వ్యాపార బంధాల దుర్గ కథ

0
11

[dropcap]వి[/dropcap]విన మూర్తి గారు అనగానే నాకు అప్పటికీ ఇప్పటికీ కూడా వెంటనే గుర్తొచ్చే నవల ‘వ్యాపార బంధాలు’. ఇది 1984లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్‌గా వచ్చినట్టు గుర్తు. అప్పుడు చాలా ఆసక్తిగా వారం వారం ఎదురుచూస్తూ చదివాను. మళ్లీ ఇంతకాలం తర్వాత దాదాపు 38 ఏళ్లు గడిచేక ఇప్పుడు చదివితే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. అప్పుడు ఆ నవల చదివినప్పటి ఆలోచనలకి ఇప్పటి ఆలోచనలకి మధ్య బాగానే తేడా ఉందని అనిపించింది. అప్పుడు చదువుతుంటే ఒక ఆశ్చర్యమే తప్ప విమర్శనాత్మక దృష్టి లేదనుకుంటాను. కానీ ఇప్పుడు నేను పాఠకురాలి గానే చదివినా అడుగడుగునా సందేహాలు వస్తూనే ఉన్నాయి.

నా సందేహాల గురించి చెప్పేముందు స్థూలంగా కథ చెప్పుకుందాం.

ఒక మధ్య తరగతి కుటుంబంలో పెద్ద కూతురుగా పుట్టిన దుర్గ చదువుకుని ఒక స్కూల్లో టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది. ఆమెకు మాధవరావు అనే ఒక యువకుడితో పరిచయం, ప్రణయమూ, గర్భమూ, మోసమూ కూడా జరిగిపోయాయి. అతను ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేడు సరి కదా 5000 పరిహారంగా ఇచ్చాడు. ఆమె ఆ డబ్బుని వాడి మొహం మీద కొట్టకుండా తీసుకుంది. అప్పటికే ఆమె తల్లీ తండ్రితో సహా అందరూ తను సంపాదించే డబ్బు కోసమే తనను ప్రేమగా చూస్తున్నారని ఇదంతా వ్యాపార సంబంధమని గట్టిగా నమ్ముతోంది. అందువల్ల ఆ డబ్బు ముఖ్యమని తీసుకుంది.

ఆ తర్వాత అబార్షన్ చేయించుకునే విషయం మీద చాలా సంఘర్షణ పడింది. స్నేహితురాలు, డాక్టరు అయిన రాధతో చర్చించింది. మొత్తానికి ఆమె ప్రమేయం లేకుండానే ఆ గర్భం పోయింది.

ఈ మొత్తం విషయంలో దుర్గ ప్రవర్తన గురించి రచయిత ఎక్కువగా రాస్తాడు. ఎప్పుడైతే ప్రేమ మోసంగా మారిందో దుర్గ అందరి పట్ల దురుసుగా పొగరుగా వ్యవహరించడం మొదలు పెట్టింది. తల్లిదండ్రులు, అమ్మమ్మ, మేనమామ అందరూ కూడా తన డబ్బు కోసం చూసేవాళ్లేనని ఎవరికి ప్రేమలు లేవని అన్నీ ఇచ్చి పుచ్చుకునే వ్యాపార సంబంధాలనే కఠినమైన ఆలోచనలోకి వెళ్లిపోయింది.

చివరికి ఆమె ఆ ఇల్లు, ఆ ఉద్యోగం, ఆ ఊరు కూడా వదిలి సెంట్రల్ గవర్నమెంట్‌లో స్టెనో ఉద్యోగం సంపాదించుకుని హైదరాబాద్ వెళ్ళిపోయింది ఇది నవల్లో మొదటి భాగం.

రెండో భాగంలో దుర్గ స్టెనో ఉద్యోగం చేస్తూ ఉన్న కాలంలో ఆమెకు కొంత విశ్రాంతి దొరికింది.

దాని గురించి రచయిత ఇలా రాస్తాడు “అప్పటికీ ఇప్పటికీ పని వేరు, అలసట వేరు, తీరిక వేరు, ఒంటరితనం వేరు. వీటన్నింటికీ ఆలోచనల మీద తగినంత ప్రభావం ఉంటుంది ఈ విధంగా దుర్గ ఆలోచనలు విస్తరిస్తూ వచ్చాయి” అంటాడు.

ఇంతకాలం ఆమె తన ప్రవర్తన్ని ఏదో విధంగా సమర్థించుకోవడానికే ఆమె ఆలోచన పనికొచ్చింది. తన నిర్లక్ష్యం, మొండితనం, ధూర్త లక్షణం అవన్నీ సరి అయినవే అని సమర్థించుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు ఒక చిత్రమైన సంఘటనతో ఆమె ఆలోచనలో కొంత మార్పు వచ్చింది.

ఆమెను మోసం చేసిన మాధవరావు నుంచి ఆమెకు వచ్చిన ఉత్తరం దానికి కారణం. మాధవరావు తండ్రి ధర్మం తెలిసినవాడు. కొడుకు ఒక అమ్మాయిని మోసగించిన కారణంగా, తన మాట ప్రకారం ఆమెను పెళ్లి చేసుకోలేదని, దానికి శిక్షగా మాధవరావుని తనకు దూరంగా ఉంచాడు.. చివరకు చనిపోయినప్పుడు తనను తాకరాదని చెప్పేడు. కొడుకు అపరకర్మలకు కూడా పనికిరాడు అని చెప్పి దూరంగా ఉంచాడు.

తర్వాత కాలంలో తండ్రి తాలూకు ఈ ధార్మికమైన ప్రవర్తనను తెలియజేస్తూ మాధవరావు దుర్గకు ఉత్తరం రాశాడు. తాను ఆయనకు ధార్మికమైన వారసుడిగా పనికిరానని ఆయన చేసిన తిరస్కారం గురించి చెప్పాడు. అందువల్ల ఆయన మరణించిన వార్త నీకు తెలియజెయ్యడం బాధ్యత అనిపించిందని ఉత్తరం రాశాడు.

ఆ పెద్దమనిషి తాలూకు ప్రవర్తన దుర్గ లోని కఠినత్వాన్ని కొంత కరిగించింది. అలాంటి సందర్భంలో ఆమెకు స్నేహితురాలు రామలక్ష్మి పెళ్ళిలో గిరి అనే ఒక సామ్యవాద భావాలున్న వ్యక్తి పరిచయం అయ్యాడు. గిరి అదివరకే దుర్గ గురించి రామలక్ష్మి ద్వారా విని ఉన్నాడు. ఆమె చేసిన పనులన్నింటినీ సాహసాలుగా భావించాడు ఆ విధంగా ఆమె పట్ల ఒక ప్రత్యేకమైన అభిమానంతో ఉన్నాడు. ఇప్పుడు ఆమెను పరిచయం చేసుకుని అభిమానించటం, అభిమానాన్ని పైకి చూపించడం మొదలుపెట్టాడు. దుర్గ అప్పటికే కొంత కఠినత నుంచి బయటకి వచ్చి ఉందేమో అతని అభిమానాన్ని ప్రేమగా భావించి తిరిగి రెండోసారి అతన్ని ప్రేమించడం మొదలుపెట్టింది. గిరికి అప్పటికే పెళ్లయింది. కానీ ఆ విషయం దుర్గకి తెలియదు. గిరి చెప్పలేదు కానీ దుర్గ విషయం తన భార్యకి చెప్తూ వచ్చాడు. ఆమె దుర్గని ఇంటికి తీసుకురమ్మని కూడా అడిగింది. కానీ గిరి సగం సగం సామ్యవాద భావజాలాల్లో అస్పష్టంగా ఉన్న వ్యక్తి. ౭తన పెళ్లి విషయం తన వ్యక్తిగతమని, అది ఎదుటివారికి చెప్పనవసరం లేదని అనుకున్నాడు. దుర్గ లాంటి వాళ్ళు పెళ్లి చేసుకోకూడదని వాళ్లు సంఘానికి సమాజానికి అవసరమని గిరి అభిప్రాయపడ్డాడు. దుర్గతో సామ్యవాద భావాల గురించి చెప్పేటప్పుడు ఇలా అంటాడు

“పుస్తకాలు రెండు రకాలు కొన్ని కథల రూపంలో నిజం చెబుతాయి. నిజంగా నాకు కథారూపం కన్నా నిజాన్ని నేరుగా చెప్పేవే ఆసక్తికరంగా ఉంటాయి. నేను అలాంటి పుస్తకాలు కొన్ని చదివాను” అన్నాడు. అన్నాక గిరికి మళ్ళీ అనుమానం వచ్చింది, “తను పుస్తకాలు అన్ని చదివాడా ఆ పుస్తకాల గురించి చెప్పుకుంటున్నదే విన్నాడా? విన్నదానితో చదివిన వాటిని అన్వయించుకుంటున్నాడా” అని.

అంటే గిరికి తను దుర్గకి చెప్పే మాటలు పట్ల స్పష్టత లేదు. కానీ ఆమె అతను ఇచ్చిన పుస్తకాలన్నీ చదివి ఆ దిశగా ఆలోచించటం మొదలుపెట్టింది. మొదలుపెట్టింది కానీ అంతకన్నా గిరి తనను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని ఎదురుచూస్తూ ఉంది. ఇంతలో గిరి మామగారు వీళ్ల సంబంధం? విషయం అంతా తెలుసుకుని గిరికి తెలియకుండా దుర్గ ఇంటికి వెళ్లి. ధూర్తంగా, పరుషంగా ఆమెను తిట్టి, హెచ్చరించి వచ్చాడు. అప్పుడే దుర్గకి గిరి వివాహితుడన్న విషయం తెలిసింది. అంత ఘోరమైన విధానంలో తెలిసింది.

ఇలా రెండోసారి కూడా మోసపోయేనని తెలిసి తట్టుకోలేక ఎలకలమందు తాగింది. తీరా చేసినపని అర్థమయి కంగారు పడి, భయపడి, ఇంట్లో నుంచి బయటకు వచ్చి అందరికీ అరిచి చెప్పి పడిపోయింది. కృష్ణారావనే యూనియన్ నాయకుడు ఆ సమయంలో అక్కడున్నాడు. ఆమెను చేతుల మీద ఎత్తుకొని తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చి, వైద్యం చేయించి బతికించాడు. విషయం తెలిసి హాస్పిటల్‌కి తల్లి, తండ్రి, గిరి, అందరూ వచ్చినా దుర్గ ఎవరితోనూ మాట్లాడలేదు.

అందర్నీ అసహ్యించుకుంది. కృష్ణారావు గిరితో మాట్లాడి దుర్గ గురించి సమాచారం తెలుసుకున్నాడు. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన దుర్గ తనను రక్షించిన కృష్ణారావే తనకి ఆప్తుడని అతనితోటే ఉంటానని అడిగింది. కృష్ణారావు తన ఇంటికి తీసుకొచ్చాడు.

ఆమె కృష్ణారావుని చూసి అతని వల్లనే తనకు జీవితంలో భద్రత లభిస్తుందని భావించింది. అంతేగాక అతని పట్ల ఆమెలో నిలవలేని కాంక్ష కూడా రగిలింది.

అతన్ని పెళ్లి చేసుకోమని కోరి అతనితో జీవితం మొదలు పెట్టింది. మాంసాహారి, శ్రామికుడు అయిన కృష్ణారావు నిక్కచ్చిమనిషి. గిరి ద్వారా, డాక్టర్ ద్వారా దుర్గా మానసిక పరిస్థితి తెలుసుకున్న అతను దుర్గను దేనికీ బలవంతం చేయటం గాని బతిమాలటం కానీ చేయకుండా తన ఇష్టానికి తనను వదిలిపెట్టాడు. దుర్గ కూడా కృష్ణారావు మంచితనానికి, అతని నిక్కచ్చితనానికి అతన్ని ఇష్టపడుతూ తనలోని కాంక్షను కూడా అతని ద్వారా తీర్చుకుంటూ, ఉంది.

అతని కుటుంబ సభ్యులను కూడా వాళ్ళ అలవాట్లతో సహా భరించడం అలవాటు చేసుకుంది.

కానీ మొదటినుంచి ఆమెది మనిషి మనిషికి మధ్య ఉన్నది లాభనష్టాల వ్యాపార సంబంధమే అని గట్టిగా నమ్ముతూ వచ్చింది. చివరకు కృష్ణారావుతో కూడా తనకున్నది వ్యాపార సంబంధం అని ఆమె ఉద్దేశం. చివర్లో కూడా ఆమె ఇలా అంటుంది

“నాకు ఎవరి మీద నమ్మకం లేదు. పూర్తిగా చచ్చిపోయింది. ఈ బూర్జువా వ్యవస్థలో దోపిడీయే ప్రధానం. పీడనే ప్రధానం. ఎవరికి ఎలా వీలైతే అలా దోచుకుంటారు. ఇప్పటికిప్పుడు ఈ శరీరంతో నువ్వు చేసిన పని ఏమిటి? వ్యాపారం. నా డబ్బు, కాకపోతే నా పని, అదే కాకపోతే నా ఉనికి, ఏదో ఒకటి నీకు అవసరం. నాకూ అంతే నీ శరీరం కావాలి. తుచ్చమైన కామం తృప్తి పడాలి. అందుకే ఈ డబ్బుని, నా పనిని, అన్నింటిని మదుపు పెడుతున్నాను.

ఈ సమాజంలో హెచ్చుతగ్గులు ఉన్నంతకాలం, ఆస్తులు ఉన్నంతకాలం, ఆధారపడటాలు ఉన్నంతకాలం, స్వచ్ఛమైన బంధాలకు స్థానం లేదు. మనం పుచ్చిపోయాం. బాగు చేయటానికి వీలు లేనంతగా మన రక్తం పాడైపోయింది”. ఇవన్నీ విన్నాడు కృష్ణారావు.

కృష్ణారావు ఇలా అనుకున్నాడు.

“ఇదంతా మధ్య తరగతి వాడి మతిభ్రమణం. ఏ ప్రయత్నం చేయలేని అశక్తత, ఆశ, గందరగోళం.

కానీ శ్రామికుడికి ఈ గందరగోళం ఉండదు. శ్రామికుడి ప్రయత్నాలే శక్తి. మార్పుకి పునాది” అనుకుంటాడు. ఇది రచయిత ఉద్దేశం కావచ్చు.

ఇలా ఉండగా దుర్గ గర్భవతి అయింది. పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడు పాలకి ఏడుస్తూ ఉంటే వాడికి పాలు కుడిపే ప్రయత్నంలో ఆమెకు కుటుంబ సంబంధాలలో ఉండే త్యాగం అంటే ఏమిటో అర్థమైంది. తల్లి ప్రేమ అర్థం అయింది. తల్లినీ, తండ్రినీ అర్థం చేసుకోగలిగింది. వారివి వ్యాపార సంబంధాలని ఎన్నోమార్లు తూలనాడినా తిరిగి వారు ఈ పరిస్థితుల్లో తన దగ్గరికి రావడం లోని వారి ప్రేమను అర్థం చేసుకోగలిగింది. తల్లిగా మారిన తర్వాత దుర్గకు మానవ సంబంధాలు అర్థమైనట్టుగా నవల ముగుస్తుంది.

2

ఈ నవలలో రచయిత కమ్యూనిజం గురించి కొంత చర్చ చేశారు. అది మధ్యతరగతి నుంచి వచ్చిన గిరి వేపు నుంచి, శ్రామిక నాయకుడైన కృష్ణారావు వేపు నుంచీ కూడా జరిగింది.

ఇందులో ఈ మూడు భాగాలలోను ముగ్గురు మగవాళ్ళు దుర్గకి తటస్థపడ్డారు. వాళ్లు ముగ్గురూ మూడు రకాలైన వాళ్ళు.

మొదటి వాడు మాధవరావు సాధారణమైన వ్యక్తి, అవకాశవాది. కానీ అతని తండ్రి ధర్మబుద్ధి కలిగినవాడు. కొడుకు చేసిన వెధవ పనికి పరిహారంగా జీవితమంతా అతనిని దూరంగా పెట్టాడు. వారసత్వం రెండు రకాలుగా ఉంటుందని పెద్దల పాటించిన ధర్మాలు తిరిగి పాటించడం కూడా పిల్లలకు వారసత్వంగా సంక్రమించాలని, పిల్లలు దాన్ని అలవర్చుకోవాలని ఆయన నమ్మకం. తరతరాలుగా వారి కుటుంబం అలానే ఉంటూ వచ్చింది. ఇదంతా ఆయన చనిపోయిన తర్వాత మాధవరావు దుర్గకి రాసిన ఉత్తరంలో ఉంటుంది.

దుర్గ మాధవరావు తండ్రి వ్యక్తిత్వం ద్వారా తర్వాత కాలంలో ఎంతో కొంత ప్రభావితమైంది.

ఇక రెండవ వ్యక్తి గిరి. మధ్య తరగతి పురుషుడు. కొంత కమ్యూనిస్టు భావజాలం కలిగిన వాడు.

కానీ అతను ఆ భావజాలాన్ని సమకాలీన సమాజంతో పోల్చుకుని చూసుకున్నప్పుడు అతనికి చాలా సందేహాలు కలిగాయి. పైగా అతనిది ఎక్కువ శాతం వినికిడి జ్ఞానం. కొంత మాత్రమే పుస్తక జ్ఞానం. ఈ సగం సగం అవగాహనతో అతను దుర్గను సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మార్చగలనని భావించి, అలా చేయాలని చూశాడు. కానీ దుర్గ ఒక సమర్ధుడైన మగ తోడు కోసం, అతని ప్రేమ కోసం ఎంతో ఆరాటంతో ఎదురుచూస్తూ ఉంది. అతను చదవమన్న పుస్తకాలన్నీ చదివి కొంత జ్ఞానం సంపాదించినా ఆమె దృష్టంతా అతన్ని పెళ్లి చేసుకుని, సంసార జీవితం సాగించడం మీదనే ఉంది. చివరకు అది విఫలమైంది.

ఇక మూడో వ్యక్తి శ్రామిక వర్గానికి చెందినవాడు. శ్రమజీవి. కార్మిక వర్గానికి నాయకుడు. అతని దగ్గర శ్రమ శక్తి గురించి గానీ, వర్గ చైతన్యం గురించి కానీ ఎంతో కొంత స్పష్టమైన స్పృహ ఉంది. దుర్గకి వీటి వేటితోను సంబంధం లేదు. కృష్ణారావు లాంటి సమర్థుడైన ఆరోగ్యవంతుడైన వ్యక్తి సాహచర్యం ఆమెకు కావాలి. అది లభించడం కోసం మళ్లీ ఆమె తన డబ్బును, తన ప్రేమను, పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తున్నానని భావించింది. ఇందులో ఆమెకు కావలసిన లాభం చేకూర్తోందని కూడా సంతృప్తి పడింది.

ఇలా నవల్లోని మూడు భాగాల్లోనూ ముగ్గురు పురుషులు ఒకరి కంటే ఒకరు ఉన్నతమైన స్పష్టమైన ఆలోచనలతో దుర్గ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం. మొదటి నుంచి దుర్గ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, చదువు ఉద్యోగం ద్వారా సొంత సంపాదన లోకి వచ్చాక ఒక ఆధిపత్య, అహంకార ధోరణిని పెంచుకుంటూ వచ్చింది. ఇంట్లో తల్లిదండ్రులు తన సంపాదనను తీసుకోవడం మొదలుపెట్టగానే వాళ్ళందరి మీద అధికారం చలాయించడం సాగించింది. ఇంతలో ప్రేమ వైఫల్యం, మోసం జరగడంతో దానిని సరిదిద్దలేదని తండ్రి మీద కోపం తెచ్చుకోవటం మొదలుపెట్టింది. ఇక అప్పటి నుంచి ఆమె ఈ కుటుంబ సంబంధాలు అన్నీ కూడా లాభనష్టాల వ్యాపార సంబంధాలే అని గట్టిగా నమ్మింది. దానివల్ల ఆమెలో దురుసుతనం, అహంకారం మరింత పెరిగాయి. అవి చివరిదాకా పెరుగుతూనే వచ్చాయి, కానీ తగ్గలేదు. ఎప్పుడైతే ఆమెకు ఆమె గర్భం నుంచి ఒక పిల్లవాడు పుట్టాడో, వాడి మీద ఆమెకు కారణం లేని ఒక ప్రేమభావం కలిగిందో అప్పుడు ఈ సంబంధాల్లో ఉండే మరొక సున్నితమైన కోణం అర్థమైంది. దాని ద్వారా తల్లి, తండ్రి మిగిలిన రక్తసంబంధీకులు అర్థమైయ్యారు. సమాజంలో గాని, కుటుంబంలో గానీ సంబంధాలు కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణలో ఉన్నా, అవి పూర్తి వ్యాపార సంబంధాలు కావని వాటిలో మానవీయ కోణం తప్పనిసరిగా ఉంటుందని ఆమె తల్లిగా మారేక అర్థం చేసుకుంది.

అయితే ఈ కథలో నాకు కొన్ని సందేహాలు కలిగాయి. వివేకం లేని ఆర్థిక స్వేచ్ఛ వలన దుర్గ ఇలా మారింది అని ఒకచోట రచయిత, లేదా ఒక పాత్ర అంటారు. ఇది స్త్రీలకేనా పురుషులకు వర్తించదా? . ఒకవేళ ఇదే కథలో పురుషుడిని పెట్టి రాస్తే అది ఎలా ఉండేది? అంటే సహజంగా సంపాదించే పురుషులంతా ఇంచుమించుగా దుర్గ లాగే ప్రవర్తిస్తారా? ప్రవర్తిస్తారని అనుకోవాలి.

ఇంకొక విషయం దుర్గకి కావలసింది ఆమె సంపాదన ముట్టుకోకుండా, సంపాదించి పెడుతూ ,ఆమెను సుఖ పెడుతూ ఉండే హీరో లాంటి మగవాడు కావాలి.

మధ్యలో కొన్ని సామ్యవాద సిద్ధాంతాల మాటలు చిలక పలుకుల్లా పలుకుతూ ఉంటుంది.

మొత్తం మీద రచయిత దుర్గ లాంటి పాత్ర ను సృష్టించి ఆమె ద్వారా ఏం చెప్పాలనుకున్నారు? ఎలాంటి స్త్రీ అయినా తల్లిగా మారితే విలువలు తెలుసుకుంటుంది అనా? లేకపోతే మృదువుగా మారుతుంది అనా? అన్నది నా సందేహం.

ఒకవేళ దుర్గకి కృష్ణారావు తారసపడక ఆమె జీవితమంతా అలాగే ఉండిపోతే ఏమైఉండేది?ఇది ఒక ప్రశ్న.

ఈ సందర్భంగా చలం గారు స్త్రీ పుస్తకంలో చెప్పిన కొన్ని మాటలు గుర్తొస్తున్నాయి.

“స్వేచ్ఛ రెండు రకాలు. బయట స్వేచ్ఛ, లోపలి స్వేచ్ఛ. లోపలి స్వేచ్ఛ ఉన్నవాడికి బయట స్వేచ్ఛతో పనిలేదు. అతనికి అంతా స్వేచ్ఛే. బయటి స్వేచ్ఛ కావాలంటే ముఖ్యమైన అవసరాల్లో ఒకటి డబ్బు. లోపలి స్వేచ్ఛ లేకుండా తన ఆశలతో, చీకట్లతో, కోర్కెలతో గొలుసు కట్టుకున్న మనిషిని బయట స్వతంత్రం ఇంకా బానిసను చేస్తుంది.”

ఇవి చలం గారి మాటలు. ఇవి స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా సమానమే.

దుర్గ లాగే ఈ మాటలు మాధవరావు కూడా వర్తిస్తాయి. దుర్గ మోసపోయింది కానీ, మాధవరావు మోసగాడు. మోసపోవటం నేరం కాదు. మోసగించడం నేరం. గిరి కూడా ఒకరకంగా ఈ అంతరంగ స్వేచ్ఛ తెలియని వాడే. అందువల్లనే దుర్గను తనకు తెలియకుండానే మోసగించాడు. ఒక్క కృష్ణారావు ఎంతో కొంత ఇటువంటి స్వేచ్ఛను తెలిసో తెలియకో కలిగి ఉన్నవాడు. కాబట్టి అటువంటివాడు తనతో ఉన్న వారికి కూడా ఆ స్వేచ్ఛ ఏమిటో తెలియ చెప్పగలడు అని అనుకోవచ్చు.

మొత్తం మీద నలభై ఏళ్ల తర్వాత మళ్లీ ఈ నవల చదివితే రచయిత ఈ నవల రాయటం వెనకాల కారణం ఏమై ఉంటుందా అని ఆలోచించవలసి వచ్చింది. బహుశా మానవ సంబంధాల్లో వ్యాపారం ఉన్నా కూడా త్యాగం కూడా ఉంటుంది, దాన్ని కూడా మనం గుర్తించవలసి ఉంది, అని చెప్పడానికేమో అని అనిపించింది.

వివిన మూర్తి గారి రచనలు ఎంతో ఆలోచనాత్మకమైనవి ఐనా కూడా వేగంగా చదివించే లక్షణం కలవి. వారికి నా అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here