విశ్వనాథవారితో నా పరిచయం

1
12

[box type=’note’ fontsize=’16’]  రాజలక్ష్మీ ఫౌండేషన్ వారు శ్రీశ్రీకు అవార్డు ఇచ్చిన సందర్భంగా (1979) వెలువరించిన సావనీర్ ‘రాజకమలం’ కోసం ప్రఖ్యాత రచయిత్రి తెన్నేటి హేమలత తమ గురువుగారు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి రచించిన అమూల్యమయిన వ్యాసం ఇది. [/box]

[ఇవి శ్రీ విశ్వనాథ వారి ముఖతా వచ్చిన మాటలు. నావి కావు. వారు కూడా ఎవరినీ చిన్నబుచ్చటానికి అన్నవి కావు. అవి యథాతథంగా చెప్పాను.

గోమఠేశ్వరుని అనుయాయులైన తెలుగు జైనులే కోమటులు అనీ – మాలాకారులే మాలవారనీ – శిల్పులు ఆ పేరే వుంచుకోక విశ్వబ్రాహ్మణుల మనటం దేనికనీ – వీరేశలింగంగారు మహానుభావుడే గాని వారిలో కొన్ని లోట్లు వున్నాయని వారి అభిప్రాయం.

కావ్యాత్మతా సిద్ధిగన్న వ్యంగ్యము సొంపు

కలయజూచెడు కాంక్ష కలుగనేని (ఆచార్య దివాకర్ల)

మీకు ఈ వ్యాసం నచ్చుతుంది. విశ్వనాథ వారి పుస్తకాలు చదవకుండా ఆయన వ్యక్తిత్వం అంచనా వేయకుండా మాట్లాడేవారికి యీ నా వ్యాసం నచ్చకపోవచ్చును.

యీ కాలానికి పట్టని మహామేరువు అని గుర్తించినవారు ఉన్నారు. వారికి నమస్కారం చేస్తూ యీ వ్యాసం వారికేనని మనవి చేస్తున్నాను. ముఖస్తుతీ – వెన్నరాయటం వారికి రాదు. వారి శిష్యురాల్ని నాకూ రాదు. అది అర్థం చేసుకుంటే ధన్యురాల్ని. ఇక వారి మాటలు చెపుతూ వారి వ్యాఖ్యానం వినిపిస్తాను. – లత.]

[dropcap]”వే[/dropcap]యి పడగల పాము విప్పారుకొని వచ్చి – కాటందు కొన్నది కలలోన రాజును” అని మీరందరూ అఘోరిస్తూ వుంటే సింబాలిజంతోనే ప్యూడలా? బుగ్గా? దాన్ని వ్యతిరేకించాను గదా….. వాడెవరు? ఆ శ్రీరంగం శ్రీనివాసరావు ఆధునిక కవి…. నేనే వాణ్ణి ఓసారి యుగకవి అని కూడా మెచ్చుకున్నాను. పాపం నాకంటే పదేళ్ళు చిన్న. అతను ఎప్పుడైనా ఇంత డైరెక్టుగా ప్యూడలిజాన్ని విమర్శించాడా? “అదీగాక జగదాభ్యుదయం కోరని రచయిత రచయిత కాడు. కవి కవి కాడు” అన్నారు కవి సామ్రాట్, కళాప్రపూర్ణ, పద్మవిభూషణ, విమర్శక చక్రవర్తి, డాక్టరు విశ్వనాథ సత్యనారాయణ గారు. గర్వించగదిన మా గురువర్యులు. ఆయన సరస్వతి సు-భద్ర. ఆయన కవిత సమార్ద్ర. అంతేకాదు చాలామంది ఆయన్ని ఛాందసుడనీ, పూర్వాచారపరాయణుడనీ అనేవారు అంటున్నారు కూడా. కానీ అది ఎంతమాత్రం నిజం కాదు. ఆయన వ్రాసిన ‘మాబాబు’ అనే నవల, ‘వీరవల్లడు’ అనే నవల ‘బద్దన్న సేనాని’ అనే నవల…. ఒకటి కాపు గురించీ, రెండవది పాలికాపు గురించీ, మూడవది మాలవాని గురించీ వ్రాసినవి. భాష్యత్రయం.

మాల అనే జాతికి ఆయన యీ విధంగా వ్యుత్పత్తి చెప్పేవారు. ప్రాచీన కాలంలో ప్రతి దేవాలయానికీ మాలాకైంకర్యం వుండేది. ఆ మాలలను సమకూర్చేవారే మాలవారు. వారు ఆత్మన్యూనతతో బాధపడి హరిజనులనే పేరు పెట్టుకోనవసరం లేదు.

కులాలను గురించి వారు చెప్పే వ్యాఖ్యానం నాకు నచ్చేది. “కులాలంటే ఏమిటి? వృత్తులే కదా. ఉదాహరణకు ఆంధ్రదేశపు కోమటులు గోమఠులు. అది జైన సాంప్రదాయం” అనేవారు. ఈ విధంగా ఆయన అనేక విషయాలను గురించి మాబోటి చిలిపి శిష్యులకు బోధించి హుందాగా తీర్చిదిద్దారు. విశ్వనాథ వారు చాలా హాస్యచతురులు. హాస్యప్రియులు. ఆయన మాటల్లో – అవి కిన్నెరసాని వ్రాసిన క్రొత్తరోజులు. ఒక జమీందారిణి నన్ను పట్టుకుని “కవిగారూ! అంతా బాగుంది గాని కిన్నెర పతివ్రత గదా, సాని అని తగిలించారేమిటండీ?” అన్నది. అనటం కాదు విసిగించింది. స్వామిని అనే పదమే సానిగా మారిందని చెప్పటానికి నాకు గాని వినటానికి ఆవిడకు గాని ఓపికా సంస్కారమూ రెండూ లేవు. ఏం చెయ్యాలి మరి? అందుకని “తప్పేనండీ దొరసానిగారూ! పోతన అంతటివాడు తన తల్లిని లక్కసాని అని గర్వంగా వ్రాసుకున్నాడు. ఏంచేద్దాం మన వాళ్ళకి అన్నీ ధర్మ సందేహాలే” అని నవ్వారు.

యీ విధంగానే ఆయన చదువు చెప్పే పద్ధతి వుండేది. వీరేశలింగం గారిని గురించి మీరు చెప్పిన సామెత అంత నచ్చలేదండీ (తెగించినవారికి తెడ్డే లింగం, వెధవముండలకి వీరేశలింగం)” అన్నాను.

“ఏదో అన్నాను గాని దానికి కారణం ఎక్కిరింపు తప్ప మరేం లేదు. ఏదైనా ఆయన మహానుభావుడు” అన్నారు విశ్వనాథ వారు. యింకా ఆయన్ని పూర్వాచారపరాయుడని అనగలమా? యింకొక కథ. ఒక తడవ ఆయనతో రైల్లో ఒక పెద్దమనిషి ప్రయాణిస్తున్నాడట. ఏమీ తోచని విశ్వనాథవారు… ఆయన భాషలోనే చెపుతాను. “విప్రహస్తం ఏనుగు తొండం అని వూరికే అన్నారా? నాకు లేని వినయాన్ని తెచ్చుకొని శిష్టవ్యవహారికంలో “అయ్యా! తమరెవరు?”

“మేము విశ్వబ్రాహ్మణులం” అన్నారు ఆయన.

దాంతో నేను నోరుమూసుకుని నీవు గీకిన పుస్తకం ఉమర్‍ఖయామ్ చదువుతున్నాను. ఉమర్‍ఖయామ్ మహా కవి త్రాగగలడు. మనం చెయ్యలేని గొప్ప పని ఎవరు చేసిన మనము మహదానందపడిపోతాం. అదుగో అలాటి ఆనందంలో నేను వుండగా ఆ పెద్దమనిషి నన్ను అడిగాడు “అయ్యా తమరెవరు?”

”నేనా ఉత్త బ్రాహ్మణ వెధవనిలెండి అన్నాను” యిది ఆ కథ.

దానికి ఆయన వ్యాఖ్యానం “నేనేదో కులాలుండాలని ఏడుస్తున్నానని అంటారు. వృత్తులుండాలని ఏడుస్తున్నాను. మళ్ళీ యిప్పుడు టెక్నికల్ కాలేజీలు పెడుతున్నారు గదా. పాత కులాలు పోయి కొత్త కులాలు పుడతాయి” అన్నారు. యిది కొత్త రకమైన ఆలోచనా విధానం. పండిపోయిన కవిత్వ ఫలితం. ఒక తడవ నేనూ విశ్వనాథవారూ కారు ప్రయాణం చెయ్యటం తటస్థపడింది. యింకో యిద్దరు ముగ్గురు మాష్టారి శిష్యులు కూడా ఉన్నారు. నేను నవ్వుతూ “మీరెప్పుడైనా ప్రేమలో పడ్డారా” అని అడిగాను.

”ఓసి నియోగీ….. అనగా ప్రతి పనినీ నియోగించే లలితా స్వరూపిణివైన లతా! కొన్ని తడవల కాళ్ళు జారి పడ్డాను. కొన్ని తడవల తల్లక్రిందులుగా పడ్డాను. కొన్ని తడవల పళ్ళురాలేటట్టు ప్రేమలో పడ్డాను. అసలు ప్రేమంటే ఏమిటి? ఒక్కళ్ళను ప్రేమిస్తే ఏకపత్నీ వ్రతం. యిద్దరినీ ప్రేమిస్తే భావ కవిత్వానికి వస్తువు. ముగ్గురిని ప్రేమిస్తే శ్రీరామచంద్రుడి అమ్మ మొగుడు కావచ్చు. నలుగురిని ప్రేమిస్తే వ్యాస మహర్షి కోడలివి కావచ్చు. అయిదుగురిని ప్రేమిస్తే భగవంతుడికి సహోదరి కావచ్చు. ఎనమండుగురిని ప్రేమిస్తే సాక్షాత్తు భగవంతుడితో సమానం. ఆ తరువాత విరమిస్తే అంబ పలుకుతుంది” అన్నారు.

యిలాగే అనేక విధాల అనేక విషయాలు విశ్వనాథవారిని ప్రశ్నించటం సమాధానాలు పొందటం జరిగింది. మీకేమిటి యిష్టం అని అడిగితే ఆయన చెప్పే సమాధానం యిట్లా వుండేది.

“శాస్త్రీయ సంగీతం యిష్టం. చీట్లపేక యిష్టం. నల్లమందు ఇష్టం. నవల వ్రాయటం యిష్టం. ఇప్పుడు వయస్సు వుడిగింది కనక ఆడవాళ్ళ వంక ఆబగా చూడ్డం అమిత యిష్టం” అని నవ్వించేవారు. యిక అయిదారు నెలలో తను నమ్మిన దైవానికి చేరువ అవుతారనగా ఒకరోజు వుదయం నేను వారింటికి వెళ్ళాను. ఆయన ఒంగి ఏదో రాళ్ళు ఏరుతున్నారు. ఏమిటి వెతుకుతున్నారు? అన్నాను. ఆయన నావంక ఎగాదిగా చూసి “నలభయ్యేళ్ళనాడు జారిపడిపోయిన నా యవ్వనాన్ని” అని టక్కున జవాబు చెప్పారు. ఆయన చైతన్యం పంచభూతాల్లో కలిసిన రోజున జోరున వాన. ఒక వూరే కాదు ఏరూ అమ్మవారూ కూడా ఏడిచారు. ప్రతి గుండే, ప్రతి కొండా, ప్రతి బండా బ్రద్దలైనయి. యిలా రాసుకుంటూ పోతే ఒక వెయ్యి పడగలవుతయి. “విషవృక్షం గురించి మీ ఉద్దేశం?” అన్నాను ఒకసారి. “కల్పవృక్షాలు మాత్రమే వుండవు సృష్టిలో. విషవృక్షాలు వుంటాయి. అది సృష్టి యొక్క ధర్మం. కాని ప్రాణి ధర్మం యింకొకటి వుంది. అది విషవృక్షాలను ఛేదించటం” అన్నారు.

“అక్కడ సరోవరము ఉన్నది. ఎందుకు వున్నది. ఉండవలెను కనుక ఉన్నది” అని ఎక్కిరించాను ఒకసారి.

“పేజీకి మూడు రూపాయలు యిస్తున్నప్పుడు పేజీలు ఎలా పెంచుకోవాలో నేర్చుకోవాలి. అది రచయిత యొక్క బ్రతుకు ధర్మం” అన్నాను.

చర్విత చర్వణం వగైరా నాన్సెన్సు చెప్పటానికే గాని నిజానికి కావు అని ధ్వనింపచేస్తూ.

“మాష్టారు! మీరూ చలంగారూ స్నేహితులటగా?” అని అడిగాను.

“అవును. అతను సెక్సు వ్రాస్తాడని పేరు. పాపం పూర్ ఫెలో! నా అంత సెక్సు అతను రాయలేదు. పులి మృగ్గులో మనిషికీ పులికీ సెక్సుపెట్టాను” అని నవ్వారు.

అంతకంతా పెంకితనం వుండేది విశ్వనాథవారిలో. బందరులో ఒకసారి ఆయన మాట్లాడుతుండగా ఎవరో వెనక నుంచి గాడిదలా ఓండ్రపెట్టారు. ఆయన టక్కున ఉపన్యాసం ఆపేసి “గాడిదలకు సుస్వాగతము. యింతవరకూ నా కవిత్వం మనుషులకే అనుకున్నాను. యిప్పుడు గాడిదలు కూడా ఆనందిస్తున్నాయి. పశుర్వేత్తి అంటే యిదేనేమో. యిదివరకు మహాకవిని. నేటినుంచీ విశ్వకవిని. మళ్ళీ మాట్లాడితే జీవకవిని” అన్నారు ఆయన పంచశతిలో.

ఉర్విలోన మహాకవి యోగివంటి

వాడు సర్వమ్ము భావనొవధిగ జూచు

నల్పులంబోలె బ్రతుకులో ననుభంచించె

ననుకొనుట పామరంబైనయూహ. అన్నారు

దానికి ఆయన వ్యాఖ్యానం. డబ్బుతోనే ప్రపంచం వుందని దరిద్రుణ్ణి నాకు తెలుసు గాని… సరే దానిమీద ఆశతోనే అనుకో వయస్సులో బ్రాకెట్ ఆడాను. పోయింది పదిహేనువందలు. వచ్చింది అయిదు అణాలన్నర. యిది తెలిసిన పామరత్వం” అని నవ్వేశారు.

“నా అంత దౌర్భాగ్యుణ్ణి నేనే. బాల్యంలో తండ్రినీ, యవ్వనంలో భార్యనీ, వార్దక్యంలో కొడుకునీ పోగొట్టుకున్నాను. ఆ ఆవేదన మీ అందరికీ తెలియకుండా వుండటానికి బిగ్గరగా అరుస్తూ ఉంటాను ఉపన్యాసాలలో. ఆ అరుపులూ కేకలూ నామీద నేనే అని ఎవరూ గ్రహించలేకపోవటం నా మరో దౌర్భాగ్యం” అని ఆవేదన పడేవారు ఎప్పుడూ ఆయన.

చివరిగా నాదో మనవి. విజయవాడలో విశ్వనాథ భారతి అత్యవసరం. అది శ్రీ చెన్నారెడ్డిగారు గుర్తిస్తారని ఆశిస్తున్నాను. ఆంధ్రులకు అన్నిటికన్న మిన్న విశ్వనాథ భారతి. విజయవాడ టౌనుహాలుకు ఆ పేరు పెడతారని ఆశించటం అనుచితం కాదు. విశ్వనాథవారికి చాలారోజుల క్రిందటే జీవితమంటే విసుగుపుట్టింది. ఆ విసుగు బహుశా పుత్ర వియోగానంతరం ఏర్పడి వుంటుంది. తను చాలా అజ్ఞానిన్ని ఆ మహాజ్ఞాని నమ్మకం.

తెలిసిన మూర్ఖులంచున్న యడల ధాత్రిని నన్ను మీరగలుగరు అనీ.

“తెలిసిన మూఢులంచు జగతింగలరే కదా. వారిలోన ఉజ్వలతరుడేను.”

అనీ ఆయన వ్రాసుకున్నారు. కానీ ఆయన బ్రహ్మీమయమూర్తి. మహాకవి. కనిపించే శరీరం పోయినా జీవిస్తున్న మహాయాత్రికుడు. యిది చాలదు. ఎప్పుడో ఆయన సంపూర్ణ జీవిత చరిత్రం రచిస్తాను – ఆయన ఛాందసుడు కాడు. మా వూరి అల్లుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here