కొన్ని మధుర స్మృతులు, కొన్ని చేదు జ్ఞాపకాలు – వెరసి ‘యాదోంకీ బారాత్’

2
11

[శ్రీ వారాల ఆనంద్ ఆత్మకథ ‘యాదోం కీ బారాత్’ను పరిచయం చేస్తున్నారు కొల్లూరి సోమ శంకర్]

[dropcap]క[/dropcap]వి, సినీ ప్రేమికుడు, వ్యాసకర్త, సంపాదకుడు, అనువాదకుడు శ్రీ వారాల ఆనంద్ స్వీయచరిత్ర ‘యాదోం కీ బారాత్’ ఇటీవల వెలువడింది. ఇప్పటికే తెలుగులో చాలా ఆత్మకథలున్నాయి కదా, మళ్ళీ ఇంకోటి ఎందుకు అని కొందరికి అనిపించవచ్చు. అందరి జీవితాల్లోనూ కష్టసుఖాలు, బాధలు సంతోషాలూ సహజమే కదా అని అనవచ్చు. నిజమే, కానీ కష్టాలను ఎదుర్కునే తీరు, సంతోషాలకు స్పందించే విధానం మనిషి మనిషికీ మారుతుంది. ఏ కష్టాన్ని ఎలా దాటారు, జీవనపోరాటం ఎలా సాగించారన్నది వైవిధ్యంగా ఉంటాయి. అందుకే ఎన్ని ఆత్మకథలొచ్చినా, మరొకరి ఆత్మకథ ఆసక్తిగానే ఉంటుంది. సందర్భమో కాదో కానీ, ఒక ఉదంతం స్ఫురించింది. కల్పవృక్షం రచించేటప్పుడు విశ్వనాథ గారికి ఇలాంటి ప్రశ్నే ఎదురయిందట. “ఇప్పటికే ఇన్ని రామాయణాలు ఉన్నాయి, మరొకటి ఎందుకు?” అని. జవాబుగా ఆయన ‘మరల నిదేల రామాయణం బన్నచో’ అన్న పద్యం చెప్పడం గుర్తొచ్చింది. జీవించడమనేది అందరికీ ఒకటే అయినా ఎవరి జీవితం వారిది, ఒకరిలా మరొకరు జీవించలేదు. ఆనంద్ గారి జీవితం ఆనంద్ గారిదే, దాన్ని మనం జీవించలేం. మరి ఆయన జీవితం గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? ఆయన ఆత్మకథ ఎందుకు చదవాలి?

అసలు ఏ పుస్తకమైనా ఎందుకు చదువుతాం? మనని నవ్విస్తుందనో, ప్రేరణనిస్తుందనో, మనలాంటి వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారన్న భరోసానిస్తుందనో, మనకన్నా దుర్భరమైన స్థితిలో ఉండి కూడా బ్రతుకు మీద ఆశ కోల్పోకుండా కొందరున్నారనో మనకి తెలియచెప్తుందనో, కవితగానో, కథగానో తోటివారి భావాలను చెప్తాయనో మనం పుస్తకాలను చదువుతాం. చాలా పుస్తకాలు మనకి తెలియని విషయాలు కొన్నైనా నేర్పుతాయన్న నమ్మికతో చదువుతాం. కొన్ని పుస్తకాల లోంచి, రచయిత అనుభవాల నుంచో, ఆ పుస్తకంలోని వ్యక్తుల నుంచో కొంత మంచిని స్వీకరిస్తాం, కొంత చెడును వదిలించుకోడానికి ప్రయత్నిస్తాం.

ముఖ్యంగా స్వీయకథల విషయానికి వస్తే, సుమారు 60-70 ఏళ్ళ చరిత్ర ఉంటుంది. ఆ వ్యక్తి పుట్టుక, ఎదుగుదల, చదువు, సోపతులు, ఉద్యోగాలు, అభిరుచులు, వివాహం, పిల్లలు, మనుమలు.. ఇలా ఎన్నో విషయాలు తెలుస్తాయి. వీటన్నిటితో ముడిపడి ఉన్న నగరాలు, పట్టణాలు, గ్రామాలు – ఆయా ఊర్లలో వచ్చిన భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిమాణాలు, మానవ సంబంధాలలో మార్పులు.. సమాజాన్ని ప్రభావితం చేసిన అంశాలు.. ఎన్నో తెలుస్తాయి. క్లుప్తంగా ఓ ప్రాంతపు గతం, వర్తమానం తెలుస్తాయి. ఆనంద్ గారి ఆత్మకథ నుంచి కూడా ఇలాంటివెన్నో మనకి తెలుస్తాయి. ఒక్కప్పటి కరీంనగర్, అలనాటి వేములవాడ, నాటి సిరిసిల్ల ఇందుకు ఉదాహరణలు.

జీవికని అన్వేషిస్తూ సొంతూరుని వదిలి తమ కుటుంబం కరీంనగర్ ఎలా చేరిందో చెబుతారు ఆనంద్. మిఠాయిల వ్యాపారం, గాజుల వ్యాపారంలో ఎలా రాణించారో చెప్తారు. అరిపిరాల అనే గ్రామం కరీంనగర్‍గా ఎలా మారిందో చెప్తారు. సొంతింటిలోనే బాల్యం ‘వలస’లా మారిందని తన బాల్యం గురించి రాసుకున్న కవిత వేదనని కలిగిస్తుంది. ఉమ్మడి కుటుంబం గురించి, బంధుమిత్రుల గురించి, తనకెదురైన ఆదరణ, అవమానాల గురించి ఈ పుస్తకంలో నిజాయితీగా వ్యక్తం చేశారు ఆనంద్.

బాల్యం నుంచి రేడియో ఆనంద్ గారిపై చూపిన ప్రభావం గురించి చదువుతుంటే ఆకాశవాణి అలనాటి వైభవం తెలుస్తుంది. పురానీ ఫిల్మోంకే గీత్, ఆప్ హీ కే గీత్, బినాకా గీత్ మాలా వంటి రేడియో కార్యక్రమాలు ఒకటి రెండు తరాలని ఉర్రూతలూగించాయి. టెంత్ వరకూ రేడియో ద్వారా సినిమా పాటల పై కలిగిన ఆసక్తి, ఇంటర్‍ చదివే సమయానికి సాహిత్యంవైపు మళ్ళింది. ఆ రోజుల్లోనే నవలలతో పాటు సినిమాలు కూడా ఆనంద్ గారి జీవితంలో విడదీయరాని భాగాలైపోయాయి. ‘ఆనంద్’ సినిమాతో రాజేష్ ఖన్నా తన అభిమాన నటుడైన వైనాన్ని చెప్తూ, ఆ సినిమాలో తనకు నచ్చిన డైలాగ్స్‌ని తెలుగులో రాశారు. అలాగే, 1969-70 మధ్య విద్యా విధానంలో వచ్చిన ప్రధానమైన మార్పుని వెల్లడించారు. ప్రీయూనివర్శిటీ పద్ధతి నుంచి 10+2+3 పద్ధతిలోకి మారింది. జూనియర్ కాలేజీలు పుట్టుకొచ్చాయని చెప్తారు. వ్యక్తిగతంగా తనలో వచ్చిన ఓ కీలకమైన మార్పుకి ఈ సమయంలోనే బీజం పడిందని అంటారు ఆనంద్. “బిడియం, ఒంటరితనం ముప్పిరిగొనగా, నన్ను నేను కూడదీసుకుంటున్న వయసది” అంటారు. ఇంగ్లీషు లెక్చరర్ పార్థసారథి గారు సమాజం, శ్రమ విలువని ఎలా తెలియజెప్పారో, ఆయన ప్రభావం తనపై ఎలా ఉందో చెప్పినప్పుడు, మనకు తెలియకుండానే, మనం మనసులో ఆయనకు జోతలు చెబుతాం. అలాగే జె. శ్రీధర్ రావు సార్ చెప్పిన ఓ మాట.. నేటి విద్యార్థులకీ కూడా అత్యంత ఆచరణీయం!

అప్పటి జాతరలు తన మీద ఎలా ప్రభావం చూపాయో చెప్తారు ఆనంద్. ఎన్నో జాతరలు, వాటి విశేషాలు, వాటి చుట్టూ ముడిపడిన కుటుంబాలు, వాళ్ళ ప్రస్తావనలు గొప్పగా ఉంటాయి. ముఖ్యంగా వేములవాడ జాతరని కళ్ళకి కట్టినట్టుగా వర్ణించారు. జాతర అంటే సామాన్యుని ఆధ్యాత్మిక, సామాజిక ఆర్థిక వ్యక్తీకరణల వేదిక అని అంటారు.

డిగ్రీ కాలేజీలో చేరినప్పటి నుంచి పుస్తకాలను చదివే దృష్టి మారి, అధ్యయనం మొదలయింది. 1974లో హైదరాబాదు నుంచి ‘ఈనాడు’ దినపత్రిక మొదలవడం కరీంనగర్‍లో దినపత్రిక దృశ్యాన్ని ఎలా మార్చిందో చెప్తారు. ఆ కాలంలోనే రాసిన తొలి కథ ‘ఆమె’ గురించి చెప్తారు, ఆ కథను ప్రచురించిన ‘చిత్రిక’ వారపత్రిక సంపాదకులు పురాణం రామచంద్ర తననెలా ప్రోత్సహించినదీ చెప్తారు. పురాణం రామచంద్ర గురించి తెలుసుకోవడం పాఠకులకు ఆసక్తికరంగా ఉంటుంది. తొలి కవిత రాసినదీ డిగ్రీ చదివే కాలంలోనేననీ, దాన్ని చదివి వినిపించినదీ, ఎస్.ఆర్.ఆర్. కాలేజీ వేదికపైనే అని గుర్తు చేసుకుంటారు. ఆ కాలంలోనే తమ మిత్రులందరి జీవితాల్లోనూ సంగీతం, ఆర్కెస్ట్రా వచ్చి చేరాయని చెబుతూ తమ మిత్రబృందంలోని ఒక్కొక్కరి ప్రతిభని పరిచయం చేస్తారు. మిత్రులంతా చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగాల్లో స్థిరపడే సమయానికి కరీంనగర్‍లో ఆర్కెస్ట్రా సంస్కృతి మాయమైందని చెబుతారు.

సినిమా తనపై చూపిన ప్రభావాన్ని ప్రస్తావిస్తూ – “అప్పుడున్న ఏకైక విజ్ఞానమూ, వినోదమూ సినిమానే. రహదారీ, మురికి కాలవ అదే” అంటారు. తరువాతి కాలంలో సమాంతర సినిమా తన జీవితంతో పెనవేసుకుపోవడానికి బీజాలు డిగ్రీ చదువుతున్నప్పుడే పడ్డాయని చెప్తారు. కరీంనగర్ లోని అప్పటి సినిమా థియేటర్ల గురించి వివరిస్తారు.

భారత స్వాతంత్ర్యానంతరం 70వ దశకం అతి ముఖ్యమైనదని చెబుతూ ఆ కాలంలో దేశంలో వచ్చిన రాజకీయ మార్పులను ప్రస్తావించి అవి దేశంపై, పౌరులపై చూపిన ప్రభావాన్ని వివరించారు. సందర్భానుసారం కరీంనగర్ లోని హోటళ్ళ గురించి చెప్తారు. సికింద్రాబాదు లోని ఆల్ఫా హోటల్ లానే, అప్పటి కరీంనగర్‍లోనూ ‘ఆల్ఫా హోటల్’ పేరుతో ఓ ఇరానీ హోటల్ ఉండేదనీ, సాయంత్రాలు ఓ అడ్డాగా ఉండేదని చెప్తారు. బిఎస్‌సి చదువుతుండగా ఆర్గానికి కెమిస్ట్రీ మింగుడుపడక ట్యూషన్‌లో చేరితే, ఆ ఉపాధ్యాయుడు ఖయ్యుం సార్ సబ్జెక్ట్ అంతా అరటిపండు ఒలిచిపెట్టినట్టు చెప్పారని అంటారు. ఆయన చెప్పిన – “ఒక పని చేస్తూ అలిసిపోతే, అది మానేసి ఇంకోటి చేయాలి తప్ప, అలసిపోయామని కాళ్ళూ చేతులు చాపి కూర్చోవద్దు” అన్న జీవన సూత్రం తనకెంతో ఉపకరించిందని అన్నారు. నిజంగా గొప్ప సూచన!

కరీంనగర్‍లో ప్రత్యేకత సాధించిన సిల్వర్ ఫిలిగ్రీ (వెండి తీగల పరిశ్రమ) కళ గురించి చెప్తున్నప్పుడు అందులోని గొప్పతనం తెలుస్తుంది.

సాహిత్యంతో ప్రభావితమైన మిత్రబృందం, తామూ రచనలు చేయాలని, ఆధునిక వచన కవిత్వంపై తమకున్న మక్కువతో ఒక సైక్లోస్టైల్ప్ పత్రికని తేవాలనుకుంటారు. రమేష్ చంద్ర గారి దస్తూరితో, ఆగాచార్య బొమ్మలతో ఆ విధంగా ‘నవత’ సంచికలు వెలువడ్డాయి. ఇవ్వాళ ప్రముఖ కవులుగా ఉన్న అనేకమంది రచనలు అందులో వచ్చాయని అంటారు ఆనంద్. వేములవాడ, కరీంనగర్‌లో నాటక ప్రదర్శనలు, సాహిత్య సభల నిర్వహణలో భాగం పంచుకోవడం వంటివి తన ఒక్కడి కాలాన్నే కాకుండా, తన సహచరులందరి జీవితాల్ని ప్రభావితం చేశాయంటారు.

తన మాతామహులు డాక్టర్ మంగారి సుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పిన వివరాలు చదువుతుంటే ఆనాటి వైద్యుల నిబద్ధత, సమాజంలో వారికి ఉన్న గౌరవం అర్థమవుతాయి.

సినిమాల మీద అభిమానంతో వేములవాడలో ఫిల్మ్ సొసైటీ స్థాపన, ప్రదర్శించిన సినిమాలు, ప్రదర్శనకై సినిమాల రీళ్ళ బాక్సులు తెప్పించుకోవటాలు ఎంతో ఆసక్తిగా వివరించారు. షత్రంజ్ కే ఖిలారి, ప్రత్యూష, మృగయా వంటి సినిమాల ఘనతను వివరించారు. ఈ క్రమంలోనే అప్పటి కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల ఫిలిం సొసైటీ, జగిత్యాల ఫిలిం సొసైటీ, హుజురాబాద్ ఫిలిం సొసైటీ, గోదావరి ఖని ఫిలిం సొసైటీ, ఎల్లారెడ్డి పేట్ ఫిలిం సొసైటీలు ఏర్పడడం, పరస్పర సహకారంతో ముందుకు సాగిన వైనాన్ని ప్రస్తావించారు. ఈ ఫిలిం సొసైటీలు కేవలం సాంస్కృతిక రంగంలోనే కాకుండా సామాజిక రంగంలోనూ కలిసి పనిచేశాయని చెబుతూ కరీంనగర్ జిల్లా పూడూరులో వరదలొచ్చి విపరీతమైన నష్టం వాటిల్లినప్పుడు ఈ ఫిలిం సొసైటీల సభ్యులు తమ ప్రదర్శనల వద్ద జోలెలు పట్టి నిధులు సేకరించి కలెక్టర్ ద్వారా బాధితులకు ఆర్థిక సాయం అందించారు.

డిగ్రీ అయ్యాక, ఉస్మానియాలో ఎమ్.ఎస్.సి. కెమిస్ట్రీకి, ఎంబిఎకి దరఖాస్తు చేసుకున్నారు. మదన్ అనే మిత్రుడి సలహాపై లైబ్రరీ సైన్స్ కోర్సుకీ అప్లయి చేసి ప్రవేశ పరీక్ష రాశారు. ఎమ్.ఎస్.సి.లో సీటు రాలేదు కానీ, లైబ్రరీ సైన్స్ కోర్సులో సీటు లభించింది. అదే భవిష్యత్తులో లెక్చరర్ ఇన్ లైబ్రరీ సైన్స్‌గా ఉద్యోగం ఇప్పించింది. వివిధ కాలేజీలో విద్యార్థులతో పనిచేసే అవకాశం కలిపించింది. ఉస్మానియాలో చేరాకా తన జీవితంలో అనేక మార్పులు రావడం మొదలైందని, ఆత్మవిశ్వాసం స్థాయి పెరిగిందని చెప్తారు.

పిజీ పూర్తవుతూనే మంథని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లైబ్రేరియన్‍గా ఉద్యోగం వచ్చింది. మంథనిలో రెండు నెలల పనిచేశాకా, సిరిసిల్ల జూనియర్ కాలేజీకి బదిలీ. కానీ రిలీవర్ రాకపోవటంతో ప్రిన్సిపాల్ గారు పంపడానికి అంగీకరించలేదు. ఎట్టకేలకు రిలీవ్ అయి సిరిసిల్లలో చేరుతారు. సిరిసిల్ల లో ఉండగా రాసిన ఒక కథపై దుష్ప్రచారం జరిగి, తాను చాలా సర్దిచెప్పుకోవాల్సి వచ్చిందని అంటారు. అక్కడ ఉన్న కాలంలోనే రెండు ఎన్నికలలో విధులు నిర్వహించిన వైనం గుర్తు చేసుకుంటారు. మిత్రుల వివాహాల గురించి, వాళ్ళు జీవితంలో స్థిరపడడం గురించి చెప్తారు. సిరిసిల్ల ఉండగా చైతన్యవంతమైన జీవితానికి మిత్రబృందం అనేక విధాలుగా తోడ్పడిందని అన్నారు.

కొంత కాలం గడిచింది. 1986 సంవత్సరం ముఖ్యమైనది. జిల్లాలో వివిధ పట్టణాలలో బాలల చలనచిత్రోత్సవాలు నిర్వహించారు. గొప్ప నవలలు చదివారు. 10 డిసెంబర్‍న ఇందిర గారితో వివాహం. పెళ్ళి, రిసెప్షన్‍కి ప్రముఖుల హాజరయ్యారు. తల్లి అనారోగ్యం, ఇందిర గారి సేవలు, కుటుంబంలో అపోహలు, బాధ్యతల నిర్వహణలో తలమునకలు. అమ్మ అనారోగ్యం ఎక్కువై, హైదరాబాదుకు తరలించడం, అక్కడ ఆవిడ మృతి చెందడం, నాన్న ఒంటరి అవడం.. ఆనంద్ దంపతులు విడిగా మరో ఇంట్లోకి మారటం.. తదితర అంశాలు మధ్యతరగతి జీవితాల్లో చాలామందికి ఎదురయ్యేవే. అయితే ఆ సమయంలో తన ఉద్యోగానికి సెలవు పెట్టి ఓ పాఠశాలని నడపడం ఓ ప్రయోగం! కొన్నేళ్ళూ నడిచాకా, కొన్ని వివాదాలు తలెత్తడంతో ఆ స్కూలు నిర్వహణ బాధ్యతలు వదిలేశారు.

ఇందిర గారికి కొన్ని అబార్షన్స్ జరిగాకా, మళ్ళీ గర్భం రావడం, ఆ సమయంలో ఓ ఆరోగ్య సమస్య ఎదురవడం, సినిమా థియేటర్‍లో ఉన్న డాక్టర్ హైమవతి గారిని అర్జెంటుగా పిలుచుకు వచ్చి చికిత్స చేయించటం వంటివి చదివినప్పుడు అటువంటి వైద్యుల కర్తవ్య పరాయణతకి అభినందనలు చెప్పకుండా ఉండలేం. వీరికి 1990లో కుమార్తె రేల, 1994లో అన్వేష్ జన్మించారు.

1993లో ప్రమోషన్ మీద అగ్రహారం డిగ్రీ కాలేజీలో లైబ్రేరియన్‍గా చేరారు ఆనంద్. ఆ కాలేజీలో ఉన్నప్పుడు అప్పటి ఎమ్.ఎల్.ఎ. రాజేశ్వరరావు పరిశీలనకి రావడం, ఆ సమయంలో ప్రిన్సిపాల్ గారు లేకపోవడం, కాలేజీలో పిల్లలు లేకపోవడం వంటివి ఆయనకు కోపం తెప్పించాయి. అది మధ్యాహ్నం కాలేజీ అయ్యేసరికి ఇంకా కొన్ని గదులకూ తాళాలు కూడా తీయలేదట. ఎమ్.ఎల్.ఎ. గారికి నచ్చజెప్పడానికి కష్టమైందట.

తర్వాతి కాలంలో ఉద్యోగ బాధ్యతలు, పిల్లల చదువులు, కవిగా, అనువాదకుడిగా, ఫిలిం సొసైటీల సభ్యుడిగా ఆనంద్ గారి జీవితం వేగంగా గడించింది. తొలినాటి ‘నవ్య చిత్ర వైతాళికుల’ నుంచి ఇటీవలి ‘ఇరుగుపొరుగు’ వరకూ ఎన్నో పుస్తకాలు ప్రచురించారు. ఒక్కో పుస్తకం వెనుక ఒక్కో కథ.

2006లో యాద కిషన్ గారి ప్రోత్సాహంలో సొంతిల్లు కట్టుకోవడం ఒక మరపురాని అనుభవం. గృహప్రవేశం తరువాత దగ్గరి చుట్టాలు మధ్య దూరాలు ఏర్పడడం బాధించిందాయనని.

2001లో తెలంగాణ రచయితల వేదిక స్థాపనలో పాలుపంచుకోవడం, 2002లో మొదటి ప్రతినిధుల సభ నిర్వహించడం వంటివి ఆయనలోని కార్యదక్షతకు అద్దం పడుతుంటాయి. డాక్యుమెంటరీల నిర్మాణం మరొక సృజనాత్మక కృషి. తాను డిగ్రీ చదివిన కాలేజీలోనే 2000 నుంచి 2016 వరకూ పనిచేసి అక్కడే ఉద్యోగ విరమణ చేశారు ఆనంద్.

తమ కాలేజీలో సినీమాల నిర్మాణంపై ఆరునెలల కోర్సు ప్రవేశపెట్టించి, సినీరంగంలోని ఉద్దండులతో పాఠాలు చెప్పించారు. Make Up to Pack Up పేరుతో రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహించారు.

2013లో కాలు చిన్నగా వాయడంతో వైద్యపరీక్షలు చేయించుకోగా, కిడ్నీలో సమస్య ఉన్నట్టు తేలింది. కొద్ది రోజులకే క్రియాటిన్ స్థాయి ఎక్కువైపోవడం, డయాలసిస్ అవసరమైంది. హైదరాబాద్‍లో షన్‍షైన్ హాస్పటల్‍లో చేరడం, మొదట డయాలిసిస్. కొన్ని రోజులు డయాలిసిస్ చేయించుకోవడం. మళ్ళీ బాధ్యతల నిర్వహణ. మళ్ళీ డయాలిసిస్. రెండూ కిడ్నీలు పాడయిపోవడంతో ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరమైంది. ఇందిర గారు కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. ఎన్నో వైద్య పరీక్షల అనంతరం చివరికి వైద్యులు ఆమోద ముద్ర వేశారు. ఆనంద్ గారికి ఒక కిడ్నీ తొలగించాకా, తీవ్రమైన ఇన్‍ఫెక్షన్ సోకి, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ వాయిదా పడడం, ఆ సమయం వారు కుటుబ సభ్యుల వేదన.. చదువుతుంటే కళ్ళనీళ్ళు తిరుగుతాయి. చివరికి 15 జూలై 2024 నాడు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరగడం, దాత, స్వీకర్త ఇద్దరూ క్షేమంగా ఉండడంతో వైద్యులకు, నర్సింగ్ సిబ్బందికీ, సన్నిహితులకు ఊరట కలుగుతుంది. కొన్ని రోజుల పర్యవేక్షణ అనంతరం, ఎన్నో సూచనలు చేసి, జాగ్రత్తలు చెప్పి డిశ్చార్జ్ చేస్తారు వైద్యులు. “దాదాపుగా ముగింపుకు చేరిన కాలాన్ని దాటేసి ఇంటికి చేరాను..” అంటూ ‘యాదోం కీ బారాత్’ మొదటి భాగాన్ని ముగించారు ఆనంద్.

~

ముందుమాటలో ఆయన రాసిన ఈ వాక్యాలు ఆయన నిబద్ధతని చాటుతాయి:

“నా ఈ ‘యాదోంకీ బారాత్’ లో విజయాలే కాదు నా ఓటములు, నేను ఎదుర్కొన్న అవమానాలు, నాకు జరిగిన నష్టాలూ అన్నీ రాసాను. చీకటీ వెల్తురూ అన్నింటినీ చిత్రించాను.

మన జీవితంలో ఎన్నెన్ని తీరాలని దాటుతామో, ఎంతెంత దూరం ప్రయాణిస్తామో.. ఎన్నో గుర్తుంటాయి మరెన్నో మరుపు అరల్లో మిగిలిపోతాయి. దాదాపుగా అన్నింటినీ రాసినప్పుడు దగ్గరి వాళ్ళనుండే రెండు వాదాలు వివాదాలు ఎదురవుతాయి. ‘నీకు నేను ఇంత దగ్గరివాడిని కదా నా గురించి చాలా తక్కువ రాసావు’ అని ఒకటి, ఇక రెండవది కొన్ని విషయాల్ని రాయాల్సింది కాదు ఎడిట్ చేస్తే బాగుండేది అని. ఇవన్నీ ఎట్లా వున్నా నేను నా జ్ఞాపకాల్ని నా శక్తి మేరకు నిజాయితీగా వాస్తవికంగా రాసాను. నా ఈ ‘యాదోంకీ బారాత్’ రాస్తున్నంత కాలమూ నాలో నేను నవ్వుకున్నాను, ఏడ్చాను, కాలరెగరేసుకున్నాను, కొన్ని సార్లు తల దించుకున్నాను.

ఇదంతా కేవలం నా గడిచిన జీవితాన్ని గుర్తుచేసుకోవడమే కాదు అది ఖచ్చితంగా తిరిగి జీవించడమే.”

~

ఈ పుస్తకంలో ఆనంద్ గారు వ్రాసిన కొన్ని అద్భుతమైన వాక్యాలు..

“అనుభవాలు చిత్రంగా చిన్నవిగానే ఉంటాయి. కానీ జ్ఞాపకాలే సుదీర్ఘం. మన వెంటే ఉంటాయి. వెంటాడుతాయి, సంబరపెడతాయి, కొన్ని దుఃఖపెడతాయి.”

“ఎన్ని ప్రేమలు అనుబంధాలు వున్నాయనుకున్నా, ఆస్తుల విషయానికి వచ్చేసరికి స్వార్థం చిందులు వేస్తుందన్నది అక్షర సత్యంగా నిలబడింది.”

“మనిషి బతుకుదారిలో ఎత్తుపల్లాలూ, తిన్నని దారులూ, మలుపులూ, మూల మలుపులూ అత్యంత సహజం. అన్నింటినీ దాటుకుంటూ పడుతూ లేస్తూ సాగే ప్రయాణంలో గెలుపోటముల ఉద్విగ్నత ఉన్నప్పటికీ బతికామనే భావన వుంటుంది.”

“వ్యక్తులపైనా శక్తుల పైనా వ్యవస్థల పైనా కాలం తనదయిన భాషలో తనదైన రీతిలో ప్రభావం చూపుతూనే తుడిచివేయలేని చరిత్రని లిఖించి వెళ్తూనే వుంటుంది.”

“ఓటమి ఊపిరి కాదు, అలవాటు కాదు, దినచర్యా కాదు. అది చీకటిలా ఎదురొస్తుంది. చిటికెస్తే పరుగెడుతుంది.”

“ఎప్పుడయినా ఏ వూరయినా ఏ మనుషులయినా కాలగమనంలో ఎన్నో అనుభవాల్ని, జ్ఞాపకాల్ని మిగులుస్తారు. అందులో సంతోషం పంచినవి, దుఃఖం కలిగించినవీ కూడా ఉంటాయి. గుర్తుంచుకుంటే, తరచి చూసుకుంటే ప్రతి మలుపూ ప్రతి మజిలీ స్మరణీయమైనవే.”

~

ఆనంద్ గారు తన స్వీయకథని బాల్యం-యవ్వనం-చదువు-ఉద్యోగం-పిల్లలు-లాగా ఒక స్ట్రక్చర్డ్ స్టైల్‍లో కాకుండా పొరలుపొరలుగా జ్ఞాపకాలుగా గ్రంథస్థం చేశారు. అందువల్ల కొన్ని అంశాలు పునరావృత్తమైనట్టు అనిపిస్తుంది. ఒక విషయాన్ని ఒకచోట సంక్షిప్తంగా చెప్పి, మరోచోట విస్తారంగా చెప్పడం కనిపిస్తుంది. ఏదేమైనా వారి అనుభవాలూ, అనుభూతులూ, స్పందనలూ, వేదనలూ ఆసక్తిగా చదివిస్తాయి. పఠితలపై గాఢమైన ముద్ర వేస్తాయి. జీవితంలో కష్టసుఖాలను ప్రతిబింబించేలా కవర్ పేజీని డిజైన్ చేశారు. చుట్టూ నలుపు (చీకటి), ఆనంద్ గారి ముఖంపై చిరు కాంతి (వెలుగు) ప్రసరిస్తున్నట్లుగా డిజైన్ చేసిన ఈ ముఖచిత్రం అత్యంత ఔచితీమంతంగా ఉంది.

***

యాదోంకీ బారాత్
రచన: వారాల ఆనంద్
ప్రచురణ: పొయట్రీ ఫోరమ్, కరీంనగర్
పేజీలు: viii+272
వెల: ₹250.00
ప్రతులకు:
వారాల ఇందిర రాణి,
ఇంటి నెంబరు 8-4-641, హనుమాన్ నగర్
కరీంనగర్. తెలంగాణ – 505001
ఫోన్: 94405 01281

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here