రాంగ్ నెంబర్

0
9

[శ్రీ వెంపరాల దుర్గాప్రసాద్ రచించిన ‘రాంగ్ నెంబర్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]టీ[/dropcap]వీలో వార్తలు చూస్తున్న ఇన్‌స్పెక్టర్ ఆనంద్, ఆ న్యూస్ ఐటెం దగ్గర ఆగిపోయాడు. నల్గొండ పోలీస్ స్టేషన్‌లో డి.ఎస్.పి. అగర్వాల్ పెట్టిన ప్రెస్ మీట్ అది. డి.ఎస్.పి. పక్కన వున్నది తన స్నేహితుడు సి.ఐ. రామకృష్ణగా గుర్తు పట్టేడు. నిజానికి అతను రామకృష్ణని చాలా కాలం తర్వాత చూసేడు. ఆ ప్రెస్ మీట్‌లో ఒక ఫేస్‌బుక్ మోసగాడి వల్ల మోసపోయిన అమ్మాయి గురించి చెపుతున్నాడు డి.ఎస్.పి.. గంట పోయిన తర్వాత, రామకృష్ణకి ఫోన్ చేసేడు ఆనంద్.

“హలో రామకృష్ణ! బావున్నావా”

“ఎవరు?” రామకృష్ణ ప్రశ్నించేడు.

 “గుర్తుపట్టలేదు కదా, నేను ఆనంద్‌ని.. మనిద్దరం వైజాగ్‌లో 2015లో పని చేసేం” అన్నాడు.

“ఓహ్ ఆనంద్.. నీతో మాట్లాడి ఎన్నాళ్ళయిందో.. ఇప్పుడు ఎక్కడ వున్నావ్?”

“నేను విజయవాడలో పని చేస్తున్నాను, నిన్ను ఇందాక నల్గొండ ప్రెస్ మీట్‌లో చూసేను.. టీవీలో న్యూస్ ఐటెం వచ్చింది. ఇన్నాళ్ళకి నిన్ను చూసేక ఒకసారి మాట్లాడాలని అనిపించి చేసేను, పని ఒత్తిడిలో పడి, కుటుంబం, ఫ్రెండ్స్ అందరికీ దూరం అయిపోతున్నాం అనుకో”. అన్నాడు ఆనంద్.

“అవును ఆనంద్! నేను, నల్గొండ వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఒక్క సారి కూడా మా వూరు ఉయ్యూరు వెళ్ళలేదు. ఈ సారి ఉయ్యూరు వచ్చినప్పుడు నిన్ను విజయవాడలో తప్పక కలుస్తాను.” అన్నాడు రామకృష్ణ

“సరే.. ఆ కేసు ఏమిటి?” అన్నాడు ఆసక్తిగా ఆనంద్.

ఇలా వివరించేడు రామకృష్ణ:

“వాడొక తెలివయిన మోసగాడు. ఫేస్‌బుక్ ద్వారా ఆడపిల్లలతో పరిచయాలు చేసుకుంటాడు. వాళ్లతో కొన్నాళ్ళు లవ్ చేసి, పెళ్లి ఎర చూపి, ఇంట్లో నుండి డబ్బు, నగలు తెప్పించుకుంటాడు. పెళ్లి నాటకం అయ్యేక, పరారీ అయిపోతాడు. ఒక్కొక్క ప్రదేశంలో 3, 4 నెలల్లోనే వాడు తన ఎరని బుట్టలో వేసేసుకుంటున్నాడు. ఇదివరలో వాడు మోసం చేసిన అమ్మాయిల జాబితా వచ్చింది. అతని ఫోటో వివరాలు వచ్చేయి. ఇంకొక విషయం, అతను ప్రదేశాన్నిబట్టి గెటప్ మారుస్తాడు, ఫోన్ నెంబర్ మారుస్తాడు. మారిన సెల్ నెంబర్‌తో బాటు, తన సెల్ ఫోన్ కూడా మార్చేస్తూ, పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్నాడు.

ఇప్పటికే వాడి దెబ్బకి బలి అయిన అమ్మాయిలు 5 మంది. కొంత మందిని ముంబైలో అమ్మేశాడు. కొంత మందిని డబ్బు, నగలు దోచుకుని పరారీ అయి పోయాడు. మోసపోయిన ఆడపిల్లలు, వాళ్ల తల్లి తండ్రులు కంప్లైంట్ చేస్తే, వాళ్ల పరువు బజారున పడుతుంది అని కంప్లైంట్ చెయ్యట్లేదు. అది వాడికి మరింత ధైర్యం తెస్తోంది.

ఇక్కడ ఒక అమ్మాయి ధైర్యం చేసి, కంప్లైంట్ ఇవ్వడంతో, విషయాలు వెలుగులోకి వచ్చేయి. ఆ అమ్మాయి కూడా 6 నెలలకి ముందు జరిగిన విషయాలు ఇప్పుడు చెప్పింది. వాడి ఫోటో, తదితర వివరాలు దొరికాయి. ప్రస్తుతం వాడు వాడుతున్న ఫోన్ ఆధారంగా ఆచూకీ తెలిసింది. అయ్యగారు విశాఖపట్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.. ఫోన్ సిగ్నల్స్ ద్వారా.

ఇక్కడ ఎఫ్.ఐ.ఆర్. లాడ్జ్ అయింది. స్పెషల్ బ్రాంచ్ ద్వారా, కమీషనర్ అఫ్ పోలీస్, తెలంగాణలో అన్ని పోలీస్ స్టేషన్స్‌కి వాడి వివరాలు పంపించేరు. మీ ఆంధ్ర డీజీపీ గారికి మా స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు మా డీజీపీ ద్వారా ఇన్ఫర్మేషన్ పంపించేరు. వాడిని ఎలాగయినా పట్టుకునే ప్రయత్నాలలో వున్నాం” అన్నాడు రామకృష్ణ.

“సరే వుంటాను.. నువ్వు వీలు చూసుకుని ఇటువైపు వచ్చినప్పుడు కలువు” అని ఫోన్ పెట్టేసేడు ఆనంద్.

ఆ ఫోన్‌లో వివరించిన క్రిమినల్‌ని గురించి ఆలోచిస్తూ వున్న ఆనంద్, భార్య పిలుపుతో ఈ లోకం లోకి వచ్చేడు.

“ఏమండీ, ఈ రోజు రాత్రి మీరు వచ్చేక, బజారుకి వెళ్లి స్వీటీకి డ్రెస్సెస్ కొనాలి. మళ్ళీ వారంలో దాని పుట్టినరోజు” అంది.

“సరే.. నేను డ్యూటీకి ఇవాళ ఎర్లీగా వెళ్ళాలి. టిఫిన్ బయట చేస్తాను. లంచ్‌కి వస్తాను” అన్నాడు.

మరో 10 నిముషాల్లో బయలు దేరి, వెళ్తూ వెళ్తూ.. భార్యని అడిగేడు.

“స్వీటీ ఇంకా లేవలేదా?”

“లేవలేదు.” అంది.

జీపు ఎక్కి స్టేషన్‌కి వెళ్లి పోయాడు.

ఆనంద్ విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సిఐగా పని చేస్తున్నాడు. ఆనంద్ భార్య లత ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తోంది. ఇప్పుడు వేసవి సెలవులు కనుక ఇంట్లోనే ఉంటోంది. వాళ్లకి ఒకే ఒక అమ్మాయి. పేరు నిత్య. కానీ ఇంట్లో ‘స్వీటీ’ అని ముద్దుగా పిలుస్తారు. పొద్దున్న 9 గంటలు దాటితే గానీ నిద్ర లేవదు.

నిత్య బి.టెక్ పూర్తి చేసి, ఈ మధ్యనే ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె వైజాగ్‌లో రఘు కాలేజీలో హాస్టల్‌లో ఉండి చదువుకుంది.

స్టేషన్‌లో ఫైల్స్ చూసుకుంటున్న ఆనంద్‌కి మళ్ళీ రామకృష్ణ నుండి ఫోన్ వచ్చింది.

“ఆనంద్, మనం పొద్దున్న మాట్లాడుకున్న నేరస్థుడు ప్రస్తుతం విజయవాడలో ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ట్రేస్ చేసే ప్రయత్నాలలో వున్నాం. నాకు నువ్వు తెలుసు కనుక, అతని ఇన్ఫర్మేషన్, ఇప్పుడు అతను వాడే ఫోన్ నెంబర్, అతని ఫోటో మరియు అన్ని వివరాలు నీకు పంపిస్తున్నాను. ఏదయినా నీ సహాయం కావాలంటే అడుగుతాను. నువ్వు నీ టీంతో అవసరమయితే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాల్సి రావచ్చు.. సిద్ధంగా వుండు.” అన్నాడు.

“సరే, అలాగే” అన్నాడు ఆనంద్.

తన టీం ని పిలిచేడు. విషయం చెప్తున్నాడు. ఇంతలో వాట్సాప్‌లో నేరస్తుడి వివరాలు వచ్చేయి. వాళ్లకి చూపించేడు.

వాళ్ళు ఆ విషయాలు మాట్లాడుకుంటూండగానే, ఆనంద్ ఫోన్‌కి ఆ నేరస్థుడి ఫోన్ నెంబర్ నుండి కాల్ వచ్చింది.

నెంబర్ చూసిన ఆనంద్ నిర్ఘాంతపోయాడు. ఆ నెంబర్ ఎస్.ఐ.కి చూపించి సైగ చేసేడు.

ఫోన్ అటెండ్ యే సమయంలో ఆ నెంబర్ ని ట్రాక్ చెయ్యాలి అని అతనికి అర్ధం అయింది. ఎస్.ఐ.కి, కానిస్టేబుల్స్‌కి ఎవరి పని వాళ్ళు ఏమి చెయ్యాలో రెడీ అయి పోయారు.

అందరూ రెడీగా వున్నారని కన్‌ఫర్మ్ చేసుకుని, స్పీకర్ ఆన్ చేసి, ఫోన్ లిఫ్ట్ చేసేడు. అతని ఫోన్‌లో ఆ కాల్ రికార్డు అవుతుంది.

అట్నుంచి ఒక మొగ గొంతు – “హలో, ఒక సారి మీ అమ్మాయి మాట్లాడుతుంది.. వినండి” అంది.

ఆనంద్‌కి ముచ్చెమటలు పోసేయి. అతని టీం మెంబర్స్ కూడా ఆశ్చర్యంగా వింటున్నారు.

ఇప్పుడు ఒక అమ్మాయి గొంతు.. చాలా బలహీనంగా, “ హలో” అంది. స్వరంలో వణుకు తెలుస్తోంది.

“నాన్నా, స్వీటీని మాట్లాడుతున్నాను. నేను చెప్పదలచుకున్నది పూర్తిగా విను. నీ ముందు మాట్లాడలేను. అందుకే ఫోన్‌లో మాట్లాడుతున్నాను” ..అని ఒక్క క్షణం గ్యాప్‌లో మళ్ళీ ఇలా అంటోంది:

“నువ్వు లేచేటప్పటికి నేను గదిలో పడుకుని వున్నానని అనుకుంటావని, నా మొబైల్ హాల్‌లో టేబుల్ మీదే ఉంచేసి, నేను రాత్రి 12 గంటలకి, బయటకి వచ్చేసేను. నేను లవ్ చేసిన విశాల్‌తో నా పెళ్లి మరో గంటలో. నువ్వు ప్రేమలకి వ్యతిరేకం అని తెలిసి, నిన్ను ఒప్పించలేనని తెలిసే, ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు కూడా నీకు, అమ్మకి చెప్పద్దని అనుకున్నాను. రాత్రి నుండీ పడుతున్న సంఘర్షణ వల్ల చాలా భారంగా ఉంది. పెళ్లి పీటల మీద నాలో వున్న గిల్టీ భావనతో పెళ్లి చేసుకునే కంటే, ఒకసారి మీతో చెప్పేస్తే నా బరువు తీరుతుంది అనిపిస్తోంది.

పైగా, నేను కనక దుర్గ అమ్మవారి సమక్షం లోనే పెళ్లి చేసుకుంటున్నాను. నా పెళ్లి అయ్యేక గాని మీరు రాలేనంత దూరంలో వున్నానని ధైర్యంగా ఫోన్ చేస్తున్నా. నేను హైదరాబాద్లో కాపురం పెట్టిన తర్వాత, మళ్ళీ ఫోన్ చేస్తాను, సారీ డాడీ.. ఇది నా నిర్ణయం” అంది.

పిచ్చివాడిలా అయిపోయాడు ఆనంద్. స్వరంలో ఏదో తేడా కనిపిస్తోంది, తన కూతురు అంత పని చేస్తుందా.. నమ్మశక్యంగా లేదు అతనికి. పైగా, తాను విజయవాడలో ఉంది, కనక దుర్గ గుడికి రాలేనంత దూరం అంటుందేమిటి? అనుకున్నాడు.

హలో హలో అంటున్నాడు. అప్పటికే కాల్ కట్ అయింది.

వెంటనే ఇంటికి ఫోన్ చేసేడు. భార్య తీసింది. “స్వీటీ గదిలో ఉందా” అన్నాడు.

“వుంది.. మీరు వెళ్ళేక లేచింది. కానీ తలనెప్పిగా వుంది అని, కాఫీ తాగి మళ్ళీ పడుకుని తలుపేసుకుంది” అని చాలా తేలికగా చెప్పింది ఆమె.

“వెంటనే గదిలోకి వెళ్లి చూడు” అన్నాడు.. కంగారుగా.

ఆమెకి ఏమీ అర్థం కాలేదు.. సరే అంటూ వెళ్ళింది. గదిలో వున్న కూతురికి ఫోన్ ఇచ్చింది.

నిత్య ఫోన్ తీసుకుంది.

“డాడీ చెప్పండి.” అంది.

నిర్ఘాంతపోయాడు ఆనంద్.

జరిగిన విషయం చెప్పేడు.

“నీతో ‘స్వీటీ’ అనే చెప్పిందా” అంది. అవునన్నాడు.

“దాందేముంది, ఎంతో మంది ఆడపిల్లల్ని ఇంట్లో స్వీటీ అని పిలుస్తూ వుంటారు”.. అని ఒక్క క్షణం ఆగింది. ఇంతలో ఆమెకి ఏదో స్ఫురించింది.

“అయితే అది సుస్మిత అవ్వచ్చు డాడీ.. సుస్మితని కూడా వాళ్ల ఇంట్లో ‘స్వీటీ’ అని పిలుస్తారు. ఇదివరకు కూడా ఒకసారి నీకు కన్ఫ్యూషన్ క్రియేట్ అయింది కదా” అంది.

సుస్మిత అంటే నిత్య స్నేహితురాలు. అప్పుడు ఆనంద్‌కి ఒక సంఘటన గుర్తుకు వచ్చింది.

నిత్య బి.టెక్ ఫైనల్ ఇయర్‌లో ఉండగా ఒకసారి కాలేజీ ప్రిన్సిపాల్ నుండి ఫోన్ వచ్చింది.

మీ అమ్మాయి క్లాస్‌లు ఎగ్గొట్టి తిరుగుతోంది అని కంప్లైంట్. ఆనంద్ తన కూతురు అలాంటి పని ఎప్పుడూ చెయ్యదని, చదువులో చాలా సిన్సియర్ గా ఉంటుంది అని చెప్పేడు.

“మీరు రోజూ కాలేజీకి బస్సు లోనే పంపిస్తారా” అని అడిగేడు ప్రిన్సిపాల్.

“బస్సులో ఎందుకు వస్తుంది, మా నిత్య హాస్టల్ లోనే ఉంటుంది. హాస్టల్ మీ కాలేజీ వెనుకే వుంది కదా” అన్నాడు.

అప్పుడు అర్థం అయింది.. ప్రిన్సిపాల్‌కి .. తాను ఒకరి బదులు ఇంకొకరికి ఫోన్ చేసేనేమో అని.

“మీరు రాఘవరావు, ఫిజిక్స్ లెక్చరర్ కాదా” అని అడిగేడు.

“కాదు నేను పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ని, మీరు ఎవరికో చేయబోయి, నాకు ఫోన్ చేసి నట్లున్నారు” అన్నాడు.

“సారీ సర్” అని ఆరోజు ప్రిన్సిపాల్ ఫోన్ పెట్టేసేడు. ఆనాటి రాత్రి నిత్యతో మాట్లాడినప్పుడు తెలిసింది. సుస్మిత వాళ్ల ఫాదర్ వైజాగ్ లోనే లెక్చరర్ అని, ఆమె కొద్దీ రోజులుగా కాలేజీకి సరిగా రావడం లేదు అని. సుస్మిత, నిత్య మంచి స్నేహితులేట. ఆమెని కూడా ఇంట్లో స్వీటీ అనే పిలుస్తారుట. “ఆయన సెల్ నెంబర్ 94912xxx38 అని, పొరపాటున చివర నెంబర్ 38 డయల్ చేయబోయి ప్రిన్సిపాల్, 28 డయల్ చేయడంతో ఆనంద్‌కి ఫోన్ వచ్చింది” అని నిత్య చెప్పింది. ఆ విషయం గుర్తుకు వచ్చింది. ‘మళ్ళీ ఈరోజు అలాంటి తప్పే జరిగి ఉంటుంది’ అనుకున్నాడు.

మళ్ళీ నిత్యని ఇలా అడిగేడు. “ఆమె ప్రేమ వ్యవహారాలు నీకు తెలుసా”

“తెలుసు, 4,5 నెలలుగా అది ప్రేమలో పడింది. ఆమెకి ఎవరో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యేడుట. పేరు విశాల్ అని చెప్పింది. అతనితో లవ్‌లో, 4th ఇయర్ చదువు కూడా పాడు చేసుకుంది. పరీక్షలయ్యేక పెళ్లి చేసుకుంటాం అంది. అది పరీక్షల్లో ఒక సబ్జెక్టు ఫెయిల్ కూడా అయింది.”

“నేను పరీక్షల హడావిడిలో ఈ మధ్య ఎక్కువ కలవలేదు దాన్ని. పరీక్షలు అయ్యాక విజయవాడ వచ్చేసేను కదా” అంది.

ఇప్పుడు ఆనంద్‌కి అర్థం అయింది. ‘ఆ స్వీటీ అనబడే సుస్మిత తన వద్ద ఫోన్ లేక పోవడంతో, ఆ విశాల్‌కి తన తండ్రి ఫోన్ నెంబర్‌కి కాల్ చెయ్యమని ఉంటుంది. నెంబర్ చెప్పినప్పుడు విశాల్ పొరపాటున, చివర నెంబర్ తప్పుగా డయల్ చేసి తనకి చేసేడు అన్న మాట., రాంగ్ నెంబర్‌కి కాల్ చేసి బాగానే దొరికేడు’ అనుకున్నాడు.

‘సుస్మిత విశాఖపట్నం నుండి తండ్రి వచ్చి పెళ్లి ఆపలేడు అన్న ధైర్యంతో మాట్లాడింది. కానీ ఆమె చిక్కుల్లో పడుతోందన్న విషయం పాపం ఆ పిచ్చిపిల్ల తెలుసుకోవడం లేదు’ అనుకున్నాడు.

సుస్మిత ఫోన్ వైజాగ్‌లో వాళ్ళ ఇంట్లోనే ఉందన్న విషయం గుర్తుకు వచ్చింది అతనికి. నిత్యతో వెంటనే సుస్మిత ఫోన్ నెంబర్‌కి కాల్ చేసి వివరాలు కనుక్కోమన్నాడు. నిత్య ఫోన్ చేసేసరికి, సుస్మిత వాళ్ళ అమ్మ ఫోన్ ఎత్తింది. ఆమె ఏడుస్తూ –

“సుస్మిత కనపడ్డం లేదు, అలాగే, ఆమె 20 తులాల బంగారం, బీరువాలో 2 లక్షల కాష్ కూడా కనపడ్డం లేదు” అని చెప్పింది.

“మీరేమీ కంగారు పడకండి ఆంటీ, సుస్మితని మా డాడీ కాపాడతారు. ఆయన ఆ పనిమీదనే వున్నారు. లక్కీగా సుస్మిత విజయవాడ కనక దుర్గ గుడిలోనే వుంది అని తెలిసింది” అని చెప్పింది.

నిత్య ఆనంద్‌కి ఫోన్ చేసి, విషయాలు వివరంగా చెప్పింది.. అప్పటికే, ఆ ఫోన్ నెంబర్‌ని ట్రేస్ చేసి, తన టీమ్‌తో సిద్ధంగా వున్నాడు ఆనంద్.

సుస్మిత విశాల్‌లు కనకదుర్గ గుడికి దగ్గరలోనే అశ్విని లాడ్జిలో బస చేసినట్లు తెలుసుకున్నాడు. ఆ ఏరియా సి.ఐ.తో మాట్లాడి, తన టీం ని కూడా కలుపుకుని, వెళ్లి వెంటనే రైడ్ చేసేరు.

సుస్మిత ఒక్కర్తే గదిలో వుంది. విశాల్ బయటకి వెళ్ళేడుట. పెళ్లిదండలు, మంగళసూత్రం తెద్దామని వెళ్ళేడుట.

సుస్మితకి విషయాలు అన్నీ వివరంగా చెప్పేడు ఆనంద్. ఇంటి నుండి తెచ్చిన 20 తులాల బంగారం, డబ్బు గురించి అడిగేడు. బాగ్ కోసం వెతుక్కుంది. కనపడలేదు. ఆమె బాత్రూంలో వున్నపుడు బాగ్ పట్టుకుని ఉడాయించేడు అని అర్థం అయింది.

జరిగిన మోసానికి సుస్మిత తల్లడిల్లి పోయింది. ఆమెని సముదాయించి ఇంటికి తీసుకు వచ్చేడు. సుస్మిత తల్లిదండ్రులని తన ఇంటికి పిలిపించేడు. వాళ్లు వచ్చి సుస్మితని తీసుకుని వెళ్ళేరు. అన్ని స్టేషన్స్‌కి విశాల్ ఫోటో, వివరాలు అప్పటికే వెళ్లడంతో, రాత్రికి నరసీపట్నంలో విశాల్ దొరికేడు. అతని వద్ద బంగారం, డబ్బు పోలీస్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు.

ఒక ఘరానా మోసగాడిని పట్టుకోవడంతో బాటు, ఒక ఆడపిల్ల జీవితం కాపాడగలిగినందుకు ఆనంద్‌ని అందరూ అభినందించారు. పాపం ఆ మోసగాడు రాంగ్ నెంబర్‌కి కాల్ చేసి తనని తాను పట్టిచ్చుకున్నాడని వాడికే కాదు, జనాలకి కూడా తెలియదు.

అయితేనేం డిపార్ట్‌మెంట్‌లో ఈ సంఘటన ద్వారా ఆనంద్ చాలా పాపులర్ అయ్యేడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here