విశ్వరూప ఆరాధన శ్రేష్ఠం

0
14

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘విశ్వరూప ఆరాధన శ్రేష్ఠం’ అనే రచనని అందిస్తున్నాము.]

శ్లో:

జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే।
ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్॥
(భగవద్గీత 9వ అధ్యాయం, 15వ శ్లోకం)

“కొందరు జ్ఞానాన్ని పెంపొందించే యజ్ఞంలో నిమగ్నమై నన్ను వారి నుండి భిన్నత్వం లేని ఏకత్వంగా చూస్తారు. మరికొందరు నన్ను వారి నుండి భిన్నత్వ భావంతో వేరుగా చూస్తారు. మరికొందరు నా విశ్వరూపం యొక్క అనంతమైన వ్యక్తీకరణలలో నన్ను పూజిస్తారు” అని పై శ్లోకం భావం.

సాధకులు సంపూర్ణ సత్యమైన భగవంతుడిని చేరుకునేందుకు వేద శాస్త్రంలో ప్రతిపాదించబడిన ఆధ్యాత్మికత యొక్క విభిన్న మార్గాలను అనుసరిస్తారు. నదులన్ని తిరిగి ఆఖరిగా సముద్రంలో కలిసినట్లు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఏ మార్గంలో పయనించినా ఆఖరుకు భగవంతుని సన్నిధికి చేరుకోవడం తధ్యమని భగవానుడు ఈ శ్లోకం ద్వారా మానవాళికి అభయం ప్రసాదించాడు.

పైన సూచించిన మార్గాలను మూడుగా విభజించారు: (1) భగవంతునితో ఏకంగా తనను తాను ఆరాధించేవాడు, (2) పరమేశ్వరుని యొక్క ఏదో ఒక రూపాన్ని రూపొందించుకుని దానిని ఆరాధించేవాడు మరియు (3) సార్వత్రిక రూపాన్ని, పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని అంగీకరించి, ఆరాధించేవాడు.

మూడవ ఆరాధన అత్యంత శ్రేష్ఠమైనదిగా శాస్త్రం ప్రతిపాదిస్తోంది. ఈ భౌతిక విశ్వం యొక్క అభివ్యక్తికి మించి దేని గురించి ఆలోచించలేని వారు ఉన్నారు. వారు విశ్వాన్ని అత్యున్నత జీవిగా లేదా అస్తిత్వంగా భావిస్తారు మరియు దానిని పూజిస్తారు. విశ్వం కూడా భగవంతుని స్వరూపమే. దీనినే విశ్వరూప ఆరాధన అంటారు. అందుకే అన్నమయ్య ఒక కీర్తనలో ‘విశ్వరూప మిదివో విష్ణురూప మిదివో శాశ్వతులమైతి మింక జయము మా జన్మము’ అని అన్నాడు. భగవద్గీత శ్రీ కృష్ణుని విశ్వరూపాన్ని ఎంతో గొప్పగా వర్ణిస్తూ, ఒక అధ్యాయాన్నే కేటాయించింది.

“సత్త్వ, రజో, తమో గుణాలు నాయందే ఉంటాయి. మరుత్తులు, వసువులు, మొదలైన దేవతలందరూ నా నుండే పుట్టారు. నేనే సృష్టి యందంతటను వ్యాపించి ఉన్నాను. నాలోనే నిశ్చలంగా సృష్టి ఉంది. ఓంకారం ఆదిగా గల నాలుగు వేదాలు, నాలుగు వర్ణాలు, నాలుగు ఆశ్రమాలు వాటి విధులు, స్వర్గం, మోక్షం, నా రూపాలే అని తెలుసుకో! యజ్ఞ పరాయణులు, నన్ను స్తుతించి పుణ్యఫలాన్ని పొందుతారు. పాపులు కూడా ప్రాయశ్చిత్త కర్మలు చేసి నన్ను స్తుతించి దోష విముక్తులవుతారు. సర్వకాలాల్లోను మహిమ కలిగిన నేనే బ్రహ్మగా సృష్టి, విష్ణువుగా స్థితిని, శివుడుగా లయాన్ని చేస్తుంటాను” అని భగవానుడు అర్జునుడితో విశ్వరూపం గురించి అద్భుతంగా చెప్పాడు.

మనం నివసించడానికి అవకాశం కలిగించిన విశ్వాన్ని ఆరాధించే విధానమే విష్ణుమూర్తికి మనం చేసే నిత్యార్చన. అయితే ఇది అత్యంత కష్టమైన ఆరాధన అని కూడా చెప్పబడింది. భగవద్గీతలో విశ్వరూప సందర్శన అధ్యాయంలో భగవంతుడు “మీరు చూస్తున్న ఈ నా రూపాన్ని చూడటం చాలా కష్టం. దివ్య దేవతలు కూడా దీన్ని చూడాలని తహతహలాడుతున్నారు. వేదాధ్యయనం వల్ల గాని, తపస్సుచేత, దానధర్మాలు, అగ్ని యాగాల వల్ల గాని నీవు నన్ను చూసినట్లుగా చూడలేను” అని అన్నారు.

విశ్వరూప ఉపాసన వల్ల మనలోని జడత్వం పోతుంది. వ్యాపనశీలత పెరుగుతుంది. పూర్వ తత్త్వాల్లోనూ మార్పు వస్తుంది. మరింత వికాసం సాధ్యమవుతుంది. ఇది అందరి హృదయాల్లో వ్యాపించే ప్రయత్నమూ జరుగుతుంది. సర్వజీవ సమానత్వం, సర్వ జీవ వ్యాపకత్వం నిత్య జీవ్తంలో ఉపాసించడం సాధ్యమవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here