వ్యామోహం-24

1
11

[శ్రీ వరిగొండ కాంతారావు రచించిన ‘వ్యామోహం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[డాక్టర్సాబ్ వాళ్ళు ఊరొదిలిపెట్టి వెళ్ళిపోయే ముందు ఓ రోజు వీరలక్ష్మి డాక్టర్సాబ్ ఇంటికి వెళ్తుంది. డాక్టరమ్మ లోపల తన పనిలో తానుంటుంది, వీధి తలుపు తీసే వుంటుంది. గుమ్మంలో ఆడుకుంటున్న పిల్లల్ని పలకరించిలో నేరుగా లోపలికి వచ్చేస్తుంది వీరలక్ష్మి. డాక్టరమ్మని చూసి నమస్కరిస్తుంది. ఎందుకొచ్చావని కోపంగా అడుగుతుంది డాక్టరమ్మ. ఒక్కసారి చూసిపోదామనని వచ్చానంటుంది వీరలక్ష్మి. కాసేపు కోపగించుకున్నా, తరువాత మామూలై, వీరలక్ష్మికి భోజనం పెట్టి పంపిస్తుంది డాక్టరమ్మ. పదిహేనేళ్ళు గడిచిపోతాయి. డాక్టర్సాబ్ దిల్‍సుఖ్‌నగర్‍లో పెద్ద ఇల్లు కట్టుకుంటారు. రాము ఎం.బి.బి.యస్. చేసి, ఆపై యం.డి. కూడా పూర్తి చేశాడు. ఫైనల్ రిజల్ట్స్ రావల్సి ఉంది. ఆ రాత్రి పన్నెండున్నర వరకు ఏదో కేసు గురించి చదువుకుని ఒంటి గంట ప్రాంతంలో పడుకున్న డాక్టర్సాబ్ మరి లేవలేదు. తండోపతండాలుగా వస్తున్న డాక్టరు గారి పేషెంట్ల దర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఇంటి ముందర వాకిట్లో షామియానా వేసి ఎత్తుబల్ల మీద ఉంచుతారు. డాక్టరమ్మ దుఃఖానికి అంతులేదు. చాలామంది వచ్చి డాక్టర్సాబ్‍ని చివరి చూపు చూసుకుని, డాక్టరమ్మకి నమస్కరించి వెళ్తుంటారు. అంతలో అక్కడికి బాల్రెడ్డి పటేల్ వస్తాడు. అక్కడ ఉన్న పూవులను డాక్టరు గారి పాదాల మీద ఉంచి నమస్కరించాడు. డాక్టరమ్మ దగ్గరకు వచ్చి పలకరిస్తాడు. తనని గుర్తుపట్టారా అని అడుగుతాడు. కొన్ని క్షణాల తరువాత ఆమె గుర్తుపడుతుంది. రామూ ఎక్కడ అని ఆయన అడిగితే, దూరంగా పనిలో నిమగ్నమై ఉన్న రామూని చూపిస్తుంది. వనజమ్మ వాళ్ళంతా ఎలా ఉన్నారని అడుగుతుంది. ఆమెను ఓదార్చుతాడు బాల్రెడ్డి. అంత్యక్రియలు పూర్తయ్యాకా, జోడెడ్లపాలానికి బయల్దేరుతాడు. పదిహేను రోజుల తరువాత వాళ్ళింటికి ఓదేలు వస్తాడు. డాక్టరమ్మని పలకరించి తానెవరో గుర్తుచేస్తాడు. పటేల్ సాబ్ రామూని జోడెడ్లపాలానికి తీసుకురమ్మన్నారని, అందుకే వచ్చానని చెప్తాడు. మాటల మధ్యలో – వీరలక్ష్మి మూడ్నెల్ల క్రిందట చనిపోయిందని చెప్తాడు. కాసేపు చర్చలయ్యాక, రామూతో పాటు సత్యమూర్తి కూడా వెళ్ళటానికి తేదీ నిశ్చయమౌతుంది. అందరి దగ్గరా సెలవు తీసుకొని వెళ్ళిపోతాడు ఓదేలు. ఇక చదవండి.]

[dropcap]ఉ[/dropcap]దయం పదిగంటలకు జోడెడ్లపాలెంలో రైలు దిగారు రాము, సత్యమూర్తి. స్టేషన్లో ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు అంతా కలిపి పట్టుమని పాతిక మంది కూడ లేరు. ప్లాట్‌ఫారమ్మీద బాల్రెడ్డి, ఓదేలు వున్నారు. దగ్గరగా వచ్చి పలుకరించాడు బాల్రెడ్డి. “బాగున్నవా రామూ! గుర్తుపట్టినవా!”

“ఆఁ గుర్తుపట్టిన మామా!” అన్నాడు రాము.

“అబ్బ బాగనె గుర్తుపట్టినవు” సంతోషపడ్డాడు బాల్రెడ్డి.

“మీరు డాక్టర్సాబ్ బావమరిది కదా! పేరు యాదస్తలేదు..” నమస్కరిస్తూ అడిగాడు బాల్రెడ్డి.

“అవును, సత్యమూర్తి.”

“మీరు సారు కదా! మందులకుంటల్నె చేస్తున్రా.” గుర్తు చేసుకుంటూ అడిగాడు బాల్రెడ్డి.

“మంచిగనె యాదున్నది మీకు. ఇప్పుడు నల్గొండల డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్‍గ పనిచేస్తున్న” చెప్పాడు సత్యమూర్తి.

“రండ్రి పోదాం” అంటూ స్టేషన్ బయటకు దారి తీశాడు బాల్రెడ్డి.

బయట జీపు వున్నది. స్టీరింగు మీద ఓదేలు వున్నాడు. వెనుక సీట్లో రాముని, సత్యమూర్తిని కూర్చోబెట్టి తను డ్రైవరు పక్కన కూర్చున్నాడు బాల్రెడ్డి.

జీపు నేరుగా వెళ్ళి పట్వారిగారింటి ముందర ఆగింది. అందరూ దిగారు. గుమ్మంలోనే సాదరంగా ఆహ్వానించారు పట్వారి నర్సింగరావు కులకర్ణి.

“రామూ బాగున్నవా! ఎంత పెద్దోనివైనవయా! నన్ను గుర్తుపట్టినవా!” ఆప్యాయంగా పలుకరించాడు నర్సింగరావు కులకర్ణి. “నర్సింగరావు మామ!” సమాధానం చెప్తూ పాదాభివందనం చేశాడు రాము. రామూను లేవనెత్తి కౌగలించుకున్నాడు కులకర్ణి. “మీరు రాము మేనమమ కదా! పేరు..”

“సత్యమూర్తి”

“ఆఁ ఆఁ సత్యమూర్తి. అప్పట్ల మీకింక పెండ్లి కాకుండె.”

“అవునండి తరువాత జరిగింది. ఇద్దరు పిల్లలు. పెద్దవాడయిదవ తరగతి, చిన్నవాడు రెండవ తరగతి” సమాధానం చెప్పాడు సత్యమూర్తి.

సత్యమూర్తి, రామూలకు తన కుటుంబ సభ్యులందర్నీ పేరు పేరునా పరిచయం చేశాడు నర్సింగరావు కులకర్ణి.

“పట్వారి సాబ్! నేను సాయంత్రం వస్త. రామూ, సత్యమూర్తి సాబ్ మీరిక్కడనె భోజనం చేసి విశ్రాంతి తీసుకోండ్రి” సెలవు తీసుకున్నాడు బాల్రెడ్డి.

“ఏదో పని అన్నాడు బాల్రెడ్డి పటేల్” ప్రస్తావించాడు సత్యమూర్తి.

“అది ఆయన చెప్తానె బాగ. మన పని మనకు మస్తుగున్నది కద! ఏమంటవు రామూ!” చనువుగా అడిగారు కులకర్ణి. రాము చిరునవ్వే సమాధానమయింది.

భోజనాలయినయి. కొసరి కొసరి వడ్డించారు. భుక్తాయాసం, దానికి తోడు తెల్లారగట్ల మూడింటికే లేచారేమో నిద్రముంచుకొచ్చింది ఇద్దరికీ. ఏర్పాటుచేసిన పడకల మీద కొరగంగానే గాఢ నిద్రలో కూరుకుపోయారు.

మూడు మూడున్నరకు మెలకువ వచ్చింది. మొహాలు కడుక్కుని తయారయేప్పటికి పకోడీలు సిద్ధంగా వున్నాయి.

“అయ్యొ! ఇంతకు ముందే కద అన్నం తిన్నాం” అన్నాడు రాము.

“ఇంతకు ముందెక్కడయ్యా! మూడుగంటలయితుంది అన్నం తిని” చెప్పాడు కులకర్ణి. పకోడీలు తినడం కాగానే టీలు వచ్చినయి. “యాభై ఎనిమిదేండ్లంటే చిన్న వయస్సె. నేను డెబ్బయికొచ్చిన చూడు ఎంత గట్టిగున్ననో. డాక్టర్సాబు పోవుడు తీరనిలోటె.” అన్నాడు కులకర్ణి.

“వీల్లమ్మ కూడ మనుషులనెంత మంచిగ కలుపుకపోతది. అటువంటి మనిషికెంత కష్టమొచ్చింది” బాధపడింది లక్ష్మింబాయమ్మ.

“ఒక జబ్బులేదు. జ్వరం లేదు. దగ్గు లేదు. రాత్రి ఒంటిగంటవరకు తెలివితోనె వున్నడు. ఎప్పుడు పండుకున్నడో తెలువది. మల్లలేవనైతె లేవలే” చెప్పాడు రాము.

“నువు కూడ డాక్టరు చదివినవన్నరు. ఏం కారణమై వుంటది” అడిగాడు కులకర్ణి.

“హార్ట్ ఎటాక్ కావాలె. అంతకు మించి కారణాలు కనపడ్తలేవు. ఇదివరకు వచ్చింది లేదు. అయిన ఆయనలో ఆ లక్షణాలు కూడ నాకు కనపడలేదు” జవాబిచ్చాడు రాము.

“మా బావ వంటి మనుషులు చాలా అరుదుగా పుడ్తారు” చెప్పాడు సత్యమూర్తి.

“వీల్లు లేచిన్రా పట్వారి సాబ్!” అంటూ వచ్చాడు బాల్రెడ్డి పటేలు.

“ఆఁ లేచిన్రు. మీ అక్క పకోడీలు చేసింది తిను. మీ తమ్మునికిన్ని పంపియ్యవమ్మ!” లోపలికి కేకేశాడు నర్సింగరావు గారు.

పది నిమిషాల తరువాత అందరూ కలసి పటేలింటికి వెళ్ళారు. మిద్దె మీద పెద్ద బల్ల చుట్టూరా కూర్చున్నారు.

“మీ నాయిన ఇక్కడ కూర్చుండే మా వ్యాధి లక్షణాలు రాసుకున్నడు. వైద్యం ఇక్కడనె మొదలైంది. ఆయన వైద్యం గొప్పతనమేందొ తెలువదిగని ఇప్పటి వరకు మేం ఒక గోలేసుకున్నది లేదు. సూదిమందు తీసుకున్నది లేదు” చెప్పాడు బాల్రెడ్డి.

“వీళ్ళ నాయిన ఆనాడు నా బిడ్డ ఇంటికి రాకపోయుంటే ఆ రోజే పైకిపోతుంటి. డాక్టర్సాబ్ మామూలు మనిషికాదు” తన అనుభవాన్ని గురించి చెప్పాడు పట్వారి సాబ్.

తన తండ్రిని గురించిన గొప్ప విషయాలు వింటున్న రాము ఛాతి గర్వంగా ఉప్పొంగింది. ఆనందంగా మేనమామ వైపు చూశాడు. సత్యమూర్తి కూడ దాదాపు అదే పరిస్థితిలో వున్నాడు.

“ఇక విషయానికి వద్దాం” అంటూ సూటిగా చెప్పసాగాడు బాల్రెడ్డి పటేల్. “నాకు మీ నాయనకు ఒక ఆడ మనిషి విషయంల జగడమైంది.”

“చిన్నమ్మ విషయమే కదా!” అడిగాడు రాము.

“నీకు తెలుసా!” ఆశ్చర్యపోతూ అడిగాడు పటేలు.

“ఓదేలు వచ్చివెళ్ళాక అమ్మ చెప్పింది. అట్లకాక కూడ వీరలక్ష్మి చిన్నమ్మ బాగ అలువాటు. చిన్నప్పుడు జింకతోని ఆడుకునేటందుకు వాల్లింటికి ఊకె పోతుంటి గాద. అది జ్ఞాపకమున్నది” చెప్పాడు రాము.

“ఆమె విషయమై బాగ ఘర్షణ పడ్డం. నా కారణంగనె మీ నాయిన ఈ ఊరు వదిలిపెట్టిండు. మీ నాయిన మీది ప్రేమతోని వీరలక్ష్మి కూడ వరంగల్‍కు ఎల్లొచ్చింది.

ఊరు వదిలి పొయ్యెట్నాడు మీ నాయిన ఒక మాటన్నడు. నాకిప్పటికి యాదున్నది. ‘ఏదన్నొకనాడు నువు, నా దగ్గరికస్తవు. ప్రేమ నిండిన మనసుతోనస్తవు. ఆ నమ్మకం నాకున్నది’.

నేను హైదరాబాదుకు అట్లనే వచ్చిన. మీ నాయన మీద గౌరవంతోనె వచ్చిన. నేను వచ్చెవరకు ఆయన ఆగలేకపోయిండు. ఒక్కరోజు ముందు వచ్చుంటే ఆయన మాటను ఆయనకే యాజ్జెసుందును.” దుఃఖభారంతో మాట్లాడలేకపోయాడు బాల్రెడ్డి. రెండు నిమిషాల తరువాత తనను తాను సంబాళించుకొని చెప్పాడు.

“మీ నాయనను బికారిని చెయ్యాన్నని నా ఆలోచన. ఆయన ఆత్మవిశ్వాసం చాన గొప్పది. ‘దేవుడు నాకు విద్యనిచ్చిండు. ఇంత వరకు నా విద్యను నేను దుర్వినియోగపర్చలే. దేవుడే నాకు దారి చూపుతడు. ఈ ఊరు కాకుంటే ఇంకొక ఊరు’ అన్నడు. అన్నట్లుగనె బ్రతికిండు. ఎదిగిండు కూడ.”

“నాన్నకు తన పని మాత్రమే తనకు గుర్తుండేది. ఎవరన్నా మెచ్చుకుంటే సంతోషపడేవాడు. విమర్శిస్తే బాధపడేవాడు. ఆ రెండు కూడ క్షణకాలమ్మాత్రమే. ఆ క్షణం గడచిపోయిందంటే ఆయనేంటో, ఆయన పనేంటో అంతే. ఆయన కోపం కూడ అంతే. ముక్కంటికి కూడ అంత కోపం వుండదేమొ. ఒక గంట పోయాక చెబితే ‘నాకా కోపమొచ్చిందా!’ అనడిగేవాడు” తన అనుభవాన్ని చెప్పాడు రాము.

“వీరలక్ష్మి విషయంల నా నడతను చక్కదిద్దింది కూడ మీ నాయిననె. ఉత్తరం రాసిండు నాకు. విషయమింక స్పష్టంగ గుర్తున్నది.

‘నేను వీరలక్ష్మి చేసింది తప్పే. అది మీపట్ల ద్రోహమే. మా తప్పును మేం సరిదిద్దుకున్నం. మీరు ఆ విషయాన్ని అంగీకరించలేకున్నారు. వీరలక్ష్మి నన్ను మరచిపోతే గాని ఆమె మీ దారికి రాదని భావిస్తున్నారు. అది నిజమే. కాని నన్ను కొడితేనో, భయపెడితేనో లేదా చంపేస్తేనో వీరలక్ష్మి భయపడి మీ దారికొస్తుందని భావిస్తున్నారు. అది తప్పు. నేను శాశ్వతంగా హైదరాబాదుకి వెళుతున్నాను. మీకెవరికీ ఇంకెన్నడూ కలువను.

వీరలక్ష్మిని అనునయించి మీ దారికి తెచ్చుకోండి. ఆమెను క్షమించండి. అహల్యకు శాపం పెట్టిన గౌతముడు, ఆమె శాపవిముక్తి కాగానే వచ్చి కాపురానికి తీసుకెళ్ళిపోయాడు. పాత విషయాలను మనసులో పెట్టుకొని ఆమెను వేధించలేదు.’

నేను డాక్టర్సాబ్ మాటను అక్షరాల పాటించిన. వీరలక్ష్మితోని సుఖపడ్డ. జోడెడ్లపాలెంకు రమ్మన్న, రానన్నది. ‘వస్తె నా యిజ్ఞతె కాదు నీ యిజ్ఞతు కూడ పోతద’న్నది. ఆలోచించిన. నిజమే అనిపించింది. కరీమాబాదల్నె వాల్ల తమ్మునింటి దగ్గర జాగదీసుకోని ఇల్లు కట్టించిన.

గమ్మతేందంటే మేమిద్దరం నాలుగ్గంటలు కలిసుంటే గంట సేపన్న డాక్టర్సాబ్ గురించి మాట్లాడుకుంటం. ఆయనంటే కోపం పోయింది. ఆయన కారణంగనె వీరలక్ష్మి నాకు దూరమైందన్న భావన కూడ పోయింది.

మూన్నెల్ల కింద వీరలక్ష్మి చనిపోయింది. నాలుగైదు నెలలు తీవ్రమైన కడుపునొప్పితోని బాధపడ్డది. చాన మందులు వాడినం. ప్రయోజనం లేకుండె. డాక్టర్సాబ్ దగ్గరకు పోదామన్న, వద్దన్నది. నా ఒడిల్నే తలపెట్టుకోని సచ్చిపోయింది. ‘మల్ల జన్మల నీతోనె తాలి కట్టించుకుంట, నీ పెండ్లాంగ బతుకుత’ అనుకుంటనుకుంటనే శ్వాసవిడిచింది” నిట్టూర్పు విడుస్తూ ఆగిపోయాడు బాల్రెడ్డి. బాల్రెడ్డి భుజమ్మీద చేయివేసి అనునయించాడు కులకర్ణి.

కొద్ది తడవైనాక చెప్పడం కొనసాగించాడు బాల్రెడ్డి.

‘నేనెక్కువ కాలం బత్క నా కోర్కెలు తీరుస్తవా!’ అనడిగింది. నేన్చెప్పుమన్న చెప్పింది. అవి అమల్దేసెటందుకె నేను మీ నాయన దగ్గరికొచ్చిన. అప్పటికె ఆలస్యమైంది.”

ఈలోగా పనివానితో చాయలు, చేగోడీలు, సకినాలు, జంతికలు పట్టిచ్చుకొచ్చింది వనజమ్మ పైకి.

“బాగున్నవా అత్తమ్మా!” అంటూ లేచి నిల్చున్నాడు రాము.

“రామూనా! బాగున్నవా! అబ్బో గుర్తుపట్టరాకుంటైనవు కద. అమ్మగిట్ల బాగున్నదా! నాయిన జరిగిపోయిండట. అమ్మకు రారాని కష్టమచ్చింది” అన్నది వనజమ్మ.

రామూ తలవంచుకు నిలబడ్డాడు.

“కూచుండు రాము! మన చేతిల ఏమున్నది. ఎప్పటికైన అందరం బోవల్సినోల్లమె. ఎన్కముందు” అంటూ ఓదార్చింది. “తినున్రి. తిని చాయల్దాగినంక ముచ్చట పెట్టుకోన్రి” అంటూ కిందకు వెళ్ళిపోయింది వనజమ్మ.

“ఇంతకూ వీరలక్ష్మి కోరికలేమిటో!” అడిగాడు సత్యమూర్తి.

“చెప్త, మొదలైతే సకినాలు తిందాం గాదా!” అన్నాడు బాల్రెడ్డి.

డాక్టరు గారి సాంగత్యాన్ని జ్ఞాపకం చేసికొంటూ తేనీటి సేవనం పూర్తి చేశారు బాల్రెడ్డి నర్సింగరావులు.

తన తండ్రిని పరమశత్రువుగా భావించి, చంపడానికి పథకం వేసిన మనిషి హృదయంలో ఆయన పట్ల ఇంతటి గౌరవభావమా! ఇంతటి ఉన్నతస్థానమా! రామూకి నమ్మశక్యంగా లేదు. బాల్రెడ్డి నడవడిలో ఇసుమంతైనా కాపట్యం కనబడడం లేదు. అతడు మాటాడే ప్రతి మాట అతని హృదంతరాళాల్లోంచి వస్తున్నట్లే తోస్తున్నది. రామూకి అంతా గందరగోళంగాను అయోమయంగానూ ఉన్నది.

‘మీ నాన్నొక మహాసముద్రం. సముద్రం శాంతికి ప్రతీక. సముద్రం పరిచయంలో కొచ్చిన మనిషి అనివార్యంగా సముద్ర ప్రభావానికి లోనౌతాడు. సముద్రం చేత మనిషి ప్రభావితుడు కాకుండా ఉండడమన్నది దాదాపుగా అసాధ్యం’ అన్న అమ్మమాటలు గుర్తుకొచ్చాక మనసులోని గందరగోళం తొలగిపోయి ప్రశాంతచిత్తుడైనాడు రాము.

“ఇక వీరలక్ష్మి చివరి కోరిక చెప్త వినుండ్రి.” బాల్రెడ్డి గొంతు విని ఈ లోకంలో కొచ్చాడు రాము.

“కరీమాబాదల ఉన్న ఇల్లు తన మేనకోడలుకు రాసిమ్మన్నది. రాసిచ్చినం. రిజిస్ట్రేషను కూడ అయింది. ఇక్కడ జోడెడ్లపాలెంల తన అత్తమామల నుండి సంక్రమించిన ఎకురం పొలాన్ని, ఇంటిని, తన పేరు మీద నేను పట్టా చేయించిచ్చిన రెండెకురాల తరిని రాము పేరు మీద అంటె నీ పేరు మీద రాయించుమన్నది. గ్రామపంచాయితిలో, రెవిన్యూశాఖలో నీ పేరు మీద మ్యూటేషన్ చేయించినం. దీంట్లో నర్సింగరావు సాబ్ పాత్ర పెద్దది. ఆవులు, బర్రెలు నన్నుంచుకొమ్మన్నది. వీరలక్ష్మి, వరంగల్లుకు పోయిన్నాడె అవన్ని నాదొడ్లెకొచ్చినయనుకో అది వేరు సంగతి” నవ్వుతూ ముగించాడు బాల్రెడ్డి పటేలు.

“ఇప్పుడు మాకిచ్చిన చాయలోని పాలు ఆ బర్రెలవేనా!” నవ్వుతూ అడిగాడు సత్యమూర్తి.

“అంతే అనుకోన్రి. ఆ బర్రెల మనుమరాండ్ల పాలన్నట్టు” అంతే స్ఫూర్తితో చెప్పాడు బాల్రెడ్డి. మిద్దె నవ్వులతో నిండిపోయింది.

“రామూ! ఇగొ ఇవి కాయితాలు. మీ కొత్తిల్లు పునాదుల వరకే ఉన్నది. చుట్టూరంగ నేనె ప్రహరి కట్టించిన. అది నాయన పేరు మీద ఉన్నది. ఆ కాయితాలు నాయిన దగ్గర్నె ఉండాలె. లేకున్న పరవలేదు. గ్రామపంచాయితీల డాక్టర్సాబ్ పేరె వున్నది. ఈ కాయితాలు మీ కప్ప చెప్పెటందుకే మిమ్ముల రమ్మన్న” ముగించాడు పటేలు.

“ఇన్నేండ్ల తరువాత ఈ ఇల్లు, పొలం మేమేం చేసుకుంటం చెప్పున్రి. మీరే ఉంచుకోన్రి. వీటిపట్ల నాకేమీ ఆసక్తి లేదు” చెప్పాడు రాము.

“వీటిని నేనుంచుకొనుడు వీరలక్ష్మి పట్ల ద్రోహమైతది. మీరు వద్దనుకుంటే అమ్మించి పెడ్తా. ఏ విషయమైన ఈ కాయితాలన్ని కొంటవోయి అమ్మకు చూపెట్టున్రి. అమ్మతోని ఆలోచించి నిర్ణయం తీసుకోన్రి. తొందరపాటు వద్దు” నచ్చచెప్పాడు బాల్రెడ్డి.

“రాత్రి ఎనిమిదింటికి రైలున్నదట గద. చీకటి పడ్తుంది బయల్దేరాలె” అంటూ లేచాడు రాము.

“రామూ! మీ ప్రయాణం రేపే. రేపు పొద్దుగాల్నె లేచి పొలం చూసిరావాలె. అట్లనే మీ తండ్రిగారు నిర్మించ తలపెట్టిన ఇంటి పునాదులు, వీరలక్ష్మి ఇల్లు చూడాలె. ఆ తర్వాతనే మీ ప్రయాణం. రేపు మధ్యాహ్నం భోజనం చేసినంక రెండు గంటల ప్యాసెంజరెక్కుతె రాత్రి ఎనిమిది తొమ్మిది వరకు సికింద్రాబాదులుంటరు” చెప్పాడు నర్సింగరావు కులకర్ణి.

మామయ్య వంక చూశాడు రాము.

‘మీ మామది నడువది. ఉండవలసిందే. ఏమంటరు సత్యమూర్తి సాబ్!” అన్నాడు నర్సింగరావు.

సత్యమూర్తి ఏమనగలడు. ఆ రాత్రి భోజనాలు, నిద్ర కులకర్ణి గారింట్లోనే. పదిహేనేళ్ళ క్రితం గుడ్డిదీపాల వెలుగులో తిని పడుకునేవారు. ఇప్పుడు కరెంటు దీపాల వెలుగులో భోంచేసి ఫ్యాను గాలికి నిద్రపోయారు.

(ముగింపు వచ్చే వారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here