యాత్రా దీపిక చిత్తూరు జిల్లా-3 & 4

0
13

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా చిత్తూరు లోని ‘కోట గుడి’, తిమ్మ సముద్రంలోని ‘రాజు గుడి’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

3.కోట గుడి

పక్కనే వున్న వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్ళాము. ఇది శ్రీ మహాలక్ష్మీ, గోదాదేవి, ఆంజనేయస్వామి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం. వెంకటేశ్వరస్వామి ఆలయానికి ముందు ఆంజనేయస్వామికి వేరే ఆలయం వున్నది. వీటిని కోట గుళ్ళు అంటారుట. ఇదివరకు ఈ ప్రాంతంలో కోట వుండేది. ఇప్పుడు లేదు. అన్నీ నూతన కట్టడాలు. ఈ గుడి కూడా 150 సంవత్సరాల క్రితం కట్టిందేట.

ఆలయం తెరిచే వుంది. ఆదివారం కదా. భక్తులు బాగానే వున్నారు. స్వామి దర్శనం చేసుకుని ఆ ప్రాంగణంలోనే ముందు వున్న ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళాము.

ఈ ఆంజనేయస్వామి ఆలయానికి ఒక చిన్న కథ చెప్పారు పూజారిగారు. చంద్రగిరి కోటమీద నవాబులు దండెత్తినప్పుడు, రాజుగారు సొరంగ మార్గాన వస్తుంటే ఆయనకి ఆంజనేయస్వామిది ఈ విగ్రహం కనిపించిందిట. తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఆలయంనుంచి కోటకి ఇదివరకు సొరంగ మార్గం వుండేదిట.

ఆంజనేయస్వామి కాళ్ళకింద శనీశ్వరుడున్న విగ్రహం చూశానుగానీ ఇక్కడ విశేషం ఆయన కాళ్ళకింద అక్షయ కుమారుడు (రావణాసురుని కొడుకు) వుంటాడు. ఇలా ఎక్కడా చూడలేదని, సరిగా కనబడటంలేదు అంటే, పూజారి గారు కవచం పెడితే కనబడుతుంది. 70 సంవత్సరాల క్రితం స్వామికి ఇత్తడి కవచం చేయించారు అని ఓపిగ్గా అక్షయ కుమారుడికి కవచం పెట్టి చూపించారు. అక్షయ కుమారుడు కత్తితో యుధ్ధం చేస్తున్నట్లు వుంది.

పూజారులు వంశపారంపర్యంగా వస్తున్నారుట. వీరు ఐదవ తరం వారు.

4 రాజు గుడి, తిమ్మ సముద్రం

అక్కడనుంచి మధ్యాహ్నం 12-05 కి బయల్దేరి తిమ్మ సముద్రంలోని రాజు గుడికి వచ్చాము. తిమ్మ సముద్రం దగ్గరలోని ఊరు. హడావిడిలో కొన్నింటి మధ్య దూరం రాసుకోవటం మర్చిపోయాను. దీనిని రాజు గుడి అని ఎందుకు అంటారో తెలియదుగానీ ఇది కాశీ విశ్వనాథ, విశాలాక్షి ఆలయం. పూర్వం రాయలవారు కట్టించిన ఆలయంట ఇది. సాలగ్రామ లింగం. ఈ స్వామి దర్శనం చేసుకుంటే కాశీ వెళ్ళొచ్చినంత ఫలితంట.

పూర్వం నీవానది ఒడ్డున చిదంబరంలోలా ఐదు గ్రామాలలో శివాలయాలు నిర్మించారుట. అవి…. యాదమరి, ఇరువారం, రాజుగుడి, కట్టమంచి, కలవకుంట. వాటిలో ఒకటి ఇది.

ప్రస్తుతం ఆలయం పూర్తిగా తీసేసి మళ్ళీ కడుతున్నారు. శివుణ్ణి, విశాలాక్షిని అదే ప్రదేశంలో ఇనప పెట్టెల్లాంటి వాటిలో పెట్టి రోజూ పూజలు చేస్తున్నారు. పునర్నిర్మాణంలో పనివారికయ్యే ఖర్చంతా శ్రీ నారాయణమూర్తి అనే వ్యాపారవేత్త పెట్టుకుంటున్నారుట. మెటీరియల్ ఖర్చు అంతా భక్తులది. ఇనప పెట్టెల తలుపుల తాళాలు తీసి అమ్మవారి, అయ్యవారి దర్శనం చేయించారు. స్వామి సాలగ్రామ లింగం చిన్నదే. అమ్మవారు శ్రీచక్ర పీఠంమీద వున్నారు. చిన్న విగ్రహమే.

మహా శివరాత్రికి ముందు 6 రోజులు ఉత్సవాలు జరుగుతాయట.

పక్కనే వరదరాజస్వామి ఆలయం తెరిచే వున్నది. కొంచెం అవతల సప్తకన్యకల ఆలయం…. మూసి వున్నది. బయటనుంచే ఫోటోలు తీసుకుని 12-35కి అక్కడనుండి బయల్దేరాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here