యాత్రా దీపిక చిత్తూరు జిల్లా- 36 ఇరువారం, 37 యాదమరి

0
9

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా ఇరువారం శ్రీ కామాక్షీ సమేత నాగేశ్వరస్వామి ఆలయం గురించి, యాదమరి లోని వరదరాజ స్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

36. ఇరువారం:

[dropcap]గి[/dropcap]రింపేట దుర్గాలయంనుంచి ఇరువారం శ్రీ కామాక్షీ సమేత నాగేశ్వరస్వామి ఆలయానికి వచ్చాము. అక్కడ అర్చకులు లేరు. ఫోన్ చేస్తే అత్యవసరమైన పని మీద వెళ్ళానని, అరగంటలో వస్తామని చెప్పారు. ఆలయం లోపల విశాలమైన ప్రదేశం, పూల చెట్లు, అరుగులు వుంటే ఆ ప్రశాంత వాతావరణంలో కొంచెంసేపు కూర్చుందాము. ఏ ఆలయానికి వెళ్ళినా ఉరుకులు పరుగులే అవుతున్నాయి. పైగా ఇవాళ యాత్రలో ఆఖరి రోజు. ఇంక చూడగలిగేవి ఎక్కువ లేవుకదాని అక్కడ కూర్చున్నాము.

కొంచెం సేపట్లో పూజారిగారు వచ్చారు. అప్పుడు చెప్పారు, తెలిసినవారెవరో పోతే చూడటానికి వెళ్ళారుట. ఇంటికెళ్ళి స్నానం చేసి వచ్చేసరికి కొంచెం ఆలస్యమయిందని.

ఆలయ చరిత్ర ఏమిటంటే పూర్వం ఇక్కడ చోళ రాజులు నిర్మించిన శివాలయం వుంది. ఆదే ఇప్పటి నాగేశ్వరాలయం. ఈ గ్రామంలో ఇరువురు అన్నదమ్ములు తాము పండించిన పంటను చెరి సగం చేసుకోవటం తెమలక ఇబ్బంది పడుతుంటే గుళ్ళోనుంచి ఒక నాగుపాము వచ్చి ఆ ధాన్యం కుప్ప మీద మధ్యనుంచి వెళ్ళిందట. పాము వెళ్ళిన ఆ చార బట్టి అన్నదమ్ములిద్దరూ చెరో భాగం తీసుకున్నారుట. అప్పటినుంచి ఆ ఊరు ఇరువారంగా ప్రసిధ్ధికెక్కింది. ఆ శివుడి ఆలయంలోంచి నాగేంద్రుడు వచ్చాడు గనుక ఆ శివుడు నాగేంద్ర స్వామి అయ్యారు.

37.యాదమరి:

ఇక్కడ ప్రాచీనమైన రెండు ఆలయాలు చూశాము. మొదటిది వరదరాజ స్వామి ఆలయం. మూసేసి వుంది. పునర్నిర్మాణం జరుగుతున్నట్లుంది.

రెడవ ఆలయం కోదండ రామస్వామి ఆలయం. ఇది కూడా శిథిలాలయం. పునర్నిర్మిస్తున్నారు. మట్టి కుప్పలు గోతులు దర్శనీయంగా లేదు.

మా రైలు సాయంత్రం 5 గంటలకు. ఇంక ఎక్కడికీ వెళ్ళే అవకాశం లేదు. అందుకని శ్రీ సాంబశివరెడ్డిగారి అన్నగారింటికి వచ్చాము అక్కడికి దగ్గరవటంతో. వారి వదిన శ్రీమతి రుక్మిణి ఎంతో ఆత్మీయంగా, ఎన్ని ఏళ్ళ పరిచయమో వున్నవారిలా చాలా బాగా మాట్లాడారు. వారితో మాట్లాడి, వారి ఆతిథ్యం స్వీకరించి అక్కడనుంచి రైల్వే స్టేషన్ చేరుకున్నాము. పొద్దున్నే రూమ్ ఖాళీ చేసి సామాను కారులో పెట్టేశాము.

రైలులో ఆహారం బాగుండదని శ్రీ పురందర రెడ్డిగారు స్టేషన్‌కి ఎదురుగా వున్న విష్ణునుంచి మాకోసం ఫలహారం పొట్లం కట్టించుకు వచ్చారు. ఈ నాలుగు రోజుల ప్రయాణంలో మా వెంట వుండి మేము వెతుక్కోకుండా అన్ని దేవాలయాలు చూపించటమేగాక వారి దగ్గరున్న పుస్తకాలు కూడా ఇచ్చిన శ్రీ సాంబశివరెడ్డిగారికి, శ్రీ పురందర రెడ్డీగారికి, డ్రైవర్ గారికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పి బయల్దేరాము. వాళ్ళు అలా ప్రణాళిక వెయ్యకపోతే మేమిన్ని ఆలయాలు చూడగలిగేవారం కాదు. వారు కూడా రైలు వచ్చేదాకా ఆగి మమ్మల్ని రైలెక్కించి మరీ కదిలారు. ఏ పరిచయం లేనివారి దగ్గరనుంచి ఇంతటి అభిమానం పొందటం నిజంగా భగవంతుడు మామీద చూపించిన కరుణే.

వీరే కాక శ్రీ సిధ్ధేశ్వర రెడ్డిగారు, వంశపారంపర్య ధర్మకర్త, టి.పుత్తూరు కోదండ రామాలయం, ఆ ఆలయ నిర్వాహకులకందరికీ వారు చూపించిన ఆదరణ ఎన్నటికీ మర్చిపోలేమని చెబుతూ పేరు పేరునా మా నమస్కారములు.

ప్రత్యేకించి పేర్కొనవలసింది శ్రీ బత్తనపల్లి టి. మునిరత్నం రెడ్డి, సుప్రసిధ్ధ రచయిత. ఆయన రాసిన పుస్తకం కౌండిన్య క్షేత్రాలు ఇప్పటిదాకా నేను చిత్తూరు జిల్లా గురించి రాసిన ఆలయాల చరిత్రలకి ముఖ్యాధారం. “ఆలయం దగ్గర కూర్చుని రాసుకుంటూ కూర్చోకమ్మా. సమయం చాలా పడుతుంది. నా పుస్తకంలోంచి మీ ఇష్టం వచ్చిన సమాచారం తీసుకుని రాసుకోండి” అని ఉదారంగా అనుమతినిచ్చిన మునిరత్నం రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతాంజలులు. మీలాంటి వారు జిల్లాకి ఒక్కరు వుంటే ఆలయాలు, ఆలయాల మాన్యాలు యధాతధంగా వుంటాయండీ.

ఈ పర్యటనలో ఇంకా అనేకమంది ప్రసిధ్ధులను కలుసుకున్నాము. అందరి పేర్లూ తిరిగి ఇక్కడ చెప్పలేక పోతున్నాను. ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.

రెండు కిలోమీటర్లు, పది కిలోమీటర్లు అంటూనే ఈ నాలుగు రోజుల్లో మేము తిరిగింది 545 కి.మీ. లు.

కృతజ్ఞతలు చెప్పానని అయిపోయిందనుకునేరు. ఇప్పటికి చిత్తూరు జిల్లాలో నాలుగు రోజుల పర్యటన మాత్రమే అయింది. మరి మేము విడి విడిగా, అప్పుడోటీ అప్పుడోటీ చూసిన ఆలయాలున్నాయి కదా. వాటిని గురించి చెప్తాను వచ్చేవారం నుంచీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here