యాదోం కీ బారాత్-7

0
10

[box type=’note’ fontsize=’16’] ‘యాదోం కీ బారాత్’ పేరిట తన అనుభవాలను, జ్ఞాపకాలను పాఠకులకు అందిస్తున్నారు శ్రీ వారాల ఆనంద్. [/box]

సిరిసిల్ల-వేములవాడ-సంస్థలూ అనుబంధాలూ

[dropcap]కొం[/dropcap]దరు ఉద్యోగ బాధ్యతల్ని తీసుసుకున్న తర్వాత అందులో పూర్తిగా అంకితమయినట్టు నటిస్తారు. ఎంత కష్టమొచ్చిందిరా దేవుడా అని అంటూ వుంటారు. అక్కడికి తానొక్కడే ఉద్యోగం చేస్తున్నట్టు తాను మాత్రమే కష్టపడుతున్నట్టు.. అదీ ఉచితంగానూ ఏదో మేహర్బానీకి చేస్తున్నట్టు. అలాంటి వాళ్ళను చూస్తే నాకయితే కోపం రాదు కానీ వాళ్ళ అమాయకత్వానికి జాలి కలుగుతుంది. “తవ్వెడు ఇచ్చిన కాడ తంగెళ్ళు పీకాలి” అని సామెత. మరెందుకట్లా ఫీలవుతారో తెలీదు అందంతా గొప్ప కోసమే. అంతా అయ్యో పాపం అనుకోవాలని. అట్లా అయ్యో పాపం అనిపించుకునే బతుకు బతుకే కాదని నేననుకుంటాను.

నా మట్టుకు నేనయితే ఉద్యోగ బాధ్యతను దానికి అదనపు బాధ్యతల్ని ఇష్టంగానే చేసాను. ఇష్టం కాని రోజు చెయ్యలేదు. బాసులతో గొడవ పడ్డ రోజులూ వున్నాయి.

సిరిసిల్లా కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మొదటి విద్యా సంవత్సరం గడిచి ఉద్యోగం ఒక దారిన పడింది. మరివైపు సిరిసిల్లా, వేములవాడ, కరీంనగర్ లల్లో మిత్రులతో కాలం సాగుతూపోయింది. ‘తిరిగిన కాళ్ళూ.. వాగిన నూరూ ఊరికే వుండదు’ అన్నట్టుగానే నాకూ ఉద్యోగం ఒక్కటే కాకుండా ఇంకా ఏదో చేయాలనే తపన మొదలయింది. కవితలు, కథలు రాసే ప్రయత్నం సాగుతూ ఉండగానే ఇది సరిపోదు ఇంకా ఏదో చేయాలనే ఆలోచన నిలవనీయకుండా వుండేది.

సరిగ్గా అప్పుడే కరీంనగర్ ఫిలిం సొసైటీ కార్యక్రమాలతో పరిచయం ఏర్పడింది. ఆదివారాలు ఉదయమే వెంకటేశ్వర టాకీసులో సినిమాలకు వెళ్ళసాగాను. ఆ సినిమాల్ని చూడడంతో పాటు ఆయా ప్రపంచ సినిమాల గురించి తెలుసుకోవడం, చదవడం కూడా షురూ అయింది.

మరో వైపు వేములవాడలో డాక్టర్ రఘుపతి రావు మామయ్య కూడా సామాజిక కార్యక్రమాల పట్ల సానుకూలంగా వున్నవాడే. తాను రాయడం అంతగా చేయలేదు కాని అనేక నవలలు, పుస్తకాలు చదివి ఇంట్లో సమకూర్చి పెట్టాడు. వాటి ప్రభావం వల్లనే జింబో నేనూ సాహితీ రంగంలోకి వచ్చాము. అందుకు ఆయనకు ఎంతో రుణపడి వున్నాం కూడా. డాక్టర్ రఘుపతి మామయ్య సిరిసిల్ల లయన్స్ క్లబ్ లో కూడా చాలా యాక్టివ్‌గా ఉండేవాడు. అప్పుడే తాను లయన్స్ క్లబ్ డిప్యుటీ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయ్యాడు. ఇంకేముంది లయన్స్ క్లబ్ కార్యక్రమాలు మరింత పుంజుకున్నాయి. తన పదవీ ప్రమాణ స్వేకారోత్సవం వేములవాడలో ఘనంగా జరుపాలని నిర్ణయించారు. అప్పటికి వేములవాడలోని తిరుమల తిరుపతి దేవస్థానం వారి వసతి గృహం బాగుండేది. ఉత్సవం అందులో ఏర్పాటయింది. అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీ కే.ఎస్.శర్మ ముఖ్య అతిథి. లయన్స్ ప్రముఖులంతా ఎట్లాగూ వుంటారు. వేములవాడలో నగుబోతు ప్రభాకర్, నల్ల ప్రభాకర్, నగుబోతు చంద్రమౌళి, సిరిసిల్లలో భోగ వెంకట స్వామి, విష్ణు ప్రసాద్ రావు, ముత్యం రెడ్డి ఇంకా అనేక మంది లయన్స్‌లో ప్రముఖులు. ఇక ఆ సందర్భంగా ఒక సావనీర్ తీయాలని సంకల్పించారు. లయన్స్ సంస్థతో నాకేమీ సంబంధం లేదు, పెద్దగా గొప్ప అభిప్రాయమూ వుండేది కాదు. ‘షో’ ఎక్కువ పని తక్కువ అనుకుంటూ ఉండేవాడిని. కాని మామయ్య పిలిచి సావనీర్ బాధ్యత నీదే అన్నాడు. ఇంక ఏముంది సరే నన్నాను. దానికి కొన్ని రోజులు కరీంనగర్‌లో వుండి ప్రింటింగ్ పనులు చూడాలి. సిరిసిల్లలో ప్రముఖులయిన లయన్స్ కొంతమంది మా కాలేజీ ప్రిన్సిపాల్ మోహన్ రావు దగ్గరకు వచ్చి ఆనంద్‌ను ఓ నాలుగు రోజులు డిప్యుటేషన్ మీద మాతో పంపమని అడిగారు. వూరి పెద్దలు కనుక ఆయనకు సరే అనక తప్పలేదు. ఇక నేను చలో కరీంనగర్. గడియారం కాడ గౌరిశెట్టి కాంప్లెక్స్‌లో వున్న నిర్మల ప్రింటింగ్ ప్రెస్‌లో సావనీర్ ముద్రణ. ఆ ప్రెస్ బి. విజయ కుమార్‌ది. విజ్జన్నతో అప్పుడే పరిచయం. చిత్రిక పురాణం రామచంద్ర లతో అప్పటికే రచయితగా వున్న పరిచయం విజయకుమార్‌తో కలివిడిగా ఉండేందుకు దోహద పడింది. నిజానికి బి.విజయకుమార్‌తో పరిచయం కావడానికి, స్నేహం చేయడానికి ముందస్తుగా తెల్సి ఉండాల్సిన అవసరం లేదు. కలిస్తే చాలు. అందరితో పాలు నీళ్ళలా కలిసి పోయే గొప్ప లక్షణం ఆయనది.

అదిగాదన్నా.. అంటూ భుజం మీద చేయి వేసేవాడు. అలాంటి విజయకుమార్‌తో సిరిసిల్లా లయన్స్ క్లబ్ సావనీర్ ద్వారా దగ్గరి పరిచయం మొదలయింది. ఆ తర్వాతి దశాబ్దాలలో అది అనేక రకాలుగా వృద్ధి చెంది సాహిత్య సృజనాత్మక రంగాల్లో నా ఎదుగుదలకు ఎంతో దోహద పడింది. ఆ ప్రెస్ లోనే రత్నాకర్, సుగుణాకర్ తదితరుల పరిచయం కూడా జరిగింది. ఇక మూడు రోజులు రాత్రీ పగలూ కష్టపడి సావనీర్ సిద్ధం చేసాం. తెల్లవారితే ఫంక్షన్ అనగా మా టెన్షన్ చెప్పనలవికాదు. ఆ రాత్రి పూర్తి మెలకువతో వుండి బైండింగ్‌తో సహా పూర్తి చేసాం. ఉదయమే విజ్జన్న నేను అక్కడే హోటల్‌లో చాయ్ తాగం. బుక్స్ రిక్షాలో వేసుకుని నేను వేములవాడ బస్సెక్కాను. ఇంటి దగ్గరికి వెళ్ళే సరికి రఘుపతి మామయ్యతో సహా లయన్స్ అంతా వున్నారు. సావనీరందదేమో అనుకుంటున్నారంతా. నన్ను చూసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్నాన పానాదులు లేని నా ముఖం చూసి వెళ్లి రెడీ అయి మీటింగ్‌కు రా అన్నారు. మీటింగ్ బాగా అట్టహాసంగా జరిగింది.

నా బాధ్యతను నెరవేర్చినందుకు నన్నూ అభినందించారు.

తర్వాత కొంత కాలానికి లయన్స్ క్లబ్ ఆఫ్ సిరిసిల్లా వాళ్ళు అదే టీటీడీ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో రెండు రోజుల భారీ ఐ కాంప్ (కంటి పరీక్షా కాంప్) పెట్టారు. చాలా గొప్ప కార్యక్రమం అది. అందులోనూ నేను చొరవగా పాల్గొన్నాను. ఆనాటి కాంప్‌కు రుద్ర రవి, ఫసీ, ముత్యం రెడ్డి, సుద్దాల బాలయ్యతో పాటు ఇంకా చాలా మంది వచ్చారు. అంతకు ముందు రోజే హైదరాబాద్‌లో కమలహసన్ ‘ఆకలి రాజ్యం’ సినిమా చూసి వచ్చిన ముత్యం రెడ్డి ఆ సినిమాను వర్ణించిన తేరు ఇప్పటికీ మర్చిపోలేను. స్క్రీన్ ప్లే మొత్తం వున్నది వున్నట్టు మా ముందు ప్రెసెంట్ చేసాడు. ఫలితంగా మర్నాడు ఉదయమే రవి మిత్రులందరినీ వెంటేసుకుని హైదరాబాద్ వెళ్లి ‘ఆకలి రాజ్యం’ చూసి వచ్చాడు.

ఐ క్యాంపు తర్వాత లయన్స్ క్లబ్ కార్యక్రమాలతో నేను పెద్దగా సంబంధం పెట్టుకోలేదు.

***

మరోవైపు వారం వారం లేదా సెలవు దొరికినప్పుడల్లా కరీంనగర్ వెళ్ళడం మామూలే. మంకమ్మ తోటలో నివాసం. ఇంట్లో మిగతా అంతా పిల్లలు. నేను క్రమంగా దామోదర్ నారాయణ రెడ్డి వెంకటేష్‌ల సర్కిల్ దాటి ఫిలిం సొసైటీ ఎంక్లోజర్ లోకి వచ్చాను. గడియారం దగ్గర దిల్లీవాలా స్వీట్ హౌస్ పక్కనే వున్న బాలాజీ డ్రెస్సెస్‌కు వెళ్ళడం మొదలు పెట్టాను. రేణికుంట రాములు సార్ అప్పుడు కరీంనగర్ ఫిలిం సొసైటీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. నాకు ఆయన చిన్నప్పటినుండే తెలుసు. మేము మిఠాయి దుకాణం ఇంట్లో వున్నప్పుడు నాన్న నన్ను ‘సంసన్స్’ దుకానికి తీసుకుచ్చేవాడు. ఆదే తర్వాత బాలాజీ అయింది. అదే రాములు సార్ ఫిలిం సొసైటీ రాములు అయ్యాడు. రాములు గారిని కలిసి వేములవాడలో ఫిలిం సొసైటీ పెట్టాలని వుంది, మీ సహాయం కావాలి అనగానే దాందేముంది. యూనియన్ బాంక్‌లో ఎన్.శ్రీనివాస్ ఉంటాడు తానే ఇప్పుడు ప్రెసిడెంట్. రేపుదయం రండి అన్నాడు. ఉదయం వెళ్ళగానే శ్రీనివాస్ అక్కడికి రావడం, వేములవాడలో స్టార్ట్ చేయడానికి చేయాల్సిన పనులపై చర్చించాం. అప్పటికే తాను నా రచనలు చదివి వున్నాడు. బాగా స్నేహంగా కలిసిపోయాడు. ఆ స్నేహం అనేక దశాబ్దాల పాటు అవిశ్రాంతంగా సాగింది.

***

వేములవాడ వెళ్లి వేములవాడలో ఏదయినా చేయాలి. కాలం ఇట్లా వృథాగా గడపడంలో అర్థం లేదని మిత్రుడు ఇట్టేడు కిరణ్ కుమార్‌తో అన్నాను. ఫిల్మ్ సొసైటీ పెడితే ఎట్లా వుంటుంది అని కూడా అన్నాను. కిరణ్ వెంటనే స్పందించాడు. ఏం చేయాలో నువ్వు చెప్పు బావా, ఎట్లా చేయాలో నేను చూస్తాను అన్నాడు. మరో ఆత్మీయుడు పి.ఎస్.రవీంద్రతో చర్చిస్తే బ్రహ్మాండంగా వుంటుంది పదండి ముందుకు అన్నాడు. నాకు లోపలెక్కడో ఇంత చిన్న వూర్లో మనతో అవుతుందా అనే మీమాంస పీకుతూనే వుంది. కాని కిరణ్ రవీంద్రలు రెండువైపులా వుండి అరె నువ్వు ప్రణాళిక వెయ్యి నడిపిద్దాం అన్నారు.

మొదట కలిసివచ్చే వాళ్ళతో కార్యవర్గం రూపొందించాలి. గోకుల్ టాకీస్ యజమానితో మాట్లాడి ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు సినిమా వేసుకునే అవకాశం కల్పించమని అడగాలి, సభ్యత్వాలు చేయించాలి. ఇవీ మాముందున్న పనులు. ఏ సినిమాలు వేయాలన్నది నా బాధ్యత. అంతే వేములవాడ రోడ్లమీద పడ్డాము. నగుబోతు ప్రభాకర్ అధ్యక్షుడిగా, నల్ల ప్రభాకర్, డా కే.మనోహర్ ఉపాధ్యక్షులుగా, వారాల ఆనంద్ కార్యదర్శిగా, ఇట్టేడు కిరణ్ కుమార్ సంయుక్త కార్యదర్శిగా, నగుబోతు చంద్రమౌళి కోశాధికారిగా పి.ఎస్.రవీంద్ర, జింబో, వజ్జల శివకుమార్, ఎడ్ల రాజేందర్, యాద కిషన్, కృష్ణ చంద్రతో పాటు ఇంకా పలువురు కార్యవర్గసభ్యులుగా కమిటీ రూపొందింది. సభ్యత్వ కార్డులు మిగతా పనులన్నీ పూర్తి అయ్యాయి. ఇక సినిమా కోసం నేను మొట్టమొదటిసారిగా సికింద్రాబాద్ ఆర్.పి.రోడ్‌లో వున్న సినిమా డిస్ట్రిబ్యూటర్ల ఆఫీసుల చుట్టూ తిరిగి సత్యజిత్ రే ‘షత్రంజ్ కే కిలారి’ సినిమా ప్రారంభ చిత్రంగా వేయడానికి బుక్ చేసాను. ఇక సొసైటీని ప్రారంభించడానికి FEDERATION OF FILM SOCIETIES OF INDIA Regional committee member ఎం.ఫిలిప్ దగ్గరికి వెళ్లాను. ఆయన ఆఫీసు రాణీగంజ్‌లో వుండేది. ఆ రోజు నా వెంట మంగారి రాజేందర్ జింబో కూడా వున్నాడు. వేములవాడ ఎక్కడుంటుంది, ఏ సినిమా వేస్తున్నారు అంటూ పలు ప్రశ్నలు వేసి తాను రావడానికి అంగీకరించాడు. ఇక స్థానిక ఏర్పాట్లల్లో కిరణ్, రవీంద్ర లతో పాటు మిగతా సభ్యులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. అప్పుడు వేములవాడ ఊర్లోకి హైదరాబాద్ నుండి సూపర్ పేర ఒకే బస్ వచ్చేది. ఆ బస్సు రాత్రి 10 గంటలకి గుడి ముందుకు చేరి మళ్ళీ ఉదయమే 5 గంటలకు వెళ్ళేది. దాన్లోనే సినిమా బాక్సులు వేములవాడ చేరేవి. అట్లా 23 ఆగస్ట్ 1981 రోజున గోకుల్ టాకీస్‌లో ఉదయం వేములవాడ ఫిలిం సొసైటీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభమయింది. అప్పటి మండలాద్యక్షుడు ఆర్.పాపా రావు, సర్పంచ్ ప్రతాప చంద్రమౌళి, డాక్టర్ ఎం. రఘుపతి రావు, నగుబోతు ప్రభాకర్‌లు వేదిక పై వుండగా ఎం.ఫిలిప్ ప్రారంభ ఉపన్యాసంతో సొసైటీ షురూ అయింది. సభ బాగా జరిగి సినిమా మొదలయింది.

ఆనాటి ప్రారంభ కార్యక్రమానికి కరీంనగర్ ఫిలిం సొసైటీ నుంచి నరెడ్ల శ్రీనివాస్, రేణికుంట రాములు, డి.నరసింహారావు, ఉప్పల రామేశం మమ్మల్ని అభినందించడానికి వచ్చారు, ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో మా అధ్యాపకుడయిన నరసింహా రావు గారు ‘ఆనంద్ యు ఆర్ బిహైండ్ దిస్…’ అని మనస్పూర్తిగా అభినందించాడు. ఆ రోజు సభావేదిక మీదికి కరీంనగర్ మిత్రుల్లోంచి ఒకరిని పిలవాల్సి వుండే… నాకు తోచలేదు ఎవరూ అనలేదు.. కానీ ఆ తప్పు ఇప్పటికీ నన్ను తొలుస్తూనే వుంటుంది. ఇక సిరిసిల్లా నుంచి ఆత్మీయులు రుద్ర రవి, ఫసి, జూకంటి జగన్నాధం ఒకే స్కూటర్ మీద వచ్చారు. అదొక పండుగ వాతావరణం. ఇదంతా బాగానే వున్నా సినిమాపై సభ్యుల ప్రతిస్పందన ఎట్లా వుంటుంది, appreciate చేస్తారా లేదా అన్నది నన్ను తొలుస్తున్న ప్రశ్న. అప్పటిదాకా సభ్యుల్లో అధిక శాతం వ్యాపార సినిమాలకు అలవాటుపడ్డ వాళ్ళే. నాకదో బెంగగా అనిపించసాగింది. సినిమా ముగిసేంతవరకు అది కొనసాగింది. కాని అనేక మంది టీచర్లు, టెంపుల్ ఉద్యోగులు కొందరు వ్యాపారవేత్తలూ బాగా స్పందించారు. మంచి సినిమా చూసే అవకాశం కల్పించారని అభినందించారు. మా అందరికీ బాగా ఉత్సాహం వచ్చింది. తర్వాత సిరిసిల్లా రుద్రరవి, ఫసి, జూకంటి అంతా కలిసి ఉడిపి హోటల్‌లో కొంత సమయం గడిపి సెలవు తీసుకున్నాం.

వేములవాడలో మొదటి సమాంతర సినిమా- ‘షత్రంజ్ కే ఖిలారి’:

సత్యజిత్ రే తన జీవిత కాలంలో తీసిన రెండు హిందీ సిన్మాల్లో ఇది ఒకటి (రెండవది ‘సద్గతి’). ఇది ప్రేమ్‌చంద్ కథ ఆధారంగా రూపొందించబడింది. ‘షత్రంజ్ కే ఖిలారి’ గొప్ప రాజకీయ వ్యంగ్యాత్మక మయిన సినిమా. ఈస్ట్ ఇండియా కంపనీ మన దేశంలోని అవధ్ లాంటి వివిధ రాజ్యాల్ని ఎట్లా కూలదోశాయో దానికిగాను స్నేహ ఒప్పందాల పేర తమ మిలిటరీని ఆయా రాజ్యాల్లో దింపి క్రమంగా ఆ ప్రాంతాల్ని ఎట్లా ఆక్రమించింది ఈ సినిమా గొప్పగా చూపిస్తుంది. ప్రేమ్‌చంద్ మూల కథకు కొంత కథనాన్ని జోడించి తీసిన ఈ సినిమా విశేష ప్రశంసలు అందుకుంది. ఇందులో ముఖ్యంగా అమ్జద్ ఖాన్ పాత్ర పోషణ ప్రశంసించదగింది.

ఇది సత్యజిత్ రే తన సృజనాత్మక జీవితంలో తీసిన అత్యంత ఖరీదయిన సినిమా కూడా. బాంబే హిందీ సినిమా పరిశ్రమకు చెందిన సంజీవ్ కుమార్, అమ్జాద్ ఖాన్, సయీద్ జాఫ్రీ, షబానా ఆజ్మి, ఫరిదా జలాల్, రిచర్డ్ అట్టెంబరో తదితరులు నటించారు ‘షత్రంజ్ కే ఖిలారి’లో. వేములవాడ ఫిలిం సొసైటీ సభ్యులకు ఆ రోజుల్లోనే బాగా నచ్చిందీ సినిమా. అట్లా ఎప్పుడూ దేవస్థానమూ జాతరా జనంతో బిజీగా వుండే వేములవాడలో కళాత్మక సినిమాల ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. తర్వాతి రోజుల్లో వాటిపైన చర్చలు, సెమినార్లు కూడా నిర్వహించాం. నాలుగు దశాబ్దాల క్రితం నాటి వాటి వివరాలు రానున్న ఎపిసోడ్‌లో రాస్తాను.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here