వృద్ధాప్యంలో మహిళల ఆరోగ్యం

0
11

[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘వృద్ధాప్యంలో మహిళల ఆరోగ్యం’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]“మ[/dropcap]మ్మీ ఏం చేస్తున్నావ్?” అంటూ చింటూ పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చాడు.

నాన్నమ్మ: “చేతిలో బ్యాగేది? స్కూల్లో గానీ వదిలేసి వచ్చావా?” ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వస్తున్న చింటూను హాల్లో కూర్చుని ఉన్న నాన్నమ్మ ప్రశ్నించింది.

చింటూ: “ఈ రోజు స్కూలే లేదని చెప్పాగా. నేను మా ఫ్రెండ్స్‌తో బయట క్రికెట్ ఆడుకొని వస్తున్నాను నాన్నమ్మా!” అంటూ వంటింటి లోని అమ్మ దగ్గరకు వెళ్ళాడు చింటూ.

నాన్నమ్మా: “ఏంటి స్కూల్లో బ్యాగు పోయిందా! అయ్యెయ్యో అలా ఎలా పారేసుకున్నావురా? పరీక్షలు దగ్గర పడుతుండగా ఇప్పుడు పుస్తకాలు పారేసుకుంటే పరీక్షలెలా రాస్తావురా!” గట్టిగా అరిచింది చింటూ నాన్నమ్మా.

చింటూ: వంటింట్లో చింటూ తలపట్టుకొని “ఏంటమ్మా! నాన్నమ్మకు ఏం చెప్పినా. సరిగా వినిపించదు. నేనొకటి అంటే తనొకటి అంటుంది” అన్నాడు.

అమ్మ: “అది కాదు చింటూ! నాన్నమ్మ పెద్దదయిపోయింది కదా. అందుకే చెవులు సరిగా వినిపించక అలా మాట్లాడుతోంది. విసుక్కోకూడదు నాన్నా!” అంటూ అమ్మ చింటూని జుజ్జగించింది.

“ఏమేవ్ చిన్నీ! ఎక్కడున్నావే! ఒక్కరూ సరిగ్గా పలకరు. కాసిని మంచి నీళ్ళు తీసుకురావే. గొంతెండిపోతోంది”. నాన్నమ్మ కేకేసింది.

“నాన్నమ్మా! నీ ఎదురుగానే ఉన్నాగా! ఎందుకట్లా పెద్దగా అరుస్తావు” అంటూ చిన్ని మంచి నీళ్ళ గ్లాసు తెచ్చి నాన్నమ్మకు అదించింది.

నాన్నమ్మ: “ఇక్కడే ఉన్నావా తల్లీ. ఏంటోనే ఈ మధ్య ఎదురుగానే ఉన్నా కనబడటం లేదే! దూరంగా ఉన్న మనిషిని దగ్గరగా వచ్చేదాకా గుర్తుపట్టలేకపోతున్నా.”

చిన్ని: “అదంతే నాన్నమ్మా! నీలాగా 60 సంవత్సరాలు వయసు పైబడిన వారికి శుక్లాలు రావడం వలన చూపు తగ్గిపోతుందని మా సైన్స్ టీచర్ గారు చెప్పారు. ఈ వయసులో కంట్లో తయారయ్యే కన్నీళ్ళు. తగ్గిపోతాయి. అంతేకాదు కంటిలో ఉండే ద్రవంలో మార్పుల వల్ల ‘ఫ్లోటర్స్’ అనేవి చిన్న చిన్న చుక్కలుగా కళ్ళ ముందు కనిపిస్తాయి. ఇలా కనిపిస్తుంటే వెంటనే డాక్టరు గారి దగ్గరకు వెళ్ళాలట. ఇంకా పెద్ద వయసులో కాటరాక్ట్‌తో పాటు గ్లకోమా, సెనైల్ మాక్యులార్ డీజనరేషన్ డయాబెటిక్ మరియు హైపర్టెన్సివ్ రెటినోపటీ అనే జబ్బులు. సాధారణమని మా టీచరుగారు చెప్పారు.”

నాన్నమ్మ: “ఏంటోనే! నువ్వు చెప్పిన దాంట్లో శుక్లాలు అన్నది తప్ప మరేదీ అర్థం. కాలేదు. అయినా నువ్వు కాస్త గట్టిగా చెప్పావు కాబట్టి వినబడింది. ఇందాక మీ తమ్ముడు స్కూల్లో బ్యాగు పారేసుకొచ్చాడట అదేదో కాస్త చూడమ్మా.”

చిన్ని: “లేదు నాన్నమ్మా. వాడికీ రోజు స్కూలే లేదు. నీకు వాడు చెప్పింది వినిపించక అలా అనుకున్నావు.”

నాన్నమ్మ: “అవునా తల్లీ, నిజమే నాకీ మధ్య వినికిడి శక్తి తగ్గినట్లనిపిస్తున్నది. మీరు పెదాలు కదపటం తెలుస్తున్నది గానీ ఏమన్నదీ సరిగా వినిపించటం లేదు.”

చిన్ని: “అంతే నాన్నమ్మా. ఈ వయసులో లోపలి చెవిలో మార్పుల వల్ల సరిగా వినిపించదు. ఎదుటి వాళ్ళు మాట్లాడే ధ్వనుల్లాంటి హైఫ్రీక్వెన్సీ ధ్వనుల్ని వినలేరు. ఈ తరువాత తగ్గు స్థాయిలని స్వరాలు కూడా వినలేరు. ఇలాంటపుడు హియరింగ్ ఎయిడ్స్ మాత్రమే సహాయం చేస్తాయి.”

నాన్నమ్మ: “హియరింగ్ ఎయిడ్స్ అంటే ఏమిటే? అదేదో చెవిలో పెట్టుకుంటారే మిషన్ లాంటిది, అదేనా?”

చిన్ని: “అవును భలే కనుక్కున్నావు నాన్నమ్మా.”

నాన్నమ్మ: “ఒకవేళ అప్పుడు బాగా వినిపించకపోతే ఏం చేయాలట?”

చిన్ని: “అప్పుడు ‘కాక్లియార్ ఇంప్లాంట్’ అనే ఆపరేషన్ చేయడం వలన కొంత ఉపయోగం ఉంటుంది.”

నాన్నమ్మ: “ఏమోనమ్మా! అవన్నీ నాకేం అర్థమవుతాయి. కాసేపాగితే నాన్న వస్తాడు. అప్పటిదాకా అమ్మకి కాస్త సాయం చెయ్యి తల్లీ!”

రాత్రి 8 గంటలకు చింటూ, చిన్ని వాళ్ళ నాన్న రమేష్ ఇంటికి వచ్చాడు. అతడు సిరిసిల్లలోని గవర్నమెంటు స్కూల్లో టీచరు.

“డాడీ వచ్చారు, డాడీ వచ్చారు” అంటూ చింటూ, చిన్ని తండ్రిని చుట్టుముట్టారు.

చింటూ: “నాకు స్వీట్స్ కావాలన్నానుగా ఏవి డాడీ?” చింటూ ఆశగా అడిగాడు.

“ఇవిగోరా! ఇస్తున్నా” అంటూ సంచిలోంచి స్వీట్స్ ప్యాకెట్ ఇచ్చాడు రమేష్ చింటూ చేతికి.

నాన్నమ్మ: “ఇదిగోరా అబ్బాయ్. ఇందాక చింటూగాడు స్కూల్లో బ్యాగ్ పారేసుకున్నాడట. ఇప్పుడు పుస్తకాలు పోతే చదువు ఎలారా?”

“అయ్యో! నాన్నమ్మా! నేను ఇందాక చెప్పాను కదా. చింటూ బ్యాగు పోలేదని వాడికీ రోజు స్కూలే లేదు అని” చిన్ని పెద్దగా చెప్పింది నాన్నమ్మతో,

చింటూ తల పట్టుకొని “అబ్బా! ఈ నాన్నమ్మతో ఎలారా వేగేది!” అంటూ, “డాడీ! నాన్నమ్మకు కనిపించటం లేదు వినిపించడటం లేదు. దానితో పాటు మతిమరుపు కూడా వచ్చినట్లుంది ఎలా డాడీ!” అన్నాడు

రమేష్: “చూడు చింటూ! పెద్దవాళ్ళను అలా విసుక్కోకూడదు. వాళ్ళు కావాలని అలా చేయడం లేదు కదా! మనం కూడా ఆ వయసుకు చేరుకుంటే అలాగే ప్రవర్తిస్తాం.”

చింటూ: “ఎంత వయసు వస్తే, మనం కూడా అలా ప్రవర్తిస్తాం..” అడిగాడు చింటూ.

చిన్ని: “ఇప్పుడు నాన్నమ్మ వయసెంత డాడీ!” చిన్ని అడిగింది.

రమేష్: “ఇప్పుడు నాన్నమ్మకు 72 సంవత్సరాలు ఉన్నాయి. సాధారణంగా 60. సంవత్సరాల వయసు పైబడిన వారిని వృద్ధులు అనవచ్చు. ఈ వయసు వచ్చిన వారికి వార్ధక్య లక్షణాలు వస్తాయి. వృద్ధాప్యంలో శరీర ఆకృతిలో మార్పు రావడం, ఎముకలు, కీళ్ళు కండరాలు వంటివి కూడా పెళుసుగా తయారవడం, జుట్టు, చర్మం, గోళ్ళు, వాసన, రుచి, స్పర్శ, నిద్ర అన్నింటిలోనూ మార్పులు వస్తాయి.”

చింటూ: “అసలీ ముసలితనం అనేది ఎలా వస్తుంది డాడీ!” చింటూ ప్రశ్న.

చిన్ని: “వృద్ధులు అని ఎవరిని అనవచ్చు? వృద్ధాప్యం ఎందుకు వస్తుంది? మనం కూడా ముందు ముందు వృద్ధులమైపోతామా?” భయంగా అడిగింది చిన్ని.

రమేష్: “అమెరికా వంటి దేశాలలో ముఖ్యంగా 65 సంవత్సరాలు పైబడిన స్త్రీలను వృద్ధులంటారు. అదే మన దేశంలో అయితే 60 సంవత్సరాలకే వృద్ధాప్య లక్షణాలు వస్తాయి. అసలు మనిషికి ముసలితనం రావడమనేది ఎలా వస్తుందో ఖచ్చితంగా చెప్పలేము. కొంత మంది శాస్త్రవేత్తలు మనిషి జీవితంలో జరిగే పరిణామాల వలన సంభవిస్తుందనీ, మరి కొంత మంది అతినీలలోహిత కిరణాల వలన అనీ, మరికొంత మంది శరీరంలోని జీవక్రియలు మందగించటం వలన అన్నీ, వంశపారంపర్యంగా జరిగే ప్రక్రియ అని అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఏది ఏమైనా పుట్టిన ప్రతి ప్రాణీ పెరగడం ఎంత సహజమో వృద్ధాప్యం రావడం కూడా అంతే సహజం. అంతే కానీ దానికి భయపడకూడదు.”

చింటూ: “వృద్ధాప్యంలో ఏమేం మార్పులు వస్తాయో ఒక్కొక్కటి చెప్పు డాడీ!”

చిన్ని: “ముందు శరీర ఆకృతిలో ఎలాంటి మార్పు వస్తుంది?”

రమేష్: “శరీరంలో కొవ్వులు ఎక్కువ చేరి ముఖ్యంగా పొట్ట ప్రాంతంలో నిలవ ఉంటాయి. స్త్రీలు సాధారణంగా 65 సంవత్సరాల వరకు బరువు పెరుగుతూ, ఆ తరువాత బరువు తగ్గుతూ ఉంటారు.”

చింటూ: “సరే చర్మంలో ఎలాంటి మార్పులొస్తాయో చెప్పు డాడీ” చింటూ అడిగాడు.

“నాకు తెలుసు. నాకు తెలుసు! చర్మం ముడుతలు పడుతుంది కదా డాడీ!” చిన్ని చెప్పింది.

రమేష్: “వెరీగుడ్ చిన్నీ, చాలా చక్కగా చెప్పావు. ఎలా కనుక్కున్నావు” అడిగాడు.

“డాడీ! నేను నాన్నమ్మను చూసి చెప్పాను” చిన్ని సమాధానం.

రమేష్: “అవునమ్మా! చర్మం సాగిపోయి ముడుతలు పడుతుంది. చర్మంలో ఉండే నూనె గ్రంధులు మెనోపాజ్ తర్వాత తక్కువగా స్రవించటం మొదలుపెడతాయి. అందువల్ల చర్మం ఎండిపోయినట్లుగా అయి ఏదైనా కొద్దిగా తగిలినప్పటికీ చర్మం చిల్లే అవకాశం కలిగి ఉంటుంది.”

చిన్ని: “మెనోపాజ్ అంటే ఏమిటి డాడీ?” చిన్ని అర్థంకాక అడిగింది.

రమేష్: “స్త్రీలలో 40 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య కాలంలో ఋతుచక్రం ఆగిపోతుంది. ఈ సమయాన్నే మెనోపాజ్ అంటారు. ఇవన్నీ మీ సైన్స్ పుస్తకాలలో ఉన్నాయి కదమ్మా! మీ టీచరుగారు. చెప్పలేదా!” రమేష్ కూతురితో అన్నాడు.

చింటూ: “చర్మం అలా ఎండిపోతుంటే దానికి మార్గమేమీ లేదా డాడీ?” మధ్యలో చింటూ అడిగాడు.

రమేష్: “ఎందుకు లేదు చింటూ! చర్మాన్ని మెత్తబరిచే మాయిశ్చరైజర్ క్రీములు, సబ్బులు వాడాలి.”

చింటూ: “మరి గోళ్ళతో ఎలాంటి మార్పులొస్తాయి డాడీ?” చింటూ ఉత్సాహంగా అడిగాడు.

“గోళ్ళు డల్‌గా ఉండి పసుపురంగులోకి మారతాయి. పెళుసుగా కూడా” చెప్పాడు రమేష్,

“జట్టు కూడా ఊడిపోతుంది కదా డాడీ!” చింటూ ఉత్సాహంగా చెప్పాడు.

“నేనింకో విషయం కూడా చెప్తాను డాడీ! జుట్టు తెల్లబడిపోతుంది కదా!” తను చాలా బాగా తెలుసన్నట్లుగా చిన్ని సంబరంగా చెప్పింది.

“అంతే కాదురా! కనుబొమ్మలు, కంటి వెంట్రుకలు కూడా తెల్లబడతాయి” రమేష్ చెప్పాడు.

“చెవులు సాగిపోయి వేలాడటం కూడా వృద్ధాప్య లక్షణమేనా? నాన్నమ్మ కలాగే ఉంది కదా డాడీ!” చిన్ని అన్నది.

“నాక్కూడా తెలుసు. నేను కూడా చెప్తాను. కళ్ళ కింద ఉబ్బెత్తుగా అవుతుంది. మొహంలోని చర్మం కూడా సాగివేలాడుతుంది” చింటూ కొత్త విషయం కనుక్కున్నట్లుగా చెప్పాడు.

“ఏంట్రా పిల్లలూ! అన్నానికొచ్చేదేమైనా ఉందాలేదా? డాడీతో కబుర్లు చెబుతూ రాత్రంతా అలాగే కూర్చుంటారా?” అంటూ చింటూ, చిన్నీల అమ్మ మమత వచ్చింది.

“ఉండు మమ్మీ! డాడీ చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్తున్నారు అన్నం కొంచెంసేపాగి తింటాం లేమ్మా!” అంటూ చిన్ని, చింటూ ఒకేసారి అన్నారు.

“నువ్వు కూడా కాసేపు ఇలా కూర్చోవోయి. స్త్రీలలో వృద్ధాప్యం గురించి. పిల్లలు తెలుసుకుంటున్నారు. నీక్కూడా ముందు ముందు ఉపయోగ పడుతుంది” రమేష్ భార్యతో అన్నాడు.

మమత: “అవునండీ! ఏదో ‘ఆస్టియా పోరోసిస్’ అట అది కూడా పెద్ద వయసులో వస్తుందని పేపర్లో చదివాను.”

“డాడీ ‘ఆస్టియో పోరోసిన్’ అంటే ఏమిటి?” అమ్మ మాటలకు మధ్యలోనే అడ్డం వస్తూ చింటూ అడిగాడు.

రమేష్: “పేపర్స్‌లో వివరాలన్నీ చదివిందిగా, మమ్మీనే చెప్తుంది విను”

“కాల్షియం, మినరల్స్ తగ్గటం వలన ఎములకు పల్చగా, పెళుసుగా అవుతాయట. దీనివల్ల ప్రాక్చర్లు అయ్యే అవకాశాలు ఎక్కువట. ఇది స్త్రీలలో చాలా సర్వసాధారణమైన సమస్యట” మమత తను తెలుసుకున్న విషయాలన్నీ చెప్పింది.

“మరైతే ఈ సమస్యకు పరిష్కారం లేదా” చిన్ని అడిగింది.

“ప్రతిరోజూ 1200 నుండి 1500 మి.గ్రా కాల్షియమ్‌ను తీసుకుంటే ఈ సమస్యను నివారించవచ్చట. అంతే కాకుండా శారీరక వ్యాయామం కూడా ముఖ్యమట” మమత చెప్పింది.

“వెరీగుడ్ మమతా! చాలా విషయాలు తెలుసుకున్నావు. నీలాగా ప్రతి స్త్రీ వార్తా పత్రికల ద్వారా, రేడియో, టీవీల ద్వారా ఇలాంటి విషయాలను తెలుసుకొంటే చాలా బాగుంటుంది. మీరు తెలుసుకోవటమే కాదు. ఇరుగు పొరుగు వారికి కూడా చెప్పి వారిలో కూడా చైతన్యం కలిగిస్తే ఇంకా చాలా బాగుంటుంది. మహిళా చైతన్యాన్ని మించిన సాధనం లేదు ఇలాంటి సమస్యలకు” భార్యను మెచ్చుకుంటూ మెరిసే కళ్ళతో చెప్పాడు రమేష్.

“డాడీ కొంత మంది బామ్మలు వంగి నడుస్తారెందుకు? దానికి కారణమేమిటి?” చింటూ ప్రశ్నించాడు డాడీని.

“వెన్నుపూసల్లో ద్రవం తగ్గి పల్చగా అవుతుంది. దీనివల్ల వెన్నుపాము వంగి దగ్గరగా కుదించుకుపోతుంది. అందువల్ల నడుం వంగిపోతుంది” రమేష్ చెప్పాడు.

“ఇంకా గుండె, ఊపిరితిత్తుల్లో ఎలాంటి మార్పులొస్తాయి డాడీ!” చిన్ని ఉత్సాహంగా అడిగింది.

“ఇవన్నీ నాకెలా తెలుస్తాయమ్మా! రేపు ఆదివారం మీ డాక్టర్ మామయ్య వస్తాడు కదా! మామయ్యైతే మీకు బాగా వివరంగా చెపుతాడు” రమేష్ అన్నాడు.

“అవునమ్మా! మీ డాడీ ‘సైన్స్ టీచర్’ మాత్రమే. ఆ విషయాలన్నీ చెప్పాలంటే మా తమ్ముడే కరెక్ట్. వాడు డాక్టరు మరి” అమ్మ గొప్పగా చెప్పింది.

“ఆఁ! అవునవును! ఆ డాక్టర్ని చదివించింది ఈ సైన్స్ టీచరే అని మర్చిపోతే ఎలా!” రమేష్ ఉడుక్కుంటూ అన్నాడు.

“మమ్మీ! డాడీ! ఇంక మాకు ఆకలేస్తోంది. త్వరగా అన్నం తిని పడుకోవాలి. ఇంకా హోం వర్కులు కూడా పూర్తి కాలేదు పదండి పదండి” అంటూ చిన్ని, చింటూ వంటింటి వైపు దారి తీశారు.

వాళ్ళతో పాటు నవ్వుకుంటూ రమేష్, మమత కూడా వంటింట్లోకి వెళ్ళారు. అన్నాలు తిని అందరూ నిద్రపోయారు. ఉదయం అందరూ టిఫిన్ తింటూ మాట్లాడుకుంటున్నారు. చింటూ ప్రశ్నలడగటానికి రెడీ అయిపోయాడు.

“డాడీ! రాత్రి నాన్నమ్మ చాలా సేపు నిద్రపోలేదు. అది కూడా వృద్ధాప్య లక్షణమేనా” అడిగాడు చింటూ.

“నాన్నమ్మ నిద్ర పోలేదని నీకెలా తెలుసూ? నువ్వు మేలుకొని చూశావా?” చిన్ని అడిగింది.

“ఎప్పుడైనా నిద్రపట్టకపోతే నాన్నమ్మ భారతం చదువుకుంటుంది. రాత్రి కూడా నాన్నమ్మ రూములో నుంచి మాటలు వినబడ్డాయి. నేను బాత్‍రూమ్‌కి లేచినప్పుడు” చింటూ బదులిచ్చాడు..

“సరే! గొడవ ఆపండి. ఇంతకీ విషయం తెలుసుకోండి. వాళ్ళకి రాత్రి వేళ నిద్ర తక్కువగా ఉంటుంది. అందుకే నేను నాన్నమ్మను పగటి పూట నిద్రపోవద్దని చెపుతాను” రమేష్ చెప్పాడు.

“రాత్రిపూట నిద్ర బాగా పట్టాలంటే ఇంకేం చెయ్యాలి డాడీ” చిన్ని ప్రశ్నించింది.

“మామయ్య ఈ టైముకే వస్తానన్నాడు ఇంకా రాలేదేంటబ్బా?” వాకిలి వైపు చూస్తూ అన్నాడు చింటూ.

“వస్తాడు రా మామయ్య. ఆగు! అంత తొందరైతే ఎలా” అని రమేష్ కూతురి వైపు తిరిగి “రాత్రి పూట పడుకోబోయే ముందు ఒక గ్లాసు పాలు తాగితే మంచిదమ్మా రోజూ” అన్నాడు.

“పాలే తాగాలా డాడీ! టీ, కాఫీ ఏమైనా తాగవచ్చా?” చిన్ని ప్రశ్నించింది.

“అయ్యో టీ కాఫీలు తాగకూడదురా చిన్నీ, అందులో ఉండే కెఫిన్ నిద్రను దూరం చేస్తుంది. పాలు మాత్రమే తాగాలి. అంతేకాక ఎంతో కొంత వ్యాయామం ఉంటే మంచిది” రమేష్ చెప్పాడు.

“మామయ్యోచ్చాడు! మామయ్యోచ్చాడు” వాకిలి వైపు చూస్తూ పెద్దగా అరిచాడు చింటూ.

అందరూ అటువైపు తిరిగారు. డాక్టర్ రాజు లోపలికి వస్తున్నాడు. వస్తూనే చాక్లెట్ల ప్యాకెట్ చింటూ కందించాడు. అది చూసి చిన్ని బుంగమూతి పెట్టింది.

“నీవు బొమ్మలు బాగా వేస్తావుగా చిన్నీ, అందుకే నీ కోసం పెయింటింగ్ బ్రష్‌లు, కలర్స్ బాక్స్ తెచ్చాను” చూపించాడు రాజు చిన్నీకి.

ఆనందంగా అందుకొని మామయ్యకు బుగ్గమీద ముద్దొకటి ఇచ్చింది చిన్ని.

“నీకోసం నిన్నటి నుంచీ వీళ్ళిద్దరూ ఎదురుచూస్తున్నారు. నేను, మీ అక్కా కూడా లే. వృద్ధాప్యంలో స్త్రీలలో జరిగే మార్పుల గురించి తెలుసుకోవాలని తెగ ఉబలాటపడిపోతున్నారు. నాకు తెలిసినవేవో నేను చెప్పాను. వాళ్ళకింకా తెలుసుకోవాలని ఉందట, అందుకే నీకోసం ఎదురుచూస్తున్నారు” రమేష్ రాజుతో అన్నాడు.

అంతలో మమత లోపల్నుంచి వచ్చి “ఏరా రాజూ! బావున్నావా? హాస్పిటల్ బాగుందా! అమ్మానాన్నా బావున్నారా” అంటూ పరామర్శించింది.

“అంతా బాగానేవున్నారక్కా” అంటూ “నిన్ను రోజూ వాకింగ్ చెయ్యమన్నాను చేస్తున్నావా! బరువేమైనా తగ్గావా లేదా అంతకు ముందులాగే ఉన్నావా?” రాజు అడిగాడు.

“ఎక్కడరా ఇంట్లో పనితోనే సరిపోతున్నది. ఇంక వాకింగ్‌కు టైముండటం లేదు. ఈ మధ్య చాలా లావైపోతున్నానురా” అన్నది మమత.

“నీ వయసెపుడు నలభై దాటుతోంది. ఇప్పట్నుంచి నువ్వు కొవ్వు పదార్థాలు తక్కువ తీసుకోవడం, మంచి శారీరక వ్యాయామం చేస్తే ముసలితనంలో సమస్యలు తగ్గుతాయి” అన్నాడు రాజు.

“ఈ వయసులో బీపీలు, షుగర్లు రాకుండా జాగ్రత్త పడితే మంచిది. ఇంకా పెద్ద వయసులోనైతే గుండె నుంచి వచ్చే పెద్ద ధమని ఆయొర్బా గట్టిగా, పెళుసుగా అయి వంగకుండా ఉంటుంది. దీనివల్ల బ్లడ్ ప్రెజర్ ఎక్కువై గుండె మీద భారం ఎక్కువ అవుతుంది. ఇలాంటపుడు హార్ట్ ఎటాక్ సంభవించవచ్చు. అంతేకాక ‘యాంజైనా’ వంటి వ్యాధులు కూడా రావొచ్చు” చెప్పాడు రాజు.

“మామయ్యా, ‘యాంజైనా’ అంటే ఏమిటి” చిన్ని అడిగింది.

“గుండెకు కావలసినంత రక్తసరఫరా తాత్కాలికంగా అందకపోవటం వలన వచ్చే గుండె నొప్పిని ‘యాంజైనా’ అంటారు” చెప్పాడు రాజు.

“మరి ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి మామయ్యా!” అడిగింది చిన్ని.

“ఏముందమ్మా! సరియైన వ్యాయామం, కొవ్వు పదార్థాలు లేని ఆహారం తీసుకుంటూ రెగ్యులర్‌గా డాక్టర్ సలహాలు తీసుకుంటే సరిపోతుంది” చెప్పాడు రాజు.

“ఊపిరితిత్తులో కూడా మార్పులొస్తాయా మామయ్యా” చింటూ ప్రశ్నించాడు మామయ్యను.

“చింటూ! ముసలితనం అంటే శరీరంలోని ప్రతి అంగమూ దాని పని తీరు తగ్గుతుంది. ఊపిరితిత్తులు కూడా అంతకుముందు పని చేసినంత బాగా పనిచేయవు. లారింక్స్ కూడా తేడా వచ్చి చిన్న స్వరంతో మాట్లాడతారు. ఇంకా నిద్రలో అప్పుడప్పుడు శ్వాస తీసుకోవడం ఆపివేసే ‘స్లీప్ ఆప్నియా’ లాంటి వ్యాధులు కూడా రావచ్చు.”

“కిడ్నీలలో ఎలాంటి మార్పులొస్తాయి మామయ్యా” చింటూ అడిగాడు మామయ్యను.

“కిడ్నీలు ఏం చేస్తాయో తెలుసుగా చింటూ! రక్తంలో ఉన్న వ్యర్థ పదార్థాలను వడపోస్తాయి. ఈ పనిని ఇవి పెద్ద వయసులో నిదానంగా చేస్తాయి. దానివల్ల సమస్యలొస్తాయి” చెప్పాడు రాజు.

“మూత్రాశయంలో కూడా పనీతీరు తగ్గుతుందా మామయ్యా. నాన్నమ్మ బాత్‍రూమ్‌కు వెళ్ళేటప్పుడు దారంతా చుక్కలు చుక్కలుగా మూత్రం పడుతుంది” చిన్ని అడిగింది.

“అవునమ్మా చిన్నీ! చాలా బాగా గమనించావు. మూత్రశయ గోడలు బలహీనపడి మూత్రాన్ని సరిగా ఆపలేవు. అక్కడ ఉండే కండరాలలో శక్తి తగ్గి మూత్రం బయటికి వచ్చేస్తుంది” చెప్పాడు రాజు.

“సాధారణంగా వృద్ధాప్యంలో స్త్రీలకు వచ్చే వ్యాధుల గురించి చెప్పరా రాజు!” మమత తమ్ముడ్ని అడిగింది.

“చాలా ఉన్నాయి అక్కా హైపర్ టెన్షన్, డయాబెటిస్, క్యాన్సర్, హార్ట్ ఎటాక్, ఆర్తరైటిస్, ఆస్టియోపోరోసిన్, డిప్రెషన్, థైరాయిడ్, పార్కిన్సన్స్ వ్యాధి, నిద్రలో వచ్చే సమస్యలు, డిమెన్షియా వంటి వ్యాధులు సర్వ సాధారణం.”

“డిమెన్షియా అంటే ఏమిటిరా?” మమత అడిగింది రాజును.

“ఇదొక రకమైన మతిమరుపులాంటిది అక్కా. ఇప్పుడేం చేశారో కాసేపటికి గుర్తు ఉండదు. ఆలోచించే శక్తిని కోల్పోతారు. ఇది చాలా బాధాకరం. చాలా మంది వృద్ధులు చనిపోబోయే ముందు ఈ సమస్యతో బాధపడతారు” బాధగా చెప్పాడు రాజు.

“ఎథిరోస్‍క్లెరొసిస్ (Atherosclerosis) అంటే ఏమిటి రాజూ? మొన్న మా కొలీగ్ వాళ్ళ అమ్మ హాస్పిటల్‌కు తీసుకెళ్ళే లోపలే చనిపోయిందట. డాక్టరు ‘ఎథిరోస్‍క్లెరొసిస్’ అని వ్యాధి పేరు చెప్పాడట” అడిగాడు రమేష్ రాజును.

“అవును బావగారు! ఇది వచ్చిందంటే గంటా రెండు గంటలలోపే ప్రమాదం సంభవిస్తుంది. శరీరంల గుండె నుంచి రక్తాన్ని తీసుకొచ్చే ధమనుల గోడలు గట్టిపడి కొలెస్ట్రాల్‌తో మూసుకుపోవడం వలన ఇలాంటి స్థితి ఏర్పడుతుంది. దీనినే ‘ఎథిరోస్‍క్లెరొసిస్’ అంటారు. దీనివల్ల హఠాన్మరణాలు సంభవిస్తాయి” చెప్పాడు రాజు.

“షుగర్ వచ్చిన వాళ్ళు తీపి తినకుండా ఉంటే సరిపోతుందా! మందులు కూడా వాడాలా? ఒకవేళ మందులు వాడకపోతే ఏమైనా ప్రమాదమా?” రాజు నడిగింది మమత.

డాక్టర్ రాజు: “అక్కా షుగర్ అంటే డయాబెటిస్ వచ్చిన వాళ్ళు క్రమం తప్పక మందులు వాడాలి. అలాగే క్రమం తప్పక డాక్టరుగారి దగ్గర పరీక్షలు కూడా చేయించుకోవాలి. లేని పక్షంలో చూపుకు సంబంధించిన సమస్యలు, గుండె జబ్బులు, మెటబాలిక్ డిజార్డర్స్, హైపో థెర్మియా వంటి వ్యాధులు రావచ్చు.”

చింటూ, చిన్ని “అమ్మో అన్ని రకాల వ్యాధులా?” భయంగా అడిగారు.

డాక్టర్ రాజు: “అలా భయపడకూడదు. కొన్ని జాగ్రత్తలూ తీసుకుంటే చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్చు.”

“ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మామయ్యా?” చిన్ని అడిగింది.

“తమ్ముడూ! స్త్రీలలో వచ్చే క్యాన్సర్ల గురించి చెప్పరా?” అడిగింది మమత.

డాక్టర్ రాజు: “చిన్నీ నీ ప్రశ్నకు సమాధానం చివర్లో చెపుతాను. ముందు అమ్మ అడిగిన దానికి సమాధానం చెప్తాను. అసలు వృద్ధాప్యం అంటేనే క్యాన్సర్ల కాలం అంటారు. స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ ముఖ్యమైనవి ఇంకా మగవాళ్ళ కొచ్చే లంగ్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, కొలోన్ అండ్ రెక్టమ్ క్యాన్సర్ల వంటివి ఏవైనా రావచ్చు.”

“అసలు క్యాన్సర్ ఎలా వస్తుంది? అంటే ఏమిటి మామయ్యా” చింటూ ప్రశ్నించాడు.

“చింటూ! మన శరీరంలో ఎన్నో కణ విభజనలు జరుగుతుంటాయి. కానీ ఒక్కొక్క సారి ఆ కణ విభజన ఆగకుండా అపరిమితంగా జరగటం వలన అక్కడొక కంతి ఏర్పడుతుంది. దానినే క్యాన్సర్ అంటారు. అది ఎందుకు వస్తుందో తెలియదు” చెప్పాడు రాజు,

“మరి క్యాన్సర్ వచ్చిందని కనుక్కోవటం ఎలా మామయ్యా” చిన్ని అడిగింది.

డాక్టర్ రాజు:     “శరీరంలో ఎక్కడైనా అసాధారణ పెరుగుదల కనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించడం మంచిదమ్మా!”

“క్యాన్సర్లను పూర్తిగా నివారించవచ్చా మామయ్యా” చిన్ని అడిగింది.

డాక్టర్ రాజు:     “క్యాన్సర్ మొదటి దశలో ఉంటే పూర్తిగా నివారించవచ్చు. కానీ ముదిరిన తరువాత వస్తే కొంత వరకు మాత్రమే నిరోధించవచ్చు. అంటే మరణాన్ని ఆపలేము కానీ జీవిత కాలాన్ని పెంచవచ్చన్నమాట.”

“క్యాన్సర్ జబ్బుకు ట్రీట్ మెంట్ ఎలా ఇస్తారు మామయ్యా” చింటూ అడిగాడు.

డాక్టర్ రాజు: “క్యాన్సర్, సోకిన భాగాన్ని తొలగించటం ఒక మార్గం లేదా కీమో థెరపీ, రేడియో థెరపీ వంటి వాటి వలన కూడా క్యాన్సర్‌ను తగ్గించవచ్చు.”

“ఇంకా ఏమేం వ్యాధులు రావచ్చు మామయ్యా!” చింటూ, చిన్ని ఇద్దరూ ఒకేసారి అడిగారు.

“ఈ రోజు ఆదివారమైనీ మీకు ఆడుకోవాలన్పించట్లేదా? కనీసం టీవీ ఐనా చూడాలని లేదా? ప్రశ్నల మీద, ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు” రాజు నవ్వుతూ చింటూ, చిన్నీలను ప్రశ్నించాడు.

“లేదు మామయ్యా! ఈ విషయాలన్నీ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అందుకే ఏ పనీ చేయాలన్పించడం లేదు. కొత్త విషయాలన్నీ తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉంది” చిన్నీ చెప్పింది.

“అవున్రా తమ్ముడూ! పిల్లలకే కాదు మాక్కూడా చాలా ఆసక్తిగా ఉంది. ఇన్ని రకాల వ్యాధులున్నాయా అని ఆశ్చర్యంగా కూడా” అన్నది మమత.

“ఊ ఊ! తెలుస్తూనే ఉంది మీ ఉత్సాహం. విషయాలు చెప్పే చెప్పే నా గొంతెండిపోయింది. అసలే ఎండాకాలం కాస్త షర్బత్ ఏమైనా తాగడానికి ఇచ్చేదుందా లేదా!” రాజు నవ్వుతూ అడిగాడు.

“ఉండరా ఇప్పుడే తెచ్చిస్తాను” అంటూ మమత లోపలికి వెళ్ళింది.

“పిల్లలూ! ఇందాక ఏమేం వ్యాధులు రావచ్చు ఇంకా అని అడిగారు కదా! న్యూమోనియా, ఇన్ఫ్లూయెంజా, ఆస్మా వంటి వ్యాధులు రావచ్చు” రాజు పిల్లలతో చెప్పాడు.

“మామయ్యా! ఈ వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇందాక చెపుతానన్నావు కదా!” పిల్లలిద్దరూ ఆసక్తిగా అడిగారు.

డాక్టర్ రాజు: “సరే చెపుతా వినండి.

  • వాకింగ్ చాలా ముఖ్యం. కనీసం వారానికి మూడు సార్లైనా అరగంట సేపు నడవాలి.
  • పౌష్టికాహారం తీసుకోవాలి. దాంతో పాటే కొవ్వు పదార్థాలు మాత్రం మానేయాలి.
  • కాల్షియం, విటమిన్ డి తీసుకోవటం వలన ఎముకలు బలంగా ఉంటాయి.
  • సైక్లింగ్, డాన్సింగ్, జాగింగ్ వంటివి ఎముకల బలానికి చాలా మంచి ఎక్సర్సైజులు.
  • న్యుమోనియా, హెపటైటిస్, టెటనస్ వంటి వాటికి వ్యాక్సిన్లు తీసుకోవాలి.
  • ఏ మాత్రం అనుమానం వచ్చినా డాక్టరును సంప్రదించడం అవసరం.
  • నలుగురితో కలసి మాట్లాడటం వల్ల మనసు ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది.

ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు. పిల్లలూ, ఇక మీ సందేహాలు తీరాయా?”

“ఓ తీరాయి మామయ్య మాకీ రోజు చాలా విషయాలు తెలిశాయి” చింటూ చిన్నీ ఆనందంగా అన్నారు.

ఇంతలో మమత షర్బత్ గ్లాసు తెచ్చి తమ్ముడికిచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here