వ్యామోహం-4

0
14

[శ్రీ వరిగొండ కాంతారావు రచించిన ‘వ్యామోహం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఆసుపత్రిలో వీరలక్ష్మి అడుగుపెట్టేటప్పటికి డాక్టరు గారు, డాక్టరమ్మ టీ తాగుతుంటారు. వాళ్ళిద్దరికి నమస్కరిస్తుంది వీరలక్ష్మి. టీ తాగాడం పూర్తయ్యాకా, వీరలక్ష్మిని పరీక్షించడానికి సిద్ధమవుతారయన. వీరలక్ష్మితో పాటు వచ్చిన కుర్రాడు వీళ్ళ మాటలు శ్రద్ధగా వింటుండంతో, సిగరెట్లు తెమ్మని ఆ కుర్రాడిని బయటకి పంపి వీరలక్ష్మిని మరికొన్ని ప్రశ్నలు అడిగి మందులు రాసిచ్చి, పదిహేను రోజుల తరువాత కూడా తగ్గకపోతే, భర్తతో సహా మళ్ళీ రమ్మని చెప్తారు. ఈ లోపు వీరలక్ష్మి కోసం టీ పంపిస్తుంది డాక్టరమ్మ. నాకెందుకని అని వీరలక్ష్మి అంటే, పర్వాలేదు తాగేసి వెళ్ళమంటారాయన. అయితే ఇరవై రోజులయినా వీరలక్ష్మి రాదు. ఒకరోజు ఆయన గుడికి వెళ్ళొస్తూంటే, ఇంటి ముందు ముగ్గేసి, రైలుని చూస్తున్న వీరలక్ష్మి కనబడుతుంది. పంచ, కండువ, విభూది, కుంకుమలతో ఆయనను మొదట  గుర్తుపట్టదు వీరలక్ష్మి. ఆయనే సైకిల్ ఆపుకుని వీరలక్ష్మిని పలకరిస్తాడు. ఇంట్లోకి రమ్మని పిలిచి, ఇల్లంతా చూపిస్తుంది. నీ భర్త ఏడి అని అడిగితే పొలానికి వెళ్ళాడని చెబుతుంది. జబ్బు తగ్గిందా అని అడిగితే పూర్తిగా తగ్గలేదంటుంది. మరెందుకు రాలెదాంటే, మీరు మా భర్తని తీసుకుని రమ్మన్నారు. ఆయనకి రావడం కుదరలేదు. అందుకనే రాలేదని చెబుతుంది. వేడి పాలల్లో చక్కెర వేసి తాగమంటుంది. భార్యాభర్తలిద్దరూ వచ్చి చూపించుకోవల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేస్తాడు. నాలుగైదు రోజుల్లో వస్తామంటుంది. ఆయన బయల్దేరుతుంటే ఒక్క నిమిషం ఆగమని దొడ్లోంచి కోసుకొచ్చిన ఆనపకాయనిచ్చి పంపుతుంది. ఇక చదవండి.]

[dropcap]“ఎ[/dropcap]క్కడిదీ ఆనపకాయ?” అడిగింది డాక్టరమ్మ.

“వీరలక్ష్మి ఇచ్చింది.”

“వీరలక్ష్మీంటే?”

“ఆ రోజు నువు టీ ఇచ్చావు చూడు ఆవిడ.”

“ఆమె ఇంటికి మీరెందుకు వెళ్ళారు?”

“నేను వెళ్ళలేదు” అంటూ జరిగింది వివరించారు డాక్టరు గారు.

“రోగి మీ వద్దకు రాకపోతే ఎందుకు రాలేదని నిలదీసే హక్కు మీకెవరిచ్చారు? వాళ్ళ రోగం వాళ్ళ వైద్యం. ఇష్టమైతే వైద్యానికొస్తారు. లేదంటే లేదు” కోప్పడింది డాక్టరమ్మ.

“వాళ్ళు నిరక్షరాస్యులు. ఆరోగ్యం విలువ తెలియదు. అయినా నేను పనిగట్టుకొని ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళలేదు కదా!” సముదాయించాడు డాక్టరు.

“నేను మీకనేక సార్లు చెప్పాను. దేవాలయానికి వెళితే నేరుగా ఇంటికి రావాలని. గుడి నుంచి మనమెవరింటికి వెళతామో – ఆ ఇంటి వారికే పూజాఫలం దక్కుతుంది. తెల్లవారగట్ల లేచి వెళ్ళి అభిషేకం చేయించుకుని వచ్చారు. నాకూ పిల్లలకూ దక్కిన ఫలితం శూన్యం” విసుక్కుంది డాక్టరమ్మ.

అరగంట తర్వాత పూజ ముగించుకొన్న డాక్టరుగారికి పొగలు కక్కుతున్న కాఫీనందించిందా ఇల్లాలు. చిరునవ్వుతో స్వీకరించాడు భర్త.

***

వారం రోజుల పాటు ఎదురు చూశాడు డాక్టరు గారు. వీరలక్ష్మి రాలేదు.

భర్త మూర్ఖుడైనప్పుడు ఏ భార్య మటుకు ఏం చెయ్యగలుగుతుంది. భర్త చెడు నడవడి తనకు తెలియకుండా ఉండగలందులకు అతని పనివేళలను ఎంత వివరంగా చెప్పుకొచ్చింది. భారతీయ స్త్రీల గొప్పతనమే అంత. భర్త కారణంగా తామెంతటి కష్టంలో వున్నా ఇతరులకా భర్తను నిందించే అవకాశాన్నివ్వరు. తనలో తాను సమాధానపడ్డాడు డాక్టరు.

మరో పదిహేనురోజుల తర్వాత వీరలక్ష్మి రాలేదు గాని వేరొక రోగికి సాయంగా సమ్మక్క వచ్చింది. రోగికి మందులిచ్చాక సమ్మక్కనడిగాడు డాక్టరు.

“వీరలక్ష్మి పెనిమిటిని తీస్కోని నాలుగైదు రోజుల్ల వస్తనన్నది. రాలేదేంది. ఇప్పటికి నెలదగ్గరకొస్తున్నది. ఎట్లున్నది? లేచి తిరుగుతున్నదా!”

“ఆఁ మా తిరుగుతున్నది. నేన్చెప్త రమ్మనుమని” అంటూ ముక్తసరిగా చెప్పి వచ్చిన రోగితో బాటు వెళ్ళిపోయింది సమ్మక్క.

ఓ అరగంట పోయాక వచ్చిన సమ్మక్క “అందరెదురుంగ ఈర్లక్ష్మి గురించి అడుగుతెట్ల డాక్సరుసాబు” అంది.

“నీ దోస్తు కద అని అడిగిన, అండ్ల తప్పేమున్నది.” ఆశ్చర్యపోయాడు డాక్టరు.

“ఇప్పుడు చెప్పున్రి ఈర్లక్ష్మి మీతోనేమన్నదో” డాక్టరు గారి ప్రశ్నకు సమాధానమివ్వకుండా ఎదురు ప్రశ్న వేసింది సమ్మక్క,

“ఆ మధ్యల ఓదేలు అనే పిల్లవాణ్ణి వెంటబెట్టుకొని వచ్చింది”..

“ఆ సంగతి నాకెర్కనె. అటెన్క మల్లచ్చిందా!’

“రాలేదు కని..” అంటూ తను గుడినుంచి వచ్చేటప్పుడామెను పలుకరించిన సంగతి, ఆమె నాలుగైదు రోజుల్లో వస్తానన్న సంగతిని వివరించి చెప్పాడు డాక్టరు.

ఇప్పుడాశ్చర్యపోవడం సమ్మక్క వంతైంది. డాక్టరు తన ఇంటికి వచ్చిన సంగతిని ఈర్లక్ష్మి తనకసలు చెప్పనేలేదు. చీమ చిటుక్కుమన్నంత చిన్న విషయాన్నైనా తనతో వివరంగా పంచుకొనే ఈర్లక్ష్మి ఇంత పెద్ద విషయాన్ని తన దగ్గర దాచిపెట్టింది. కారణం బోధపడింది. డాక్సరు సాబుకు అబద్దం చెప్పింది. ‘అట్లెందుకు చెప్పినవు’ అని తను కోప్పడుతుంది కాబట్టి తన దగ్గర ఆ విషయాన్ని దాచిపెట్టింది. గబుక్కున వీధి గుమ్మం దగ్గరకెళ్ళి వీధి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు తేరిపార చూచింది. డాక్టరు గారి వద్దకు వచ్చేవాళ్ళెవరూ లేరని నిర్ధారించుకొంది. “అమ్మ బయటికస్తదా!” అడిగింది.

“పిలువాన్నా!” అర్థంకాక అడిగాడు డాక్టరు.

“వద్దు వద్దు. నేన్జెప్పె ముచ్చట అమ్మ ఇంటె మంచిగుండది” కంగారుగా చెప్పింది సమ్మక్క

“అమ్మ నేను పిలుస్తె గని దవాఖానలకు రాదు. ఆమెకు ఇంట్లనే మస్తు పనుంటది” చెప్పాడు డాక్టరు.

ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకొని చెప్పింది సమ్మక్క “అక్కకు మగడు లేడు బాంచెను.”

“మరి”

“సచ్చిపోయిండు. అక్కకు చిన్నతనంలనె పెండ్లయింది. పెండ్లయిన రెండేండ్లకె తాడిచెట్టు మీంచి పడి మగడు సచ్చిపొయిండు. అటెన్క పది పదిహేనేండ్లకు అత్తమామలు జచ్చిన్రు. ఇయన్ని నాకు లగ్గం గాక మునుపై జరిగిపోయినయి. మా అత్త జెప్పుట్ల నాకెర్క”

“మరి పుస్తె మట్టెలున్నయి. బొట్టు పెట్టుకుంటది” అయోమయంగా అడిగాడు డాక్టరు.

“బాల్రెడ్డి పటేలుంచుకున్నడు బాంచెను. వాల్ల అత్తమామలున్నప్పుడె యవ్వారం మొదలైందట. వాల్లకు నచ్చక వాల్లు వేరే ఉన్నరట. ఇప్పుడీమె వున్న ఇల్లు సుత పటేలు గట్టిచ్చిందె. పటేలు కొఱకు బొట్టు పెడ్తాది. మట్టెలు బెడ్డది. బంగారు గొలుసు వట్టిదె. రైకల దోపుకుంటది కాబట్కె అందరు మంగల సూత్రమనుకుంటరు.”

“బాల్రెడ్డంటె పోలీసు పటేలేన” వివరం కొఱకు అడిగాడు డాక్టరు.

“అవునయ్య, కని ఏమాట కామాట చెప్పాలె. ఉంచుకున్న మనిషని ఎన్నడు సుత ఈమెను అల్కగ జూడంగ చూడలె. రెండో లగ్గం చేసుకున్న కిందికె అనుకోరాదు. కని నాదానైతనని పెండ్లాం కింద చెప్పుకోడు. అక్క సుత ఈ విషయం ఎవలతోని మాట్లాడది. ఊరందరికి సంగతి దెల్సునంటే దెల్సు, తెలవదంటే తెలువది. అదయ్య ముచ్చట. నలుగురిట్లే ఈ సంగతి మాట్లాడేటట్టుండదు గదనయ్య. ఎక్కడ ఏమ్మాట్లాడ్తె పటేలు చెవుల బడ్తదో తెలువది. మనమ్మాట్లాడె ముచ్చట ఒకటుంటది. పటేలుకు ముట్టె ముచ్చట ఇంకో నమూన వుంటది. అందుకే ఎవల జాగర్త వాల్లది.” వివరంగా చెప్పింది సమ్మక్క.

తల తిరిగిపోయింది డాక్టరు గారికి. అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నవాళ్ళు వాళ్ల సంబంధాన్నెంత పవిత్రంగా భావిస్తున్నారో కదా! వీరలక్ష్మి నిరక్షరాస్యురాలు. బాల్రెడ్డి పటేలు అంతా జేసి హైస్కూలు వరకైనా చదువుకున్నాడో లేదో తెలీదు. వంశపారంపర్యంగా సంక్రమించిన పటేలుగిరి అయివుంటుంది. ఊరివాళ్ళు కూడ ఆ బంధాన్ని గురించి అంతగా పట్టించుకుంటున్నట్లు లేదు. సంస్కారానికి విద్యకు సంబంధం లేదంటారందుకే – కళ్ళు మూసుకుని తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయాడు డాక్టరుగారు.

“ఏంది డాక్సరు సాబు నేన్జెప్పింది వింటున్నవా లేకుంటె నిద్రబోతున్నవా!” అడిగింది సమ్మక్క.

కళ్ళు తెరిచి అన్నాడు డాక్టరు. “లేదు సమ్మక్కా! వింటున్న. ఇప్పుడు వీరలక్ష్మి ఆరోగ్య సమస్యకు పరిష్కారమెట్ల అని ఆలోచిస్తున్న.”

“ ‘నన్ను పోలీసు పటేలుంచుకున్నడు’ అని అక్క నీకు చెప్పజాలక మగడు, మోటబాయి కతల్జెప్పుకచ్చింది. ఇప్పుడు నువు పెనిమిటిని తోల్కోని రమ్మని చెప్పినవు. ఇప్పుడక్కంబడి పటేలు బావ, అవు పటేలు నాకు బావనె అయితడు కద” నవ్వుతూ కసేపాగి చెప్పింది సమ్మక్క “నీ దగ్గరికస్తడా!”.

“మరేం చేద్దాం చెప్పు.”

“ఏం లేదయ్య! అక్కకే వైద్యం చెయ్యాలె. రోగం ముదురకుంట చూస్కోవాలె. బతికినన్ని దినాలు బతికించుకోవాలె” కళ్ళ వెంట నీళ్ళు కార్తుంటె చీరకొంగును నోట్లో కుక్కుకుని నిశ్శబ్దంగా ఏడుస్తోంది సమ్మక్క.

స్నేహబంధం తప్ప ఏ బంధమూ లేని సమ్మక్క దుఃఖాన్ని చూచి చలించిపోయాడు డాక్టరు గారు.

“సరే! నీ సూచన గూడ బాగనె వున్నది. మీ అక్కను తీస్కరా!” చెప్పాడు డాక్టరు. సంతోషంగా తలనూపి వెళ్ళిపోయింది సమ్మక్క.

మూడో రోజు ఉదయం పదిగంటల ప్రాంతంలో వీరలక్ష్మి సమ్మక్కలు డాక్టరు గారి గుమ్మంలోకి అడుగుపెట్టారు. అదేమి విశేషమో తెలియదు. వీరలక్ష్మి వేళ చూచుకొని వస్తుందేమో అన్నట్లుగా – ఆమె వచ్చే సమయానికి రోగులెవరూ వుండరు.

సిగ్గుపడుతూ వచ్చి డాక్టరు గారి దగ్గర స్టూలుపైన కూర్చుంది వీరలక్ష్మి. ఆయన వేపు చూడలేకపోతున్నది. తను చెప్పిన విషయాలన్నీ అబద్ధాలని డాక్టరు గారికి తెలిసిపోయింది. అందులో “దేవునసొంటి డాక్సరుకబద్దం చెప్తవానె అక్క!” అంటూ సమ్మక్క తనను పొట్టు పొట్టు తిట్టింది.

నాడి చూడడానికి చెయ్యి చాపాడు డాక్టరు. అర్థం చేసుకొని చేతినందించింది వీరలక్ష్మి.

“వీరలక్ష్మీ! నువ్వు తప్పేం జెయ్యలే, నీ మీద నాకేం కోపం లేదు. ఎప్పటి లెక్కనె వచ్చి పోతుండు మందుకు” చెప్పాడు డాక్టరు. తలనూపింది వీరలక్ష్మి.

వ్యాధి వివరాలు తెలుసుకొని నెలకు సరిపడా మందులనిచ్చాడు.

“ఎన్ని కొత్తలు” జాకెట్లోంచి డబ్బులు తియ్యబోతూ అడిగింది సమ్మక్క.

“పైసలు బట్టయి. వీరలక్ష్మికి ఫీజులేదు. ఎన్నిరోజులైనా, ఎన్నేళ్ళైనా” స్థిరంగా చెప్పాడు డాక్టరుగారు.

ఋణభారంతో తలను వంచుకొని నీళ్ళు నిండిన కళ్ళతో చేతులు జోడించింది వీరలక్ష్మి. సమ్మక్క కూడ చెమ్మగిల్లిన కళ్ళతో నమస్కరించింది డాక్టరు గారికి.

సెలవు తీసుకొని తేలికపడ్డ మనసుతో వెనుదిరిగారు అక్కాచెల్లెళ్ళిద్దరూ.

***

డాక్టరుగారు ఆసుపత్రిలో చదువుకుంటున్నారు. డాక్టరమ్మ కొడుకు నెత్తుకొని డాక్టరు గారి దగ్గరకొచ్చి నిలుచుంది. పట్టుచీర ధరించింది.

‘ముస్తాబైనావు. ఏమిటి విశేషం’ అన్నట్లుగా కళ్ళెగరేశాడు డాక్టరు గారు.

“లక్ష్మింబాయక్క పసుబ్బొట్టుకు పిలిచింది” చెప్పింది డాక్టరమ్మ. చిన్నగా నవ్వాడు డాక్టరు. ఆ నవ్వులో వెటకారం తోచింది డాక్టరమ్మకు. “ఎందుకు నవ్వుతున్నారు?” అడిగింది భర్తను.

“ఏమీ లేదులే!”

“కాదు ఏదో వుంది.” పట్టుబట్టింది డాక్టరమ్మ.

“నువ్వు పేరంటానికి అనాలి కదా! పసుబ్బొట్టు అన్నందుకు నవ్వొచ్చింది.”

“అందులో అంతగా నవ్వాల్సిందేమీలేదు లెండి. మాది జంగారెడ్డిగూడెం అయినంత మాత్రాన నేను ఆంధ్రాదాన్నైపోలేదు. మీది అశ్వారావుపేట అయినంతలో మీరు తెలంగాణ వారు అయిపోరు.” దెప్పిపొడిచింది డాక్టరమ్మ.

“ఏదో సరదాగా నవ్వాలేవోయ్. దానికే ఇంత కోపమా!” అనునయించాడు డాక్టరుగారు. మూతి తిప్పుకుంది డాక్టరమ్మ.

“సరే అయితే పసుబ్బొట్టుకే వెళ్ళిరండి తల్లీ!” చెప్పాడు డాక్టరు.

“మీరు కూడా రావాలి”

“పసుబ్బొట్టుకు నేనెందుకు. కొంపదీసి చీర కట్టుకోమనవు కదా!”

“పసుబ్బొట్టు కోసం కాదు. ఈ పిల్లాణ్ణి చంకనేసుకొని నేనంత దూరం నడవలేను. మీరెత్తుకుంటారని.”

“ఓహో! కూలి మనిషిలాగ అన్నమాట!”

“కన్న కొడుకు నెత్తుకోవడానికి కూడ కూలి కావాలా!”

“అవును కావాలి. డబ్బుల రూపంలో కాదు.”

“మరి!”

“అవసరమైనప్పుడడుగుతాలే. అప్పుడిద్దువుగాని.”

“అవసరమైనప్పుడడిగేది కూలి కాదు. తిరిగి చెల్లించగలిగేదైతే అప్పు చెల్లించలేనిదైతే బిచ్చం అవుతుంది.”

“నేను తిరిగి చెల్లించగలననే అనుకుంటున్నాను.”

“మీరడగబోయేది మీరీ జన్మలో తిరిగి చెల్లించగలిగేది కాదు. మీరడిగితే నేనిచ్చేది భిక్ష మాత్రమే అవుతుంది.”

“అవును అంతేలే. అర్ధనారీశ్వరుడైనా సరే! పరమ శివుడు ఆది భిక్షువు. భిక్ష వేసేది జగన్మాత అయిన అన్నపూర్ణాదేవి.” రాజీపడ్డాడు డాక్టరు గారు.

“అలా రండి దారికి” విజయగర్వంతో నవ్వులు చిందించింది డాక్టరమ్మ.

“నేనో కేసు గురించి స్టడీ చేస్తున్నాను. నువ్వెళ్ళి రాకూడదూ!” మళ్ళీ మొదటికొచ్చాడు డాక్టరు గారు.

“మీరు రాకుంటే నేను వెళ్ళను. రేపెప్పుడన్నా లక్ష్మింబాయక్క కలిసి ‘పసుబ్బొట్టుకు రాలేదేందె చెల్లే!’ అనడిగితే డాక్టర్సాబు పోవద్దన్నడు అని చెప్తా” బెదిరించింది డాక్టరమ్మ!

“అమ్మ రాక్షసీ! కాల్చకుండానే అట్లకాడతో వాతలు పెట్టగలవు నువ్వు.” అంటూ ప్యాంటూ షర్టూ వేసుకొని ప్రయాణానికి సిద్ధమైనాడు గత్యంతరం లేని డాక్టరుగారు.

“మరి మిగతా ముగ్గురూ!” అడిగాడు డాక్టరు.

“అమృతా వాళ్ళింట్లో ఆడుకుంటారు. కృష్ణవేణి వాళ్ళని ఆడిస్తోంది.”

“అమృతా వాళ్ళింట్లోనా!” ప్రశ్నార్థకంగా చూచాడు డాక్టరు.

“ఏం వాళ్ళింటికి మన పిల్లలు వెళ్ళకూడదా!” ఎదురడిగింది డాక్టరమ్మ.

“అలా అని కాదు వాళ్ళు భోగం వాళ్ళు కదా..” అర్ధోక్తిలో ఆగిపోయాడు డాక్టరు.

“భోగం వాళ్ళయితేనేం. వాళ్ళ వృత్తిలో లేరు కదా! అమృత ఒక్క మనిషినే నమ్ముకుని వున్నది. అతనితో ఆమెకు పెళ్ళంటూ జరక్కపోవచ్చు. కాని ఆమె అతనితో నిజాయితీగానే వుంటున్నది కదా! కృష్ణవేణికి పదిహేనేళ్ళు, ఐదో క్లాసు వరకు చదివించి మాన్పించారు. సంబంధాలు కూడ చూస్తున్నారు. ఉగాది వరకు పెళ్ళి నిశ్చయమవచ్చునన్న ఆలోచనలో ఉన్నారు” వివరించింది డాక్టరమ్మ.

“స్త్రీలందరూ నీ అంత విశాల హృదయంతో ఆలోచిస్తే సమాజమింకెంత బాగుండేదో కదా!” భార్యను మెచ్చుకున్నాడు డాక్టరు గారు.

“ఈ హృదయ వైశాల్యం జబ్బు మీ నుండే నాకంటుకుంది. స్త్రీలకు విశాల హృదయం లేకపోవడమే మంచిదిలెండి. స్త్రీల విశాల హృదయాలనాధారం చేసికొన్న మొగవాళ్ళు లోకంలో అమృతలాంటి వారి సంఖ్యను అపరిమితంగా పెంచేయగలరు” చురుకు పెట్టింది డాక్టరమ్మ.

ఇంటికి తాళం వేసి పిల్లాణ్ణి భుజాన వేసికొన్నాడు డాక్టరుగారు. పక్కనే నడుస్తూ కబుర్లు చెబుతున్నది డాక్టరమ్మ. దారినపోయే వాళ్ళంతా వింతగా చూస్తున్నారు. భార్యాభర్తలు అలా ప్రక్కప్రక్కనే నడుస్తూండడం అప్పటి సమాజానికి ఊహకందని విషయం. మొగుడు ముందు నడుస్తుంటే పెళ్ళాం కనీసం ఓ నాలుగడుగులన్నా వెనకాల నడవాలన్న మాట.

ఇంకొక నాలుగడుగులు వేస్తే నర్సింగరావు పట్వారి ఇల్లు వస్తుందనగా డాక్టరుగారి భుజమ్మీది పిల్లాణ్ణి తీసుకొని చంకనెత్తుకొంది డాక్టరమ్మ.

“ఇంతదూరం ఎత్తుకొచ్చిన వాణ్ణి ఇంకో నాలుగడుగులు ఎత్తుకోలేనా!” అన్నాడు డాక్టరు పిల్లవాణ్ణందిస్తూ.

“అదంతే! మీతో పిల్లాణ్ణి మోయిస్తున్నానని ఊరంతా అనుకుంటారు.”

“ఇప్పటి దాకా చూసినవాళ్ళనుకోరా!”

“వాళ్ళతో నాకు సంబంధం లేదు. పేరంటానికొచ్చేవాళ్ళకు నాకు మాత్రమే సంబంధం” చెప్పింది డాక్టరమ్మ. ఈలోగా నర్సింగరావుగారిల్లు రానే వచ్చింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here