యాత్రా దీపిక చిత్తూరు జిల్లా-25: కీలపట్ల

0
7

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా కీలపట్ల లోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

కీలపట్ల

[dropcap]ప[/dropcap]లమనేరుకి 7 కి.మీ.ల దూరంలో కీలపట్ల వుంది. పలమనేరుకన్నా పురాతనమైన ఈ ఊరు ఇప్పుడైతే చిన్నదే గానీ ఒకప్పుడు గొప్ప వెలుగు వెలిగిన చారిత్రక ప్రాధాన్యమున్న గ్రామం. దీని అసలు పేరు కోటిపల్లి. చిన్న తిరుపతిగా కూడా ప్రఖ్యాతి చెందింది. చోళ రాజులు యుధ్ధ సిపాయిల పటాలాన్ని ఒక దానిని ఇక్కడ శాశ్వతంగా వుంచటంచేత దీనికి కీల పటాలముగా పేరు వచ్చి..తర్వాత తర్వాత ఇప్పుటి కీలపట్లగా మారింది.

కీలపట్ల చరిత్ర గతిలో ఎన్నో ఆటుపోట్లకు గురై, నాశనమై పునర్నిర్మింపబడింది. అనేక యుధ్ధాలు, దండయాత్రలలో ఈ గ్రామము చుట్టూ సుమారు 33 గ్రామాలు నాశనమై, శిధిలమై నామ రూపాలు లేకుండా పోయినా, కీలపట్ల మాత్రం నిలదొక్కుకున్నట్లు తెలుస్తోంది.

కోనేటిరాయడుగా పిలువబడే శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం

ఇక్కడ అతి పురాతనమైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం వుంది. ఈయన కోనేటి రాయడుగా ప్రసిధ్ధికెక్కాడు. ఈ ప్రసన్న వెంకటేశ్వరస్వామి మూలవిరాట్టును భృగు మహర్షి ప్రతిష్ఠించగా, జనమేజయుడు చిన్న ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు వున్నాయి. క్రీ.శ. 1646లో ఈ ప్రాంతం విజయనగర రాజుల నుంచి బీజాపూరు సుల్తాన్ పాలనలోకి వచ్చి గుఱ్ఱంకొండ కేంద్రంగా పాలింపబడింది. ఈ దశలో విజయనగర రాజుల పాలనలోని అపురూపమైన అనేక ఆలయాలపై దాడులు జరిగాయని చరిత్ర సారాంశం. పుంగనూరు పాలెగాడు ముమ్మడి చిక్కరాయలు తిరుగుబాటు చేయటంతో పాటు నవాబులనుంచీ స్వతంత్ర్యం ప్రకటించుకోవడంతో ఆగ్రహించిన టిప్పుసుల్తాన్ 4000 పదాతి దళాలను, తుపాకులను పంపి, 70 రోజులు దిగ్బంధనం చేసి ఆవులపల్లె, పుంగనూరు జమీందారీలను తిరిగి స్వాధీనము చేసుకున్నాడు. ఈ దశలో వారి అధీనములోని అన్ని ఆలయాల్లోనూ విగ్రహాలు ధ్వంసం కాబడినవి. కీలపట్ల కూడా అందులో ఒకటి. పుంగనూరు జమీందారుపై ప్రతీకారము తీర్చుకొనుటకు 1783లో టిప్పుసుల్తాన్ 500మంది ముస్లిమ్ యోధులను తుపాకులను ఇచ్చి ఇక్కడ క్యాంపు నిర్వహించటానికి సైన్యాధికారులతో పంపెను. ఆ సమయంలో ఇక్కడ ఏకల దొరలు పుంగనూరువారికి శిస్తు కట్టుకుని ఈ ప్రాంతాన్ని అధీనంలో వుంచుకున్నారు. వారు దండు మేలుమాయి గుండా కీలపట్ల వైపు సాగుతున్న విషయము తెలుసుకుని కీలపట్లకు 1 కి.మీ. పడమరగా శివపురము వద్ద దండును ఎదిరించి, యుధ్ధము చేసి ప్రాణాలు కోల్పోయారు. సైన్యము కీలపట్ల ఆక్రమించినది. వీరి అరాచకముల కారణంగా రెండవసారి ఈ ఆలయాలు శిథిలావస్ధకు చేరినవి. పూజారులు విగ్రహాలను రక్షించుకోవటానికి వాటిని ఆభరణాలు, ఉత్సవాలకుపయోగించే పంచలోహ విగ్రహాలు, మణి మాణిక్యాలు పొదిగియున్నవన్నీ కోనేటిలో పడేశారు. శత్రు సైన్యాలకు ఎదురు పడిన వాళ్ళందరూ మరణించారు.

బ్రిటిష్ వారి రాకతో పుంగనూరు జమిందారులకు హక్కులు, బాధ్యతలు లభించాయి. జమీందారుకి శ్రీమన్నారాయణుడు కలలో కనబడి తాను కోనేటిలో వున్నట్లు, తిరిగి ఆలయములో ప్రతిష్ఠించి పూజలు జరిపించమని చెప్పెనట. అంతవరకూ కీలపట్ల ఎక్కడుందో తెలియని జమీందారు భటులద్వారా కనుగొని కోనేటిలోని నీటిని తోడించి, స్వామివారి విగ్రహములను తీసి ప్రతిష్ఠించి, తిరిగి ధూప దీప నైవేద్య, నిత్యపూజా కార్యక్రమములు జరుగుటకు అంతకు మునుపు వున్న భూములు కాక వందలాది ఎకరాల మాన్యములు ఏర్పరచారట.

ఈ స్వామి మహిమ గురించి ఎక్కువగా చెప్పుకునే కథ ఇక్కడున్న ఒక శాసనం ప్రకారం.. బోడికొండమనాయుడను ఏకిలదొర ప్రతి సంవత్సరం స్వామి కళ్యాణంలో కన్యాదానం చేసేవారు. ఇంకా అనేక ఉత్సవాలను ఘనంగా జరిపించేవారు. ఇవ్వన్నీ అక్కడ వసూలు చేసిన శిస్తులతో చేసేవాడు. ఇలా జరిపించటంలో ఆయన చంద్రగిరి రాజులకు చెల్లించాల్సిన శిస్తు చెల్లించలేకపోయాడు. కొన్ని సంవత్సరములనుండీ శిస్తు జమకానందున చంద్రగిరి రాజునకు కోపం వచ్చి బోడికొండమనాయుడుని జైలులో వుంచాడు. ఆ సమయంలో కీలపట్లలో ఉత్సవాలు జరుగుతున్నాయి. రాజును ఒక్కరోజు తనని విడిచి పెట్టమని ప్రాధేయపడ్డాడు బోడికొండమనాయుడు. రాజు అనుమతించలేదు. ఉత్సవం రోజు జైలులో చూడగా నాయుడు లేడు. కీలపట్లకు వేగులను పంపి చూడగా, బలిష్టమైన ఏనుగు అంబారీపై ఉత్సవం ముందు ఊరేగుతున్నాడు. వేగులద్వారా విషయము తెలుసుకొన్న రాజు సపరివారంగా కీలపట్లకు వచ్చి నాయుడు పాదాలకు నమస్కరించి, తప్పు క్షమించమని వేడుకొని, శిస్తు బాకీ రద్దు చెయ్యటమేగాక ఆలయ నిర్వహణకొరకు వందల ఎకరాల భూమిని సమర్పించాడు.

సుమారు 100 సంవత్సరాలు పూజ లేకుండా శిథిలమైన ఆలయంలో తిరిగి కోనేటిలో లభించిన స్వామి విగ్రహమును ప్రతిష్ఠించుటచే ఈ వెంకటేశ్వరస్వామికి కోనేటిరాయడు అనే పేరు వచ్చింది. ఇదివరకు కీలపట్ల చుట్టూ అనేక పురాతన ఆలయాలు వుండేవి. ఈ దండయాత్రలతో అవి శిధిలమై, కనీసం అవశేషాలు కూడా కనబడకుండా మాయమయ్యాయి.

శ్రీ వెంకటేశ్వరస్వామి మొదట అవతారమెత్తినపుడు తుంబుర తీర్థంలో తపస్సు చేస్తున్న భృగు మహర్షి కోరిక మేరకు కాలినడకన వచ్చి ఈ ఆలయంలో సాలగ్రామశిలగా వెలిశారు. ఆ తరువాతనే తిరుమలలో వెలిశారని ప్రతీతి. ఈ ఆలయం తిరుమల కంటే ముందే నిర్మించబడినది. ఈ ఆలయాన్ని నిర్మించిన శిల్పులే తిరుమల ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని చెక్కారని చెబుతారు. ఈ శిల్పులు తిరిగి కీలపట్లకు పోవాలని బయలుదేరితే కీలపట్ల ఆలయాన్ని ఇంకెంత సుందరంగా మలుస్తారో, తిరుమల ఆలయం గతి ఇంకేమగునో అని వారిని దారికాచి చంపేశారని కధ చెపుతారు.

తిరుమల ఆలయం నిర్మించిన తరువాత పశ్చిమ ప్రాంతం భక్తులు కీలపట్ల స్వామిని దర్శించి అడవిగుండా తిరుమల వెళ్ళేవారట. ఆ సమయంలో వచ్చిపోవు భక్తుల సౌకర్యార్ధము నగిరి తోపులో నాలుగు కోనేర్లు, విశ్రాంతి గదులు, వంటగదులు వుండేవి.

అన్నమాచార్యులు ఈ ఆలయాన్ని దర్శించారని, కొన్నాళ్ళు ఇక్కడ వుండి కోనేటి రాయా అనే మకుటంతో పాటలు రాసి తంబుర మీటుతూ పాడేవారనీ చెబుతారు. అన్నమయ్య కీలపట్ల స్వామిని దర్శించిన తర్వాతే తిరుపతి స్వామిని దర్శించి పాటలు రచించారని చెబుతారు.

ఇక్కడ ఇంకొక విశేషం వెంకటేశ్వరస్వామి తిరుమలనుండీ అడవి మార్గము గుండా కీలపట్ల ఆలయానికి నడచి వచ్చిన పవిత్రమైన భూదారి వుందిట. ఇప్పటికీ ఈ దారి వుందంటారు. ఆయన నడిచి వచ్చిన పాద ముద్రలు బండలపై వున్నవట. నువ్వు వచ్చుట మాకు ఎలా తెలియునన్న చోళరాజు, రాణులకు, నేను వచ్చు సమయమున ఆకాశ మార్గము తిరుమల నుండీ కీలపట్ల వరకు వెన్నెల వెలుగుల దారి ఏర్పడునని, ఇంకా పరీక్షించదలిస్తే అడవి మార్గముగుండా నేను నడచి వచ్చిన పాదముద్రలు చూచి తెలుసుకొమ్ము అని కలలో తెలిపెనట.. స్వామి తెలిపిన విధంగా రాజదంపతులు పరీక్షించి స్వామి తమ నగరుకు విచ్చేసి తాము సర్వాంగ సుందరంగా నిర్మించిన ఆలయములో కొలువు తీరాడని గుర్తించారు.

ఇదివరకు స్వామి బ్రహ్మోత్సవాలకి చుట్టుపక్కల 33 గ్రామాలోని దేవతలను అలంకరించి ఊరేగింపుగా తీసుకొచ్చేవారుట. ఆ గ్రామాలన్నీ ప్రస్తుతం చరిత్రలో కలిసిపోయాయి. తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో అభివృధ్ధి పనులు జరుగుతున్నాయి.

అతి ప్రశాంతంగా కనబడే ఈ గుడి వెనుక ఇంత చరిత్ర, ఇంత వైభవం వుందని నాకూ శ్రీ బత్తనపల్లి మునిరత్నం రెడ్డిగారి కౌండిన్య క్షేత్రాలు, కీలపట్లాధీశ్వర పుస్తకాల ద్వారా తెలిసింది. ఆయన ఆ పుస్తకాలు నాకివ్వటమేగాక, వాటిలో విషయం వాడుకోనిచ్చినందుకు ఆయనకు పత్రికా ముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వచ్చేవారం మరో క్షేత్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here