యాత్రా దీపిక చిత్తూరు జిల్లా-27, 28: లద్దిగం

0
11

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా లద్దిగం – పుంగనూరు రోడ్ లో పంచలింగేశ్వరాలయం గురించి, లద్దిగం లోని శ్రీ నీలకంఠేశ్వరస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

27. పంచ లింగేశ్వరాలయం

[dropcap]ల[/dropcap]ద్దిగం – పుంగనూరు రోడ్‌లో పంచలింగేశ్వరాలయం దర్శించాము. ఇక్కడ బోర్డులయితే పంచ పాండవులు ప్రతిష్ఠించిన లింగాలని పెట్టారుగానీ గుడి చూస్తే కొత్తదానిలా వుంది. వరుసగా పాండవుల పేర్లతో లింగాలు వున్నాయి. అక్కడనుంచి లద్దిగం వెళ్ళాము.

28. శ్రీ నీలకంఠేశ్వరస్వామి ఆలయం, లద్దిగం

ముందుగా శ్రీ నీలకంఠేశ్వరస్వామి ఆలయానికి వెళ్ళాము. ఆలయం చిన్నదే అయినా చాలా శుభ్రంగా, ప్రశాంతంగా వుందు. బయట గోడలనిండా శాసనాలు చాలా చెక్కి వున్నాయి, వేరే భాషల్లో కూడా. చాలా పాత ఆలయం. పునర్నిర్మించారుగానీ, పాతదనాన్ని అలాగే అట్టిపెట్టారు.

పూజలు జరుగుతున్నాయి. అమ్మ శ్రీ పార్వతీదేవి, అయ్య శ్రీ నీలకంఠేశ్వరుడు పూజలు జరిగి కళకళలాడుతున్నారు. ఇత్తడి దీపారాధన కుండీలలో వరుసగా దీపాలు వెలిగించి వున్నాయి. ఆలయం తలుపులు తీసే వున్నాయి. ఎవరూ లేరుగానీ ఆలయం చాలా ప్రశాంతంగా వున్నది.

ఈ గ్రామం పుంగనూరు – చౌడేపల్లి రహదారిలో పుంగనూరుకి 6 కి.మీ.ల దూరంలో వుంది. పుంగనూరు దొరగారు ఏనుగు పై దౌడు తీసి ఈ గ్రామం వద్ద ఏనుగును కట్టేసి పుదిపట్లకి వెళ్ళేవాళ్ళని, ఆయన తిరిగి వచ్చే లోపల ఏనుగు లద్దె వేసిందని, అది లద్దె వేసే ప్రాంతంలో నిర్మించబడిన నివాసాల సముదాయానికి లద్దిగంగా పేరు వచ్చిందనీ అంటారు.

ఈ ఆలయం చోళుల మొట్టమొదటి ఆలయంగానూ, నమూనా కోసం నిర్మించిన ఊహా రూపంగానూ భావించవచ్చు. ఈ ఆలయాలు క్రీ.శ. 8 – 9 శతాబ్దాల మధ్య నిర్మించినవాటిగా తెలుస్తున్నది. ఈ ఆలయం నల్లరాతితో నిర్మించబడింది. నల్ల రాతి ప్రహరీ గోడపై 11 బసవేశ్వర ప్రతిమలు నిల్పారు.

ఆలయ ప్రవేశం దక్షిణంగా వుంటుంది. స్వామి తూర్పు అభిముఖంగా వుంటారు. సూర్యోదయ కిరణాలు గోడలో వున్న రాతి కిటికీల ద్వారా స్వామిని తాకుతాయి. తూర్పున వృత్తాకారంలో వున్న నాలుగ్గాళ్ళ మండపంలో నంది విగ్రహం వుంది. గర్భాలయ గోడలన్నీ తమిళ భాషలో చెక్కబడిన శాసనాలతో నిండి వున్నాయి. శాసనాలనుబట్టి ఈ ఆలయాన్ని చోళరాజులు నిర్మించినట్లు తెలుస్తోంది. గర్భగుడి చుట్టూ ఉపాలయాలలో దేవతా విగ్రహాలున్నాయి.

గోపురం నాలుగువైపులా సింహాల క్రింద దిక్పాలకుల ప్రతిమలు వున్నాయి. ఏకాండ ఏక కలశంలో ఆలయం శిఖర చెక్కబడింది. ఆరడుగుల ఎత్తయిన చిన్న స్తంభాలపై ముఖ మండపం అమోఘమైన శిల్పకళతో అలరారుతోంది. భూమట్టంనుండీ మూడడుగుల ఎత్తున్న పీఠముపై ఏడు అడుగుల ఎత్తు మించని స్తంభాలపై ఆలయం నిర్మించారు.

ఆలయంలోని శాసనాల్లో నంబుగచ్చి పతినాయర్ అనే రాజు ఈ గుడికి మాన్యాలులిచ్చినట్లుంది. ఈ రాజుకే ఉత్తమ చోళగంగ అనే బిరుదు వుంది. ఉత్తమ చోళుడే ఈ గుడిని కట్టించి వుండవచ్చు. అతని శాసనమే ఇక్కడి మొదటి శాసనం.

ఈ ఆలయం మొత్తం నల్లరాయితో నిర్మించబడి అద్భుత శిల్పకళతోనిండి వుంది. సమీపంలో ఎక్కడా నల్లరాతితో ఆలయాలు నిర్మించబడలేదు. అందుకే ఈ ఆలయానికి ప్రత్యేకత వుంది. తమిళనాడులో చెక్కబడి ఎద్దుల బండ్లపై ఈ స్తంభాలు, శిల్పాలు తీసుకు రాబడినవని అంటారు. ఈ నమూనాలో తమ రాజ్యమంతటా అనేక ఆలయాలు నిర్మించాలనుకున్న చోళరాజుల ఆశ అడియాసగానే మిగిలిపోయింది. ఈ ఆలయానికి మాన్యములున్నాయి. శాసనాల ప్రకారం చాలా భూములు స్వామివారికి కానుకలిచ్చినట్లు తెలుస్తోంది. దేవాదాయ శాఖవారు ఈ శిల్ప సంపద చూసి రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించారు.

శివరాత్రికి విశేష పూజలు జరుగుతాయి. రోజువారి పూజలు, వార పూజలు, విశేష పూజలు జరుగుతాయి.

పక్కనే రామాలయం వుంది. అక్కడ కూడా ఎవరూ లేరు. కానీ పూజలు జరిగి దేవుళ్ళు కళకళలాడుతున్నారు. కొన్ని ఫోటోలు కింద పెట్టబడి వున్నాయి. వాటికి కూడా పూజ జరిగి వుంది.

ఆ వాతావరణం, ఆ ప్రశాంతత, ఆ పూజలు చూసి తృప్తిగా తిరుగు ముఖం పట్టాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here