవాబు వంశస్థుఁడు. నేఁటితో బహ్మనీ సుల్తానులకును గంగూవంశస్థులకును సంబంధము తీరినది. ఇంక గంగూ బ్రాహ్మణునియాత్మ బహ్మనీసుల్తానులను రక్షింపదు. గంగూహసను లిద్దరు నేర్పరచుకొన్న సంధి యూరకే నామమాత్రముగానే యున్నది. అది యీనాఁటితోఁ బూర్తిగా బోయినది. ఈ సుల్తానులకు గంగూబ్రాహ్మణుని యాత్మయందుకన్నఁ తమ మంత్రులయందే యెక్కువ విశ్వాసమైపోయినది…”

కథనంలో భాగంగా ఇస్లాం మతం గురించి ఆ మతం తాలూకా సుల్తానుల గురించి అప్పటి హిందూ సమాజం గురించి వచ్చిన వాక్యాలు ఇవి. ఇందులో ఏ వాక్యం మునిమాణిక్యం వారిదీ ఏది విశ్వనాథ వారిది అని చెప్పటం కష్టం.

ఏదైతేనేమి పుస్తకంతో విశ్వనాథ వారి పేరు ముడి పడి ఉంది. కథా విషయంలోకి వస్తేనేమో తీవ్రమైన మతావేశం కలుగచేసే భావాలు ఉన్నాయి పైన ప్రస్తావించినట్టుగా. ఇప్పటి రాజకీయ వాతావరణంలో ఇటువంటి భావజాలానికి హిందుత్వ అని పేరు కదా. కాబట్టి ఇది విశ్వనాథ సత్యనారాయణ హిందుత్వలాగా ఉన్నదే అనే భావం కలిగింది నాకు. ఈ వ్యాసం మొదటిలో చెప్పినట్టు ఈ విషయం పై నా ఫేస్‍బుక్ గోడ అనే చిన్న టీ కప్పులో పెద్ద తుఫానే రేగింది.

ఈ తుఫాను తీరం దాటాక తేలిన విషయం ఏమిటంటే. ఇది డైరెక్టు విశ్వనాథ రచన కాదు. ముస్లిముల గురించి విశ్వనాథ ఇంత తీవ్ర విమర్శ చేసే టైపు వ్యక్తి కాడు అని. ఇలా ఇస్లాంకు తీవ్ర వ్యతిరేకం ఉండేటట్టు వంటి రచనలు సావర్కర్ అంబెడ్కర్ వంటి వారు చేసారు కానీ విశ్వనాథ చేయలేదు చేయడు కూడా అని. ఇది నా సాహితీ మిత్రుడు అయినటువంటి ఒక రచయిత చేసిన తీర్మానం.

ముస్లిం దాడుల గురించి సంస్కర్తలు సంస్కరణ భావాలు ఉన్న వాళ్ళు విమర్శలు చేశారు కానీ సనాతన ఛాందసులు చేయలేదని అంటారాయన. విశ్వనాథ ఛాందస భావాలు కలవాడు కనుక ఆయన రాయని రచనలోని వాక్యాలను ఆయనకు ఆపాదించి ఆయనలో లేని ఇస్లాం వ్యతిరేకతను నేను ఆయనకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాను అని ఫిర్యాదు అనమాట.

‘వక్రరేఖ’లు, వక్రబుద్ధులు అనే శీర్షికన మరొక విమర్శ అందింది. దీని సారాంశం ఏమిటి అంటే విశ్వానాథ హిందూ ముస్లిం ఉమ్మడి కల్చర్ అనే భావనకు ప్రతీక అట (అంటే ఆంగ్లంలో హిందూ-ముస్లిం Syncretism అని అంటారు కొందరు). దీనికి సాక్ష్యంగా హిందూస్థానీ సంగీత నేపథ్యం ప్రధానంగా రాసిన ‘మ్రోయు తుమ్మెద’ అనే నవలను ప్రస్తావించారు ఈ విమర్శకుడు.

అటువంటి గొప్ప హిందూ ముస్లిం భాయ్ చారా ఆంటే సోదర భావంతో కూడుకున్న ఉమ్మడి సంస్కృతికి విశ్వనాథ ప్రతీక అని అయన రాయని నవలలోని భావాలను ఆయనకు ముడిపెట్టే ప్రయత్నం చేయటం దారుణమని ఇది హిట్లర్ అనుయాయులైన హిందూ రైట్ వింగ్ వారు చేసెడి మహా ఘోరమని అన్నారు ఆ విమర్శ చేసిన సాహితీ మిత్రుడు. ఆయన రచయిత కూడా (ఇప్పటికీ ఆయన నాకు మిత్రులే. ఇది చదివాక కూడా మైత్రీ భావం అలానే కొనసాగుతుంది అని అనుకుంటున్నాను. ఇది పేరుతో వ్యక్తితో సంబందించిన వాదం కాదు కేవలం భావజాలంకు చెందిన చర్చ కాబట్టి ఈ వ్యాసంలో ఆయన పేరు ప్రస్తావించట్లేదు).

విశ్వనాథలో ముస్లిం దాడుల వలన హిందూ సంస్కృతికి ధర్మానికి ఏదో నష్టం జరిగిపోయింది అన్న ఆవేశం కనపడదనీ ఆయన తెలంగాణా గురించి రాసినా కూడా ముస్లిం పాలన ఉర్దూ విద్యల గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదనీ మన లోపాల వల్లే మన సంస్కృతికి ముప్పు అనేదే ఆయన భావనలా కనిపిస్తుందని అన్నారు ఈ సాహితీ మిత్రుడు.

దీనికి సాక్ష్యంగా ‘మ్రోయు తుమ్మెద’ అనే నవలలో ఒక ఉదంతం గురించి ప్రస్తావించారు ఈయన. ఈ నవలలో అరిపిరాలలోని శిథిల శివాలయము గురించి విశ్వనాథ యిలా వ్యాఖ్యానిస్తాడు.

“ముసల్మానులు ఆ దేవాలయమును నాశనము చేసిరి. వారు చేసిరని వీరు చెప్పుదురు. అది యొక అపప్రధయేమో. వీరే తమ నిరాదరణ భావము వలన తమ మతము నందు తమకు గాఢమైన అభిమానము లేకపోవుట వలన తమ దేవతలను తిరస్కరించి, నాశనము చేసుకొని నింద ముసల్మానుల మీద మోపుచున్నారేమో ….” అని.

ఈ వాక్యం ఆధారంగా “నిరాదరణ భావం, అభిమానంలేకపోవడం వల్లనే సంస్కృతికి వినాశనం జరుగుతుంది. కానీ బలవంతపు మతమార్పిడులు, దాడుల వల్ల కాదు” అని తేల్చారు ఈ విషయమై విమర్శించిన సాహితీ మిత్రుడు.

దీనికి ప్రతిగా నేను ఈ క్రింది వ్యాఖ్యను చేసాను

“రాజు శక్తిని రాజ్య శక్తిని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. అలా ఐతే ఇస్లాం క్రైస్తవం కమ్యునిజం రాజ్య శక్తిని సంతరించుకున్నాక ఎన్నో కాఫిర్ పేగన్ సంస్కృతులు మట్టికరిచాయి. వాటన్నిటికీ ఆ సంస్కృతుల ప్రజల చేతకాని తనమే కారణమని రాజ్యం ప్రభావం ఏమీ లేదని అంటారా? మావో కాలంలో చైనాలో ఎన్నో సంప్రదాయ ఫోక్ ఆచారాలను పనిగట్టుకొని అంతరింప చేశారనీ అవి ఇప్పుడు మళ్ళీ పునరుజ్జీవనం చేసే ప్రయత్నం జరుగుతోందని చైనా వారే ఇప్పుడు పుస్తకాలు రాస్తున్నారు. అంటే ఆయా సంప్రదాయ వర్గాల చేతకాని తనం వలనే ఇదంతా జరిగింది అంటారా రాజ్యం రాజ్య శక్తి తప్పేమి లేదంటారా? నేటివ్ అమెరికన్ తెగల వారు నర మాంస భక్షకులు బాగా వెనుకబడిన వారు టెక్నాలజీ లేని వారు అందుకనే బలమైన ప్రత్యర్థి చేతిలో ఓడిపోయారు. కాబట్టి కలోనియలిజం గురించి పెద్దగా బాధ పడాల్సిన అవసరం ఏమీ లేదు అని క్రిస్టియన్ రైట్ వారు వాదిస్తారు అమెరికాలో. అలా ఉంది మీరు చెప్పే వ్యవహారం. మీకు ఇది వరకు ఒకసారి కూడా చెప్పాను. ఇండియాను పక్కన పెట్టేసి ఇరాన్ ఇరాక్ వంటి చోట్ల ఇస్లాముకు అక్కడ ఉన్న ఇతర మతాలకు సంప్రదాయాలకు జరిగిన ఘర్షణను చూడండి అని. ఉదాహరణకు Yezidis గురించి చూడండి”

ఏదో సంభాషణలో నాకు నా సాహితీ మిత్రునితో ఉన్న మైత్రి కారణంగా ఇలా ఒక మాటకు మాట అనేశాను. ఆ మాటైతే అన్నాను కానీ లోలోపల నాకు కూడా ఒక భావన కలిగింది. విశ్వనాథ గద్య సాహిత్యం ఇంతగా చదివాను కదా అయినా కూడా నాకు ఈ వక్రరేఖ వాక్యాలు కొంత ఆవేశపూరితంగా కటువుగా అనిపించాయి. బహుశా నిజంగా విశ్వనాథ సొంత రచనైతే అంత తీవ్రంగా ఈ విషయం గురించి రాసి ఉండేవాడు కాదేమో అని అనిపించింది.

అలాగని ఇస్లాం పాలన వలన మన సంస్కృతికి వచ్చిన నష్టం ఏమిలేదనీ రాజు హిందువైనా ముస్లిమయినా హిందూ సంస్కృతికి వచ్చే నష్టమేమీ లేదనీ తప్పేదైనా ఉంటే అంతా కూడా మనలోనే ఉందని కూడా విశ్వనాథ అనలేదు అని నాకు తెలుసు. ఏదో ఒకానొక సందర్భంలో అలా రాసి ఉండచ్చు కానీ అలా ఆయన ఇస్లాంకు క్లీన్ చిట్ ఇచ్చిన దాఖలాలు లేవు అని నేను ఎరుగుదును. దీని గురించి విశ్వనాథ రచనలలోని వాక్యాలే ఆధారంగా ఒక వ్యాసం రాయాలని అనిపించింది. ఇదీ ఈ ప్రస్తుత వ్యాసం వెనకాల కథ.

‘మ్రోయు తుమ్మెద’ లోకి వెళ్ళే ముందు విశ్వనాథ రాసిన ‘రోషనార- లేక – ఛత్రపతి శివాజీ’ అనే చారిత్రక నాటకం గురించి ప్రస్తావించాలి. హిందుత్వ ప్రస్తావన వచ్చినప్పుడు ఛత్రపతి శివాజీ గురించిన చర్చ జరుగుతూనే ఉంటుంది. హిందూ రాజ్యం లేదా హిందూ రాష్ట్రం అనే భావన ఆయన కాలంలో బలపడిందని అంటారు కొందరు. కాబట్టి అటువంటి శివాజీ నేపథ్యంలో విశ్వనాథ రాసిన నాటకం గురించి ఈ వ్యాసంలో ఒక రెండు మాటలు తలుచుకోవడం సమంజసమే.

ఔరంగజేబు చెల్లెలు రోషనార మరియు ఛత్రపతి శివాజీ ఇతర చారిత్రక పాత్రలతో రాసిన నాటకం ఇది. కొంత ఊహా శక్తి కొంత చరిత్ర. ఈ నాటకంలో చాలా చోట్ల హిందువులు తురుష్కులు అన్న ప్రస్తావన వస్తుంది. మొదటి అంకములో రోషనార మౌలాలీతో ఒక మాట అంటుంది

“రోష: నాకు గూడ మన మతమన్నచో నిష్టమే. హిందువులు రాజ్యము చేయుటకు యోగ్యులు కారు. ఆ జాతి స్వతంత్రముగా యోచించలేదు. వారు అనుకరణబుద్ధులు. వారు మనవలెనే వస్త్రములు ధరింతురు. వారిలో చాలమంది మన ఆచారములనే అవలంబించుదురు. వారికి స్వాతంత్య్రమెందులకు?

మౌలా: అందుకనియే శివాజీ గొప్పయేమి? వాడును వారి జాతిలో పుట్టినవాడే.

రోష: అది కాదే! నాకు తెలిసినంతవరకు హిందూజాతి చచ్చిపోదు. అది ఎక్కడనో పచ్చిగా నుండును. ఎప్పుడో అది పిలకలు వేయును. ఈ శివాజీ ఆ పిలకలలో నొకటి”

ఈ మాటలలో శివాజీ పట్ల విశ్వనాథ వారి అభిమానం తెలుస్తోంది. హిందూ జాతి చచ్చిపోదు అనేదే చాలా గొప్ప మాట.

మరొక చోట “భారతదేశము భారతదేశమే! ఇది తురుష్క దేశమెప్పటికీ కాదు” అని అంటాడు శివాజీ.

ఇంకో చోట ‘రామసింహుడు’ ఇలా అంటాడు

“మన హిందువుల కొక్క జాడ్యమున్నది. వారు నమ్మినచో నెదురు తిరగరు. ప్రభువు తురుష్కుడైనను ఆయన విష్ణుమూర్తి యంశ యనుకొందురు. అందుకే మనమిట్లుంటిమి” అని.

విశ్వనాథ ముస్లిముల విషయంలో తీవ్ర భావనతో విమర్శ చేయలేదు అంటే బహుశా ఇటువంటి అంశాల గురించి అయన రాసినప్పుడు అయ్యి ఉండవచ్చును. కొన్ని వందల ఏళ్ళుగా హిందువులకు ముస్లిములకు మధ్యన సంబంధం. ఇందులో ఎన్నో యుద్ధాలు. అప్పుడప్పుడు కొంత సంధి కాలం. కొన్నేళ్ళు ముస్లిం రాజుల పాలనా మరికొన్నేళ్ళు హిందూ రాజుల పాలనా ఉండేది. ఇంచుమించుగా మన దేశంలో ఎన్నో ప్రాంతాల చరిత్ర ఇటువంటిదే. నిరంతర ఘర్షణ అనేది జరగలేదు. నిజమే. యూరోపు మధ్య ఆషియా లాగా క్రూసేడ్లు అనే మతపరమైన యుద్దాలు లేవు. ఘోరమైన యుద్ధాలు జరిగినా కూడా అవి నిత్య కురుక్షేత్రాలుగా మారలేదు. కొందరు హిందువులు ముస్లిం రాజులను దైవాంశ సంభూతునిగా భావించి ఉండచ్చును. కొందరు ఆ రాజుల కోసం పనిచేసి ఉండచ్చు. కొందరు ఆ రాజులకు తలొగ్గి ఉండచ్చు కూడా. అయితే శివాజీ వంటి వారు కూడా ఉన్నారు.

విశ్వనాథ రెండు పార్శ్యాలనూ స్పృశించారు. ఇదే నాటకంలో రామసింహుని తండ్రి జయసింహుడు శివాజీని అవతార పురుషుడంటాడు. హైందవ రాజ్యనేత అంటాడు. జయసింహుడు హిందువైనప్పటికీ ఔరంగజేబు పక్షం వాడు. జయసింహుడి గురించి ప్రస్తావిస్తూ శివాజీ ఇలా అంటాడు.

“ఓయీ! వచ్చినవాడు జయసింహుడు. యుద్ధములలో నారితేరినవాడు. అన్ని రహస్యములు తెలిసినవాడు. క్షత్రియుడు. తురుష్కుడు కాడు. తురుష్కులకు బుద్ధిమాంద్య ముండును. హిందువుల కుండదు” అని.

ఇక్కడ కూడా హిందువులు తురుష్కులు అని వేరుగానే ప్రస్తావించారు. జయసింహునికి శివాజీకి మధ్యన జరిగిన సంభాషణలో జయసింహుడు శివాజీని ఉద్దేశించి ఇలా అంటాడు

“మీరు మహారాజులు, వట్టి మహారాజులు కారు. ఒంటిచేతిమీద నొక భారతధర్మ మూలభూతమైన చిన్న రాజ్యమును స్థాపించినవారు. శత్రువులకు సాధ్యముకానివారు, పరమతస్థులకు తలవంచనివారు. మేమందఱము పరమతస్థులకు లొంగిపోయిన వారము. మీరు భారత ధర్మముయొక్క మర్యాద నిలబెట్టుచున్నారు. మీ పేరు విన్నచో నా హృదయము ద్రవించిపోవును. నా హృదయమేమి, భారతీయుడెవ్వడైన తమరిని స్మరించుకొనును. తమరిని ప్రాతఃకాలములయందు స్మరించి తీరవలయును”

నిజంగా విశ్వనాథ సదరు ఉమ్మడి కల్చర్ వీరాభిమాని అయితే అసలు ఎందుకు ఇదంతా రాసేవాడు. స్వమతం పరమతం అనే భావన ప్రస్పుటంగా తెలుస్తోంది కదా ఈ మాటలలో. కొందరు హిందువులు పరమతస్థులకు లొంగిపోయిన వారని కొందరు తలవంచలేదనే తేడాను కూడా చూపెడుతున్నారు. శివాజీని భారత ధర్మం యొక్క మర్యాద నిలబెట్టేవాడు అని అన్నాడు జయసింహుడు. ఉమ్మడి కల్చర్‌ను నిజంగా విశ్వనాథ ఆరాధించే వాడైతే అసలు ఈ సంభాషణలో ఈ వాక్యాలే అనవసరం. శివాజీ భారతీయులందరికీ ప్రాతః స్మరణీయుడు అని అంటాడు జయసింహుడు. తానూ ఔరంగజేబు పక్షం వాడైనప్పటికీ ఈ మాట అంటాడు. విశ్వనాథ శివాజీ గురించి నాటకం రాసాడు కానీ అమెరికాలో ఉండే సౌత్ ఏషియా చరిత్రకారుల లాగా ఔరంగజేబును పొగుడుతూ పుస్తకం రాయలేదే? రాజు ఔరంగజేబు అయితే ఏమిటి శివాజీ అయితే ఏమిటి మనదంతా ఉమ్మడి కల్చర్ అని అనుకోలేదే?

జయసింహునితో శివాజీ ఇలా అంటాడు ఔరంగజేబు గురించి

“ఆ పాదుషాకును నాకును పొత్తు కుదరదు. అతడు భారత ధర్మమును నాశనము చేయుటకు హిందూమతమును పెకలించుటకు వ్రతము పూనినాడు” అని

భారత ధర్మము హిందూ మతము అనేది ఒకటి ఉంది దానికీ ఔరంగజేబు భావజాలానికి పొంతన కుదరదు అని గుర్తిస్తేనే కదా ఈ వాక్యాల కూర్పు జరిగేది? ఏమిటీ ఉమ్మడి కల్చర్ మరి? ఔరంగజేబు హిందూ మతమును పెకిలించటానికి వ్రతం పూనుకున్నాడు అని అంటాడు శివాజీ.

యుద్ధాలు అన్నాక ఇవన్నీ సహజం ఒకరిని ఒకరు చంపుకోవటాలు ఇటువంటివి. ఊరికే దీనిలోకి మతాన్ని తేకండి అని వాదించాడు ఇంకొక సాహితీ మిత్రుడు. ఇటువంటి వాక్యాలను చదవరు అనుకుంటాను వారంతా. చదివినా దాట వేస్తారు. లేదంటే వక్ర భాష్యాలు చెబుతారు.

రోషనారతో ఔరంగజేబు చేయబోయే దాడుల గురించిన ప్రస్తావన వస్తుంది. అప్పుడు శివాజీ ఇలా అంటాడు

“పూర్వము గజనీ మహమ్మదు చేసెను. లోడీలు చేసిరి. మూడు వందల ఏండ్లుగా మొఘలులు చేయుచున్నారు. రేపెవ్వడు వచ్చునో తెలియదు. నాకు భయము లేదు. ఎవ్వడును భయపడనక్కర్లేదు. ఆ దైవమే కాలము. కాలమే దైవము..”

మరొక చోట శివాజీ ఇలా అంటాడు “..భగవంతుడున్నాడు. దుర్గాభవాని యున్నది! ఆ తల్లి నా చేత నొక హిందూ రాజ్యమును స్థాపింప జేసినది. నన్నెన్నో సార్లు రక్షించినది” అని.

వీటన్నిటిలో ముస్లిము రాజ్య ప్రభువుల దాడుల ప్రస్తావన హిందూ ప్రతిఘటనకు సంబంధించిన భావాలు ఉన్నాయి కదా. ఇదంతా ఏమిటి? ఎందుకు రచయిత వీటి ప్రస్తావన తెస్తున్నాడు ఈ నాటకంలో? ముస్లిములు అంటే అంత ఉదార భావం ఉంటే అసలెందుకు ఈ రచనలు చేయటం. హిందూ రాజ్య స్థాపన అని ఖచ్చితంగా సందేహానికి తావు లేకుండా ఉంది కదా. ఇంకెందుకు హిందువులకు ఈ ఉదారవాదపు ముసుగులో గుద్దులాటలు?

ఎందుకనో నేను వక్రరేఖ నవలలో కొన్ని వాక్యాలు ప్రస్తావించగానే కొందరికి కంగారు వచ్చింది. సెక్యులర్ విశ్వనాథ అనబడే సౌధము యొక్క పునాదులు కొంత కదిలినట్టు ఉన్నాయి?

ఇంటి దగ్గరే ఒక గొప్ప దేవాలయం ఉంటే సరిపోదు సెక్యులర్ హిందువుకు. దానిని ఆనుకుని ఒక మసీదు. పక్కనే ఒక చర్చి. ఫర్లాంగు దూరంలో ఒక గురుద్వారా. ఊరి మధ్యలో పెద్ద కోర్టు. కోర్టు పైన పెద్ద రాజ్యాంగం నమూనా పట్టుకుని ఒక విగ్రహం. ఇవన్నీ ఉంటేనే భారత దేశం అన్నట్టు. హిందూ మతం నా మతం అని అనుకుంటే సరిపోదు. అన్ని మతాలనూ సమానంగా పొగడాలి. నాకంతా ఒకటే అని అనిపించుకోవాలి. నేను మాతాలకు అతీతమైన విశ్వ మానవుడిని అనిపించుకోవాలి. ఇదొక సెక్యులర్ తాపత్రయం. శివాజీ గురించి పైన రాసిన వాక్యాలు వక్రరేఖలో ప్రస్తావించిన వాక్యాలు ఈ సెక్యులర్ విశ్వనాథ అనే భావనకు పనికి రావట్లేదేమో?

హిందుత్వ సావర్కర్ అని ఒక భూతం తయారు చేయాలి మొదట తర్వాత అంబేడ్కర్ రచనలలో ఇస్లాం గురించిన విమర్శలు అని మరొక భూతం తయారు చేసి వీటికి ప్రతిగా ఈ రెండిటి కంటే వేరుగా హిందూ మతము అనే పాలులో ఇస్లాం మతం అనే చాకోలెట్ కలిపి ఒక చక్కటి రుచి గల ఉమ్మడి కల్చర్ అనే చాకొలేట్ మిల్క్ షేక్ వచ్చిందనే కల్పన చేయాలి. ఈ చాకొలేట్ మిల్క్ షేక్ అమ్మకానికి విశ్వనాథ సత్యనారాయణ అనే బ్రాండ్ అంబాసిడర్ కావలసి వచ్చాడా? ఎక్కడో అడపాదడపా ఒకటీ అరా ప్రస్తావన వచ్చినంత మాత్రాన విశ్వనాథ అలా చెప్పినట్టు అయిపోతుందా?

సరే పైన చెప్పినదంతా ట్రాష్ అనుకుందాం. వక్రరేఖకు విశ్వనాథకు సంబంధమే లేదు. శివాజీ గురించి నాటకం రాసినందుకు పాత్రోచితంగా కొన్ని సంభాషణలు అలా వచ్చి ఉండచ్చును కానీ విశ్వనాథ నిజానికి ఉమ్మడి కల్చర్ ఉదారవాది అనుకుందాము. దానికి ‘మ్రోయు తుమ్మెద’నే సాక్ష్యం అనుకోవాలా? శివాజీ హిందూత్వకు ప్రతీక కాబట్టి కొన్ని వాక్యాలు ఆ భావాలకు అనుగుణంగా ఉన్నాయి కానీ నిజానికి విశ్వనాథకు ముస్లిం పాలన పట్ల ఏ విధమైన అవేశము ఆవేదన లేవు అనుకుందామా? సరే ఈ ‘మ్రోయు తుమ్మెద’లో ఈ విషయమై ఏముందో చూద్దాము. ఈ నవలలో తెలంగాణ గురించి రాసినా కూడా ముస్లిం పాలన గురించి ఉర్దూ విద్యను గురించిన వ్యతిరేక భావాలేమీలేవా? చూద్దాం ఆ సంగతి కూడా.

‘మ్రోయు తుమ్మెద’ గాత్రం సంగీతం వగైరా కళల నేపథ్యంలో సాగే కథ. ఇందులో హిందూస్థానీ సంగీతం కర్ణాటక సంగీతం గురించిన చర్చలు చాలా ఉంటాయి. నిజానికి కొన్నేళ్ళ కిందట నేను మొదటిసారి ఈ పుస్తకం చదివినప్పుడు నాకు కొంత కష్టమయ్యింది ఇదంతా అర్థం చేసుకోవటం. నాకు శాస్త్రీయ సంగీతం గురించిన పరిజ్ఞానం విషయాసక్తి కొంత తక్కువే. అయినా కూడా విశ్వనాథ శైలిలో చదివించే లక్షణం ఉంటుంది కాబట్టి చదివేసాను. అడపాదడపా ఒకటీ అరా పేజీలు తిరగేస్తూ ఉంటాను కూడా. పైన నా మిత్రుడు చేసిన వ్యాఖ్యలో ప్రస్తావించిన అరిపిరాల శిథిలాలయం గురించిన మాట నాకు గుర్తు ఉంది. అయితే అది మాత్రమే రాయలేదు విశ్వనాథ ఈ పుస్తకంలో.

తెలంగాణ సమాజం గురించి ఇలా అంటారు విశ్వనాథ

“ఇది తెలుగుదేశము. ఇచటనున్న జాతి తెలుగుజాతి. ఈ దేశము నాలుగైదువందల యేండ్లుగా తురుష్కుల పాలనములో నున్నది. ఇచట చదువన్నచో నుర్దూభాష. కాని యందరును తెలుగే మాట్లాడుదురు. ఎక్కువ ఉర్దూ శబ్దములు మిలనము చేయుదురు. ఇచ్చటి జన మేమి జనము! ఏడువందల యేండ్లుగా తురుష్కుల ప్రాబల్యము కల దేశములో నిచ్చటి జనము తమ తెలుగుబాసను, తమ తెలుగు జాతియొక్క సంస్కారములను వదలుకొనలేదు. విస్మరించలేదు. ఎవడో నూటికి కోటికి మతిభ్రష్టుడైనవా డుండవచ్చును. జనము జనమందరును చెడిపోలేదు”

తురుష్కుల ప్రాబల్యము ఉర్దూ చదువులు వీటన్నిటి ప్రభావం గురించిన ప్రస్తావన కళ్ళకు కట్టినట్టుగా ఉంది కదా. ఏడు వందల ఏండ్లుగా వారి పాలనలో ఉన్నా కూడా ప్రజలు భాషను సంస్కృతిని వదులుకొనలేదు అని స్పష్టంగానే ఉంది కదా. అంటే తురుష్క సంస్కృతి తెలుగు జాతి యొక్క సంస్కారము వేరు అని గుర్తిస్తున్నట్టే కదా. లేదంటే ఎంచక్కా ఏడు వందల ఏండ్ల తురుష్కుల ప్రాబల్యము వలన చక్కని ఉమ్మడి కల్చర్ వచ్చినది అని రాసేవాడు కదా? ఎందుకని రాయలేదు మరి? “చెడిపోలేదు” అని పదం వాడాడు కదా ఇక్కడ విశ్వనాథ? అంటే తెలుగు జాతి యొక్క సంస్కారాలను వదులుకోవడం భాషను వదులుకోవడం హర్షించాల్సిన విషయం కాదనే కదా. వదులుకుంటే చెడిపోవటమే అనే కదా అర్థం? మరేమిటి ఈ ఉమ్మడి కల్చర్ ఉదారవాదం?

ఇంకొక మాట అంటాడు విశ్వనాథ ఆంధ్రులను తెలంగాణ వారినీ పోల్చుతూ

“రెండువందల యేండ్లు కృష్ణాగోదావరీ పినాకినీ తీరవాసులు నాంగిలేయుల సంపర్కము నందు మెసలిరి. రెండువందల యేండ్లలో వారు చెడిపోయినంత యేడు వందల యేండ్లలో వీరు చెడిపోలేదు” అని

ఈ విషయంలో నాకేమి విశ్వనాథతో పేచీ లేదు. ఆంగ్లేయుల పాలనలో మనకు వలస మేధ అంటే Colonial consciousness అన్నది ఒకటి వచ్చి పడింది. మన విద్యలు మన స్వత్వం గురించిన మన ఆలోచనలు ఇవన్నీ కూడా ముస్లిముల పాలన కంటే కూడా ఆంగ్లేయుల పాలనలోనే ఎక్కువ రాపిడికి ఒత్తిడికి గురయ్యాయి. అదే కాలంలో పారిశ్రామిక విప్లవం చేసిన వృత్తి పరంపరల విధ్వంస ప్రభావం మనమీద ఎలాగూ ఉండనే ఉంది. కాబట్టి ఆంగ్లేయుల పాలనలోనే భారతీయులం ఎక్కువగా చెడిపోయాం. అందులో సందేహం ఏమి లేదు. అయితే దీని అర్థం ఇస్లాము పాలన స్వర్గ తుల్యం అని కాదు. దాని ప్రభావం వేరే దీని ప్రభావం వేరే. అంతే.

ఉత్తర భారతం దక్షిణ భారతం రెంటి పైనా ఇస్లాం ప్రభావం వేరేలాగా పడిందని అంటారు విశ్వనాథ.

“కొన్నివేల యేండ్లుగా నుత్తరదేశము తిరిగి తిరిగి వచ్చిన తురుష్కుల దండయాత్ర చేత, వారి యాక్రమణ చేత, వారి యొత్తిడుల చేత నెక్కువభాగ మాచారవిషయమున సడలిపోయినది”

దండయాత్రల గురించి ఆక్రమణ గురించి వాటి వలన హిందూ ధర్మం పై బడ్డ ఒత్తిడిని గురించి ఇంత చక్కగా చెప్పాక కూడా “విశ్వనాథలో ముస్లిం దాడుల వలన సంస్కృతికి ధర్మానికి ఏదో నష్టం జరిగిపోయింది” అనే ఆవేశం లేదు అనటంలో ఆంతర్యం ఏమిటి? ఆవేశం అంటే యుద్ధానికి ఉసిగొల్పాలా? అలా చేస్తేనే ఆవేశం ఉన్నట్టా? తురుష్కుల పాలనలు ఆక్రమణ చేత ఉత్తరాన ఆచార వ్యవహారాలలో తీవ్ర మార్పులు జరిగాయి అని రాశారు విశ్వనాథ. అది చాలదా?

దక్షిణ భారతం గురించి ఇలా అంటారు ఆయన. ఉత్తర భరతంలో లాగా తురుష్కుల పాలన వలన ఆచారాల విషయంలో ఇక్కడ అంత ఒత్తిడి కలిగిన పరిస్థితి లేదు అంటారాయన.

“దక్షిణమున నట్లు జరుగలేదు. తురుష్కు లెంతదండెత్తి వచ్చినను- విజయనగర సామ్రాజ్యము, పీష్వాల రాజ్యము, దక్షిణమున తంజావూరు మధురరాజ్యములు, వేదమత సంప్రదాయములను తిరిగి తిరిగి నిలబెట్టుచునే వచ్చెను.” అని.

ఈ సామ్రాజ్యాల వారు అంతా కూడా ఈ ‘ఉమ్మడి కల్చర్’ కోసమేమీ వెంపర్లాడలేదే. వేదమత సంప్రదాయములను నిలబెట్టుచునే వచ్చెను అని అన్నారే కానీ ఉమ్మడి కల్చర్ పెంపొందించెను అని అనలేదు కదా. వేదమత సంప్రదాయము తురుష్కుల మతము వేరు వేరని చెప్పకనే చెబుతున్నారు కదా? అసలు అంతా మన మంచికే మనదంతా ఉమ్మడి కల్చరు అని ఈ రాజ్యాల వారు అనుకుని ఉంటే సరిపోయేదేమో సెక్యులర్ విమర్శకుల దృష్టిలో? యుద్ధాలు చేయాల్సిన పనే లేదు అప్పుడు!

వక్రరేఖలో ప్రస్తావించిన బహమనీ సామ్రాజ్యం గురించి ఇలా అంటారు.

“ఈ స్థితి బహమనీ రాజ్యపు మేరయందు కలుగలేదు. బహమనీ రాజ్యము పంచధా విభక్తమైన తరువాతకూడ, హస్తినాపురమునందలి లోఢీల ఖిల్జీల మొగలుల నాగరకతనే పాటించుకొనుచు వచ్చెను. ఎంత పాటించుకొన్నను దక్షిణదేశము నందలి, నడిబొడ్డు చెడని అచ్చమైన భారతీయ సంప్రదాయపు చిన్నెలను తొలగించుకొనలేకపోయెను”

ఇక్కడ కూడా స్పష్టంగా లోఢీ ఖిల్జీ మొగలుల నాగరికత అని వేరు చేసే కదా రాశారు. అచ్చమైన భారతీయ సంప్రదాయపు చిన్నెలు అన్న మాటలోనే ఇది వేరే మొగలు నాగరికత తురుష్క సంస్కృతి వేరే అని తెలుస్తూనే ఉన్నది కదా. మరెక్కడి ఉమ్మడి కల్చర్ ఉదార వాదం?

బహమనీ రాజ్యం గురించి మరొక మాట

“తల్లికోటయుద్ధము జరుగువరకు విజయనగర సామ్రాజ్యముయొక్క సంస్కారబలమును బహమనీరాజులు తొలగబెట్టజాలకపోయిరి. మహారాష్ట్రరాజ్య మన్నను విజయనగరరాజ్యమన్నను బహమనీరాజులకు పచ్చివెలగకాయ వలెనే యుండెను”

ఇక్కడ కూడా విజయనగర సామ్రాజ్యపు సంస్కార బలము అని అంటూ బహమనీ రాజ్య సంస్కృతితో వేరుగానే కదా ప్రస్తావన? ఇక్కడ శివాజీ నాటకంలో పేర్కొన్నట్టు మహారాష్ట్ర హిందూ రాజ్య సంస్కృతి గురించిన ప్రస్తావన ఉండనే ఉంది. ఇక్కడెక్కడా ఉమ్మడి కల్చర్ కానరావట్లేదే?

 “కర్ణాటాంధ్రముల యందు విస్పష్టమై అచ్ఛమైన భారతీయ సంస్కృతి జాతీయతాముద్రను తొలగించుకొనకుండ సంరక్షించుకొన్నది” అని అంటారు ఇదే చోట. ఇక్కడ కూడా స్పష్టంగా అచ్చమైన భారతీయ సంస్కృతీ జాతీయతా ముద్ర అని తురుష్క సంస్కృతితో సంబంధం లేకుండానే ప్రస్తావన.

మతాంతరీకరణ గురించి ఇలా అంటారు విశ్వనాథ

“అదియేమి చమత్కారమో ముసల్మాను మతము నూటికి పదునేనుమందిగా మతాంతరులను చేసికొన్నది. అప్పటికే ఆ మతమునకు, అంతటి క్రూరతతో అంతటి రాజ్యాధికారముతో, అంతటి వధలతో నెక్కువ చేయలేకపోయెను”

ఇందులో ఆవేశం ఆవేదన లేదా? రాజ్యాధికారం పరమతం వారికి చేరిపోవటం గురించిన చింత ఉండనే ఉంది కదా. క్రూరత గురించి వధల గురించి కూడా ప్రస్తావించారు. రాజ్యాధికారాన్ని మతాంతరీకరణకు ఎలా వాడుకున్నారో రాశారు కదా. అదేదో చలాకీగా ఆడుతూ పాడుతూ ఉమ్మడి కల్చర్ వచ్చేసింది ఇది చాలా శుభ పరిణామం అని ఆయనేమి మిఠాయిలు పంచట్లేదు కదా?

ఇప్పుడు ఉమ్మడి కల్చర్ విషయానికి వద్దాము.

“ప్రసిద్ధము లైన గానవిద్యావేత్తల యొక్క కుటుంబములలో నధికులు తురుష్కమత మవలంబించుట జరిగినది. బీహారులోగూడ నిట్టిపనియే జరిగినది. ఈ సంగీతవిద్యా సంప్రదాయము తరతరములుగా వచ్చుచున్న కుటుంబము లన్నియు తురుష్కమతమును స్వీకరించుట చేత, ఔత్తరాహమైన సర్వసంగీత విద్యయు తురుష్కముద్రను వహించెను. నేటికిని వింధ్యోత్తర దేశముల యందలి సంగీతవిద్వాంసులు తురుష్కులు. వారు మతము చేత తురుష్కులు. విశ్వాసము చేత భారతీయులు. ఆ మహావిద్వాంసులలో పరమోత్తములైన వారందరు నొకడు కాళీభక్తుడు, ఒకడు కృష్ణభక్తుడు, మరియొకడు రామభక్తుడు. మతము నందు మాత్రము ముసల్మానులు. వారిలో కొందరు సంస్కృత పండితులు. సంప్రదాయ మంతయు ప్రధానమైన భారతీయమును పరిత్యజించ లేదు”

ఇందులో కూడా తురుష్కులు భారతీయులు అని వేరు చేసే మాట్లాడుతున్నారు. తురుష్క మతము స్వీకరించుట చేత కొంత తురుష్క ముద్ర వచ్చింది అని అన్నారు. అంటే మతం ప్రభావం అంగీకరిస్తున్నట్టే కదా. భారతీయమును పరిత్యజించలేదు అని అనటంలోనే ఉంది కదా మర్మమంతా. మతాంతరీకరణ జరగినా కూడా సంస్కార బలంతో పరంపరల శక్తితో భారతీయతను నిలబెట్టుకున్నారు దీనికి ఉమ్మడి కల్చర్ అని ఒక పేరు పెట్టుకుని గొప్పలు చెప్పుకోనక్కర్లేదు. అసలు భారతీయత అని ఒకటి తురుష్క మతం అంటూ మరొకటి గుర్తెరిగే భావన ఉంటే ఈ ఉమ్మడి కల్చర్ అనబడే సాంకర్య వ్యామోహం ఉండదు కదా.

అసలు విశ్వనాథ సంప్రదాయవాది కాబట్టి ఆయనకు ఈ ఉమ్మడి సాంకర్య వ్యామోహం ఉండే అవకాశమే లేదు. ఆయన సర్వవిద్యలు భారతదేశమునుండి యితరదేశములకు వ్యాపించినవి అని అంటారు. ఆయన రాసిన ‘ఆరు నదులు’ నవల అంతా దీని గురించే. ఇదే విషయం విశ్వనాథ ‘మ్రోయు తుమ్మెద’లో కూడా రాశారు. మనకు సొంతమైన భారతీయ సంస్కృతికీ కొన్ని పరాయి సంస్కృతులకూ సామ్యం ఉండే అవకాశాలు లేకేమీ కాదు. సామ్యం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆ సామ్యం ఉండటానికి కారణం ఏమిటంటే అవి అంతా కూడానూ ఇక్కడి నుంచి వెళ్ళినవి కాబట్టే అని అంటారు విశ్వనాథ.

ఇది సంప్రదాయ ధోరణి. ఇప్పటి కాలంలో సంప్రదాయ వర్గాలలో ఎందరికో భక్తి గౌరవ భావాలున్న పూరీ శంకరాచార్యులు శ్రీ నిశ్చలానంద సరస్వతి స్వామి వారు కూడా ఇదే అంటారు. భారతదేశం అనేది ఈ భూమండలం మొత్తానికి హృదయం వంటిదని అంటారు ఆయన. హిందూ దేవతలు దేవుళ్ళు అంతా ఎందుకు చాలా వరకు ఈ భారత భూ భాగంలోనే అవతరించారు అన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ. సంప్రదాయ ధోరణి ఇదే. మరెందరో ధర్మ గురువులు కూడా ఇదే మాట చెప్పారు.

“అన్ని యితరదేశములకు భారతదేశము నుండియే జనము వెళ్ళిరి. వారిచట నున్న ధర్మము నుండి భ్రష్టులై వెళ్ళినవారు. అచటనచట వారిసంఖ్య ప్రబలి రాజ్యములు నిర్మించుకొనిరి. ఇచటి విద్యలనే తీసికొని పోయిరి. అందుచేత సామ్యము ప్రబలముగా నుండును”

“అన్నివిద్యలతో పాటు సంగీతవిద్యకూడ అరబ, పారశీక దేశములకు పోయినది”

కాబట్టి ఈ నవలలో విశ్వనాథ సంగీతం విషయంలో ఉమ్మడి కల్చర్ ప్రోత్సహించినట్టుగా అనిపించినా కూడా దానిని అర్థం చేసుకోవలసిన విధానం అది కాదు. ఇక్కడి నుంచి వెళ్ళిన విద్య కొంత రూపాంతరం చెంది తిరిగి మళ్ళీ ఇదే నేలకు వచ్చినట్టు. పుట్టినిల్లు ఇదే. అది విశ్వనాథ చెబుతున్నది.

ఈ విషయాల గురించి చెబుతూ విశ్వనాథ ఈ క్రింది మాట కూడా అన్నారు. ఇక్కడ కూడా ఆంగ్లేయుల పాలనలో జరిగిన మార్పులకు ఇస్లాం పాలనలో జరిగిన మార్పుకు స్వరూపంలో తేడా ఉంది.

“రెండు వందల యేండ్లు పాశ్చాత్యులీ దేశము నేలి చారిత్రకముగా ననేకములైన దురభిప్రా యములకు ప్రచారము కల్పించిరి. వారు చేసిన దుండగములకు లెక్కలేదు. ఆర్యులని ద్రావిడులని యొక సిద్ధాంతమును పెట్టిరి. ఆర్యులు మధ్యఆసియాలోని వారని యొక సిద్ధాంతము పెట్టిరి. వేదములయు వేదాంగములయు కాలమును వారు యథేచ్ఛముగా తీర్మానించిరి”

ఆర్య ద్రావిడ సిద్ధాంతాలు చరిత్ర కాలగమనం గురించిన అస్తవ్యస్త ఆలోచనలు ఇవన్నీ కూడా మనకు ఆంగ్లేయుల పాలనలో అంటుకున్న జాడ్యాలు. ఇవి ఇస్లాం పాలనలో లేవు. అంత మాత్రం చేత హిందూ మతం ఇస్లాం మతం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు కాదు. రెంటికి తేడా ఉంది అని అర్థం అంతే.

తెలంగాణా గురించి ముఖ్యంగా భాగ్యనగరం గురించి ఇలా రాస్తారు విశ్వనాథ

“ఈ భాగ్యనగర రాష్ట్రములో, మరియు నీ ప్రాంతములందు, తొలినాడు కత్తులతో కటారులతో హిందువు లను ముసల్మానులుగా జేసిన కొన్నివందల యేండ్ల క్రిందటి టిప్పుసుల్తాన్ పోయెను. ఎవడో యొకసేనాని యెవడో యొకసుల్తాను పూర్వపు దండయాత్ర దినములలో భిన్నభిన్న ప్రాంతములను గెలిచికొనెడి దినములలో మతాంతరులను జేయుట యుండెడిది. బహుమనీ రాజ్యము పంచధా విభక్త మైనతరువాత నంత యొత్తిడి లేదు”

కత్తులతో కటారులతో టిప్పు సుల్తాన్ మతం మార్పించారు అని రాశారు కదా. దండయాత్రలు జరిగాయని మతాంతరీకరణ జరిగిందని కూడా స్పష్టంగానే ఉంది కదా? బహమనీ రాజ్యం విభక్తమయ్యాక ఒత్తిడి లేదు అంటే అదేదో ఆ రాజుల గొప్ప కాదు లేక హిందువులకు ఉమ్మడి కల్చర్ మీద ప్రీతి ఉన్నట్టేమీ కాదు.

“విజయనగర శివాజీ రాజ్యముల బలముచేత నాయొత్తిడి చాల తగ్గిపోయెను” అని అంటారు వెంటనే విశ్వనాథ.

ఆ రాజ్యాలు ఎందుకు ప్రతిఘటించాయి? కేవలం రాజ్య కాంక్ష కోసం మాత్రమే కాదు. అవి హిందూ రాజ్యాలు కనుక. పర మత రాజ్యాల దౌష్ట్యాలను అడ్డుకోవటం తమ కర్తవ్యంగా భావించాయి కనుక. నిజానికి హిందువులకు ఈ ఉమ్మడి కల్చర్ మీద అంత అభిమానమే ఉంటే శివాజీ ఎందుకు? విజయనగర రాజ్య వంశాలు ఎందుకు? రాజెవడడైతే నేమి? రాజు మతం ఏదైతేనేమి? అంతా మనవాళ్ళే మనదంతా ఉమ్మడి సంస్కృతి అని ఉదారవాదపు భావనతో ఊరకే ఉండేవారు కదా? ఎందుకు ఉండలేదు? ఎందుకంటే స్వ పర అన్న భేదం వారికి తెలుసును కనుక. ఈ పర సంస్కృతి నుండి ఆ స్వ సంస్కృతికి గల ముప్పును గుర్తెరిగారు కనుక. అందుకే వారి శక్తికి తగినట్టు ప్రతిఘటించారు.

ఆంగ్లేయుల కాలం గురించి ఇలా అంటారు విశ్వనాథ

“ఇంకను దేశమునుండి నాంగిలేయుల ప్రాబల్యము వచ్చిన తరువాత ముసల్మానుమతము లోనికి జనులను బలవంతముగా మార్చెడివారే లేకపోయిరి. సంఘములో ముసల్మాను లైనవారు, ముసల్మానులు కానివారు హిందువులుగా మిగిలి, కలసి మెలసి బ్రతుకుచుండిరి”

ఇక్కడ ప్రస్తావన రాలేదు కాబట్టి క్రైస్తవ మతాంతరీకరణ గురించి రాయలేదు. దాని గురించి వేరే చోట రాశారు ఆయన. ముసల్మానులు ముసల్మానులుగా హిందువులు హిందువులలాగానే బ్రతుకుతున్నారు అందరూ ఒకలాగా బతకట్లేదు. లక్షల సంఖ్యలో ఉండే ఇరుమతాల సామాన్య ప్రజలు యుద్ధాలు చేసుకోవాలి రక్తపాతాలు జరగాలి అని ఎవరు కోరుకుంటారు? అలా కోరుకోలేదు కనుక వెంటనే ఉమ్మడి కల్చర్ ఉదారవాది ఐపోవలసిన అవసరం కూడా లేదు.

భాగ్య నగర రాజ్యంలో ఉర్దూ రాజ భాష అవటం గురించిన ప్రస్తావన పదే పదే వస్తుంది ఈ పుస్తకంలో.

“ఈ రాష్ట్రములో నురుదూ రాష్ట్రభాష యగుట సుల్తానులు చేసినది కాని ప్రజలు కోరినది కాదు.” అంటారు ఒక చోట. రాజ్య పాలకుల ఆలోచనలకు ప్రజల అభిలాషకు తేడా తెలుస్తూనే ఉన్నది ఇక్కడ. ఉర్దూ షాయరీల గానం చెయ్యట్లేదు విశ్వనాథ ఇక్కడ.

అంతటితో ఆగక ఈ భాషల ప్రాపకం విషయమై ఇలా అంటారు

“ఇచ్చటి తురకలలో నందరును తెలుగుబాసయే మాటాడుదురు. పెక్కుమంది యిండ్లలో మాటాడునది తెలుగుబాసయే. ఈ లక్షణము దక్షిణదేశ మంతయు కలదు. దీనికి తమిళరాష్ట్రము గొప్ప యుదాహరణము. అచటి ముసల్మానులకు నురుదూభాష రానే రాదేమో! వారి సర్వ వ్యవహారములు తెలుగుబాస లోననే జరుగును. భాగ్యనగర రాజులు సుల్తానులై యుర్దూభాషను నిలబెట్టుటచేత నీ రాష్ట్రమునందలి తురక లుర్దూ భాషను మరచిపోలేదు.”

రాజు ఉర్దూను పట్టుకు వ్రేలాడటం వలననే ఉర్దూ భాషకు ప్రాబల్యం పెరిగింది. ప్రజల అభీష్టం మేరకు ఏమి కాదు అని అంటారాయన. ఈ కలిసి ఉండే సంధి కాలంలో కొందరు అధికారులకు బ్రాహ్మణులతో సచ్ఛూద్రులతో సత్సంబంధాలు ఉండటం గురించి కూడా రాశారాయన.

హైదరాబాదును పాలించిన నిజాం రాజుల గురించి ఇలా అంటారు ఆయన. ఈ వాక్యాలలో రాజ్యానికి మతానికి గల సంబంధం గురించి ఎడారి మతాలు చేసిన మతాంతరీకరణ గురించి కూడా ప్రస్తావిస్తారు.

“ప్రభువు తురుష్కుడు. తురుష్కులు వెలగలదుస్తులు ధరించుటకు పెట్టినది పేరు. వారి బ్రదుకులో సగము వెలగల దుస్తులు ధరించుటయే. వారికి భోగపరాయణత్వము బ్రతుకుతోడి లక్షణము. వారి మతము దానికెంతటి వ్యతిరేకమో, వారి బ్రదుకులు దానికంత యనుకూలము. వారిలో పెక్కుమంది ముసల్మాను మతాచారములు నెరపుటలో దిట్టలు. వారాచారదాసులు. ఆచారమే మత మనుకొనుటలో వారు హిందువుల కంటె పదియాకు లెక్కువ చదివిన వారు. ఏమతమున కైనను ప్రాణభూత మైనది శమదమాది షట్కము. అదిలేని మతము మతము కాదు. ఆ మతానుయాయి మతానుయాయి కాడు. లోకమునందు మతములు, రాజ్యములు విజృంభింప జేసికొనుట కుపయోగపడుచున్నవి. అందరును తమ మతము వారు కావలయును. ఇది యెట్లు కుదురును? అయినతరువాత లాభమేమి? ఆఫ్రికా దేశములో నమెరికా దేశములో పాశ్చాత్యులు తద్దేశీయులైన పూర్వజాతి మనుజులను చంపినంత మందిని చంపి, తక్కినవారిని క్రైస్తవులను జేసిరి. ఆమతము పుచ్చుకొని నంతనే మోక్షము వచ్చునని వారు చెప్పుదురు. అట్లే ముసల్మానులును చెప్పుదురు. మతాచారములకు దాటిన తరువాత సర్వజనులు క్రూరులే, సర్వజనులు దుష్టులే. అందరు నహంకార పూరితులే. అందరును కామక్రోధ పరాయణులే. వీరికి మతమెందు కుపయోగించుచున్న దనగా వీలైనచో తమ రాజ్యములను పెంపొందించుకొనుటకు. కానిచో మతము పేర తమలోపల నున్న దుర్జనత్వమును క్రూరత్వమును బాహిర పెట్టుటకు”

“ఆచారమే మతం అనుకొనుటలో వారు హిందువులకంటే పదియాకులు ఎక్కువ చదివారు” అనటంలో విశ్వనాథ మార్కు పరిశీలన ఉంది. అందరూ తమ మతము వారు కావాలి అని రాజ్య శక్తితో ప్రజల మతాన్ని మార్చే ప్రయత్నం గురించిన విమర్శ కూడా కనపడుతుంది మనకు పై వాక్యాలలో.

శివాజీ నాటకంలో కూడా ఔరంగజేబు చెల్లెలు రోషనారా ఇలా అంటుంది ఒక చోట.

“మతాభిమానం ప్రధానమైనదే. లోకములో నందరును తురుష్కులగుదురా? హిందువులుందురు, బౌద్ధులుందురు – పారశీకులుందురు, జైనులుందురు” అని.

ఈ మాటకు మౌలాలీ సమాధానం

“ఈ మాటలు పాదుషాగా రంగీకరింపరు. పది మాటలెందుకు? నీ అభిప్రాయములు పాదుషా గారికి గిట్టవు” అని. ఔరంగజేబును ఉద్దేశించి రాసినది ఇదంతా. అంటే రాజ్యం అంతా తురుష్క మతానికి మార్చాలి అనే భావన గురించిన మాట ఇది. ‘మ్రోయు తుమ్మెద’లో రాసింది కూడా అదే. ముస్లిం రాజుల మతావేశం వలన భారత సంస్కృతికి నష్టం లేదు అని విశ్వనాథ అభిప్రాయం అని ఎలా అంటాము ఈ వాక్యాలను చూచాక? మతాంతరీకరణకు రాజ్యం ఎలా సహాయ పడిందో రాశారు కదా? శివాజీ నాటకం గురించిన చర్చ ఎలాగూ పైన చూసాము. దక్షిణంలో హిందూ సంస్కృతి నిలబడటానికి కూడా హిందూ రాజ్యాల ప్రతిఘటనే కారణం అన్నారు విశ్వనాథ. ముస్లిం పాలన వలన భారతీయ సంస్కృతికి ఏ నష్టము లేదు అనుకుంటే అసలెందుకు ఈ చర్చలంతా?

హైదరాబాద్ ప్రజల సంస్కృతి గురించి ఇలా రాశారు ఆయన.

“ప్రభువు ముసల్మాను కనుక, ఆ మతపు పండుగ లన్నియు జరుగును. ప్రజలు హిందువులుగాన వీరి పండుగలును జరుగును. ఈ ప్రజలలో కొందరు తెలుగువారు, కొందరు మహారాష్ట్రులు, కొందరు కర్ణాటకులు, హిందువుల లోననే భాషారాష్ట్రములను బట్టి పండువులు భేదించును. మొత్తముమీద హైదరాబాదులో జరుగు పండుగల సంఖ్య యింతయని చెప్పుటకు వీలులేదు. ముసల్మా నుల పండుగలు, హిందువులభావముల చేత ముద్రితములై యుండును. ఇది పరస్ప రము విడదీయరాని ముద్ర”

ఇప్పుడు ఇక్కడ ఒకరి పండగల మీద ఒకరికి ముద్ర పడింది విడదీయరాని ముద్ర అని అన్నారు కనుక అదుగో ఉమ్మడి కల్చర్ వాదం ప్రస్తావన వచ్చేసింది అని ఆనందించనక్కర్లేదు. రక రకాల భాషా రాష్ట్రాల పండుగల వైవిధ్యతలో ఇది కూడా కలిసింది అంతే. ఇందులో గొప్ప ఏదైనా ఉంటే అది వైవిధ్యతను గుర్తెరిగిన సనాతన ధర్మ సిద్ధాంతాలలో ఇమిడి ఉంది. అంతే కానీ ఆ వైవిధ్యతను నిర్మూలించి మతాంతరీకరణ చేయాలని చూసే భావజాలంలో లేదు.

రాజు మతం ప్రజల మతంపైన చూపే ప్రభావం గురించి ఇలా అంటారు

“హిందువులు ప్రభుజాతి యైన తురుష్కులను జూచి తమ పండుగలు కూడ వారివలెనే వెలగల దుస్తులు ధరించికొని తిరుగుట ప్రధాన లక్షణముగా జేసికొందురు. రాజానుమతో ధర్మః! ధర్మము రాజానుమతమగుట యట్లుంచి యాచార ములు నిస్సందేహములుగా రాజానుమతము లగును. పలుమంది హిందువులు తురుష్కుల వలెనే కన్పింతురు. షరాయి, షేర్వానీ, అరబోపీ- ఈ మూడును ధరించిననే నాగరకమైన దుస్తులు ధరించినట్లు”

ఇది రాజ్యం ముసల్మానుల చేతులోకి వెళ్ళిపోవటం వలన వచ్చిన అవస్థ. దీనిని చూసి ఉమ్మడి కల్చర్ అని ఆనందిస్తే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు.

ఇక వ్యాసంలో మొదట్లో ప్రస్తావించిన అరిపిరాల శివాలయం దగ్గరికి వద్దాము.

“ముసల్మాను లా దేవాలయమును నాశనము చేసిరి. వారు చేసిరని వీరు చెప్పుదురు. అది యొక యపప్రధ యేమో!? వీరే తమ నిరాదర భావము వలన, తమ మతమునందు తమకు గాఢమైన యభిమానము లేకపోవుటవలన, తమదేవతలను తామే తిరస్కరించి, నాశనము చేసికొని, నింద ముసల్మానుల మీద మోపుచున్నారేమో!”

అవును ఈ వాక్యం విశ్వనాథ ఈ నవలలో ఈ గుడి విషయంలో రాశారు. కాబట్టి ఆ విమర్శ చేసిన మిత్రుడు ఈ వాక్యాన్ని పట్టుకుని తప్పంతా హిందువులదే అని తీర్మానం చేశారు.

అయితే దీని వెంటనే ఏం రాశారు? ఇదిగో ఇలా రాసారు

“వారొకప్పుడు దేవళపుగోడలు పడగొట్టవచ్చును. ఒక నందిముట్టె విరుగగొట్టవచ్చును. హనుమంతునితోక ఖండింపవచ్చును, దేవళమునందున్న దేవతా విగ్రహము యొక్క అభయహస్తమును ఖండింపవచ్చును. దానితో హిందువులు తద్దేవా లయమునం దర్చనలు చేయుట మానవలయునని యున్నదా? దేవతావిగ్రహమునకు నభయహస్తము ప్రధానము. ఆ యభయహస్తము మాలిన దేవతలను పూజించుట యెందుకనియా? ఆ దేవత తన్నారాధించువారి కభయ మిచ్చును. తన యభయము మాట యేమిచూచుకొనును? అట్టి దేవతను పరిత్యజించినమాత్ర మేమి నష్టము?”

ఇందులో ఆలయ విధ్వంసం జరిగింది అనే అంటున్నారు కదా. జరిగినంత మాత్రాన ఆలయాన్ని వదిలేయరాదని భావం. ఇలాంటి భావం ఉండటం వల్లనే సోమనాథ్ మందిరం అన్ని సార్లు పునర్నిర్మాణం జరిగింది. ఘజని దండయాత్రల కాలం తర్వాత ఆ గుడి పునర్నిర్మాణం అనేది జరుగుతూనే ఉంది. అయితే ఇటువంటివి జరగాలంటే ప్రజలు మాత్రమే పూనుకుంటే సరిపోదు. రాజు పూనుకోవాలి. రాజు అంటే పదవి మాత్రమే. ఆ వ్యక్తి అహిల్యాబాయ్ హోల్కర్ వంటి స్త్రీ మూర్తి కూడా కావచ్చు. ఆవిడ ఎన్నో దేవాలయాల పునర్నిర్మాణం గావించారు.

అయితే స్వతంత్ర భారతం సెక్యులరిజం అనే పేరు మీద హిందూ మత నిరాధారణ ఇతర మతాల ఆదరణ అనే విచిత్రమైన సిద్ధాంతం పెట్టుకుంది. ఏదో అడపాదడపా ఏదైనా ఆలయ పునర్నిర్మాణం జరుగుతోంది అనగానే హిందూ ఫాసిజం సావర్కర్ భూతం అనుకుంటూ పడిపోతారు సెక్యులర్ హిందూ మేధావులు. వీరికి అసలు హిందువుల నిరాదరణ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? వారికుందా అసలు హిందూ మతం లేదా సనాతన ధర్మం పట్ల అనురక్తి?

అయోధ్య ఆలయ నిర్మాణం కోర్టు తీర్పు తర్వాతే కదా జరిగింది? అయినా కూడా దాని మీద ఎన్ని విమర్శలు. సరే ఒక రాజకీయ పార్టీ దానిని ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంది అని అంటే మిగిలిన పార్టీలు ఏం చేస్తున్నాయి మరి? అన్ని పార్టీల వారు వచ్చి అవును ఇది హిందువులు అందరికి ప్రీతిపాత్రుడైన రాముని జన్మభూమి ఇక్కడ ఆలయం ఉండటం సబబైన విషయమే అని అన్నారా? లేదు. ఎందుకంటే ఈ సెక్యులర్ హిందువు అనే వాడు ఒకడు వచ్చి పడ్డాడు కనుక.

వాడికి తన దేవాలయం కాదు ముఖ్యం. ఈ వ్యాసం మొదట్లో చెప్పినట్టు ఆ ఆలయం గోడని ఆనుకుని ఒక మసీదు దానిని అనుకుని ఒక చర్చి వీలయితే బౌద్జ ఆరామము ఇంకా కుదిరితే యూదుల సినగాగ్ కూతవేటు దూరంలో రాజ్యాంగం చేతులో పెట్టుకుని ఉన్న అంబేడ్కర్ విగ్రహం దానిని ఆనుకుని కోర్టు ఇవన్నీ కావాలి.

ఇక జనాభా సంఖ్యల ప్రకారం ఇతర మతాల వారు ఉండనే ఉన్నారు. కొన్ని కొన్ని చోట్ల వారు హిందువుల కంటే ఎక్కువగా కూడా ఉన్నారు. ఆలయాల నిరాదరణకు అసలు కారణం ఇది. కాశ్మీర్ లో ఇప్పటికి ఇలా శిథిలావస్థలో ఉన్న ఆలయాలు ఎన్నో. వాటన్నిటి చూసి హిందువులు వట్టి వెధవలోయ్ అని అనట్లేదు విశ్వనాథ. రాజ్యానికి మతానికి గల సంబంధం గురించి చాలానే రాసారు ఈ ‘మ్రోయు తుమ్మెద’లో. పైన పేర్కొన్న వాక్యాలు వాటికి సాక్ష్యం. రాజానుమతో ధర్మః అన్న సిద్ధాంతం ప్రకారం చూస్తే ఇప్పుడంతా ఆంగ్లంలో HINO అని అంటారు కొందరిని ఉద్దేశించి హిందూస్ ఇన్ నేమ్ ఓన్లీ అని. వీరు పేరుకి మాత్రమే హిందువులు ఆచరణ ఉండదు అభిమానం అసలే ఉండదు. హిందువులు ఇలా తయారవ్వట్టానికి కారణం హిందూ మతం విషయంలో ఇప్పటి రాజు అంటే రాజ్యాంగ వైఖరి ఇలా ఉంది కాబట్టి హిందువుల వైఖరి కూడా ఇలా తయారయ్యింది అని. ఈ తలా తోకలేని సెక్యులర్ భావనను విశ్వనాథ వెనకేసుకు రాలేదు.

ఇక రెండు మతాలకు గల తేడా గురించి కూడా రాశారు ఇందులో విశ్వనాథ. మొన్నామధ్యన లండన్ విమానాశ్రయం లో సర్వ మత ప్రార్థన స్థలం ఒకటి కనపడింది. దాని తాలూకా కార్యవర్గ బృందంలో హిందూ మతానికి సంబంధించి క్రైస్తవ మతం వారి వలెనే ఒక chaplain ఉన్నాడట. హిందూ ఛాప్లైన్ అంటారట అతనిని. ఇది చూసినప్పుడు నేనిలా అనుకున్నాను, సరే ముస్లిం అయితే నమాజు చేసుకుంటాడు ఈ ప్రార్థన మందిరంలో సమయం సందర్భం లేకుండా హిందువులు ఏమి చేసుకుంటారు అక్కడ అని. విచిత్రంగా ఈ వ్యాసం కోసం ‘మ్రోయు తుమ్మెద’ చదువుతూ ఉంటే విశ్వనాథ ప్రార్థనల గురించి చేసిన ప్రస్తావన ఒకటి కనపడింది.

“ఆ విశ్వవిద్యాలయపు హాస్టలులో తురుష్క విద్యార్థులు కలరు. హిందూ విద్యార్థు లును కలరు. ముసల్మాను విద్యార్థులకు నమాజు చేసికొనుట కొకగది యున్నది. హిందూ విద్యార్థులకు ప్రార్ధన చేసికొనుట కొకగది యున్నది. హిందూ విద్యార్థులలో పలుమంది ప్రార్ధనలకు పోనేపోరు. హిందూమతములో నట్టి ప్రార్ధనలు లేవు” అంటారు ఇక్కడ ఆయన. ఈ ప్రార్థన అన్న భావన హిందువులకి లేదంటూ ఒక విశ్వనాథ మార్కు పరిశీలన చేశారు. దీని గురించి వివరిస్తూ ఇలా రాశారు

“బ్రాహ్మణు లైనవారు తదాచార పరాయణు లైనచో సంధ్యావందనమును చేయుదురు. కొందరు దేవతార్చనలు చేయుదురు. కొందరు మంత్రములను జపింతురు. తక్కినవారు సంధ్యావందనములు చేయుదురు. అట్టికర్మ వీరికి లేదు. సాయంకాలములయందు దేవాలయములకు పోవచ్చును. శనివారములయం దుపవాసము లుండవచ్చును. ఏకభుక్తము లుండ వచ్చును. ఏకాదశి మొదలైన దినములయందు భగవద్భావముతో నుండుటయు, నాచారములను పాటించుటయు, నియమముగా నుండుటయు, శుభాశుభ కర్మల యందు కొన్ని నియమములను పాటించుటయు, భజనలు మొదలైనవి చేయుటయు, భారత భాగవతములను చదువుటయు, యీ జగమంతయు భగవన్మయమని తెలిసికొని తాను శమదమాది గుణముల నభ్యాసము చేయుట చేత పరమేశ్వర సన్నిధి నుండుటగా భావించుటయు- నిదియే సామాన్యులయిన హిందువులయొక్క మతభావన”

ఇలా హిందువులకు ప్రార్థన మందిరం అవసరం అంతగా లేదు అంటూ మన మతానికి పర మతానికి గల తేడా చెప్పారు. ఇందులో ఇతర మతాల వారి పట్ల ద్వేషం ఏమీ లేదు. ఈ విధంగా చూస్తే విశ్వనాథకు కొందరు హిందుత్వ వాదులకు తేడా ఉంది అనటం వాస్తవమే. హిందుత్వ వాదులు నాకు తెలిసి ఆచార నియమాలన్నీ పాటించండయ్యా అని ఉద్యమాలు చెయ్యట్లేదు. అవసలు ఆవేశపూరిత ఉద్యమాలతో తేలే విషయాలు కావు బహుశా. విశ్వనాథ హిందూ మతాచారాల గురించి ప్రస్తావిస్తూనే ఇస్లాం ఆచారాలతో తేడాను కూడా ఎత్తి చూపారు.

ఈ ప్రార్థన అనే భావం గురించి మరికొంత విస్తృత ఆలోచన చేశారు విశ్వనాథ. శ్రవణము మననము ధ్యానము వంటివి మన దగ్గర ఉన్నాయి కానీ ప్రార్థనలు లేవు అని అంటారు విశ్వనాథ. ఈ మాటలలో కూడా పెరమతముల ఒత్తిడి ప్రభుత్వ లక్షణం గురించిన ప్రస్తావన ఉంది. హిందువుల నిరాదరణ చేతకానితనం అంటూ తప్పంతా హిందువుల మీదకు తోయలేదు. పర పాలనలో ఉన్న ఒత్తిడి గురించి రాజ్య శక్తి ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అన్న దాని గురించి కూడా రాసారు.

“ప్రొద్దుననే స్నానము చేయవచ్చును. రామ, కృష్ణ యనుకొనవచ్చును. భోజనా త్పూర్వము సర్వజనులు భగవద్భావన చేయుదురు. లోన భగవచ్ఛక్తి యైన చైతన్య మున్నది. ఈ శరీరము భోజనము చేత పోషింపబడుచున్నది. శరీర మున్నన్నినాళ్ళు లోపలిచైతన్య మున్నది. అనగా భగవంతు డున్నాడు. తినిన యన్న మా భగవంతుని భావనకు దోహద మగుచున్నది. అందుచేత నన్నమే భగవత్స్వరూపము. భోజనక్రియ భగవ ద్వ్యాపారము. ఇది హిందూమతములోని ప్రథమ సిద్ధాంతము. వీరికి ప్రార్థనలు లేవు. ధ్యానము కలదు. శ్రవణము కలదు. మననము కలదు. ప్రార్థన యేమి? ఏమని ప్రార్థింపవలయును? హిందూమతమున కీ భావన తెలియదు. ప్రార్థనలు ప్రధానముగా గల పెరమతముల యొత్తిడి, ప్రభుత్వ లక్షణము చేత భారతదేశమున బలవత్తరము కాగా, వారిని చూచి వీరును ప్రార్థనల నారంభించిరి”

ఆహా హిందువులు కూడా ముసల్మానుల వలె క్రైస్తవుల వలె ప్రార్థనలు చేసుకుంటున్నారు ఎంత గొప్ప ఉమ్మడి కల్చర్ అని ఆనందించట్లేదు ఇక్కడ విశ్వనాథ. ఎందుకంటే భారతీయ సంప్రదాయం గురించి ఆయనకు ఖచ్చితమైన అభిప్రాయం ఉంది కాబట్టి. స్వ పర అనే భేదాన్ని ఆయన గుర్తించాడు కాబట్టి.

 ఇంతటితో ఆగలేదు విశ్వనాథ

“సంప్రదాయముగా వచ్చుచున్న యొక లక్షణము తరిగి, పెర సంప్రదాయముతో గూడిన యొకలక్షణము పెరిగెను. మానవుని బ్రదుకు భోజనముమీద నాధారపడి యున్నది. భోజనము ధనముమీద నాధారపడి యున్నది. ధనము రాజుయొక్క ధనముమీద నాధారపడి యున్నది. అందుచేత రాజమతము నందలి భావములకు ప్రాధాన్యము వచ్చెను. వారును మన మతమునందు సానుభూతి యేమియు లేని వారయ్యును, వారికి ధనాదాయము ప్రజల వలన రావలయును గనుక, ప్రజలయొక్క కొన్ని విశ్వాసములను పాటించినట్లు కనిపింప జేసినచో వారినుండి రాబడి సుఖముగా వచ్చును. కావున హిందూమతము నందు సానుభూతి కలవారివలె నభినయింతురు”

ఇక్కడ కూడా సంప్రదాయముగా వచ్చిన లక్షణము తగ్గటం పెర సంప్రదాయంతో కూడిన లక్షణం పెరగటం గురించిన ప్రస్తావన ఉంది. ఇంత ఖచ్చితంగా ఆయన తేడాలు చెబుతూ ఉంటే ఉమ్మడి కల్చర్ అనటం ఏమిటి? ముస్లిం పాలన వలన మనకు ఏ నష్టం లేదు అని అయన అనుకున్నారు తప్పంతా హిందువులదే అని అనటం ఏమిటి? ఇక చివరన హిందూ మతం నందు సానుభూతి గల వారివలె ప్రభుత్వం వారు అభినయింతురు అన్నది నూటికి నూరు పళ్ళు నిజం. ఇది పరాయి పాలకుల విషయంలోనే కాదు. మన దౌర్భాగ్యం కొద్దీ మనది సెక్యులర్ రాజ్యాంగం సెక్యులర్ ప్రభుత్వ యంత్రాంగాలు. అవి కూడా ఈ సానుభూతి అనే నటన మీదనే నడుస్తాయి. ఈ జాడ్యం పట్టిన వ్యక్తికి వాడు పుట్టుక తోనే హిందువు అయినా కూడా తన రాష్ట్రంలో తన దేశంలో హిందువులు తొంభై శాతం ఉన్నా పది శాతం ఉన్నా తేడా లేదు.

ఎందుకంటే సెక్యులర్ సిద్ధాంతం చివరాఖరికి మెజారిటీ మతాన్ని పారద్రోలటానికి ప్రయత్నం చేస్తుంది. ఇది మెజారిటీ మత నిర్మూలన చుట్టూతా తిరుగుతుంది. ఎందుకంటే ప్రజల నాడి దానితో అల్లుకుని ఉంది కాబట్టి. ఇదంతా రాజ్య శక్తి కోసం జరిగే ప్రచ్ఛన్న యుద్ధం. అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా లేదు ఈ విషయంలో. అదలా ఉండనివ్వండి.

స్వ సంప్రదాయం పెర సంప్రదాయం అన్న తేడా గురించి విశ్వనాథకు స్పష్టమైన అవగాహన ఉంది. హిందువులు అందరు కూడా దానిని పెంపొందించుకోవాలి. దీనికి హిందుత్వ అని పేరు పెట్టినా సనాతన ధర్మం అని పేరు పెట్టినా పెద్ద నష్టం లేదు. ఉమ్మడి కల్చర్ వెంపర్లాట అక్కర్లేదు దీనికి. నీవు నీ మతాచారం పాటించడానికి నీకు పక్కింట్లో పక్క మతం వాడు ఉండాల్సిన పనేమీ లేదు. ఒకవేళ లేకపోయినా కూడా నీవేమీ బాధ పడనక్కర్లేదు అయ్యో నా ప్రాంతంలో వైవిధ్యత తగ్గిపోతోందే అని. మరొక్క విషయం గమనించాలి. ఒక వేళ పర మతం వాడు ఉంటే పనిగొట్టుకుని వాడిని దేశ బహిష్కరణ కూడా చేయమని విశ్వనాథ చెప్పట్లేదు.

ఇంతేకాకుండా ప్రజల పై రాజ్య శక్తి ప్రభావం గురించి మరికొంత రాస్తారు విశ్వనాథ

“రెండుదేశములున్నవి. రెండుమతములున్నవి. ఒకదేశమువారు మరియొక దేశమువారిని పాలించుట జరుగును. ఒకమతమువా రింకొకమతమువారిని పాలించుట జరుగును. ఇది పూర్వకాలపు మాట. నేటి కాలపు మాట, ఒక సిద్ధాంతమువా రింకొక సిద్ధాంతము వారిని పాలించుట జరుగును. ఒకపక్షమువారు మరియొక పక్షము వారిని పాలించుట జరుగును. వారిని వీరు న్యాయముగా పాలించరు. తనమతము మొదలైన వానికే ప్రాధాన్య మిత్తురు. పెద్దపెద్ద యుద్యోగము లన్నియు తమవారికే యిచ్చుకొందురు. వారిని బానిసలవలె జూతురు. అంతియేకాక తమమతము మొద లైనవియే లక్ష్యభూతము లనియు, పాలింపబడుచున్నవారి యాచారములు, విశ్వాసములు అనాగరకము లనియు బోధింతురు. పాలింపబడుచున్నవారిలో కొందరు పాలకుల భావముల కనుకూలముగా నుందురు. వారి కుద్యోగములు మొదలైనవి దొరకును. వారు స్వజాత్యాదుల యందు విరోధము వహింతురు. స్వజాత్యాదులను నిరసింతురు. నీ వన్నము దేనినిబట్టి తినుచున్నావో దానియందు నీ కభిమానము కలుగును. ఇది సామాన్య జంతులక్షణము”

హిందువులకు కొన్ని వందల ఏళ్ళుగా పట్టిన జబ్బు ఇదే. స్వజాత్యాదుల పట్ల విరోధం. నిరసన భావం. ఇది ఇస్లాం పాలనలో ఒక లాగా ఆంగ్లేయుల పాలనలో మరొకలాగా రూపాంతరం చెందింది. విశ్వనాథ కేవలం ఆంగ్లేయుల పాలనను మాత్రమే విమర్శించలేదు. ఇస్లాము పాలనను కూడా విమర్శించాడు. అయితే రెంటినీ ఒకటే లాగా విమర్శించలేదు. ఒక్కో దాని ప్రభావం ఒక్కోలాగా పడింది మన సంస్కృతి మీద. ఆ తేడాను ఆయన గుర్తించాడు.

పరంపరగా వచ్చిన సంప్రదాయానికి వర్తమానానికి మధ్యన ఉన్న సంఘర్షణను విశ్వనాథ గుర్తించారు. ఇలా అంటారాయన ఈ విషయమై:

“ఈ మానవకోటి యన్నది యొకటున్నది. మూడుకాలముల మీద జాతిమొత్తము మీద- నొకపరంపర, యొక సంప్రదాయము, నొక విశ్వాసము, కొన్ని యాచారములు ప్రబలియుండును. అవియన్నియు గలిపి జాతి లక్షణముగా భాసించుచుండును. ఈజాతిలక్షణ మొకటి యున్నది. వర్తమానమునం దొక మానిసి యున్నాడు. వాని బ్రదు కొకటి యున్నది. ఈ రెంటికిని నిత్యసంఘర్షణము. వ్యక్తి తనజాతి యొక్క లక్షణమును తా నవగతము చేసికొని, దానిని జీర్ణించికొని, తన బ్రదుకు దానినీడలో నడుపవలయును. అప్పుడు వా డా జాతికి చెందినవా డగును”

ఇలా జాతి లక్షణానికి అనుగుణంగా బతికే పద్దతి ఒకటి ఉంది. ఇది అందరికీ సాధ్య పడేలాగా ఉండాలి అంటే రాజ్య సంరచన దీనికి అనుగుణంగా జరగాలి.

అయితే అంతటితో ఆగలేదు విశ్వనాథ.

“ఈ మానవసృష్టియం దనేక మతములు కలవు. పలుజాతులు కలవు. ఒక్కొక్క దేశమునం దొక్కొక్క మతము తలయెత్తును. విజృంభించును. అట్లే యింకొక దేశమునం దింకొక మతము. ఒక దేశమునం దొక సంప్రదాయము. మరియొక దేశమునం దీంకొక సంప్రదాయము. ఏ మతమువా రామతమును, యే సంప్రదాయమువా రా సంప్రదాయమును పరిగణించి, పాటించి, యాచరించినచో వచ్చిన నష్ట మేమి?” అని అంటారు ఆయన.

ఇటువంటి వ్యాఖ్య ఆనంద కుమారస్వామి కూడా చేస్తాడు. Proselytising Fury అని అంటారు ఆయన. అంటే ఇతర మతాల వారిని తన మతంలోకి ఎలాగైనా సరే మార్చాలి అనే మతావేశం. భారతదేశంలో మత ప్రచారం పేరిట వచ్చేవారు ఈ మతాంతరీకరణ అనే ఆవేశం తగ్గించుకోవాలని అంటారాయన. విశ్వనాథ ఇక్కడ ప్రస్తావించేది కూడా అదే. ఎవరి జాతి సంప్రదాయాన్ని అనుసరించి వారిని బతకనిచ్చే లక్షణం ఉంటే అంతా బానే ఉంటుంది. కానీ మతాంతరీకరణ అనే బలమైన భావనతో రాజ్య శక్తి కలగలసిన మత సంస్కృతులు కొన్ని ఉన్నాయి. వాటితోనే వచ్చే చిక్కంతా. అదే విశ్వనాథ చెబుతున్నది. అంతే కానీ ఇస్లాం రాజ్య శక్తుల మతాంతరీకణ భావాల వలన ఉమ్మడి సంస్కృతి వచ్చిందని అది శుభ పరిణామమనీ క్రైస్తవ వలసవాద రాజ్యం హిందువులకు చేటుని తెచ్చింది కాబట్టి ఆంగ్లేయుల పాలన మాత్రమే తప్పు దానిని మాత్రమే విమర్శించాలి అని ఆయన అనలేదు. అది కాదు విశ్వనాథను అర్థం చేసుకోవలసిన విధానం.

“ఈ అనంత కాలములో, యీ యఖండప్రపంచకములో నొక కాలఖండమున నొక దేశభాగమున జనించినవాడు తన జాతి సంప్రదాయమును తిరస్కరించి పరజాతి సంప్రదాయముల స్వీకరించుట వలన నతడు సృష్టికి చేసిన యుపకార మేమి? తనజాతికి పొనరించిన మేలేమి? తనకు దా జేసికొనిన మహోపకృతి యేమి?” అని కూడా అంటాడు విశ్వనాథ. తన జాతి సంప్రదాయమును పర జాతి సంప్రదాయంతో సాంకర్యం చేసి ఉమ్మడి కల్చర్ అనొక దానిని తయారు చేసుకోండయ్యా అని ఆయనేమీ ఉపదేశం ఇవ్వలేదు. అదేదో గొప్ప విషయం లాగా దానికేమి కిరీటం పెట్టలేదు.

మతాంతరీకరణ గురించి ఇంకొక వ్యాఖ్యానం చేస్తారు విశ్వనాథ

“ఇంతకంటె నఖండు డింకొకడు కలడు- తా జెడ్డ కోతి వన మెల్ల జెరచె నని, తనజాతికి తన సంప్రదాయమునకు తన యాచారములకు తా నొక్కడు విరోధి యగుట చాలక పరులను కూడ తాదృశులనుగా జేయుటకు బ్రతికియున్నన్నినాళ్ళు ప్రయత్నము చేయును”

ఇక్కడ కూడా తన జాతి తన సంప్రదాయము అని స్వ పర బేధాలను ఎత్తి చూపారు విశ్వనాథ.

పాలకుని జాతి పాలితుల జాతి వేరే అయినప్పుడు పరిస్థితులు ఎలా మారతాయి అన్న విషయమై విశ్వనాథ విశ్లేషణ చూడండి.

“ఒక పెరజాతి యొకజాతిని పాలించుచుండును. పాల్యమగుచున్న జాతి పాలకుని దురుద్ధతను నిత్యము నెదిరించుచుండును. హింసింపబడుచుండును. ఎప్పుడో నిష్కృతి కలుగుదాక నిట్లు జరుగుచునే యుండును. ఇచట జాతియన్నది యుప లక్షక శబ్దము. తొలుత చెప్పిన మత సిద్ధాంత పక్షములు కూడ దీనిక్రిందనే వచ్చును. పాల్యమై అధఃకరింపబడుచున్న జాతి దుష్టుడైన పాలకుని దుర్లక్షణముల నెదిరించుటలో పలుత్రోవలు పోవును”

ఇక్కడ కూడా ప్రతిఘటన గురించిన ప్రస్తావన ఉంది. పాలితులు పాలకులకు ఎదిరించటం గురించిన ప్రస్తావన ఉంది. ఈ ఎదురు తిరగటం విషయంలో పాలకులు పాలితుల పై చేసే హింస గురించిన ప్రస్తావన కూడా ఉంది. ఇవన్నీ చూసి కూడా ముస్లిం పాలన వలన హిందూ సంస్కృతికి ముప్పు లేదని విశ్వనాథ అన్నాడు అని అనుకోవటంలో ఆంతర్యం ఏమి? పర జాతి వాడు వేరే జాతి వాడిని పాలించినప్పుడు జరిగే సంఘర్షణ గురించి ఇంత చక్కగా రాశారు కదా. రాజు మతం ప్రజల మతం వేరు అయినప్పుడు వచ్చే సమస్య గురించి విశ్వనాథ చర్చించారు కదా ఇక్కడ. ఇదే మ్రోయు తుమ్మెద నవలలో?

ఇది కాక చాలా ఏండ్లు ఆ పర మతాల పాలనకు లోనైన పాలితులలో వచ్చే ఆత్మ న్యూనతా భావం గురించి ఇలా రాశారాయన

“తానా జాతికి లౌకికముగా, నాధికారికముగా, శరీర బల విషయికముగా తగ్గిపోవుటచేత, ఆ జాతికి తనయందు తనకొక యవిశ్వాసము ప్రబలును. ఆ పెరజాతి వచ్చి తనమీద నధికారము చేయుటకు నా జాతియొక్క సంప్రదాయ విశ్వాసాచారముల యందొక యాధిక్య మున్నదని భావించును. అట్టి యాధిక్యము తనజాతి యొక్క మతవిశ్వాసాదులయందు కూడ కలిగించుకొనవలయు నని ప్రయత్నించును”

కొన్ని వందల ఏళ్ళుగా పర పాలన ప్రభావానికి లోనైన హిందువులకు స్వజాతి స్వసంప్రదాయం పట్ల ఈ అవిశ్వాసము ఆత్మ న్యూనత భావం పేరుకు పోయింది. ఇది ఆంగ్లేయుల పాలన తర్వాత మరింత వికటించింది. ఇప్పటికీ ఎందరో హిందూ మేధావులులో కూడా ఈ భావన ఉన్నది. అంటే మేము సనాతన ధర్మం పక్షం అనే మేధావి వర్గం వారిలో కూడా ఉంది ఇది. క్రైస్తవులలో ముసల్మాను సంస్కృతులలో ఏదో ఆధిక్యత ఉంది అన్న భావన చాలా మంది హిందువులలో ఉంది. ఈ ప్రభావానికి లోనైన హిందువులు తమ మతాన్ని మార్చుకోవటానికి చేసిన ప్రయత్నాలు కొన్ని ఉన్నాయని అంటారు ఆయన.

“ముసల్మానుల చేత, ఆంగిలేయుల చేత పరిపాలింపబడిన హిందూజాతి, వారి మతమువంటి లక్షణములు తనయందు కూడ వెలయించుకొనుటకు జేసిన మహాప్రయత్నములు మూడువిధములుగా నున్నవి” అంటారాయన.

ఇక్కడ కూడా ముసల్మానులు ఆంగ్లేయలు అని ఇరువురి పాలన గురించి రాసారు ఆయన. కాబట్టి విశ్వనాథ ఆంగ్లేయుల పాలన వలన మాత్రమే హిందువులకు నష్టం వాటిల్లిందని అన్నారు ముస్లిముల పాలనను అయన విమర్శించలేదు పైగా ఉమ్మడి కల్చర్ ను వెనకేసుకు వచ్చారు అని అనటం సబబు కాదు. ఆ రెంటిని కూడా పర పాలన కిందే గుర్తించారు విశ్వనాథ.

ఈ మూడు మహా ప్రయత్నాల గురించి ఆయన ఇలా అంటారు

“శూన్యవాదమును ప్రతిపాదించి భగవంతుడు లేడని చెప్పి నాస్తికమతములకు శిరోభూషణమైన బౌద్ధమతమును హిందువులలో కొందరు గొప్పమతముగా స్వీకరించిరి. ఆ మతమును పుచ్చికొనినవారు లేరు కాని దాని యందు వీరు నెరపుచున్న యాదరము పట్టరానిదిగా నున్నది. రెండవది బ్రహ్మసమాజము. మూడవది ఆర్యసమాజము”

ఇప్పటి హిందుత్వ రాజకీయ భావజాలం పై ఆర్య సమాజ ప్రభావం ఉంటే ఉండవచ్చును నాస్తిక మత భావాల ప్రభావం కూడా కొంత ఉండే ఉండవచ్చును. అయితే ఈ ప్రయత్నాలు ఇలా ఎందుకు జరిగాయి అనే విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.

ఇక సనాతన ధర్మం గురించి వర్ణాశ్రమాల గురించీ విశ్వనాథ వారి వాదం లోక విదితమే. ఇలా అంటారాయన ‘మ్రోయు తుమ్మెద’లో సనాతనధర్మము లేదా సనాతన మతము గురించి. ఈ మతము స్వరూపమే వేరు అంటారు. ఇక్కడ కూడా స్వ పర భేదాన్ని పాటించారు ఆయన

“భారతదేశమున నున్న మతముపేరు సనాతనమతము. ఈ మతము యొక్క స్వరూపమే వేరు. ఇతర మతములతో పోల్చినచో నీ యంశము నందును దీనికి పెరమతములయందు సామ్యము కుదరదు. ఈ మతములో నున్న ప్రధాన విషయము వర్ణాశ్రమాచార ధర్మములు. ఈ మతము యొక్క పైక ట్టిది. ఇది లేక హిందూమతమే లేదా యన్నంతటి కట్టుదిట్టములతో దేశము నందు సంఘమునందు వర్ణవ్యవస్థ చొప్పించబడినది. మతమునకు దానికి నవినాభావ సంబంధ మున్నట్లు చేయబడినది. ఈ వర్ణభేదము పెరమతస్థులకు మ్రింగ ననువుకాని పచ్చివెలగకాయ యైనది”

ఇతర మతాలలో ఉన్న భేదాల గురించి కూడా ప్రస్తావిస్తారు ఇక్కడ విశ్వనాథ. నిజానికి ఈ వ్యాసానికి ఇది అంత అవసరం లేదు. వర్ణాశ్రమ భేదాల గురించిన చర్చ ఈ వ్యాసానికి అనవసరం. అయితే ‘మ్రోయు తుమ్మెద’లో పలు చోట్ల బహమనీ సామ్రాజ్యపు ప్రస్తావన వస్తుంది. హైదరాబాద్ నిజాము రాజ్యానికి ఆ సామ్రాజ్యానికి ఉన్న లంకె వలన. ఇక్కడ కూడా వస్తుంది. ఈ వ్యాసం మొదట్లో చెప్పినట్టు వక్రరేఖ అంతా కూడా ఆ బహమనీ రాజుల గురించే. గమనించుకోవల్సిన విషయం ఇది.

“చెప్పరానన్ని భేదములు లేని మతమే లేదు. ముసల్మానులలో వందశాఖ లున్నవి. వారి కొకరి కొకరికి పడదు. ఒక్క మతవిశ్వాసములకు సంబంధించిన శాఖలే కావు. భారతదేశము నందలి మతసంప్రదాయములలోని భేదము లట్లుంచగా దేశీయులైన ముసల్మానులు, పరదేశీయులైన ముసల్మానులు, వారికి వీరికిగల ద్వేషమే రాజ్యనాశనము నకు కారణమగుచున్నది. బహమనీరాజ్య మైదుగా విభక్తమగుటకు ప్రధానకారణ మిది”

ఇలాగే క్రైస్తవ మతములో గల భేదాల గురించీ ఆర్య సమాజం పుట్టుకకు దారితీసిన పరిస్థితులు దాని తీరుతెన్నులు గురించిన వ్యాఖ్య ఇది. ముసల్మానుల చర్యల పట్ల ఆర్య సమాజం వారికి గల ప్రతీక్రియావేశము గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ఇక్కడ.

“క్రైస్తవమతము లోని భేదములు కొన్ని వందలు. ఈ భేదము లన్నియు సమంజసములు, సమ్యగతములు! భారతదేశ మందలి వర్ణభేదము విపరీతమైనదిగా భావింపబడెను. ఎవ్వడేమి చెప్పగలడు? ఏది యెట్లయిన భేదములు లేవని పైకి జెప్పుచున్న ముసల్మాను క్రైస్తవ మతములతో పోటీపడుటకు హిందూమతము పెంచికొనిన బ్రహ్మసమాజార్య సమాజములలో నార్యసమాజము కొంచెము తీవ్రత యెక్కువగల మతము. కొద్దిలో మొగలుల నాడు సిక్కుమత మెట్లు పుట్టినదో, యాధునిక కాలమున నార్యసమాజమట్లు పుట్టినది. ఈ యార్యసమాజము సికిందరాబాదు నగరమున కొందరు వర్తకుల యాదరణము చేత వృద్ధిపొందెను. ముసల్మానుల యౌధ్ధత్యము నెదుర్కొనుటకు నార్యసమాజ మవసరమయ్యెను. ఈ యార్యసమాజము తిరిగి తిరిగి ముసల్మానుల యౌద్ధత్యము పెరిగినప్పుడెల్ల తాను ప్రతిక్రియావేశము నెరపుచుండెను”

భారతదేశానికి స్వాతంత్య్రము రావటం గురించీ సర్దార్ పటేల్ వివిధ ప్రాంతీయ సంస్థానాల విషయంలో ఎదుర్కొన్న సమస్యల గురించి కూడా రాశారు ఈ నవలలో. చూచాయగా ఖాసీం రిజ్వి ద్వేషపూరిత ఆలోచనల గురించి కూడా ప్రస్తావిస్తారు విశ్వనాథ. నిజాం రాజు వైఖరికి ఖాసిం రిజ్వి వైఖరికి తేడా ఉందని కూడా అంటారు. ఖాసిం రిజ్వి పేరు ఎత్తితేనే ఆమ్మో ఇదంతా హిందుత్వ కదా నీవు సావర్కర్ వర్గం వాడివా అంటూ సావర్కర్‌ని భూతంగా చూపి ఇలా ఖాసీం రిజ్వి గురించి చర్చిస్తే ఏదో మహా ఘోరం జరిగిపోతుందని భయపెట్టే ప్రయత్నం చేసే మేధావి వర్గం వారు ఉండనే ఉన్నారు మన దగ్గర. వీరికి అవకాశం ఇస్తే ఖాసిం రిజ్వీ గురించిన ఈ ప్రస్తావనను పుస్తకం నుంచి తొలగించేసి తెలంగాణలో హిందూ ముసల్మాను మైత్రి గురించి మాత్రమే విశ్వనాథ రాసాడు అని అన్నా అంటారేమో బహుశా.

ఈ వ్యాఖకు ఈ వ్యాసానికి అట్టే సంబంధం లేకపోయినా కూడా నాకు నచ్చింది కనుక ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

“పరజాతి చేత పాలింపబడుచున్న జాతి జీవితములో నిత్య మీరితిగా జాతి సంప్రదాయ గౌరవరక్షణకు, వ్యక్తిజీవనమార్గ సంపాదనకు, సంఘర్షణ జరుగుచుండును. ఈ సంఘర్షణలో గొందరుపడి నలిగిపోవుదురు. వారివలన భవిష్యజ్ఞనులకు లాభము కలుగును. వారి జీవితములు మాత్రము వృథా యగును. వారు నలిగిపోదురు. వారు నశించిపోయినను పోవచ్చును. వారు వీరులు. తక్కినవారు సామాన్య మానవులు”

ఇటువంటి వారు కేవలం వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా ధర్మ రక్షణ పునరుజ్జీవనం కోసం చేసిన ప్రయత్నాల వలననే హిందూ సంస్కృతి ఈ మాత్రమైనా మిగిలింది ఈ నేలలో ఇన్నేళ్ళ పర పాలనా దండయాత్రలు యుద్ధాలు దౌష్ట్యాలు జరిగినా కూడా. వీరంతా కూడా వారి వ్యక్తిగత జీవనంలో ఎన్నో కష్టాలు అనుభవించారు జీవిక అంతా కూడా చాలీ చాలని సంపాదనతోనే.

మరొకచోట విశ్వనాథ అక్బర్‌ను గొప్ప చక్రవర్తి అంటూనే ఔరంగజేబు వైఖరిని విమర్శిస్తాడు.

“క్షత్రియులలో రఘువంశ మున్నది. దిలీపుని మొదలు శ్రీరామచంద్రుని వరకు వారందరు మహానుభావులు. నిన్న మొన్నటి మొఘలు వంశము చూడుము! వారిలో నిజముగా గొప్పవా డక్బరు చక్రవర్తి యొక్కడే. ఔరంగజేబు, కౌరవవంశమునకు దుర్యోధనునివలె పుట్టినాడు”

అయితే రాముడిని అక్బర్‌ను ఒకే గాటన కట్టినట్టు కాదు దీని అర్థం. ఆ మాత్రం తేడా గమనించగలిగితే చాలు. రామ రాజ్యం అక్బర్ రాజ్యం ఒకటే అన్నట్టు కాదు. అలా వక్ర భాష్యం చేయకపోతే చాలు.

తెలంగాణ ప్రాంతంలో జన జీవనం గురించిన మరొక సంభాషణ ఇది. ఇందులో కొందరు బ్రాహ్మణుల గురించి ఒక వెలమ కులానికి చెందిన పాత్ర గురించిన చర్చ ఉంటుంది.

“మనది తురకదేశము. చదివినది తురక చదువు. సంస్కృతాంధ్ర గ్రంథములతో నింతటి పరిచయ మెట్లు గలిగెను?” అని ఆ వెలమ కులానికి చెందిన ఒక పాత్ర గురించి మరొక పాత్ర వేసిన ప్రశ్న ఇది. తురక చదువు చదివినా కూడా భారతీయ భాషలలో ఇంత పాండిత్యం ఎలా వచ్చింది అని ప్రశ్న. పాఠశాలలో చెప్పెడి చదువుకు స్వజాతీయ సంప్రదాయానికి గల లంకెను విశ్వనాథ గుర్తించినట్టుగా గుర్తించిన వారు చాలా తక్కువ మన దేశంలో. ఆ ప్రశ్నకు సమాధానంగా మరొక పాత్ర అంటుంది ఇలా.

“వారు వెలమవారు. ఈ దేశములో వెలమవారు నాగరకులని చెప్పవల యును. సంప్రదాయములను నిలబెట్టుకొన్నారని చెప్పవలయును. మన రాష్ట్రములో నమాజు చేసెడివారు బ్రాహ్మణులలో నున్నారు, వెలమలలో లేరు. ఉన్నచో రెడ్లలో నుందురు. వెలమవారు సంప్రదాయ రక్షకులు. వీరి నాయనగారికి భారత భాగవత ములు హృత్కవిలె గా నుండును. ఆ యింటిలో ప్రొద్దుననే లేచి రుక్మిణీకళ్యాణము, గజేంద్రమోక్షము, ప్రహ్లాద చరిత్రము పారాయణము చేయుదురు. అనేక స్తోత్రములు చదివికొందురు. ఇతడి కవియన్నియు యేలరావు?”

సంప్రదాయ రక్షణ అంటే అది మరి విశ్వనాథ వారి ఉద్దేశ్యంలో. “ఆహా ఆ బ్రాహ్మణుడు చేయుచున్న నమాజు చుడండి! ఇదియే కదా మన ఉమ్మడి సంస్కృతిలోని రస రమ్యత! బహు చక్కగా యున్నదే!” అని అనలేదు ఆయన. ఆయన బ్రాహ్మణుడైనా కూడా నమాజు చేసే బ్రాహ్మణుడిని విమర్శిస్తూ వెలమ వారిని ఈ సందర్భంలో పొగిడారు ఇక్కడ. ఇంకొక చోట రెడ్డి వర్గానికి చెందిన పాత్రను కూడా పొగిడి ఉండచ్చు. సంప్రదాయ రక్షకులు ఏ కులం వర్గం వారైనా కూడా విశ్వనాథ మెచ్చుకుంటారు. ఈ నవలలోనే ఎన్నో ఉదాహరణలు. అసలు పుస్తకం మొదలయ్యేదే పద్మశాలీ కుటుంబంలో!

ఒక బ్రాహ్మణ కుటుంబంలో జరిగిన సంభాషణ గురించిన ప్రస్తావన ఉంటుంది ఈ మ్రోయు తుమ్మెద నవలలో. ఈ విషయం కొంత చర్చించి ఈ వ్యాసం ముగిస్తాను. తుమ్మెద అనేది ప్రధాన పాత్ర పేరు ఈ నవలలో. ఈ తుమ్మెదకు ఒక బ్రాహ్మణ కుటుంబంతో కలిగిన పరిచయం గురించిన సన్నివేశం ఇది. ఆ బ్రాహ్మణుడు పూర్వాచార పరాయణుడు. కొడుకు మాత్రం తురకవాని లాగా వ్యవహరిస్తాడట. ఈ విషయమై ఆ బ్రాహ్మణ భార్యా భర్తల మధ్యన గొడవ జరుగుతుంది.

“వారు బ్రాహ్మణులు. తండ్రి విభూతి ధారణము చేయును. ధోవతియే కట్టుకొనును. ప్రతిదిన మింటిలో జప తపాదులు సాగుచుండును. ఆయన యేవృత్తి చేయునో తుమ్మెదకు తెలియదు. ఆయన భార్యకూడ సాధువు, మంచి యిల్లాలు. సామాన్యముగ వీధికి తన మొగము చూపించదు. మొగమున నింత కుంకుమబొట్టు పెట్టుకొనును. పదునారు పదునేడేండ్ల నుండి యీ ప్రాంతములో నున్నను తల్లిదండ్రుల యాకార విశేషము నందు మార్పేమియు లేదు. కొడుకు మాత్రము పక్కా తురకవాని వలె గనిపించును. షరాయి, షేర్వానీటోపీ, సిగరెట్టుత్రావుట! నిత్య మతడి దర్శనమిట్లే జరుగును”

ఇది ఆ భార్యా భర్తల మధ్యన వివాదం. ఇందులో కూడా ఆంధ్ర తెలంగాణ సమాజం గురించిన తేడాలను గురించిన ప్రస్తావన కనపడుతుంది. అంటే తురక ప్రభువుల ప్రభావం హిందూ ప్రజా జీవనం పై ఎలా పడింది అన్నది. మన పిల్లవాడు మన సంప్రదాయం అనే భావన కూడా కనపడుతుంది.

“భర్త: నీవు పిల్లవానిని పాడుచేసితివి. తురకవానివలె బెంచితివి. వాడేది కోరిన నది సాగించితివి. మనము బ్రాహ్మణులము. ఏ మతము గొప్ప యా మతముది. మనపిల్లవాడు మన సంప్రదాయములో పెరుగవలయును గాని, పర సంప్రదాయములో పెరుగరాదు. నే నచట చిదికిపోయితిని. ఈ యూరు వచ్చి మరల సంపాదించుకొని తిరిగి యింటికి పోవలయునని యెంచితిని. ఈ యూరునకు వచ్చి నా కొడుకును తురకవానిని చేయవలయునని రాలేదు”

ఇంతటితో ఆగక ఇలా అంటాడు భర్త భార్యతో

“ఈ తురుష్కబాలకుని నేను గోదావరీ మండల మునకు దీసుకొని పోవుదునా? అచట నలుగురు నన్నేమందురు? నేను వీనికి వేదమును చెప్పించినట్లా, శాస్త్రమును చెప్పించినట్లా? ఇతడి వృత్తిని యితడి ప్రవర్తనను చూచి దేవతలు సంతోషింతురా?”

ఈ బ్రాహ్మణుడి మాట విశ్వనాథ స్వగతం అవునో కాదో మనం రూఢీగా చెప్పలేం కానీ ఈ బ్రాహ్మణుడైతే ఉమ్మడి కల్చర్ వాది కాదన్నది తెలుస్తూనే ఉన్నది కదా.

ఈ మాటకు భార్య భర్తకు చెప్పిన సమాధానం. ఇక్కడ కూడా తురకల ప్రభుత్వం అన్న ప్రస్తావన ఉండనే ఉంది. తురకల రాజ్యంలో వారికీ అనుగుణంగా నడుచుకోవాలి అన్న సూచన కూడా ఉంది. ఇరు సంస్కృతుల సంఘర్షణ గురించిన ప్రస్తావన కూడా ఉంది.

“భార్య: ఇది లోకము, దీని ననుసరించి యుండవలయును. ఇది నిజాము రాష్ట్రము, తురకల ప్రభుత్వము, ఇచట మీవలె విభూతి పిండికట్లు పెట్టుకొని తిరిగినచో నెవ రాదరింతురు? ఇచటను బ్రాహ్మణులు కలరు కనుక, శుభాశుభకార్యములకు మిమ్ము పిలుతురు. పిల్లవానిని గూడ మీవలెనే సిద్ధము చేసినచో- లోకము, లోకము నందలి మర్యాద యన్నవి యక్కరలేదా?”

తన భార్య అన్న ఈ మాటకు సమాధానంగా భర్త ఇలా అంటాడు

“నేను మర్యాదగా బ్రతుకుట లేదా? నన్నందరును పిలుతురు. శాస్త్రిగారని గౌరవింతురు. నన్నెవ్వరు నగౌరవపరచుట లేదు”

దానికి భార్య సమాధానం

 “గౌరవించుటలో ననేకవిధము లుండును. పౌరోహిత్యము చేయు బ్రాహ్మణుని కిచ్చెడు గౌరవము వేరు, పండితున కిచ్చెడు గౌరవము వేరు. ధనవంతున కిచ్చెడి గౌరవము వేరు. ఒక గొప్పయధికారి కిచ్చెడుగౌరవము వేరు. ఆ రాజ్య మెవరిదో వారి సంప్రదాయముల ప్రకారము ప్రవర్తించెడివాని కిచ్చెడు గౌరవము వేరు”

ఇక్కడ కూడా రాజ్యం గురించీ రాజ్య సంప్రదాయముల గురించిన ప్రస్తావన ఉంది.

జన్మ చేత తన కొడుకు బ్రాహ్మణుడైనను వృత్తి చేత తురుష్కుడు అంటాడు ఆ బ్రాహ్మణుడు. ఇక్కడ కూడా బ్రాహ్మణుడు తురుష్కుడు అన్న తేడా ఎత్తి చూపుతున్నారు. ఉర్దూ భాష గురించిన ప్రస్తావన కూడా ఉంది.

“భర్త: నీ కొడుకు తరకలవలె దుస్తులు వేసికొనును. ఎక్కువమంది తురకలతోనే సాన్నిహిత్యము చేయును. ఉరుదూబాస యెంతయో బాగుగా మాటాడును. వానికి పదునెనిమిదేండ్లు వచ్చినవి. వాని కుపనయనము లేదు. ఆ గుడ్డల తోడనే వచ్చును. నా సహపంక్తిని భోజనము చేయుటకు సిద్ధపడును. వాడు జన్మచేత బ్రాహ్మణుడు తప్ప వృత్తిచేత కాదు. వృత్తిచేత తురుష్కుడు”

దీనికి సమాధానంగా భార్య ఇలా అంటుంది

“భార్య: మీకన్న వానికున్న గౌరవమే గొప్పది”

అప్పుడు బ్రాహ్మణుడు తన భార్యకు ఇచ్చిన సమాధానం చాలా పదునైనది.

“భర్త: వాని కేమి గౌరవము! నాకొడుకు గానిచో వానికి గౌరవము లేదు. నేనీ యూరు వచ్చి పౌరోహిత్యము చేసి సంపాదించితిని. మనవైపున బౌరోహిత్యము వలన నింత సంపాదింపలేము. ఇచట సంపాదింపవచ్చును. కొంత నిలువచేసితిని, యీ గృహమును కొంటిని. ఇతడి కొక యిల్లున్నది గనుక, నా సంపాదించిన యాస్తి కితడు వారసుడు గనుక, యితడి కన్నోదకములకు లోపములేదు గనుక, వీనిని జనులు గౌరవించు చున్నారు. వాని గౌరవము మదధీనమైనది. వానియంతట వానియునికి లేదు. వీని కిచటివైపు పిల్లను చేయుట నా కిష్టములేదు. మనవైపు నుండి రెండుమూడు సంబంధములు వచ్చినవి. వారు వీని వాలకమును చూసి బేజా రెత్తి బాజారు పట్టిరి. ముందు వీని కుపనయనము చేయవలయును. వాడు దాని కంగీకరించుట లేదు. ఉపనయనములో నేమియున్న దనుచున్నాడు. నీవు వాని నట్లు పెంచితివి. నీయందు నాకు గల ప్రేమ చేత నిన్నును నీ కుమారుని నీ యిష్టము వచ్చినట్లు నడువ నిచ్చితిని.”

ఇది ఒక రకంగా తర్వాత కాలంలో మన దేశంలో ప్రబలిన లిబరల్ హిందూ పేరెంట్ మైండ్‌సెట్‌కు ప్రతీక అనుకోవచ్చును. మీ ఇష్టం వచ్చింది మీరు చేయండి బలవంతమేమీ లేదు నచ్చితేనే ఏదైనా చేయండి అని ఎందరో హిందూ తలితండ్రులు పిల్లలకు మత బోధ ధర్మ బోధ చేస్తారు. అంతా ఇష్టానికి వదిలేస్తే అందులో ధర్మమేమి ఉందసలు?

తర్వాత ఆ భార్యా భర్తల నడుమ భాషను గురించిన చర్చ కూడా వస్తుంది.

“భార్య: మీరిపుడు వాని కుపనయనము చేయుడు. నేను వాని నంగీకరింప జేసెదను.

భర్త: వాని కలీఫ్, బే, టే, సే యన్న యక్షరములు వచ్చినట్లు ఓం నమశ్శివాయ యన్న యక్షరములు రావు. వాని కుపనయనము చేయుట బ్రాహ్మణత్వమునకే యపచారము చేసినట్లు.

భార్య: మీ బ్రాహ్మణ్య మంత గొప్పదైనచో మానివేయుడు. వానికంత గొప్ప నష్టమేమి? వానికీయూరిలో చాల మర్యాద కలదు. వాడు కనిపించినచో కన్ను లడ్డు కొందురు. వా డవ్యవహితముగా పెద్దపెద్ద నవాబుల వద్దకు పోగలడు. ఉరుదూ బాసలో నంత పండితుడు లేడందురు. ఆ బాసలో నతడు షాయరు”

ఈ చర్చ కేవలం భాష దగ్గరే ఆగలేదు!

“షాయ రనగా నేమి?” అని అమాయకంగా ప్రశ్నిస్తాడు భర్త. అప్పుడు భార్య తన భర్తను కొంత ఎద్దేవా చేస్తూ వ్యంగ్యంగా ఇలా సమాధానం ఇస్తుంది.

“భార్య: మీరీ యూరిలో నిన్నాళ్ళుంటిరి. ఈమాట తెలియదు. పొద్దుననే వెళ్లుట, మధ్యాహ్నము నాల్గు గంటలకు బియ్యమును, విస్తళ్ళును, పప్పులును నాలుగైదు కూరగాయలును బుజాన వేసికొని వచ్చుట. మూడురూకలో నాలుగురూకలో రొండిన దోపికొని వచ్చుట. అవి నా చేతి కిచ్చుట. ఇంతేకాని షాయర్ అన్నమాట నెరుగరు. షాయర్ అనగా కవి. ఈ యూరిలో పలుచోట్ల పలుసార్లు ముషాయిరాలు జరుగును. ముషాయిరా లనగా కవి సమ్మేళనములు. గొప్పగొప్ప ఉరుదూకవులు వత్తురు. ఇతడును తన కవిత్వమును వినిపించును. వారంద రాశ్చర్య పోవుదురట. మన పిల్లవాని యున్నతి మీకు దెలియుట లేదు”

ఇది విన్న బ్రాహ్మణుడు ఇలా అంటాడు

“భర్త: నా కెట్లు తెలియును? నాకు నమకచమకములు వచ్చును. శ్రీసూక్త పురుషసూక్తములు వచ్చును. మంత్రపుష్పము వచ్చును. వైదికమైన శుభాశుభకర్మలు చేయించు మంత్రములు వచ్చును.”

వెంటనే చటుక్కున భార్య ఇలా అంటుంది

“భార్య: మీ కాబ్దికమంత్రము కూడ వచ్చును.” అని

గాఢమైన తాత్విక చర్చను పక్కన పెడితే భార్యా భర్తల మధ్యన తెలుగు ఇళ్ళల్లో సంభాషణలు ఇలాగే ఉంటాయి. ఇలా కుటుంబ జీవనాన్ని విశ్వనాథ వ్యక్తం చేసినట్టుగా వ్యక్తం చేయగల రచయితలు అతి కొద్ధి మంది ఉన్నారు మన దగ్గర. అందుకే ఆయన భావజాలంతో ఏకీభావించక పోయినా కూడా ఆయన కథన శైలిని రచనలను అభిమానించే వారు ఉన్నారు.

సరే మళ్ళీ ఈ విషయానికి వస్తే భార్య చేసిన ఆబ్దిక మంత్రాల ప్రస్తావనతో భర్తకు కొంత కోపం వస్తుంది.

“భర్తకు గోపము వచ్చెను. అత డిట్లనెను,

“ఈ లోక మశాశ్వతము. అందరును చనిపోయెడివారే. హిందువు లైనచో చనిపోయిన తరువాత కర్మలున్నవి. మీదండ్రి కాబ్దికము మీయన్న మన దేశములో బెట్టుచుండె నందువా, లేదందువా? ఆబ్దిక మంత్రము లేకుండ నాబ్దిక మెట్లు పెట్టుదురు? అది వచ్చుట కూడ తప్పా? ఆబ్దికము పెట్టనిచో పరలోకము లందున్న పితరులు తిండిలేక మాడిపోవుదురు”

దీనికి సమాధానంగా భార్య ఇలా అంటుంది

“భార్య: షాయర్ అగుటయు తప్పు కాదు. గొప్పకవి యగుట గొప్ప విషయమే తప్ప చిన్నవిషయము కాదు”

 భర్త తిరిగి ఇలా అంటాడు

“భర్త: ఒక విషయము గొప్పదా, తక్కువదా యనుట వేరు. అది స్వజాతీయమా, పరజాతీయమా యనుట వేరు”

ఇక్కడ కూడా స్వ పర అన్న భావన బయటకు వచ్చింది. ఉమ్మడి అనే భావన లేదు.

ఈ స్వ పర అన్న భావమునకు సమాధానంగా ఆ భార్య పాత్ర “అందరును మానవులే” అంటుంది. తిరిగి ఆ బ్రాహ్మణుడు స్వ పర భేదాల ప్రస్తావన తెస్తాడు!

“భర్త: నీకొడుకు తురకలతో కలసి తినును. నాకు దెలియును. వాడు భ్రష్టుడై పోయినాడు. వానికి మరల సుపనయనము చేయవలయు నన్నచో వానికి మరల ప్రాయశ్చిత్తము చేయవలయును. బంగారపుసూది కాల్చి వాని నాలుకమీద సంటించ వలయును”

మీరేమైనా చేసుకోండి కావలిస్తే ప్రాయశ్చితం కూడా చేసుకోండి కానీ మన కొడుకు ఉర్దూ భాషలో గొప్ప కవి అన్న విషయం గుర్తించండి అంటుంది భార్య.

“భార్య: మీరు లక్ష చెప్పుడు, వేయి చెప్పుడు. వానికి మీరు ప్రాయశ్చిత్తము చేయించు కొనుడు! పెండ్లి చేయుడు! వానిచేత సంధ్యావందనము కూడ చేయించుడు! నా కభ్యంతరము లేదు. అత డురుదూభాషలో గొప్పకవి. దానిని కాదనుటకు వీలులేదు. పెద్ద పెద్ద యధికారు లందరు వానియం దధికాదరము కలవారు”

దీనికి సమాధానంగా భర్త స్వ భాష అంటే తెలుగు సంస్కృతం యొక్క ప్రస్తావన తెస్తాడు. తెలుగులో అప్పటికే ఆ ప్రాంతంలో ఎందరో కవులు ఉన్నారనీ వారెవ్వరు కూడా భాషను వదులుకోలేదని తురక వేషం వేసుకోలేదని అంటాడు ఆ బ్రాహ్మణుడు

“భర్త: కవియన్నచో నొక్క యురుదూ బాసలోననే కానక్కరలేదు. సంస్కృతములో కవులున్నారు. తెలుగులో మహానుభావులైన కవులున్నారు. నీ కొడుకు తెలుగులోననో, సంస్కృతములోననో నొక కవి యైనచో నేను సంతోషించెడివాడను. ఈ యూరిలో తెలుగుబాసలో కవనము వ్రాయువారు లేరన్నట్లు మాటాడుదువు! నేను కొందరి నెరుగుదును. ఈయూరిలో ఒద్దిరాజు శేషగిరిరావన్న యాయన కలడు. గారపాటి రాఘవరెడ్డి యన్నాయన కలడు. వారిద్దరును కవులే. ఇంకను చాలమంది కవులున్నారట. వైష్ణవులలో కవు లున్నారట. మొన్ననొక కుఱ్ఱవాడు వచ్చినాడు. అతడి పేరు దాశరథి యట. అతడు చాల పైకి వచ్చెడు కవియని ప్రశంసించినారు. నా కదియంతయు తెలియదు. వారెవ్వరు నీ కొడుకువలె తురకవేసము వేయుట లేదు. నీ కొడుకునే నీ విట్లు పాడుచేసితివి”

నేను పాడు చేశాను మీరు బాగు చేసుకోండి అని అంటుంది అప్పుడు భార్య. దానికి సమాధానంగా భర్త ఇలా అంటాడు..

“భర్త: ఇప్పుడు నేనేమి బాగుచేయగలను!? నేను వాని కమరము చెప్పబోవగా నీవు వానిని చదువనీయలేదు. రుక్మిణీ కళ్యాణమును, గజేంద్రమోక్షమును చెప్పుద మనగా వానిని దీసికొనిపోయి యురుదూ పాఠశాలలో ప్రవేశపెట్టితివి. నేను వాని నొక విధముగా పెంచవలయు ననుకొంటిని. నీవు వాని నింకొక విధముగా పెంచితివి”

ఇక్కడ స్పష్టంగా ఉర్దూ చదువుల ప్రభావం గురించి రాశారు విశ్వనాథ ఈ బ్రాహ్మణ దంపతుల సంభాషణలో భాగంగా. ఇటువంటివి ఆయన ఇంగిలీషు చదువుల విషయమై కూడా రాశారు. ముస్లిం పాలనలో ఉర్దూ విద్యను గురించి విశ్వనాథ వ్యతిరేకంగా రాయలేదు అని అనటం ఏమిటి మరి? ఈ సంభాషణలో చెప్పిన దానికంటే ఉర్దూ విద్య పట్ల వ్యతిరేకత వ్యక్తం చేయటం వీలవుతుందా?

చివరికి మళ్ళీ జీవిక సంఘంలో గౌరవం కాలంతో మార్పు వంటి విషయాల గురించిన చర్చ వచ్చి ఈ సంభాషణ ముగుస్తుంది. ఇహపరలోక చింతన గల మతం మనది కాబట్టి ప్రతిదీ ఇప్పటి సంఘంలో చెల్లుబాటు అయ్యే పరిస్థితులను బట్టి బేరీజు వేయకూడదు అని అంటాడు భర్త.

“భార్య: అతడుద్యోగి కావలయును. పెద్ద పెద్ద అధికారుల మన్ననలు పొందవల యును. ఇది లౌక్యము. లౌకికముగా నత డేమియు చెడిపోలేదు. అతడు సుఖముగా జీవయాత్ర సాగించగలడు. మీ వలె కష్టపడనక్కరలేదు. వా డట్లుండుటయే నా కిష్టము. వానిని నేనట్లు పెంచితిని. మీరెప్పుడు నింటిలో లేకుండుట నాకు సహాయకారి యైనది. జన్మయెత్తిన తరువాత ప్రధానమైన విషయ మేమనగా లోకములో మర్యాదగా బ్రదుకుట.

భర్త: మనుష్యుడై పుట్టినవాడు లోకములో కొన్నాళ్ళు బ్రదుకును. తరువాత చనిపోవును. చనిపోయిన తరువాత పరలోకము లున్నవి. మనమత మేమనగా యిహపరసాధకమైన జీవనము చేయుట.

భార్య: మీకంత కష్టముగా మన్నచో నేను వానిచేత నొప్పింతును. మీరు వారి కుపనయనము చేయుడు. ఆ మంత్రములో యేవో వానికి జెప్పుడు. వాడు లోకము నందు మర్యాదగా బ్రదుకుటకు కావలసిన లక్షణములు నేను వానికి సమకూర్చి పెట్టితిని. ఇంక మీ యిష్టము వచ్చినట్లు మీరు చేయవచ్చును. వానికి మీరన్నచో తక్కువ గౌరవము లేదు. మిమ్మెప్పుడు నెదిరించలేదు. నిజానికి వానికి నాయందు కంటె మీయందే యెక్కువ భక్తి” అని భార్య అనటంతో ఈ సంభాషణ ముగుస్తుంది. ఎన్నో గాఢమైన విషయాల గురించిన చర్చ గల సంభాషణ ఇది.

ఇది స్థూలంగా ‘మ్రోయు తుమ్మెద’లో ఇస్లాం ప్రభువుల పాలనలో ఉర్దూ విద్య మరియు హిందూ సంస్కృతి పై ఇస్లాం ప్రభావం వంటి విషయాల పై విశ్వనాథ ఆలోచనలు. ఇదేదో కేవలం నేను ఫేస్‍బుక్‌లో ఎవరితోనో చేసిన చర్చల వలన వచ్చిన భావావేశం వలన రాసినది కాదు. ఇప్పటి కాలంలో హిందూ కుటుంబాలలో జన్మించిన వారిలో హిందూ మతం లేదా సనాతన ధర్మం గురించి ఎన్నో అపోహలు న్యూనతా భావాలు అవగాహన లోపాలు వంటివి ఉన్నాయి. నాకు సంబందించినంత వరకు విశ్వనాథ సత్యనారాయణ రచనలు సనాతన ధర్మం గురించి తెలుసుకోవడంలో చాలా సహాయపడ్డాయి. కాబట్టి వ్యాసంలో మొదట్లో ప్రస్తావించిన ఇస్లాం గురించిన ప్రశ్నల సమాధానాలకు కూడా ఈ పుస్తకాలు బాగానే పనికొస్తాయి. నేను విశ్వనాథను మాత్రమే చదవలేదు. ఇతరత్రా రచనలు బోలెడు చదివాను ఇటువంటి విషయాలలో. నేను చూసిన మేరకు ఇటువంటి ఆలోచనలు చేసిన సంప్రదాయ వాదులు ధర్మ గురువులు చాలానే ఉన్నారు. విశ్వనాథ కొత్తగా ఆయన మాత్రమే చేసిన ప్రతిపాదనలంటూ ఏమీ చేయలేదు. ఈ సనాతన ధర్మంలో ఏముందో అదే చెప్పారు తనదైన శైలిలో.

హిందువులకు ఇప్పటికి కూడా స్వ పర అనే భేదాలు పెద్దగా తెలియట్లేదు. ఏళ్ళ కొద్దీ ఆంగ్ల విద్యలో పెరిగిన తరాలు ఇప్పుడు రెండు మూడు ఉన్నాయి ఈ నేల పై. సమాజంలో రక రకాల మార్పులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ మార్పులన్నీ మంచికేనా అంటే ఎవరూ ఏమీ చెప్పలేరు. కానీ మార్పులు మాత్రం చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇవి భిన్నత్వానికి దారి తీసేవా లేక ఏకత్వం అనే యూనిఫార్మిటీ వైపునకు తీసుకువెళ్ళేవా అంటే బహుశా ఏకత్వం వైపే ప్రయాణిస్తున్నామేమో అనిపిస్తుంది. భిన్నత్వం తగ్గుతోంది.

స్వజాతి సొంత సంప్రదాయం తన కంటూ ఉన్న మతం ధర్మం పరంపర వంటి వాటి గురించిన అవగాహన పెరగాలి. అన్ని సంస్కృతులను కలగాపులగం చేసే ప్రయత్నాలు పెద్దగా మనశ్శాంతి కలుగచేయవు. వ్యక్తికీ సమూహానికీ ఇద్దరికీ. ఇటువంటి ప్రయత్నాలు వికటించే అవకాశాలే ఎక్కువ. ఈ విషయంలో విశ్వనాథ వాదం చదివాక నాకు అర్థమైనది అదే. “శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్। స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః” అన్న గీతా వాక్యం హిందూ ధర్మానికి ఇస్లాం క్రైస్తవం వంటి మతాలకు మధ్యన జరిగిన సంఘర్షణలకు కూడా వర్తిస్తుంది. ఉమ్మడి కల్చర్ తాపత్రయం వదులుకుని మనకంటూ ఉన్న ధర్మాన్ని మనం ఆచరించటమే ఉత్తమం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here