యాత్రా దీపిక చిత్తూరు జిల్లా-1

0
8

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటన జరిపి జిల్లాలోని పలు ఆలయాల గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

కిందటి వారం దాకా అనంతపురం జిల్లాలో పర్యటించారు కదా. ఈ వారంనుంచీ రాయలసీమలో మరొక జిల్లా చిత్తూరులోని ఆలయాలను దర్శిద్దాము. దానికన్నా ముందు ఆ జిల్లా గురించి, జిల్లా పర్యటనలో నాకు సహాయపడిన వ్యక్తుల గురించి కొంత తెలుసుకుందాము.

చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి చెందిన రాయలసీమలో వున్నది. చిత్తూరు జిల్లా 1911 సంవత్సరంలో ఏప్రిల్ 1న ఏర్పాటైంది. ఇది తమిళనాడు సరిహద్దులలో ఉంది. చిత్తూరుకు పశ్చిమాన తమిళనాడుకు చెందిన జిల్లాలు ఆర్కాట్, ధర్మపురి, కర్ణాటకకు చెందిన కోలార్ జిల్లా, తూర్పున తమిళనాడుకు చెందిన అణ్ణా, చెంగై జిల్లాలు, ఉత్తరాన వై.ఎస్.ఆర్. జిల్లా, అనంతపురం జిల్లాల మధ్య ఉంది. జిల్లాలో కొంత భాగం కొండలు లోయలతో కూడిన మదనపల్లి విభాగమయితే మరికొంత భాగం మైదాన ప్రాంత మండలాలతో కూడిన పుత్తూరు విభాగం. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ మండలాలు, గ్రామాలు గలిగిన జిల్లా ఇది.

ఒక వైపు కర్ణాటకకు, మరో వైపు తమిళనాడుకు దగ్గరగా ఉండటంతో తెలుగుతో బాటు, తమిళం, కన్నడ భాషలు కూడా విస్తృతంగా వాడుతుంటారు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన చోళులు, పల్లవులు, పాండ్యులు మొదలైన వారు దీన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. విజయనగర సామ్రాజ్యం కాలంలో చంద్రగిరి కేవలం ప్రధాన కేంద్రంగానే కాక కొన్నాళ్ళు రాజధానిగా కూడా విలసిల్లింది. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత ఇది పాలెగాళ్ళ ఆధీనంలోకి వచ్చింది. చిత్తూరు, చంద్రగిరి ప్రాంతాల్లోనే పదిమంది పాళెగాళ్ళు అధికారం చెలాయించే వాళ్ళు. ఆర్కాటు నవాబు ఈ ప్రాంతాన్ని చేజిక్కించుకోవడానికి చూసినపుడు మైసూరు నవాబులు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ చిత్తూరును తమ వశం చేసుకోవడానికి ప్రయత్నించారు. హైదరాలీ గుర్రంకొండ నవాబు కుమార్తె అయిన ఫకృన్నిసాను వివాహం చేసుకున్నాడు. వీరిరువురికీ జన్మించిన వాడే టిప్పు సుల్తాన్. రెండవ మైసూరు యుద్ధం జరుగుతుండగా చిత్తూరు దగ్గర్లోని నరసింగరాయనిపేట దగ్గర హైదరాలీ డిసెంబరు 6, 1782లో అనారోగ్యంతో మరణించాడు. ఆర్కాటు నవాబుల పరిపాలనలో చిత్తూరు ఖిల్లా గానూ, దానికి మొహమ్మద్ అలీ సోదరుడు అబ్దుల్ వహాబ్ ఖిల్లాదారు గానూ ఉండేవాడు. అతని దగ్గర సైనికుడుగా చేరిన హైదరాలీ తర్వాత అతన్నే ఓడించి మైసూరుకు బందీగా తీసుకుని వెళ్ళాడు.

చిత్తూరులో భారత దేశంలోనే కాదు ప్రపంచంలో చాలామందికి తెలిసిన తిరుపతి, కాణిపాకం, శ్రీ కాళహస్తి వంటి ప్రసిద్ధ దేవాలయాలు వున్నాయి. ఆ దేవుళ్ళందరికీ నమస్కారం చేసి మన చిత్తూరు యాత్ర మొదలు పెడదాము. చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రసిధ్ధ పుణ్య క్షేత్రాలు ఇదివరకు అప్పుడప్పుడూ చూసినా జిల్లాలో వీలయినన్ని చూడాలని బయలుదేరింది మాత్రం 2019 సంవత్సరంలో ఫిబ్రవరి 1వ తారీకునుంచి 5వ తారీకుదాకా నేను, మా స్నేహితురాలు శ్రీమతి బొండాడ ఉమామహేశ్వరి. ఈ జిల్లా పర్యటనలో మాకు సహాయం చేసినవారిగురించి తప్పకుండా చెప్పాలి. ఇందులో శ్రీ పురందరరెడ్డిగారు, శ్రీ సాంబశివ రెడ్డిగారు నా పుస్తకాల ద్వారా నాకు పరిచయమైనవారు. శ్రీ పురందర రెడ్డిగారు ఒకసారి నా పుస్తకాలు కొనుక్కోవటానికి హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటికి వచ్చారు. అప్పుడు వాళ్ళ జిల్లాలో చూడవలసినవి చాలా వున్నాయి రమ్మనమన్నారు. మీ జిల్లాలో ప్రసిధ్ధ ఆలయాలు తప్పితే ఎక్కువ ఆలయాల గురించి తెలియదు, మీరు చెప్తానంటే వస్తాము అన్నాను. తప్పకుండానండీ, మా స్నేహితుడు శ్రీ సాంబశివ రెడ్డికి ఇంకా ఎక్కువ తెలుసు. ఆయన తప్పకుండా సహాయం చేస్తారు అని అప్పటికప్పుడు ఫోన్ కలపి ఆయనతో మాట్లాడించారు. ఆయన కూడా మాకు తెలిసినవాటి గురించి చెబుతాము, మీరొచ్చేలోపల ఇంకా తెలుసుకుంటాము తప్పకుండా రండి అన్నారు. ఇంకేం. చిత్తూరు జిల్లాకి మాకు రహదారి పడ్డది.

చిత్తూరులో మేము ఒక ఆణిముత్యాన్ని కలుసుకున్నామండీ. ఆయన పేరు శ్రీ బత్తనపల్లి మునిరత్నం రెడ్డి, రచయిత. ఆయన చిత్తూరు జిల్లా ఆలయాల నడిచే నిఘంటువు. ఏ మారుమూలలో వున్నదాని గురించయినా అడగండి వెంటనే చెప్పేస్తారు. ఈయన కూడా ఆలయాల గురించి పుస్తకాలు రాస్తారని, ఆయన పుస్తకాలలో ఒకటి కౌండిన్య క్షేత్రాలు అనే దానిని పంపించారు నాకు సాంబశివ రెడ్డిగారు. చిత్తూరు వచ్చే ముందు ఆ పుస్తకం చూస్తే కొంత ఐడియా వస్తుందని. పుస్తకం అందిన వెంటనే అన్ని పనులూ పక్కన పెట్టేసి ఆ పుస్తకం చదవటం మొదలు పెట్టాను. అప్పటిదాకా ఆలయాల గురించి రాసేవారు నాకు తెలిసి నేనే ఆముదం వృక్షం. ఆ పుస్తకం చూసిన తర్వాత, ఎదురుగా లేని ఆయనకు ముందు నమస్కారం చేశాను ఆయన చేసిన అద్భుతమైన కృషికి. అదేమిటో తెలుసా? చిత్తూరు జిల్లాలో అనేక ఆలయాలు వుండేవి. వాటిలో సగం పైగా ధ్వంసం కాబడ్డవి. గుడి మాన్యాలు కబ్జా చేసినవారు కొందరు లెక్కలు చూపించాల్సి వస్తుందని గుళ్ళనే మాయం చేశారుట. మునిరత్నం రెడ్డిగారు ప్రతి గుడికీ అది వున్న చోటు, ఎంత ప్రదేశంలో ఆలయం వున్నది, నిర్మాణం కొలతలు, దిక్కులు, ఎటువంటి నిర్మాణం, దానమిచ్చిన భూముల వివరాలు, శాసనాలున్న ప్రాంతము విపులంగా వ్రాశారు. ఆధ్యాత్మిక పరంగానే కాకుండా చారిత్రక విషయాలు, శిథిల చిహ్నాలు, గ్రామ నామాల పరిణామాలు పరిశోధన పూర్వకంగా వ్రాశారు. విషయ సేకరణలో ప్రతి గ్రామాన్ని ఒకటికి పదిసార్లు సందర్ళించి, ముసలివాళ్ళు, అర్చకులు, ధర్మకర్తలతో గ్రామసభలు ఏర్పాటు చేసి జనవాడుక నుండీ విషయాలు సేకరించారు. గ్రామ భూ, భౌతిక స్వరూపములనుబట్టి, గ్రామ నామాన్నిబట్టి, గ్రామ ప్రాంతాలలోని చారిత్రక ఆధారాలను మేళవించి. శిలా శాసనాలనుండి పరిష్కరించి అధ్యయనం చేసి వ్రాశారు. తాళ పత్రాలు, జమీందార్ల రికార్డులు, భూదాన పత్రాలు, రెవిన్యూ విభాగాలనుండీ, దేవాదాయ శాఖనుండి కొంత సమాచారం సేకరించి పొందుపరచారు. విషయ సేకరణకు పరిశోధనలకు 5 సం. పట్టింది. అయినా అసంపూర్తి పుస్తకంగానే వున్నదనుకున్నారు ఆయన. ఈయన వ్రాసిన మరో అద్భుత గ్రంథం పుంగనూరు జమిందారీ – ఆలయాలు (క్రీ.శ. 610 ముండి 2009 వరకు).

ఎవరి గ్రామంలో వున్న చిన్న ఆలయాలను వారు పట్టించుకోవటం లేదు. ఈ పుస్తకంలో తమ గ్రామ విశేషాలను చదువుకొని మన గ్రామానికి ఇంత చరిత్ర వుందా అని గ్రామస్తులు ఆశ్చర్యపోక తప్పదు. వారి వారి గ్రామ విషయాలు వారికే తెలియని కాలమిది. గ్రామాల జానపద చరిత్రలు ఈ తరం మారితే పూర్తిగా తుడుచుకు పోయినట్టే. ఆ ఇబ్బందిని అధిగమించి రాబోయే తరాలకు ఆయా ఆలయాల, గ్రామాల, ప్రాచీన విషయాలను అందించాలనే ఉద్దేశ్యంతో రాశానని చెబుతూ ఇది ఆలయాలకు రికార్డుగానూ ఉపయోగపడుతుంది, ఇందులో వ్రాయబడిన ఆలయములను కూల్చిన ఈ పుస్తకం ఆధారంగా గుర్తించి చర్యలు తీసుకోవచ్చు అని హామీ కూడా ఇచ్చారు.

నేను రాస్తున్నదీ మన పురాతన ఆలయాల గురించి అందరికీ తెలియజేయాలని, వాటి జీర్ణోధ్ధరణకు ఎవరన్నా పాటు పడతారేమోననే ఆశతోనే. కాని, నిర్మాణ వివరాలు ఇవ్వటంలేదు. అందుకనే ఆయన నాకొక అద్భుతమైన వ్యక్తిగా కనిపించారు. అలాంటి వ్యక్తులను కొంతమందికన్నా పరిచయం చెయ్యాలని ఇక్కడ ప్రస్తావించాను. జిల్లాకొకరు ఇలాంటివారుంటే ఆ జిల్లాలోని ఆలయాలన్నీ సురక్షితమేగా. ఇలాంటి రచనలు మిగతా ప్రజోపయోగ వనరులన్నింటికీ కూడా వుండాలనిపించింది.

ఈ కౌండిన్య క్షేత్రాలు పుస్తకం ద్వారానే చిత్తూరు జిల్లాని కౌండిన్య క్షేత్రమని కూడా అంటారని, కౌండిన్య మహర్షి ఇక్కడ తపస్సు చేశారని తెలిసింది.

ఇంకా చిత్తూరు జిల్లా ప్రముఖులు శ్రీ సాంబశివ రెడ్డిగారు, శ్రీ పురందర రెడ్డిగారూ, ఈ నాలుగు రోజులూ మాతోబాటే ఓపిగ్గా అన్ని ఆలయాలు తిరిగి వీలయినన్ని వివరాలు చెప్పారు. సాంబశివ రెడ్డిగారు తను దాచుకున్న పుస్తకాలు ఇచ్చారు. నా దగ్గర వుంటే నేనొక్కణ్ణే చదువుతాను. మీకిస్తే నలుగురికి చెప్తారు అంటూ. ఆయనకి పురాతన ఆలయాల గురించి వివరాలు సేకరించటం అలవాటు. మునిరత్నం రెడ్డిగారు తను రాసిన పుస్తకాలు ఇచ్చారు. వీరే కాదు టి.పుత్తూరు శ్రీ కోదండరాములవారి దేవస్ధానం ధర్మకర్తలు శ్రీ పి. సిధ్ధేశ్వర రెడ్డిగారు ఎన్నో విధాల సహకరించటమేకాదు వారి ఆలయంలో మాకు చిన్న సన్మానం ఏర్పాటు ఛేశారు.

శ్రీ సాంబశివ రెడ్డిగారు ముందే నాకో మాట చెప్పారు. మేము మీకు అన్ని విధాల సహాయం చేస్తాముగానీ మీ పుస్తకం మా రామయ్యకే అంకితం ఇవ్వాలన్నారు. అంతకన్నా మహద్భాగ్యమా!?

ఈ నా చిత్తూరు జిల్లా యాత్రా దీపిక తవణంపల్లి మండలం, టి.పుత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ కోదండ రాములవారి పాదాలకే అంకితం.

ఈ ఆలయం గురించి చాలా అద్భుతాలు వున్నాయి. ఆ ఆలయం దర్శించినప్పుడు చెబుతాను వాటి గురించి. మరి మన యాత్ర ప్రారంభిద్దామా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here