[dropcap]క్రొ[/dropcap]త్తగా కాపురానికి వచ్చిన శ్రీలక్ష్మికి ఒక ప్రక్క భర్త దగ్గర బెరుకు, సిగ్గు పోకున్నా మరో ప్రక్క ఏదో అనుమానం ఆమెను పీడుస్తుంది. నోరు తెరిచి భర్త వేణుమాధవ్‌ని అడగాలంటే ధైర్యం చాలడం లేదు. కాని ఎందుకో ఆ రోజు భర్త ఆఫీసు నుండి రాగానే స్నానం చేసి ట్రిమ్‌గా తయారయి అద్దం ఎదుట నిలబడి ఈల వేసుకుంటూ క్రాపు సరి చేసుకుంటూ ఉంటే శ్రీలక్ష్మికి ఒళ్ళు మండిపోయింది. తయారు కావడం పూర్తి అయినాక బీరువా తీసి కొంత డబ్బు జేబులో పెట్టుకొని, ఈల వేసుకుంటూ మరోసారి అద్దం దగ్గరకు వచ్చి, తన ప్రతిబింబం చూసుకొని లక్కీ అంటూ స్టయిల్‌గా వంట ఇంటిలోకి అడుగులు వేసాడు. మంచం మీద కూర్చుని భర్త చేష్టలన్ని పరిశీలిస్తున్న శ్రీలక్ష్మి తను ఆగదిలో కూర్చున్నట్లు కూడా చూడకుండా భర్త వంట ఇంటిలోకి వెళ్ళడం ఒళ్ళు మండిపోయింది.
వంట ఇంటిలో నుండి తిరిగి బెడ్ రూమ్‌లోకి వచ్చి “ఏమిటోయ్ ఇక్కడ కూర్చుని, నేను నీ కోసం వంట ఇంటిలోకి వెళుతున్నాఊరుకున్వావే? కొంపతీసి దేవిగారికి నా మీద కోపం రాలేదు కదా” అన్నాడు నవ్వుతూ వేణుమాధవ్.
“ఊహఁ… కోపం కాదండి, చెప్పరాని సంతోషంగా ఉంది” అంది హృదయం భగ్గున మండుతుంటే శ్రీలక్ష్మి.
“దేనికోయ్” అన్నడు నవ్వుతూ వేణుమాధవ్!
“మీలాంటి బుద్దిమంతుడు నాకు భర్త అయినందుకు” అంది వ్యంగ్యంగా శ్రీలక్ష్మి.
“ఏమిటి లక్కీ! నిజంగానే నా మీద నీకు కోపం వచ్చినట్టుంది. వాచీ వైపు చూసి మైగాడ్ టైమ్ అయిపోయింది. లేటయితే అక్కడ…”
“కొంపలంటుకుపోతాయి వెళ్ళండి. మీకు… మీకు ఇప్పుడే చెబుతున్నాను… నన్ను లక్కీ గిక్కీ అని పిలిచి ఇంకా బాధపెట్టకండి…. నేను…. చాలా దురదృష్టవంతురాలిని. అన్‌లక్కీఫెలోని…” గొల్లుమంది శ్రీలక్ష్మి.
“మైగాడ్! ఏమిటోయ్!…. ఏడుస్తున్నావా? సారీ లక్కీ…. టైమ్ అయింది… ఒకటి మాత్రం నిజం! నేను నీకెప్పుడు అన్యాయం చేయను… అన్నట్లు నేను రావడం లేటయితే కంగారుపడకు. ఓ.కె.” అని హడావిడిగా వెళ్ళిపోయాడు.
భర్త ప్రవర్తనకు నిలువునా నీరయిపోయింది శ్రీలక్ష్మి. ఆడది ఏం కోరుకుంటుందో దానికే తను దూరం అయింది. క్రొత్తగా కాపురానికి వచ్చిన తను భర్త సన్నిధిలో ఒంటరితనాన్ని, తల్లిదండ్రులను, చెల్లి తమ్ముడిని మరిచిపోవడానికి ప్రయత్నించాలి అనుకుంది. పుట్టింట్లో అందరూ ఆ మాటే అన్నారు. “పుట్టింటి వాళ్ళను తలచుకొనే తీరిక నీకెక్కడ ఉంటుంది శ్రీలక్ష్మీ, మీ ఆయన సన్నిధిలో ఎవరు నీకు గుర్తురారులే ఇక్కడే ఈ కన్నీళ్ళు” అని మేనత్త హాస్యమాడతుంటే అందరూ గొల్లున నవ్వారు.
“మీ శ్రీలక్ష్మిది ఒంటిరి కాపురం. అస్తమానం మమ్ములను తలచుకొని బెంగ పెట్టుకోకుండా దాని కాపురంలో అది లీనమయిపోవాలి. అల్లుడుగారు బుద్దిమంతులు. ఏరికోరి చేసుకున్నారు. నా కూతురు కంట తడి పెట్టకూడదు” అని ఆవిడ కళ్ళల్లో నీళ్ళు రావడం గుర్తు వచ్చింది శ్రీలక్ష్మికి. ‘అమ్మా… మీ అల్లుడు నువ్వు అనుకున్నంత బుద్దిమంతుడు కాదమ్మా…. సాయంకాలం అయ్యేటప్పటికి టింగురంగడిలా తయారయి రోడ్డున పడే మనిషి… నా జీవితం కాలిపోయింది అమ్మా…. నేను ఈ నరకకూపంలో ఉండలేను…. చూస్తూ అటువంటి మనిషితో కాపురం చేయలేను. నాకు…. నాకు అన్యాయం చేయను అని ఆ మనిషి చెప్పడంలో ఎంత అర్థం ఉంది… అటు సాయకాలం అయ్యేటప్పటికి దానింటికి వెళ్ళకుండా ఉండలేరున్నమాట. ఇటు తనూ కావలన్నమాట. ఇంతకన్నా నరకం ఏ ఆడది భరించగలదు…’ కళ్ళ నుండి నీళ్ళు కారుతుంటే గువ్వలా సోఫాలో ఒదిగిపోయింది శ్రీలక్ష్మి.
“ఏంటోయ్!…. అదోలా ఉన్నావ్?” అని దగ్గరకు తీసుకోబోయాడు వేణుమాధవ్.
రయ్ మని దూరం జరిగింది శ్రీలక్ష్మి. “దయుంచి నన్ను… నన్ను మీరు తాకవద్దు” అని పిచ్చిదానిలా అరిచింది శ్రీలక్ష్మి.
ఒక్క నిముషం ఆశ్చర్యంగా చూసాడు శ్రీలక్ష్మి వైపు వేణుమాధవ్. మరు నిముషం అర్థమయున వాడిలా….
“సారీ ల…క్ష్మీ!… నిన్ను…. నిన్ను… నేను బాధ పెడుతున్నాను. ఆ విషయం నాకు తెలుసు… కాని… ఎంత ప్రయత్నించినా సాయంకాలం అయ్యేటప్పటికి నా మనసు అటే లాక్కువెళ్ళిపోతుంది…. నాలో ఉన్నది ఈ ఒక్క బలహీనతను పోగట్టుకున్నాకే అసలు పెళ్ళి చేసుకోవాలి అని అనుకున్నాను. కాని ఈ బలహీనత నుండి తొందరగా బయటపడలేకపోతున్నాను… మా నాన్నగారు నీ ఫోటో తీసుకు వచ్చి చూపెట్టి నా అభిప్రాయం అడిగారు. మా నాన్నగారికి మీ కుటుంబం, ముఖ్యంగా నీ అందచందాలు, నడవడి ఆకట్టుకున్నవి. ఇక నా సంగతి సరే సరి. నెల్లాళ్ళలో ముహుర్తాలు ఉన్నాయి బాబు అని ఆయన అంటే అన్నాళ్ళు ఎందుకు నాన్నా అనేసాను… నా తొందరపాటు చూసి మా నాన్నగారు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు… లక్ష్మీ…. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నా ప్రాణం… నువ్వు లేకండా నేను ఒక్క రోజు ఉండలేను… కాని…. నా మనసుని కళ్ళెం వేసి వెనక్కు లాగుతున్న ఈ ఒక్క బలహీనత నుండి బయటపడి నీ తోటిదే లోకం క్రింద మారే రోజులు దగ్గిరలోనే ఉన్నాయి. అప్పటి దాక దయించి నన్ను అపార్థం చేసుకోవద్దు ప్లీజ్” అంటూ వీధిలకి అడుగులు వేశాడు.
భర్త మాటలకు నిలువునా నీరయిపోయింది శ్రీలక్ష్మి. ‘ఛ!… ఛ!… ఎంత డైరెక్టుగా చెప్పాడు. అతనికున్న బలహీనత నుండి ఎప్పటికయినా బయటపడతాడా ఈలాంటి మనిషితోనా తాను కాపురం చేస్తుంది? ఏ స్త్రీ భరించ లేని నిజాన్ని దర్జాగా చెప్పాడు. మై గాడ్! ఇంత నికృష్టమైన మనిషితో తను ఒక్క నిముషం కలిసి ఉండలేదు’ అని రయ్ మని మంచం మీద నుండి శ్రీలక్ష్మి లేచి వేణుమాధవ్ రావడం చూసి కోపంగా తల తిప్పుకొంది పక్కకు. కళ్ళల్లో వస్తున్న కన్నీటిని బలవంతంగా ఆపుకొంది.
“లక్కీ!… స్టూటరు స్టార్ట్ కావడం లేదు. రిక్షాలో వెళుతున్నాను. తలుపు వేసుకో” అన్నాడు వేణుమాధవ్.
ఏదో ఆలోచన తళుక్కున మెరిసింది శ్రీలక్ష్మిలో. గాబరగా తాళం వేసి, పిచ్చిదానిలా వీధిలోకి పరిగెత్తింది. అప్పటికే వేణుమాధవ్ రిక్షా ఎక్కడం చూసి, అక్కడే ఉన్న రిక్షా ఎక్కి, “ఏయ్ రిక్షా ఆ ముందు రిక్షా వెనకాలే పోనీయ్” అంది శ్రీలక్ష్మి.
ముందు రిక్షా వెళ్ళి ఒక బిల్డింగ్ ముందు ఆగింది. రిక్షాలో ఉన్న శ్రీలక్ష్మి భర్త ఆ బిల్డింగ్‌లోకి వెళ్ళడం చూసి ఆశ్చర్యపోయింది. ఛ… ఛ… తన భర్త ఎంత పబ్లిక్‌గా ఆ ఇంట్లోకి వెళుతున్నాడు. భగవంతుడు తనకెంత అన్యాయం చేసాడు.
“ఏమిటమ్మా? తమ లాంటి వోళ్ళు ఈ టయిములో ఇలాంటి సోటికి రావడం మంచిది కాదమ్మా. పెద్దోడిని సెబుతున్నాను ఇనుకో తల్లి…. ఒక్కపాలి ఈ సోటికి వచ్చినోళ్ళు మళ్ళా మళ్ళా రాకుండా ఉండనేరు” అన్నాడు.
“తాతా!… నువ్వు…నువ్వు ఇంకేం మాట్లాడకు. నేను భరించలేను. ఒక్క నిముషం ఉండు…. ఇప్పుడే వచ్చేస్తాను….” అని గబగబా అడుగులు వేయసాగింది శ్రీలక్ష్మి.
“ఏం చేస్తావు తల్లి! అక్కడ సూడడానికి, ఏముంటుంది తల్లి? అట్టాగే కూకుంటాను” అన్నాడు రిక్షావాడు.
తడబడుతున్న అడుగులతో గుమ్మం వరకు వెళ్ళి లోపలి దృశ్యాన్ని చూసి అచేతనంగా నిలబడిపోయింది. అది క్లబ్…. హాలులో బిలియర్డ్స్, పింగ్ పాంగ్ టేబిల్ కనిపించాయి. ఒక ప్రక్కగా పెద్ద టేబుల్, ఆ టేబిల్ చుట్టూ వేణుమాధవ్‌తో పాటు కొంత మంది వ్యక్తులు కూర్చని ఉన్నారు. వేణుమాధవ్ కార్డ్స్ కలుపుతూ కనిపించాడు.
“ఏంటోయ్ మాధవ్ అదోలా ఉన్నవ్? అన్నాడో వ్యక్తి.
“ఓరేయ్ రామం!…. నాకు రోజూ ఇక్కడకు రావడం చాలా బాధగా ఉంది రా! నా భార్య క్రొత్తగా కాపురానికి వచ్చింది. ఆవిడకు అన్యాయం చేస్తున్నాను అన్న బాధ నా మనసుని రోజు దహించువేస్తుందిరా” అన్నాడు వేణుమాధవ్.
“అన్యాయం ఏముందిరా! నీకు పేకాట ఆడడం అంటే ఇష్టం…. రోజూ ఆడడానికి క్లబ్‌కి వస్తున్నావ్!”
“నోరు ముయ్యరా! ముమ్మాటికి నేను ఆవిడకు అన్యాయం చేస్తున్నాను. నేను ఎక్కడికి వెళుతున్నానో తెలియక శ్రీలక్ష్మి బాధపడుతుంది. అలా అని నేను ఆవిడతో సాయంకాలం అయ్యేటప్పటికి పేకాట లేకుండా ఉండలేను అని సిగ్గు విడిచి చెప్పలేకుండా ఉన్నాను…” అన్నాడు బాధగా వేణుమాధవ్.
“అలా ఎన్నాళ్ళూ దాస్తావురా? నేను చూడు ఒక్క అరగంట ఆలశ్యంగా ఇంటి నుండి బయలుదేరాను అనుకో, మా ఆవిడ దిక్కుమాలిన పేకాటకు ఈ రోజు వెళ్ళడం లేదా అంటుంది” అన్నాడు మరో వ్యక్తి.
అతని మాటలకు అందరూ గొల్లున నవ్వారు.
“మా ఇంట్లో అయితే మా పెద్దాడు నాన్నా టైము అయింది. ఈ రోజు ఇంకా క్లబ్‌కి వెళ్ళలేదు అంటాడు” అన్నాడు పేకముక్కలు వరుసగా పెట్టుకుంటూ ఇంకో వ్యక్తి.
“ఈ జోకు విన్నావురా రామం, ఈ మధ్య మా ఆవిడ ఎప్పుడూ పేకాటలో డబ్బులు పోగొట్టుకోవడమేనా, పేకాటలో గెలిస్తే గుడికి వస్తాను అని దణ్ణం పెట్టుకోండి అంది” అన్నాడు నవ్వుతూ మరో వ్యక్తి.
అందరూ మరో సారి గొల్లున నవ్వారు.
“మాధవ్! మీ ఆవిడకు పేకాట రోజూ ఆడకపోతే ఉండలేను అని చెప్పేయ్ గురు” అన్నాడు రామం.
“లేదురా! నేను చెప్పి ఆవిడను బాధ పెట్టలేను. నిజం చెప్పాలంటే దీని అంతటకీ కారణం మా నాన్నగారు. చిన్నప్పటి నుండి ఉగ్గపాలతో కంపెనీ కోసం నాతో పేకాట ఆడేవారు. కాలేజీ హాస్టల్‌లో నా రూమ్‌మేటు పేకాటగాడు. ఇక ఉద్యగంలో జాయిన్ అయినాక…” వేణుమాధవ్ మాట పూర్తికానే లేదు…
“మేమందరం పేకాట గురువులం” అన్నారు అక్కడు వ్యక్తులందరూ నవ్వుతూ…
“రమేష్!… నేను ఈ బలహీనత నుండి బయటపడడానికి ప్రయత్నిస్తున్నానురా… నాకు వెనకాల అంతో ఇంతో ఆస్తి ఉంది కాబట్టి సరిపోతుంది అవే మరొకరయితేనా ఈ నెల జీతం మూడు వంతులు పేకాటలో పోయింది” వేణుమాధవ్ మాటలకు కోపంగా చూసాడు ఈశ్వరరావు.
“చాల్లేరా మాధవ్ నీ మాటలు… పెళ్ళికి ఏడాది ముందు నుండి పేకాట మానడానికి ప్రయత్నిస్తున్నావ్! పెళ్ళి నాటికి పేకాట మొఖం చూడనన్నావ్. ఒక పూట భోజనం లేకున్నా ఉండగలం కాని పేకాట లేకుండా ఉండలేంరా నా మాట విని చెప్పేయ్ మీ ఆవిడతో” అన్నాడు రామం.
“కరెక్టుగా చెప్పావురా రామం. ఈ జన్మలో మనం ఈ పేకాట లేకుండా బ్రతకలేం, కోడి పలావుకి అలవాటు పడ్డ వాడు పప్పు అన్నం తినలేనట్లు.”
“ఇప్పుడు కోడి పలావుకి, పప్పు అన్నానికి, పేకాటకి సంబంధం ఏమిటిరా… అయినా ఈ సామెత ఎక్కడ వినలేదు” అన్నాడు ఈశ్వరరావు.
“లేదురా, ఈ మధ్యన మనోడికి పేకాటలో తెగ డబ్బులు వస్తున్నాయి కదూ, హుషారులో క్రొత్త సామెతలు తయారు చేస్తున్నాడు అది వాడి స్వంతం” అన్నాడు రామం.
తనని వాళ్ళు ఎక్కడ చూస్తారో అన్నట్లు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ రిక్షాలో వచ్చి కూర్చుంది శ్రీలక్ష్మి.
“రిక్షా పోనీయ్ తాతా” అంది.
“వచ్చావా తల్లి!…. ఏం చేత్తాం… అంతా మన చేతుల్లో లేదు. మనసు కట్టుపెట్టుకోకు తల్లీ” అన్నాడు బాధగా రిక్షావాడు.
“లేదు తాతా! నా మనసు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. అన్నట్లు ఇందాక ఏమన్నావ్ మన చేతుల్లో ఏం లేదు అన్నావు కదూ కాని నా చేతుల్లో ఉంది తాతా ఇదిగో ఇరవై రూపాయలు” అంది శ్రీలక్ష్మి రిక్షా దిగుతూ.
“ఇరవైయా? ఎందుకమ్మా అంత డబ్బు. రాను పోను ఎనిమిది ఇవ్వండమ్మా” అన్నాడు.
“లేదు తాతా… ఇరవై రూపాయలు నీకే ఇచ్చాను తీసుకో” అని రయ్ మని పక్కింటి పోర్షను దగ్గరకు వెళ్ళి బెల్లు కొట్టింది శ్రీలక్ష్మి.
ప్రక్కింటి పోర్షను పార్వతి తలుపు తీసి “రా అమ్మా” అంది.
“అన్నయ్యగారు ఉన్నారా?” అంది శ్రీలక్ష్మి.
“నువ్వు ముందు కూర్చో అమ్మా. ఏవండీ మీ చెల్లాయి వచ్చింది” అంది పార్వతి.
“అన్నయ్యగారు, మీకు నేను స్వంత చెల్లలుని కాకపోయినా అంతకన్నా ఎక్కువగా చూస్తున్నారు. నిన్న శ్రావణ శుక్రవారం అని జాకెట్టు, చీర, పసుపు, కుంకం పెట్టారు. ఏ తోబుట్టవులు లేని ఒంటరి వాడిని, నిన్ను చెల్లెమ్మా అని పిలుస్తాను అన్నారు… మరి… మరి… నాకు ఒక చిన్న సహాయం చేయరూ” అంది కళ్ళల్లో నీళ్ళు నిండుతుండగా శ్రీలక్ష్మి.
“ఏమయిందమ్మా? ఎవరు నిన్ను ఏమైయినా అన్నారా చెప్పు. వాళ్ళ రక్తం కళ్ళ చూస్తాను. చెప్పమ్మా” అన్నాడు రంగారావు.
“ఏమిటమ్మా శ్రీలక్ష్మి! మీ అన్నయ్యగారే గాని నేను నీకు సహాయం చేయలేను అనుకున్నావా?” అంది పార్వతి.
“అది కాదు వదినా ఈ నాటకంలో అన్నయ్యది పెద్ద పాత్ర, నీద చిన్న పాత్ర” అంది శ్రీలక్ష్మి.
“అంతేలే అమ్మా మీ నాటకం అంటున్నావ్, నీవు రచయిత్రివి అని వేణుమాధవ్ చెప్పాడు. మీ అన్నయ్యగాని, నేను పెద్ద పాత్ర వేయలేను అని అనుకున్నావా? కాలేజీలో చదువుతున్నప్పడు పెద్ద పెద్ద బరువు పాత్రలు వేసి…”
“ఉష్!… నువ్వుండవే!… భర్తకి నాటకంలో పెద్ద పాత్ర వేయడానికి చాన్స్ వచ్చందని సంతోషించాలి. ఇంతకీ నాటకం పేరు ఏమిటమ్మా? ఎక్కడ వేయాలి? దూరదర్శన్‌కి పంపిస్తున్నావా?” అన్నాడు రంగారావు నవ్వుతూ.
నవ్వాపుకోలేక పోయింది శ్రీలక్ష్మి.
“అబ్బబ్బ… మీ ఇద్దరికి నాటకం వేయాలని మోజు ఉంటే తరువాత వేయిస్తాను, కాని నేను చెప్పిది జాగ్రత్తగా వినండి” అంది శ్రీలక్ష్మి.
ఇద్దరు శ్రీలక్ష్మి చెప్పినది జాగ్రత్తగా విన్నారు.
***
“ఏమండీ ఆరున్నర అవుతుంది టైము. ఈ రోజు బయటకు వెళ్ళరా?” అంది శ్రీలక్ష్మి
ఒక్క నిముషం ఆశ్చర్యంగా శ్రీలక్ష్మి వైపు చూసి “వెళతాను లక్కీ!…. నువ్వేమి అనుకోనంటే నీ డబ్బులు 500లు ఉంటే ఇయ్యి… బ్యాంక్‌లో డబ్బు డ్రా చేయడం మరిచిపోయాను. రేపు జీతాలుగా అనుకున్నాను… కాని ఈలోగా నిన్న అనవసరంగా 1000 రూపాయలు పోగొట్టుకున్నాను” అన్నాడు వేణుమాధవ్!
“ఆ… వెయ్యి రాపాయలు పోయయా? ఎలా పోయాయిండి?” అంది కంగారుగా శ్రీలక్ష్మి.
“ఆ… వెయ్యి రూపాయలు పోగొట్టుకోలేదు. రోడ్డు మీద ఎలాగో పడిపోయాయి. ఇక మీదట జాగ్రత్తగా ఉంటాను. జాగ్రత్త కాదు.. ఇక మీదట అసలు డబ్బులు పడిపోకుండా…. అదే లక్కీ రోడ్డు మీద నడవకూడదు అనుకుంటున్నాను” అని మొఖం మీద పట్టిన చెమటను తుడుచుకున్నాడు.
ఫకాలున నవ్వింది శ్రీలక్ష్మి.
“రోడ్డు మీద నడవకుండా ఎలా నడుద్దాం అనుకుంటున్నారు?” అంది అమాయకంగా మొఖం పెట్టి శ్రీలక్ష్మి.
“అ…. అదే… అదే…. టైము అయింది ముందు అయిదు వందలు ఇయ్యి…. ప్లీజ్ ఏమీ అనుకోవుగా… రేపు ఇచ్చేస్తాను” అన్నాడు వేణుమాధవ్.
“నా దగ్గిర అయిదు వందలే ఉన్నాయి… ప్లీజ్ ఏమీ అనుకోకుండి… నాలుగు వందలు తీసుకోండి. నాకు వంద రూపాయలు కావాలి. ఈ రోజుకి ఎలాగో సర్దుకుంటాను లెండి” అంది వంద రూపాయిలు బీరువాలో పెడుతూ శ్రీలక్ష్మి.
ఆశ్చర్యంగా శ్రీలక్ష్మి వైపు చూసాడు వేణుమాధవ్.
“నీకు వందరూపాయలు ఈ రోజు ఎందుకోయ్… సర్దుకోవడం ఏమిటి లక్కీ?” అన్నాడు.
“ఆ… సర్దుకోవడం అంటే… అదేనండి మీరు తొందరగా వెళ్లి రండి” అంది శ్రీలక్ష్మి.
రాత్రి పది గంటలవుతుండగా వేణుమాధవ్ ఇంటికి వచ్చాడు. బెల్ కొడదామని తలుపు దగర చేయి పెట్టిన వాడు తలుపులు దగ్గరగా వేసి ఉండడం, ఎవరో మనుషులు మాటలు వినపడడం దాంతో తలుపు సందులో నుండి ఆశ్చర్యంగా లోపలికి చూసాడు.
ఎదురుగుండా దృశ్యాన్ని చూసి నిశ్చేష్టుడుయ్యాడు.
ప్రక్కింటి రాంగారావు, శ్రీలక్ష్మి పేకాట ఆడుతూ కనిపంచారు.
“అన్నయ్యా సారీ!… ఈ వంద రూపాయులు తీసుకో…. మిగిలిన నూట యాభై క్రింద ఈ ఉంగరం ఉంచు అన్నయ్యా. డబ్బు ఇచ్చాక ఉంగరం తీసుకుంటాను” అంది శ్రీలక్ష్మి.
“అయ్యో! అవేం మాటలమ్మా, పేకాట అంటే ఏమిటో తెలియని నాకు పేకాట నేర్పించావు. డబ్బుతో ఆడకూడదమ్మా అంటే డబ్బుతో ఆడితేనే థ్రిలింగ్‌గా ఉంటుంది అంటున్నావ్! ఆటలో గెలిచి నీ దగ్గర డబ్బులు తీసుకుంటూన్నప్పుడల్లా సిగ్గుగా ఉంటుంది అమ్మా” అన్నాడు రాంగారావు.
“అదేమిటి అన్నయా, అలా అంటావ్! నాలో ఉన్న బలహీనత ఈదొక్కటే! అమ్మ, నాన్నగారు నాచేత పేకాట మాన్పించడానికి విశ్వప్రయత్నం చేసారు. మా చిన్నాన్న మా ఇంట్లోనే ఉండేవాడు. మా చిన్నాన్నకి పేకాట ఉంటే తిండి కూడా అక్కరలేదు. కాలక్షేపానికి నాతో పేకాట ఆడేవాడు. చిన్నతనంలో ఆ పేకాటకు అలవాటు పడిన నేను, నిజం చెప్పలంటే ఈ వ్యసనానికి పూర్తిగా బానిస అయిపోయాను. ఆయనకు ఎప్పటికప్పుడు చెబుదాం అనుకున్నాను. ఏ మొఖం పెట్టుకొని చెప్పను అన్నయ్యా” అంది శ్రీలక్ష్మి.
“బాధపడకమ్మా బావగారు మంచివాడు. నెమ్మదిగా చెప్పి చూడు” అని తలుపు వైపు చూసిన రంగారావు… “అదిగో బావగారు వచ్చారు, వేణుమాధవ్‌గారు శ్రీలక్ష్మిని ఏమీ అనకండి శ్రీలక్ష్మి చాలా మంచి పిల్ల…” అన్నాడు
నిశ్చేష్టుడై అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి వచ్చాడు వేణుమాధవ్.
కుర్చీలో కూర్చున్న పార్వతి కంగారుగా లేచి, “అన్నయ్యగారూ మా వారు… అదే…. ఈ రోజుకి ఆట… ఏవండి…. మిమ్మలనే ఇంకా అలా చూస్తారు ఏమిటి లేవండి” అంది.
ఏదో తప్పు చేసిన దానిలా తలవంచుకుంది శ్రీలక్ష్మి.
“బావగారూ… మీరు… మీరు… ఇంకోలా శ్రీలక్ష్మి గురించి అనుకోకండి. అమ్మయి బుద్దిమంతురాలు. గుమ్మం దిగి ఎరుగదు. అమ్మాయికి ఈ బలహీనత ఉంది. అన్నట్లు ఈన్నాళ్ళు అమ్మాయితో పేకాటలో గెలిచిన డబ్బు రెండు వేలు వేరే ఉంచాను” అన్నాడు రంగారావు.
“అబ్బబ్బ…. మీరు ఇక ఉండండి…. ఇక్కడ వుండి నేను చెబుతాను… అన్నయ్యగారూ ఆ డబ్బు అలాగే దాచాను. ఆడపడుచు డబ్బు తీసుకుంటే పుట్టగతులు ఉండవు… ఇంకా అలా చూస్తారు ఏమిటండి… తెచ్చి ఇచ్చేయిండి” అంది అప్పుడే అక్కడికి వచ్చిన పార్వతి.
“నువ్వు ఇక ఆపోయి…. చెల్లాయి డబ్బు నాకెందుకు” అన్నాడు రంగారావు.
“అన్నయ్యా ఆటో మనం స్ట్రిక్ట్‌గా ఆడాం. ఈ మధ్య అలవాటు తప్పిపోయి ఓడిపోతున్నాను. నువ్వు క్రొత్తగా అట నేర్చుకున్నా భలేగా ఆడుతున్నవన్నయ్యా. నువ్వు తిరిగి ఇచ్చినా నేను తీసుకోను. మా పుట్టింటి వాళ్ళు ఇచ్చినా డబ్బు…” అని ఏదో గుర్తు వచ్చిన దానిలా “అన్నయ్యా… మీరు… మీరు ఇక వెళ్ళండి” అని తల దించుకొని అడుగులో అడుగు వేసుకుంటూ వేణుమాధవ్ దగ్గరకు వెళ్ళి “ఏవండీ మీకు… మీకు కోపం వచ్చింది కదూ” అంది భయంగా మొఖం పెట్టి.
రంగారావు పార్వతి భయంగా వేణుమాధవ్ వైపు చూసారు.
వేణుమాధవ్ మఖంలో కోపం కొట్టవచ్చినట్లు కనబడసాగింది.
“అన్నయ్యగారికి బాగా కోపం వచ్చినట్టుంది. ముందు మనం వెళితే మంచిదండి…” అంది పార్వతి.
“సరేలే రేపు మాట్లాడుదాం, అమ్మా శ్రీలక్ష్మి తలుపు వేసుకో అమ్మా” అన్నాడు రంగారావు.
“ఏవండీ! నేను…. నేను…. రోజు పేకాట ఆడకుండా ఉండలేనండి… ఎప్పటి నుండో ఈ వెధవ వ్యసనం నుండి బయటపడడాని ట్రై చేస్తున్నాను… ప్చ్!…. కాని మానలేకపోతున్నాను…. నాలో ఉన్న ఈ ఒక్క వీక్‌నస్‌ను మీరు… మీరు క్షమించండి…. ప్లీజ్…” అని తలుపు గొళ్ళం వేయడానికి వెనుతిరిగిన శ్రీలక్ష్మి కెవ్వున అరిచింది.
రెండు చేతులతో శ్రీలక్ష్మిని గాఢంగా కౌగిలించుకొని అమాంతంగా ఎత్తి “హిహ్ పిప్ హిప్ హురే” అని అరుస్తూ గిరగిరా తిప్పసాగాడు వేణుమాధవ్.
“కళ్ళు తిరుగుతున్నాయి… క్రిందకు దించండి… చెప్పండి నన్ను మీరు…” అంది
“క్షమించడం కాదోయ్!… నువ్వు… నాకు నిజంగా చాలా చాలా నచ్చావు. మనల్ని చూసి అందరూ మేడ్ ఫర్ ఈచదర్ అన్నారు కాని… మన ఇద్దరి హాబీస్… అవేనోయ్ వీక్‌నెస్‌లు ఒకటి కావడం చూస్తే ఏమంటారో” అన్నాడు సంతోషంగా వేణుమాధవ్.
“ఏదో ఒకటి అంటారు లెండి… మందు మీరు చెప్పండి… నన్ను క్షమించినట్లేనా?” అంది బుంగమూతి పెట్టి శ్రీలక్ష్మి.
“క్షమించడం ఏమిటోయ్… నువు నాకు బాగా నచ్చావు.. ఐలైక్ యు వేరీ మచ్… రీయల్లీ ఐ థాంక్ టు గాడ్…. రేపటి నుండి మన ఇద్దరం కలసి పేకాట ఆడుకుందాం… ఆఫీసు నుండి ఇంటికి వచ్చాక ఇక ఒక్క అడగు బయట పెట్టను. అన్నట్లు నీ వీక్‌నెస్ గురించి ముందే చెబితే అనవసరంగా ఎదురింటి నక్కగాడికి నువ్వు రెండు వేలు, నేను ఆ వెధవల దగ్గర మూడు వేలు పోగొట్టుకోకుండా ఉండే వాళ్ళం. మన ఇద్దరి డబ్బు హాయిగా మన దగ్గరగా ఉండేది” అన్నాడు.
రాఘవేంద్రరావు పిక్చరులా తను ఆడిన నాటకం సక్సెస్ కావడంతో కళ్ళల్లో నిండుతున్న సంతోషంతో గోడన ఉన్న వేంకటేశ్వరస్వామి వైపు చూస్తూ ‘థాంక్ టు గాడ్’ అనుకంది మనసులో శ్రీలక్ష్మి.