వ్యామోహం-17

0
10

[శ్రీ వరిగొండ కాంతారావు రచించిన ‘వ్యామోహం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[మందులకుంటకి బయల్దేరుతాడు డాక్టర్సాబ్. అతని మనసులో ఎన్నో ఆలోచనలు. తన జరిగినవన్నీ తలచుకుని అంతర్మథనం చేసుకుంటాడు. అయిదో నెల వరకూ భార్యని పుట్టింటిలో ఉండమని చెప్పాలని నిశ్చయించుకుంటాడు. అత్తగారిల్లు చేరాకా, భోజనాలయి కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో భర్తని చూసి, బాగా చిక్కిపోయాడనీ, నీరసంగా ఉన్నాడనీ, అసలు ఉత్సాహంగా లేడని అంటూ ఏడుస్తుంది డాక్టరమ్మ. మంగమ్మ, సత్యమూర్తి కూడా అందోళన చెందుతారు. వారం రోజులు అక్కడుండి మనసుని కుదుటపరుచుకుని జోడెడ్లపాలానికి తిరిగి వస్తాడు. ఓ రోజు పొద్దున్నే తాపీ మేస్త్రీ వచ్చి కొత్తింటి పనులు మొదలుపెట్టడానికి ఇంకా ఐదు రోజులే ఉందని గుర్తు చేస్తాడు. అందర్నీ పురమాయించుకుని, అతన్నే దగ్గరుండి అన్ని పనులు చూసుకోమని, డబ్బులేమయినా కావాలంటే అడగమని అంటాడు డాక్టర్సాబ్. తన భార్యకి ఒంట్లో బాలేదని ఏదయినా మందివ్వమని మేస్త్రీ అడిగితే, తీసుకురాకపోయావా అంటాడు డాక్టర్సాబ్. ఆమె వచ్చి పరిస్థితిలో లేదని తెలిసి మేస్త్రీతో బయల్దేరి వాళ్ళింటికే వెళ్తాడు. రేపు ఉదయం ఇంటి పని పునః ప్రారంభం అవుతుందనగా, కొత్తింటి కాపలా మనిషి సాయిలు పరుగులు తీస్తూ వస్తాడు. ఎవరో ఇల్లంతా కూల్చేసారనీ చెప్పి ఏడుస్తాడు. అక్కడికి వెళ్ళి చూసిన డాక్టర్సాబ్ నిర్ఘాంతపోతాడు. నిస్సత్తువ ఆవరించి కూలబడతాడు. ఈ వార్త తెలిసిన కొందరు జనాలు వచ్చి డాక్టర్సాబ్‍ని ఓదారుస్తారు. మర్నాడు ఉదయం బాల్రెడ్డి పటేల్ ఇంటికి వెళ్ళి ఏకాంతంలో మాట్లాడుతాడు డాక్టర్సాబ్. తనని ఇంత అవమానల పాలు చేయడం ఎందుకు, ఊరు విడిచిపెట్టి వెళ్ళిపొమ్మంటే అయిపోయేది కదా అంటాడు. మొదట తనకేం తెలీదని బుకాయించినా, కొద్ది సేపటి తర్వాత, తన కుటిలత్వాన్ని బహిర్గతం చేస్తాడు బాల్రెడ్డి పటేల్. ‘నువ్వు మారలె. తప్పయింది, ఇక నుంచి మంచిగుంట అని నువ్వు వచ్చి నా కాల్ల మీద పడలేదు కనుక’ ఇదంతా జరిగిందని అంటాడు బాల్రెడ్డి. ఇక చదవండి.]

[dropcap]“నే[/dropcap]ను మారలేదనెట్లనుకున్నవు. నువు కొట్టిన దెబ్బలకు వీరలక్ష్మి మంచమ్మీంచి లేస్తలేదని, విపరీతమైన జ్వరం వచ్చిందని, మందిమ్మని వచ్చింది సమ్మక్క. సమ్మక్క వీరలక్ష్మికి దగ్గరి మనిషి. ఇద్దరి తల్లిగార్లొక్క తావుల్నె,

నేనడిగిన ‘వీరలక్ష్మి తోలిచ్చిందా!’ ‘లే నా ఇచ్చ నేనే వచ్చిన’ అన్నది సమ్మక్క. నువ్వడిగితె కాదు వీరలక్ష్మి తోలిచ్చిన సుత నేను మందిచ్చేడ్ది లేదు. పటేలు స్వయంగ చెప్తే మందిస్త లేకుంటె లేదు. అయ్యోరు పంతులు దగ్గరికి పొమ్మని చెప్పిన. కావాన్నంటే సమ్మక్క అదే శేఖరయ్య పెండ్లాన్ని పిలిపించుకోనడుగున్రి” అదే స్వరంలో జవాబిచ్చాడు డాక్టరు గారు.

“పొమ్మన్నవెట్ల! నీ వృత్తి ధర్మం నిన్ను బాధించలేదా!” వెటకారం నిండుకొస్తుంటే అడిగాడు బాల్రెడ్డి.

“నాకూ వీరలక్ష్మికి అనుబంధం ఏర్పడక పోయుంటే తప్పక వైద్యం చేసి వుండేవాడిని. మీరు వీరలక్ష్మినట్లా గొడ్డును బాదినట్లు బాదడం పశుత్వం కిందికి వస్తుందని మీ ఇంటికొచ్చి మరీ చెప్పేవాడిని.”

“ఇప్పుడేమైంది!”

“ఇప్పుడు నేను మందిస్తే నా అనుబంధం కొనసాగుతున్నట్లుగా నీవు భావించే అవకాశం వుంది. అదొక యాదృచ్ఛిక సంఘటన. ఒకానొక అనుభవం. కొనసాగింపు ఐచ్ఛికమే. మంచో చెడో కాలంతో పాటు కొట్టుకుపోయాము. కాలమే ముగింపు పలికింది. నేను నా ప్రవర్తనను సమర్థించుకోవడం లేదు. అట్లని అసహ్యించుకోవడమూ లేదు. అదొక సత్యం. జరుగకుండా ఉండాల్సింది. జరిగిపోయింది. మరలమరల అలా జరగాలని కూడా అనుకోవడం లేదు” నిర్వేదంగా చెప్పాడు డాక్టరు గారు.

“అంటే – నువ్వు నా ఆడిదాన్నెత్తుకపోతవు. నేనూకుండాలె. అంతేకద నువు చెప్పేది. ఇగొ ఇను డాక్టర్సాబూ – నువ్వు చచ్చిపోద్దనుకున్న నా పెండ్లాన్ని బతికించినవు. నా ఆరోగ్యాన్ని కాపాడినవు. కాబట్కె బతికిపొయినవు. అదె ఇంకోడీ పని జేసుంటె వాని దినవారాలయి కూడ మూడు నెల్లయితుండే కావచ్చు. నువు బతికున్నవు. అంతకే సంతోషపడు. నేన్నిన్నిక్కడ కూచుండబెట్టి ఇంక నీతోని మాట్లాడ్తున్ననంటెనె నా మంచితనాన్ని నువ్వర్థం చేసుకోవాలె” తడి గుడ్డలో నిప్పులు చుట్టి డాక్టరు గారి చేతిలో పెడ్తున్నాడు బాల్రెడ్డి.

డాక్టరు గారు నిరుత్తరుడయ్యాడు. ఖిన్నుడయ్యాడు. ఒక ఐదు నిమిషాల తర్వాత “పటేలా! ఒక్కమాట. నీ కోపానికి నేను పాత్రుడనే. దొంగతనం చేపిచ్చినవు. జుర్మాన కింద ఇరువై తులాల బంగారం, శేరున్నర వెండి జమకట్టుకున్నవు. కట్టుబట్టల్తోని మిగిల్చినవు. నేన్జేసిన పాపానికి శిక్షకు సరిపోయింది. నా బతుకు తెరువును నాకు దక్కించినవు. దవాఖానను ముట్టుకోలె. దానికి నేన్నీకు ఋణపడి వున్న.

కొత్త ఇల్లును నేలమట్టం చేసినవు. ఇండ్ల నీ అసూయ వున్నది. ఈర్ష్య వున్నది. గ్రామస్తులు నా పట్ల చూపించె ప్రేమను తట్టుకోలేక పోతున్నవు. దొంగతనమెనుక, కొత్త ఇంటిని ధ్వంసం చేసుట్ల నీ చెయ్యి ఉన్నదని ఊరోల్లకు తెలువది కాబట్కె వాల్లు నా వెనుక ఉన్నరు. తెలిసిన్నాడు ఊరంత నీ దిక్కె నిలబడ్తది. నువ్వంటె ప్రేమతోని కాదు. భయంతోని. వీరలక్ష్మి కూడ నిన్ను కాదంటే తన అత్తమామలేమైతరో అన్న భయంతోని నీకు లొంగి వచ్చింది కని, నువ్వంటే మనసు పడి కాదు.

దేవుడు నాకు విద్యనిచ్చిండు. ఇంతవరకు నా విద్యను నేను దుర్వినియోగపర్చలే. దేవుడే నాకు దారి చూపుతడు. ఈ ఊరు కాకుంటే ఇంకొక ఊరు. ఏదన్నొకనాడు నువు నా దగ్గరికస్తవు. ప్రేమ నిండిన మనసుతోని వస్తవు. ఆ నమ్మకం నాకున్నది” అంటూ బయల్దేరి ఇంటికొచ్చేశాడు డాక్టరు గారు.

డాక్టరు గారి ఆత్మవిశ్వాసాన్ని చూచిన బాల్రెడ్డి పటేలు కంగుతిన్నాడు. కుర్చీలో అలానే కూర్చుండిపోయాడు.

***

మరునాడుదయం ఎనిమిదిన్నర ప్రాంతంలో నర్సింగరావు కులకర్ణి గారింటి నుండి పిలుపొచ్చింది రమ్మనమని. పూజాదికాలు ముగించుకొని పదిగంటలకల్లా పట్వారి గారింటికి చేరుకొన్నాడు డాక్టరు గారు. సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్ళాడు కులకర్ణి. ఇంటిల్లిపాదీ పరామర్శించారు. జరిగిందానికి తమ విచారాన్ని వెల్లడించారు. తేనీటి సేవనమైనాక “రా డాక్టర్సాబ్” అంటూ తన రాతకోతలకు ప్రత్యేకించి అట్టే పెట్టుకొన్న గదిలోకి డాక్టరు గారిని తీసుకొచ్చారు నర్సింగరావు కులకర్ణి.

ఇరువురూ కుర్చీల్లో కూర్చున్నాక డాక్టరు గారు తలవంచుకొని చెప్పాడు “నేను మీ నమ్మకాన్ని వమ్ము చేశాను. మీ విశ్వాసాన్ని కోల్పోయాను.”

“నీ మీద నాకు కోపం లేదు డాక్టర్సాబ్! నేన్నిన్నర్థం చేసుకోగలుగుత”

“ఇంత పతనం చెందాక కూడానా!” ఆశ్చర్యంతో అడిగాడు డాక్టరు గారు.

“ఇదంత కాలమహిమ డాక్టర్సాబ్. ఒక ఆడిది ఇష్టపూర్తిగ ముందడుగేసినప్పుడు ఎటువంటి మొగోనికైన తప్పిచుకొనుడు సాధ్యం కాదు. మేనక అందాలకు దాసోహమన్న విశ్వామిత్రుడు పదివేలేండ్ల తపః ఫలాన్ని పోడగొట్టుకున్నడు. ఇక్కడ మనమేమర్థం చేసుకోవాలె గదాంటె పదివేలేండ్ల తపస్సు కూడ అప్సరస ఆకర్షణ నుంచి విశ్వామిత్రుణ్ణి రక్షించలే. విశ్వామిత్రునికే దిక్కులేని తావుల డాక్టర్సాబ్ దేం లెక్క చెప్పున్రి” చిరునవ్వుతో చెప్పాడు కులకర్ణి.

“ఇటువంటి వ్యాఖ్యానాన్ని నేనెప్పుడూ వినలేదు” అంతే చిరునవ్వుతో బదులు చెప్పాడు డాక్టరు గారు.

“డాక్టర్సాబ్! పురాణేతిహాసాలు మనకు కథను మాత్రం చెప్తాయి. మన సామర్థ్యాన్ని బట్టి వాటికన్వయాలు పుట్టుకస్తయి. కరణాన్ని గద. ఏ విషయాన్నైన కొత్తకోణంల ఆలోచిస్తనన్నట్టు” వివరించాడు కులకర్ణి.

“అంటే నేను తప్పు చేయలేదని నమ్ముతున్నారా!” అడిగాడు డాక్టరు గారు.

“విశ్వామిత్రుడు తప్పు చేయలేదా! తప్పంత మేనకదేనా! ఏ తప్పు లేకుంటనే విశ్వామిత్రుని పదివేలేండ్ల తపస్సు భ్రష్టమైందా!” ఎదురడిగాడు కులకర్ణి.

“మీరు నన్నయోమయంలో పడేస్తున్నారు.”

“అయోమయమేం లేదు డాక్టర్సాబ్! నేను మొదలే చెప్పిన కద కాలమహిమ. ఆ సమయంల మన బుద్ధి పని చేయదు. ప్రజ్ఞ పనికిరాదు. వివేకమక్కరరాదు. అటెన్క అయ్యో! అనుకుంటం. అప్పటికే జరుగవలసిన నష్టమంత జరిగిపోతది. మీ విషయంల కూడ అదే జరిగింది.”

“అవును” తలదించుకొన్నాడు డాక్టరు గారు. కొద్ది తడవైనాక “వెళ్ళివస్తాను” అంటూ లేచాడు.

“అయ్యొ! అట్ల పోతరేంది. ఇవ్వాళ మీ భోజనం మా ఇంట్లనే.” డాక్టరు గారి చేయి పట్టుకొని నిలువరించాడు కులకర్ణి.

“మళ్ళెప్పుడైన చూద్దాం లెండి” అన్నాడు డాక్టరు.

“మళ్ళెప్పుడైన కూడ రావచ్చు. ఇవ్వాళ మాత్రం తప్పని సరి” తన నిర్ణయాన్ని తెలిపాడు కులకర్ణి.

మళ్ళీ తనే ప్రస్తావించాడు “ఊరు వదలిపెడ్తానన్నారట”.

“అవును. ఇంత ఒత్తిడిలో ఇన్ని గొడవల మధ్య వైద్యం చేయడం సాధ్యం కాదు.”

“బాల్రెడ్డిదేం లెక్క. ఆవేశం మనిషి. నేన్చెప్తె వింటడు. నీకు జరిగిన నష్టమ్మొత్తం లెక్కగట్టిస్తాడు. దగ్గరుండి కొత్తిల్లు పూర్తి జేపిస్తడు. నీకిష్టమేనా!” అడిగాడు కులకర్ణి.

“నా కిష్టమే. ఆనందాన్నిచ్చే విషయమే. అయినా కూడ వద్దు. మీరు చెప్పిన విశ్వామిత్రుని కథలో ఇంకొక అంశం కూడ వున్నది. విశ్వామిత్రుడు మేనకను వదిలిపెట్టాడు. స్థలం మార్చుకొన్నాడు. కొత్తగా తపస్సు కూడ మొదలుపెట్టాడు.”

“శభాష్ డాక్టర్సాబ్! నీ ఆలోచన నాకు నచ్చింది. ఇంతకు కొత్త ప్రాక్టీసెక్కడనుకున్నవు.”

“ఇంకా అనుకోలేదు. మా స్వగ్రామానికి పోదామని.”

“అంటే”

“అశ్వారావుపేటలోనే వుందామనుకొంటున్న.”

“సొంతూర్లె కామధేనువు కూడ వట్టిపోయిన ఆవుకిందికే లెక్క. వద్దు. నేన్చెప్తున్న విను. హనుమకొండల దవాఖాన పెట్టుకో, వృద్దిల కస్తవు.”

“హనుమకొండలో నాకు పెద్దగా పరిచయాలు లేవు.”

“ఇక్కడ ఉండెనా! నేన్దప్ప నీకీ ఊళ్ళె పరిచయస్తుడన్నోడుండెనా! ఇప్పుడో! నీ కొఱకు ప్రాణమిచ్చెటందుకు మనుషులు సిద్ధంగ వున్నరు. నీ వ్యక్తిత్వమటువంటిది.”

“ఇది పల్లెటూరు. అది పట్నం.”

“పల్లెటూరైన పట్నమైన అది మనుషుల సమూహమే. మీరే చెప్తిరి కద మీ దోస్తు కృష్ణమాచారి వరంగల్లుల మస్తు పేరు కమాయించిండని” అన్నాడు కులకర్ణి.

“నిజమేననుకోండి..”

“సంశయాలు వద్దు డాక్టర్సాబ్. నరసింహారావు అని నా పేరే. మా మేనమామ వకీల్సాబు. ఆయన కొడుకు రాజేశ్వర్రావని ఆబ్కారిల పన్జేస్తడు. రాత్రి వచ్చిండు” అంటూ “రాజూ! రాజూ!” అని కేకవేశాడు.

“ఏంది బావా!” అంటూ వచ్చాడు పాతికేళ్ళ యువకుడు.

“దా! కూర్చుండు. ఈనె డాక్టర్సాబ్. అద్భుతమైన హస్తవాసి. ఈ ఊర్లె చానమందికి పోయె ప్రాణాలను నిలబెట్టిండు. చానమందికేంది స్వయంగ నాకు ప్రాణదాత. శాంతమ్మ వాళ్ళింటికి పొయినప్పుడు మస్తు కిందికి మీదికైన. ఈనెనె కాపాడిండు” డాక్టరు గారిని పరిచయం చేశాడు కులకర్ణి.

“నమస్తె డాక్టర్సాబ్!” అంటూ లేచి నిలుచుని ప్రణామం చేశాడు రాజేశ్వరరావు.

“నమస్తే!” అంటూ కరచాలనం కూడా చేశాడు డాక్టరు గారు.

“డాక్టర్సాబ్ పిల్లలిప్పుడిప్పుడే ఎదుగుతున్నరు. పట్నంల స్థిరపడాలని ఆలోచిస్తున్నడు. హనుమకొండైతె బాగుంటదని చెప్పిన. ఈ నెలల్నె మారుద్దామని ఆలోచన. నువ్వు కొద్దిగ ఇంటికి, దవాఖానకు వసతి చూపిస్తివా నా మాట నిలబెట్టినోనివైతవు.”

“అయ్యొ! దాన్దేమున్నది బావ. నీ మాట నేనెన్నడన్న కాదంటనా! డాక్టర్సాబ్! హనుమకొండకు రాన్రి. ఎల్లుండి పొద్దున్న రైలుకు బయల్దేరుతున్న నా వెంబడి వస్తిరా మా ఇంట్లనె ఐదారు దినాలుండి ఏర్పాట్లన్ని చూసుకోవచ్చు. సామాన్ల గురించి, అక్కను, పిల్లలను తీసుకొచ్చుడు గురించి అటెన్క ఆలోచించవచ్చు” గుక్క తిప్పుకోకుండా చెప్పాడు రాజేశ్వరరావు.

“మీకు శ్రమ కలిగిస్తున్నాను. ఐనా మీ ఇంట్లో అన్ని రోజులుండడం..”

“డాక్టర్సాబ్! నువు మాట్లాడకయ్యా! నా ఇంట్లో నీకు స్వతంత్రమున్నదా లేదా!” అడిగాడు పట్వారి నర్సింగరావు కులకర్ణి.

“అయ్యొ ఎంత మాట!”

“నా ఇల్లెంతనొ మా మేనమామ ఇల్లు సుత అంతనే. అవుడుకు మేనమామనె కాని నా కంటె రెండేండ్లె పెద్ద. మా శాంత ఈ రాజు కంటే ఏడాది పెద్దది. మా మేనమామ నేను ఒక్క బల్లెనె చదువుకున్నం. బంధుత్వాన్ని మించిన స్నేహం మాది. ఆ స్వతంత్రంతోనె చెప్తున్న. మొహమాటపడకు. చప్పుడు చెయ్యకు. ఎల్లుండి పొద్దుగాల ప్రయాణానికేర్పాట్లు చూసుకో.” దాదాపుగా ఆజ్ఞాపించాడు నర్సింగరావు కులకర్ణి.

“తాతా! అమ్మమ్మ భోజనాలకు రమ్మంటుంది” వచ్చి చెప్పింది మనుమరాలు.

చాన్నాళ్ళకు సుష్టుగా భోం చేసి త్రేన్చాడు డాక్టరు గారు.

***

వెళ్ళిన రోజు సాయంత్రానికల్లా వకీలు నరసింహారావు గారి కుటుంబ సభ్యుడై పోయాడు డాక్టరు గారు. పదిహేను రోజుల్లో డాక్టరు గారి మకాం హనుమకొండకు మారిపోయింది. లష్కర్ బజార్లో రోడ్డు మీద ఆసుపత్రికి ఒక మడిగ అద్దెకు తీసుకున్నాడు. ఇల్లు కాస్త లోపలికి దొరికింది. రెండూ ఒక్కచోట అంటే కుదరలేదు. “కొత్తగా వచ్చిన డాక్టరు దవాఖాన రోడ్డు మీద ఉండడమే మంచిది. కాస్త ప్రచారమౌతుంది” అని అభిప్రాయపడ్డాడు వకీలు నరసింహారావు.

తాను ఊరి మారిపోతున్నట్లు ఎవరికీ చెప్పలేదు. అయినా ఊరివారంతా అప్పుడొకరు ఇప్పుడొకరు అన్నట్లుగా వచ్చి తాము పొందిన వైద్యానికి కృతజ్ఞతలను తెలుపుకున్నారు. డాక్టరు గారి భవిష్యత్తు బాగుండాలని కోరుకొన్నారు. వారి మాటల్ని బట్టి పటేలు పగబట్టిన విషయం ఊరివారికి తెలిసిపోయిందని బోధపడింది డాక్టరు గారికి.

అమృతా, ఆమె కూతురు కృష్ణవేణి ఏడ్చేశారు. అమ్మనీ పిల్లల్నీ మరీమరీ అడిగినట్లు చెప్పమన్నారు. షావుకారు విశ్వనాథం దంపతులు యథాశక్తి సాయపడ్డారు. డాక్టరు గారు వెళ్ళిపోతున్నందుకు బాధపడ్డారు.

ఆవిడకు సంబంధమున్నా లేకపోయినా డాక్టరుగారు తాను చేసే ప్రతి చిన్న పనిని డాక్టరమ్మకు చెప్పేవాడు. అది అనుమతి తీసుకోవడం కాదు. చెయ్యదలచుకొనిన పనిని చెప్తాడు అంతే. లేదా చేసేశాక చెప్తాడు. ఆవిడ విని ఊరుకునేది. భర్తకు సంబంధించిన విషయాల్లో ఆవిడ కలుగజేసుకునేది కాదు. ఆవిడకు అభ్యంతరకరమైన పనులను చేస్తున్నాననుకున్నప్పుడు మాత్రం ఆ పనిని చేసేసిన కొంతకాలానికి ఇప్పుడు చెప్తే ఆవిడ ఉద్వేగపడదు అని నిర్ణయించుకున్నాక చెప్పేవాడు.

హనుమకొండకు మకాం మార్చడమన్నది డాక్టరు గారి జీవితంలో చాలా పెద్ద నిర్ణయం. వారానికోసారి డాక్టరు గారు మందులకుంటకు వెళ్ళివస్తూనే ఉన్నాడు. అయినా ఈ విషయం తన భార్యాపిల్లలకు గాని, అత్తగారికి, బావమరిదికి గాని తెలియదు. అంతా బాగా నడుస్తున్న జోడెడ్లపాలం వదిలిపెట్టి హనుమకొండకెందుకు రావాలి? ఇష్టపూర్తిగా మనుసు నిండుగా కట్టుకుంటున్న స్వంత ఇంటిని వదిలేసి హనుమకొండకు మకాం మార్చడమెందుకు? అన్న ప్రశ్నలకు డాక్టరు గారి వద్ద ప్రస్తుతానికి సమాధానం లేదు. సమాధానం దొరికేంతవరకు ఆయన ఈ విషయాన్ని మందులకుంటకు చేరవేయలేడు.

హనుమకొండలో ప్రాక్టీసు పెడుతున్న విషయాన్ని డాక్టరు గారు కృష్ణమాచారికి కూడ చెప్పలేదు. స్థిరపడ్డాక వెళ్ళి కలవాలని అనుకున్నాడు. జోడెడ్లపాలాన్ని విడచిపెట్టాల్సి వచ్చిన పరిస్థితులను ఆత్మీయులెవరితోనూ పంచుకొనగలిగిన పరిస్థితిలో లేడాయన. పతనమన్నది కొండపై నుండి దొర్లిపడ్డ రాయి వంటిది. నిన్న కొండపైన ఉన్న రాయి ఈనాడు నేలపైన ఉన్నది. ఇదెలా జరిగింది అన్నదానికి ఎవరి వద్దా సమాధానం లేదు. కారణం తెలిసివున్న కొండ మాట్లాడదు. రాయి కూడ మాట్లాడదు.

వాక్చాతుర్యంతో నలుగురిని మెప్పించడమే కాదు, అందరకూ తలలో నాలుకగా మెసలగలగడమన్నది డాక్టరు గారికి వెన్నతో పెట్టిన విద్య. ఆ కారణంగా రెండు నెలల్లోనే డాక్టరు గారి ప్రాక్టీసు పుంజుకుంది.

వీలు చూసుకుని కృష్ణమాచారింటికి వెళ్ళి ఓ రోజు వాళ్ళింట్లో గడిపి వచ్చాడు కూడా. “భవిష్యత్తులో పిల్లల చదువుకి ఎలాగూ పట్నం రాక తప్పదు కదా! ఆ పనేదో ఇప్పుడే చేస్తే పోలా! అనిపించింది” చెప్పాడు డాక్టరు గారు.

“పోనీలే మంచి నిర్ణయం తీసుకున్నావు” అభినందించాడు కృష్ణమాచారి.

శివరాత్రి వెళ్ళిపోయింది. కాముని పున్నమికి మందులకుంటలోనే వున్నాడు డాక్టరు గారు. “ఈ ఉగాది అందరమూ కలసి మనింట్లోనే జరుపుకుందాం!” ప్రతిపాదించాడు డాక్టరు గారు.

“ఇది మనిల్లు కాదా!” అడిగాడు సత్యమూర్తి.

“అది కాదు బావమరిది. ఇది మీ అక్క పుట్టినిల్లు. పండుగ మెట్టినింట్లో జరుపుకోవాలని నా కోరిక. మాతో పాటుగా నువ్వూ, అత్తయ్య గారు వస్తారన్నమాట” విశదీకరించాడు డాక్టరు గారు.

“ఒంటి పూట బళ్ళు మొదలవుతాయి బావా! జోడెడ్లపాలెం అంటే మూడు రోజుల ఏర్పాటు చూచుకోవాలి. నాకు సెలవు దొరకదు. అమ్మను తీసుకెళ్ళండి. నేనేదో కాలక్షేపం చూసుకుంటాను” అన్నాడు సత్యమూర్తి.

“ఇప్పుడు మన మకాం జోడెడ్లపాలెం కాదు సత్యమూర్తి, హనుమకొండ లష్కర్ బజారు” బాంబు పేల్చాడు డాక్టరు గారు.

“హనుమకొండా? అదేమిటండి. ఎప్పుడు మార్చారు! మాట మాత్రంగానైనా చెప్పలేదు. వారం కింద వచ్చినప్పుడు కూడ ఇంకెంత ఇంకో రెణ్ణెల్లలో గృహప్రవేశమన్నారు. వైశాఖమాసమంటే మా తమ్ముడికి కూడ సెలవులు గనుక నాక్కాస్త సాయంగా ఉంటాడనుకొన్నాను” గుక్కతిప్పుకోకుండా మాట్లాడిన డాక్టరమ్మ ఉద్వేగం కారణంగా ఆగిపోయింది.

మౌనంగా ఉండిపోయాడు డాక్టరు గారు. “అదేంటి బావా! అక్క అంతలా అడుగుతుంటే మాట్లాడవేం” రెణ్ణిమిషాలు చూసి అడిగాడు సత్యమూర్తి.

ఐదు నిమిషాల మౌనం తర్వాత చెప్పాడు డాక్టరు గారు. “రాజకీయ కారణాల వల్ల హఠాత్తుగా ఊరు వదలి పెట్టాల్సి వచ్చింది.”

“మీకు రాజకీయాలకి సంబంధం ఏంటి బావా! నీ ప్రాక్టీసు ఉచ్చస్థాయిలో ఉండింది. పైగా ఆ ఊళ్ళో అందరికీ నీవంటే అపారమైన గౌరవముంది. ఒక్కసారిగా ఇంత మార్పా! ఎలా సాధ్యం!” అయోమయంలో పడిపోయి అడిగాడు సత్యమూర్తి.

“బాల్రెడ్డి అన్న రాజిరెడ్డి సర్పంచు. డెబ్భైఏండ్లకు పైబడిన వయసు. గ్రామ పాలనకు ఆయనకు సంబంధం లేదు. పోలీసు పటేలు బాల్రెడ్డి చక్రం తిప్పుతాడు” చెప్పాడు డాక్టరు గారు.

“అది గ్రామస్తులకు సంబంధించిన విషయం. నీకెందుకు?”

“నేను కూడ ఇల్లు కట్టుకుంటున్నాను కదా! గ్రామస్థుడి కిందనే లెక్క”

“ఊళ్ళో ఎవరికీ లేని బాధ నీకెందుకు?” అడిగాడు సత్యమూర్తి.

“ఎవరికీ బాధలేదని కాదు. ఎవరూ వెళ్ళబుచ్చరు. నేను వెళ్ళబుచ్చాను.”

“ఏమని?”

“వచ్చే సంవత్సరం ఎన్నికలున్నాయి. వెంకట్రామయ్య అని విశ్రాంతోపాధ్యాయుడు. గ్రామం పట్ల ప్రేమ వున్నవాడు. పాలనపట్ల అవగాహన ఉన్నవాడు. గ్రామాభివృద్ధికి పాటుపడడానికి సిద్ధంగా ఉన్నవాడు. నలుగురినీ తనతో పాటు కలుపుకుపోగలిగినవాడు. అతనిని ప్రోత్సహించడమే నేను చేసిన నేరం.”

“అది నేరమెందుకవుతుంది. అయినా ఎన్నికల్లో గెలిచినప్పుడు కదా వెంకట్రామయ్య సర్పంచయ్యేది!”

“అది నిజమే కాని వెంకట్రామయ్యలో ఎన్నికల్లో నిలబడాలా వద్దా అన్న ఊగిసలాట వుండింది. ఆ ఊగిసలాటను పోగొట్టింది నేను. చాపకింద నీరులా ప్రచారం కూడ జరిగిపోయింది. ఇప్పుడు సర్పంచిగా వెంకట్రామయ్య గెలుపును ఏ శక్తీ ఆపలేదు.”

“బాల్రెడ్డంటే నీకెందుకంత కోపం” అడిగాడు సత్యమూర్తి.

“నాకతడంటే కోపమేమీ లేదు. నిజానికి ఇల్లు కట్టుకొందుకతడు సాయం కూడా చేశాడు, చేస్తున్నాడు. కాని గ్రామం దృష్టితో చూసినప్పుడు పోలీసు పటేలు, సర్పంచు రెండు అధికారాలు ఒకరి చేతిలోనే కేంద్రీకృతమై వుండడం తప్పు. అధికార దుర్వినియోగం జరుగుతున్న దాఖలాలున్నాయి. నేనతని మీద అభియోగాలు మోపలేదు. అతనికి వ్యతిరేకంగా ఎక్కడా దరఖాస్తులు కూడ ఇవ్వలేదు. ఐదేండ్లకొకసారి సర్పంచును మార్చుకొనగలిగే అధికారాన్ని ప్రభుత్వమే మనకు ప్రసాదిస్తున్నది. కనుక ఆ అవకాశాన్ని వినియోగించుకొమ్మని గ్రామస్తులకు సలహానిస్తున్నాను”.

“కేవలం ఈ కారణంగా నీవు గ్రామాన్ని వదిలిపెట్టాల్సి వచ్చిందా!” అనుమానంగా అడిగాడు సత్యమూర్తి.

“అవును ఈ కారణంగానే. చేతిలో వున్న అధికారాన్ని పోగొట్టుకోవడం ఎవరికైనా కష్టంగానే వుంటుంది. రాజిరెడ్డి ఓడిపోవడమన్నది కాదక్కడ సమస్య. పోలీసు పటేలుకు గ్రామమ్మీద పట్టు తగ్గిపోతుందేమోనన్నది అసలు భయం.”

“ఏదేమైనా గ్రామం బాగుపడుతుందో లేదో గాని, మనమైతే తీవ్రంగా నష్టపోయాం బావా!” తీర్మానించాడు సత్యమూర్తి.

“సంబంధం లేని విషయాల్లో తలదూర్చి లేని చిక్కులు తెచ్చిపెట్టుకోవడం మీ బావగారికేమి కొత్త విషయం కాదులేరా!” తమ్ముడితో చెప్తూ కోపాన్ని వెళ్ళగక్కింది డాక్టరమ్మ.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here