వివేకానందుని యతిగీతము – విశ్వనాథ వారి అనువాదము

0
8

[dropcap]ఒ[/dropcap]కసారి మద్రాసు రేడియో స్టేషనులో రామకృష్ణా మిషన్‌కు చెందిన నిర్వికల్పానంద స్వామి విశ్వనాథకు తారస పడ్డారు. నిర్వికల్పానందులు పూర్వాశ్రమంలో విశ్వనాథ వారి విద్యార్థి. మాటలలో స్వామి విశ్వనాథ వారిని వివేకానందుల వారి ‘the Song of Sanyaasin’ను అనువదింపుమని కోరారు. ఆ సమయానికి స్వామి వారివద్ద ఆ గీతం ఉంది. అదే తడవుగా చెట్టు కింద కూచుని విశ్వనాథ తెలుగు పద్యాన్ని చెప్పడం, నిర్వికల్పానందులు రాసుకోడం జరిగింది. వారనువదించిన యతి గీతం 1945 – 1956 నాటి రెండవ ముద్రణలను అనుసరించింది. జువ్వాడి గౌతమ రావు గారు, వివేకానందుల వారి 137వ జయంతి రోజు 2000 జనవరి 12న దానిని ప్రచురించారు. ఈ గీతాన్ని 2012/13 జనవరిలో వివేకానందుని 150వ జయంతి సందర్భంగా జవంగుల వెంకటేశ్వర రావు గారు తెలుగు వారికి అర్పించారు. విశ్వనాథ వారి అనువాదాన్ని భారతి మొ. పత్రికలలో ప్రచురించారు.

భారతదేశం మళ్ళీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద. స్వాతంత్ర్యము అనేది మత సిద్ధాంత రాద్దాంతాలలో లేదు. అది ఆచరణలో, ఆధ్యాత్మికులుగా పరిణతి చెందడంలో మాత్రమే ఉంది. ఉత్తిష్టతః జాగృత ప్రాప్య వరాన్నిబోధత” అన్న కఠోపనిషత్ వాక్యాలు ఈ గీతానికి ప్రేరణ. లెండు, గురిని ముట్టువరకు ఆగకు అనిన మూల సూత్రమే ఇందుకు స్ఫూర్తి. పాటతో నిద్రించు జనతను మేల్కొనుమని హెచ్చరించడమే ఇందలి ధ్యేయం.

స్వామీ వివేకానందుడు మానవ లోకానికి అందించిన మహత్తరమైన కానుక యతి గీతం. వారు ఈ గీతాన్ని మూలతః ఆంగ్లంలో రచించారు. 1895 జులై ఆగస్టు నెలలలో, న్యూయార్క్ అమెరికా లోని “Thousand Island Park, New York, in July, 1895” లో కావించిన ఉపన్యాస మాలికలో ఈ గీతాన్ని రచించారు. యతులకు ఉండవలసిన బౌద్ధిక ఆంతరిక ప్రవృత్తులను గూర్చి మార్మికంగా చెప్పారు. ఈ యతి గీతము, భారత దేశం లోని యోగులందరికీ, నిత్య పారాయణ గీతంగా మారింది.

ఈ గీతం కేవల ఆధ్యాత్మికం గానే కాక దేశభక్తి భావనకు ఓత ప్రోతమైన ప్రతీకగా భాసించింది. దేశాభ్యుదయానికి దేశ పునరుత్థానానికి అనుక్షణం పరితపించిన స్వామి భావనలు అక్షర రూపాన్ని పొందాయి. యువకుల అంతస్సత్వాన్ని జాగృతం చేయడానికి వివేకానందుడు ఈ గీతం లోని ప్రతి అక్షరాన్ని ఉద్ధరించాడు. వారు జీవించిన అత్యల్ప వ్యవధిలో తర తరాలకు కావలసిన ఆధ్యాత్మిక, బౌద్ధిక సంపదను యువకులకు అందించారు. నిస్వార్థమైన ఆత్మ చేతన దేశ స్వాతంత్ర్యానికి మూలమని ఉద్ఘోషించారు.

మూలంలో 13 stanza లలో ఉన్న ఈ గీతాన్ని విశ్వనాథ వారు 12 సీస పద్యాలు, ఒక శార్దూలంలో అనువదించారు. మూలంతో తులనాత్మకంగా చూస్తే ఇది భావానువాదానికి చక్కని ఉదాహరణ నిస్తుంది. అనుసృజనలో అనువాదకుని భావనా స్వాతంత్ర్యం తగిన గాంభీర్యత లోనే సరళతా సిద్ధిని సాధించడం లోనూ, దేశీయతా వాక్కులను అనుసంధానించడం లోనూ, సందర్భోచితమైన సూక్తులను సామెతలను జోడించడం లోనూ వ్యక్తమౌతుంది.

ఉదాహరణకు కొన్ని వాక్యాలను గ్రహిద్దాం

ఈ గీతం ధీర శాంత విమల పర్యావరణంలో ఉద్భవించినదని, ముందుగానే పాఠకుల మనో యవనికకు లోక వాసనలను తుడిచిన నిశ్చల భూమికను సిద్ధం చేసారు.

Wake up the note! the song that had its birth

Far off, where worldly taint could never reach,—

Sing high that note, Sannyâsin bold! Say—

“Om Tat Sat, Om!” అనే వాక్యాలను పలికించురా, రువార -మేచు తంత్రీ సుధా కంఠమెత్తి జ్ఞాన -వియదమోఘాధ్వములు పల్లవించునట్లు అని మొదటి చివరి వాక్యాలను పద్యం లోని చివరి పాదాలుగా మార్చారు. ధీర సన్యాసి అంటూ సంబోధించారు.

Bonds that bind thee down,

Of shining gold, or darker, baser ore ;

Love, hate—good, bad—and all the dual throng,

Know, slave is slave, caressed or whipped, not free ;

For fetters, though of gold, are not less strong to bind ;

బానిస ఎపుడైన బానిసయే,శృంఖలమ్ములేవేన్ శృంఖలమ్ముల యగు,

బంగరు తో జేయ బడ్డట్టి సంకెలల్

పట్టి చేతులు ముద్దు పెట్టుకోవు,

ధీర సన్యాసి విద్రిచి విదిర్చి కొమ్ము అంటూ “పట్టి చేతులు ముద్దు పెట్టుకోవు అని సరసంగా అనువదిస్తూనే –

చివరకు సాధు సచ్చిత్కళా ప్రదీప్త సం విన్మహాజ్యోతి తీర్చునట్లు, – ప్రణయ కోపాలనే ద్వంద్వాలను (ముక్కలగునట్లుగా) చిద్రుప చిద్రుప లగునట్లుగా చీల్చ వలెనని గంభీరంగా కొరడాతో ఝుళిపిస్తారు.

Let darkness go;-it drags

From birth to death, and death to birth, the soul.

He conquers all who conquers self. Know this

And never yield, Sannyâsin bold! Say—కాంతి కాదది చీకట్ల పుట్ట, -మాయ లేడి -ధీర సన్యాసి లొంగకు మౌర దాని –

హరిణ మాత్త మారీచమైన ప్రతిభ -సీత చెంగటనే వధ చేయు దాని -అని పూర్వ పురాణ ఉదాహరణతో జాతీయతను పలికించారు –ఎత్తు గడలోనే “పదరించి ” త్వరితంగా అని ఆరంభించారు. కొరవి దెయ్యాల వెల్గును చూచి భ్రమ పడవద్దని చీకటి నీడకు ప్రతిమను చూపారు.

Who sows must reap,” they say, “and cause must bring

The sure effect ; good, good ; bad, bad ; and none

Escape the law. whoso wears a form

Must wear the chain

ముంగిటి లో బోసి పోవు పంట

కాలికిం గాదేని వ్రేలికి దప్పదు

పడక తాతాచార్ల వారి ముద్ర- అంటూ హాస్య ప్రహసనాన్ని పలికించారు.

తెలివి పొలములు పొల పొల పులకరింప – అనే నుడి తో పులకలు కలిగించారు.

The sexless Self!

The Self is all in all, none else exists ;

And thou art That, Sannyâsin bold! Say—

“Om Tat Sat, Om!”

నిర్లింగ మైనట్టి, నిర్గుణ మైనట్టి అని విస్తరించి

ఆత్మయను నట్టిదీవ, అనాత్మ యైన /దేదియు ను లేదు, మిథ్యానుపాదితమ్ము,

అని బోధ ను గావించారు.

ఆత్మ స్వాతంత్ర్యాన్ని గురించి వివరిస్తూ/ ఆత్మ కృతమైన యట్టి కాయంబునందు,

దగులుకొనూట్టి కవి వోలె దగులు కొనక

ప్రణవ పర్యాయ జప సుధా ప్లవము గొనుము అని అత్యంత హృద్యముగా సుధా ప్లవమను తెప్పను గొనవలెనని కవిత్వ వ్యాఖ్యానమిచ్చారు.

The rope that drags thee on. Then cease lament,

Let go thy hold, Sannyâsin bold! Say —

“Om Tat Sat, ఓం!”

స్వేచ్ఛ కోసం ఎక్కడో వెతకడ ఎందుకు అంటూ –

నీవ నిర్మించు కొందువు నిన్ను గట్టు /ద్రాళ్ళ వానిని కర్మ సూత్రముల ద్రెంపు

ధీర దండి /ఓం తత్సదధీన వదన

ఈపద్యాన్ని ఓ! ఊర్ణ నాభ ,భవదుద్గతాత్మ ద్రవ /రజ్జు సంతాన ధారా నిబద్ధ అని ప్రారంభించారు.

ఆశకు నిరాశ / కును సుదూరస్థుడేను నేనగుచు నీవు /ధీర దండి -ఇక్కడ ఊర్ణ నాభ (సాలీడు తాను సృజించు కున్న తాళ్ళ తో తానే బంధించు కున్నట్టు అన్న ఉపమానం తో ప్రభావ వంతం కావించారు.

Where praiser praised, and blamer blamed are one.

Thus be thou calm, Sannyâsin bold! Say—

“Om Tat Sat, ఓం!”అన్న అద్వైత భావనను

నిందించు వాడు, నిందింప బడు వాడు, – దారొక్కడైన యపుడు

నింద యెట్టిది పొగడిక నిజమదెట్టి

దేది యెటులైన గానినీకేమి చెపుమ -అని మనస్సుకు తాకించారు.

whom anger chains can ever pass thro’ maya’s gates

అమిత కోపమునకు నమ్ముడు పోవు వా/ డంతకంతకు బోవునడుగడుకు

అని బుజ్జగించారు. maya’s gates అను దానిని మాయాద్వార విధుర వీధి /నిష్క్రమింపను జాలరు -అంటూ ఔను అనిపించారు.

Have thou no home. What home can hold thee, friend?

The sky thy roof, the grass thy bed; and food

What chance may bring, well cooked or ill, judge not.

No food or drink can taint that noble Self

Which knows Itself. Like rolling river free

Thou ever be, Sannyâsin bold! Say—

“Om Tat Sat, Om!”

మాయా ద్వార విధురవీధి నిష్క్రమింపను జాలరు

నీదు పై కప్పు నిభృత తారకలతో,

రమ్య మౌ చాందినీరా యతీంద్ర

నీదు శయ్యా వీధి నిద్దంపు పచ్చిక

పచ్చ ముఖ్మల్ పరుపయ్య యోగి

నీదు నాహారంబు నేడు వెచ్చని షడ్ర

సోపేత రమ్యంబు -రేపు కంద

మూలంబు -లెల్లుండి ముడుచుక పండు కొంటయు -ఎల్లయును సమానంబులు గాగ

నదులు వర్షర్తువున దటీ నదుదార

జలము లయ్యు వేసంగికి సైకతముల వరలు గార్చిచ్చులట్లు నీవలెనె యోగి,

ఓయి భిక్షూ నీకు నొక్కడు తక్కువె

యొక్క దెక్కువె !పేద యూర నూర /తిరిగి మయాపిధానము తెరల జేసి

కలది యొక్కనితో గూడ గలియ కుండ

పై అనువాదం లో నిభృత తారకలు, చాందినీ ,నిద్దంపు పచ్చిక పదాలు అర్థాన్వయాన్ని గుచ్చి ఎత్తాయి. mayas veil అను పదానికి మాయాపిధానము అనేపదం తత్వార్థానికి పదును పెట్టింది.

The “I”

Has All become, the All is “I” and Bliss.

Know thou art That, Sannyâsin bold! Say —

తనంత న్నీవయై -జన్మ మృ

త్య్వారూఢంబగు మాయ దాటి

చన్మయ్యా! ధీర సన్యాసి! ఆ

త్మారాముండవు -నీడలేని వెలుగై

ఆనంద దీపంబవై అనుటలో మృత్యు +ఆరూఢ పద సంధి కవి జిగీషను తెల్పుతుంది

ఓం తత్సత్ మకుటం గా కలిగిన మూలాన్ని అనువాదం లో ధీర దండి ఓం తత్సధీన వదన అని సంబోధనా క్రమంగా చేయడం విశేషంగా ఒప్పింది.

ఇలా అనువాద రుచిరమైన ఈ గీతాన్ని అందరూ తప్పక చదివి, దేశ స్వాతంత్ర్యానికి మూలంగా ఆత్మ స్వేచ్ఛా నిరోధకమైన బంధనాలను తొలగించు కోవాలి. దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమర వీరుల త్యాగాలను స్మరించాలి. వ్యక్తి నిష్ఠను దేశ ప్రేమకు అంకితం చేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here