విశ్వనాథ వారి ‘కిన్నెరసాని పాటలు’-1

0
7

[dropcap]గో[/dropcap]దావరికి ఉపనది యైన కిన్నెరసాని వాగుపై ఒక రమణీయమైన కల్పన చేసి రసవంతమైన పాటలు రాసారు కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు. భద్రాచలం బస్సులో వెళ్ళేవారికి కిన్నెరసాని వాగు కన్పిస్తుంది. ఒక కొండ, దానినానుకొని ప్రవహించే వాగుని చూసి తెలుగువారి కుటుంబకథ లాగా, అందమైన కల్పన చేస్తూ, అంతర్లీనంగా నీతి ప్రకటిస్తూ, పండిత పామర జన రంజకంగా రాసారాయన. కిన్నెరసానిని ఆయన చూసిన క్షణమాహాత్మ్యం చిత్రమైనది.

తండ్రి శోభనాద్రిగారితో పాటు బొగ్గులకుంట దగ్గర తమ భూములు చూసుకోవడానికి ఒకసారి వెళ్ళారట సత్యనారాయణగారు. పోలవరంలో విశ్రాంతికై ఆగగా, అక్కడ జనుల మాటల్లో మొదటిసారి ‘కిన్నెరసాని వాగు’ అని విన్నారు. మర్నాడు ఆ వాగుని చూసారు. కిన్నెర అనే పేరు, సూర్యోదయ సమయం లోని ప్రశాంతమైన ప్రకృతి నిశ్శబ్ద వాతావరణంలో ఆ వాగు యొక్క లయబద్ధమైన మ్రోతలు ఆయన మనసులో ముద్రించుకుపోయాయి. నాటినుండే ఏదో అందమైన భావం, రాగం ప్రారంభమై, తర్వాత కావ్యంగా రూపుదిద్దుకొని తెలుగు సాహిత్య ప్రపంచంలో చిరస్ధాయిగా నిలిచిపోయింది. 1927లో జయంతి పత్రికలో కిన్నెరసాని పాటలు ప్రచురణ మొదలైంది. కథా నేపథ్యాన్ని కవి ముందుగా చెప్పారు ….

“ఈ కథ జనప్రచారంలో లేదు. కిన్నెరసానివాగు భద్రాద్రి పోయే త్రోవలో ఉంది. ఆ వాగు చూసి ఆ మధురనామం నిరంతరం మననం చేసుకోవటం వల్ల కలిపించుకున్న కథ. ఆ వాగు గోదావరిలో పడుతుంది. …..కిన్నెర మహాపతివ్రత. అందరు తెలుగు కన్నెలకు మల్లెనే ఉద్విగ్న హృదయ. ఎక్కువ తెలుగు కుటుంబాలకు సామాన్యమైన అత్తాకోడళ్ళ పోరాటం ఆ యింట్లోను వెలసింది. కొడుకు సుఖమెరుగని అత్తకు కిన్నెర మీద నిందలారోపించడం పని అయింది. ఒకప్పుడు ఆవిడ చేసిన నింద భరించడం కష్టమైంది. కిన్నెర భర్త ఏం చేస్తాడు? తల్లిని కాదనలేడు. భార్యను ఓదార్చుకోనులేడు. ఆవేశహృదయంతో కిన్నెర అడవులవెంట పరుగెత్తింది. భర్తపోయి ఆమెను వద్దని కౌగలించుకున్నాడు. ఆమె అతని కౌగిట్లోనే కరిగి నీరై వాగై ప్రవహించింది. అతడు శోకించి శోకించి శిల అయినాడు.”

కిన్నెరసాని పద వ్యుత్పత్తిని పరిశీలిస్తే….. కిన్నెర – సాని. యక్షులు గంధర్వుల వలెనే కిన్నెరజాతి కూడ దేవతాగణం వంటివారు. సంగీతప్రియులు. స్వామిని శబ్దభవము సాని. అధికారిణి. రెడ్డిసాని, బాపనసాని, బత్తుసాని అనే మాటలు వాడుకలో ఉన్నాయి. ఇక్కడ ‘సాని’ అంటే ‘ స్త్రీ’ అని అర్థం. అంటే కిన్నెర అనే జాతికి చెందిన స్త్రీ అని చెప్పవచ్చు. దశవిధ వీణల్లో కిన్నెర అనేది ఒకరకమైన వీణ. “కిన్నెర వీణ వలే మ్రోగే జలగమనం గల నది” అని కూడ చెప్పవచ్చు. బెంగుళూరులో ప్రభుత్వ మ్యూజియంలో కిన్నెర వీణను చూడవచ్చు.

వాగుగా మారిపోయి, వేగంగా సాగిపోతున్న కిన్నెరను చూసి ఆమె భర్త శోకిస్తూ శిల అవడంతో కావ్యం ప్రారంభమౌతుంది.

ఓహో కిన్నెరసానీ
ఓహో కిన్నెరసానీ
ఊహా మాత్రము లోపల
నేల నిలువవే జవరాలా…..

ఇది కావ్యారంభం. కోపంతో వెళ్ళిపోతున్న భార్యను వెళ్ళవద్దంటూ భర్త కౌగలించుకున్నాడు. అంతలోనే ఆమె కరిగి నీరై ప్రవహించసాగింది. అతడికేమీ అర్థం కాలేదు.

పరుగెత్తెడు నీ వేణీ
బంధము పూనితి చేతను
కరమున వేణికి బదులుగ
కాల్వగట్టె నీటి పొరలు
ఎడమచేతనే కొంగును
ఒడిసి పట్టుకొంటి చెలి
తడి చేతను కొంగు లేక
తడిబడితిని ప్రియురాల
నీ పాదమ్మున మోచిన
నా ఫాలమ్మున చెమ్మట
ఈ పగిదిని వాగువైన
నీ పై ప్రేమము చూపెడి…

కుపిత యైన నాయికను అనునయించడానికి నాయకుడు ప్రయత్నిస్తూ మొదట జడ పట్టుకోబోయాడు. చేతిలోకి జడ బదులు నీరు జారింది. కొంగుపట్టి ఆపబోయాడు. తడిచేయి మిగిలింది. చివరగా పాదాలపై పడ్డాడు. ఫాలాన చెమట మిగిలింది. ఈ సన్నివేశం చాల ముఖ్యమైంది. నాయిక నదిగా మారిపోయే క్రమాన్ని వర్ణించే దృశ్యచిత్రణ.

ఇప్పుడేగదే నా కౌగిట
కప్పితి నీ శోకమూర్తి
అప్పుడె నిలువున నీరై
ఎప్పుడు ప్రవహించితివే
నిను కౌగిట నదిమిన నా
తనువు పులకలణగ లేదు
కను విప్పితినో లేదో
నిను కానగ లేనైతిని…

ఆమె ఏమౌతున్నదో గుర్తించే లోపునే కరిగి నీరైపోయింది. ఆశ్చర్యంతో, దుఃఖంతో అతడు కొయ్యబారి పోయాడు. శిలగా మారిపోయాడు. తన తప్పేమిటో తెలిసికొన్న అతడు “నేను తప్పె చేసితిననుకొనుము. కాని నీ వలె ఇంక కఠినురాండ్రను స్త్రీలెక్కడా కన్పించరు” అని పశ్చాత్తాపంతో వాపోయాడు. ఆమెకై ఏడ్చి ఏడ్చి “అతని కంఠము సన్నవడియె. కన్నులు మందగించె. కాయము కొయ్యబారె. దేహము రాయి వోలె నగుచున్నది.”

ఈవు రసాకృతి వగుటను, ఈ వైఖరి ప్రవహించితి
నేను శిలా హృదయుండను పూనుదునె ధునీవైఖరి

స్త్రీ ప్రకృతి స్వరూపిణి, లలిత మధుర స్వభావం కలది కనుకనే ఆమె నదిగా మారిపోయింది. పురుషుడు స్త్రీ కన్నా గంభీరుడు, ధీరుడు కనుక స్తబ్దుడైనాడు, శిలాభూతుడైనాడు. అప్పటికి కానీ కిన్నెరసానికి తెలియలేదు తనపై భర్త కెంత ప్రేమ వుందో! కానీ ఇప్పుడు తెలుసుకున్నా , ఎంత వగచినా, వనరినా లాభం లేదు. జల లక్షణం ప్రవహించడమే కదా! అందుకే –

కరిగింది కరిగింది
కరిగింది కరిగింది
కరిగి కిన్నెరసాని వరదలై పారింది
తరుణి కిన్నెరసాని తరకల్లు కట్టింది
పడతి కిన్నెరసాని పరుగుల్లు పెట్టింది.

పతిని వీడలేక, నీటి స్వభావం వల్ల పల్లానికి ప్రవహించసాగింది. జలదేవతలు త్వర పెట్ట విడలేక విడలేక, చనలేక చనలేక, పోలేక పోలేక , వలవల ఏడుస్తూ, వెనక్కి తిరిగి చూస్తూ చూస్తూ వీడి పోయింది. మనిషిగా ఉన్నప్పుడు కిన్నెర ఎంత వయ్యారియో, నెమ్మది చానో …. నదిగా మారినా తన సహజ గుణం పోగొట్టుకోక అంత వయ్యారంగానూ, అంత నెమ్మదిగానూ నడిచిపోతోందట. అలా అలా నడుస్తూ, క్రమంగా వేగం పెరిగి నడకలే నృత్యంగా మారినాయి.

కెరటాలలో నుర్వు
తెరచాలలో నీటి
పొరజాలులో కిన్నె
రటు కదలి యిటు కదలి
చిటి తరంగాలతో పొటి తరంగాలతో
నటనాలు మొదలెట్టెనే క్రొన్నీటి
తుటుములా కదలాడెనే

ఈ పదాల పొందిక, రచనా వైఖరి గమనిస్తే ఒక స్త్రీ నర్తిస్తున్నట్లే అనిపిస్తుంది పాఠకులకు. అలా పదచాలనం ఎక్కువయ్యే సరికి కంఠం విచ్చుకుంది. వాయుదేవతలు రమ్మని పాటలు పాడారు. కోకిలలు, పికిలిపిట్టలు గొంతు కలిపాయి. ఒక మధురమైన మనోహరమైన సంగీతం వెలువడింది.

కోనలన్నీ ముంచుకొని వచ్చు సెలయేటి
చాన కిన్నెరసాని జలజలా స్రవియించు
తరుగులో, పై కెగయు
నురుగులో, క్రొంగ్రొత్త
తేనె కాలువలూరెనే, అమృతంపు
వాన చినుకులు జారెనే

అని కిన్నెర సంగీతం సాగుతుంది. కిన్నెర నాట్యం, సంగీతానికి లోకాలు పులకించిపోతున్నాయి. తనమానాన తాను ఆడుతూ పాడుతూ వస్తోంది. పాట మెల్లగా గాలి తరంగాలలో తేలితేలి దూర తీరాలకు పోసాగింది. సముద్రుడెక్కడో దూరంగా ఉన్నాడు. అంతలో అతనికి లీలగా పాట వినిపించింది. చూస్తే, ఎవరూ కనిపించలేదు. మధురమైన కిన్నెర పాట విని కడలిరాజు మనసు ఊయలలూగింది. తగని కోరికతో, ఆసక్తితో, బొటనవేళ్ళపై నిలిచి చూడాలని ఉప్పొంగాడు. మిర్రి మిర్రి చూసాడు. సహజంగా, అమాయకంగా, నృత్య సంగీతాలతో మైమరచి పోయి వస్తోంది కిన్నెర. ఆమె అందాలు అవలోకించి, ఆకర్షణలో మునిగిపోయి , తన ఒడలు తనకేమో తెలియనంతగా తపించిపోయాడు, తబ్బిబ్బు పడ్డాడు కడలిరాజు. స్వభావ సిద్ధంగా సముద్రుని లోని అలల ఆటుపోట్లను “కాలి వేళ్ళ పై నిలిచి” చూసాడనడం కవి భావనాశక్తి గొప్ప నిదర్శనం. ధైర్యంగా అనుకున్నాడు “నదీనాం సాగరో గతిః”, కిన్నెర తనని చేరక తప్పదని. విరహంతో వేగిపోయాడు. కామంతో కదిలిపోయాడు. పట్టరాని కోరిక తో ‘పొంగి’ పోయాడు.

కడలి పొంగుని చూసి కళవళపడింది కిన్నెర. రాబోయే కీడుని ఊహించి, మనసున దిగులొంది, పెద్ద వగతో అక్కడే నిలిచిపోనెంచి, నీటి గుణం చేత కదిలిపోక తప్పక, అతి ప్రయత్నం మీద రాళ్ళ నడ్డం చేసుకొని నిల్చుటకు, పొదలనడ్డం చేసుకొని ఆగుటకు ప్రయత్నించి విఫలురాలైంది. కెరటాల కౌగిటిలో తనను ఇముడ్చుకోడానికి ఉబికి, ఉప్పొంగుతున్న కడలిని చూసి దిగులొంది, పూర్వం భర్తకు తనపై గల ప్రేమను తలచుకుంది. ఇల్లు వదిలి వచ్చిన తన తొందరపాటుకు చింతించింది.

ఓ నాథ నిను వీడి వచ్చీ
ఓ రాజ నిను వదలి వచ్చీ
నా యొడల్సయితమ్ము నానా జనులు కోర
ఈ యేవపుం బ్రతుకేల పొందితినిరా

అని వగచింది. “హా యని కిన్నెర యేడ్చెన్”. ఈ కష్టాల కడలిని దాటటం ఎలా అని ఏడ్చింది. కడలిరాజు పట్టరాని కోర్కెతో పొంగిపోవడం చూసి జగాలన్నీ కలవరపడ్డాయి, “కామాతురాణాం న భయం న లజ్జా” అని. లోకాలు తప్పుత్రోవలు పోతే సర్ది చెప్పగలట్టి సామంతుడు. అటువంటి వాడీ విధంగా కామానికి గురియై తపించడం తన పరువు ప్రతిష్ఠలకు భంగం కాదా అని, తనకున్న గౌరవమర్యాదలకు లోపం కాదా అని తర్కించారు.

గంగ తన యిల్లాలు కాదటే
యమున తన యిల్లాలు కాదటే
ఎంతమంది లేరు, ఇన్ని యేళ్ళూ వచ్చి
చిన్ని వాగును చూచి చిత్తమెరియించుకో
తనకు నిది తగదూ
కడలి రాజునకూ

కవి స్వయంగా కథలో ప్రవేశించి ఇక్కడ కడలిరాజు కామాన్ని గర్హించారు. గంగ, యమున మరికొన్ని నదులు ఇల్లాలితనం నెరవేర్చుచుండగా చిన్ని వాగు కిన్నెర నాశించడం కడలిరాజుకు తగదని మందలించారు.

(కడలి పొంగు, కిన్నెర దుఃఖం… చివరకు ఏమైంది? వచ్చేవారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here