ఓ బొమ్మ గీయబోయి…

0
9

[box type=’note’ fontsize=’16’] “తెలుగు చలన చిత్ర దర్శకులు కొద్దిగా వైవిధ్యం వైపు ఆలోచిస్తున్నారని ఎంతో ఆనందం వేసింది. కానీ అది కొద్ది సేపే మిగిలింది” అంటున్నారు వేదాంతం శ్రీపతిశర్మ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాని సమీక్షిస్తూ. [/box]

‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్ర సమీక్ష

తెలుగు చలన చిత్ర దర్శకులు కొద్దిగా వైవిధ్యం వైపు ఆలోచిస్తున్నారని ఎంతో ఆనందం వేసింది. కానీ అది కొద్ది సేపే మిగిలింది.

రచయితల అంతరాత్మను అన్వేషిస్తూ కథలను, వాస్తవాలను, వైయక్తిక జీవితాలను తెర మీద ఆవిష్కరించాలంటే తత్వాన్ని దర్శించేందుకు తొలుత ఒక సున్నితమైన హృదయం కావాలి. ‘అపూర్ సంసార్’, ‘ప్యాసా’ వంటివి తలచుకుంటే ఆ కాలంలోని అమృతవాహినికీ, ఈ తరంలోని కుప్పిగంతులకు మధ్య ఎంతటి భావదారిద్ర్యంతో కూడిన ఎడారి ఏర్పడినదో అనిపిస్తుంది!

అలా అని ఆ నేపథ్యంలో కొన్ని కమర్షియల్స్ రాలేదని చెప్పలేము. ‘అనామిక’ లేదా ‘కభీ కభీ’ వంటివి జనాలని రంజిప జేస్తూనే కొన్ని కవిత్వపు విషయాలను, కళాత్మకతను కూడా స్పృశించాయి.

క్రాంతిమాధవ్ ఈ చిత్రాన్ని రచించి యున్నారు. దర్శకత్వం కూడా వహించారు.

విజయ్ దేవరకొండ గౌతమ్ పాత్ర పోషించాడు. తన ప్రియురాలు యామిని (రాశీఖన్నా)కు తన ఉద్యోగాన్ని సమర్పించుకుని ఏడాదిన్నర పాటు ఒక పుస్తకం వ్రాయటానికి పూనుకొంటాడు. ఈ సమయంలో లివ్-ఇన్ పద్ధతిలో సాగుతున్న వ్యవహారంలో యామిని పూర్తిగా ఒంటరితనాన్ని అనుభవిస్తూ చివరకు తనని వదిలి వెళ్ళిపోతుంది. ఇంకొకరితో వివాహానికి సిద్ధపడుతుంది. హీరోగారు రచనలోకి దిగుతారు. ఇల్లందులోని బొగ్గుల గనుల ఇతివృత్తంలో ఒక సామాన్యురాలైన భార్య పడ్డ ఘర్షణను బాగా చూపించారు. సువర్ణ అనే పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటన ఈ చిత్రంలో అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది! ఇదిలా ఉండగా పారిస్‌లో ఒక వృత్తాంతం చూపించారు. ఓ పైలట్‌తో వ్యవహారం, ఆమెకు ఈయన కళ్ళు ఇవ్వటం, స్వయంగా గ్రుడ్డివాడవటం… ఇది ఏదోలా ఉంది.

ఈ పేజీలు మిత్రుడు తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారి ద్వారా ప్రచురణలో పెడతాడు.

గౌతమ్ యామిని ద్వారా తిరస్కరింపబడి కారును ఢీకొని, తల కారుకు, ఎదురుగా వచ్చిన వాడి చేతిలోని బండరాయికి కొట్టుకుని (కావాలని), ఈ బాధ తాను అంతరంగంలో పడుతున్న బాధ కంటే ఏ మాత్రం గొప్పది కాదని అందరికీ చెప్పి మరో బండరాయితో ఎదురుగా ఉన్న వాడి తల పగలగొట్టి జైలుకు వెళతాడు. ఇది మన రచయితగారి పాత్ర. ఆ జైలు నుండే సినిమా ప్రారంభం అవుతుంది…

అందులోంచి ఇవతలకి అచ్చి చివరి కాగితాలు ఖాళీగా ఉంచేసిన నవల కొన్ని లక్షల కాపీలు అమ్ముడుపోయినందుకు సభలోకి ప్రవేశించి ప్రసంగిస్తాడు గౌతమ్. తరువాత యామిని తండ్రి యామినిని తీసుకువచ్చి అతని కోసం నిరీక్షిస్తోందని చెప్పి వెళ్ళిపోతాడు!

కె.కె. వల్లభ, కె.ఎస్. రామారావు నిర్మించిన ఈ ‘క్రియేటివ్ కమర్షియల్స్’ చిత్రంలో నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం బావున్నాయి.

రాబర్ట్ ఆల్ట్‌మాన్ చిత్రం ‘ది ప్లేయర్’ (1992) ఒక్కసారి ఈ దర్శకుడు చూడవలసి యున్నది. సినిమా టెక్నిక్‌లో ప్రిఫాబ్రికేషన్ (పాస్టీజ్ కల్చర్) అనేది నిజజీవిన్తానికి, కాల్పనిక పరమైన సృజనాత్మకతకు వారధి కట్టే లూప్. ఇంటర్ టెక్స్టువాలిటీ,  బ్రికోలాజ్ వంటి సినీ సాంకేతికాలు ఇటువంటి ఇతివృత్తాలకు చాలా అవసరం.

గుండెలకు హత్తుకునే పాట మనకొద్దు, సాహితీపరమైన విషయం మనకొద్దు, కళతో పనిలేదు, స్వాభావికమైన భావ విన్యాసం రచయిత పాత్రకు వద్దు. కానీ ఓ కమర్షియల్ సినిమా కోసం ఉన్నట్టుండి ఓ రచయిత పాత్ర కావలసి వచ్చింది! ఈ తరాన్ని చూస్తుంటే కొద్దిగా జాలి వేస్తోంది.

రేటింగ్: 3/10.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here