[box type=’note’ fontsize=’16’] ‘యాదోం కీ బారాత్’ పేరిట తన అనుభవాలను, జ్ఞాపకాలను పాఠకులకు అందిస్తున్నారు శ్రీ వారాల ఆనంద్. [/box]
[dropcap]ఒ[/dropcap]కసారి ఉద్యోగంలో చేరింతర్వాత మన జీవిత చక్రం మారిపోతుంది. అప్పటి దాకా వున్న అలవాట్లు, టైంటేబుల్ వున్నది వున్నట్టు వుండదు. ఉద్యోగ కాలానికి అనుకూలంగా మారిపోతుంది. మార్చుకోవాలి. తప్పదు. అందులోనూ పని చేసే ఊర్లోనే వుంటే పరిస్థితి ఒకరకంగా వుంటుంది. వేరే వూర్లో వుండి రోజు షటిల్ కొట్టాలంటే మరొక రకం. నాది షటిల్ సర్వీస్. వేములవాడ-సిరిసిల్లా-వేములవాడ. అదట్లా వుంటే నేను ఉద్యోగంలో చేరిన 80లలో ఉద్యోగులు స్థానికంగా ఉండాలనే నిబంధనను ఖచ్చితంగా పాటించేవారు. అందుకోసం వేరే ఊర్ల కెళ్ళి వచ్చే పోయే వాళ్ళు స్థానికంగా ఒక ఇంటి నంబర్ ఇచ్చేవాళ్ళం. బయటకు వెళ్తే హెడ్ క్వార్టర్ అనుమతులు కూడా అవసరమయ్యేవి. ప్రిన్సిపాళ్లు, అధికార్లు కింది వాళ్ళను సతాయించాలనుకుంటే ఈ ఆయుధం వాడే వాళ్ళు. నాకలాంటి అవసరం రాలేదు.
***
ఒకసారి వేములవాడలో లాండ్ అయ్యాక మొదటి రోజుల్లో ఉదయమే తాతయ్య వాళ్ళింట్లో టిఫిన్ అదే పూర్తి చేసేవాణ్ని. తర్వాత అట్లా బయటకెళ్ళి ఇంటి వెనకాలే వున్న ఇట్టేడు కిరణ్ వాళ్ళ షాబాజ్ బండల షాప్ లోనో, రవీంద్ర తోనో లేదా రాజ్ ఫోటో స్టూడియో లోనో గడిపేవాన్ని. తర్వాత లంచ్ చేసి నడుచుకుంటూ మేదరివాడ, చాకలివాడలు దాటి వేములవాడ ‘మూలవాగు’ గుండా నడిచి తిప్పాపూర్ బస్ స్టాండ్ చేరేవాన్ని. అప్పటికి ఇంకా శాశ్వత బస్ స్టాండ్ నిర్మాణం కాలేదు. తిప్పాపూర్ స్టాండ్‌లో ట్రాక్టర్ ఆనందం, శ్రీమతి భాగ్యలక్ష్మి తదితరుల ఇండ్లు ఉండేవి. అక్కడే మక్కకంకులు అమ్మే వాళ్ళు, చిన్న చాయ్ దుకాణాలు ఉండేవి. బస్ ఎక్కి సిరిసిల్ల 12 కిలోమీటర్లు వెళ్ళే వాన్ని.
అట్లా కొంత కాలం వెళ్ళింతర్వాత మా కాలేజీ సహచరుడు యాద కిషన్ స్కూటర్ మీద షేర్ చేసుకుని కలిసి వెళ్ళడం అలవాటయింది. మార్చ్‌లో కాలేజీలో జాయిన్ అయితే అప్పటికి ఇంకా క్లాసులు జరుగుతున్నాయి. అప్పుడు రెండు రకాల విద్యార్థులు వుండేవాళ్ళు. ఒకరకం పరీక్షల్లో పల్టీలు కొట్టీ కొట్టీ ముదిరిపోయి లంపెన్ గాంగ్‌లా వుండేవాళ్ళు. మరో రకం కొంత ప్రగతిశీలంగా చదువుకుంటూ బాగుండేవాళ్ళు. సిరిసిల్లా కాలేజీ కో-ఎడుకేషన్. అమ్మాయిలూ అబ్బాయిలూ వుండేవాళ్ళు దాంతో వాతావరణం లైవ్లీ గానూ, వివాదంగానూ వుండేది. నేను చేరిన కొత్తల్లోనే పెద్ద గొడవ జరిగింది. ఒక రోజు తెలుగు లెక్చరర్ లక్ష్మయ్య గారు క్లాసులో చెబుతూ వుండగా మగ పిల్లలు ఏవో అశ్లీల మాటలు అని వాటి అర్థం కావాలనో ఏదో గొడవ పడ్డారు. అమ్మాయిలూ కూడా వుండడంతో గొడవ బాగానే అయింది. వివాదం ప్రిన్సిపాల్ గదిలో కొచ్చింది. విద్యార్థుల్ని ప్రిన్సిపాల్ పిలిపించాడు. ఆ సమయానికి యాదృచ్ఛికంగా నేను అక్కడే వున్నాను. “విద్యార్థులూ, మీరు పిల్లలు, ఇప్పుడే మీకివన్నీ ఎందుకు హాయిగా చదువుకోక” అంటూ నేనూ ఏదో మాట కలిపాను. ప్రిన్సిపాల్ వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాడు. ఇక ఏముంది గొడవ పెద్దది అయింది. నేను జువాలజీ లాబ్‌లో కిషన్ రాజన్న లతో వున్నాను. ఒక్కసారిగా పది మందికి పైగా స్టూడెంట్స్ అక్కడికి వచ్చారు. “ఏమో అన్నావట నీకేం తెలుసు.. ఎవరు నువ్వు.. నీకు పెళ్లయిందా.. నాకిద్దరు పిల్లలు తెలుసా” అంటూ దాడికి వచ్చాడొకడు.. నేను ఎదురుతిరిగే సరికి గొడవ పెద్దది అవుతున్నదని రాజన్న కిషన్‌లు వాళ్ళను సముదాయించి “సారు కొత్తగా వచ్చాడు..” అంటూ సర్ది చెప్పారు. కొంచెం గొడవ అయింది. వాళ్ళు వెళ్ళింతర్వాత వాడు ప్రతాప్ అనీ రఫ్ ఫెల్లో అంతా గుండాల తత్వం పోనీలే అన్నారు నాతో. మొదట్లోనే ఒక బిట్టర్ అనుభవం.
అదలా ఉండగానే ఇంటర్ వార్షిక పరీక్షలు వచ్చాయి. వేములవాడలో మా బంధువు మా మిత్రుడు ఎడ్ల రాజేందర్ తమ్ముడు మహేష్ మా కాలేజీలోనే ఇంటర్ స్టూడెంట్. ఆనంద్ బావ అంటూ క్లోజ్‌గా ఉండేవాడు. అప్పటికి నాకు పరీక్షలు రాసిన అనుభవమే తప్ప ఇన్విజిలేషన్ కొత్త. అందుకే మొదటి రోజు శ్రీధర్ రావు సర్ తనతో ఒకే గదిలో వేయించుకున్నాడు. తీరా చూస్తే మహేష్ అదే రూములో పరీక్ష రాస్తూ వున్నాడు. ఏముంది, ఇంగ్లీష్ పరీక్ష గ్రామర్ బిట్స్ అన్నీ చెప్పాను. అట్లా ఉపయోగపడ్డాను. రోజూ పరీక్షల డ్యూటీ క్రమంగా అలవాటయింది. అప్పుడే రుద్ర రవి, హసన్ ఫసి ఉల్లా, అశోక్ తదితరులు, ఇంకా శైలజ (హిమజ) కూడా పరీక్షలు రాసారు. మిత్రుడు కోడం పవన్ కుమార్ పరీక్షల చివరి రోజు వచ్చి రవి తదితరులను పరిచయం చేసాడు. ఆశ్చర్యంగా ఇంటర్ 2 ఇయర్ పరీక్షలు రాసిన వాళ్ళూ నేనూ మంచి స్నేహితులమయ్యాం. శైలజ మా ఆంటీ అయింది.
కాలేజీ పరిస్థితి ఇట్లా వుంటే బయట అప్పటికే మంచి కవిగా పేరు గడించిన ఆత్మీయ మిత్రుడు జూకంటి జగన్నాథం సిరిసిల్లా సెస్ (Co-Operative Electrical Supply Society) లో పనిచేసేవాడు. తను కూడా కాలేజీకి వచ్చేవాడు, నేనూ వాళ్ళ ఆఫీసుకు వెళ్తూ వుండేవాన్ని. పవన్‌తో కలిసి అప్పటికే సీనియర్ కవి శ్రీ కనపర్తి గారి ఇంటికి వెళ్ళేవాళ్ళం. వాళ్ళ కూతుళ్ళు కవిత, సరితలు కూడా బాగా ఆత్మీయంగా మాట్లాడేవాళ్ళు. ఇంకా నిజాం వెంకటేశం, జక్కని వెంకట రాజం, వడ్డేపల్లి కృష్ణ తదితరుల పరిచయమూ అప్పుడే జరిగింది. అదే సమయంలో అంతా సాహిత్య వాతావరణం. కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ పసుపులేటి జయంత్ కుమార్ కూడా కవిత్వం రాసేవాడు. మొత్తంగా సిరిసిల్లలో ఒక సాహితీ వాతావరణం వుండేది. దాదాపుగా అదే సమయంలో నేనో కథ రాస్తే అది ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో వచ్చింది. ఒక తహసిల్దార్ కూతురు కాలేజీలో లెక్చరర్ అన్న మాటలకు అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకుంటుంది, అలాటిదే ఆ కథ. మంచి రెస్పాన్స్ వచ్చింది కాని కాలేజీలో అలాంటి సంఘటన జరిగింది అదే రాసానని జయంత్ ప్రచారం చేయడంతో కొంత వివాదమయింది. అలాంటిదేమీ లేదని నేను చాలా సర్ది చెప్పుకోవాల్సి వచ్చింది.
అట్లే సిరిసిల్ల జూనియర్ కాలేజీలో పని చేస్తుండగా మొదటి సంవత్సరాలల్లోనే ఏవో ఎన్నికలోచ్చాయి. అప్పటి ఉత్తర తెలంగాణా అట్టుడుకుతున్న స్థితి. ఒక వైపు అన్నల ఎన్నికల బహిష్కరణ పిలుపు. మరో వైపు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఎన్నికల్ని నిర్వహించాలని పట్టు. దాంతో ఎన్నికల సమయంలో గోడలన్నీ వివిధ రాజకీయ పార్టీల ప్రచార ఆడంబరాలు. మరో ప్రక్క ఎన్నికల బహిష్కరణ పిలుపు నిస్తూ అన్నల నినాదాల రాతలు. పరిస్థితి చాలా ఉద్రిక్తంగా వుండేది. పోలింగు సమయంలో ఓట్ల బాక్సులు ఎత్తుకెళ్ళడం, పోలీసుల పైన దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్ళిన సంఘటనలు కూడా జరిగేవి. ఎన్నికల అధికారులు ఒక స్థాయిలో పోలీసులు వుంటే మేము ఎన్నికలు నిర్వహణ చేయం అనేదాకా వచ్చింది. అంతే కాదు అన్నలు వస్తే బాక్సులు అప్పగించాలే తప్ప వాళ్ళతో వాదాలకు వివాదాలకు దిగొద్దని కూడా నిర్ణయం చేసారు. ఉన్నతాదికారులది ఎటూ చెప్పలేని స్థితి. ప్రభుత్వ నిర్ణయం కనుక ఎట్లాగోలా ఎన్నికల్ని నిర్వహించాలన్నది వాళ్ళ పట్టుదల. ఆ సమయం లోనే నాకు కొనారావుపేట్, నిమ్మపల్లి ప్రాంతాల్లో ఒక గ్రామంలో ఎన్నికల డ్యూటీ పడింది. నాకేమో కొత్త. అయినా మామూలుగానే వున్నాను. ఎన్నికల ట్రైనింగ్ క్లాసులు ముగిసాయి. చూపుడు వేలికి చుక్కలు పెట్టడం, బాలట్ పేపర్లు మలవడం మొదలు అనేక విషయాలు వివరించారు. “మీరంతా చాలా ఎన్నికలు చూసారు” అంటూనే అధికారులు అనేక విషయాల్ని వివరించారు. ఎన్నికల రోజులు రానే వచ్చాయి. ఎన్నికల సామాన్లు తీసుకునే సమయంలో డ్యూటీ ఎక్కడో ఎవరెవరు ఏ టీమో ఆదేశాలు ఇచ్చేవారు. నాకు మా కాలేజీ పీఈటీ దేవరాజం సారు, నారాయణ సార్లు సహచరులుగా వచ్చారు. నేను ఊపిరితీసుకున్నాను. “నువ్వేం ఫికర్ పెట్టుకోకు బిడ్డా. మేం చూసుకుంటాం” అన్నారు వారిద్దరు. దేవరాజం సారయితే వాళ్ళ ఇంటినుండి ముగ్గురికి సరపడా చికెన్ మటన్ లతో కారేజీల్లో భోజనం తెచ్చాడు. ఇంకేముంది. ఎన్నికలు సరదాగానే గడిచాయి. పోలింగుకు ముందు రోజు మాత్రం పీకల దాకా టెన్షన్తో గడిచింది. అట్లా మొదటి ఎన్నికల డ్యూటీ గడిచి ఊపిరి పీల్చుకున్నాను.
అట్లా సిరిసిల్లా కాలేజీలో వుండగా రెండు మూడు ఎన్నికలలో డ్యూటీ చేసాను. ప్రతిసారీ వేర్వేరు వూర్లు, భిన్నమయిన అనుభవాలు.
***
80 విద్యాసంవత్సం ముగిసిన తర్వాత క్రమంగా కొత్త అడ్మిషన్లు, కొత్త పిల్లలు సరికొత్త అనుభవాలు. విద్యాలయాల్లో ఉండే గొప్పదనమే అది. ఎప్పటికప్పుడు కొత్తే. పిల్లలు చదువులు బదిలీలతో కొత్త సహచరులు. ఏదీ మిగతా కార్యాలయాల్లో లాగా రొటీన్‌గా వుండదు. ఏ విద్యా సంవత్సరానికా సంవత్సరం కొత్తదే. నేను సిరిసిల్ల కాలేజీలో పూర్తి చార్జ్ తీసుకుని విద్యార్థులతో కలివిడితనం పెంచుకోవడం మొదలు పెట్టాను. పుస్తకాలివ్వడం. తీసుకోవడం. అంతా గోల గోలగా వుండేది. కొందరు బుద్దిగా వుంటే మరి కొందరు చిరాకు కలిగించే వాళ్ళు. నాకున్న Stammering ఒక్కోసారి బాగా ఇబ్బంది పెట్టేది. పిల్లలు ముందు కాకున్నా వెనక నవ్వే వాళ్ళనుకుంటా. ఏమీ చేయలేని స్థితి. నా ఫ్రెండ్లీ తత్వమే నన్ను విద్యార్థులకు దగ్గర చేసింది. అంతే కాదు నా ప్రగతిశీల భావాలు కూడా ఆ ఆలోచనలున్న స్టూడెంట్స్‌కు దగ్గర చేసింది. జగన్నాథం లాంటి మిత్రులు క్లాసులు చెప్పాల్సి లేకున్నా నేను ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం పట్ల బాధ పడేవాళ్ళు.
కానీ నేను దాన్ని క్రమంగా అధిగమించాను. ముఖ్యంగా రుద్ర రవి లాంటి వాళ్ళ స్నేహం ఎంతో బలాన్నిచ్చింది. వాళ్ళ స్నేహం కలిసిన తర్వాత సిరిసిల్ల గాంధీ చౌరస్తాలో వున్న వాళ్ళ బాంబే డైయింగ్ షాప్‌లో దాదాపుగా కలిసే వాళ్ళం. ఫసి, సలీం, అశోక్, గూడూరి ప్రవీణ్, బొగ రవి లాంటి అనేక మిత్రులతో పాటు జగన్, పవన్ అంతా ఓకే బాచ్. కలిసామంటే చాలు స్వీట్ హౌజ్‌లో గంగా జమున లేదా ఉడిపిలో టిఫిన్లు అంతా ఒక సెలెబ్రేషన్ లాగా వుండేది. రవి వాళ్ళ నాన్న శ్రీ రుద్ర శంకరయ్య గారు ఆ వూరికి అనేక టర్మ్స్ సర్పంచ్. తను కూడా నేనంటే బాగా అభిమానంగా చూసేవారు. ఫసి వాళ్ళ బాబాయి జిల్లా పరిషత్తు కో-ఆప్షన్ సభ్యుడిగా వుండేవారు.
సిరిసిల్లలో ఆ రకంగా చైతన్యవంతమయిన జీవితానికి మిత్ర బృందం అనేక విధాలుగా తోడ్పడింది. అంతే కాదు సాంస్కృతికంగా అనేక కార్యక్రమాలూ చేసాం ఆ వివరాలతో మళ్ళీ వారం కలుస్తాను.
(ఇంకా ఉంది)