వ్యామోహం-10

0
12

[శ్రీ వరిగొండ కాంతారావు రచించిన ‘వ్యామోహం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[పటేల్ బాల్రెడ్డిని కలిసినప్పుడు ఆర్నెల్లు గడిచినయి అని గుర్తుచేస్తాడాయన డాక్టర్సాబుకి. దేనికని అంటే, జబ్బు నయమైందో లేదో చెప్తానన్నావని అంటాడు బాల్రెడ్డి. గతంలో రాసిచిన్న ప్రశ్నలనే మళ్ళీ రాసిచ్చి వనజమ్మని అడిగి జవాబులు రాసుకురమ్మంటాడు డాక్టర్సాబ్. నాస్తాకీ, చాయ్‌కీ ఏర్పాట్లు చేసి, కిందకి వెళ్తాడు బాల్రెడ్డి. కాసేపటికి బాల్రెడ్డి రాసుకొచ్చిన జవాబులు చూసి, కాసేపు కళ్ళు మూసుకుని ఆలోచించి, వనజమ్మకి ఇంకా రెండు నెలల వైద్యం అవసరమని చెప్తాడు. అప్పటి రోగ లక్షణాలు ఇప్పుడు లేవు కదా అని బాల్రెడ్డి అడిగితే, ఆ లక్షణాలు లేకపోవడం మంచిదే కానీ, ఆమె అనారోగ్యవంతురాలు కాదు, అట్లని సంపూర్ణ అరోగ్యవంతురాలు కూడ కాదని చెప్తాడు డాక్టర్సాబ్. బాల్రెడ్డి జబ్బుకి కూడా ప్రశ్నలు ఇచ్చి, జవాబులు రాసివ్వమంటాడు. అలాగే రాసిస్తాడు పటేల్. ఆయన రాసిన సమాధానాలు దైవ సాక్షిగ సత్యమే అయితే, సంపూర్ణారోగ్యవంతుల కిందనె లెక్క అని చెప్తాడు డాక్టర్సాబ్. అయితే తానిక బ్రహ్మచర్యం వదిలేయవచ్చా అని బాల్రెడ్డి అడిగితే, వనజమ్మకు నయమయ్యేదాకా ఆగాలంటాడు డాక్టర్సాబ్. తనకా ఊర్లో రెండో ఇల్లుందని పటేల్ చెప్తే, వీరలక్ష్మి కదా అని అంటాడు డాక్టర్సాబ్. నీకెలా తెలుసని అడిగితే, ఊరందరికీ తెలుసనీ, కానీ ఎవరూ దాని గురించి మాట్లాడరని అంటాడు డాక్టర్సాబ్. తనకి వీరలక్ష్మి ఎలా పరిచయమైందో చెప్తాడు. వీరలక్ష్మికి కూడా ప్రశ్నలు రాసిచ్చి, జవాబులు రాయించుకురమ్మని చెప్తాడు. డాక్టరమ్మ తమ్ముడు సత్యమూర్తి అక్కాబావల్ని చూడడానికి వస్తాడు. పిల్లలకి కానుకలతో పాటు, ఒక కెమెరా తెస్తాడు. దాంతో పిల్లల్ని ఫోటోలు తీయాలని అతని ఆలోచన. మర్నాడు డాక్టర్సాబ్ కాడెద్దులపల్లెకు వెళ్తాడు. పిల్లలూ, డాక్టరమ్మ ముస్తాబయి ఫోటోలకు సిద్ధమవుతారు. అందరూ కలిసి గ్రూపు గాను, విడివిడిగానూ ఫోటోలు దిగారు. పిల్లలు గొడవ చేస్తే, అమృత, కృష్ణవేణి, డాక్టరమ్మలను కలిపి ఫోటో తీస్తాడు సత్యమూర్తి. జింకపిల్ల కూడా ఉండాలంటాడు రాము. పిల్లలతో పాటు కృష్ణవేణి వెళ్ళి జింకపిల్లని తెస్తుంది. వాళ్లతో పాటు వీరలక్ష్మి కూడా వస్తుంది. జింకపిల్లను, పిల్లలను, అక్కయ్యను, అమృతను, వీరలక్ష్మిని, కృష్ణవేణిని కలిపి గ్రూపులు గాను, విడివిడిగాను ఫోటోలు తీస్తాడు సత్యమూర్తి. మూడో రోజున ఊరెళ్ళిపోతాడు సత్యమూర్తి. మళ్ళీ ఎప్పుడో వచ్చినప్పుడు అందరూ ఫోటోలడిగితే, ఆ రోజు అందులో రీలయిపోయిందని, ఫోటోలు రాలేదని చెప్తాడు. ఫోటోలు లేకపోతే ఏమయింది, ఆ రోజెంతో సంబరంగా గడిచిందని అంటుంది అమృత. ఇక చదవండి.]

[dropcap]కా[/dropcap]ర్తీకశుద్ధ సప్తమీ శుక్రవారం ఉదయం 8.40కి భూమిపూజకు ముహూర్తం నిశ్చయమైంది. డాక్టరు దంపతులు పట్టుబట్టలు కట్టుకొని పీటలమీద కూర్చున్నారు. డాక్టరు గారి అత్తగారు, బావమరిది వచ్చారు. చిన్నపిల్లలిద్దర్నీ ఎత్తుకున్నారు. పెద్ద పిల్లలిరువురూ జరుగుతున్న క్రతువును ఆసక్తిగా చూస్తున్నారు. పురోహితుడు వారణాసి మహదేవయ్య మంత్రాలు చదువుతున్నాడు. తాపి మేస్త్రి మైసయ్య పనివాళ్ళతో సిద్ధంగా ఉన్నాడు ముగ్గు పొయ్యడానికి. పట్వారి నర్సింగరావు దంపతులు, పోలీసు పటేల్ బాల్రెడ్డి, సర్పంచు రాజిరెడ్డి, మాలిపటేల్ నర్సిరెడ్డి, షావుకారు అల్లెంకి శంకరయ్య, హెడ్మాస్టరు అనంతుల నరహరి, సారెదార్ రఘునాథరావు ఇలా ఒకరేమిటి ఊర్లో సగమ్మంది ఆడామగా అక్కడే వున్నారు.

గ్రామంలో ముఖ్యులను తప్ప వేరెవర్నీ పిలువలేదు డాక్టరుగారు. అయినా సరే అందరూ సమయానికి హాజరైనారు. డాక్టరుగారి పట్ల వారికా నాలుగేళ్ళలో ఏర్పడిన అవ్యాజానురాగాలటువంటివి.

జంపన్నగూడెం వెళ్ళే దారిలో ఇరవై గుంటల స్థలం. దాదాపుగా ఊరి చివరి క్రిందే లెక్క. కానైతే ఈ స్థలానికి ఫర్లాంగవల మాధ్యమిక పాఠశాల వున్నది.

“ఊరి కొసకు కడ్తున్నవు డాక్టర్సాబూ!” అడిగాడు అల్లెంకి శంకరయ్య.

“పట్వారిసాబు జాగనిక్కడనె ఇప్పించిండు” చెప్పాడు డాక్టరు.

“బడె వున్నవు శంకరయ్య! జంపన్నగూడెం నుంచి వస్తుంటె మొదటి ఇల్లు డాక్టర్సాబ్‌దే కద!” నవ్వుతూ అన్నాడు పట్వారి. వీరలక్ష్మి గుర్తుకు వచ్చి నవ్వొచ్చింది డాక్టరు గారికి.

“ఊరికి చివరిగా కట్టుకున్నారేమిటీ మీ ఇల్లు” అడిగాడు తానా రోజు.

“ఇది కొసకెట్లయితది డాక్సర్సాబు. మల్లన్న గుడికెల్లి వస్తుంటే మాదె మొదటిల్లు” అన్నది వీరలక్ష్మి.

“అగో నవుతవు డాక్టర్సాబ్!” అడిగారిద్దరూ ఒకేసారి.

“అవుతల బడి వుండంగ నా యిల్లు కొసదెట్లయితది మొదటిదెట్లయితది అని నవ్వొచ్చింది” అన్నాడు డాక్టరు.

“అవునయ్యో! చమత్కారివే” నవ్వుతూ అన్నాడు పట్వారి.

ముహూర్త సమయమైంది. పంతులు గారి సూచన మేరకు డాక్టరుగారు నాలుగుసార్లు గడ్డపారతో భూమి మీద పొడిచాడు. మేస్త్రి తన సహచరుల సహకారంతో ముగ్గుపోశాడు. మచ్కూరివాండ్లు పట్వారి సొంత ఇంటి పనికివలె తమ సహాయ సహకారాలనందించారు.

“డాక్టర్సాబ్! ఈ ఆదివారం గాక పై ఆదివారం నాటికి టేకు మొద్దులు వస్తయి. వడ్లరాజయ్య సైజులు కోసి చౌకోట్లు, కిటికీలు చేసి పెడ్తడు” ఆశ్వాసనమిచ్చాడు నర్సింగరావు కులకర్ణి.

“చాన కృతజ్ఞుణ్ణి” దణ్ణం పెడ్తూ చెప్పాడు డాక్టరు గారు.

“అంత పెద్ద మాటెందుగ్గని. దూలాలు, వాసాలు గోడలు పూర్తయ్యె నాటికస్తయి. ఎనిమిదర్రలు, హాలు అంటే పెద్ద ఇల్లె పెట్టుకున్నవు. దైర్నం పెద్దదె” అభినందించాడు నర్సింగరావు.

“అంతా మీ అందరి అభిమానం. పొరుగూరి వాళ్లొస్తె వైద్యానికి ఒకట్రెండు రోజులుండె ఏర్పాటు చేస్తున్న. నాలుగర్రలు దవాఖానకె పోతయి” వివరించాడు డాక్టరు గారు.

“మరి పెంకలెందుకే. మిద్దెను చూసెడ్దుండె” అన్నాడు మాలిపటేల్.

“మిద్దె నాతోనేడయితది నర్సిరెడ్డి పటేల” జవాబిచ్చాడు డాక్టరు.

“యాదగిరీ! ఇట్రావయ్యా” పిలిచాడు కాస్త దూరంగా నిలబడి చూస్తున్న కుమ్మరి యాదగిరిని బాల్రెడ్డి పటేలు.

దగ్గరగా వచ్చాడు యాదగిరి. “ఇగొ యాదగిరి ఇటుకబట్టీలెప్పుడు పెడ్తున్నవు” అడిగాడు పటేలు.

“ఎప్పుడేంది పటేల! మూడు ఆముల ఇటుక కాల్తున్నది”

“శభాష్! డాక్టర్సాబిల్లు పూర్తయ్యేదన్క మధ్యల ఖాలిరాకుండ ఇటుకనందించే బాధ్యత నీది. ముందుగాన్నె చెప్తున్న పైసలు నా దగ్గర కొనబో. డాక్టర్సాబు దగ్గర ఒక్కరూపాయ దీస్కున్న సుత మర్యాదక్కది” చెప్పాడు బాల్రెడ్డి.

ఆశ్చర్యపోయాడు డాక్టరు గారు. ఊరంతా నివ్వెరపడింది. బాల్రెడ్డి పటేలు మాట సాయం జేయడమే గొప్ప విషయం. అటువంటిది డాక్టర్సాబు తలపెట్టిన ఇంత పెద్ద ఇంటికి ఇటుక మొత్తం ఖర్చు తను భరిస్తున్నాడంటే నమ్మశక్యం గాకుండా ఉంది ఊరి వారికి.

‘ఈయన పైసలిస్తడా లేకుంటె ఖర్చుమొత్తం నా మీదికి నూకుతడా’ మనసులోని అనుమానం మొహమ్మీద ప్రస్ఫుటమౌతుంటే అంగీకరమేనన్నట్లుగా తలనూపాడు యాదగిరి.

యాదగిరి మనసును చదివిన బాల్రెడ్డి పటేలు వెంటనే జేబులోంచి వందనోటును తీసిచ్చి “ఇగో ఇది బయాన తీస్కో. అవుసరముంటె ఎప్పటిదప్పుడు దీసుకొ లేకుంటె కొసాఖరుకైన దీస్కో” అన్నాడు.

రెండు చేతులూ జోడించి బాల్రెడ్డి దగ్గరకొచ్చిన డాక్టరుగారు చిన్నగా అన్నాడు “నువ్వు నన్ను ఋణంల పడేస్తున్నవు పటేలా!”

“నువ్వు చేసిన్దానికిదేమంత పెద్ద ముచ్చట కాదుగాని అంత మర్చిపో!” అన్నాడు బాల్రెడ్డి.

అప్పుడే అక్కడికక్కడే పునాదిరాళ్ళ కేర్పాటయిపోయింది. ఇల్లు మట్టి అడుసుతో కట్టేట్టు, డంగు సున్నంతో గిలాబు చేసుకొనేటట్టు కూడ నిర్ణయమైపోయింది.

“ఒక్క నెల ముందట చెప్తే చాలు డాక్టర్సాబు నీకెన్ని వాయిల సున్నం కావాన్నంటే అన్ని వాయిల సున్నం డంగు బట్టిస్త సరిగ్గ అందిస్త” వాగ్దానం చేసాడు డంగు ముత్తిలింగం. అలాగ ప్రతి ఒక్కరూ డాక్టరుగారి ఇంటి నిర్మాణానికి తలా ఒక చేయి వేయగలందులకు నిర్ణయమైపోయింది.

ఆటపాటల్లో అలిసిపోయిన పిల్లలు పెందరాళే నిద్రలోకి జారుకున్నారు. అల్లుడి పరపతిని చూసి ఆనందపడింది అత్తగారు. బావగారి పట్ల ఊరివాళ్ళ అభిమానాన్ని గ్రహించుకున్న సత్యమూర్తి బావగార్ని అభినందనలతో ముంచెత్తాడు. తన భర్త గొప్పతనాన్ని చూచుకొని పరవశించిపోయింది డాక్టరమ్మ. ఊరివాళ్ళ అపారమైన ప్రేమభావం మోయలేనంత బరువుగా తోచింది డాక్టరు గారికి.

ఓ రాత్రి వరకు కబుర్లాడుతూ అందరూ నిద్రపోయారు గాని, డాక్టరు గారి కంటి మీదకు మాత్రం కునుకు రాలేదు. తెల్లవారగట్ల కోడి కూసింది. ఊరివారంతా మేలుకొంటుంటే కన్నంటుకొంది డాక్టరు గారికి.

***

ఇంటిపని అనుకున్న దానికంటే వేగాన్ని పుంజుకొంది. చూస్తూ చూస్తూండగానే పునాదులు పూర్తయ్యాయి. వసంత పంచమి నాటికి గుమ్మాలెత్తారు. పన్నెండు గుమ్మాలు, ఎనిమిది కిటికీల ఇల్లు. ఆ రోజుల్లో ఇంటి మొత్తానికి ఒకటి రెండు కిటికీలుండడమే గొప్ప విషయం. అలాంటిది ఏకంగా ఎనిమిది కిటికీలంటే మాటలా. డాక్టరుగారిల్లు గురించి మాట్లాడుకొనని ఇల్లు ఆ ఊళ్ళో లేకుండా పోయిందంటే అతిశయోక్తి కాదు.

గోడలు నాలుగడుగుల ఎత్తుకు లేచాయి. బావిలో నీళ్ళయిపోయాయి. ముహూర్తం రోజునే బావి తవ్వడం మొదలు పెట్టారు. ఎనిమిది కోలల బావి. కోల అంటే నాలుగు మూరలు లేదా రెండు గజాల కైవారంతో అంతే లోతులో గొయ్యి అన్నమాట. ఆరు కోలలు తవ్వాక జలపడింది. సాధారణంగా జలపడ్డాక ఒక కోలను మించి తవ్వరు. కాని డాక్టరు గారు పట్టుబట్టి మరీ రెండు కోలలు అదనంగా తవ్వించారు. అయినా బావి కృత్తిక మొదట్లోనే ఎండిపోయింది. భరణి కార్తెలోనే ఊళ్ళో సగానికి పైగా బావులెండిపోయాయి. ఇంక చేసేదేముంది. నీటి వసతి లేనందున గృహనిర్మాణం ఆగిపోయింది. మృగశిరలో వానలు పడాలి. ఆర్ద్ర వరకు నీళ్ళు పుష్కలంగా వస్తాయి. అంటే సుమారు ఇంకో రెండు నెలల వరకు నిర్మాణం పనులు ఆగిపోయినట్లే. గతేడాది వర్షాలు సరిగా పడనందువల్ల ఈ పరిస్థితి వచ్చింది. పన్నెండేళ్ళకోసారి ఇలా బావులెండిపోతాయి ఈ ఊళ్ళో అని చెప్పారు ఎనభై తొంభై ఏళ్ళున్న ముదుసళ్ళు.

పని ఆగిపోయినా నిలువెత్తు గోడలు లేచాక ఇల్లు ఇల్లే. రోజూ దీపం పెట్టి శుభ్రం చేసేందుకు, కాపలాగా వుండేందుకు చాకలి సాయిల్ను పెట్టుకున్నాడు డాక్టరు గారు. నాలుగు నిట్రాళ్ళు పాతుకొని, చుట్టూ తడికలు కట్టుకొని, పైన గడ్డి పరచుకొని గుడిసె తయారు చేసికొన్నాడు సాయిలు.

అదృష్టవశాత్తు మంచినీళ్ళ బావి ఎండిపోలేదు. ఊళ్ళో దాదాపుగా ఇంటికొక బావి చొప్పున వున్నా అన్నీ ఉప్పు నీళ్ళే. ఊరంతటికీ ఒక్కటే మంచి నీటి బావి. నాలుగు వేపులా గిలకలతో నీళ్ళు తోడుకొనే సదుపాయంతో వుంటుందా బావి. ఎవరి చేదబొక్కెన, చాంతాడు వాళ్ళే తెచ్చుకొంటారు. వీలవని వాళ్ళు అక్కడున్న వాళ్ళనడిగి ఆ చేదతోనే నీళ్ళు తోడుకుంటారు. బరువు బిందెలనెత్తుకుందుకు ఒకళ్ళ కొకళ్ళు సాయం చేసికొంటారు. ఇదొక అద్భుతమైన ప్రచారంలేని సహకార పద్ధతి అన్నమాట. ఊరిలోని ఆడవాళ్ళంతా మంచినీళ్ళకక్కడికే వస్తారు. ఏ రోజన్నా ఆడవాళ్ళకు చేతకాకపోతే ఆ ఇంటి మగవాళ్ళు నీళ్ళకొస్తారు. పటేలు, పట్వారి వంటి వాళ్ళింటికి పనివాళ్ళే నీళ్ళు తోడుకువెళతారు.

డాక్టరు గారింట్లో బావినీళ్ళు మరీ మంచినీళ్ళని చెప్పడానికి లేదు కాని పప్పు ఉడుకుతుంది. వాళ్ళా నీళ్ళతోనే నెట్టుకొస్తున్నారు. కాని నీళ్ళు మరీ అడుక్కు వెళ్ళిపోయి బురదలు వస్తున్నాయి. తోడుకున్న నీళ్ళు తేరుకున్నాక వాడుకోవచ్చు కాని, వంటకు తాగడానికి పనికి వచ్చేట్టు లేవు. అమృత వాళ్ళింటి బావి పరిస్థితి కూడ అదే. అంచేత డాక్టరమ్మ కూడా బిందె పుచ్చుకుని మంచినీళ్ళ బావికి రాక తప్పట్లేదు. డాక్టరు గారింటికి మంచినీళ్ళ బావి అట్టే దూరం లేకపోవడం ఆవిడకు కలిసి వచ్చిన అంశం.

రాముకి ఏడాది పరీక్షలయిపోయాయి. ఒంటిపూట బళ్ళు నడుస్తున్నాయి. ఫలితాలు వచ్చేవరకు పాఠాలు చెప్పరు కాని, పిల్లలు బడికి వెళ్ళి వస్తూ వుండాలి. ఆడుకోవడానికి ఇదొక సాకు. కాబట్టి మిగతారోజుల్లో ఎలా వున్నా పరీక్షలయిపోయాక నడిచే ఒంటిపూట బళ్ళకి పిల్లలు ఇష్టపూర్తిగా వెళ్ళి వస్తుంటారు. ఎండలు బాగా వున్నాయని, ఒకటో క్లాసే కదాని సోముని బడి మాన్పించారు. వాడు చిన్న వాళ్ళిద్దరితో ఆడుకుంటూ ఇంటివద్దనే వుంటున్నాడు.

ఓ రోజు నీళ్ళు తోడుకొని కూజా బిందెని చంకనెత్తుకోవడంలో ఆయాసపడింది డాక్టరమ్మ. బిందెనెత్తుకోవడానికి సాయం చేసింది నీళ్ళు తోడుకోవడాని కొచ్చిన మహదేవయ్యగారి భార్య మహాలక్ష్మమ్మ.

బిందెనెత్తుతూ చిన్నగా అడిగింది “ఆయాసపడుతున్నావు. నీరసంగా వున్నావు. మొహంలో నిగారింపు. మళ్ళీ ఏమన్నా విశేషమా!” అవునన్నట్లుగా తలనూపింది డాక్టరమ్మ.

“ఎన్నో నెల?”

“మూడనుకుంటున్నాను” చెప్పింది డాక్టరమ్మ.

“ఏమిటోనమ్మా ఈ ఆడజన్మ. దేముడు రాసిపెట్టినన్నాళ్ళు కంటూనే పోవాలి” ఓదార్చింది మహాలక్ష్మమ్మ.

“మీ మూడో అమ్మాయి పురిటికొచ్చినట్టుంది!” పరామర్శించింది డాక్టరమ్మ.

“అవునమ్మా! ఈ వారంలో పురుడు రావచ్చుననుకొంటున్నాం. మంత్రసానికి చెప్పి పెట్టాం. తను కూడ చూసి వెళ్ళింది. నొప్పులొస్తే పిలవమంది” సమాధానం చెప్పింది మహాలక్ష్మమ్మ.

ఆవిడ దగ్గర సెలవు తీసుకొని ఇంటికొచ్చింది డాక్టరమ్మ.

ఇది జరిగిన వారానికి మంచినీళ్ళ బిందెను వంటింట్లో దించుతున్న డాక్టరమ్మ చెయ్యి పట్టుజారి బిందె కిందపడబోయింది. బిందె జారకుండా చూచుకొనే యత్నంలో పట్టుతప్పి బిందెతోపాటు ఆవిడ కూడ బోర్లపడిపోయింది. బిందె పడ్డ శబ్దం పెద్దగా రావడంతో ఆసుపత్రి గదిలోనే వున్న డాక్టరుగారు పరుగెత్తుకొచ్చారు వంటింట్లోకి. ఆవిడను లేపబోయారు. నుంచోవడానికావిడకు సాధ్యం కాలేదు. రెండు చేతుల్లోనూ ఆమె నెత్తుకొచ్చి ఆసుపత్రి పరీక్ష బల్లమీద పడుకోబెట్టారు.

ఆమె వగరుస్తోంది. ఆయాసపడుతున్నది. మందులు వేశారు డాక్టరుగారు. ఆమెకు సపరిచర్యలు చేస్తూనే వంటచేసి పిల్లలకు అన్నాలు పెట్టారు. నాన్న చెప్పే చిన్న చిన్న పనులు చేస్తూ రాము దీనంగా అమ్మనే చూస్తూ నిలుచున్నాడు. విషయం తెలుసుకున్న అమృత, కృష్ణవేణి చిన్నపిల్లలు ముగ్గుర్నీ వాళ్ళింటికి తీసుకెళ్ళి ఆడించడం మొదలు పెట్టారు.

సాయంత్రానికి కోలుకొంది డాక్టరమ్మ. లేచి తన పనుల్లోకి ప్రవేశించడానికి పూనుకొంది. వారించారు డాక్టరుగారు. చిన్నగా పొత్తికడుపులో నొప్పి అనిపించసాగింది. పడుకోమని చెప్పి ఇంజెక్షనిచ్చాడు డాక్టరు గారు.

మరునాడుదయమే సవారి కచ్చురం చేయించుకొని భార్యాపిల్లలతో మొలకలగూడెం స్టేషనుకొచ్చాడు డాక్టరు గారు. తన సైకిలును స్టేషను మాస్టరుకప్పజెప్పి రైలెక్కి కాజీపేట స్టేషనుకు అక్కడి నుండి హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలకు వచ్చారు. తోడుగా ఉండటానికి అమృత వచ్చింది.

పరీక్షలన్నీ అయినాక లేడీ డాక్టరు చెప్పింది. “మీ అనుమానం నిజమే. గర్భసంచికి దెబ్బ తగిలింది. అదృష్టమేమంటే పిండం దెబ్బ తినలేదు. ఇప్పట్నించి పురుడయ్యేవరకు ఆమె ఏ పనులూ చెయ్యకూడదు. పిల్లల్ని కూడ ఎత్తుకోకూడదు.”

“మరి ప్రయాణం ఎట్లా! మేం జోడెడ్లపాలెం నుండి వచ్చాం. రైలు దిగి ఎడ్లబండిలో పయనించాలి” చెప్పాడు డాక్టరు.

“ఇక్కడే ఏమన్నా ఏర్పాట్లు చేసుకోండి. ప్రయాణంలో ఏమైనా అపాయం జరిగితే చెప్పలేం. లేదా మళ్ళీ పరీక్ష చేయించుకోవడానికి వచ్చేప్పుడైనా ఇబ్బంది కలుగవచ్చు. నేను పిండం గురించి చెప్పడం లేదు. పెద్ద ప్రాణం గురించి చెబుతున్నాను. ఆపైన మీ ఇష్టం. మీ వీలు కూడ చూచుకోండి” అంది డాక్టరమ్మ.

ఏం చేయాలో పాలుపోలేదు డాక్టరు గారికి. పది నిమిషాలు తీవ్రంగా ఆలోచించాక మార్గాంతరం తట్టింది.

తనతో పాటే వైద్యం నేర్చుకొన్న సహాధ్యాయి కృష్ణమాచార్యులు ఇక్కడే వరంగల్లులో ఆసుపత్రి పెట్టుకొన్నాడు. తనకు వలె మూడు మార్గాలలో పయనించకుండా కేవలం ఆయుర్వేదాన్ని నమ్ముకొని ప్రాక్టీసు పెట్టాడు. మంచి పేరు కూడ గడించాడు. సొంత ఇల్లు ఇంకా కట్టుకోలేదు గాని, పాపయ్యపేట చమన్ వద్ద పెద్దదే ఇల్లు అద్దెకు తీసుకున్నాడు.

ఆసుపత్రి నుండి నేరుగా రిక్షాలు చేయించుకొని డా. కృష్ణమాచారింటికి వెళ్ళారు. సమయానికి కృష్ణమాచారి ఇంటి వద్దనే వున్నాడు. సంతోషించాడు కూడాను. మగవాళ్ళు అడపాదడపా కలుసుకున్నా ఆడవాళ్ళు కలుసుకుని చాన్నాళ్ళయింది. ఆవిడది కూడ జంగారెడ్డిగూడెమే కావడం మూలాన పెళ్ళికి ముందునుండే వాళ్ళిద్దరూ స్నేహితురాండ్రు. కృష్ణమాచారిది ఏలూరు దగ్గర విజయరాయి. కృష్ణమాచారికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు మొగ పిల్లలు, ఒక ఆడపిల్లను. పిల్లలు త్వరలోనే కలిసిపోయారు. భోజనాలయినయి. సాయంత్రం నాలుగు కావస్తుంది.

ఐదున్నరకి ప్యాసింజరుంది. అమృతను మళ్ళీ దించి రావాలి. అమృత తానొక్కతెనే వెళతానంది. అలాగైతే మరుసటి రోజుదయం వెళ్ళమన్నారు వీళ్ళు. రాత్రికి కృష్ణవేణి ఒక్కత్తే ఉండలేదని భయపడింది అమృత. రాత్రికి దించి రేప్పొద్దుటే బయల్దేరి వస్తానని చెప్పి బయల్దేరాడు డాక్టరుగారు అమృతతో.

స్టేషన్లో టిక్కట్లు తీసుకొని రైలెక్కారు. రైలు కాజీపేట నుండే బయల్దేరుతుంది కనుక ముందుగానే ఫ్లాటుఫారం పైన వుంటుంది. వరకు వెళుతుంది. లోకల్ అంటారు. నాగపూరు వరకు వెళ్ళేదాన్ని ప్యాసెంజరు అనే వాళ్ళు.

రైల్లో అల్లెంకి శంకరయ్యతోపాటు ఆయన కుటుంబ సభ్యులంతా కూర్చొని వున్నారు. పరస్పర అభివాదాలయ్యాక విషయం తెలుసుకున్నారు. డాక్టరమ్మ పరిస్థితికి చింతపడ్డారు. చివరకు శంకరయ్య “డాక్టర్సాబ్! అమృత మా ఎంబడె వస్తది. ఊళ్ళెకు బోయినంక ఇంటికి ఎవర్నన్న ఇచ్చి తోలిస్తగని, నువ్వు పన్జూసుకోని రా!” అన్నాడు.

డాక్టరు గారు అమృత వంక చూశాడు. అమృత తన సమ్మతిని తెలిపాక వాళ్ళవద్ద సెలవు తీసుకొని ఇంటికి బయల్దేరాడు డాక్టరు గారు.

ఆ రాత్రి భోజనాలయ్యాక డాక్టర్లిద్దరి మధ్య అనేక విషయాలను గురించిన చర్చ చాలాసేపు జరిగింది. ఆ చర్చల్లో భాగంగానే డాక్టరు గారు కృష్ణమాచారి గారింటి దగ్గర్లోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకునుండాలని, డాక్టరుగారు వీలు వెంట జోడెడ్లపాలానికి వెళ్ళి వచ్చేట్లు నిర్ణయమైంది. అద్దె ఇల్లు కృష్ణమాచారి నివాసానికి దగ్గరగా వుంటే ఏమన్నా అవసరాలొస్తే చూచుకోవచ్చునన్నది ఆలోచన.

మరునాడుదయం డాక్టర్లిద్దరూ పాపయ్యపేట చమన్ పరిసర ప్రాంతాన్నంతా గాలించగా బొడ్రాయి సమీపంలో ఓ ఇల్లు దొరికింది. వంటింటితో కలిపి మూడు గదులు. లెట్రిన్ బాత్రూం విడిగా వున్నాయి. మున్సిపల్ నల్లా రోజూ ఉదయం ఆరుగంటలకు వస్తుంది. ఇంటిముందున్న బొందలోకి దిగి నీళ్ళు పట్టుకోవాలి. అత్యవసరమనుకొంటే ఇంట్లో హ్యాండ్ పంపు ఉంది. నీళ్ళు కొట్టుకోవాలి.

“నెలకు పదిరూపాయల కిరాయ. పాయఖాన, హమామ్‌ఖాన మీకు మాకు ఒక్కటె. మేథరామె దినాం వచ్చి సాఫు చేసి కక్కూసును బక్కెట్ల తీస్కపోతది. మనిషికి నెలకు రూపాయ లెక్క ఆ పైసలు మీరె కట్టుకోవాలె.

నల్లా నీల్లు మనిద్దరమె కాక గల్లిల ఇంకో నాలుగిండ్లోల్లు పట్టుకొంటరు. నల్ల గంట సేపస్తది. కరెంటు మీటరు ఒక్కటే కాబట్కె మీరు బుగ్గకు రూపాయి చొప్పున మూడు బుగ్గలకు మూడు రూపాయలియ్యుండ్రి చాలు. నడక మీకు మాకు ఒక్కటే. వాకిలి సానుపు మీరొక దినం మేమొకదినం చేస్కోవాలె” అద్దె నియమాలన్నీ గడగడ చెప్పేశాడు యజమాని.

“నేను డాక్టరు కృష్ణమాచారిని. ఈ పక్క సందులోనే వుంటాను. గోపాలస్వామి గుడి దగ్గర మెయిన్ రోడ్డులో నా దవాఖాన” తనను తాను పరిచయం చేసుకొన్నాడు కృష్ణమాచారి.

“ఓ మీరేనా ఆ డాక్టర్సాబు. అయ్యొ గుర్తుపట్టలే సారు! అంటే ఎప్పుడు కూడ మాకు వైద్యుని అక్కర పడలె” క్షమాపణ పూర్వకంగా అన్నాడు ఇంటి యజమాని.

“వైద్యుని అవసరం రాకుండా ఉండడమే మంచిది లెండి. పరిచయం చేసుకుందామని చెప్పాను. ఈయన మా స్నేహితుడు. డాక్టరు కూడా. జోడెడ్లపాలెంలో ప్రాక్టీసు చేస్తాడు. భార్య ప్రసూతికున్నది. ఒక ఆర్నెల్లు మీ ఇంట్లో ఉంటాడు” అన్నాడు కృష్ణమాచారి.

“ఓ అట్ల చెప్పరూ! నా పేరు వనపర్తి కృష్ణమూర్తి. జోడెడ్లపాలెంల అల్లెంకి శంకరయ్య మా షడ్డకుడే. మీకు గుర్తుండే ఉండచ్చు.”

“అవునా! నిన్న మీ ఇంటికేనా వాళ్ళు వచ్చి వెళ్ళింది” అడిగాడు డాక్టరు గారు.

“అవును డాక్టర్సాబ్! మా బావమరిది బిడ్డ పెద్దమనిషయుండె. పిన్నావారి వీధిల వుంటరు వాండ్లు. ఆ కార్యక్రమానికే వచ్చిన్రు వాండ్లు” అన్నాడు సంతోషంగా.

మళ్ళీ అతడే అన్నాడు “మీరు మాకు దగ్గరి వాండ్ల కిందనే లెక్క. పదిరూపాయలియ్యుని. కరెంటు పైసలవుసరంలే. వాకిలి కూడ మావోల్లె వూడ్చుకుంటరు. మాకు మట్టెవాడల్నె బట్టల దుకాణమున్నది. పండుగలు పబ్బాలకు మా దగ్గర్నె బట్టలు తీసుకోవచ్చు. ఎప్పుడన్న ఓసారి వచ్చి దుకాణమైతె చూడున్రి.”

డాక్టర్లకింక మాట్లాడడానికేమీ మిగులు లేదు. పది రూపాయలు కిరాయ అడ్వాన్సు ఇచ్చి ఇంటికి వచ్చారిద్దరూ.

“చాలాసేపు వెళ్ళారే. ఒంటిగంట కావస్తుంది. అన్నయ్యగార్ని మీ ఆసుపత్రికి తీసుకెళ్ళారా!” అడిగింది కృష్ణమాచారి భార్య అన్నపూర్ణ.

“లేదు. ఇళ్ళవేటతోనే సరిపోయింది. శుభశకునం ఏంటంటే ఇల్లు దొరికింది. పక్క సందులోనే. బొడ్రాయికి దగ్గర్లో. నిజం చెప్పాలంటే మనింటి నుంచి నా ఆసుపత్రికి వెళ్ళే దారిలో సరిగ్గా మధ్యన వుంది” చెప్పాడు కృష్ణమాచారి.

“పోనీలెండి మంచి పనిచేశారు. ఖాళీ సమయాల్లో నేను సుందరి దగ్గరకు వెళ్ళి రావచ్చును” చెప్పింది అన్నపూర్ణ.

భోజనాలకు ఏర్పాటు చేస్తూంటే డాక్టరమ్మ పనిలో పాలు పంచుకోబోయింది. వారించింది అన్నపూర్ణ “సుందరీ! కొంతకాలం డాక్టర్ల మాట వినవే!” అంటూ.

“సరేలే అన్నపూర్ణా! డాక్టర్ల మాటేమోగాని, నీ మాట తప్పక పాటిస్తాను” చిరునవ్వుతో సమాధానమిచ్చింది డాక్టరమ్మ.

చిన్న నాటి కబుర్లతో ఆడవాళ్ళు, విద్యాభ్యాసం కబుర్లతో మగవారు భోజనాలను పూర్తి చేశారు. పిల్లల భోజనాలు ముందే అయిపోయాయి.

“పడగ్గదిలో పక్కలు వేశాను. పడుకోండి” జనాంతికంగా చెప్పింది అన్నపూర్ణ.

“రావోయ్ బావా! పడుకుందాం!” అన్నాడు కృష్ణమాచారి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here