వెడ్ షూట్స్

3
7

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో ₹ 2500/- బహుమతి పొందిన కథ. రచన పి‌. వి. రామశర్మ గారు. ఈ కథకు ప్రైజ్ మనీని అందించిన వారు సంచిక వెబ్ పత్రిక.]

[dropcap]“అ[/dropcap]బ్బాయి అమ్మాయి ఒకరికొకరు నచ్చినట్టున్నారని వాళ్ళని చూస్తేనే అర్థవుతోంది. ఇంక మిగతా విషయాలు మాట్లాడేసుకుందామా?” అని అన్నాడు మారేజ్ బ్యూరో ఇంచార్జ్ మన్మథరావు, ముసిముసి నవ్వుల్తో తమ చేతిలో మొబైల్స్‌లో ఏవో తెగ టైప్ చేసేసుకుంటూన్న కిషన్‌నీ, అతనికెదురుగా కూర్చున్న భవితనీ చూస్తూ.

కిషన్ తండ్రి శ్రీశైలం “అమ్మాయి నచ్చిందేమిట్రా?” అనడిగాడు. తండ్రి మాటలు కిషన్‌కి వినబడినట్లు లేదు. అదే నవ్వు మొహం మొబైల్‌లో ఇంకొంచెం లోపలికి దూర్చేశాడు, గేదె కుడితి తాగినప్పుడు మొత్తం ముక్కు, మూతి కుడితిగోలెంలో ముంచేసినట్టు.

అమ్మాయి తండ్రి భీమశంకరం కూడా “భవితమ్మా! అబ్బాయి నీకు నచ్చాడా?” అనడిగాడు. మొబైల్ లోకంలోనే ఉన్న ఆ భవితకీ తండ్రి మాటలు చెవికెక్కలేదు.

“ఈ మొబైళ్ళు తగలెయ్య! ఎక్కడ చూసినా, సమయం సందర్భం లేకుండా, బురద కనిపిస్తే పంది అందులో పడిపొర్లుతున్నట్టు, ఈ దిక్కుమాలిన మొబైళ్ళు వదిలి చావడం లేదెవరూ!” అని సణుక్కుంటూ, కిషన్ వీపు మీద ఎవరూ చూడకుండా గిచ్చి.. “ఒరే! ఆ దరిద్రపు మొబైల్ చూడ్డం ఆపి, ఆ పిల్లని చూడు. నచ్చిందో లేదో చెప్పు. ఇప్పటికిది నీకు ఇరవైయ్యో చూపు. నీకు ముప్ఫఏళ్ళు ఇంకో రెండ్రోజుల్లో తగలెడతాయి. ఈసారీ ఇది తుస్సుమంటే.. నీ బతుకు ఎప్పటికీ మిస్సయే బస్సే!” అని కొడుకు చెవిలో భ్రమరంలా ఝుమ్మంది తల్లి భ్రమరాంబ.

“అబ్బ!” అని వీపుని తను కూర్చున్న కుర్చీకే అమ్మగిచ్చిన చోట అటుఇటూ రుద్ది, “అమ్మాయి పిచ్చగా నచ్చేసిందే. ఇక మీదే ఆలస్యం” అన్నాడు కిషన్ మొబైల్లోంచి తల పైకెత్తకుండానే. “అసలు నువ్వామ్మాయినెప్పుడు చూశావురా? వచ్చిన దగ్గర్నుండీ ఆ మొబైల్‌లో తలదూర్చుక్కూర్చున్నావు తప్ప!” అనంది భ్రమరాంబ ఆశ్చర్యంగా.

“మీరు మా జాతకాలు నప్పాయని ఈ పెళ్లిచూపులు ఫిక్స్ చేయగానే, నేను భవీ.. అదే ఆ అమ్మాయి భవిత వెంటనే ఫోన్లో పరిచయాలుచేసేసుకుని, వాట్సాప్ చాట్లు మొదలెట్టేసాం. ఇక్కడికిరాగానే ఫ్లాష్‌లా ముఖాముఖీ చూసేసుకుని, ఇందాకటినుండీ ఇంకా బోల్డు కబుర్లు ఈ వాట్సాప్‌లో చాటుకుంటున్నాం.” అన్నాడు కిషన్.

“వార్నీ! అప్పుడే ముద్దుపేరు భవీ అని కూడా పెట్టేశావేంట్రా?” అని ఆశ్చర్యపోయింది భ్రమరాంబ.

అటువైపు ఆ అమ్మాయిని కూడా ఆమె తల్లి దాక్షాయణి ఎవరూ చూడకుండా వీపు మీద రక్కి అబ్బాయి నచ్చాదోలేదో త్వరగా చెప్పవే అని చెవిలో గుసగుసలాడితే, ఆ పిల్ల కూడా కెవ్వుమనబోయి తమాయించుకుని, “ఓకే మామ్! ఐ లైక్ కిస్, ఐ మీన్ కిషన్.” అని తల్లితో చెప్పింది.

ఆవిడ కూడా వెర్రిమొహం వేసుకుని, ‘వీళ్ళిద్దరూ ఒకర్నొకరు ఎప్పుడు చూసుకున్నారూ? ఎప్పుడు నఛ్చేసుకున్నారూ? ఏమిటో ఈ మాయదారి పెళ్లి చూపులు, ఇప్పుడే అలా చూసిందో లేదో.. కిస్సు అని ముద్దుపేరు కూడానూ!’ అనుకుంటూ భ్రమరాంబ దగ్గరకొచ్చి “వీళ్ళిద్దరూ ఒకరికొకరు నచ్చేశార్టండీ. ఇకమిగతా విషయాలు..” అంది చనువుగా భ్రమరాంబ చేయి పట్టుకుంటూ.

మేరేజ్ బ్యూరో మన్మథరావు మాట్లాడుతూ, “ఆహా! భేషైన సంబంధం సుమండీ. అబ్బాయి, అమ్మాయి ఎప్పుడూ మొబైల్ లోకం లోనే ఉంటారు. ఇక సంసారంలో ఏ మాటలు, వాదనలూ, గొడవలూ ఉండవు. నిశ్శబ్ద కాపురం అంటే వీళ్ళదే!” అన్నాడు.

“చాల్లేవయ్యా, అస్తమనూ మొబైల్లోనే ఉంటే ఉద్యోగాలు, సంసారం ఏం అక్కర్లేదా? ఏదో ఈ సంబంధం కుదిర్చేసి, కమీషన్ కొట్టేద్దామనే యావ తప్ప నీకింకో పన్లేనట్టుంది” అన్నాడు శ్రీశైలం కోపంగా మన్మథరావుతో.

“ఏదో సరదాకన్నాడులెద్దురూ. వదిలేయండి. వాళ్ళిద్దరికీ నచ్చితే, మనకింకేం కావాలి చెప్పండి శ్రీశైలంగారు”  అన్నాడు భీమశంకరం. అతనికి ఈ సంబంధం తుస్సుమంటే.. మళ్ళీ కూతురుకి సంబంధాలు వెతికే ఓపికపోయింది. భవిత బొద్దుగా ఉండడంతో చాలా సంబంధాలు వెనక్కెళ్లిపోయాయి. ఈ పెళ్ళికొడుకు కిషన్ కూడా బొద్దుగా ఉండడం, ఇద్దరూ బొద్దూబొద్దే అన్నట్టు చూడచక్కగా ఉంటారని, ఎలాగైనా ఈ సంబంధం వదులుకోకూడదని ఆయన నిశ్చయించుకున్నాడు.

***

అలా పెళ్లి చూపుల అంకం ముగిశాక, మర్నాడు సీన్ పెళ్లిమాటల అంకంలోకి మారింది.

మేరేజ్ బ్యూరో మన్మథరావు ఆధ్వర్యంలో శ్రీశైలం దంపతులు, భీమశంకరం దంపతులు, పెళ్లిమాటలు జరిగాయి. పెళ్లిమాటల్లో భ్రమరాంబ, దాక్షాయణి గార్ల మధ్య కొన్ని విభేదాలు పొడసూపినా, మన్మథరావు గారు, భీమశంకరం గారు వాళ్ళని శాంతపరచి, సర్దిచెప్పి, మొత్తానికి పెళ్లిమాటలు పూర్తయ్యాయనిపించుకున్నారు. త్వరలోనే ముహూర్తాలు పెట్టేసుకుందాం అనుకున్నారు. అలా పెళ్లి మాటల తతంగం పూర్తయిందనిపించుకున్నాక, ప్రీవెడ్ షూట్ ప్రోగ్రామ్ చర్చకి వచ్చింది.

“ప్రీ వెడ్ షూట్‌కి వెళ్ళిరావడం మంచిదే. అది కూడా వాళ్ళ జాతకాలు నప్పడం లాగే, పెళ్లయ్యాక గొడవలు పడకుండా, వాళ్ళు ఎంతకాలం కలిసిమెలిసి ఉంటారో అన్నది తెల్సుకోడానికి ఉపయోగపడుతుంది.” అన్నాడు మన్మథరావు.

“మీరు మరీనీ. గొడవలెందుకొస్తాయండీ? ప్రీవెడ్ షూట్‌కి వెళ్ళినవాళ్ళందరూ గొడవలు పడిపోతున్నారా ఏం!? హాయిగా వెళ్ళి రానీండి.” అని మన్మథరావుతో అంటూ, “ఆ! అయిడియా. ఈసారి ఆ ప్రీ వెడ్ షూట్‌కి పిల్లలతో పాటూ మనం కూడా వెళ్దామండీ. మన పెళ్ళిళ్ళనాటికి ఈ ప్రీ వెడ్ షూట్లూ లేవు, సరైన ఫోటోలూ లేవు, వీడియోలు అసలే లేవు. అసలు హనీమూన్లే లేవూ!” అని దీర్ఘం తీసింది దాక్షాయణి, మగపెళ్ళి వారితో.

“అవునండోయ్ వదినగారూ. మంచి పాయింటే. మనం కూడా వెళ్దాం. అంతే!” అని సపోర్ట్ చేసింది భ్రమరాంబ. అంతకుముందే ఆ కాబోయే వియ్యపురాళ్ళిద్దరూ పోటాపోటీగా అనుకున్నవన్నీ మర్చిపోయారు.

“అదేం కోరిక భ్రమరం. ఆవిడ ఏదో అనడం నువ్వు దానికి ఓకే అనడం. ఈ వయసులో మనం వెళ్తే దాన్ని ప్రీ వెడ్ షూట్ అననరు. పోస్ట్ వెడ్ పోస్ట్‌మార్టం అంటారు” అన్నాడు శ్రీశైలం ఒకింత కోపంగా. భీమశంకరం కూడా ఓ నవ్వు నవ్వాడు సమర్థనగా. మన్మథరావు ఇదెక్కడి ఫిటింగ్ అనుకుంటూ, ఏమనాలో తోచక బుర్ర గోక్కున్నాడు.

“అదేం కుదరదు అన్నయ్యగారూ. మన కాలంలో ఇలాంటి సరదాలే లేవు. ఇప్పుడు తీర్చుకుందాం అంతే! ఒకవేళ మీరు రాకపోయినా, మేమిద్దరం వెళ్ళితీరుతాం” అంది దాక్షాయణి పట్టుదలగా.

ఆవిడ మొండిపట్టుదల తెలిసిన భీమశంకరం నేను నిస్సహాయుణ్ణి అన్నట్టు శ్రీశైలం వైపు చూశాడు.

మనసులో ఇదేదో బాగానే ఉన్నట్టుందే.. అననుకుని.. “ఇదిగో వెళ్తేవెళ్దాం కానీ,, అక్కడ ఈ పిల్లలతో పాటు మనమూ రకరకాల ఫోజుల్లో ఫోటోలు, గెంతుల వీడియోలు, నిన్ను ఎత్తుకుని గిరగిరా తిప్పమనడాలూ అడిగితే ఊరుకునేది లేదు. నాకసలే నడుం నొప్పి” అన్నాడు శ్రీశైలం.

“అవును బావగారు. నిజమే. నాకు మోకళ్లనొప్పులు కూడానూ” అన్నాడు భీమశంకరం.

“సర్లేండి. ఇక ఇప్పుడు మీరు మీమీ రోగాల లిస్ట్ చదవక్కరలేదు” అని భీమశంకరం డొక్కలో ఓ పోటు పొడిచింది దాక్షాయణి. అలాంటిపోటు తనకీ పడకుండా కొంచెం దూరం జరిగాడు శ్రీశైలం. ఇక అంతటితో నోరు మూసుకున్నారు వియ్యంకులిద్దరూ.

***

ఈ విషయాన్ని వెంటనే కిషన్‌కి ఫోన్ చేసి చెప్పింది భ్రమరాంబ. “అదేంటీ! మధ్యలో మీరెందుకూ మాతో.. కావాలంటే మీరు మా పెళ్లి అయ్యాక ఏ తీర్ధయాత్రలకో వెళ్ళండి” అన్నాడు కిషన్ తల్లితో.

“మాకింకా, తీర్ధయాత్రలకు, వానప్రస్థాలకు వెళ్ళే వయసు రాలేదు లేరా. మేమూ మీతో ప్రీ వెడ్ షూట్‌కి వస్తున్నాం అంతే!” అంది భ్రమరాంబ తమ నిర్ణయాలకు తిరుగులేదన్నట్టు.

“ఉండు. భవితో ఓ మాట చెప్పనీ!” అన్నాడు, ఎలా తప్పించుకోవాలోతెలీక.

“నువ్వేం చెప్పక్కర్లే! ఆ అమ్మాయికి వాళ్ళమ్మ చెప్పడం, తను ఓకే అనడం జరిగిపోయాయి. నువ్వింకేం సాకులు వెతక్కుండా, మీరేయే ఊర్లు వెళ్తారో అక్కడ మీతో పాటూ మా నలుగురికీ రూమ్స్ బుక్ చెయ్!” అని హుకుం జారీ చేసింది భ్రమరాంబ.

ఏం చెప్పాలో తెలీక బుర్ర గోక్కుని, “సరే! మళ్ళీ మాట్లాడతా” అని ఫోన్ కట్ చేసి, భవితకి ఫోన్ చేశాడు కిషన్.

“ఏంటి భవీ. మన పేరెంట్స్ మనతోపాటు ప్రీ వెడ్ షూట్‌కి వస్తారట. నువ్వేమో ఓకే చెప్పావట. వాళ్లెందుకు మన మధ్యలో పానకంలో పుడకల్లా..”

“మీ అమ్మానాన్నలని అంటే అనుకోగానీ, మా మమ్మీడాడీలని పుడకలు, పుల్లలు అని అనకు కిస్సూ. ఇప్పుడు మనం వద్దన్నా మా అమ్మ అస్సలు వినదు. నీక్కూడా ఇప్పుడు సందర్భం వచ్చిందని చెప్తున్నా.. మా ఇంట్లో మా అమ్మ మాటంటే మాటే. ఆవిడ మా పాలిట శివగామి. నువ్వు కూడా రేపు పెళ్ళయి మా ఇంటికొచ్చేటప్పుడు మా అమ్మ ఏం పెడితే అది తినాలి. ఏం చెప్తే అది చెయ్యాలి. లేకపోతే నీ పని మహేంద్ర బాహుబలే! జాగ్రత్త.” అని ఓ హెచ్చరిక జారీచేసింది భవిత, కాబోయే మొగుడికి అత్తగారితో భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్తూ.

‘వామ్మో! ఇలాంటి అత్తగారితో ఎలా వేగడం? అసలు నా జాతకం ఈ భవీతో కాకుండా, వాళ్ళమ్మతో మాచ్ అవుతుందో లేదో చూపించుకోవాల్సింది. ఇప్పుడు ఈ మ్యాచ్ వద్దని కాన్సెల్ చేసుకుంటేనో? అమ్మో! ఇప్పటికే ముప్పైలోకి వచ్చి పడ్డాను. ఇప్పుడు పెళ్లి కాకపోతే.. నా బతుకు ప్రతీ స్టేషన్ ఔటర్ సిగ్నల్లో పడిగాపులు పడే లేట్ రన్నింగ్ ట్రైన్ లాగవుతుంది. మళ్ళీ ఎప్పటికీ పెళ్లవుతుందో? ఎందుకొచ్చిన గొడవ! అయినా అత్తగారింట్లో రోజూ ఉంటానా, తింటానా ఏంటీ?’ అనుకుని సమాధానపడ్డాడు.

***

ఇలా ప్రీ వెడ్ షూట్‌కి పెళ్ళికొడుకు కిషన్, పెళ్లికూతురు భవితతో పాటూ వాళ్ళ తల్లిదండ్రులూ వెళ్తున్నారని తెల్సి, వారి వారి బంధువర్గంలో కొందరు, “ఇదేదో బాగుందే చెలీ.. అని పాడుకుని, మేమూ మీతో పాటు వస్తాం, మాకూ ఇలాంటి సరదాలు అప్పట్లో తీరలేదు, మాఖర్చు మేమే పెట్టుకుంటాము” అని సిద్ధపడ్డారు. ఎలాగూ ఇంతమంది చుట్టాలు వెంట పడుతున్నారు కనుక, ఖర్చు కలిసొస్తుందని ఆ రిసార్ట్ లోనే ప్రీ వెడ్ షూట్‌తో పాటు, నిశ్చితార్థం, బరాత్, సంగీత్, మెహందీ లాంటి వన్నీ పెట్టేసుకుందామని వియ్యంకుల దంపతులు ఓ తీర్మానం చేసేసుకుని, ఓ శ్రీశైలం, మంచి ముహూర్తం కోసం శాస్త్రులు గారిని సంప్రదించారు శ్రీశైలం, భీమశంకరం దంపతులు.

‘కాలం మారిపోయింది. ఇలాంటి వెర్రిని ఆపలేం’ అని మనసులోనే మధనపడ్డ శాస్త్రి గారు, ఉన్నంతలో ఓ ముహూర్తాన్ని ఖాయం చేశాడు.

ఇప్పుడు ప్రీ వెడ్ షూట్ల మోజు పెరిగిపోతుండడంతో నగరానికి కొంచెం దూరంగా ఓ ప్రీవెడ్ స్పెషల్ రిసార్ట్ వెలిసింది.. దాంట్లో ప్రీ వెడ్ ఫోటో, వీడియో షూట్లకి కావల్సిన విధంగా, బోట్ షైర్, స్విమ్మింగ్ ఫూల్స్, బురదనీటిలో మొల్లోతు దిగి విన్యాసాలు చెయ్యడాలూ, చెట్లెక్కి తలకిందులుగా వేలాడే వీలూ, ఇంకా కోతులు, కుక్కలు, పిల్లులూ, పందులతోపాటు, రాబందుల్లాంటి పక్షుల్తో కూడా ఫోటోలు దిగడం, గుర్రపుస్వారీ, గాడిదపై ఊరేగింపు లాంటి వికారాలెన్నో ఉన్నాయి. దాంట్లో సూట్స్, రూములు బుక్ చేసుకున్నారు వెళ్లాల్సినవారంతా.

మొత్తానికి అనుకున్న ముహుర్తాన ఓ రెండు బస్సుల జనంతో ఆ ప్రీ వెడ్ రిసార్ట్‌కి బయల్దేరారు.

నిశ్చితార్థం, బారాత్, సంగీత్, మెహందీ ఫంక్షన్లు బాగా జరుపుకుని, ప్రీ వెడ్ షూట్ ముచ్చట్లకి సిద్ధపడ్డారందరూ. అయితే అక్కడే మొదలైయ్యాయి వాళ్ళ పాట్లు. గుర్రపుస్వారీలో భ్రమరాంబకి నడుం పట్టేసింది, దాక్షాయణికి గాడిద వెనక్కాళ్ళతో ఓ తన్నుతన్నడంతో కింది దవడ కదిలి మొహం వాచిపోయింది.. ఇక కూడా వచ్చిన బంధువుల్లో అత్యుత్సాహం ప్రదర్శించిన వాళ్ళు బురదలో దొర్లబోయి, అప్పటికే అందులో ఉన్న పందులు వెంటపెట్టేసరికి బయటపడలేక, బురదలో ఇంకాస్త కూరుకుపోయారు. రాబందులతో సెల్ఫీ దిగబోతే అవి కొందరి చర్మాలు పీకి రుచి చూశాయి. ఇంకొందరు చెట్లెక్కి రకరకాల స్టిల్స్ ఇవ్వబోయి చేతకాక కిందపడి మోకాళ్ళు చేతులు రక్కుకుపోయి గోలపెట్టారు. ఇలాంటివి జరుగుతాయని ముందే ఊహించిన రిసార్ట్ వాళ్ళు, వాళ్ళు అట్టేపెట్టుకున్న ఓ డాక్టర్‌తో ఫస్ట్ అయిడ్ వంటిది చేసి, దానికీ భారీగా ఫీజు లాగేశారు. అసలే నడుంనొప్పి, మోకాళ్ళనొప్పులని ముందే డ్రాప్ అయిన వియ్యంకుంలిద్దరూ మాత్రం సేఫ్ జోన్‌లో ఉన్నారు

ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. భవితకి, కిషన్‌కి వాళ్ళ ఫోటోషూట్ లలో ప్రతీ ఛోటా చాలా వాదనలు జరిగి, అవి చిలికిచిలికి బుడమేరు వరదలా వాళ్ళని ముంచెత్తాయి. చెట్టెక్కి కొమ్మ పట్టుకు ఊగుతున్న పోజులో ఫోటో తీసుకుందాం అని భవిత అంటే ఆ చెట్టెక్కలేక నానా యాతన పడి రెండుసార్లు కింద పడ్డాడు కిషన్.

“హే! చెట్టులెక్కలేవా ఓ కిషనూ, కొమ్మనూగలేవా!” అని కిషన్‌ని ఆట పట్టించింది భవిత.

“ఏదీ నువ్వెక్కు చూద్దాం. ఆ బొద్దు బోల్డు బాడీ నువ్వూనూ!” అని ఛాలెంజ్ చేయడంతో, “నన్ను బొద్దు, బోల్డు అంటావా!” అని భోరుమంది భవిత కాసేపు.

ఆ పిల్లని ప్రసన్నం చేసుకునేసరికి కిషన్ ఎలాగోలా చెట్టెక్కి ఆ కొమ్మలుపుచ్చుకుని గారడీవాడిలా నానా విన్యాసాలు చేసి, బురదగుంటలో పడి దొర్లి, పందుల్తో ఫోజులిచ్చి.. ఇలా నానా తంటాలు పడ్డాడు. ఇక ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ లకి కిషన్ కావలసిన భంగిమల్లో ఫోజులివ్వలేకపోయేసరికి, ఆ ఫోటోగ్రాఫరే భవితని పట్టుకుని స్టిల్స్ ఇచ్చి కిషన్‌కి చూపించేసరికి, కిషన్ ఉడుక్కున్నాడు.

పైగా, “హే! నీకన్నా ఇతనేనయం కిస్” అని భవిత ఆట పట్టించేసరికి ఇంకాస్త కుళ్లుకున్నాడు లోలోన కిషన్.

కోతులతో సెల్ఫీ తీసుకునే సమయంలో ఏ మూడ్‌లో ఉందోగానీ, ఓ కోతి కిషన్‌ని కరిచింది.

“ఏం ఫర్లేదు. వాటికి ఇంజక్షన్ చేయించేసాం. ఇప్పుడు మీకో ఇంజక్షన్ చేస్తాం. మీకేం కాదు!” అని రిసార్ట్ మేనేజర్ భరోసా ఇచ్చాడు. అయినా గానీ, ఏమో, కొన్నాళ్లు పోయాక, ముత్యాలముగ్గులో అల్లురామలింగయ్యలా కిషన్ కోతిలా ప్రవర్తిస్తేనో అనుకుని, “అమ్మా! నాకీ కోతి కిస్సు వద్దే!” అని మొండికేసింది భవిత.

కిషన్ కూడా, “ఇలాంటి కోతి చేష్టల పాన్లు, పెళ్లయ్యాక నాతో ఎన్ని చేయిస్తుందో ఏమో, అయినా ఆ అత్తగారు దాక్షాయణి కూడా దయాదాక్షిణ్యం లేని మనిషని భవీ హింట్ ఇవ్వనే ఇచ్చింది అలాంటప్పుడు నాకీ భవీ వద్దు, తనతో భవిష్యత్తూ వద్దు” అని షూటింగ్ పేకప్ చెప్పిన డైరెక్టర్ లా “ప్రీ వెడ్ షూట్ అండ్ వెడ్డింగ్ కేన్సిల్” అని అరిచాడు.

శ్రీశైలం, భీమశంకరంల గుండెలు గుభేలుమన్నాయి. ‘ఇప్పుడీ ఇద్దరు పెళ్లి వద్దనుకుంటే మళ్ళీ ఎప్పటికి వీళ్ళకి సంబంధాలు కుదురుతాయో? అసలు కుదురుతాయో, కుదరవో ఏం దారి భగవంతుడా!? నేరకపోయి ఈ ప్రీ వెడ్ షూట్ పెట్టుకున్నారు వీళ్ళు. తిన్నగా ఊరుకోకుండా మేం కూడా చుట్టాలతో అమిరిపోయాం. నలుగురిలో ఇదో నగుబాటు’ అని మనసులో మొత్తుకుంటూ, వాళ్ళిద్దరికీ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఈ నచ్చచెప్పే ప్రయత్నంలో భ్రమరాంబ, దాక్షాయణి ల మధ్య పెళ్లిమాటలప్పుడు జరిగిన కొన్ని విభేదాలు మళ్ళీ బయటపడి, వాళ్ళిద్దరూ కూడా నువ్వెంత అంటే నువ్వెంత అని అధికార ప్రతిపక్షాల్లా కలియబడ్డారు. వచ్చిన చుట్టాల్లో కొందరు అదో వినోదంగా చూసినా కొందరు మాత్రం వాళ్ళకి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

ఏది ఏమైనా కిషన్, భవిత మొండిపట్టు పట్టడం, ఇటు భ్రమరాంబ దాక్షాయణి కూడా ఎడమొహం పెడమొహం పెట్టుకోవడంతో చేసేది లేక శ్రీశైలం, భీమశంకరం కూడా మిడిల్ డ్రాప్ చేసిన పేకాట రాయుళ్ళా మొహాలు వేలాడేశారు.

అలా ఆ మేరేజ్ బ్యూరో మన్మథరావు అన్నట్టు, ప్రీ వెడ్ షూట్‌లో వాళ్ళు ఎంతలా ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉంటారు అన్నపరీక్షలో, పెళ్లికొడుకూ, పెళ్లికూతురు మాత్రమేకాక, వియ్యపురాళ్ళిద్దరూ కూడా ఫెయిల్ అయ్యారు. అలా నిశ్చితార్థం దాటి ముందుకువచ్చిన ఆ పెళ్లిసంబంధం కాస్తా కాన్సెల్ అయి, మళ్ళీ వాళ్ళిద్దరి పెళ్లి సంబంధాల వేట మొదటికొచ్చింది. మొత్తంగా కిషన్ భవితల ప్రీ వెడ్ షూట్ మాటేమో గానీ, వాళ్ళ తల్లిదండ్రుల, ఇతర బంధువుల పోస్ట్ వెడ్ షూట్ ముచ్చట మాత్రం కొంత అవస్థల పాలైనా, ఎలాగోలా తీరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here