శూన్యం నుండి శూన్యంలోకి చేసే మానవ ప్రయాణం శామ్యూల్ బెకెట్ WAITING FOR GODOT

0
11

[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]

[dropcap]W[/dropcap]AITING FOR GODOT శామ్యూల్ బెకెట్ రాసిన నాటిక. కేవలం రెండు దృశ్యాలలో ఉండే ఈ నాటకం ఇంగ్లీషులోని నాటక ప్రపంచంలో ఒక ప్రభంజనంలా వచ్చింది. దీన్ని మొదట ప్రెంచి భాషలో 1949లో రాసారు రచయిత. తరువాత ఆయనే 1954 లో ఆంగ్లంలోకి దీనిని అనువదించారు. అప్పటి నుండి ప్రపంచంలో ఎన్నో వేదికలపై ఇది ప్రదర్శనలు జరుపుకుంది. కొన్ని సందర్భాలలో రచయితే ఈ నాటకానికి దర్శకత్వం వహించారు కూడా. ఇంగ్లీషులో గొప్ప నాటకాలలో ఇది ఒకటిగా చెబుతారు.

శామ్యూల్ బెకెట్ ముందు నవలా రచయిత. అప్పుడప్పుడు మాత్రమే ఆయన నాటకాలు రచించేవారు. అయితే ఈ ట్రాజికామెడి తరువాత వీరికి నవలా రచయిత కంటే కూడా నాటక రచయితగానే సాహిత్యలోకంలో ఎక్కువ పేరు వచ్చింది. ఈస్ట్రగొన్, వ్లాదిమిర్ అనే ఇద్దరు ప్రధాన పాత్రల మధ్య నడిచే సంభాషణ ఇది. గోడోట్ అనే ఒక వ్యక్తి కోసం వారు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ఎదురుచూపుల మధ్య ప్రపంచంలోని ఎన్నో విషయాలపై చర్చిస్తూ ఉంటారు. చాలా సేపు ఎదురు చూసిన తరువాత ఒక అబ్బాయి వచ్చి గోడోట్ తనని పంపించాడని, ఆ రోజు తనకు రావడం కుదరలేదని, మళ్ళీ మరుసటి రోజు అదే ప్రదేశంలో వారిని కలుస్తానని చెప్పమన్నాడని సమాచారం ఇస్తాడు. నాటకంలోని మొదటి అంకం ఇక్కడ అయిపోతుంది. మరో అధ్యాయంలో మళ్ళీ ఇద్దరూ అక్కడే గోడోట్ కోసం ఎదురు చూస్తూ కనిపిస్తారు. మళ్ళీ ఎన్నో విషయాలపై చర్చ నడుస్తుంది. మళ్ళీ మరో అబ్బాయి వచ్చి ఆ రోజు కూడా గోడొట్ రావట్లేదని మరుసటి రోజు వచ్చి ఎదురుచూడమని చెప్పడంతో నాటకం ముగుస్తుంది.

ఈ నాటకాన్ని విశ్లేషకులు ఎన్నో రకాలుగా విశ్లేషిస్తారు. ఆ రెండు పాత్రల మధ్య నడిచే సంభాషణలో ఎన్నో సింబాలిజమ్స్ కనిపిస్తాయి. అప్పటి రాజకీయ, సామాజిక పరిస్థితుల పట్ల చాలా ఆలోచనలు కలగజేస్తాయి. చూసే ప్రేక్షకులు వారి స్థాయిని బట్టి నాటకాన్ని అన్వయించుకోవచ్చు. చాలా భాగం రచయిత ప్రేక్షకుల విజ్ఞతకు, ఊహకు వదిలేస్తారు. ఒకసారి రచయితను గోడోట్ అంటే దేవుడా, ఇది దేవుని కోసం ఎదురుచూపా అని అడిగారు ఒకరు. ఇంగ్లీషులో GODOT పదంలో GOD ఉన్నందువలన అలా ఊహించుకోవచ్చా అన్నది అతని ప్రశ్న. దానికి రచయిత ఇచ్చిన జవాబు, “ఈ నాటకాన్ని నేను ముందు ఫ్రెంచి భాషలో రాసాను. ప్రెంచిలో దేవుడిని DIEU అని సంభోధిస్తారు. కాబట్టి ఇది నేను దేవుని కోసం ఎదురుచూపు అన్న అర్థంలో రాసాననుకోవడం సరి కాదు” అని జవాబిచ్చారు.

రచయిత ఈ నాటకంలో పాత్రలకు పెట్టిన పేర్ల ద్వారా ఒక విశ్వమానవ భావనను కలిగించే ప్రయత్నం చేసారు. వ్లాదిమర్ అన్నది రష్యన్ పేరు, ఈస్త్రగొన్ అనది ప్రెంచి పేరు. అలాగే తరువాత వచ్చే లక్కీ అనే సేవకుడి పేరు ఇంగ్లీషు వారిది అయితే అతని యజమాని అయిన పోజో పేరు ఇటాలియన్ భాషలోనిది. ఇలా నాలుగు దేశ ప్రజల మధ్య నానుతున్న పేర్లను తీసుకుని వారిని ఒక చోట కలిపి ఈ నాటకానికి ఒక యూనివర్సల్ టచ్ ఇచ్చే ప్రయత్నం రచయిత చేసారు. అందువలన ఇది సమస్త మానవుల ఎదురుచూపుగా అన్వయించుకోవచ్చు.

పోజో లక్కీ ఇద్దరూ కూడా వ్లాదిమర్ ఈస్త్రగోన్ ఉన్న చోటకు వస్తారు. పోజో యజమాని అయినా నౌఖరు పై విపరీతంగా ఆధారపడే వ్యక్తి. అతనిలో యజమానిననే అహంకారం ఉన్నా నౌకరు లేకుండా ఉండలేని ఒక అభద్రతా భావం కూడా కనిపిస్తూ ఉంటుంది. అతను లక్కీని ఒక తాడుకి కట్టివేసి తీసుకొస్తాడు. అతను స్వయంగా ఏ పని చేయడు. అతని సూచనలను బట్టి లక్కీ అన్ని పనులు చేసుకుంటూ వెళతాడు. యజమాని చెప్పకుండా అతనేదీ చేయడు. ఇలా అ ఇద్దరూ ఒకరైపై మరొకరు ఆధారపడి జీవిస్తూ కనిపిస్తారు. లక్కీ తనతో యాభై సంవత్సరాలుగా ఉన్నాడని అతన్ని చూడడమే విసుగ్గా ఉందని తనకు అందుకని అతన్ని అమ్మేయాలని తాను అనుకుంటున్నానని పోజో వ్లాదిమర్‌కు ఈస్రగోన్‌కు చెబుతాడు. వారి సంభాషనలో పోజో పాలు పంచుకుంటాడు. అక్కడ విశ్రమించి తిని మళ్ళీ అతి కష్టం మీద ప్రయాణమవుతాడు. ఈ లోపు జీవితం పట్ల తన అభిప్రాయాలు చెబుతాడు. అందులో ఆలోచన కన్నా ఒక రోటీన్‌ని స్వీకరించిన నిర్వికారభావం కనిపిస్తుంది.

రెండో అద్యాయంలో మళ్ళీ పోజో లక్కీ వచ్చినప్పుడు పోజో గుడ్డివాడుగా కనిపిస్తాడు. లక్కీ వినికిడి శక్తి కోల్పోతాడు. ఈ రెండో అధ్యాయం మరుసటి రోజు కాకపోవచ్చన్న సూచనతో అక్కడ ఉన్న ఒక చెట్టు మొదటి అద్యాయంలో పూర్తిగా ఎండిపోయినట్లు కనిపిస్తే ఈ రెండవ అధ్యాయంలో దానిపై కొన్ని ఆకులు కనిపిస్తాయి. అంటే అలా ప్రతి రోజూ వ్లాదిమర్ ఈస్త్రోగోన్లు ఎదురు చూస్తూనే ఉన్నట్లు అర్థమవుతుంది. మొదటి అద్యయంలో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్న పోజో లక్కీ ఇక్కడ గుడ్డీ చెవిటి వారుగా కనిపిస్తారు. అంటే ఈ రెండూ అధ్యాయాల మధ్య కొన్ని వారాలు లేదా కొన్ని నెలలు గడిచి ఉండవచ్చు అన్న దాన్ని రచయిత చెప్పీ చెప్పనట్లు చూపిస్తారు.

ఈ నాటకాన్ని విశ్లేషిస్తూ ఒక విశ్లేషకుడు ఎదురుచూపు లేకపోతే జీవితమే లేదు అన్న భావన కలిగించే నాటకం ఇది అని చెప్తారు. ప్రపంచం అన్ని వాస్తవికతలకు దూరమై, గందరగోళంగా ఉన్నదన్నదానికి ఈ పాత్రల లోని గందరగోళం సూచిస్తుంది అన్నది మరొకరి వాదన. జీవితం అంటే శూన్యం నుంచి శూన్యం వైపుకు చేసే ప్రయాణం. ఈ నాటకం అదే సూచిస్తుంది అని కూడా చెప్పవచ్చు. WAITING FOR GODOT లో ఈ శూన్యత కనిపిస్తుంది. మన జీవితంలో ఎన్నో ఎదురుచూపులు. ఇవాళ కాకపోతే రేపైనా మనం కోరుకున్నది మనకు దొరుకుతుంది అనే ఆశ, ఈ ఆశల మధ్య జరిగే ఊగిసలాటలో ప్రపంచం మనకిచ్చే అనుభవాలు కొన్ని. అవి కొన్ని సార్లు మనవి కావు అనిపిస్తాయి. కాని మనమే వాటిని అనుభవిస్తాము. మనవి కాని వాటిని అనుభవిస్తూ, మనకు కావల్సిన దాని కోసం ఎదురు చుస్తూ గడిపే ఈ జీవితమే మానవుడు ఈ భూమిపై ఆడే నాటకం. ఆ నాటకాన్ని విశ్లేషిస్తే అంతా శూన్యతే… ఈ నాటకంలోని ఆ శూన్యత ఎందరో మేధావులను ఆకర్షించింది. ఆలోచించజేసింది.

వ్లాదిమర్ చాలా లావుగా ఉంటాడు. ఈస్త్రగోన్ బక్కగా బలహీనంగా, అపరిశుభ్రంగా ఉంటాడు. ఒక సందర్భంలో అతనితో వ్లాదిమర్ అంటాడు. “కాస్త ఆలోచించు ఇప్పటి దాకా జీవితంలో నువ్వేదీ పరిపూర్ణంగా ప్రయత్నించలేదు. నేను కొద్దో గొప్పో పోరాటం చేసాను. నువ్వా స్థితికి ఇంకా రాలేదు.”

ఈస్త్రగోన్ ఒక చోట తన కాలికి చిన్నవయిన షూలను ధరించి ఇబ్బంది పడుతూ వాటిని కాలు నుండి వేరు చేయడానికి శ్రమ పడతాడు. అప్పుడు షూలపై విసుగు చూపిస్తాడు. వ్లాదిమర్ ఆది చూసి తన కాలులో ఉన్న తప్పును కప్పి పుచ్చుకోవడానికి బూట్లను తిడుతున్న మూర్ఖుడు అని ప్రేక్షకులకు ఈస్త్రగోన్‌ను పరిచయం చేస్తాడు. మనం కూడా ఎన్నో సార్లు మన తప్పిదాలకు చూట్టూ ఉన్న పరిస్థితులను, మనుష్యులను కారణంగా చూపించి జీవిస్తున్నాం అన్నది గుర్తు చేసే ప్రయత్నం ఇది.

మరో చోట పోజో అంటాడు “ఎంత ఎక్కువగా మనుష్యులను కలిస్తే నాకు అంత సంతోషం. ఎంత ఎక్కువ స్వార్థం ఉన్న వ్యక్తిని కలిస్తే నా అనుభవాలు అంత గొప్పగా, నేను నేర్చుకున్న పాఠాలు అంత ఉన్నతంగా, మేధోవంతంగా ఉంటాయి అని. మరో చోట వ్లాదిమర్ అంటాడు “అసలు మనం సంతోషంగా ఉన్నది లేనిది మనకు తెలుసా” అని అతనితోనే ఈస్త్రగోన్ “మనం ఒకే ప్రయాణం చేయడానికి తయారు కాబడలేదు” అని అంటాడు.

మనుష్యులుగా మనకేం కావలి, ఈ ప్రపంచం నుంచి ఏం తీసుకోగలగాలి?మన ప్రయాణం ఎటు ఎవరితో, మన గమ్యం ఏంటీ, లక్ష్యం ఏంటి అన్న విషయాల పట్ల ఒక అవగాహన లేకుండా తృప్తి లేని మన జీవితాలు మారాలంటే ఎవరో రావాలని వారి కోసం నిరంతరం ఎదురు చూస్తూ ఉంటాం. ఈ నాటకంలో గోడోట్ కోసం చూస్తున్న ఇద్దరికీ గోడోట్ ఎవరో తెలీదు కాని అతన్ని కలిస్తే తమ జీవితాలలో గొప్ప మార్పు వస్తుందని నమ్ముతారు. మనం కూడా అలాంటి నమ్మకంతోనే ఎదురుచూస్తూ ఉంటాం ఏదో ఆశిస్తూ ఉంటాం. నిరంతరం వెతుక్కుంటూనే ఉంటాం.

వ్లాదిమర్ మానవ సంబంధాల గురించి ప్రస్తావిస్తూ ఇలా అంటాడు “మన భావాలు మన నియంత్రణలో ఉండవు. నేను చూడు… నీ లోటును అనుభవించాను. అలాగే నువ్వు లేని ఆ లోటులో సంతోషంగానూ ఉన్నాను.”

అతను ఈస్ట్రొగోన్‌కి అక్కడి ప్రకృతి అందాలను చూపించే ప్రయత్నం చేసినప్పుడు ఈస్ట్రగోన్ అంటాడు. “నా జీవితం అంతా నేను మట్టిలో కొట్టుకుంటూ జీవించాను. నువ్వు అందాన్ని చూడమంటున్నావు. ఇది ఎలా సాద్యం” అతనే మళ్ళీ అంటాడు “నిన్న సాయంత్రం మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అందులో పెద్ద విషయాలేమీ లేవు. మనం అలాగే అర్ధ శతాబ్దం గడిపేసాం. ఏదో ఒకదాన్ని కనుక్కుని, అది మనకోసం అని నమ్మి, మనం జీవించే ఉన్నాం అని మనల్ని మనం నమ్మించుకుంటూనే రోజుల్ని గడుపుతున్నాం. ఇదేనా జీవితం అంటే” వ్లాదిమర్ అంటాడు “ఈ నిముషం మనమే ప్రపంచం, మనలోనే సమస్త మానవాళి ఉంది.” ఈ మాటల ద్వారా ఈ అంతులేని నిరీక్షణ యుగయుగాలుగా మానవ సమూహం చేస్తూనే ఉంది అన్న అర్థాన్ని కల్పిస్తారు రచయిత.

పోజోని అతనెలా గుడ్డివాడయ్యాడొ చెప్పమని అడిగినప్పుడు అతను ఇలా అంటాడు “ఒక రోజు నిద్ర లేచాను. నాకేమీ కనపడలేదు. అదృష్టం లాగే నా చూపు నాకు అందకుండా పోయింది” మానవ ప్రపంచంలో అదృష్టం ఆడే నాటకాన్ని రచయిత ఇలా దెప్పి పొడుస్తూ వివరిస్తారు. ఈ నాటకం పై స్టేజీ వర్ణన గురించి కూడా ఎన్నో వ్యాఖ్యానాలున్నాయి. గంటర్ అండర్స్ అనే విశ్లేషకుడు ఆ స్టేజీ పై ఉన్న చెట్టు సమాజానికి ప్రతీక అని దానికి ప్రతి మనిషి శవంగా వేలాడుతూ తనను తాను ఆహుతి చేసుకుంటున్నాడనే ఉద్దేశంతో ఆ చెట్టుని అలా పెట్టడం జరిగిందని చెబుతాడు. లక్కీ మెడలోని తాడు పోజో చేతులో ఉంటుంది. ఆ తాడు ఎలా లక్కీని నియంత్రిస్తుందో పోజోను అలాగే కట్టిపడేస్తుంది. అంటే సేవకుడు, యజమాని ఇద్దరు ఒకరికొకరు బానిసలే ఈ మానవ ప్రపంచంలో. ఎవరూ ఎవరికీ యజమాని కారు. పూర్తిగా ఎవరూ స్వతంత్రులు కారు. ఇది హెగెల్ ప్రతిపాదించిన మనవ సంబంధాల సిద్దాంతాన్ని దృవీకరిస్తుంది అంటారు మరో విశ్లేషకుడు. వ్లాదిమర్ అంటాడు తమకు ఎదురు చూడడం ఒక అలవాటయిందని. అలవాటు కోసమే ఎదురు చూసే స్థాయికి తమ జీవితాలు వచ్చాయని. ఈ ఎదురు చూపులు లేకపోతే తమకు జీవితమే లేదని. ఈ ప్రపంచంలో మనిషి జీవితంలోని నిరంతర అన్వేషణను రచయిత ఇలా చిత్రించారని మరో విశ్ళేషకుడి భావన.

ఈ నాటక శైలి ఇందులోని సంభాషణలు చాలా రోజులు గుర్తుండిపోతాయి. ప్రపంచంలో ఎన్నో ప్రదర్శనలు జరిగిన ఈ నాటకం ఎక్కడ ప్రదర్శించబడినా ఆయా దేశ కాల మాన రాజకీయ సామాజిక పరిస్థితుల పరంగా రాసిన నాటకం అది అని అందరూ ఒకే స్థాయిలో ఆదరించడం ఈ నాటకం ప్రత్యేకత. ఇప్పటికీ ఎప్పటికీ ప్రపంచ నాటక చరిత్రలో అతి గొప్ప నాటకంగా పేరు ఉన్న నాటకం శామ్యూల్ బెకెట్ రచించిన WAITING FOR GODOT.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here