వ్యామోహం-3

0
12

[శ్రీ వరిగొండ కాంతారావు రచించిన ‘వ్యామోహం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[జనార్దన మూర్తి కథ చెప్పడం మొదలుపెడతాడు. ఆ కథలో ఓ ఊర్లో ఈశ్వరమ్మ, లక్ష్మయ్య భార్యాభర్తలు. తమ కోడలు వీరలక్ష్మి పద్ధతి తనకి నచ్చడం లేదని భర్తకి చెబుతుంది ఈశ్వరమ్మ. భార్యని దగ్గరకు పిలిచి – వీరలక్ష్మి ప్రవర్తన అలా ఎందుకు ఉందో చెప్పి, అర్థం చేసుకోమని చెప్తాడు. సొంత మేనకోడలే అయిన వీరలక్ష్మిని తప్పుబట్టవద్దని అంటాడు. భర్త చనిపోయిన చాలా ఏళ్ళ వరకూ నిగ్రహంగానే ఉందనీ, కానీ చివరికి బాల్రెడ్డి పటేల్‍‍కి లొంగిపోయిందని చెప్పి, బాల్రెడ్డి వీరలక్ష్మిని హీనంగా చూడడం లేదనీ, అన్ని సౌకర్యాలు కల్పించాడనీ, అంతేకాక, ఆమె మీద కన్నున్న అందరినీ దూరం పెట్టాడనీ అంటాడు. కాలక్రమంలో పదేళ్ళు గడుస్తాయి. ఈశ్వరమ్మ, లక్ష్మయ్యలు కాలం చేస్తారు. వీరలక్ష్మికి తన ఇంటికి దగ్గరలో ఉండే సమ్మకతో స్నేహం ఏర్పడుతుంది. వాళ్ళిద్దరూ అక్కాచెళ్ళెళ్ళ వలె ఉంటారు. కొంతకాలానికి వీరలక్ష్మి తల్లిదండ్రులు కూడా చనిపోతారు. తమ్ముడు మరదలు వీరలక్ష్మిని బాగానే చూసుకుంటారు. వీరలక్ష్మికి అనారోగ్యం చేస్తుంది. అయ్యోరు పంతులిస్తున్న మందులు పనిచేయవు. సమ్మక్క బలవంతం చేసి ఊరికి కొత్తగా వచ్చిన డాక్టర్ గారి దగ్గరకు తీసుకువెళ్తుంది. దారిలో ఆ డాక్టరు గారి గురించి, ఆయనిచ్చే మందుల గురించి చెప్పి వీరలక్ష్మికి ధైర్యం చెబుతుంది సమ్మక్క. డాక్టరు గారు వీరలక్ష్మిని పరీక్షిస్తారు. జబ్బులు లక్షణాలను అడిగి తెలుసుకుంటారు. ఒక ఇంజక్షన్ చేస్తారు. మందులిస్తారు. ఆ మందుల్ని ఎలా వాడాలో చెప్పి మళ్ళీ శుక్రవారం రమ్మంటారు. శుక్రవారం నాడు మళ్ళీ డాక్టరు దగ్గరకు వెళ్తారు వీరలక్ష్మి, సమ్మక్కలు. ఎలా ఉంది అని అడిగితే, తగ్గిందని చెప్తుంది వీరలక్ష్మి. ఆమెను పరీక్షిస్తారు డాక్టర్. ఇక మందులవసరం లేదు, వెళ్ళమంటారు. కానీ వాళ్ళిద్దరూ కదలరు. అక్కకి పూర్తిగా నయమవలేదని చెప్తుంది సమ్మక్క. వైద్యుల వద్ద సిగ్గు పడకూడదని అన్ని సమస్యలు స్పష్టంగా చెప్పాలని అంటారు డాక్టర్. ఆయన గట్టిగా అడిగిన మీదట – అక్కకి తెల్లబట్ట అవుతుందోని సమ్మక్క చెబుతుంది. తెల్లబట్టవ్వడం సాధారణమే అంటాడాయన. నెలలో ప్రతీ రోజూ అవడం ఆరోగ్యమేనా అని వెటకారంగా అంటుంది సమ్మక్క. ఆయనకి కోపం వచ్చినా సర్దుకుని వివరాలు చెప్పమంటారు. వీరలక్ష్మిని ఒక్కో ప్రశ్న అడుగుతూ, జవాబు తెలుసుకుంటూ రోగం తీవ్రతని అంచనా వేస్తారు. ఆయనకి ఓ అవగాహన వచ్చాకా, ఆమెకి మందులిస్తారు. ఎలా ఉపయోగించాలో చెప్తారు. శరీరంలో వచ్చే మార్పులను గమనించుకుని, ఈసారి వచ్చినప్పుడు చెప్పమంటారు. వీరలక్ష్మి, సమ్మక్క ఇంటికి బయల్దేరుతారు. ఇక చదవండి.]

[dropcap]“న[/dropcap]మస్తె డాక్సరు సాబు” అంటూ దండం పెడ్తూ ఆసుపత్రిలోకి వీరలక్ష్మి అడుగు పెట్టేటప్పటికి డాక్టరు, డాక్టరమ్మ టీలు తాగుతున్నారు. గుమ్మంలోనే ఆగిపోయింది వీరలక్ష్మి. వెనకాల ఓ పదేళ్ళ కుర్రాడున్నాడు. “రా వీరలక్ష్మి! పరవాలేదు!” అంటూ ఆహ్వానించాడు డాక్టరు. “దండాలమ్మా” డాక్టరమ్మకు మొక్కింది వీరలక్ష్మి లోపలికొస్తూ. సమాధానంగా చిరునవ్వు నవ్వింది డాక్టరమ్మ. డాక్టరు గారు టీ తాగినంతసేపూ వీరలక్ష్మిని నఖశిఖ పర్యంతమూ పరిశీలిస్తూండిన డాక్టరమ్మ ఆ వెంటనే టీ గ్లాసులను తీసుకొని లోనికెళ్ళింది. బిడియంతో తలదించుకొని అలాగే వుండిపోయింది వీరలక్ష్మి.

“కూర్చో వీరలక్ష్మీ” చెప్పాడు డాక్టరు. డాక్టరు గారికి దగ్గరగా ఉన్న స్టూలు మీద వచ్చి కూర్చున్నది వీరలక్ష్మి.

“సమ్మక్క రాలేదా!”

“రాలె బాంచెను. వాల్లింటికి చుట్టాలొచ్చిన్రు. వీడు మా పక్కింటి పొల్లగాడు. ఎంబడి పెట్టుకోనచ్చిన” చెప్పింది వీరలక్ష్మి.

“ఇప్పుడెట్లున్నది

“పర్వలేదు”

శ్రద్ధగా వింటున్నాడా పిల్లవాడు. “నీ పేరేందిర?” అడిగాడు డాక్టరు.

“ఓదేలు” చెప్పాడు పిల్లవాడు.

“అల్లెంకి శంకరయ్య దుకానానికి పోయి ఒక చార్మినార్ సిగరెట్ డబ్బున్ను, ఖైరి అగ్గిపెట్టె తీస్కరా పోర!” పని పురమాయించాడు డాక్టరు. డబ్బుల కోసం చేతులు జాపాడు వాడు.

“పైసలవుసరంలే. డాక్టర్సాబిమ్మన్నడన్చెప్పు రాసుకుంటడు”. బాణంలా దూసుకుపోయాడు ఓదేలు.

“పోరడు శ్రద్ధగా వింటుండు. వాడీ విషయాలు వినగూడది గద” చెప్పాడు డాక్టరు. అవునన్నట్లుగా తలూపింది వీరలక్ష్మి.

లోగడ అడిగిన ప్రశ్నలన్నింటినీ మళ్ళీ అడిగాడు డాక్టరు. వచ్చిన మార్పుల్ని రాసి పెట్టుకున్నాడు. ఈ మారు గతంలో వలె సిగ్గు పడలేదు వీరలక్ష్మి.

“వీరలక్ష్మీ ఇప్పుడు నీకు పదిహేను రోజుల మందులిస్తున్న. ఇప్పట్లెక్కనె రోగ లక్షణాలన్నిట్ని గమనించి చెప్పు. కొద్దిగంత తక్కువ కావాలె. తక్కువైతే ఇవే మందులిస్త. తక్కువ కాకుంట అట్లనె ఉన్న, ఎక్కువైన ఈ జబ్బు నీకు నీ భర్త నుంచి సంక్రమించినట్లు. ఆయనగ్గూడ వైద్యం అవసరమైతది. వచ్చెటప్పుడు ఆయనను గూడ తోల్కోని రావాలె” మందుల్ని పొట్లాలుగ కడుతూ చెప్పాడు డాక్టరు. సమ్మతిగా తలనూపింది వీరలక్ష్మి.

సిగిరెట్లు, అగ్గిపెట్టె తెచ్చిచ్చాడు ఓదేలు. “సేటు పైసలడిగినాడుర!” అడిగాడు డాక్టరు.

“లే! ఎవలకన్నడు. డాక్సరు సాబుకన్న. తీసిచ్చిండు గంతె” మొసపోస్తూ చెప్పాడు ఓదేలు. పరుగెత్తిన ఆయాసం తగ్గలేదు మరి.

“ఎన్ని కొత్తలయ్య!” అడిగింది వీరలక్ష్మి డబ్బుల కోసం రవికలో చెయ్యి పెట్టుకోబోతూ.

“ఈ సారి పైసలు బట్టయి. మల్లొచ్చినప్పుడు వైద్యం మొదలుపెడ్తగద అప్పుడడుగుతతియ్యి”.

వీరలక్ష్మి డాక్టరు గారి వద్ద సెలవు తీసుకొని గుమ్మం వరకు వచ్చింది. లోపల్నుంచి టీ గ్లాసుతో వచ్చాడు డాక్టరు గారి పెద్దబ్బాయి.

“ఉండు వీరలక్ష్మీ! అమ్మ నీ కోసం చాయ పంపింది”. వెను దిరిగింది వీరలక్ష్మి. టీ గ్లాసును బల్ల మీద పెట్టి తుర్రుమన్నాడు కుర్రాడు. “నాకెందుకయ్య చాయ!” బిడియ పడింది వీరలక్ష్మి. “అది అమ్మనడుగాలె. అమ్మ పంపింది. తాగాలె. అంతకె” నవ్వుతూ చెప్పాడు డాక్టరు.

కూర్చోకుండా నిలబడే టీ తాగింది వీరలక్ష్మి. “నీల్లెక్కడున్నయయ్య” టీ గ్లాసును కడగడానికని అడిగింది.

“లోపటికి పో! అమ్మనే ఇస్తది” అంటూ దారి చూపించాడు డాక్టరు గారు.

విశాలమైన ఇంటిలో వానపడే గచ్చులో గ్లాసును కడిగి బోర్లించి రావడానికి పది నిమిషాలు పట్టింది వీరలక్ష్మికి. “అమ్మ మంచిగ మాట్లాడ్తది” కితాబునిచ్చింది.

“ఈ లోకంల పరిచయమైనోల్లందరు ఆమెకు ఆత్మబంధువులె” చెప్పాడు డాక్టరు.

“వస్తనయ్య!” అంటూ ఓదేలు చేయిపట్టుకొని బయల్దేరింది వీరలక్ష్మి.

“ఎందుకైనా మంచిది వీరలక్ష్మితో జాగ్రత్తగా ఉండండి.” రాత్రి పిల్లలు నిద్దరోయాక చెప్పింది డాక్టరమ్మ.

“మనకీ వీరలక్ష్మికీ ఏం సంబంధముంది చెప్పు. అసలామె ఎవరో ఏమిటో కూడా నాకు తెలీదు. వైద్యానికొచ్చింది. వైద్యం చేస్తున్నాను. అంతే. టీ కూడా నీ అంతట నీవే పంపించావు. నేనేం చెప్పలేదుగా!” సుదీర్ఘమైన వివరణనిచ్చాడు భార్య అనుమానాన్ని నివృత్తి చేసే ఉద్దేశ్యంతో డాక్టరు గారు.

“టీ కాఫీల గురించి కాదు. ఆమె కారణంగా మీరు చిక్కుల్లో పడతారేమో అనిపించింది. చెప్తున్నాను. ఆపైన మీ ఇష్టం” కోపం ధ్వనించింది డాక్టరమ్మ గొంతులో.

“ఈ మాత్రం విషయానికంత కోపమెందుకు డాక్టరమ్మా! మా జాగ్రత్తలో మేముంటాం. సరేనా!” భార్యను దగ్గరకు తీసుకుంటూ అనునయించాడు డాక్టరు గారు.

డాక్టరమ్మ అసలు పేరు బాలాత్రిపురసుందరి. కాడెద్దులపల్లెలో అందరూ ఆమెను డాక్టరమ్మా అని పిలుస్తుండడంతో తను కూడ భార్యనలాగే పిలవడం మొదలెట్టాడు. అంతకు ముందే పేరుతో పిలిచేవారో మనకు తెలియదు.

***

పదిహేను రోజులన్నచోట ఇరవై రోజులైనా ఆసుపత్రికి రాలేదు వీరలక్ష్మి. వీరలక్ష్మి జబ్బు స్వభావం సంక్లిష్టమైంది కనుక బాగా చదివి పెట్టుకొన్నాడాయన. ఇరవైఒకటవ రోజున ఇక ఆమె రాదని నిర్ధారించుకొన్నాడు. ‘ఈ రోగులంతా ఇంతే. వ్యాధి తగ్గుముఖం పట్టిందంటే చాలు రావడం మానేస్తారు. రోగాన్ని కూకటి వేళ్ళతో సహా పెకిలించి వేయాలన్న తన స్వభావాన్ని ఎవరూ అర్థం చేసుకోరు. బోధనలను పట్టించుకోరు. పెద్ద చదువులు చదువుకొన్న వాళ్ళ ప్రవర్తనే అలా ఉంటున్నది. ఇక నిరక్షరాస్యురాలైన వీరలక్ష్మి సంగతి చెప్పేదేముంది’ అనుకొని సమాధానపడ్డాడు డాక్టరు గారు.

పొద్దున్న ఆరు ఆరున్నర మధ్యకాలం. వీరలక్ష్మి వాకిలి ఊడ్చి అలుకు చల్లి, ముగ్గు వేసి ఇంట్లోకి వెళ్ళబోతూ రైలు కట్ట వైపు నుంచి వచ్చే బండ్ల బాట వైపు చూసింది. ఈ మధ్యనే దాని పైన మొరం పోసి రోడ్డు రోలరుతో తొక్కించారు. తరువాతెప్పుడో కంకర రోడ్డుగా మారుస్తారట. ఊరు పక్కనుండే రైలుమార్గం వెళుతుంది కాని స్టేషను లేదు. రోజూ ఆ సమయానికి ఓ పొడవైన గూడ్సు రైలు వెళుతుంది. దాన్ని రెండు బొగ్గింజన్లు లాగుతుంటాయి. ఆ రైలు వెళ్ళే దృశ్యం వీరలక్ష్మికి చాలా ఆనందాన్నిస్తుంది. ఒక్కో రోజా రైలు ఆలస్యంగా వస్తుంది. అక్కడ కాపలాలేని లెవెల్ క్రాసింగు ఉన్నది కనుక ఇంజను తప్పకుండా కూత పెడుతుంది. ఇంజను కూత వినబడగానే చేతిలో ఉన్న పనినొదిలేసి వాకిట్లోకొచ్చి నిల్చుంటుంది వీరలక్ష్మి. రైలు వెళ్ళిపోయాక తన పనిలో తాను పడిపోతుంది. రోజులో చాలా రైళ్ళు వస్తూ పోతూ ఉంటాయి. వాటి గురించిన పట్టింపు లేదు వీరలక్ష్మికి. పొద్దుటవచ్చే గూడ్సు రైలే తనకు ప్రధానం. వాకిట్లో ముగ్గువేశాక చేతిలో ముగ్గుడబ్బాతో ఓ అయిదు నిమిషాలు ఎదురు చూస్తుంది వీరలక్ష్మి. అప్పటికీ రైలు రాకపోతే ఇంట్లోకి నిరాశగా వెళ్ళిపోయి పనిలో పడిపోతుంది. రైలు కూత వినబడగానే లేని ఉత్సాహం పుట్టుకొస్తుంది. వీరలక్ష్మికి అదొక దినచర్యగా మారిపోయింది.

ఆ రోజలా రైలు కోసం చూస్తున్న వీరలక్ష్మికి బాట మీదుగా సైకిలు మీద ధోవతి, పైన ఉత్తరీయం కప్పుకుని వస్తున్న పంతులుగారు కనిపించారు. ‘గుడిపంతులప్పుడే వస్తున్నడేందియ్యాల’ అనుకుంటూ అలాగే నిలబడింది. వీరలక్ష్మి.

సైకిలు దగ్గరగా వచ్చింది. తానెరిగివున్న పంతులు కాదు. కొత్త వ్యక్తి ఎవరో. పంతులును పలుకరిద్దామనుకున్న వీరలక్ష్మి కొత్త వ్యక్తిని చూసి తొట్రుపాటు పడింది.

సైకిలు వీరలక్ష్మికి పదడుగుల దూరంలో ఆగింది. కిందనొకకాలు, పెడలుపైన ఒక కాలు ఉంచి, ఎడమచేత్తో బ్రేకు పట్టుకొని సైకిలునాపుకున్నాడు పంతులు. “బాగున్నావా వీరలక్ష్మీ” అడిగాడు.

“అయ్యో! డాక్సరు సాబూ! మీరా! తొల్త గుడిపంతులనుకున్న. గుడిపంతులు పదకొండు పన్నెండు గొట్టంగ ఇంటికిపోతడు కద ఇప్పుడే పోతాండేంది అనుకొన్న. దగ్గరికచ్చినంక ఈ పంతులెవలో అనుకున్న. మొకం నిండ విభూతి బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకుంటివి. చేతులకు బస్మం రాసుకుంటివి. మీదికెల్లి ధోతి, అంగి లేకుంట కండువ గప్పితివి. గుర్తుపట్టలేదయ్య. ఏమనుకోకు” పశ్చాత్తాపం ధ్వనించింది వీరలక్ష్మి గొంతులో.

“పర్వలేత్తియి వీరలక్ష్మి. మందులైపోంగనె రమ్మంటి గద. రెన్నెల్లైతాంది రాలేదెందుకు.” అడిగాడు డాక్టరు.

“దేవుని లెక్క కనపడ్డవు. లోపటికి రా అయ్య. మా ఇల్లు చూద్దువు” అన్నది వీరలక్ష్మి.

“ఇంకోసారస్తతియ్యి. మబ్బుల నాలుగింటికి పోయిన గుడికి. ఇక్కడి మల్లన్న గుడి ప్రాశస్త్యం నాకీ నడుమనె తెలిసింది. గుడి పంతులుకు జ్వరమొస్తె నా దగ్గరికొచ్చిండు. అప్పుడే తెలిసింది. ఇవ్వాళ మాసశివరాత్రి. అందుకే పొయ్యి అభిషేకం చేసుకోనివస్తున్న” అభ్యంతరం చెప్పాడు డాక్టరు.

“నువు కావల్సుకోని మా ఇంటికస్తవానయ్య. తొవ్వంటి బోతున్నవు. నేను కనబడ్డనని ఆగినవు. దేవుడే మా ఇంట్లెకచ్చిండనుకుంట. రా దొరా!” అనుకుంటూ లోనికి దారి తీసింది వీరలక్ష్మి.

డాక్టరు గారికి తప్పలేదు. సైకిలు స్టాండు వేసి ఇంట్లోకి వెళ్ళాడు. “కూచుండయ్య” అంటూ కుర్చీ చూపించింది. కూచున్నాడు. చేతులున్న చెక్కకుర్చీ, పెంకుటిల్లు బానే వుంది అనుకున్నాడు. చుట్టూ చూశాడు. గది మరీ పెద్దదికాదు. మరీ చిన్నది కూడా కాదు. గుమ్మానికెదురుగా వెలుగుపడేట్టుగా కుట్టుమిషను, మిషను ఎదుట స్టూలు. ఇంకొక రెండు తక్కువ ఎత్తులో ఉన్న స్టూలు వంటి పీటలు వున్నాయి. మట్టిల్లు. ఎర్రమట్టి అలుకుతో శుభ్రంగా ఉన్నది. నేల కూడ గచ్చువలె గట్టిగా వుంది. గది చుట్టూతా ముగ్గు. గది మధ్యలో చుక్కల ముగ్గు. సున్నాన్ని నానబెట్టి బెల్లం లేదా తుమ్మ జిగురు కలిపి వేస్తారాముగ్గును. కొంతమంది ముగ్గులో మెరుపు కోసం కుంకుడురసాన్ని కూడ కలుపుతారు. ‘వీరలక్ష్మిది కళాత్మక హృదయం’ మనసులోనే అనుకున్నాడు. తను కూర్చున్న చోటికి ఆరడుగుల దూరంలో పందిరి పట్టె మంచం కూడా ఉంది. దుప్పట్లు దిళ్ళు చక్కగా అమర్చివున్నాయి. ‘ఏమో అనుకున్నా. వీరలక్ష్మి స్థితిమంతురాలే’ మళ్ళీ మనసులోనే అనుకున్నాడు డాక్టరు గారు.

లోనికి వెళ్ళిన వీరలక్ష్మి మంచినీళ్ళ గ్లాసుతో వచ్చింది. “ఏం చూస్తున్నవయ్య. ఏదో ప్యాదోల్ల ఇల్లు” అంది వినయంగా.

“పొద్దు పొద్దుగాలనే ఏం దూపై తదిగని, మంచినీళ్లు పట్టయి. ఇల్లు శుభ్రంగ ఉంచినవు వీరలక్ష్మీ. చాన సంతోషం. వస్త” అనుకుంటూ లేచాడు డాక్టరు గారు.

“అయ్యొ అట్ల పోతవేందయ్య. ఒక్క నిమిషం కూకుండు. కూకుండుడేంది మా ఇల్లు చూద్దువు రా!” అంటూ లోనికాహ్వానించింది వీరలక్ష్మి. లోనికి వెళ్ళాడు డాక్టరు. రెండోగది వంటిల్లు. చక్కగా అమర్చి ఉన్నది. కూరాడు కుండలతో పాటు మంచినీళ్ళకుండ ఉన్నది. ఇత్తడి బిందెలు, గిన్నెలు, చెంబులు, గ్లాసులు చక్కగా తోమి బోర్లించివున్నాయి.

“రా అయ్యా!” అంటూ దొడ్డిగుమ్మంలోంచి బయటకు దారితీసింది వీరలక్ష్మి. బయటికొచ్చిన డాక్టరు గారికి విశాలమైన పెరడు కనిపించింది. చుట్టూ ముళ్ళకంచె – పశువులు పందులు రాకుండా. కూరగాయల మొక్కలున్నాయి, పాదులున్నాయి. పందరిపై నుండి ఆనపకాయలు వేళ్ళాడుతున్నాయి. గడ్డివాము అనడానికి లేదు గాని మేటు వున్నది. పక్కనే గుడిసె వున్నది. రెండు బర్రెలున్నాయి. వాటి దూడలున్నాయి. కుడితి తొట్టి ఉన్నది. పశువులు గుంజలకు తలుగులతో కట్టివేయబడివున్నాయి. పశువుకి, మేత కొఱకు వేసిన గడ్డికి మధ్య ఒక మొద్దు అడ్డంగా వుంది. లేకపోతే మేయవలసిన గడ్డిని పశువు తొక్కి పాడు చేస్తుంది. ఆ గడ్డి మేతకు పనికిరాకుండా పోతుంది. మొద్దుకు అవతలి భాగంలో అంటే గోడకు మొద్దుకు మధ్యన ఉండే భాగాన్ని గాడి అంటారు. గాడిలో గడ్డి వేస్తారు.

పశువులు బయటకు వెళ్ళే మార్గం విడిగా వుంది. ఎడ్లబండి కూడ లోనికి రావచ్చు. పశువులు బయటకు పోకుండా ఉండేందుకు పనగడి (పన్గడి) ఏర్పాటు కూడ ఉన్నది. ఐదారడుగుల పొడవున్న ఓ మాదిరి మొద్దును నిలువుగా రంపంతో కోస్తారు. రెండు భాగాలకి ఒక పక్కన పలకవలె ఏర్పడుతుంది. వాటిపైన సమాంతరంగా అడుగు లేదా అడుగున్నర దూరంలో పెద్ద పెద్ద రంధ్రాలను చేస్తారు. సాధారణంగా ఈ పనికి తాటి దూలాలను వాడుతారు. దారికి చెరొకపక్క ఆ మొద్దులను పాతుతారు. అలా పాతినప్పుడు రెండు మొద్దులలోను ఉండే రంధ్రాలు సమానమైన ఎత్తులో ఎదురు బెదురుగా ఉండేట్లు చూచుకొంటారు. ఆ రంధ్రాల్లోంచి వెదురు బొంగులు గాని, సన్నటి పొడవాటి వాసాలను గాని దూరుస్తారు. మనుషులు ఆ ఖాళీలోంచి వంగి దూరి వెళ్ళగలుగుతారు కాని జంతువులు వెళ్ళలేవు.

డాక్సరు గారిని పెరడు మొత్తాన్ని సావకాశంగా చూడనిచ్చిన వీరలక్ష్మి “అయ్య! గుడిసె కూడ చూద్దురు రండ్రి” అంటూ పశువుల కొట్టంలోకి దారితీసింది. వెనకాలే డాక్టరు గారు వెళ్ళారు.

గొళ్ళెం తీసి గుడిసె తలుపు తెరిచింది వీరలక్ష్మి. లోపలంతా చీకటిగా వుంది. వీరలక్ష్మి లోనికి వెళ్ళి గుడిసె అవతలి వేపు తలుపు తెరిచింది. గుడిసెలో వెలుగు పరచుకొంది.

“రా దొరా!” పిలిచింది వీరలక్ష్మి.

“నన్ను దొరా! అంటవేంది నేను డాక్టరును” లోనికొస్తూ తన అభ్యంతరాన్ని చెప్పాడు డాక్టరు.

“డాక్టర్లు దొరలు కారా! దొరకంటే ఎక్కువనె. దేవుడు” అభ్యంతరాన్ని కొట్టిపారేసింది వీరలక్ష్మి.

గుడిసెలో కొచ్చాడు డాక్టరు. గది ఒక్కటే అయినా విశాలంగా ఉన్నది. ఎర్రమట్టితో అలకడం, ముగ్గులు పెట్టడం ఇక్కడ కూడా పెంకుటింట్లో, వలెనే ఉన్నది. ఒక పక్క గడంచ మీద వడ్ల బస్తాలున్నాయి. గోడలకు కొట్టిన కొయ్యలకు తలుగులు వేళ్ళాడుతున్నాయి. పారలు, గడ్డపారలు, తట్టలు, ఇత్యాది వ్యవసాయపు పనిముట్లన్నీ మరొక గోడ ప్రక్కన చక్కగా సర్దివున్నాయి. గుడిసె ముందుభాగానికొచ్చాడు. అది వీధి. “ఏంటి వీరలక్ష్మీ. ఇటు గూడ తొవ్వ వున్నదా!”

“అవునయ్యా! మా ఇల్లు మలుపు మీద ఉండడుతోని అటొక తొవ్వ ఇటొక తొవ్వ లెక్క గొడ్తది” జవాబిచ్చింది వీరలక్ష్మి. “అవునూ, నీ భర్త ఏడీ! ఎంత మందుంటారేమిటి మీ ఇంట్లో?” అడిగాడు డాక్టరు.

“మా ఇద్దరమె బాంచెను. అత్తమామలు కాలం చేసిన్రు. అత్తమామలున్నప్పుడు ఈ గుడిసెల్నె వుంటుంటిం. గుడిసె ఎనుక గోడ దీసి నిట్రాళ్ళు పెట్టినం. అదె పశువుల కొట్టమైంది” వివరించింది వీరలక్ష్మి.

“ఇంతకూ మీ ఆయన కనిపించడేం.”

“పొలానికి బొయ్యిండయ్య. మబ్బుల గోర్కొయ్యలు రాకముందుకె మోట గొట్టనీకి పోతడు. తొమ్మిది పదిగొట్టెటాల్లకు వాపసస్తడు” చెప్పింది వీరలక్ష్మి.

“మరి నువ్వు బోలె. ఆయన మోటగొడ్తె నీల్లు పారిచ్చెటందుకింకోలుండాలె గద” అడిగాడు డాక్టరు.

“పాలేరున్నడు బాంచెను. నన్ను పొలం పన్లకు రానియ్యడు. ఈ పెరడె నా పొలం. ఇదంత నేను పొతం జేసుకున్నదే. దీంట్లో ఆయనను ఏలుబెట్టనియ్య” మురిపెంగా చెప్పింది వీరలక్ష్మి.

“పాలు గూడ నివ్వె పిండుతవ.”

“లేదయ్య, గోదలుగాసె ఈరిగాడె పొద్దుమాపు పాలు పిండిపోతడు. ఇంకో గంట గంటన్నరకచ్చి బర్లను మ్యాతకు తోల్కపోతడు.”

“పోవాలె. పొద్దుబోతుంది” అంటూ గుడిసె బయటకు నడిచాడు డాక్టరు. వెనుకాలే తలుపు మూసి గొళ్ళాలు పెట్టుకొని వచ్చింది. వీరలక్ష్మి.

వంటింటి గోడ నానుకుని ఉన్న పొయ్యి మీద పాలు పొంగి పొయ్యిలో పడుతున్నాయి. “వీరలక్ష్మీ! పాలు పొంగుతున్నయి” చెప్పాడు డాక్టరు గారు.

“అయ్యొ! మర్చి పొయిన్నయ్య!” పరుగెత్తుకుంటూ వచ్చి చీరకొంగుతో పట్టుకొని పాలగిన్నెను పొయ్యిమీంచి దించింది వీరలక్ష్మి.

“పొయ్యి బయటనే వుంటదా!”

“అవునయ్య! వానబడితెనె వంట లోపట. లేకుంటె పొగతోని గోడలు మసిబారిపోతయి.”

“మంచిది వీరలక్ష్మీ! వెళ్ళొస్తాను” చెప్పాడు డాక్టరు పెరట్లోంచి వంటింట్లోకి అడుగుపెడ్తూ. “అయ్యొ! కొద్ది సేపు కూకుండుండ్రిగాద! ఇప్పుడే పాలల్ల శర్కరేసుకస్త. తాగి పోదురు.”

“ఈ మర్యాద లేమీ వద్దు వీరలక్ష్మీ! నేను పోవాలె.”

“మా ఇండ్లల్ల పాలు సుత తాగరా! ఇంటి పాలు ఇంట్లనె పాడి వున్నది. సూస్తిరి గద.” నిష్ఠూరమాడింది వీరలక్ష్మి.

తప్పనిసరై ముందు గదిలోకొచ్చి కుర్చీలో కూర్చున్నాడు డాక్టరు గారు. వెనకాలే వచ్చిన వీరలక్ష్మి కుట్టుమిషను ముందరి స్టూలును తీసుకొచ్చి డాక్టరు గారి ముందుంచింది. లోపలికెళ్ళి రెండు గ్లాసులతో వచ్చింది. ఒక గ్లాసు నిండా మంచినీళ్ళు, ఇంకో గ్లాసు నిండా వేడి వేడి పాలు.

“ఇన్ని పాలు వద్దు వీరలక్ష్మీ. తగ్గించు” అన్నాడు డాక్టరు.

“యాపాటున్నయ్య తాగు.”

“యాపాటేంది? సోలెడున్నయి. సోలగిలాసనిండ ఇస్తివి.”

“మా ఇంట్లన్ని ఇసొంటి ఇత్తడి గిలాసలెవున్నయి. చిన్నయి లేవు. మేం వాటినిండ తాగుతం. వచ్చినోల్లకు సుత నిండుగనె ఇస్తం.” గడుసుగా సమాధానం చెప్పింది వీరలక్ష్మి. చిరునవ్వుతో పాలగ్లాసును చేతిలోకి తీసుకున్నాడు డాక్టరు.

“ఇంతకూ నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. నీ మందులయిపొయి గూడ నెలకావస్తున్నది. ఎందుకు రాలే చెప్పు. పూర్తిగ తక్కువయిందా! అట్లయితె గూడ వచ్చి చెప్తే సంతోషపడ్తగద.” అన్నాడు డాక్టరు చిక్కటి పాల కమ్మటి రుచిని ఆస్వాదిస్తూ.

“లేదయ్య. ఓ పాటి నయమెవున్నది గని పురాంగ తక్కువైతలేదు. తక్కువ కాకుంటే నా పెనిమిటిని తోల్కరమ్మంటివి గద. ఆయనకు తీర్పాటుకమైతలేదు” తలదించుకొని విచారపడుతూ చెప్పింది వీరలక్ష్మి.

“ఇలా అశ్రద్ధ చేస్తే ఎలా చెప్పు. మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా వ్యవసాయం పనులు చేసుకోగలుగుతారు” అనునయంగా చెప్పాడు డాక్టరు.

“అవునయ్య నువ్వు చెప్పేద్ది నివద్దెగని ఏంజేసెటట్టున్నది. మబ్బుల బాయికాడికి పోయిందంటే పదిగొట్టంగచ్చి బుక్కెడంత తిని పంటడు. మల్ల రెండు గొట్టంగ లేచి కాలెక్కలు గడుక్కోని బొయిండంటె దీపాలు పెట్టెయాల్లదన్క పొలంలనె వుంటడు. వచ్చెటప్పుడె తాల్లల్లకు బొయి కల్లుదాగస్తడు. ఇగ నీ దగ్గరికెప్పుడు రావాలె చెప్పు” ఎదురడిగింది వీరలక్ష్మి.

“వీరలక్ష్మీ! నువు చెప్పేది నిజమే కాని, నేను చెప్పిన మాట వినకుంటే నీ మగడు పొలానికి పోజాలడు, నువ్వు కూరగాయలు పెరట్ల పండించజాలవు. అటెన్క నీ యిష్టం” అనుకుంటూ తాగేసిన పాలగ్లాసు స్టూలు మీద పెట్టి లేచి నిల్చున్నాడు వెళ్ళడానికన్నట్టు.

“సరెనయ్యా! ఈ నాలుగైదు రోజులల్ల తప్పకస్తం!” చెప్పింది వీరలక్ష్మి.

డాక్టరు గారు గుమ్మందాటి బయటికొచ్చి సైకిలుస్టాండు తీస్తుండగా “అయ్యా! ఒక్క నిముసం” అంటూ లోనికి పరుగెత్తింది వీరలక్ష్మి. ఎందుకో అర్థం కాలేదు డాక్టరు గారికి. రెండు నిమిషాల్లో చేతిలో పొడవాటి ఆనపకాయతో వచ్చింది. “అయ్యా! తీస్కపో! వండుకోన్రి. అమ్మనడిగిన్నని చెప్పున్రి” అంది పరుగువల్ల వచ్చిన ఆయాసంతో,

“ఇదంతెందుకు వీరలక్ష్మి. అయిన ఎట్ల తీస్కపోవాలె చెప్పు” అడిగాడు డాక్టరు. ఆమె ఆప్యాయతను కాదనలేకుండా ఉన్నాడు. అట్లని ఆనపకాయని తీసికొని పోవాలనీ లేదు.

“క్యారలుకు పెట్టుకోండ్రి డాక్సర్ సాబు” అంటూ చనవుగా వెనకాలకు వచ్చి ఆనపకాయను జారిపోకుండా సైకిలు క్యారేజికి అమర్చిపెట్టింది. “మంచిది పొయిరాండ్రి” అంటూ సాగనంపింది. డాక్టరు కనుమరుగయ్యేదాక అక్కడే నిల్చొని తదుపరి నిట్టూరుస్తూ లోపలికెళ్ళింది వీరలక్ష్మి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here