వెండి డోనిగర్ రెండు పుస్తకాల పరిచయం

1
10

[వెండి డోనిగర్ రచించిన ‘ఆన్ హిందూయిజం’, ‘ది హిందూస్’ అనే పుస్తకాలలోని అంశాలను పరిచయం చేస్తున్నారు డా. కాళిదాసు పురుషోత్తం.]

[dropcap]ఇం[/dropcap]డాలజిస్టు, ప్రొఫెసర్ వెండి డోనిగర్ రచనలు – on Hinduism (2013), The Hindus (2009) – పరిచయం ఇది.

పై పుస్తకాలలో మొదటిది ఇంగ్లీషులోను, రెండోది తెలుగులో (హెచ్.బి.టి. ప్రచురణ, 2014) లభిస్తున్నాయి. రెండు పుస్తకాలు శ్రద్ధగా చదవగినవి.

వెండి డోనిగర్ సంస్కృత భాషలో, ప్రాచీన సంస్కృత సాహిత్యంలో విశేషమైన కృషి చేసి, చికాగో విశ్వవిద్యాలయంలో ప్రపంచ మతాలను గురించి ఎనభయ్యవ పడిలో కూడా పాఠాలు చెబుతున్నారు. ఆమె ఈ పుస్తకాలలో వ్యక్తపరిచిన అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభావం లేకపోవచ్చు గానీ, ఆమె భారతీయ సంస్కృతిని మూలమైన గ్రంథాలను అధ్యయనం చేసిన తీరు మాత్రం నా తలకు కొత్తగా అనిపించింది. ఒక విదేశీయురాలుగా, అన్యమతస్థురాలుగా హిందూ మతంలోని ఆచార వ్యవహారాలను, దేవతల గాథలను, అవతారాలను, పురాణాల్లో ప్రస్తావనకు వచ్చే దేవదానవులు, రాక్షసుల కథలను తన పధ్ధతిలో, దృష్టిలో విశ్లేషించారు. మత గ్రంథాల మీద, మత ఆచారాల మీద అచంచలమైన విశ్వాసం ఉన్నవారికి ఆమె లేవనెత్తిన ప్రశ్నలు కూడా ఊహల్లోకి కూడా రావు, స్ఫురించవు.

వెండి డోనిగర్ తల్లిదండ్రులు అమెరికాకు వలస వచ్చిన యూదు మతస్థులే కాని, గాఢమైన మతవిశ్వాసులు కారు. ఆమె బాల్యం, విద్యాభ్యాసం న్యూయార్కులో గడిచింది. సంస్కృతం, భారతీయ విజ్ఞానం (Indian Studies) లో కృషి చేసి పి.హెచ్.డి పట్టా పొంది, చికాగో విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా 80వ పడిలో కూడా కొనసాగుతున్నారు.

ప్రొఫెసర్ వెండి డోనిగర్ భారతీయ సంస్కృతి మీద అనేక రచనలు చేశారు, పరిశోధనా పత్రాలు సమర్పించారు. మొదట పేర్కొన్న గ్రంథాలే కాక ‘Asceticism & Eroticism in the Mythology of Śiva’, ‘Hindu Myths: A Sourcebook’, ‘The Origins of Evil in Hindu Mythology’, ‘Women, Androgynes, and Other Mythical Beasts’ ఆమె ప్రధానమైన రచనల్లో కొన్ని. ఆమె ఫేస్‌బుక్‌లో సంస్కృత భాష పుట్టుకకు మధ్య ఆసియాతో సంబంధం ఉందని చేసిన చిన్న వ్యాఖ్య ‘సంప్రదాయ రక్షకు’ల బూతుకూతలకు గురైన అనుభవాలతో బాటుగా ఎన్నో భౌతికదాడులు, నిందారోపణలకు గురైనారు.

నేను వెండి డోనిగర్ రెండు పుస్తకాల నుంచి కొన్ని విషయాలు ఈ వ్యాసంలో ప్రస్తావిస్తాను. 3వ శతాబ్దికి చెందిన పతంజలి యోగశాస్త్రం వివిధ రుషులను యోగులని పేర్కొనడం వల్ల యోగశాస్త్రంలో అస్పష్టత ఏర్పడినట్లు ఆమె అభిప్రాయపడ్డారు. యోగశాస్త్రాల్లో స్త్రీ దేహాన్ని చాలా అసహ్యంగా, జుగుప్సాకరంగా వర్ణించారని, యోగశాస్త్రాలన్నీ పురుష దృష్టి నుంచి రాయబడినవని అంటారు. మహాబలిపురం కుడ్య శిల్పాలలో దొంగ సన్యాసులకు, మోసకారులైన యోగులకు ప్రతీకలుగా ఒంటి కాలి మీద తపస్సు చేస్తున్నట్లున్న పిల్లులు, కొంగలు చిత్రించబడ్డాయని వ్యాఖ్యానించారు,

10-12 శతాబ్దుల మధ్యకాలంలో, హిందూ, బౌద్ధ మతస్థులు శాంతియుతంగా జీవిస్తున్న సమయంలో ఒక విధంగా పౌరాణిక లక్షణాలున్న ‘యోగవాశిష్ఠం’ అనే తాత్విక రచన కాశ్మీరు ప్రాంతంలో రచించబడ్డట్లు ఆమె అభిప్రాయపడ్డారు. ఈ పురాణంలో పునర్జన్మకు సంబంధించిన గాథలు చాలా ఉన్నాయి. రుగ్వేదంలో, పునర్జన్మకు సంబంధించి స్పష్టాస్పష్టంగా మాత్రమే ప్రస్తావనలున్నట్లు అంటారు. పురాణాలలో ప్రస్తావించబడిన కాల్పనిక జంతువు ఓగ్రి (ogre, a kind of mythical creature) ఒక బ్రాహ్మణుడి కురూపి భార్యను అపహరించుకొని పోతుంది.

Ahura Mazda లో అసురులు దయాగుణం కలిగిన యక్షి, యక్షిణలు – లేదా శక్తులు. తర్వాత కాలంలో భారతీయ పురాణ గాథల్లో వీరు రాక్షసులుగా, దుష్టశక్తులుగా కనిపిస్తారు. పర్షియా (ఇరాన్) దేశపు పురాణాల్లో, వైదిక సాహిత్యంలో దయాగుణం యక్షులు, యక్షిణులు క్రైస్తవ పురాణ కథల్లో అపకారం చేసే పిశాచాలుగా మారిపోయారని వెండి డోనిగర్ వ్యాఖ్యానించారు.

వేదాంత గ్రంథాల్లో నపుంసకుణ్ణి ‘క్లీబ’ శబ్దంతో వ్యవహరించారు. పుంశ్చలి అంటే కామదాహంతో పురుషుల వెంటపడే ఆడది, కామపిశాచి వంటి స్త్రీ. తాగుబోతు, జూదరి, సర్వ దుర్లక్షణాలు కలిగిన పురుషుణ్ణి ‘కితవ’ శబ్దంతో పేర్కొన్నారు. పురాణ సారస్వతంలో భూమి స్త్రీకి ప్రతీక, ఆకాశం పురుషుడికి ప్రతీక.

రుగ్వేదంలో రుద్రుడి పేరు తప్ప లింగం, శివ పదాల ప్రస్తావన కనిపించదు. ‘శిశ్న’ పదం ప్రస్తావన రెండు రుగ్వేద మంత్రాలలో మాత్రమే వస్తుంది. క్రీ.పూ. 600 నాటికి ఉపనిషత్తుల్లో ‘లింగం’ పదం వాడపబడినా, సాధారణార్థంలో Smoke, fire వలె వాడబడింది, కాలక్రమంలో అది జెండర్‍ని సూచించే పదంగా, తర్వాత సాధారణ అర్థంలో ‘జెండర్’ అని వాడుకలోకి వచ్చింది. క్రీస్తు శకం 300 నాటికి శివుణ్ణి, శివుడి పురుషావయవాన్ని ‘లింగం’ పదంతో పేర్కొనడం కనిపిస్తుంది. తమిళ పెరియ పురాణంలో తిన్నడి కథ వర్ణించబడిందని డోనిగర్ అంటారు.

లింగం సెక్సుకు సంబంధించిన అర్థంలో, అసెక్సువల్‌గా సాధారణ అర్థంలోనూ, రెండు తీరులుగాను భావించబడింది. కురి, గురి పదాలు స్త్రీ పురుష జననేంద్రియాలను పేర్కొనడానికి వాడుకలోకి వచ్చాయి క్రమంగా.

యజ్ఞ యాగాల్లో మానవుణ్ణి, అశ్వాన్ని, ఎద్దును, పొట్టేలు లేదా మేకను బలిచ్చేవారట.

అష్టాదశ పురాణాల్లో విపరీతంగా, మార్పులకు, చేర్పులకు, ప్రక్షిప్తాలకు నెలవైంది స్కాంద పురాణం. ఇందులో ఉన్నన్ని, అమూలకాలు, ప్రక్షిప్తాలు మరే పురాణంలోనూ లేవు.

ఈ పురాణంలో రకరకాల భావజాలాలను చొప్పించారు. పౌరాణికుడికి ఏ పురాణమో గుర్తు రాకపోతే “స్కాందపురాణంలో ఉంటుంది చూడండి!” అనడం పరిపాటయింది. భాగవత పురాణం కూడా ప్రక్షిప్తాలకు నిలయం అంటారు వెండి డోనిగర్. స్థల పురాణాలు, వంశవృక్షాలు, యాత్రాకథనాలు ప్రత్యేకంగా స్థానిక భౌతిక పరిసరాల వర్ణనలలో పరిమితం కాదు. ఈ కథనాలు తరచూ సగం సగం స్త్రీవాద కంఠ స్వరంలో వర్ణించబడ్డాయి. దక్షిణదేశంలో ప్రచారంలో ఉన్న శైవ సిద్ధాంత తత్వం స్కాంద పురాణంలో గోచరమవుతుంది. తప్పులు చేసిన దుర్మార్గుడైన భక్తుడు, పశ్చాత్తాపం ప్రకటించని భక్తుణ్ణి కూడా శివుడు కరుణించినట్లు స్కాంద పురాణంలో చెప్పబడింది. కేదారఖండంలో గుడిగంట దొంగ కథ అటువంటిదే. ఆదిమ దశలోని స్త్రీవాద భావనలు కేదార ఖండంలో గోచరిస్తాయి. ఇంద్రాణి, పార్వతి – స్త్రీ శక్తికి ప్రతీకలని, స్త్రీశక్తిని చూపిన దేవతలని వెండి డోనిగర్ అంటారు. ఈ గాథలో ఇంద్రాణి నహుషుణ్ణి మాయచేసి తప్పుదారి పట్టించడంలో ఉపాయాన్ని తనంతట తానే ఊహించడాని అమె ప్రత్యకంగా పేర్కొన్నారు, మహాభారత కథలో ఇంద్రాణి బృహస్పతి సలహా ప్రకారం నహుషుణ్ణి తప్పుదారి పట్టించినట్లుందని అంటారు. దధీచిని హత్యచేసి అతని వెన్నెముకను తీసుకొనిపోయిన దేవతలను దధీచి భార్య సువర్చల శపించడాన్ని స్త్రీశక్తికి మరొక ఉదాహరణగా డోనిగర్ చూపారు,

ఇతర పురాణాల్లో లేని ప్రత్యేకత స్కాంద పురాణంలో ఉంది, దైవకృపకు స్త్రీలు, పాపులు కూడా అర్హులవుతారు. స్త్రీలు ప్రకృతికి ప్రతీకలుగా ఈ పురాణంలో చిత్రించబడ్డారు.

పురుషుల్లో కామోద్రేకానికి స్త్రీలే కారణమని మనువు తీర్మానించాడు. ప్రపంచ మతాలన్నీ స్త్రీల వల్లే పురుషుల్లో కామోద్రేకం కలుగుతున్నాట్లు పేర్కొన్నాయి. మద్యపానం, దుష్ట సాంగత్యం, భర్తకు దూరంగా ఉండడం, స్వైర విహారం, ఇతరుల గృహాల్లో నిద్రించడం, నివాసం – ఈ ఆరు స్త్రీల శీలం కళంకమవడానికి కారణాలని మనువు అభిప్రాయం. మనువు పురుషులకు కూడా కొన్ని విధి నిషేధాలు విధించాడు. సోదరుని భార్యతో సంగమించకూడదు. తప్పనిసరైతే ఆమెతో ఒకసారి వ్యభిచరించవచ్చట. మహాభారతంలో వ్యాసులవారి కథ ఒక నిదర్శనం. ఈ విధి నిషేధాలు హిందువుల జీవనంలో భాగమై స్త్రీలు, శూద్రులు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను, హక్కులను చాలా వరకు పోగొట్టుకొన్నట్లు, వెండి డోనిగర్ ఆభిప్రాయపడ్డారు.

రుగ్వేదంలో శరణ్యు దేవత ప్రస్తావన ఉంది. సూర్యుడే వివస్వతుడు, ఆయన భార్య త్వస్తి. వీరి కుమార్తె శరణ్యు. ఈమె వివస్వతుణ్ణి పెళ్ళాడి యమ, యమి అనే అమడ పిల్లలకు జన్మనిస్తుంది. త్వస్తి తన స్థానంలో తనవంటి రూపం ఉన్న ఒక స్త్రీని పెట్టి, తాను అశ్వరూపాన్ని, ధరించి పారిపోతుంది. సూర్యుడు కూడా మగ గుర్రం రూపంలో ఆమెను అనుసరించి వెళ్తాడు. ఇద్దరూ అశ్వరూపాల్లో సంగమించగా, అశ్వినీ దేవతలనే అమడ పిల్లలు కలుగుతారు.

రుగ్వేదంలో స్త్రీ మానవి, మరణం ఉన్న మనిషిగా వర్ణించబడింది. ఆమె పెనిమిటి పురుషుడు మాత్రం మృత్యువు లేని చిరంజీవిగా వర్ణించబడ్డాడు.

వివస్వతుడు మానవుడు, శరణ్యు దేవత, immortal. శరణ్యు ప్రతిరూపమైన స్త్రీ మాత్రం మానవి. దేవత అయిన శరణ్యు కంటే మానవి తగినది. ఈ గాథలో శరణ్యు ప్రతిరూపమైన స్త్రీకి శిశువులు కలగరు. శరణ్యు అసలు రూపానికే ఒక పుత్రుడు – మానవ సంతానం యమ జన్మిస్తాడు. అశ్వరూపం ధరించిన సంయోగించిన శరణ్యు, వివస్వతులకు అశ్వినీ దేవతలు – అమడలు జన్మిస్తారు. సగం అశ్వరూపం, సగం మానవరూపంలో జన్మించిన వీరికి మొదట సోమరసం (అమృతం) నిరాకరించబడ్డా, చివరకు ఇవ్వబడింది. వీరు అమరులుగా పేర్కొనబడ్డారు.

శరణ్యు భర్త, బిడ్డ మానవులు (mortals) అనేది స్పష్టం. అనేక పాఠాల్లో (texts) యమ మనుజుడుగా పేర్కొనబడ్డాడు. సూర్యుడు కూడా మర్త్యువే. తన ఏడుగురు సోదరుల వలె కాక, మర్త్యుడుగా అభివర్ణించబడ్డాడు. మాతృగర్భంలో ఉన్నపుడే సూర్యుడు మార్పులు (mutation) పొంది విరూపుడైనట్లు, ఆ శిశువును తల్లి నిరాకరించినట్లు గాథ. యాస్కుని ‘నిరుక్తం’ వ్యాఖ్యలో పై గాథ పేర్కొనబడింది.

స్త్రీలు అమర్త్యులుగా, పురుషులు మర్త్యులుగా రుగ్వేదంలో వర్ణించబడ్డారు. శరణ్యు దేవత ఆకృతి కలిగిన ఆమె వంటి స్త్రీ (hen double) మానవజాతికి తల్లిగా భావించబడుతోంది. ఇరాన్ దేశపు పౌరాణిక సంప్రదాయం ప్రకారం యమ – యమి వావివరుసలు పాటించకుండా శారీరికంగా కలిసినట్లుంది. శరణ్యు- కుంతి, యమ – కర్ణుల మధ్య కొన్ని పోలికలు గోచరిస్తాయి.

మన పూర్వులు తొలి మానవులు వివాహబంధంలో ఇమడని వివాహేతర సంబంధాల వల్ల జన్మించిన వారే. కర్ణుడి ప్రస్తావన రుగ్వేదంలో కూడా ఉంది. కర్ణుడు కూడా ఈ విభజన కిందకే వస్తాడు. తల్లిదండ్రులు, పిల్లలు, దేహవర్ణం గురించిన పురాణగాథలు ఈ తెగకు చెందినవే.

మూలదేవుని కథ ఇటువంటిదే. నేరం బయట పడుకుండా, గుట్టు రట్టు కాకుండా వ్యభిచరించడమే ఈ కథ, (Muladeva and the Brahmin’s daughter). కథాసరిత్సాగరంలోని ఈ కథ ఆరేబియన్ నైట్స్ లోకి కూడా పాకింది. ఈ గాథలన్నింటిలో పురుషులే విధివిధానాలను, మంచీచెడూ తీర్మానించి అమలు చేస్తారు. స్త్రీ తన నేర్పు, చాతుర్యంతో చిక్కుల్లోంచి బయటపడి విజయం చేపడుతుంది. డోనిగర్ శ్రీమహావిష్ణువును మాయావి, trickster అంటారు. ప్రాచీన సాహిత్యంలో సంతాన సౌభాగ్యం (fertility), మన్మథుడు స్త్రీ పురుషుల మీద తన ప్రభావాన్ని ప్రదరించడం సాధారణంగా కన్పించే విషయాలు. ఈ సందర్భంలో శాకుంతల నాటకాన్ని సమీక్షిస్తూ శకుంతలను ‘clever wife’ అని ప్రశంసిస్తూ, నాటకంలో సమస్య పరిష్కారమూ ఆ ఉంగరమేనని, శాకుంతల నాటక రచనా కాలం సుమారు నాలుగో శతాబ్ది కావచ్చని, మహాభారత రచన శ్రీ.పూ. 300 – క్రీశ 800 మధ్యకాలంలో పూర్తయి ఉంటుందని, ప్రజలు తన చర్యను ఆమోదించరని దుష్యంతుడు భావించడం తార్కికం కాదని, ఒక నెపం మాత్రమే అని డోనిగర్ అభిప్రాయపడ్డారు. ప్రజాభిప్రాయాన్ని మన్నించి సీతను అరణ్యానికి పంపడం కూడా వాదానికి నిలబడే అంశం కాదని, కుంటిసాకని విమర్శ చేశారు.

ఇంద్రుడు ఆడగుర్రంగా మారిన గాథ ననుసరించిలో కేవలం రూపం మార్చుకోసం మాత్రమే కాక, పురుష రూపం నుంచి ఆడ గుర్రంగా మారడం కూడా గుర్తించదగిన అంశం. ఇందులో జండర్ మార్పు కనిపిస్తుంది. పురాణ గాథల్లో శివపార్వతులూ అర్ధనారీశ్వరులుగా పేర్కొనబడ్డారు. హిందూ దేవతల కథల్లో పురుషుడుగా మారినా స్త్రీ తన ప్రవృత్తిని నిలుపుకోడం, స్త్రీ రూపంలోకి మారినా పురుషుడు తన ప్రవృత్తిని నిలుపుకోడం గుర్తించదగిన అంశం. విష్ణువు మోహిని అవతారం రూపం ధరించినపుడు, శివుడు ఆ రూపాన్ని మోహించిన గాథ ప్రసిద్ధమైనది. బ్రహ్మాండపురాణంలో మోహిని అవతార కథ విస్తరించి రాయబడింది. శివుడి కోరిక ప్రకారం విష్ణువు మరొకసారి మోహిని రూపంలో శివుడికి కనిపించగానే, శివుడు స్వస్థితిని మరచి, పార్వతిని విడిచి మోహిని వెంటపడతాడు. అసూయ, అపరాధ భావంతో పార్వతి తలదించుకొంటుంది. శివుడికి వీర్యస్కలనమై మహాశాస్త అయ్యప్ప జన్మిస్తాడు.

శివుడు మోహినిని వాంఛించడాన్ని hetrosexual భావనగా డోనిగర్ అభిప్రాయపడ్డారు. ఇట్లా కామవాంఛలు కలగడానికి శివునికున్న ద్విలింగ సంబంధం కారణం కావచ్చని డోనిగర్ అంటారు. తమిళ ప్రాచీన సాహిత్యంలోని ఒక కథలో ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న ఒంటరి స్త్రీ రూపాన్ని శివుడు తాను స్వీకరించినట్లు ఒక కథ ఉంది. దారుకారణ్యంలో పురుషులందరూ స్త్రీ రూపాల్లోని మారిపోతారు. రామాయణ కథలో అరణ్యంలో పురుషులు స్త్రీలుగా మారిన సందర్భాన్ని డోనిగర్ ప్రస్తావిస్తారు ఈ సందర్భంలో. ఏకాంతంగా ఉన్నప్పుడు పార్వతిని సంతోషపెట్టడానికి శివుడు స్త్రీ రూపంలోకి మారతాడు. అరణ్యం, జంతువులు అన్నీ స్త్రీ రూపాల లోకి మారిపోతాయి. ఈ కథలో అన్నీ స్త్రీ రూపాలలోకి మారినా, శివుడు మాత్రం అసలు రూపంలోనే ఉండి, ఇపుడు అరణ్యంలోకి ఏ పురుషుడు వచ్చినా, స్త్రీగా మారిపోగలడని పార్వతితో, అన్నట్లు సాయకుని వ్యాఖ్యలో ఉంది. ఈ కథకు సంబంధించి బ్రహ్మాండపురాణంలో కొన్ని వైరుధ్యాలున్నాయి.

రహస్యప్రదేశంలో శివపార్వతులు ఏకాంతంలో ఉన్నపుడు శౌనకుడు, మరికొందరు పసివాళ్లు (young boys) అక్కడికి వచ్చి, సిగ్గుపడి వెనక్కి మరలుతారు. “ఇప్పుడు నీ ఇష్ట ప్రకారం చెయ్యి” పార్వతి శివుడితో అంటుంది. “నా ఆశ్రమంలో అడుగుపెట్టిన పురుషులు దేవకన్యలంత సుందర స్తీలుగా మారిపోతారు” అని ఈశ్వరుడు అనగానే, అందరూ అందమైన యువతులుగా మారిపోతారు.

3వ శతాబ్దికి చెందిన కామసూత్ర రచయిత మల్లనాగుడు. కామసూత్ర వ్యాఖ్యాత యశోధర 13వ శతాబ్దికి చెందినవారు. తనకు పూర్వం ఉన్న అనేక గ్రంథాలను వాత్సాయనుడు సంప్రదించినా, ఆ వివరాలు మనకు తెలియవు. కేవలం కామకేళి భంగిమలు, సంయోగ పద్ధతులను మాత్రమేకాక, జీవన కళ (art of living), జీవిత సహచరుణ్ణి, సహచరిని ఎంపిక చేసుకోడం, దాంపత్య విధులు, వివాహేతర శృంగారం, వేశ్యలుగా జీవించడం, వేశ్యాసంపర్కం, కామోద్దీపన కోసం ఔషధాలు, కలయికలో భంగిమలు వంటి విషయాల మీద ధనికుల కోసం, సంపన్నుల కోసం వాత్సాయనుడు కామసూత్ర రచించాడు.

విద్యావంతులు, సంస్కారుల మానసిక సమతుల్యంపై వ్యతిరేక భావనలు కలిగిస్తాయని గ్రామీణ, ఆటవిక స్త్రీలతో కామ సంబంధాలను వాత్సాయనుడు నిషేధించాడు. కామసౌఖ్యానికి స్త్రీ యొక్క సామాజిక వర్గానికి సంబంధం లేదని డోనిగర్ వ్యాఖ్యానిస్తారు. కామసూత్రాలలో ప్రస్తావించబడిన నాయకులు చతుష్షష్టి కళల్లో ఆరితేరి ఉంటారు గాని, సొంత వ్యవహారాలు గాని, సొంత తల్లిని గాని పట్టించుకోరని డోనిగర్ అంటారు. కామసూత్ర నగరాల్లోని స్త్రీ పురుషుల కోసం రాయబడిందని, వారు ఆ గ్రంథం చదవకపోయినా మహిళలు అందులో విషయాలను ఆచరణలో పెట్టవచ్చని డోనిగర్ అభిప్రాయం. బహుశా రాజకుమార్తెలు, వేశ్యలు, మంత్రులు తదితరులు ఈ గ్రంథ పాఠకులు కావచ్చు. ఇందులో కొన్ని భాగాలు స్త్రీలను దృష్టిలో ఉంచుకొని రచించబడినదని, కామసూత్ర మహిళల అవగాహనను ప్రభావితం చేసి ఉంటుందని డోనిగర్ భావించారు.

కామసుత్రలో మూడవ ప్రకరణం ప్రత్యేకంగా వివాహ యోగ్యులైన కన్యల కోసం, నాలుగో ప్రకరణం భావుకుల కోసం, అరవ ప్రకరణం పాటలీపుత్రంలోని వేశ్యల ఉపయోగం కోసం రచించబడింది. ఇది శృంగార పాఠ్యపుస్తకంగా మాత్రమే కాక, ఒక రూపకంగా భాసిస్తుందని డోనిగర్ అంటారు. ఇందులో వివరించిన స్త్రీపురుషులను వాత్సాయనుడు కథా నాయికలుగా, నాయకులుగా భావించాడు. వీరికి జీవితకాలం సహాయపడే వ్యక్తులూ విదూషకులని సంస్కృత రూపకాల్లో పేర్కొనబడ్డారు. విదూషక పాత్ర ఒక మూస పాత్ర.

వాత్సాయనుడి కామసూత్ర – శృంగారాన్ని గురించిన రూపకమా? కామసూత్రలో అంతర్గతంగా ఒక నిర్మాణం ఉందని, నాటకంలో మాదిరి సంఘటనల వరుస, అమర్పు ఉందని, దీన్ని రూపకంగా తాను భావిస్తున్నట్లు డోనిగర్ అంటారు. ఇతర సంస్కృత రూపకాల్లో మాదిరే ఇందులో 7 అంకాలున్నాయి, తొలి అంకంలో పాటడానికి సంబంధించిన సమగ్రమైన భోగట్టా ఇవ్వబడింది. నాయకుని పరిణయం, అతడు శృంగార శాస్త్రంలో పావీణ్యం సంపాదించడం, పరస్త్రీలతో, వేశ్యలతో సాంగత్యం, వయసు పైబడిన తర్వాత కామవృద్ధి కోసం ఔషధ సేవనం, మంత్ర తంత్రాలను ఆశ్రయించడం తర్వాత అంకాలు.

భారతీయ పాఠకులకు, విదేశీ పాఠకులకు ఆసక్తి గొలిపే రెండు అంశాలు కామసూత్రలో ఉన్నాయని డోనిగర్ అంటారు. ప్రాచీన భారతదేశం, శృంగారం, రాజులు, రాణులు, నిత్య జీవితంలో పక్షులకు మాటలు, పాటలు నేర్పించడం విదేశీయులకు ఆసక్తి గొలుపుతుందట, వారికి ఇవి వింతగా అనిపిస్తాయట. యువజనులకు కామోద్రేకాన్ని కలిగించే స్వప్నం రీతిలో ఈ గ్రంథంలో కథనం కొనసాగుతుందని, దాన్ని పాఠకులు గుర్తిస్తారని, ఇందులో వివరించబడిన వశీకరణ విద్యలు పాశ్చాత్యులకు కొత్తగా, వింతగా అనిపిస్తాయని డోనిగర్ వ్యాఖ్యానించారు.

వివాహితలను అక్రమ సంబంధాల్లోని దింపడానికి దూతిక మొదట అహల్య కథ వినిపిస్తుందంట. ఇది హెలెన్ ఆఫ్ ట్రాయ్ వంటి కథని డోనిగర్ అంటారు.

రామాయణంలో అహల్య గాథ విజయవంతంగా ముగిసిన కథ అంటారు. వివాహేతర శృంగారాన్ని ప్రోత్సహించేందుకు వచ్చిన అవిమారకుడు భాస నాటకంలో నాయకుడు. అవిమారకుడు ఆటవికుడు, శబరుడు, దళితుడున్న అంశాన్ని భాసుడు గానీ, వ్యాఖ్యాత గాని ప్రస్తావించకుండా మరుగుపరచారని డోనిగర్ అంటారు.

సద్వంశ సంజాతుడైన శిశువును అరణ్యంలో, జంతువులు పెంచి పెద్ద చేశాయి, అతను తన రాజ్యానికి తిరిగివెళ్ళి రాజ్యాన్ని సాధించుకొనే వరకు. కిప్లింగ్ మోగ్లీ కథ కూడా ఇటువంటిదే. Oedipus, Moses, Tarzan వంటి కథలు ఈ కోవకు చెందినవే అంటారు డోనిగర్.

వివాహితలను వివాహబంధాన్ని అతిక్రమించి అక్రమ కామసంబంధాలు పెట్టుకోమని ప్రోత్సహించే సందర్భాలలో “Look before you leap” అని వాత్సాయనుడు హెచ్చరిస్తాడు. కామసూత్ర కన్నా రెండో శతాబ్దులకు ముందే మను ధర్మశాస్త్రం కూర్చబడింది. శివక్షేతు కామసూత్ర కర్త అని, కాదు నంది ఆ గ్రంథ రచయిత అని వాదాలున్నాయి. శివకేతు ప్రస్తావన మహాభారతంలో వస్తుంది. ఉపనిషత్తుల్లోనూ శివకేతు ప్రస్తావనలున్నాయి. ఉపనిషత్తుల ప్రకారం శివకేతు తండ్రి అతనికి భారతీయ తత్త్వశాస్త్రాన్ని బోధించాడు. ఇంతటి తాత్వికుడి ప్రస్తావన కామసూత్రలో రావడం ఆశ్చర్యం గొలుపుతుంది. కామసూత్ర ఇతన్ని ‘Expert Sexologist’ గా అభివర్ణించింది. వేదాంతి, వ్యభిచార వర్తనకు వైరి అయిన శివకేతు అనే వ్యక్తి శృంగార శాస్త్రానికి కర్త కావడం ఆశ్చర్యంగా ఉంది అని డోనిగర్ అంటారు.

దత్తకుడు ఈశ్వరుణ్ణి తన పాదాలతో తాకి, గర్భవతి అయిన స్త్రీని ఆశీర్వదించమని కోరినట్లు, శివుడు కోపించి దత్తకుణ్ణి స్త్రీవి కమ్మని శపించినట్లు, దత్తకుడి పార్థనను మన్నించి, శివుడు అతనికి స్వస్వరూపం ప్రసాదించినట్లు, దత్తకుడు స్త్రీపురుష అనుభవాలను స్వయంగా అనుభవించి, తెలుసుకొని పుస్తకం రాసినట్లు గాథ.

ఆనేక కారణాల వల్ల పురుషులు స్త్రీలుగా మారి, తిరిగి పూర్వరూపం పొందిన కథలు హిందూ, బౌద్ధ పురాణాల్లో ఉన్నాయి. నారదుడు, Bhangaswana వంటివారే. దత్తకుడు ఈ పాత్రల అనుభవాలను ప్రస్తావిస్తాడు. వాత్సాయన కామసూత్ర వ్యాఖ్యాత ఈ దత్తకుణ్ణి బైసెక్సువల్‌గా చేశాడు.

శ్వేతకేతు 500 భాగాలుగా రచించిన శృంగార శాస్త్రాన్ని భారవ్య 150 భాగాలలో కుదించాడు. ఈ గ్రంథాలు ఇప్పుడు లభించకపోయినా, వాత్సాయనుని కాలానికి ఉండి ఉంటాయి.  కామసూత్రలో కొన్ని  శృంగార భంగిమలను పేర్కొన్న సందర్భంలో శివ, ఇంద్రాణి ప్రస్తావనలు వస్తాయి. రోమన్ల దేవతల రాజు జూపిటర్, దేవేరి జూనోతో ఇంద్రాణికి పోలికలున్నాయి.

ఇంద్రాణిలోని గాఢమైన కామవాంఛలు, భర్త విశృంఖల పరస్త్రీ వ్యామోహాన్ని చూచి అసూయపడడం వంటి లక్షణాలలో పోలికలున్నాయి.

దాండక్యుడు వేటాడుతూ భార్గవుడి ఆశ్రమంలో మునికుమార్తెను మోహించి రథం మీద తీసుకొనిపోతాడు. భార్గవుడు తపశ్శక్తితో జరిగిన విషయం గ్రహించి రాజును శపిస్తాడు. శాప ఫలితం వల్ల దాండక్యుడి రాజ్యం, రాజకుటుంబం, ప్రజలు ధూళి తుపానుల్లో మట్టి కింద పడి నశిస్తారు. అదే దండకారణ్యం. బ్రాహ్మణ బాలికను అహహరించి దాండక్యుడు నాశనమైనాడని నీతి. ఇంద్రుడు గౌతముని వలె నటించి అహల్యను సమీపిస్తాడు. కీచకుడు భీముని చేతిలో చచ్చాడు. రావణుడు తాను అపహరించాననుకున్నా సీత – సీత ఛాయారూపంలో ఉన్న సీత అని అనేక గాథా విశేషాలున్నాయి. కామసూత్రలో అధర్మ, విశృంఖల కామం తప్పని చెప్పినట్లు అనిపిస్తుందని డోనిగర్ అంటారు. చోళరాజు సుకుమారి అయిన చిత్రసేన వేశ్యను మొరటుగా కౌగలించి కొయ్య పనిలో వాడే పనిముట్టు (wedge) తో కొట్టి చంపుతాడు, ఇరువురూ కామకేళిలో ఉన్న సమయంలో. కుంతలరాజు శాతకర్ణి జబ్బుపడి తేరుకొని, తన రాణి అలంకృత అయి కామోత్సవానికి బయలుదేరడాన్ని చూచి, కామోద్రేకంలో శృంగార కార్యంలో బరమాను కుంటి చేతిలోకి తీసుకొని ఆమె బుగ్గ మీద పొడవబోయి కంట్లో పొడిచి అంధురాలిని చేస్తాడు. వాత్సాయనుడు ఉదహరించిన అతికాములయి, దుర్మార్గంగా ప్రవర్తించిన రాజులందరినీ దక్షిణ దేశవాసులుగా చూపించాడు. ఈ రాజులు రావణుడు, అహల్యల మాదిరి సంస్కృత పురాణాల్లో అంతగా ప్రసిద్ధులు కారు.

కామసుత్రలో అతికామి అయి, మానవతుల శీలాన్ని హరించే దుష్టుడుగా ఆభీరుడు చిత్రించబడ్డాడు, ఇతడు పరస్త్రీని భోగించడం కోసం మరొకరి గృహానికి వెళ్ళవలసివస్తుంది. అక్కడ కాపలా ఉన్న భటుడు అభీరుణ్ణి చంపుతాడు. యూరపు రాజులతో పోల్చి, అక్కడ పాలకులకున్న స్వేచ్ఛ భారతదేశంలో లేదని డోనిగర్ వ్యాఖ్యానించారు.

డోనిగర్ ప్రపంచవ్యాప్తంగా మతాలు, పెంపుడు జంతువులకు సంధింధించిన చరిత్రను ఈ గ్రంథంలో విశ్లేషిస్తూ అడవి గుర్రాలను వధించడం, దిగుమతి చేసుకోడం, మందలుగా సాకే జంతువుల (farm animals) పట్ల మన దృక్పథం చర్చిస్తూ అది భయంకరమైనదంటారు. బానిసలు, స్త్రీలు, అశ్వాలు, పసిబిడ్డలు, జంతువుల పట్ల మన దృక్పథాన్ని సుదీర్ఘంగా చర్చించారు. క్రీ.శ. 1800 – 1900 మధ్యకాలంలో వెలువడిన సాహిత్యంలో తమ ఇష్టం ప్రకారం పనిచేయని గుర్రాలను చావగొట్టడం, హింసించడం వంటి అనేక విషయాలను ఆమె సోదాహరణంగా చర్చిస్తూ, జంతువుతోపాటు మనుషులని కూడా నశించిపోతున్న జాతులుగానే పరిగణించాలంటారు. అశ్వమేధయాగం రామాయణంలో వర్ణించబడిందని, అటువంటి జంతుబలి దృశ్యాలు చిన్న పిల్లల మీద గాఢమైన ముద్రవేస్తాయని ఆమె భావిస్తారు. పశువు నవరంధ్రాలూ మూసి పశువును బలి ఇవ్వడం ఆ జీవి బాధను తగ్గించడంగా ఆమె వ్యాఖ్యానించారు.

బలి చేయబడ్డ పశువు స్వర్గానికి వెళ్తుందని వేద మంత్రాలతో ఉందని, మనువే బలిపశువుకు బదులు పిండిబొమ్మను పెట్టవచ్చని పేర్కొన్నట్లు డోనిగర్ అంటారు. భారతదేశంలో ప్రచారంలో ఉన్న, అనేక జంతువుల కథల్లో anthropomorphism విధానం గోచరిస్తుందని, జంతువులకు మానవుల గుణాలను అంటగట్టి కథలల్లడాన్ని ఆంథ్రోమార్ఫిజం అని ఆమె వివరించారు.

క్రీ.శ. 500 ప్రాంతంలో బౌద్ధ మత ఆకరాల నుంచి పంచతంత్ర కూర్పబడినట్లు, ఈసప్ కథల ద్వారా పంచతంత్ర ప్రపంచానికి పరిచయమేనని వెండి డోనిగర్ అభిప్రాయపడ్డారు. ఈ కథల్లో కొంగ, పిల్లి – దొంగ సన్యాసులకు, ఆషాఢభూతులకు ప్రతీకలు. భారతీయ పురాణ సాహిత్యంలో మత్స్యాన్ని alternative consciousness కు ప్రతీకగా తీసుకొన్నట్లు డోనిగర్ అంటారు.

పురాణాల్లో జంతువులను మానవులుగా, మానవులను జంతువులుగా పొరపాటుగా అనుకొనే అనేక సందర్భాలున్నాయి. రామాయణ, భారతాల్లో ఇటువంటి కథలున్నాయి. కర్ణుడు క్రూర మృగమని భావించి లేగదూడను చంపుతాడు. ముఖ్యమైన యుద్ధంలో వైఫల్యం చెందుతావని ఆ జంతువు శపిస్తుంది. గ్రీక్ కథల్లో అఖిలస్ హీల్ మాదిరే శ్రీకృష్ణ నిర్యాణం కూడా ఉంటుంది. అదొకటే మానవ సంబంధమైన బలహీనత లేదా లోపం కృష్ణుడిలో ఉంటుంది. నీళ్లు తాగుతున్న ఏనుగని పొరపడి దశరథుడు మునికుమారుణ్ణి చంపుతాడు. రాముడు మాయా మృగం వెంటపడడం కూడా ఇటువంటిదే. జంతురూపంలో ఉన్న మానవుణ్ణి వధించడం వల్ల వేటగాడు (రాముడు) భార్యావియోగ బాధ అనుభవించవలసినట్లు శాపం.. క్రౌంచ మిథునంలో అడపక్షి దుఃఖాన్ని చూచి వాల్మీకి నోట వెంట ‘మానిషాద..’ శ్లోకం అప్రయత్నంగా వెలువడుతుంది.

దశరథుడికి పక్షుల భాష తెలుసు. భార్యతో ఏకాంతంగా ఉన్న సమయంలో పక్షుల సంభాషణ విని ఆయన నవ్వుకొంటాడు. ఆమె అతని నవ్వుకు కారణం తెలుసుకోగోరుతుంది. ఆ విషయం చెప్తే తాను మరణిస్తానని అన్నా, ఆమె చెప్పితీరాలని పట్టుపట్టడంతో చెప్పక తప్పింది కాదు. కైకేయి అన్ని హద్దులు అతిక్రమించి విపరీతంగా బ్లాక్‌మెయిల్ చేసినట్లు డోనిగర్ అంటారు. ఈ కథలోను భర్తకు మాత్రమే పక్షుల భాష తెలిసినట్లుంది. ఈ కథను వ్యాఖ్యానిస్తూ హిందువుల్లో ‘misogyny’ అంటే పురుషులు ఎక్కువ ప్రతిభాశాలురుగా చిత్రించబడ్డారని ఆమె భావించారు. పురుషులకు చదవడం రాయడం వచ్చు, స్త్రీలకు విద్య లేదని కూడా అంటారు.

జంతువుల రూపం దాల్చి మానవులు రతిక్రీడలో పాల్గొన్నట్లున్న వర్ణనలను బట్టి, శృంగారం జంతు స్వభావం అనే సూచన ఉన్నట్లు, డోనిగర్ అంటారు. కథల్లో జంతువులు మానవ భాషలో వ్యవహరించడాన్ని బట్టి, భాష జంతువులను మానవులుగా చేస్తుందని (Language makes animals as humans) ఆమె అంటారు.

ఇండో యూరోపియన ద్వారా సంస్కృత భాషతో పాటు అశ్వం కూడా భారతదేశంలో ప్రవేశపెట్టబడింది, యుద్ధరథాలు విహరించేందుకు, యాగాల్లో బలి యిచ్చేందుకు, పశువుల మందల కాపుదలకు అశ్వం పనికి వచ్చింది. మహాభారతం లోని వినత, కద్రువల వివాదంలో, సూర్యరథానికి సప్తాశ్వాసాలు పూన్చినట్లు, సగం మానవరూపం, సగం అశ్వ రూపం కలిగిన అశ్వినీదేవతల గాథలో అశ్వాల ప్రస్తక్తి వస్తుంది. హాయగ్రీవుడు వైదికదేవత. హిందూ పురాణగాథల్లో అశ్వం ఆకర్షవంతమైన కేంద్రంగా చేసిన వర్ణనలున్నాయి.

టర్కీ దేశపు మూలాలును అశ్వాన్ని మొగలులు అరేబియా, పర్షియా దేశాల నుంచి సముద్ర మార్గంలోనూ, భూ మార్గంలోనూ దినుమతి చేసుకొన్నారు. వైదిక మతంలో గోవు కన్నా అశ్వం చాలా పవిత్రమైనది. అశ్వం ఆర్యులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. భారతదేశంలో సానిక ప్రజలు దశ్యుల కన్నా వేరుగా, (బానిసలు) తమను తాము ఆర్యులమని అభివర్ణించకొన్నారు. వేదాలను రక్షించిన విష్ణువు హయగ్రీవ రూపంలో వర్ణించబడ్డాడు. అశ్వినీ దేవతలు సగం మానుష రూపం, సగం అశ్వరూపంలో ఉన్నవారే. గుర్రాలను ఉంచుకొనే తాహతు లేకపోయినా, సాధారణ హిందువుల్లో శక్తి, ఆకర్షణలకు అశ్వం ప్రతికగా నిలిచింది. దండయాత్రలకు, యుద్ధంలో విజయాలను అశ్వం ప్రతీక. అశ్వపాలన భారతీయులకు అంతగా తెలియదు. తరచు ఆఫ్గనిస్థాన్ మార్గంలో గుర్రాలను దిగుమతి చేశారు. భారతదేశంపైకి టర్కీ దండయాత్రల కన్నా ముందు నుంచే ఇక్కడ గుర్రాలను పెంచటం, సంతనోత్పత్తి కొనసాగుతున్నాయి. మార్కోపోలో కాలం నాటికి భారతదేశంలో గుర్రాల పెంపకం లేదనే మాట నిజం కాదు. మొగలులు కూడా అశ్వాలను పెంచి వృద్ధి చేశారు. తూర్పు ఇండియా కంపెనీ (బ్రిటిష్) వారు కూడా గుర్రాల పెంపకాన్ని (breading) ప్రోత్సహించారు. బౌద్ధ సాహిత్యంలో అశ్వముఖులైన యక్షిణుల కథలున్నాయి. గోపథ బ్రాహ్మణంలో నాలుగు వేదాలు అశ్వాన్ని మచ్చిక చేయడంలో పోటీ పడినట్లు పేర్కొనబడింది. వేదంలో అశ్వాన్ని, మచ్చిక చేసుకొనే ప్రక్రియను ‘శమింపజేయడం’గా పేర్కొనబడింది. ‘అధ్వరులు’ మంత్ర జలాన్ని అశ్వం మీద చిలకరించి శమింప జేస్తారు. అశ్వం ప్రత్యేకంగా అగ్ని, జలాలతో కలిపి పేర్కొనబడింది. ప్రాచీన ఆర్యులు అశ్వాన్ని వరుణదేవునికి బలిచ్చేవారు. వైదిక సాహిత్యంలో ‘ఉచ్చైశ్రవం’ అంటే రెక్కలు కలిగిన పవిత్ర అశ్వం. డోనిగర్ భారతదేశంలో చర్మకారులు, మలాన్ని తొలగించి శుభ్రంచేసే పాకీపనివారిని తరచు పందులు, కుక్కలు అని పేర్కొనడం కూడా ఉంది. శునకాల పట్ల ఉన్న సాధారణ అపోహలను, ప్రిజుడిసెస్‌ను మహాభారతం ఆమోదించినట్లు డోనిగర్ అంటారు. మహాభారత కాలం నాటికి శునకాలు కాలుష్యకరమైన జంతువులనే భావన స్థిరపడినట్లు డోనిగర్ అంటారు. నైతిక విషయాలను వివరించడానికి హిందూ పురాణాల్లో జంతువుల కథలను వాడుకొన్నారని, మహాప్రస్థానంలో ధర్మరాజు వెంట వెళ్ళిన శునకం కథ అటువంటిదేనని ఆమె అంటారు.

ప్రొఫెసర్ వెండి డోనిగర్ ఈ పుస్తకాల్లో మన ఆలోచనలను భిన్నమైన అనేక అంశాలను ప్రస్తావించారు. మనం ఎన్నడూ భావించని విధంగా పురాణ కథలను వ్యాఖ్యానించారు. తీవ్రమైన మత నిష్ఠ, సనాతన భావాలు ఉన్న వారు కొన్ని విషయాలను హర్షించరు కాని ఈ గ్రంథాల్లో అనేక నూతన విషయాలు తెలుస్తాయి.

***

On Hinduism
Author: Wendy Doniger
Publisher: Aleph Book Company
Pages: 664
Price: ₹ 1500/-
For copies:
https://www.amazon.in/HINDUISM/dp/9382277072

~

 

 

 


హిందువులు
రచన: వెండి డీనిగర్, అనువాదం: అశోక్ టంకశాల
ప్రచురణ: హెచ్.బి.టి.
పేజీలు: 345
వెల: ₹ 275
ప్రతులకు: హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం. 85, పిల్లర్ నెం. 68 దగ్గర, బాలాజీనగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్, తెలంగాణ 500006
ఫోన్: 040 2352 1849
ఆన్‍లైన్‌:
https://hyderabadbooktrust.com/products/hinduvulu-the-hindus-wendy-doniger-translator-ashok-tankashala?

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here