యాత్రా దీపిక చిత్తూరు జిల్లా-14. ద్రౌపదీ ధర్మరాజుల ఆలయం, 15. రాధా రుక్మణీ సమేత వేణుగోపాలస్వామి ఆలయం, ఉత్తర బ్రాహ్మణపల్లి

0
11

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా జిల్లా లోని ‘ద్రౌపదీ ధర్మరాజుల ఆలయం’ గురించి, ఉత్తర బ్రాహ్మణపల్లి లోని రాధా రుక్మణీ సమేత వేణుగోపాలస్వామి ఆలయం గురించి, వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

14. ద్రౌపదీ ధర్మరాజుల ఆలయం

కొండ దిగితే ఇంకో అద్భుతం అన్నాను కదా. అదేంటంటే… మీరు ఎప్పుడన్నా ద్రౌపదీ ధర్మరాజుల గుడి గురించి విన్నారా? చిత్తూరు జిల్లాలో వారిరువురికూ గుళ్ళు వున్నాయి. చిత్తూరులో బోర్డు చూసి ఆశ్చర్యపోయాను. ఆ గుడి తప్పకుండా చూడాలనుకున్నాను. అప్పుడు సమయం కాదు గనుక, మూసి వుంది గనుక చూడలేక పోయాము. ఇప్పుడు ఆ గుడి చూడవచ్చుకదా అని ఉత్సాహంగా వెళ్ళాము.

కానీ, ఇక్కడ కూడా మాకదే పరిస్ధితి ఎదురైంది. మరి మేమెళ్ళింది మిట్ట మధ్యాహ్నంకదా. ఆలయం బయటనుంచి చూడగలిగినా, లోపల, దేవతా మూర్తులను చూసే భాగ్యం కలగలేదు. పంతులుగారు బయటకెళ్ళారు. తాళాలు ఆయన దగ్గర వున్నాయి. అందుకే దర్శనం కాలేదు.

ఆలయం గురించి కొన్ని విశేషాలు.. ఆలయ నిర్మాణం క్రీ.శ. 1905లో జరిగింది. ఇక్కడ ఇంకో విశేషం వుంది. అదేమిటంటే గుడి కట్టించినప్పటినుంచీ, ఇప్పటిదాకా ఆపకుండా ప్రతి ఏడాదీ మహా భారతం కధా కాలక్షేపం జరుగుతుంది. అదీ 21 రోజులపాటు. ఆ సమయంలోనే రాత్రిళ్ళు భారతాన్నే నాటకాలుగా వేస్తారు 18 రోజులపాటు. జనం విపరీతంగా వస్తారు. ఆ 21 రోజులూ ఊళ్ళో పండగ వాతావరణం నెలకొంటుంది.

ఈ మధ్య సినిమాలు, టీవీల మూలంగా కథలకి స్పందన తగ్గింది. దానితో వచ్చే జనం తక్కువవుతున్నారు.

ఆలయం ముందు ఒక చక్రం, నిలువు రాయి వున్నాయి. అది శక్తి పీఠం అన్నారు. వివరాలు సరిగా తెలియలేదు.

1905లో మునిస్వామిచెట్టి గుడి కట్టించి పూజారిగా వుండి, ఇక్కడే చనిపోయారు. తర్వాత 50 సంవత్సరాల పైనుంచి గుడిసి గణేష్ చెట్టి అనే ఆయన వంశపారంపర్య ధర్మకర్తగా వున్నారు.

15. రాధా రుక్మణీ సమేత వేణుగోపాలస్వామి ఆలయం, ఉత్తర బ్రాహ్మణపల్లి

అక్కడనుంచి మధ్యాహ్నం 1 గంటకి బయల్దేరి ఉత్తర బ్రాహ్మణపల్లిలో వున్న రాధా రుక్మిణీ సమేత వేణుగోపాలస్వామి ఆలయానికి వచ్చాము. ఇక్కడి విగ్రహాలను చాలా కాలం క్రితం దొంగలెత్తుకు పోయారుట. తర్వాత ఆలయాన్ని చూడలేదని సాంబశివరెడ్డిగారు ఒకసారి దర్శనం చేసుకు వద్దామని ఆసక్తిగా తీసుకెళ్ళారు.

చిన్న ఆలయమే. మమ్మల్ని చూసి పూజారి తండ్రీ, కొడుకులు వచ్చి తలుపులు తీశారు. ఇక్కడి విగ్రహాలను 70 ఏళ్ళ క్రితం దొంగలెత్తుకెళ్ళి కాణిపాకం ఏరులో పడేశారు. ఆ సమయంలో వేరే విగ్రహాలు పెట్టారు. విగ్రహాలు పోయాయని వీరు అప్పుడే ఫిర్యాదు చేశారు. ఒకసారి ఏట్లో ఇసుక తీస్తుండగా విగ్రహాలు దొరికాయి. అవి ఎవరివి తేలటానికి పోలీస్ స్టేషన్‌లో 6, 7 నెలలు పెట్టారు. ఇక్కడివారు ఆధారాలు చూపలేకపోవటంతో పురావస్తు శాఖ, హైదరాబాదు వారు తీసుకెళ్ళారు. ఆధారాలు చూపలేదని వీరికి ఇవ్వలేదు.

గర్భగుడి చాలా పురాతనమైనది. పడిపోతే మళ్ళీ కట్టించారు.

తర్వాత విష్ణు భవన్‌కి వచ్చి భోజనం చేసి కార్వేటి నగరం బయల్దేరాము. ఆ కథ వచ్చే వారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here