యాత్రా దీపిక చిత్తూరు జిల్లా-10

0
7

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా టి. పుత్తూరు లోని ‘శ్రీ కోదండ రామాలయం’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

శ్రీ కోదండ రామాలయం, టి. పుత్తూరు

[dropcap]మ[/dropcap]ర్నాడు 3-2-19, ఆదివారం ఉదయం 8-30కి బయల్దేరి విష్ణులో బ్రేక్‌ఫాస్ట్ చేసి అక్కడికి 14 కి.మీ.ల దూరంలో వున్న టి. పుత్తూరు బయల్దేరాము. ఇది తవణంపల్లి మండలంలో వున్నది. కాణిపాకానికి 3 కి.మీ.ల దూరం. మాతో వచ్చిన శ్రీ సాంబశివ రెడ్డిగారి ఊరు. ఇక్కడి కోదండరామ స్వామికే పుస్తకం అంకితమివ్వమని రెడ్డిగారు చెప్పింది.

కారు దిగగానే ఐదారుగురు ఎదురొచ్చారు. ముందు కొబ్బరి బొండాలు కొట్టించి, బలవంతాన ఉమకీ నాకూ చెరో రెండు గ్లాసుల నీళ్ళు తాగించారు. కొబ్బరి నీళ్ళు చాలా బాగున్నాయి. ఆలయం, పక్కనే పెద్ద కోనేరు, చుట్టూ కొబ్బరి చెట్లు, పూల మొక్కలు, చాలా ప్రశాంతంగా, చాలా బాగుంది. చుట్టూ అంతా చూశాక ఆలయంలోకి వెళ్ళాము.

అక్కడ కోదండరాములవారికి అంకితమివ్వమని ఆయన వూరికే చెప్పలేదండీ. ఆ రాములవారు చాలా మహత్యం కలవారు. కోరి తాను స్వయంగా అక్కడకి రావటమే కాదు, ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన నిదర్శనాలు చూపించాడు, ఇప్పటికీ అక్కడివారందరికీ తాను వున్నానని నిదర్శనం చూపిస్తునే వున్నాడు. ఆ విశేషాలన్నీ మరి మీతో పంచుకోవాలికదా.

సాధారణంగా మనం ఆలయ చరిత్రలు విన్నప్పుడు ఆ దైవం అక్కడ స్వయంభూగా వెలిశాడనో, లేక ఎవరో మహాత్ములు ప్రతిష్ఠించారనో, లేక ఎక్కడో ప్రతిష్ఠించాలని విగ్రహాలను తీసుకు వెళ్తుంటే బండి కదలకపోవటంతో అక్కడే ప్రతిష్ఠించారనో, ఇలాంటి కథలు వింటాము. కానీ ఆంజనేయస్వామి తన స్వామి వున్న శిథిలాలయం గురించి తెలియజేసి, ఆయనని అక్కడనుంచి తీసుకు వచ్చి తన చెంత ప్రతిష్ఠ చెయ్యమని కోరటం ఆ ఊరి వారి భాగ్యమనుకోవాలా, భక్తుడు ఆంజనేయస్వామికి తన రాముడికి దూరంగా వుండలేడు. అనుకోవాలా .. ఏదైనా స్వామి లీలలు అని ఖచ్చితంగా అనుకోవాల్సిందే, దైవ శక్తిని నమ్మాల్సిందే.. అనేక మహత్యాలు చూపిస్తూ భక్తులనందరినీ ఏకత్రితం చేస్తూ విశేష పూజలందుకుంటున్న స్వామి ఈయన. వివరాలు ఏమిటంటే….

పూర్వం నార్త్ ఆర్కాడు జిల్లా, చిత్తూరు సబ్ జిల్లాకు చెందిన టి.పుత్తూరు గ్రామంలో పూర్వకాలంనుంచీ ఒక ఆంజనేయ స్వామి ఆలయం వుంది. ఆ స్వామిని ఊరివారందరూ భక్తితో సంజీవరాయడు అని పిలుస్తూ కొలుచుకునేవారు. 1862 సం. లో పాపిరెడ్డి అనే ఆయన ఆలయ ధర్మకర్తగా వుండేవారు. ఒక రోజు ఆయనకు సంజీవరాయస్వామి కలలో కనిపించి.. ఈ ఊరికి పశ్చమ వాయవ్య దిశగా 40 మైళ్ళ దూరంలో పలమనేరు – చౌడేపల్లి మధ్య కోగిలేరు అనే ఊరు వుంది. ఆ ఊరి పక్కనే ఒక ఏరు ప్రవహిస్తున్నది. దానిలో ఒక రామాలయం ఇసుకలో పూడిపోయి వుంది. అందులో శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలున్నాయి. వాటిని తీసుకొచ్చి ఈ గుడి దగ్గర ప్రతిష్ఠించి పూజలు చేయవలసినదిగా ఆజ్ఞాపించాడు. ఆంజనేయస్వామికి చూడండి తన స్వామి అంటే ఎంత భక్తో. ఎక్కడో ఏట్లో పూడిపోయి వున్న శిథిల దేవాలయంలోని విగ్రహాల గురించి తన భక్తులకు తెలియజేసి, తన స్వామిని దన దగ్గరకు రప్పించుకున్నాడు.

పాపిరెడ్డి గారు గ్రామస్తులతో కలిసి ఎడ్ల బళ్ళమీద పలమనేరు అడవిదారిలో (అప్పుడంతా అడవులు ఎక్కువ) కోగిలేరు చేరుకుని అక్కడ ఏరు, దాని ఒడ్డున పాడుబడిన ఆలయం వుందా అని అడిగారు. కోగిలేరువారు ఏరు వున్నది, అది ఎప్పుడూ ప్రవహిస్తూనే వుంటుంది కానీ దాని ఒడ్డున ఆలయమేమీ లేదు అని చెప్పారు. కానీ సుమారు 90 సం. వృధ్ధుడు ఒకరు.. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఏటి ఒడ్డున ఒక దేవాలయం వుండేదిట, అది ఏటి నీటిలో కొట్టుకు పోయిందని మా పెద్దలు చెప్పేవాళ్ళు అని చెప్పారుట.

అందరూ ఏటి ఒడ్డుకు చేరుకున్నారు. పాపిరెడ్డిగారు అక్కడ రాత్రి తాను కలలో చూసిన స్ధలాన్ని గుర్తించి చూపించారు. ఆ నదిలో నీటి ప్రవాహాన్ని మళ్ళించి తగు పరిశీలనలు చేసి, అక్కడ త్రవ్వగా వారికి కూలిన రాతి కట్టడాలు కనిపించాయి. అందులో రెండు స్తంభాలు నిలువుగా వున్నాయి, వాటిమీద అడ్డంగా ఒక రాతి దూలం, దానిమీద ఏటవాలుగా పడిన బండలు, (ఆఛ్ఛాదనలాగా) వాటికింద ఏ మాత్రం చెక్కు చెదరని శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహాలు గుర్తించారు.

కలలో చూసినదాని ప్రకారం విగ్రహాలు కనిపించాయని సంతోషంతో టి.పుత్తూరు వారు ఆ విగ్రహాలను తమ ఊరు తీసుకు వెళ్ళాలని బయల్దేరగా, కోగిలేరు వారు అడ్డు తగిలారు. మా ఊరి విగ్రహాలు మాకే ఇవ్వాలన్నారు. టి.పుత్తూరు వారు సంజీవ రాయస్వామి మాకు కలలో కనబడి చెప్పారు కనుక మాకివ్వాల్సిందని కోరారు. అప్పుడు కోగిలేరువారు మీకు నిజంగా దేవుడు కలలో కనబడి చెప్తే ఒక పందెం పెట్టుకుందాం. దానిలో ఎవరు గెలిస్తే వాళ్ళు ఆ విగ్రహాలు తీసుకోవాలనుకున్నారు.

కోగిలేరు వారు చెప్పిన ప్రకారం టి.పుత్తూరు వారికి ఇనుప ముక్క, కోగిలేరు వారికి జొన్న బెండు ఇచ్చారు. వాటిని నీటిలో వేస్తే ఇనుప ముక్క నీటిలో తేలాలి, జొన్న బెండు నీటిలో మునగాలి. ఎవరికి అలా జరిగితే ఆ ఊరివారికి ఆ విగ్రహాలు. సీతా రాముల విగ్రహాలకు పూజ చేసి టి.పుత్తూరు వారు ఇనుప ముక్కను, కోగిలేరు వారు జొన్న బెండును నీటిలో వదిలారు. టి.పుత్తూరు వారు వేసిన ఇనుప ముక్క నీటిలో తేలి ప్రవాహానికి వ్యతిరేకంగా వెళ్ళిందట. జొన్న బెండు అలాగే వున్నది. కోగిలేరు వారు దైవ మహత్యాన్ని గుర్తించి ఆ విగ్రహాలని టి.పుత్తూరు గ్రామస్తులతోపాటు అక్కడిదాకా తెచ్చారు.

క్రీ.శ. 1862 – 68 మధ్య ఆలయాన్ని నిర్మించి ఆణి మాసము (తమిళ మాసము) పౌర్ణమి రోజున సీతా రామ లక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. అప్పటి దాకా వున్న సంజీవరాయని విగ్రహం సీతా రాముల కోసం కొంచెం ముందుకు జరిపారు. అప్పటినుంచి ఆలయం పేరు సంజీవరాయని ఆలయంనుంచి శ్రీ కోదండ రామాలయంగా మారింది.

ఈ ఆలయంలో స్వామి చూపించిన మహిమలు చాలానే వున్నాయి. అవేమిటంటే…

  1. స్వామి ఇక్కడికి రావటానికి పెట్టిన పరీక్షలో ఇనుప ముక్క నీటిలో తేలిందంటే స్వామి అనుగ్రహమే కదా.
  2. స్వామిని ప్రతిష్ఠించినప్పటినుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడాదీ ఆణి మాసంలో జరిపేవారు. కానీ ఆణి మాసంలో ఎక్కువ వ్యవసాయ పనులు వుంటాయి, అదీగాక గాలి ఎక్కువగా వుండటంతో కర్పూరం సరిగ్గా వెలగదని 1894 సం.లో వార్షిక బ్రహ్మాత్సవాలు శ్రీరామనవమికి, అనగా తమిళ చిత్రి మాసంలో జరుపుదామని అప్పటి ధర్మకర్త లింగారెడ్డిగారు నిర్ణయించి అలా జరిపించారుట. దురదృష్టవశాత్తు ఆ సంవత్సరము ఊరు మొత్తం కాలిపోయిందిట. స్వామికి బ్రహ్మోత్సవాలు మార్చటం ఇష్టం లేదని భావించి అప్పటినుంచి ప్రతిష్ఠ జరిగిన ఆణి మాసంలోనే నిర్విఘ్నంగా జరిపించటం మొదలు పెట్టారు.
  3. 1895 సం. లో అరగొండ (అర్ధగిరి) లో ఒక పురాతన కాలంనాటి రథము పైభాగము పాడైపోయి, నిరుపయోగంగా వుండటంతో ఆ రథాన్ని మీ ఊరికి తీసుకెళ్ళమని అప్పటి ధర్మకర్త లింగారెడ్డిగారికి అరగొండవారు చెప్పారుట. కానీ ఈ సంగతి తెలిసి ఆ రథం తమకే కావాలని టి.పుత్తూరు, తవణంపల్లి, చిత్తూరు వాళ్ళు పోటీ పడ్డారు. దానితో ఆ మూడు ఊర్ల వారికీ మళ్ళీ ఒక పోటీ పెట్టారు. దాని ప్రకారం మూడు కుండల నీరు తీసుకుని ఒక కుండపై ఒక కుండ వరుసగా అమర్చి పై కుండలోని నీటియందు బియ్యం వేసి పొయ్యి వెలిగించి వేడి చెయ్యాలి. ఎవరి పై కుండలో మొదట పొంగు వస్తుందో వాళ్ళకి రథము ఇస్తామని చెప్పారు. స్వామివారికి పూజ చేసి పొయ్యి వెలిగించి వేడి చేయగా టి.పుత్తూరు వారి పై కుండలో మొదట పొంగు వచ్చిందిట. అది స్వామి మహిమ అనుకుని ఆ రథాన్ని టి.పుత్తూరు వారికి ఇచ్చారుట. అప్పుడు అక్కడనుంచి టి.పుత్తూరుకు సరైన రోడ్డుకూడా లేదు. అత్యంత శ్రమకోర్చి ఆ రథాన్ని గ్రామానికి తీసుకు వచ్చారు. 1905లో ఆ రథము పై భాగాన్ని అప్పటి ధర్మకర్త, లింగారెడ్డిగారి కుమారుడు అయిన నాగేశ్వర రెడ్డి ఇంకొందరితో కలిసి మరమ్మత్తు చేయించి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిపించారు.
  4. గుడిలో 2005లో స్వామియొక్క నామములు, కిరీటములు దొంగిలించబడ్డాయి. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సమయంలో హనుమంత వాహనం సమయంలో లోకనాధరెడ్డి అనే ఆయనని స్వామి ఆవహిస్తారు. అప్పుడు ఆయన రామునివలే నిలబడి అక్కడివారు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇచ్చేవారు. ఆ సమయంలో లోకనాధరెడ్డిగారిని అక్కడివారు అడిగారుట.. స్వామీ, మీ నామములు, కిరీటాలు దొంగిలిస్తూంటే మీరు చూస్తూ ఎలా వుండి పోయారు అని. దానికి ఆయన.. ఆ దొంగలు మా చెల్లెలు దండువారమ్మకి మొక్కుకుని వచ్చి దొంగిలించారు. కాబట్టి చూస్తూ వూరుకున్నాను అన్నారుట. ఊరి వారు మీ చెల్లెలు దండువారమ్మకి మొక్కుకుని ఏ తప్పు చేసినా క్షమిస్తారా అని అడిగితే .. ఒక తప్పుకింద క్షమించాను. కానీ ఆ దొంగలకి ఆశ ఎక్కువైంది. ఇంకో ఆలయంలో కన్నం వేస్తున్నారు. అందులో ఈ ఊరతను ఒకరు, పక్క ఊరతను ఒకరు వున్నారు. పేర్లు చెప్పను. కానీ వారిని మూడు వారాల లోపల పట్టిస్తాను అని చెప్పారుట. అంతేకాకుండా వేరొకరికి 3 నిమ్మకాయలిచ్చి వీటిని తల దిండుకింద పెట్టుకుని నిద్రపో. కొద్ది రోజులలో మీకే తెలుస్తుంది అని చెప్పారుట. ఈ విషయాన్ని 19-6-2005 ఆదివారం ఉదయం 11 గం.లకు వీడియో రికార్డింగ్ చెయ్యబడింది. ఆ రోజునుండి ఒక వారం లోపల పూతలపట్టు దగ్గర కలికిరి కొండలో 22-6-2005 దొంగతనం జరిగింది. ఆచూకి తెలిసిన పోలీసులు 11-7-2005 దొంగలను అరెస్టు చెయ్యటం జరిగింది. ఈ విషయం 12-7-2005 దిన పత్రికలలో రావటంతో టి.పుత్తూరు వారికి దొంగలెవరో తెలిసింది.
  5. ఈ గుళ్ళో ప్రమాణాలు చేసే ఆనవాయితీ కూడా వున్నది. అయితే తప్పుడు ప్రమాణాలు చేసిన వారికి వెంటనే ఏదో ఒక నష్టము జరిగేది. అందుకే ఇక్కడ ఎవరూ తప్పుడు ప్రమాణం చెయ్యటానికి సాహసించరు.
  6. ఆలయ అభివృధ్ధికి విశేష కృషి చేసిన ఐ. వేణుగోపాల రెడ్డి (లెక్చరర్, శ్రీ పద్మావతి పాలిటెక్నిక్, టి.టి.డి,, తిరుపతి) ఒకసారి గుడి ముందు నిలబడి ఇక్కడ బోరింగ్ వేసి నీళ్ళు పడితే పుష్కరిణి కట్టవచ్చని మనస్సులో అనుకొంటుండగా, ఒక కొత్త బాలుడు (ఆ ఊరి వాడు కాదు) ఆయన దగ్గరకు వచ్చి, అన్నా అని ఆయనని పిలిచి, ఇక్కడ భూమిలో రెండు పాయల నీరు వచ్చి ఇక్కడ కలిసి ఇటు వైపు వెళ్తున్నాయి. ఒక పాయ గర్భగుడి కింద నుంచి ప్రవహించి, ఈ గోపురం నుంచి ఇటు వెళ్తున్నది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏమీ తెలియని బాలుడు నీటి గురించి అంత వివరించాడు అంటే, అది దైవ సందేశంగా భావించి బోరింగ్ మిషన్ వారికి బోరింగ్ వెయ్యటానికి సమయం ఎప్పుడు దొరుకుతుందని ఫోన్ చేస్తే, వారు ప్రస్తుతం ఖాళీగానే వున్నాము, అని వెంటనే వచ్చారుట. అలాగే బోరింగ్ తవ్వటానికి, పైపులకు, మోటార్లకు ఆర్ధిక సహాయం అనుకోకుండా అదే రోజున సమకూడి బోరింగ్ వెయ్యటమేకాక అందులో పుష్కలంగా నీరు పడ్డది. ఊళ్ళో ఎక్కడ నీరు లేక పోయినా ఈ బోరింగ్ లో మాత్రం సర్వ కాల సర్వావస్తలలోనూ నీరు లభ్యమవుతుంది. దానితో పక్కనే చక్కని పుష్కరిణి తవ్వించారు. 13-6-2008న ఈ పుష్కరిణిలో మొదటి సారిగా స్వామి చక్రస్నానం చేయబడింది.
  7. 2007వ సంవత్సరంలో ఒక అద్భుతం జరిగింది. సంజీవరాయని ఆలయ కుంభాభిషేకం సందర్భంగా కలశానికి పెట్టిన కొబ్బరికాయ మూడు కళ్ళనుంచి మూడు మొలకలు రావటం గమనించి దానిని జాగ్రత్తగా కాపాడి, భూమిలో పాతారు. ఆ మూడు మొలకలు పెద్దవై మూడు కొబ్బరిచెట్లయి, చక్కని ఫలాల్ని అందించసాగాయి. వాటిని సీతా, రామ లక్ష్మణులుగా భావించి పూజలు చేస్తారు భక్తులు. వాటి కాయలను కోయరు. వాటంతట అవి కింద పడితే వాటిని భక్తులు అధిక మూల్యం చెల్లించి తీసుకెళ్ళి ప్రసాదంగా తీసుకుంటారు. ఈ ప్రసాదం తీసుకోవటంవల్ల, పిల్లలు లేనివారికి పిల్లలు కలగటం, పెళ్ళికాని వారికి పెళ్ళి కావటం, వగైరా అనేక సమస్యలు పరిష్కారం అవుతుండటంతో వాటికోసం వేచి చూసేవారి సంఖ్య కూడా పెరిగింది. ఆ కాయలకి ఒక ధర అంటూ నిర్ణయించలేదు. తీసుకునే భక్తులు వారి శక్తిని బట్టి అధిక మొత్తం హుండీలో వేస్తారుట.
  8. 8-3-2018న శ్రీశ్రీశ్రీ చిన్న జియ్యరు స్వామి వచ్చి ఇంత చిన్న ఊర్లో అంత పెద్ద ఆలయాన్ని అంత చక్కగా నిర్వహిస్తున్నందుకు అభినందించారు. ఇక్కడ బ్రహ్మోత్సవాలు 15 రోజులు జరుగుతాయి. ఆ విషయం తెలుసుకుని కూడా ఆశ్చర్యపోయారుట. అంత చిన్న ఊళ్ళో 15 రోజులు బ్రహ్మోత్సవాలు జరగటం అంటే మాటలు కాదని మెచ్చుకున్నారుట. ఆళ్వారుల విగ్రహాలు ప్రతిష్ఠించమని సూచించారుట.
  9. ఐరాల శంకరరెడ్డి ఇక్కడ అన్నీ తానే అయి చూసుకుంటారు. దానికి కారణం కూడా చెబుతారు. ఆయన అమెరికాలో వున్న వారి కుమారుడి దగ్గర వున్నప్పుడు ఒక రోజు కలలో రథ చక్రాలు వెయ్యాలి రా.. అనే ఆదేశం వినిపించింది. అంతే అక్కడ వుండలేక వెంటనే స్వదేశానికి స్వగ్రామానికి వచ్చేసి గుడికి చేరుకుంటే రథ చక్రాలు రెండూ పాడయి వున్నాయిట. వెంటనే బాగు చేయించారు. ఆత్మీయుల కోసం అమెరికా వెళ్ళినా ఆయన మనసు ఈ ఆలయాన్ని విడిచి వెళ్ళదు. రోజూ అక్కడనుంచి ఇక్కడి వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటారు.

ఆలయ నిర్మాణం

ఆలయం బయట స్తంభాల మండపం తర్వాత వివిధ దేవతా మూర్తులతో అలంకరించిన సమున్నతమైన రాజగోపురాన్ని చూడవచ్చు. ఆలయం బయటనే కుడివైపు పుష్కరిణి స్వచ్ఛమైన నీటితో, చుట్టూ కొబ్బరి చెట్లు, ఇంకా వివిధ రకములైన ఫల, పుష్ప వృక్షాలతో రారమ్మని ఆహ్వానిస్తూ కనబడుతుంది. ఆలయం ముందే జి.ఐ. షీట్లతో కప్పబడిన రథ స్ధావరం.

ఆలయం ప్రదక్షిణ మార్గంలో మండపాలు.. అందులో కొన్నింటిలో భద్రపరచబడ్డ ఏనుగులు, గుఱ్ఱాలు, గరుత్మంతుడు, హనుమంతుడు, శేషుడు, మొదలగు స్వామివారి వాహనాలు, రాక్షస బల్లులు, ద్వార పాలకులు, రథ చోదకులు మొదలగు రధమునలంకరించే విగ్రహాలు భద్రపరచబడ్డాయి.

గర్భాలయంలో శ్రీ కోదండరామస్వామి సీతా, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడు. స్వామిని దర్శిస్తేనే చాలు.. మనసు ప్రశాంతత పొందుతుంది.

బ్రహ్మోత్సవ విశేషాలు

బ్రహ్మోత్సవంలో భాగంగా మొదటి రోజు సాయంకాలం అంకురార్పణము, రెండవ రోజు ఉదయము ధ్వజారోహణం, రాత్రి హంస వాహనము, మూడవ రోజు సింహ వాహనము, నాల్గవ రోజు రాత్రి హనుమంత వాహనము, ఐదవ రోజు రాత్రి శేష వాహనము, ఆరవ రోజు అనగా పౌర్ణమి రోజు మధ్యాహ్నం కళ్యాణోత్సవము, సాయంకాలం కళ్యాణ తిరుక్కోలం (స్వామివారి కళ్యాణం అయిన తర్వాత పుర ప్రదక్షిణ చేస్తారు. ఆ సమయంలో ప్రతి ఇంటి దగ్గర స్వామికి ఎర్ర నీళ్ళు దిష్టి తీస్తారు. అప్పుడు కొబ్బరికాయలు కొట్టరు), రాత్రి గరుడ సేవ, ఏడవ రోజు రాత్రి గజ వాహనము, ఎనిమిదవ రోజు మధ్యాహ్నం 3 గం.లకు రధోత్సవము, రాత్రి కర్పూర హారతి సేవ, తొమ్మిదవ రోజు రాత్రి అశ్వ వాహనం, ఏకాంత సేవ, పదవ రోజు మధ్యాహ్నం ఉట్లోత్సవం, సాయంకాలం వసంతోత్సవము, ధ్వజ అవరోహణం జరుగుతుంది. ఈ ఉత్సవంతో పాటు ప్రతి రోజు ఉదయం అభిషేకాలు, మధ్యాహ్నం ప్రత్యేక ఉత్సవాలు, సాయంకాలం ఉంజల్ సేవలు జరుగుతాయి.

ఇవికాక జూన్ 2008 సంవత్సరము నుండి బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ వాహనము రోజున పుష్కరిణిలో దీపారాధన, పదకొండవ రోజు సూర్యప్రభ, పండ్రెండవ రోజు చంద్రప్రభ, పదమూడవ రోజు పుష్ప పల్లకి సేవ, పదునాలుగవ రోజు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగుతాయి. బాణసంచా, సాంస్కృతిక కార్యక్రమాలు, మరియు తిరుమల తిరుపతి దేవస్ధానము యొక్క అన్నమయ్య ప్రాజెక్టు ద్వారా కీర్తనలు, ధర్మ ప్రచార పరిషత్తు ద్వారా హరికధ కార్యక్రమములతో ప్రత్యేక ఉత్సవములు ప్రతి సంవత్సరము జరుగుతాయి.

ఆలయంలో పరిశుభ్రత, ఉద్యానవనం, వగైరాలే కాకుండా అక్కడ అందరినీ ఆకర్షించే మరొక విషయం ఆలయం అభివృధ్ధి గురించి అందరూ ఒకటిగా కృషి చేస్తారు. ఆలయాభివృధ్ధికి ఏ విధంగానైనా సహాయం చేసేవారంతా ఆలయ అభివృధ్ధి కమిటీ మెంబర్లేనంటారు వారు. ఆలయమే ప్రాణంగా పనిచేస్తున్న ధర్మకర్త శ్రీ పి. సిద్ధేశ్వర రెడ్డి, ఆయనకి అన్ని విధాలా అండదండలుగా నిలుస్తున్న శ్రీ ఐరాల శంకరరెడ్డి, శ్రీ ఐ. వేణుగోపాల రెడ్డి, శ్రీ సాంబశివ రెడ్డి, ఇంకా ఎందరో పెద్దలు, ఊరి వారందరూ కూడా ఈ విషయంలో అభినందనీయులు.

వంశ పారంపర్య ధర్మకర్త శ్రీ పి. సిద్ధేశ్వర రెడ్డిగారు, ఆలయ నిర్వహణలో శ్రధ్ధ చూపిస్తున్నారు. వారు, వారి ధర్మపత్నితో సహా ఆలయ విశేషాలు వివరించి, మేము అంత దూరం నుంచి వారి రాముడి దర్శనార్ధం వచ్చామని చిన్న సన్మానం కూడా చేశారు. ధన్యవాదాలండీ. మీ ఊరంతటినీ కలసికట్టుగా రాములవారి సేవలో నడిపిస్తున్నారు. అన్ని ఊళ్ళల్లో అలా వుంటే ఆలయాలన్నీ కళకళలాడుతాయికదా.

కాణిపాకం – అర్ధగిరి మార్గంలో వున్న ఈ ఆలయాన్ని కాణిపాకం దర్శించే భక్తులంతా సులువుగా దర్శించుకోవచ్చు.

మార్గము

చిత్తూరు నుంచి అర్ధగిరి (అరగొండ) బస్సులో తవణంపల్లి చేరుకుని, అక్కడనుండి 1.5 కి.మీ.లు ప్రయాణించినచో శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని చేరుకోవచ్చు. కాణిపాకంనుండి 4 కి.మీ.ల దూరంలో వుంది. సర్వీసు ఆటోలు కూడా లభ్యమవుతాయి.

సొంతవాహనుదార్లు సునాయాసంగా తక్కువ సమయంలో ఈ ఆలయ దర్శనం చేసుకోవచ్చు. ఇన్ని విశేషాలున్న ఈ ఆలయాన్ని అవకాశం వున్నవారు తప్పక దర్శించుకోవాలి. పల్లెటూరు గనుక భోజనం, వసతి వగైరా సౌకర్యాలు వుండవు. కాణిపాకం, చిత్తూరు నుంచి తేలికగా వెళ్ళి రావచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here